గుణవతి అహంభావం!

5
5

[box type=’note’ fontsize=’16’] మాటల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తే, అపార్థాలుండవని జి. వల్లీశ్వర్ రచించిన ఈ 99 సెకన్ల కథ చెబుతుంది. [/box]

[dropcap]మా[/dropcap] కార్తీక్ హిందీ టీచర్ గుణవతి మీద నాకు ఒళ్ళు మండి పోయింది. ఏడో క్లాసు టీచర్‌కి ఇంత అహంభావమా?

టీచర్స్ దినోత్సవం నాడు కార్తీక్ సొంతంగా హిందీలో రాసిన కవితని స్కూలంతా మెచ్చుకుంటే, ఈ గుణవతి మాత్రం మర్నాడు క్లాసులో వాణ్ణి నిలబెట్టి, “సినారె రాసినట్టు రాశావ్. ఎక్కడ కాపీ కొట్టావురా?” అని అర గంటసేపు ఏడిపిస్తుందా?

ఆంధ్రా నుంచి ఢిల్లీకి బదిలీ అయి వచ్చాం కాబట్టి వాడికి అసలు హిందీ రాదనుకుందా? కార్తీక్ నాలుగో క్లాసు నుంచే ఇంగ్లీష్, హిందీలో వాడి స్థాయిలో వాడు ఎన్ని కవితలు రాసాడు!

ఇప్పుడు క్లాసులో జరిగిన అవమానం భరించలేక వాడు రెండు రోజులనుంచి స్కూలుకే పోవటం లేదు. అన్నం తినటం లేదు. నాకు ఆఫీసు పనితో రాత్రి పదింటిదాకా ఆఫీసులో సరిపోతోంది…. రేపు ఆదివారం నాడు వాడి పాత కవితలన్నీ తీసుకొని, గుణవతి ఇంటికి వెళ్ళి, చూపించి వాయించి పారేయాలి…. ఆ రాత్రంతా నాకు ఇదే ఆలోచన.

మర్నాడు పొద్దుటే అనుకోకుండా మా పెద్దాయన శేషయ్య గారు దిగాడు. ఏదో పనిమీద వచ్చాడు. చూసిపోదామని మా ఇంటి కొచ్చాడు.

“కాస్సేపు కూర్చోండి” అంటూ నేను గుణవతి దగ్గరకెళ్తున్న విషయం చెప్పాను.

ఆయన పగలబడి నవ్వాడు. నన్నాపాడు.

కార్తీక్‌ని దగ్గరకి తీసుకున్నాడు.

“నీ కవిత మళ్ళీ చెప్పరా” అన్నాడు.

వాడు చేతులు కట్టుకొని హిందీలో చెప్పాడు.

“తరువు లాంటి వాడే గురువు కూడా.
అది పూలూ, పండ్లు ఇస్తుంది మనం నీళ్ళిస్తున్నామని,
ఆయన విద్య, జ్ఞానం ఇస్తాడు, మనం ఏమిస్తున్నామని?”

శేషయ్యగారు మళ్ళీ నవ్వాడు.

“ఒరేయ్ నిన్ను టీచర్ మెచ్చుకుంది గదరా! ఏడుస్తావెందుకు?”

వాడు ఏడుపు ఆపేశాడు.

“నువ్వు సొంతంగా రాశావంటే నమ్మలేనంత గొప్పగా రాశావురా. నిన్ను ‘సినారె’ స్థాయిలో చూసిందిరా. దానికి ఏడవటం ఎందుకు, స్కూలు మానేయటం ఎందుకు?…”

కార్తీక్ మొహం ఆనందంతో వెలిగిపోయింది.

గుణవతి దగ్గరికి నా ప్రయాణం ఆగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here