గుజరాత్ రాజస్థాన్ పర్యటనానుభూతులు-9

1
12

[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]నా[/dropcap]కు ఒక ఆలోచన వచ్చింది. యోగా గాడితో చెబితే “సూపర్” అన్నాడు. ఏకీభవించడంలో వాడిని మించిన మొనగాడు ఎవరూ లేరు. కాని అప్పుడప్పుడు నాకు ఝలక్ ఇస్తుంటాడు వెధవ!

మేం మర్నాడుదయం జోధ్‌పూర్‌కు వెళ్లాలి ట్రయిన్‌లో. దాని తర్వాత జైసల్మేర్. మూడు రోజుల వ్యవహారం. మూడు రోజులకు సరిపడా బట్టలు, మందులు వగైరా ఒకే బ్యాగ్‌లో సర్దాము. ఒక చిన్న షోల్డరు బ్యాగు. మిగతా పెద్ద సూట్‌కేసూ, రెండు బ్యాగులూ, బాయ్‌తో బుజ్జితాళం కప్పలు తెప్పించి వాటికి వేశాము. మూడురోజుల తర్వాత మళ్లీ మా తిరుగు ప్రయాణం హైదరాబాద్‌కు, జైపూర్ నుంచే, కాబట్టి ఈ బ్యాగులన్నీ వేసుకొని జోధ్‌పూర్, జైసల్మేర్ తిరగడం ఎందుకు? వాటిని జైపూర్ రైల్వే స్టేషన్ క్లోక్ రూంలో పెట్టి పోతే పోయే!

“ఎలా ఉంది రా నా ఉపాయం?” అన్నడిగితే.

“ఉపాయం లేనోడిని ఊర్లోంచటి వెళ్లగొట్టమని కదరా సామెత!”అన్నాడు.

“అయితే నిన్ను ఆదోని నుంచి వెళ్లగొట్టాలి!” అన్నా నవ్వుతూ.

“రాజులు సలహాదారుల్ని పెట్టుకొనేది ఎందుకు?” అన్నాడు వాడు రాజఠీవి ఒలకపోస్తూ.

వాడి తెలివికి నవ్వేశాను హాయిగా. ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ’ అని ఎవరన్నారోగాని, వారికి నా జోతలు!

ఉదయం 6 గంటలకు బ్యాగులతో స్టేషన్ చేరుకున్నాం ఆటోలో. మధ్యలో ఒక చోట ‘బినా చీనీ’ కాఫీ తాగాము. క్లోక్ రూం ఒకటో నంబరు ప్లాటుఫారం మీదే ఉంది. పెద్ద బ్యాగులు, సూట్ కేసు దాంట్లో పెట్టి, రశీదులు తీసుకొని భద్రపరచుకున్నాము.

ఏడు ఇరవైకి పూరీ-జోధ్‌పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నాల్గవ నంబర్‌లో వస్తుందని అనౌన్స్ చేస్తున్నారు. చక్కగా లిఫ్ట్ ఎక్కి దిగి, ఒకే బ్యాగ్‌తో ఆడుతూ పాడుతూ వెళ్లి రైలెక్కాము. రైల్లోనే బ్రేక్‌ఫాస్ట్ చేశాము. ఉప్మా, వడ!  నాట్ బ్యాడ్. పన్నెండు గంటలకు జోధ్‌పూర్ చేరింది రైలు. గంట ముందే డ్రైవర్ ‘అనిల్ ప్రజాపతి’ ఫోన్. తాను స్టేషన్ దగ్గరే వెయిట్ చేస్తున్నానని!

అతడు మమ్మల్ని రిసీవ్ చేసుకొని, హోటల్ ‘కిసాన్ లెగసీ’ కి తీసుకొని వెళ్లాడు. అది శాస్త్రి నగర్‌లో ఉంది. వెళ్లి check in చేసి రిఫ్రెష్ అయ్యాము. మధ్యాహ్నం కాసేపు రిలాక్స్ అయ్యి, 3 గంటలకు జోధ్‌పూర్ టూర్‌కు బయలుదేరాము.

***

మా మొదటి గమ్యం ఉమైద్ భవన్ ప్యాలెస్. అది ఒక రాజుల కోట. అది మూడు భాగాలుగా ఉంది.

అవి -1. రాజవంశీయుల వారసుల నివాస భవనాలు 2. మ్యూజియం 3. ఒక స్టార్ హోటలు.

భవనం కంటోన్మెంట్ ఏరియాలో, సర్క్యూట్ హౌస్ రోడ్‌లో ఉంది. అక్కడి స్టార్ హోటల్‌లో బస చేయడానికి రోజుకు 49,206 రూపాయలు అట.

మా యోగా అడిగాడు “బరేయ్ శర్మా, ఒక్క రోజు కోసం అంత డబ్బు పెట్టి రూం తీసుకొనే వాళ్లు కూడా ఉంటార్రా? ఏమోబ్బా!”

నేను నవ్వాను. “ఒరేయ్ యోగా, మనకు తెలియని లోకం అది. మనమే 3 స్టార్ హోటళ్లలో, రిసార్టులలో బస చేస్తుంటే..”

“మనం దిగుతున్న హోటళ్లలో రూం ఎంత ఉంటుంది?”

“అదంతా ప్యాకేజిలోనే ఇన్‌క్లూడ్ అయి ఉంటుంది. నేను గుజరాత్‌లో కనుక్కుంటే రోజుకు 2700 రూపాయలు అని చెప్పాడు. మనమేమో రోడ్డు మీద టిఫిన్ బండ్ల కోసం వెతుక్కునే రకాలం!”

“నీ వెంట రాబట్టి ఇంత ప్రపంచం చూడగలుగుతున్నా గాని, శర్మా, నా జీవితంలో ఎప్పుడూ ఇలా ఎంజాయ్ చేయలేదురా?” అన్నాడు వాడు.

“సరేలే! ఈ వయసులో ఆ మాత్రం కంఫర్టబుల్‌గా కాకుండా ఎలా తిరుగుతారా పిచ్చోడా?” అన్నా.

ఉమైద్ భవన్ ప్యాలెస్, ప్రపంచంలోని అతి పెద్ద ప్రయివేట్ ప్రాపర్టీలలో ఒకటి అట. స్టార్ హోటల్‌ను ‘తాజ్ గ్రూప్’ మెయిన్‌టెయిన్ చేస్తుంది. ప్రస్తుత వారసుడు గజ్‌సింగ్. ఆయన తాత మహారాజా ఉమైద్ సింగ్ పేరు దానికి పెట్టారు. భవనంలో మొత్తం 347 రూములున్నాయి. నిర్మాణశైలి ఇండోశారసనిక్. నిర్మాణాన్ని 1928లో ప్రారంభించి 1943లో పూర్తి చేశారు. భవనాన్ని గోల్డెన్ ఎల్లో రంగులోని శాండ్ స్టోన్‌తో కట్టారు. దాని ఇంజనీరు మాంచెస్టర్ (ఇంగ్లాండ్)కు చెందిన హెన్రీ వాఘన్.

రాథోడ్ రాజవంశానికి ఒక యోగి శాపం పెట్టాడట. భయంకరమైన దుర్భిక్షం (కరువు)తో రాజ్యం అల్లాడుతుందని. 1920 నుంచి, 1923 వరకు ప్రతాప్ సింగ్ మహారాజు పాలన చివర్లో ఆ కరువు సంభవించింది. రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం, రాజా ఉమైద్ సింగ్ ఈ భవనాన్ని నిర్మించాడు. 2 నుంచి 3 వేల మంది ఈ నిర్మాణంలో పని చేశారు. అప్పట్లో దానికి 11 మిలియన్ల రూపాయలు ఖర్చైంది.

భవనంలో ఒక పెద్ద ఆయిల్ పెయింటింగ్ చూశాం. (Fresco) రాజపుత్రులు మొగలులతో, మెహ్రాన్‌గఢ్ కోట వద్ద పోరాడిన యుద్ధ దృశ్యం అందులో అద్భుతంగా చిత్రించారు. ఒక సింహాసనం ఉన్న గది, చాలా కళాత్మకంగా ఉంది. ఇంటీరియర్ సెంట్రల్ డోమ్ 103 అడుగుల ఎత్తున, దాని పై 43 అడుగుల ఎత్తున ఔటర్ డోమ్ ఉంది. ‘మెజెస్టిక్’గా ఉన్నాయవి. ప్రవేశ ద్వారం దాటిం తర్వాత ఫ్లోరింగ్ అంతా బ్లాక్ గ్రానైట్ పరిచారు. తళతళమెరుస్తూ, మన ప్రతిబింబాలు అందులో ప్రతిఫలించేలా ఉంది ఫ్లోరింగ్. ఇప్పటి వారసుడు గజ్‌సింగ్‌ను ‘బాప్‌జీ’ అంటారట.

‘తాజ్ గ్రూప్’ వారి యజమాన్యంతో నడిచే 7 స్టార్ హోటల్ భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటి. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్డా, నిక్ జోనాస్‌ను 2018లో ఈ హోటల్లోనే పెళ్లి చేసుకుంది.

అక్కడ భోజనం కేవలం 2 వేల రూపాయలట. అక్కడ పెళ్లి చేయాలంటే 200 – 250 మంది ఆహూతులకు 76 లక్షల నుంచి 92 లక్షలవుతుంది. చీపే!

భవనం బయట 26 ఎకరాల్లో ఆకుపచ్చని లాన్స్, పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. నాట్యం చేస్తున్న నెమళ్లను చూశాము. అవి ఒకటే అరుస్తున్నాయెందుకో మరి. వాటి అరుపులను ‘క్రేంకారములు’ అంటారని మన ప్రబంధాలలో ఉంది. ఒక పెద్ద కృత్రిమ సరస్సు ఉంది. దానిని సబ్‌టరేనియన్ జొడాయిక్ పూల్ అంటారట. అందులో నీరు నీలంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంది! భవనమంతా కవర్ చేయడానికి గంట పట్టింది మాకు.

అనిల్ ప్రజాపతి, మా డ్రయివర్‌ను మంచి టీ తాపించు భయ్యా అని అడిగాము. కొంచెం దూరంలోని ‘చాయ్ అడ్డా’కి తీసుకెళ్లాడు. మేం లంచ్ చేస్తే తిరగలేమని, రూమ్‌కే ‘దహీ వడ’ తెప్పించుకొని తిన్నాం. ఇప్పుడు మళ్లీ ఆకలేస్తుంది! దీని సిగతరగ! ఈ ఆకలి మనం చచ్చేంత వరకు వదలదు!

చాయ్ అడ్డా దగ్గర పనీర్ సమోసా, కార్న్ సమోసా, ప్యాజ్ సమోసా, ఆలూ సమోసా ఇలా రకరకాలున్నాయి. కచోరీలు, దాల్ వడ కూడా. పన్నీర్ అంటే నాకు ఎందుకో గిట్టదు. కార్న్ సమోసాలు తలా రెండు తిని, షుగర్ లేని టీ తాగి, ఆత్మరామ్‌జీని శాంతింప చేశాం.

అనిల్ ప్రజాపతి బ్రాహ్మడట. ఆ మాట వినగానే నాకెందుకో అతని మీద అభిమానం పుట్టుకొచ్చింది. నాకు కులపిచ్చి లేదు గాని. బ్రాహ్మణులలో డ్రైవర్ వృత్తి చేసే వారు మన వైపు అరుదు. అతనికి క్రాపు వెనక చిన్న పిలక కూడా ఉంది. వాళ్ల నాన్నగారు పండిత్ జీ అట. అంటే పురోహుతుడు. ఆయన పేరు హర్యక్ష ప్రజాపతి గారట. ఇతనికీ పౌరోహత్యం పనులు వచ్చుట. పీక్ సీజన్‌లో తండ్రికి సాయంగా వెళతాడట. దటీజ్ ది స్పిరిట్! ‘యోగః కర్మసు కౌశలమ్’ అని భగవానుడు చెప్పిన మాటను ఈ అబ్బాయి చక్కగా పాటిస్తున్నాడు. పని ఏదైతేనేం? దానిలో నిజాయితీ, టలెంట్ ముఖ్యం. అతన్ని అభినందించాను.

అక్కడి నుంచి కైలాణ లేక్ వెళ్లాం. అది ఒక కృత్రిమ సరస్సు. ఉమైద్ భవన్ నుంచి 8 కి.మీ. దూరంలో ఉంది. 1872లో దానిని మహారాజా ప్రతాప్ సింగ్ తవ్వించారు. దాని విస్తీర్ణం 0.84 చ.కి.మీ ఉంటంది.

అంతకు మునుపు, భీమ్‌సింగ్, తాకత్‌సింగ్ అనే పాలకుల భవనాలు అక్కడ ఉండేవట. దాని లోతు సుమారు 50 అడుగులు. వెడల్పు తక్కువేగాని పొడవు ఎక్కువగా ఉంది. అది మంచి నీటి సరస్సు. జోధ్‌పూర్ నగరానికింతా అక్కడ నుంచే తాగు నీరు సరఫరా అవుతుంది. లేక్ నానుకొని ఉన్న కొండల మీద అతి పెద్ద వాటర్ ఫిల్టర్లు ఉన్నాయి. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది.

సరస్సు దగ్గర ఇరవై నిమిషాలు గడిపి, మెహ్రాన్‌గఢ్ అనే కోటకు చేరుకున్నాం. అది చాలా పురాతనమయిన కోట. చాలా పెద్దది. దనిలో 12 అంతస్తులున్నాయి. కోట మొతం 1200 ఎకరాలలో వ్యాపించి ఉంది. రాథోడ్ వంశస్తుడైన జగ్‌సింగ్ దీనిని నిర్మించారు. భూమిపై నుండి 400 అడుగుల ఎత్తున్న కొండపై దీని నిర్మాణం జరిగింది. కోటలో అత్యంత కళాత్మకమైన మందిరాలున్నాయి. అవి మోతీమహల్, ఫూల్ మహల్, శీషామహల్, దౌలత్ ఖానా.

జోద్‌పూర్‌ను ‘బ్లూ సిటీ’ అంటారు. కాపర్ సల్ఫేట్ (మైలుతుత్తం) చిక్కని ద్రావణాన్ని ఇళ్ల గోడలకు బయటపక్క సున్నంలాగా వేస్తారట. అది స్యూర్యకాంతికి ఆరి, నీలంగా మారుతుంది. అవి బ్రాహ్మణ కుటుంబాలు. రాజవిధేయతగా పాటించే వారని అంటారు. ‘ది జంగిల్ బుక్’ అన్న సినిమాను 1994లో కోటలో కొంత భాగాన్ని చిత్రీకరించారు.

రావ్ జోధా అన్న రాజు మొదట ఈ కొండను చూసి, దీని మీద కోటను నిర్మిస్తే బాగుంటుందని, ఆ కొండ మీద ఉండే కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నాడట. కాని ‘చిడియావాలే బాబా’ అన్న సన్యాసి, అక్కడ పక్షులను పెంచుతూ ఉండేవాడు. ఆయన రావ్ జోధా చేస్తున్న పనికి ఆగ్రహించి, రాజ్యం నిరంతర కరువులతో క్షోభిల్లాలని శపించాడు. రాజు ఆయన పాదాల మీద పడి శరణు వేడాడట. రాజవంశంలోని ఎవరినైనా ముందు సజీవంగా కొండలో ఖననం చేసి, దాని మీద కోట కట్టుకుంటే, తన శాపం విమోచనమవుతుందని ఆ సన్యాసి చెప్పాడు. అలా ఎవరూ ముందుకు రాలేదు. చివరికి రాజారామ్ మేఘ్వాల్ అన్న రాజబంధువు ఒకాయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అదీ ఈ కోట వెనుక కథ. కోట నిర్మాణం 1459లో జరిగింది.

లోహా పోల్ (ఐరన్ గేటు)కు ఎడమవైపు 15 చేతి ముద్రల అచ్చులు, ఒక గోడ మీద తాపడం చేసినవి, జేగురు రంగులో మనకు కనపడతాయి. అవి, మహారాజా మాన్ సింగ్ గారి మరణం తర్వాత, ఆయనతో పాటు సతీసహగమనం చేసిన ఆయన భార్యలవని ఐతిహ్యం. ఇది 1843లో జరిగింది. దీనికి ముందు 1731లో, మహారాజా అజిత్‌సింగ్ చనిపోయినపుడు, ఆయన ఆరుగురు భార్యలు, 58 మంది ఉంపుడు గత్తెలు కూడా సతీసహగమనం చేశారు.

12 అంతస్తుల పైకి తీసుకెళ్లడానికి లిఫ్ట్ ఏర్పాటు చేశారు ఇటీవలే. ప్రతి అంతస్తులో ఆగుతుంది. లిఫ్ట్ సీత్రూ (పారద్శక) గ్లాస్‌తో చేశారు. టూరిస్టులు దిగకూడదు కాని లిఫ్ట్‌లో నుంచే పోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. కోట ఎంట్రీ ఫీజు చాలా ఎక్కువ! 400 రూపాయలు.

తర్వాత మా గమ్యం జశ్వంత్ అడ్డా. రాజా జశ్వంత్‌సింగ్ మాన్ వేసవి విడిది అది. దాని ఎక్స్‌టీరియర్స్ రాజఠీవి ఉట్టిపడేలా నిర్మించారు గాని, ఇంటిరియర్స్ అంత గొప్పగా లేవనిపించింది. రాజుగారి పెద్ద చిత్రపటం అక్కడ తగిలించారు. దీనిని జశ్వంత్ తాడా అని కూడా అంటారు. ఇది ఒక cenotaph అంటే స్మారక చిహ్నం లాంటి సమాధి. ఇది తెల్లని పాలరాతి నిర్మాణం. 19వ శతాబ్దంలో మహారాజా సర్దార్ సింగ్, తన తండ్రి, మహారాజా జశ్వంత్ సింగ్ II (జోధ్‌పూర్ నేలిన రాథాడ్ వంశీయుల్లో 33వ వాడు) జ్ఞాపకార్ధం కట్టించాడు. ఎండలో ఆ భవనం కళ్లు మిరుమిట్ల గొలుపుతుంది. అంత శ్వేతవర్ణం! అక్కడ పది నిమిషాలున్నాం అంతే.

మేం హోటల్ కిసాన్ లెగసీ చేరేసరికి సాయంత్రం ఆరు కావస్తూంది. వెళ్లి ఒక గంట రిలాక్స్ అయ్యాము. ఏడు గంటలకు బయలుదేరి గణేశమందిర్, దేవీ భద్రావతి మందిర్ సందర్శించాము. మా అనిల్ ప్రజాపతి “కొండ మీద రామ్‌దేవ్ బాబా, తన తండ్రి జ్ఞాపకార్ధం ఒక గుడి కట్టించాడు. చూస్తారా సార్?” అని అడిగాడు. దాదాపు మూడు వందల మెట్లెక్కాలని అన్నాడు. మేమంత ఆసక్తి చూపలేదు.

రాజస్థాన్‌లో మేం గమనించింది ఏమిటంటే అన్ని వర్గాల వారిలో కొందరు పిలక ధరించడం. విద్యాధికుల నుంచి రూయ్ బాయిస్ వరకు దీన్ని పాటిస్తున్నారు. క్రాపు వెనక ఉంటుంది. గుండు ఉండదు. మేమం రూమ్‌కు తిరిగి వచ్చేసరికి 9.30 ఆ హోటల్లోనే ‘టామరిండ్ రెస్టారెంట్’ అని ఉంది. కాంప్లిమెంటరీ డిన్నర్!

“అన్ని వంటకాల్లో పులుపు ఎక్కువగా వేస్తారేమో?” అన్న అనుమానం వెబుచ్చాడు మా యోగా. నేను నవ్వాను.

“పేర్లు పెట్టడం ఇప్పటి ట్రెండ్ లేరా? హైద్రాబాద్ లో కూడ ‘చిల్లీస్’ అని రెస్టారెంట్ ఉంది” అన్నాను.

అది రాజస్తానీ థాలీ. రెండు మృదువైన, పొంగిన వేడి వేడి పుల్కాలు, చనా మసాలా, జీరా రైస్, గోబో మసాలా, ప్లెయన్ దాల్, పాపడ్, దహీతో మా డిన్నర్ కానిచ్చాము. బాగుంది పడుకొని హాయిగా నిద్రపోయాము.

***

మర్నాడు 25వ తేదీ, ఫిబ్రవరి. “మనం బయలుదేరి అప్పడే పన్నెండో రోజు” అని ఆశ్చర్యపోయాం. చట్టం లాంటిదే కాలం! తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. పెంచలేం, తగ్గంచలేం, ఆపలేం దాన్ని! మన మానసిక స్థితిని బట్టి అది త్వరగా, నెమ్మదిగా, గడిచినట్లు మనకు అనిపిస్తుంది. అంతే!

ఉదయం ఆరుగంటలకు రూం చెక్ అవుట్ చేసి, జోధ్‌పూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. అది కూడ కళాత్మకంగానే ఉంది. ప్రవేశ ద్వారం దాటిన వెంటనే గోడలను రకరకాల కళాకృతులతో, పెయింటింగ్ లతో అలంకరించారు. అది ఒక జంక్షన్. అక్కడి నుంచి మేం జైసల్మేర్ వెళ్లాలి. ఐదు గంటల ప్రయాణం. సబర్మతి – జైసల్మేర్ ఎక్సప్రెస్ ఏడు గంటలుకు ఐదో నంబరు ప్లాట్‌ఫారం పైకి వచ్చింది. పైకంటే పైకి కాదండోయ్! పెడర్థాలు తీయకండి! ఎక్కి కూర్చున్నాం.

8.30కి బ్రేక్‌ఫాస్ట్ చేశాం. సింగడాలు! అంటే ఆలూ సమోసా. వేడిగా బాగున్నాయి. టీ తాగాం. 12 గంటలకు జైసల్మేర్ రైల్వే స్టేషన్‌లో దిగాం. మా కోసం అక్కడ పశుపతి సిసోడియా ఎదురు చూస్తున్నాడు. అదేనండి, మా డ్రయివర్. సిసోడియా, రాథోడ్ ఇలాంటి ఇంటి పేర్లు సహజంగా రాజవంశీయులవి. కాని ప్రస్తుతం ఆ వర్గాలలో కూడ పేదవాళ్లున్నారని మాకు అర్థమైంది. మన దగ్గర రెడ్డి, నాయుడు, చౌదరి, చివర ఉన్నవారు ఎంత మంది పేదలు లేరు? అలాగ!

పశుపతి ఇలా అన్నాడు “సార్, మనం హోటల్‌కు పోయి లంచ్ చేసి, రిలాక్స్ ఐతే టైం సరిపోదు. డైరెక్ట్‌గా సైట్ సీయింగ్ చూసుకొని సాయంత్రానికి డెజర్ట్ క్యాంప్‌కు చేరుకోవాలి. అందుకే మనకు ఇక్కడ హోటల్ అలాట్ చేయలేదు. డిజర్ట్ నైట్ క్యాంప్ జైసల్మేర్ టవున్ నుండి 50 కి.మి ఉంటుంది. గంట ప్రయాణం.”

మేం రైల్లో రెండు గంటలు పడుకున్నాం. కాబట్టి అలసిపోలేదంతగా. అలసిపోయినా చేసేదేమి లేదు.“సరే అబ్బాయి” అన్నాం అతనితో.

మా మొదటి గమ్యం మందిర్ ప్యాలెస్. జైసల్మేర్ చాలా పురాతన నగరం. కారులో వెళుతుంటే ఆ భవనాలు చూసి మాకు అర్థమైంది. మందిర్ ప్యాలెస్ ఒక చారిత్రక మహోన్నత కట్టడం. దాన్ని మహారాజ్ జస్వీర్ సింగ్ 1922లో నిర్మించారు.

‘జస్’ అంటే ‘యశ్’ అని అర్థం. సంస్కృత భాషా నియమాల ప్రకారం, ఉత్తర భారత భాషలన్నింటిలో ‘ర’ ‘డ’ లను ‘వ’ ‘బ’ లను ‘య’ ‘జ’ లను ఈ రెండింటిలో దేనిననా పదాల్లో ఉపయోగిస్తారు. తమిళ్‌లో ఐతే త, ద, క, గ, ప, బ, గ, హ లలో రెండవ దాన్ని ఉపయోగిస్తారు. అన్ని భాషలూ సంస్కృత జన్యాలే. ‘జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలంబునన్’ అని గదా ఆర్యోక్తి! కాని మన తెలుగు భాషలో మాత్రం ఈ పద్ధతి లేదు! బంగారు తల్లి మన తెలుగు!

యశ్వీర్ – జశ్వీర్, ప్రతాప్‌ఘర్, ఘడ్, సింహ్, సింగ్, రవీంద్ర, రబీంద్ర, సంగీతం, సంగీదం, సకల, సగల ఇలా అన్న మాట.

ఇవన్నీ మా యోగానందుల వారికి వివరించాను. ఎంతైనా టీచర్‌ను కదా! వాడు శ్రద్ధగా విన్నట్టు విని, ఇలా అన్నాడు-

“అయితే ఇప్పుడేమంటావు రా? చంపుతున్నావు! నాకు తెలుగే సరిగ్గా రాదు! ఇవన్నీ నా కెందుకురా?” వాడి గొంతులో నన్ను ఆట పట్టించాలన్న కొంటెతనం.

నాకు కోపం వచ్చింది. “సారీ రా! పొరపాటయింది” అన్నా.

వాడు నవ్వాడు. “సరే సరే! చెప్పు చెప్పు. అంటే జైసల్మేర్‌ను యైసల్మేర్ అనొచ్చా?”

“నీ మొహం! పదాన్ని బట్టి! పెళ్లీకీ పిడుక్కూ ఒకే మంత్రమా?”

వాడన్నాడు. “ఇక నీవు ఆపు! ఇప్పుడు నీవన్న దానిని నేను వివరిస్తా. నాకు ఆ మాత్రం తెలుసులే.”

“ఏమిటో చెప్పి ఏడ్చు.”

“నీలంటి బాపనీయ్యకు మంత్రాలు రావంట. సంభావన వస్తుందని పెళ్లి చేయించటానికి ఒప్పుకున్నాడు. తంతు నడిపిస్తూ, అతనికి వచ్చిన ‘శుక్లాం భరధరం’, ‘చేత వెన్న ముద్ద’, ఇంకా కొన్ని వేమన పద్యలు చదువుతున్నాడట. ఒకాయన ఇదంతా గమనిస్తున్నాడు. చివరికి తాళి కట్టే సందర్భం వచ్చింది. మన స్వామిగారు ‘అర్జునా, ఫల్గుణా, పార్ధా, కిరీటి, శ్వేతవాహన..’ అంటూ పిడుగు పడేటప్పుడు చదివే మంత్రం చదవసాగాడట.. ‘ఏమిటి పంతులు! ఇదా ఆ మంత్రం?’ అని అడిగితే, ‘పిడుగు పడినా సరే, ఈ తాళి తెగిపోకూడదని..’ అన్నాడట. అందుకే ‘పెళ్లికీ పిడుక్కీ ఒకే మంత్రమ’ని సామెత! ఎలా వుందిరా శర్మా?”

“బాగుందిరా! బాగా చెప్పావు! నీవేం పైకి కనిపించేంత మంచోడివి కాదురోయ్! మొదట్లో.. నీలాంటి బాపనయ్యకు అన్నావు చూడు, అదే నాకు నచ్చలేదు.”

ఇద్దరం నవ్వుకున్నాము. మా ఇద్దరి కాంబినేషన్ సూపర్ కదండి!

మందిర్ ప్యాలెస్ ఎక్స్‌టీరియర్స్‌ను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. కళను నిర్మాణంలో మమేకం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది? లోపల ఒక మ్యూజియం ఉంది. దాంట్లోకి వెళ్లలేదు. రాజుల దుస్తులు, ఆయుధాలు, ఎన్నని చూస్తాం? యథాప్రకారం భవనంలోని ఒక భాగాన్ని స్టార్ హోటల్‌గా మార్చారు. సామాన్య ప్రజానీకం అందులో బస చేయలేరట.

మహారాజా జశ్వీర్ సింగ్ 1914-1949 ప్రాంతాల్లో పరిపాలించాడు. ఆయన రాజ్ కుమారి కల్యాణ్ కన్వర్‌ను వివాహమాడాడు. 1917లో ఆయన వారసుడు మహారాజా హుకుమ్ సింగ్ ఆయన ఎమ్.ఎల్.ఎ.గా ఉన్నారు రాజస్థాన్ అసెంబ్లీలో. ఆయన తర్వాత ఆ రాజవంశంలో మూడవ తరం వారసుడు రాజ్ కుమార్ డా. జితేంద్ర సింగ్. ఆయన తన భార్యా పిల్లలతో ఆ భవనంలోనే నివసిస్తాడు.

భవనం గోపురాన్ని ‘బాదల్ విలాస్’ అంటారు. ఆకాశంలో మేఘాలను టచ్ చేసేంత ఎత్తుందని దాని అర్ధం. జైసల్మేర్ ఫోర్ట్ తర్వాత అదే ఎత్తయినది. భవనంలోని ‘జవహర్ విలాస్’ అన్న భాగాన్ని మహారాజా హుకుమ్ సింగ్ ఒక ప్రీమియం హెరిటేజ్ హోటల్‌గా మార్చి ‘వెల్‌కమ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్’ వారికి లీజుకిచ్చాడు. బాగా డబ్బున్నవారు, కోటల్లో నివసించాలన్న సరదా తీర్చుకోవచ్చు.

మందిర్ ప్యాలెస్ లోని మ్యూజియంను హర్ హైనెస్, మహారాణీ సాహెబా, కల్యాణ్ కన్వర్ (బూంది రాజకుమార్తె)కు అంకితం ఇవ్వబడంది. ఆమె జస్వర్ సింగ్ రాజుగారి భార్య అని ముందే చెప్పకున్నాం. తర్వాత రాజకిచెన్(?) లోకి వెళ్లాం. అది చాలా పెద్దది. అందులో గంగాళాలు, గిన్నెలు, గరిటెలు, నర్తనశాల సినిమాలో భీమసేనుడి కిచెన్‌లో ఉన్నంత పెద్దవి.

మందిర్ ప్యాలెస్ ఉన్న ప్రాంతాన్ని ‘గాంధీ చౌక్’ అంటారు. దానికి కొంత దూరంలోనే జైసల్మేర్ ఫోర్ట్ ఉందట. కానీ దాన్ని ప్రజలకు రెసిడెన్షియల్ యూనిట్స్‌గా మార్చి ఇచ్చేశారట. జైసల్మేర్ ఓల్డ్ సీటిలోని 25 శాతం ప్రజలు అక్కడ నివసిస్తారట. రావల్ జైస్వాల్ అనే రాజుగారు దాన్ని 1155 ADలో కట్టారు. అందులో షాపులు, మార్కెట్‌లు ఉంటాయట. మా పశుపతి సిసోడియా చెప్పాడు.

మా యోగా అన్నాడు – “రెసిడెన్షియల్ క్యాంపస్‌గా మారిన దాన్ని ఏం చూస్తాం? వద్ద పద!” నాకూ కరెక్టే అనిపించింది. టైం చాలదని తిరుగుతున్నాం. రెండున్నర దాటింది. భోజనం! భోజనం! అని పేగులు అరుస్తున్నాయి. ‘డెలికసీ’ అన్న హోటల్‌కు తీసుకెళ్లాడు మా డ్రయివర్. అది పూర్తి రాజస్థానీ, జైసల్మేర్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంది. అడుగు ఎత్తున ‘లో’ టేబుల్స్, రెండుడుగుల ఎత్తున వాటి కెదురుగా డైనింగ్ టేబుల్స్ వేశారు.

మంచాల్లాంటివి కూడా ఉన్నాయి. వాటి పక్కన హుక్కా గొట్టాలు! అంత క్రింద కూర్చోని తినలేం. కాని మాలాంటి వాళ్లకు ఒక మూల నాలుగు పెద్ద టేబుల్లు, కుర్చీలు వేశారు. ఇంటీరియర్స్ కళాత్మకంగా ఉన్నాయి. కింద వాల్ టు వాల్ కార్లెట్. పాత్రలన్నీ రాగివి. తళతళ మెరుస్తున్నాయి. భోజనం ప్లేట్లు కూడా రాగివే. పొదీనా రైస్, కర్డ్ రైస్ ఆర్డర్ చేసి, షేర్ చేసుకున్నాము.

అక్కడి నుంచి ఆర్మ్‌గఢ్ జైన్ మందిర్‌కు వెళ్లాము. జైసల్మేర్‌లో అది ‘మస్ట్ వాచ్’ అట. అక్కడి మూల విరాట్టు జైన గురు పరంపరలో 108వ వారు. ఆయన పేరు పార్శ్వనాధ్ తీర్ధంకర్. జైన మందిర్ చాలా మనోహరమైన నిర్మాణం. కోటలు చూసీ చూసీ విసుగెత్తిన మాకు అది చాలా రిలీఫ్ నిచ్చింది! మందిరంలోని మంటపాలు, గోపురాలు రెడ్ శాండ్ స్టోన్‌తో నిర్మించారు. లోపల, మందిరంలో చల్లగా, ప్రశాంతంగా ఉంది. ఆవరణ అంతా మహా వృక్షాలున్నాయి. ఒక వైపు పాండురంగని భక్తుడైన పుండరీకుని గుడి ఉంది. అది పాలరాతి విగ్రహం. జైన సంప్రదాయానికి, పుండరీకునికి పొంతన కుదరలేదు. పుండరీకుడు విష్ణు భక్తుడు కదా!

నాలుగున్నర దాటింది. మేము ఆరు గంటలకల్లా డెజర్ట్ క్యాంప్‌కు చేరాలి. మధ్యలో ఎక్కడైనా టీ కి ఆపమన్నాం. పశుపతి సిసోడియా “వద్దు సార్. డెజర్ట్ క్యాంప్‌లో అన్నీ కాంప్లిమెంటరీనే. టీ, స్నాక్స్ మీరు వెళ్లగానే ఇస్తారు. రాత్రి డిన్నర్ చాలా బాగుటుంది.” అన్నాడు.

మేం ఒక ఇరవై నిమిషాలు ప్రయాణించిన తర్వాత ఎడారి ప్రారంభమైంది. అదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన థార్ ఎడారి. దాన్నే గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటారు. రోడ్డుకు రెండు వైపులా, కనుచూపు మేర, ఇసుకే! ఇసుక! ఇసుక! ఇసుక తప్ప మరేమీ లేదు. పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు! థార్ ఎడారి 205,000 చ.కి.మీ విస్తీర్ణంలో ఇండియా-పాకిస్టాన్ దేశాల్లో వ్యాపించి ఉంది. పాకిస్తాన్ బోర్డర్ పెద్ద దూరం ఉండదట. అత్యంత వేడిమి వెలార్చే ప్రపంచంలోనే 9వ అతి పెద్ద సబ్ ట్రాపికల్ ఎడారి ఇది. ఇండియాలో రాజస్థాన్ లోనే దీని విస్తీర్ణం ఎక్కువ. 90 శాతం ఇండియాలో, పది శాతం పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ ప్రాంతంలో ఈ ఎడారి ఉంది.

ఇతర ప్రాంతంలో శీఘ్రంగా కనుమరుగు అవుతున్న వన్యప్రాణుల్లో కొన్ని ఈ ఎడారిలో బ్రతుకుతున్నాయి. చింకారా జాతి జింకలు, దుప్పులు, బ్లాక్‌బక్ జాతి జింకలు, ఇండియన్ వైల్డ్ యాస్ (కంచరగాడిదలు) ఇక ఒంటెలు సరే సరి. ఇవన్నీ ఎడారి వాతావరణాన్ని తట్టుకోగలవు. రెడ్ ఫాక్స్ జాతి నక్కలు, అనేక రకాల సర్పాలు ఉంటాయి. ఎడారి నెమళ్లు కూడా. ‘ఎడారి కోయిల’ అని కవులు అరుదైన విషయాన్ని చెప్పేటప్పుడు కవి సమయంగా వాడతారు గాని, థార్ ఎడారిలో కోయిలలు లేవు. వసంతము లేదు. ఎడారిలో రకరకాల చెట్లు, పొదలు, గుబుర్లు పెరుగుతాయి. కొన్ని పుష్పజాతులు కూడా ఉంటాయట.

జనాభా అతి తక్కువ. ఒక చ.కి.మికు 83 మంది ఉంటే గొప్ప. వారిలో అన్ని మతాల వారూ ఉన్నారు. రాజస్థాన్ లోని మొత్తం జనాభాలో 40 శాతం మంది ఎడారి వాసులే. వారి ముఖ్య వృత్తి ఒంటెల పెంపకం. లిమిటెడ్‌గా వ్యవసాయం. వారికి జానపద సంగీతం, కవిత్వం, నృత్యం అంటే చాలా ఇష్టం. జైసల్మేర్, బికనీర్ నగరాలు ఎడారిలోనే నిర్మించారు.

చిన్న చిన్న నీటి కుంటలు, చిన్న చెరువులు వారికి నీటి వసతి కల్పిస్తాయి. అవి మానవులు తవ్వుకున్నవే. నీరు తియ్యగా ఉండదు. నీటి వసతి లభ్యత బట్టి ప్రజలు సంచారజీవులు, నీరు నిల్వ చేసే టాంకులు కూడా నిర్మిస్తారు.

బాజ్రా అనేది ఎడారిలో పండే ఖరీప్ పంట. మన సజ్జ పంట లాంటిది. తృణధాన్యం. శ్రీగంగానగర్ జిల్లాలో ఆవాల పంట (mustard) బాగా సాగవుతుందట. అన్నీ వర్షాధార మెట్ట పంటలే. జొన్న, మొక్కజొన్న, వేరు శనగ, నువ్వులు కూడ పండిస్తారు కాని తక్కువ!

నల్ల మందు (opium) పంట కూడా సాగు చేస్తారు. నల్ల మందు వాడకం ప్రజల్లో ఎక్కువ. ఎడారిలో ఒంటెల మీద టూరిస్టులను తిప్పడం కూడా ఒక ముఖ్యవృత్తి. ఒంటెలను చక్కగా అలంకరిస్తారు. దీనినే desert safari అంటారు.

జైసల్మేర్ బేసిన్‌లో natural gas నిక్షేపాలను కూడ Oil India వెలికి తీసింది.

రోడ్డు కిరువైపులా డెజర్ట్ క్యాంప్‌లు రకరకాల పేర్లతో, అవి అందించే సౌకర్యాలతో పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకున్నాయి. ఆరు గంటల పదినిమిషాలకు మా కోసం రిజర్వ చేసిన ‘డెజర్ట్ కింగ్ రిసార్టు’కు చేరుకున్నాం. కారు దిగుతూనే తెలిసింది బయట ఎంత వేడిగా ఉందో?

(ఫోటోలు – కొన్ని ఇంటర్‍నెట్ నుంచి సేకరణ, కొన్ని రచయిత తీసినవి)

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here