గుండాన జోగారావు చిన్న కథలు

0
6

[dropcap]గుం[/dropcap]డాన జోగారావు గారు రచించిన రెండు వైవిధ్యభరితమైన చిన్న కథలను అందిస్తున్నాము.

1. ఆకలి

బైపాస్ బండి చార్జ్ తీసుకున్నాను నార్త్ సింహాచలంలో. శ్రామిక్ స్పెషల్.  వలస కార్మికుల్ని గమ్య స్థానాలకు చేర్చే ట్రైన్. గార్డ్‌గా ఉద్యోగిస్తున్నాను.  విజయనగరం బైపాస్ ట్రైన్లకు వాటరింగ్ స్టేషన్.

ఒక ప్రయాణీకుడు నా దగ్గరకు వచ్చి “సర్… దువ్వాడలో భోజనం అందరూ పంచుకోమని ప్యాకెట్లు బోగీలోకి ఎక్కిస్తే ఒకొక్కరూ దొమ్మీగా పడి రెండేసి పాకెట్లు తీసేసుకుని దాచేసుకున్నారు సర్. మా ఫామిలీకి ఒక్క పాకెట్టే దొరికింది. మా ఆవిడకీ పాపకీ ఏం దొరకలేదు సర్” అన్నాడు దీనవదనంతో.

లాక్‌డౌన్‌తో స్టేషన్‌లో స్టాల్స్ అన్నీ మూతపడ్డాయి.

వాటరింగ్ పూర్తయిన ట్రైన్ మరో రెండు గంటల తర్వాత పలాసలో ఆగింది.

అవుట్ గోయింగ్ గార్డ్‌కి చార్జ్ ఇచ్చి దిగి వెళ్తూ నాతో ఎప్పుడూ ఉండే స్లైస్డ్ బ్రెడ్‌తో పాటు గుడ్ డే బిస్కట్ పాకెట్ ప్రక్క బోగీలో ఉన్న అతని పాప చేతిలో పెట్టాను.

అయినా ఆకలి స్వార్థంతో జతకూడితే ఇక మనిషి బ్రతుకుతాడా?…

ముగింపు మీరే చెప్పాలి.

2. స్వాభిమాని

“చిన్నా… అలా అనకు రా.”

“ఇప్పుడేమయింది డాడీ.”

“నువ్వు అడిగినప్పుడు బైక్ కొని ఇవ్వలేకపోయాను. ఇప్పుడు వెసులుబాటు కలిగింది. పద వెళ్ళి బైక్ తీసుకుందాం.”

“ఫర్లేదు డాడీ… నేను తీసుకుంటాను. ఇప్పుడే మార్కెటింగ్ కంపెనీలో చేరాను కదా… నేను సొంతంగా వాయిదాల్లో తీసుకున్నా వాయిదా కట్టాలన్న తలంపుతో కష్టపడి పనిచేయాలన్న కసి పెరుగుతుంది. నాకూ సంతృప్తిగా ఉంటుంది.”

“అది కాదు నానా… ప్రతి రోజూ ఊబెర్ కి రానూపోనూ నాలుగొందలు పోస్తున్నావ్.”

“నిన్నేమీ అడగట్లేదు కదా డాడీ.”

“నాకే గిల్టీగా ఉందిరా… పోనీ చేబదులుగా తీసుకో… ఆ తర్వాత నాకు ఇచ్చేద్దూ గానీ”

“వద్దు డాడీ… నేనింకా వాలిపుత్రుణ్ణి కాదలచుకోలేదు. నాకు కావాల్సినవి అన్నీ సమకూర్చుకుంటాను… మెల్లమెల్లగా.”

“అయితే నా మాట కాదంటావ్.”

“లక్ష్యాలు చేరడానికి చేస్తున్న ప్రయత్నం డాడీ… నీ మాటని నిర్లక్ష్యం చేయడం కాదు.”

“నువ్వు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటావ్.”

“నాకు నా టార్గెట్స్‌లో క్లారిటీ ఉంది డాడీ… మళ్ళీ ఈ విషయం నా దగ్గర ఎత్తకు.”

“నువ్వు మొండోడివి రా.”

“నువ్వు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు డాడీ.”

“నా మాటకు విలువ లేదన్న మాట.”

“నా విలువ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నా డాడీ… వై డోన్ట్ యు అండర్‌స్టాండ్”

“ప్చ్”

“హహహ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here