గులాబీ రంగు రోడ్డు

0
11

[శ్రీ సలీం రచించిన ‘గులాబీ రంగు రోడ్డు’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]“ఈ[/dropcap]రోజు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్దాం డియర్. మనకు పరిచయం లేని ప్రదేశాలకెళ్ళడం చాలా థ్రిల్లింగ్‍గా ఉంటుంది కదా” అన్నాను.

“వద్దు. ఈ సండే కూడా బీచ్‌కే. నాకు సముద్రమంటే ఎంతిష్టమో నీకు తెల్సుగా. నువ్వంటే ఎంతిష్టమో దానికి రెట్టింపు ఇష్టం” అరచేయంత మందాన ఉన్న తన అందమైన కళ్ళని సుతారంగా తిప్పుతూ అంది సుకేశిని.

“ప్రతి ఆదివారం సముద్రపు ఒడ్డున కూచుని కూచుని బోర్ కొడ్తోంది డియర్. ఈ రోజు మరో చోటికి వెళ్దాం.. ప్లీజ్.”

“నో వే. నాకు బోర్ కొట్టదు. బీచ్‍కైతేనే వస్తాను. కాదంటే నువ్వొక్కడివే వెళ్ళు. నాకభ్యంతరం లేదు” పెదవి విరుస్తూ చెప్పింది.

“నువ్వు పక్కన లేకుండానా? నాకంత సరదా లేదులే. నీ యిష్టప్రకారమే కానీ. వెళ్దాం రా” నాలోని నిరాశని కప్పిపుచ్చుకుంటూ అన్నాను.

సుకేశిని కార్లో నా పక్క సీట్లో నవ్వుతూ కూచుంది. ఆ నవ్వులో ఎప్పుడూ గెలుపు నాదే సుమా అనే భావన తొణికిసలాడింది.

సమయం నాలుగ్గంటలు దాటి పదినిమిషాలైంది. ఇరవై కిలోమీటర్ల దూరం. అరగంట ప్రయాణం. అక్కడ రాత్రి ఏడున్నర వరకు గడిపి, తిరిగి బయల్దేరితే ఎనిమిదింటికల్లా యింటికి చేరుకుంటాం. అలవాటైన రోడ్డు.. కారుని మెల్లగా నడపసాగాడు.

సుకేశిని డ్యాష్ బోర్డ్ తెరిచి అందులోంచి రఫీ, లతా మంగేష్కర్‍ల డ్యూయెట్లున్న క్యాసెట్ తీసి, టేప్ రికార్డర్లో పెట్టి, ప్లే బటన్ నొక్కుతూ “నీకు స్వీట్ నథింగ్స్ మాట్లాడటం రాదు కదా. నాకు సైలెంట్‍గా కూచోవడం ఇష్టముండదు. టైం పాస్ కావాలంటే ఇదొక్కటే దారి” అంది.

ఆమె వైపోసారి చూసి, తల తిప్పుకుని, రోడ్డుమీద ధ్యాస పెట్టాను. నిజమే. నాకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉండదు. సుకేశిని వసపిట్టలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. విరుద్ధమైన స్వభావాలు.

కానీ అదేమీ మా ప్రేమకు అడ్డు రాలేదు. విజాతి ధృవాల మధ్య ఆకర్షణ ఉంటుందని కదా సైన్స్ అంటుంది. ఐదేళ్ళ ప్రేమ తర్వాత పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళయి ఏడాది దాటి రెండు నెలలు.. సుకేశిని చాలా మంచి అమ్మాయి. ఎటొచ్చీ చిన్న పిల్లలా మంకు పట్టు పడ్తుంది. తన మాటే చెల్లాలని పంతం పడ్తుంది. అంతే..

‘సౌ సాల్ పహలే ముఝే తుమ్‍ సే ప్యార్ థా, ముఝె తుమ్ సే ప్యార్ థా, ఆజ్ భీ హై ఔర్ కల్ భీ రహేగా’ స్టీరీయో లోంచి రఫీ, లతా మంగేష్కర్‍ల గొంతులు శ్రావ్యంగా విన్పిస్తున్నాయి. సుకేశిని వాళ్ళ గొంతులో గొంతు కలిపి పాటని హమ్ చేయసాగింది.

రోడ్డు మీద వాహనాల రద్దీ ఎక్కువగా లేదు. స్పీడ్ పెంచాను,

“స్పీడ్ పెంచావేమిటి? మెల్లగా వెళ్లాం. తొందరెందుకు?” అంది సుకేశిని.

“రోడ్డు ఖాళీగా ఉంది. అందుకే ఎనభైలో వెళ్తున్నా.”

“వద్దు. అరవై దాటకూడదు.”

“అలాగైతే నువ్వే డ్రైవ్ చేయవచ్చుగా. నీ ఇష్టమొచ్చిన స్పీడ్‍లో వెళ్ళొచ్చు.”

“సరే. పక్కనాపు. నేనైతే నలభై దాటను” అల్లరిగా నవ్వుతూ అంది.

“వద్దులే డియర్. నేనే నడుపుతా. అరవై దాటన్లే” అన్నాను.

కొన్ని క్షణాల విరామం తర్వాత “స్పీడ్‍గా వెళ్దామంటే ఇష్టపడవు. కొత్త ప్రదేశాలకెళ్దామంటే వద్దంటావు. ఎందుకు చెప్పు?” అన్నాను.

“అతి వేగం వల్ల ప్రమాదాలు జరుగుతాయని నాకు భయం.”

“మరి కొత్త ప్రదేశాలంటే..”

“ఫియర్ ఆఫ్ ది అన్‍ఫెమిలియర్. అక్కడ ఎలాంటివాళ్ళు ఉంటారో తెలియదు కదా. దొంగలు, మోసగాళ్ళు, రేపిస్టులు, హంతకులు.. ఉండొచ్చు కదా. అందుకు భయం.”

“పక్కన నేనున్నానుగా. యింకెందుకు భయం?”

“నలుగురు మగాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే నువ్వొక్కడివి ఏం చేయగలవు?”

పెద్దగా నవ్వాను. తెరలు తెరలుగా నవ్వాను. “సోనీ టీవీలో క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్లు చూడొద్దంటే వినవు కదా. దానివల్లనే నీకు మనుషులందరూ క్రిమినల్స్‌లా కన్పిస్తున్నారు. నీకున్న ఫోబియాని ఏమంటారో తెలుసా? అగురోఫోబియా.”

“నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో. నా స్వభావం మారదు. ఐనా ఈ రోజుల్లో మంచివాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటావా? నువ్వూ నేను తప్ప” అంటూ నవ్వింది.

ఇంతలో టేప్‍లో కొత్త పాట మొదలయింది.

“దునియావాలోంసే దూర్ జల్నే వాలోంసే దూర్ ఆజా ఆజా చలే కహీ దూర్, కహీ దూర్”

“రఫీ లతాల మధ్య ముకేష్ ఎలా దూరాడు?” అడిగింది నవ్వుతూ..

“ముకేష్, లతలు కూడా, అందరినీ వదలి ఎక్కడెక్కడికో పొమ్మంటున్నారు.. ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడికయినా వెళ్ళిపోదామా?” అన్నాను.

ఆమె సమాధానంగా ఏదో అంటోంది.

నేను తన మాటల్ని వినే ధ్యాసలో లేను. ఎడం వైపున గుబురు పొదల మధ్యన కన్పిస్తున్న రోడ్డు వైపు ఆశ్చర్యంగా చూస్తూ కారుని పక్కకు తీసి ఆపాను.

“యిక్కడెందుకాపావు?” నా వైపు అనుమానంగా చూస్తూ అడిగింది.

“ఈ రోడ్డు చూశావా? పోయిన వారమేగా మనం ఈ దారి గుండా ప్రయాణించాం. అప్పుడు లేదుగా. దారిలో కన్పించే రెండు గ్రామాల్ని దాటి కదా వచ్చాం. కొత్తగా యిక్కడేమైనా గ్రామం ఏర్పడిందా? దానికోసం ఈ రోడ్డు వేశారా? ఐనా ఓ వారంలో గ్రామం పుట్టుకు రావడమనేది వింత కదూ” అన్నాను.

“మనకెందుకవన్నీ.. మన దారిన మనం వెళ్లాం పద” చిరాగ్గా అంది.

“నువ్వో విషయం గమనించావా? ఈ రోడ్డు తార్రోడ్డులా నల్లగా లేదు. సిమెంటు రోడ్డులా తెల్లగానూ లేదు. అదో రకమైన లేత గులాబీ రంగులో మెరుస్తోంది. బహుశా రోడ్లు వేయడం కోసం కొత్త రకం మెటీరియల్ కనుక్కున్నారేమో. అసలిది ఎక్కడిదాకా వెళ్తుందో చూసొద్దామా?”

“వద్దు. నేరుగా బీచ్‍కి పోనీ” కోపంగా అంది.

“ప్లీజ్ సుక్కూ. ఈ రోడ్డు మీద కారెలా పోతుందో చూడాలన్న ఆసక్తి. జస్ట్ పది నిమిషాలు. అంతే. ఆ వెంటనే తిరిగొచ్చేద్దాం.”

కొద్దిసేపు నా మొహంలోకి దీర్ఘంగా చూసి, “సరే. పది నిముషాలు దాటి ఒక్క సెకండ్ ఎక్కువైనా నేనొప్పుకోను. యువర్ టైం స్టార్ట్స్ నౌ” అంది మొబైల్ ఫోన్‍లో టైమర్ ఆన్ చేసి.

తను ఒప్పుకుంటుందనుకోలేదు. ఏ మూడ్‌లో ఉందో ఒప్పుకుంది. ఎంత సంతోషమనిపించిందో.. వెంటనే కార్‍ని పొదల మధ్యలోంచి లేత గులాబీ రంగులో మెరిసే ఆ రోడ్డులోకి పోనిచ్చాను.

కొంత దూరం వెళ్ళాక రోడ్డు ఎడం వైపుకి మలుపు తిరిగింది. మరికొంత దూరం ప్రయాణించాక కుడివైపుకి తిరిగి రెణ్ణిమిషాలు డ్రైవ్ చేశాను. తన మొబైల్ ఫోన్లో చూస్తున్న సుకేశిని, “అదేమిటి , నా మొబైల్ లో టైం ఏదేదో చూపిస్తోంది” అంది కంగారుగా..

“పది నిముషాలయితే వెళ్ళిపోదామంటావు కదా!! ఈ రోడ్డు వదలి పోవాలని లేనట్టుంది. అందుకని టైం ఆటలాడుతున్నట్టుంది” అన్నాను.

“లేదు..నాకేదో భయంగా వుంది. వెనక్కి తిప్పండి కారు. వెళ్ళిపోదాం” భయంతో హిస్టిరికల్‌గా అరిచింది.

“యస్ బాస్” అంటూ కారుని వెనక్కి తిప్పి పోనిచ్చాను. రెణ్నిమిషాలు దాటినా ఎడం వైపు మలుపు రాలేదు. ఆశ్చర్యపోతూ మరికొంత ముందుకి పోనిచ్చాను. పది నిమిషాల డ్రైవ్ తర్వాత కూడా లెఫ్ట్ టర్న్ కన్పించలేదు. నాలో కంగారు మొదలైంది. పైకి కంగారు కనబడనివ్వలేదు. అప్పుడు గమనింఛాను, ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు, టేప్ ఆగిపోయింది. పాటలు రావటంలేదు.

“మళ్ళా వెనక్కిపోనీ.. మనం టర్నింగ్ని మిస్ అయ్యామేమో” అంది సుకేశిని. తన అందమైన కళ్ళల్లో ఇపుడు భయం నగ్నంగా కన్పించసాగింది.

అలా ఎలా మిస్ అవుతాం? అవకాశమే లేదు. ఏదో జరిగింది. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. కొన్ని నిమిషాల ముందు కన్పించిన రోడ్ అలా ఎలా మాయమైపోతుంది? ఇంపాజిబుల్.

కంగారును అణచుకోటానికి టేప్‌ను కదిపాను. కదలిక లేదు. ఎఫ్ ఎమ్ చానెళ్ళు తిప్పాను. ఇండక్షన్ శబ్దం తప్ప మరో శబ్దం లేదు. అన్ని ఎఫ్.ఎమ్ చానళ్ళు పనిగట్టుకుని మూత పడ్డట్టున్నాయి.

కారుని వెనక్కి తిప్పాను. రోడ్డు నేరుగా వెళ్తుంది తప్ప ఎక్కడా టర్నింగులు కన్పించలేదు.

“అందుకే కొత్త ప్రదేశాలకు రానని చెప్పాను. వింటేగా. యిప్పుడు చూడు ఏమైందో..” ఆమె గొంతులో కోపంతో పాటు భయం కూడా ధ్వనించింది.

“మనం దారి తప్పినట్టు అన్పిస్తోంది. ముందుకే వెళ్ళి చూద్దాం.. ఈ రోడ్డు ఎటుకెళ్తుందో తెలుస్తుంది. అక్కడినుంచి బీచ్‌కి దారెటో తెల్సుకుంటే చాలు” ధైర్యాన్ని చిక్కబట్టుకుంటూ అన్నాను.

“దారి తప్పడానికి మనమేమీ గంటలకొద్దీ సందుల్లో గొందుల్లో. ప్రయాణం చేయలేదు. ఒక లెఫ్ట్ ఒక రైట్ తీసుకున్నాం. అంతే. జరిగింది అది కాదు. ఏ మాయల మాంత్రికుడో మనం వచ్చిన దారిని అదృశ్యం చేసినట్టు అన్పిస్తోంది. నాకు భయమేస్తోంది అమోఘ్” సన్నగా ఏడుస్తూ అంది.

“భయపడకు. నేనున్నానుగా. మనమిప్పుడు ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం. మాయలూ మంత్రాలూ ఉత్త నాన్సెకిల్ బిలీవ్స్. ఈ ప్రపంచంలో ప్రతిదీ సైన్స్ నియమాలకు లోబడే జరుగుతూ ఉంటుంది” అన్నాను. అలా అన్నానే గానీ నాకు మనసులో బెరుగ్గానే ఉంది. కొన్ని నిమిషాల ముందు ప్రయాణించి వచ్చిన రోడ్డు అకస్మాత్తుగా ఎలా కన్పించకుండా పోయింది? అంతు చిక్కని ప్రహేళికలా ఉంది.

దారికిరువైపులా చెట్లు కన్పించసాగాయి. “ఈ చెట్లు చూశావా? కొత్తగా ఉన్నాయి. ఇలాంటి చెట్లను నేనెప్పుడూ చూళ్ళేదు” అంది.

ఇందాకటినుంచి నేనూ గమనిస్తూనే ఉన్నాను. వింత రంగుల్లో ఉన్న ఆకులు.. వింత ఆకారాల్లో మొలిచిన చెట్లు. రంగురంగుల ప్లాస్టిక్ వైర్లతో అల్లి తయారు చేస్తే తప్ప సాధ్యం కాని రూపాలు. కానీ ప్లాస్టిక్ కాదు. నిజమైన చెట్లే. సుకేశిని కంగారుపడ్తుందని చెప్పలేదు. యిప్పుడు తనే గమనించింది కాబట్టి ఏదో ఓ సమాధానం చెప్పి బుజ్జగించక తప్పదనిపించింది.

“మనకు తెల్సినవే చెట్లనుకుంటే ఎలా? వాటిలో కొన్ని వేల రకాల స్పీషీస్ ఉండొచ్చు. యివి మనకు తెలియని జాతికి చెందిన చెట్లు” అంటూ నవ్వడానికి ప్రయత్నించాను.

మరికొంత దూరం వెళ్ళి ఉంటాము. సుకేశిని భయంతో చిన్నగా అరిచింది. “ఆ పక్షిని చూశావా ఎంత భయంకరంగా ఉందో.. అది మనవైపే చూస్తోంది. ఎటాక్ చేయడానికి సిద్ధపడ్తున్నట్టుంది” అంది.

నేను కార్‌ని స్లో చేసి, సుకేశిని చూస్తున్న వైపు చూశాను. నిజమే.. దాని ఆకారమే భయం గొలిపేలా ఉందనుకుంటే దాని కళ్ళు మరింత భయపెడ్తున్నాయి. ఎంత పెద్ద కళ్లో.. వాటిలో ఎర్రటి జీరలు.. మా వైపే చూస్తోంది. క్రోధం నిండిన చూపు..

నాకూ భయమేసింది. కారుని వేగంగా పోనిచ్చాను.

పక్షి నింపాదిగా ఎగురుతూ మమ్మల్ని వెంబడిస్తోంది. ఆ విషయం చెప్తే సుకేశిని భయపడుతుందని నేను చెప్పలేదు. కానీ, దాన్ని గమనిస్తూనే వున్నాను.

ఇంతలో యిళ్ళు కన్పించసాగాయి. మా వీధిలో ఎలా ఉంటాయో అలానే ఉన్న యిళ్ళు.. మనుషులు అటూ యిటూ తిరగడం చూశాక నా భయం తగ్గింది. చెట్లు, మాక్కనిపించిన పక్షి వింతగా ఉన్నాయి కానీ మనుషులు మామూలుగానే ఉన్నారు. ఆ వూరిని, అక్కడి మనుషుల్ని చూశాక సుకేశిని నాకంటే ఎక్కువ సంతోషపడింది

బీచ్‍కి ఎలా వెళ్ళాలో కనుక్కుంటే చాలు ఇక్కడినుంచి బైటపడొచ్చనిపించింది.

కారుని రోడ్డు పక్కగా ఆపుకుని దిగి, నిలబడ్డాను. ఒకతను నా పక్కనుంచి వెళ్తూ నా వైపు ప్రశ్నార్థకంగా చూడటం గమనించి, “హల్లో సార్.. ఒన్ మినిట్” అన్నాను. అతను ఆగి, ఏమిటన్నట్టు చూశాడు. “బీచ్‌కి వెళ్ళడానికి దారెటో చెప్తారా?” అని అడిగాను.

“బీచ్? అంటే ఏమిటి?” నా వైపు అయోమయంగా చూస్తూ అన్నాడు.

మనిషిని చూస్తే ఏమో బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు. బీచ్ అంటే ఏమిటో తెలియకపోవడం ఏమిటి?

“బీచ్.. సముద్రం సర్.. సముద్ర తీరం.”

“సముద్రం అంటే?”

సముద్రం అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతునే “సముద్రం సర్.. ఓషన్.. సీ.. ఉప్పు నీళ్ళు.. ఎగసిపడే అలలు..”

అతను నా వైపు వింతగా చూశాడు. ఓ పిచ్చి వాడి వైపు చూసే చూపు.. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోతున్నట్టు వేగంగా వెళ్ళిపోయాడు.

యిలా అడగడం వల్ల ప్రయోజనం ఉండదని అర్థమైంది. ఏదో ఓ దారి పట్టుకుని వెళ్తూ ఉంటే తప్పకుండా మాక్కావల్సిన దారి దొరుకుతుందన్న ఆశ..

పరిసరాల్ని గమనించుకుంటూ కారుని మెల్లగా పోనివ్వసాగాను.

సాయంత్రమైంది.. చీకటి పడింది.. దారీ తెన్నూ తెలీని అవస్థలో రాత్రి పూట ప్రయాణం చేయడం ప్రమాదకరమని మనసు హెచ్చరిస్తోంది. అలాగని ఈ రాత్రిని ఎక్కడ గడపాలి? ఎవరూ తెలీదే..

ఓ యింటి ముందు ఎవరో స్త్రీతో మాట్లాడుతున్న నాన్న కన్పించగానే సడన్‍గా బ్రేక్ వేశాను. సుకేశిని ముందుకు తూలి, వెనక్కి సర్దుకుని నా వైపు కోపంగా చూసింది. ఆమెను పట్టించుకోకుండా నాన్నలా కన్పించిన వ్యక్తి వైపు పరిశీలనగా చూశాను. నాన్నే.. అనుమానం లేదు. ఎటొచ్చీ ఎప్పుడూ కన్పించేలా కాకుండా చాలా ట్రిమ్, పదేళ్ళ వయసుని నొక్కేసినట్టు యవ్వనంగా కన్పిస్తున్నాడు.

కారు దిగి ఆ యింటి వైపుకి నడిచాను. నన్ను చూడగానే ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్టు చూసి, “ఎవర్నువ్వు? ఏం కావాలి?” అని అడిగాడు నాన్న.

ఎందుకు నేనెవరో గుర్తు పట్టనట్టు మాట్లాడుతున్నాడు? యిక్కడెందుకున్నాడు? ఆ స్త్రీ ఎవరు? నాలో ఎన్ని అనుమానాలో.. ఎన్ని భయాలో.. ఒక్కుమ్మడిగా దాడిచేస్తూ..

“నాన్నా.. నేను అమోఘ్‍ని” ఎలాగోలా గొంతు పెగుల్చుకుని అన్నాను.

“నాన్నేంటి? ఎవరు నాన్న? నువ్వెవరో నాకు తెలియదు. నువ్వేదో చిత్త భ్రమలో ఉన్నట్టున్నావు” నా వైపు అనుమానంగా చూస్తూ అన్నాడు.

ఆ స్త్రీ నా వైపూ నాన్న వైపు కోపంగా చూస్తూ “ఎవరండీ ఇతను? మిమ్మల్ని నాన్నంటున్నాడేమిటి? అసలేం జరుగుతోంది? కొంపదీసి మీకు మరో సంసారం ఉందా?” అంది.

“అయ్యో ఆరాధ్యా.. అలాంటిదేమీ లేదు” అంటూ నా వైపు తిరిగి, “చూడు బాబూ.. నువ్వెవరో తెలియదు. ఈమె నా భార్య. నాకిద్దరు పిల్లలు.. పదమూడేళ్ళ కొడుకూ పదేళ్ళకూతురు. ఆనందంగా సాగిపోతున్న మా సంసారంలో చిచ్చు పెట్టకు. దయచేసి వెళ్ళిపో” అన్నాడు.

అతను నాన్నలా ఉన్నాడు కానీ నాన్న కాదని అర్థమైంది. ఒకేలా కన్పించే వ్యక్తులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని కదా అంటారు. వాళ్ళలో ఇతనొకడేమో.. అంతేనా లేకపోతే నాన్న చిన్నిల్లు పెట్టి, అమ్మను మోసం చేస్తున్నాడా?

“సారీ సర్.. నేనే పొరబడ్డాను. క్షమించండి. మాకు ఈ ప్రాంతం కొత్త. దారి తప్పాం. మూడు గంటల నుంచి పిచ్చిపట్టినట్టు తిరుగుతున్నాం. అలసిపోయి ఉన్నాం. నిరాశా నిస్పృహల్లో ఉన్నాం. మీలో కొన్ని నాన్న పోలికలు కన్పించాయి. అందుకే పొరబడ్డాను. క్షమించండి” అన్నాను.

అతని మొహం ప్రసన్నంగా మారింది. కానీ ఆమె మొహంలోని కోపఛాయలు తగ్గనే లేదు.

అతను తిరిగి యింటిలోపలికి వెళ్ళబోతున్న సమయంలో, “మీరేమీ అనుకోనంటే నాదో విన్నపం. చీకటి పడింది. నేను ఒక్కడినే అయితే ఏ రోడ్డుపక్కనైనా తలదాచుకోగలను. నాతో పాటు నా భార్య కూడా ఉంది. ఈ రాత్రికి మీ యింట్లో ఆశ్రయమిస్తే చాలు. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాం” అన్నాను.

అతను కారు పక్కన నిలబడి ఉన్న సుకేశిని వైపోసారి చూసి, “సరే. ఒక్క పూటేగా ఉంటానంటున్నారు. దానికేం భాగ్యం. లోపలికి రండి” అన్నాడు.

అతని భార్య పాములా బుసకొట్టి, లోపలికి విసురుగా వెళ్ళిపోయింది.

డిన్నర్ సమయంలో కూడా ఆమె బైటికి రాలేదు. అతన్ని నానా రకాలుగా తిడ్తోనే ఉంది. అతను నవ్వుతూ భరిస్తూ ఉండటం చూసి, నాకే జాలేసింది. “సారీ సార్. మేం ఉండటం మీకు సమస్య అయ్యేలా ఉంది. మేం వెళ్ళిపోతాం” అన్నాను.

అతను నవ్వాడు. అచ్చం నాన్న నవ్వినట్టే.. “ఏం పర్వాలేదు. నా భార్య బేసికల్‍గా చాలా మంచిది. ఎటొచ్చీ కోపం ఎక్కువ. పిచ్చి కోపం.. ఒక్కోసారి ఆ కోపంలో ఏం చేస్తుందో కూడా తనకు తెలియదు” అన్నాడు.

ఎంత సహనమో ఈ మనిషికి! అనుకున్నాను. మా నాన్నకు కోపం ఎక్కువ. ప్రతి చిన్నదానికి అమ్మ మీద చిర్రుబుర్రులాడుతుంటాడు. పాపం అమ్మ.. నవ్వుతూ సహిస్తూ ఉంటుంది. ఈ మొగుడూ పెళ్ళాలు మా అమ్మానాన్నల స్వభావానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు.

“యిక్కడి రోడ్లు, మట్టి లేత గులాబీ రంగులో ఎందుకున్నాయి?” అని అడిగాను. “మీ ప్రశ్న అర్థం లేనిది. ఇక్కడ రోడ్లెప్పుడూ ఈ రంగులోనే వుంటాయి. ఎక్కడి నుంచి వచ్చారు?” అడిగాడతడు.

నేను చెప్పాను.

అది విని నవ్వాడు. “ఎప్పుడూ వినలేదు, ఇలాంటి పేరు” అన్నాడు. నేను  ఏవేవో గుర్తులు చెప్పాను. కాస్సేపు నా వైపు పరిశీలనగా చూశాడు.

తన అరచేతిలో మరోచేయి చూపుడువేలితో ఏదో రాశాడు. అతడి ముఖం గంభీరంగా మారింది. హఠాత్తుగా లేచాడు. “నాకు పనుంది. నా భార్య మీకు ఏర్పాట్లు చేస్తుంది” అని వెళ్ళిపోయాడు.

మాకేమీ అర్థం కాలేదు. అంతా అయోమయంగా వుంది.

పిల్లల బెడ్రూం మాకు కేటాయించారు. పిల్లలు హాల్లో పడుకున్నారు.

***

అర్ధరాత్రి పెద్దపెద్ద అరుపులు విన్పిస్తే యిద్దరం నిద్రలోంచి ఉలిక్కిపడిలేచాం.

ఏం జరుగుతోందో అర్థం కాలేదు.

ఎవరో అరుస్తున్నారు.

“వాళ్ళని చంపటానికి వీలులేదు. వాళ్ళు వేరే ఏదో గ్రహం నుంచో,  వేరే కాలం నుంచో, వేరే విశ్వం నుంచో వచ్చారు. వారిపై వైజ్ఞానిక పరిశోధనలు జరపాలి. వారిని మేము తీసుకువెళ్తాం. మాకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.” ఎవరిదో గొంతు వినిపిస్తోంది.

“వీల్లేదు. వీరు మన శత్రు దేశం నుంచి మన రహస్యాలు కనుక్కునేందుకు వచ్చారు. వారిని మేము తీసుకెళ్ళి నిజాలు కక్కిస్తాం. వారిని ప్రశ్నించే అనుమతి మాకుంది.” కర్కశంగా వుందా గొంతు.

“వీరు ఏలియన్లను అనుమానంగావుంది. ఏలియన్ పరిశోధన సంస్థకు అప్పగించటం మీ బాధ్యత.”

ఈ గొంతుల మధ్య అతని భార్యగొంతు బిగ్గరగా వినిపిస్తోంది. అతని భార్య కోపంతో అంటున్న మాటలు స్పష్టంగా విన్పిస్తున్నాయి. అతనేదో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

“వాడు మీ కొడుకే. మీ యిద్దరూ కలిసి నాటకాలాడ్తున్నారు. ఆస్తులన్నీ మీ పెద్ద కొడుక్కి కట్టబెట్టి నా కొడుక్కి అన్యాయం చేయాలనుకుంటున్నారా? నా కంఠంలో ప్రాణముండగా అలా జరగనివ్వను” అంటోందామె.

“అతనెవరో నాకు తెలియదు. మన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నా మాట నమ్ము” అన్నాడతను.

“మరి మిమ్మల్నెందుకు నాన్నా అని పిలిచాడు?”

“చెప్పాడుగా ఏవో పోలికలు కన్పించాయని.”

“మీకు వాళ్ళెవరో తెలియకపోతే యింట్లోకి ఎందుకు రానిచ్చారు? భోజనాలు పెట్టి, పడుకోడానికి వేరుగా గదిని ఏర్పాటు చేసి, ఇలాంటి మర్యాదలన్నీ ఎందుకు చేశారు?”

“దారి తప్పామని చెప్పారుగా. అతనితో పాటు వయసులో ఉన్న ఓ ఆడపిల్ల కూడా ఉంది. దయతో ఆశ్రయమిచ్చాను. అంతే. అయినా పోలీసులకు కబురు పెట్టానుగా? నా కోడుకయితే పోలీసులకు తెలుపుతానా?”

“నేను నమ్మను. యిందులో ఏదో గూడుపుఠాణి దాగుంది. మీరు వాళ్ళను యింట్లోకి రానిచ్చి మంచిపని చేశారు. నా కొడుకు భవిష్యత్తు కోసం ఎన్ని హత్యలు చేయడానికైనా వెనుకాడను.”

“కొంపదీసి వాళ్ళను చంపుతావా ఏమిటి?”

“వాడు నిస్సందేహంగా మీ కొడుకే. అనుమానం లేదు. వాడ్ని తప్పకుండా చంపుతాను. వాడితో పాటు ఆ పిల్లను కూడా. అందుకే గూండాలను పిలిచాను” అందామె.

బయట మనుషులు కొట్టుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.

సుకేశిని భయంతో వణికిపోసాగింది. “మనం వెంటనే యిక్కడినుంచి వెళ్ళిపోదాం. లేకపోతే మనల్ని చంపినా చంపుతారు వీళ్ళల్లో ఎవరికి చిక్కినా” అంది.

“శాస్త్రవేత్తలు మన మాటలు వింటారు. మనం వేరే ఏదో గ్రహానికి వచ్చినట్టున్నాం” ఆమెను సముదాయిస్తూ అన్నాను.

“ఇక్కడెవరూ మన గురింఛి ఆలోచించటంలేదు. ఎవరు మనల్ని వదిలినా ఆమె వదలదు.  ఆమె భర్త ఏం చెప్పాడో గుర్తు లేదా? పిచ్చి కోపంలో ఏం చేస్తుందో ఆమెకే తెలియదు అని కదా అన్నాడు. సైకోలా ఉంది. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. తొందరగా బయల్దేరు” అంది బైటికి వెళ్ళడానికి సన్నద్ధమౌతూ.

యిద్దరం మెల్లగా తలుపు తీసుకుని హాల్లో కొచ్చాం. ఎవరి గొడవలో వాళ్ళున్నారు, కొట్టుకుంటూ, తన్నుకుంటూ. పిల్లలు ఇంత గోలలో కూడా  గాఢనిద్రలో ఉన్నారు. పక్క బెడ్రూంనుంచి ఆమె అరుపులు విన్పిస్తూనే ఉన్నాయి. వీధి తలుపు తీసి, కారులోకి ఎక్కి కూచున్నాం.

“కొంత దూరం పోనిచ్చి రోడ్డుపక్కన ఎక్కడైనా ఆపు. తెల్లవారేవరకు కార్లోనే కూచుందాం” అంది సుకేశిని. ఆమె చెప్పినట్టే చేశాను.

తెలతెలవారుతుండగా మళ్ళా బయల్దేరాం. దారిలో ఎవరిదో శవయాత్ర.. వాళ్ళకు దారివ్వడం కోసం కారుని పక్కన ఆపుకుని ఆసక్తి కొద్దీ ఆ శవం వైపు చూశాను. అచ్చం నాలానే ఉన్న వ్యక్తి శవం అది. వయసే అరవై ఉంటుందేమో.. అదొక్కటే తేడా..

ఎంత భయమేసిందో.. కన్పించిన దారి వెంట వేగంగా పోనిచ్చాను. కొంత దూరం వెళ్ళాక వింతగా ఉన్న రంగురంగుల చెట్లు కన్పించాయి. వికృతంగా, భయంకరంగా ఉన్న రెండు పక్షులు కన్పించాయి. యింకొంత ముందుకెళ్ళాక ఎడం వైపు మలుపు కన్పించింది. తిప్పగానే ఏదో అడ్డొచ్చింది. కారు కంట్రోల్ కాలేదు. దాన్ని ఢీకొన్నాను.

దాన్ని తాకుతానని కళ్ళుమూసుకుని సిద్ధమై పోయిన నాకు, ఏదీ తగలకపోయే సరికి కళ్ళు తెరిచాను.

నాకు తెల్సిన రోడ్లోకి ప్రవేశించాను. ఆశ్చర్యంతో సుకేశిని వైపు చూశాను. ఆక్సిదేంట్ అవుతుండన్న భయంతో ఆమె స్పృహ తప్పిపోయి వుంది.

“హమ్మయ్య.. బతికిపోయాం” అంటూ కారుని ఆపి వెనక్కి తిరిగి చూశాను.

గుబురుపొదల మధ్య నిన్న కన్పించిన లేత గులాబీ రంగు రోడ్డు ఇప్పుడు లేదు. మాయమైంది.

ఆ తర్వాత ఎన్నిసార్లు ఆ దారెంట బీచ్‌కి వెళ్ళామో.. ప్రతిసారీ గులాబీ రంగు రోడ్డు కన్పిస్తుందేమోనని వెతుక్కునేవాడిని. మళ్ళీ ఎప్పుడూ ఆ రోడ్డు కన్పించలేదు.

ఇప్పటికీ మేము సమాంతర విశ్వంలో ప్రవేశించామో, వేరే గ్రహానికి వెళ్ళామో మాకు అర్థం కాలేదు. అసలెేమయిందో, ఎలా జరిగిందో కూడా తెలియదు. అప్పుడప్పుడు మేము దాని గురించి మాట్లాడుకుంటాము. ప్రతి సారి సుకేశిని అడుగుతుంది.

“మన జీవితంలో నిజంగానే అలా జరిగిందా లేకపోతే కలగన్నామా?”

“కల కాదు నిజమే.. కల లాంటి నిజం. నిరూపణ లేని నిజం ఆ గులాబీ రోడ్”  అంటాను నేను సమాధానంగా!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here