[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]
[dropcap]జం[/dropcap]గమ దేవర గురువయ్యస్వామి శంఖము ఊది ‘భవతీ భిక్షాందేహీ’ అన్నాడు.
ఇల్లాలు పల్లెంలో బియ్యం తెచ్చి జోలెలో పోసి పాదాభివందనం చేసింది. ‘దీర్ఘ సుమంగళీభవ’ అని దీవించి, బియ్యాన్ని చూసి నవ్వుకున్నాడు.
పల్లెం నిండా తెచ్చినట్లే కానీ, నిండా పిడికెడు బియ్యం లేవు. పల్లెంలో పలుచగా చేసి మానెడు తెచ్చినట్లు భ్రమ కల్పిస్తున్నారు. ఎవరు భిక్షతెచ్చినా ఇట్లే తెస్తున్నారు.
“జోలెలో వేసే బియ్యం భక్తి, జోలె నుండి నాలుగు గింజలు స్వామి పల్లెంలో వేసేది ముక్తి” అనేది అభిప్రాయం. ఇప్పుడా అభిప్రాయం నీరు కారుతుంది. భక్తి అడుగంటుతుంది.
“తినని లింగాన్ని కుడుకుడు అని, తినే జంగమదేవరను నడు నడు” అంటారని ఏనాడో బసవేశ్వరుడు తన వచనాల ద్వారా జగతికి తెలిపాడని గుర్తు చేసుకున్నాడు. ఊరంతా తిరిగినా అడ్డెడు బియ్యం కూడా దొరకటం లేదు. పూర్వమైతే బుడ్డెడు బియ్యం దొరికేవి అనుకుంటూ మరొక ఇంటికి వెళ్ళాడు గురువయ్యస్వామి.
భర్త గరువయ్యస్వామి కొరకు శివమ్మ భోజనం చేయకుండా ఎదిరిచూడసాగింది. మధ్యాహ్నం రెండు గంటలైనా వస్తనేలేడు.
ఎక్కడెక్కడ తిరుగుతుండో ఏమో అని అనుకుంటుడగానే….. కడపలో కాలు పెట్టాడు గురువయ్యస్వామి.
“ఎంత సేపయ్యానయ్యా! నీ కొరకు చూడబట్టి. భిక్షానికి వెళితే, ఆకలి, దూప మీద సొయి ఉండనే ఉండది నీకు. నీ కొరకు పాపడాలు కూడా వేశాను.”
“ఏం జెయ్యాలే… నాలుగిండ్లు తిరిగితేనే కదా పొట్ట గడిచేది…”
“నీ కొరకు కళ్లల్లో వొత్తు లేసుకుని చూస్తున్నా. నీ కిష్టమని దొండకాయ కూర చేసిన. చల్ల మిరపకాయలు గోలిచ్చిన. నేను కూడా తినలేదు. కాళ్లు కడుక్కుని రా…. వడ్డిస్తా.”
“అయ్యయ్యో! నీ వింకా తినలేదా భిక్షానికి కాదులూరు పోవడేమోగాని అక్కడ లింగాయతుల ఇంట్లో తిన్న. నా కొరకు వేసిన పాపడాలు, గోలిచ్చిన చల్లమిరపకాయలు నీవే తిను.”
“నా కష్టం నన్ను తినుమనుడేగాని, నీ కష్టం నుండి నగ, నట్ల చేయించుడైతే లేదు. అయితే మాయే గాని, కనీసం ఫోనన్న చెయ్యద్దా.”
“నీ కొడుకు నాకు ఫోను కొనిచ్చిండని, ఫోను చేయాల్నా ఏంది.”
“మాట్లాడితే కొడుకు ముచ్చట తీస్తవు. ఏందో… ఏమో నీ సంగతి నాకు తెలువదు. ఈ రకంగా కొడుకును యాది జేసుకుంటవో ఏమో.”
“ఏమో! అమెరికాలో ఉన్న లోకేశ్ తిన్నాడో లేడో. ఆ ఉద్యోగం ఎంత తిప్పలో ఏమో….”
“అయ్యో శివశివ! వానికేమైందయ్యా. లోకేశ్‌ది ఉట్టుట్టి ఉద్యోగమా ఏమిటి? సాఫ్టవేర్ ఇంజనీయర్…. ఉండడానికి ఇల్లు, ముత్య మంటి కొడుకు, భార్యా, కారు వానికే మైందయ్యా.”
“…….”
“నువ్వే ఎప్పడికి వాని మీద గుండె పగులుతవు. మా నాన్న ఎట్లుండెనోనని ఫోనన్న చేస్తడా వాడు.”
“మనకి ఫోను ఎక్కడిది?”
“మనకు కొనియ్యకున్నా…. ఎల్లవ్వ ఇంటికి ఫోను చెయ్యచ్చు కదా. వాడికి కొడుకు పుట్టి 3 నెలలు అవుతంది. వాట్సాప్ లోనన్న మనమడి ఫోటో పెట్టచ్చు కదా!”
“సరే! సరే! నువ్వు తిను పో. పొద్దు పోయింది.”
“కొడుకును ఒక్క మాట అననివ్వవు” అంటూ రుసరుస లాడుతూ వంటింట్లోకి వెళ్లింది శివమ్మ.
మనసంతా అదోలా అనిపించి బట్ట కుర్చీలో కూలబడ్డాడు గురవయ్య. కొడుకు ముచ్చట జ్ఞాపకమోచ్చినప్పుడల్లా ఏదోలా ఉంటుంది. ఎంత మరువాల్నాన్న మరుపురాక కళ్ల ముందు సినిమాలా కొడుకు లోకేశ్‌తోని అనుబందం కనిపించసాగింది.
***
గురువయ్యస్వామి కొడుకు లోకేశ్ పదవ తరగతిలో రాష్ట్రస్థాయిలోనే ఫస్టు వచ్చాడు.
సర్టిఫికెట్ చేతికందించిన హెడ్మాస్టర్ “స్వామి! మీ అబ్బాయి రాష్ట్రంలోనే ఫస్టు రావడం గొప్ప విశేషం. బాగా చదివిస్తే ఇంజనీయరో, డాక్టరో అవుతాడు.”
“ఎక్కడ చదివించాలే సార్.”
“హైదరాబాద్‌లో ‘నమఃశివాయ’ కళాశాలలో చదివించు. ఒకసారి ఏబది వేలు కడితే చాలు. మొత్తం చదువు పూర్తయ్యే వరకు వాళ్ళే బాధ్యత తీసుకుంటారు.”
“ఆ కళాశాలలో భోజన వసతి కూడా ఉందా?”
“ఆ… ఆ… ఉంది. అది మీ స్వాములకు లింగయాత్‌లకు కన్సెషన్. ఏబదివేలే…. మిగతా కులాలకైతే లక్షకు పైననే తీసుకుంటారు.”
“మంచిది సార్. మీరు చెప్పినట్లే నమఃశివాయ కళాశాలలోనే చదివిస్తా” అని లోకేశ్‌తో ఇల్లు చేరాడు స్వామి.
స్కూలులో జరిగినదంతా శివమ్మకు చెప్పి “ఏబది వేలు ఎక్కడ నుండి తెస్తాం మనం” అని గురవయ్యస్వామి అనగానే.
“నా దగ్గర ఏబది వేలు ఉన్నాయి. నేను ఇస్తా” అన్నది శివమ్మ.
“ఏబది వేలా, నీదగ్గర అంత డబ్బెక్కడిది?”
“ఇన్నేండ్ల నుండి కూడ బెట్టానయ్యా. నేనిస్తా. నీ కెందుకు బెంగ.”
“నువ్వు ఇస్తానంటే… రేపే వెళ్లి జైను చేసి వస్తా.”
శివమ్మ అన్నట్లే మరునాడు ఏబది వేలు గురువయ్యస్వామి చేతికి ఇచ్చింది. లోకేశ్‌తో గురువయ్యస్వామి హైదరాబాద్ వెళ్లి నమఃశివాయ కళాశాలలో జైను చేసి వచ్చాడు.
చూస్తుండగానే ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ పూర్తి చేశాడు లోకేశ్.
సర్టిఫికెట్‌తో ఇంటికొచ్చిన కొడుకును చూసి మురిసిపోయారు తల్లిదండ్రులు.
శివమ్మ కొడుకుకు ఇష్టమని భక్ష్యాలు చేసింది. రాత్రి భక్ష్యాలతో సంతషంగా ముగ్గరు భోజనం చేసి కూర్చోగానే…
“వాడి చదువు పూర్తయింది కదా! అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యాలి కదయ్యా!” గురవయ్యస్వామితో శివమ్మ అనగానే…
“మన మెదక్ జిల్లాలో వాని చదువుకు దగ్గ అమ్మయి లేదు. బీదర్‌లో ఉందట తెలుసుకున్న.”
“ఐతే!… నువ్వు అబ్బాయి చూసి రండి…”
“నీవు రావా! ఏంది?”
“నేనెందుకయ్యా? తండ్రి కొడుకులు మీరు వెళితే చాలదా?”
“సరే రేపే వెళతాం” అన్నాడు గురువయ్యస్వామి.
అన్నట్లే తండ్రి కొడుకులు బీదర్ వెళ్లి పెళ్లి నిశ్చయించుకొని వచ్చారు.
పెళ్ళికి బీదర్‌లోనే ఆకాశమంత పందిరి, భూదేవి అంతా పీటలేశారు.
పెళ్ళిలో కాళ్లు తొక్కిచ్చేటప్పుడు సున్నితంగా లోకేశ్ కాలు తొక్కింది జయ. జయ ఎంత సున్నితంగా కాలు తొక్కిందో… లోకేశ్ అంత గుడుసుగా గట్టిగా తొక్కాడు.
ముఖమంత ఎర్రగా కాగా ‘అమ్మా…’ అంది విజయ. జయ ముఖం రంగు మారడం చూసి…. కొంటెగా నవ్వాడు లోకేశ్.
తలంబ్రాలు దోసిల్లలో పోసుకున్నాక, తాంబాలమే ఎత్తి మొత్తానికి మొత్తం జయపై కుమ్మరించాడు.
జయ చారడేసి కళ్లను చక్రాల్లా తిప్పి భర్తను వెక్కిరించింది.
పెళ్లి జరిగాక, నెలరోజుల వరకు సరస, శృంగారాల ఉయ్యాలలో ఊయలలూగారు నవదంపతులు.
లోకేశ్‌కు అమెరికా నుండి ఫోను వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్ ఉద్యోగములో జైను కమ్మని. డిపాజిట్‌గా నాలుగులక్షలు కట్టాల్సి ఉంటుందని, యజమాన్యం ఫోను చేశారు.
ఇదే విషయాన్ని నాన్నతో… “అమెరికాలో ఉద్యగం వచ్చింది” అన్నాడు లోకేశ్.
“సంతోషంరా నీ కష్టం ఫలించింది.”
“ఐతే… నాన్న.”
“ఏందిరా…”
“నాలుగు లక్షలు డిపాజిట్‌కు కాగా, వెళ్లడానికి మా ఇద్దరికి రెండు లక్షలు కావాలి.”
“ఆరు లక్షలా…. అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదిరా.”
“మామయ్యను అడుగు?”
“నువ్వుడిగితేనే…. బాగుంటుందేమో…”
“వద్దు నాన్న. పెద్ద మనిషిగా నువ్వుడిగితేనే బాగుంటుంది.”
“సరే! ఫోను కలిపి ఇవ్వు.”
“నాన్న! ఇదిగ కలిపిన.”
“బావగారు బాగున్నారా?”
“ఆ..ఆ… అంత మంచిదేనా…”
“అంత మంచిదేకాని…”
“చెప్పండి బావగారు.’
“లోకేశ్‌కు అమెరికాలో ఉద్యగమొచ్చింది.”
“శుభం మంచిదే కదా…”
“ఆరు లక్షలు డబ్బు కావాల్నట.”
“సరే! చెరిసగం సర్దుదాం” అంటూ ఫోను పెట్టేశాడు.
చీరకొంగుకు చేతులు తుడుచుకుంటూ వంటింట్లో నుండి వచ్చిన శివమ్మ.
“అన్నయ్య ఏమన్నారండి?”
“ఆరు లక్షలు చెరిసగం సర్దుదామన్నాడు.”
“మనం మూడు లక్షలు ఎక్కడి నుండి తెస్తాం?”
“నా దగ్గరుందిలే డబ్బు.”
“మూడు లక్షలా! అంత డబ్బెక్కడిది?”
“అప్పుడో ఇప్పుడో అవసరానికి వస్తదని జమ చేసుకున్న.”
ఈ మాట విన్న లోకేశ్ ఈల వేసుకుంటూ వెళ్లి జయను గట్టిగా వాటేసుకుని, ఎత్తి గిరగిరా తిపాడు.
“వదలండి. అడ్డం పడుతానేమో…”
జయను దింపిన లోకేశ్…
“మనం అమెరికా వెళుతున్నాం అని జయ బుగ్గ మీద చిటిక వేశాడు.”
“ఏమా మోటు సరసం. బుగ్గెంత కందిందో చూడు.”
“నిజమా!” అని బుగ్గ కందింది చూడడానికి దగ్గరకు వచ్చిన లోకేశ్‌కు చేతులు నడుము చుట్టు వేసి గట్టిగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకుంది జయ.
“అబ్బా! నువ్వు కౌగలించుకున్నప్పుడు గాజుల చప్పడైంది. ఆ చప్పడుకు నా గుండె గల్లైంతైంది” అన్నాడు లోకేశ్.
“అమ్మో… అమ్మో… అట్లనా ఐతే… నా గుండెకు చిక్కందేమో చూడు” అని జయ అనేసరికి… పైట తొలగించి చూడడానికి దగ్గరకు వెళ్లాడు లోకేశ్.
“ఏయ్ దొంగ” అంటూ భర్తను విడిపించుకుని దూరం జరిగి కిలకిల నవ్వింది జయ. ఆ నవ్వులో శ్రుతికలిపాడు లోకేశ్.
ఇద్దరు వియ్యంకులు ఆరు లక్షలు జమ చేసి లోకేశ్‌కు ఇచ్చారు.
నాలుగు లక్షలను ఆన్‌లైన్ ద్వారా డిపాజిట్ చేశాడు. రెండు లక్షలతో అమెరికాకు టికెట్స్ బుక్ జేశాడు. ప్రయాణం వారం రోజులు ఉండే సరికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
లోకేశ్, జయలు అమెరికా వెళుతున్నప్పుడు గురువయ్యస్వామి, శివమ్మలతో పాటు జయ తల్లిదండ్రులు కలిసి ఏర్‌పోర్టుకు వెళ్లి వాళ్లు ప్లేన్ ఎక్కే వరకు ఉండి ‘బై’ చెప్పి వచ్చారు.
కొడుకు కోడలు అమెరికా వెళ్లి నెల రోజులు గడిచినా ఒక రోజు ధశరధం సేట్ గురువయ్యస్వామి దగ్గరకు వచ్చి….
“స్వామి! అమ్మగారి లేనిది రిజిస్ట్ర్షేషన్ కాదట.”
“ఆమెకు తెలిస్తే ఎంత ఇబ్బంది… నేనొక్కడిని సంతకము పెటితే చాలదా?”
ఇద్దరికి చాయ తెచ్చిన శివమ్మ చాయ చేతులకిస్తూ… “రిజిస్ట్రేషన్ అంటున్నారు? ఏమి రిజిస్ట్రేషన్ సేటు?”
“ఆ… ఏం లేదమ్మా! మీ అర ఎకరం భూమి స్వామి నాకు అమ్మిండు. అది రిజిస్ట్రేషన్ కావాలంటే… మీ సంతకము కావాల్నట.”
“సరే! ఎన్నడు వెళ్లాల్నో నిర్ణయించుకొనిరా. నేను కూడా ఆయనతో పాటు వచ్చి సంతకము పెడతా.”
“మంచిదమ్మా! వస్తా” అంటూ దశరథం సేటు వెళ్లాడు.
భర్త దిక్కు చూస్తూ శివమ్మ “ఎంత పని చేసినవయ్యా, ఉన్న అర ఎకరం అమ్మి మనకు బొందకు జాగ లేకుంట చేసినవు.”
“లోకేశ్ అమెరికా పోవల్నంటే… డబ్బు లేదయే. మరేం చెయ్యాలే.”
“ఏం జెయ్యాలంటవు వాడి మామయ్య కోటీశ్వరుడు. ఆయననే మోత్తం ఇయ్యిమనక పోయ్యివా?”
“నువ్వు సగం నేను సగం సర్దుదామనప్పుడు నేనేమి చెయ్యాలే. మొత్తం ఇవ్వమని అడగడానికి నాకు అభిమానం అడ్డొచ్చింది.”
“……”
“మరీ! నీ మెడలోని పుస్తెల తాడు ఏది? రోల్డ్ గోల్డ్ పుస్తెల తాడు వేసుకున్నావు.”
“నా పరిస్థితి అంతే… ఆనాడు వాడి చదువుకు ఏబది వేలు అవసరముంటే అమ్మి తెచ్చిన.”
గురువయ్యస్వామి కళ్లు జలపాతం కాగా……
“మన లోకేశ్‌ది అమెరికాలో పెద్ద జాబ్. అర ఎకరం ఏందే… పదెకరాలు కొంటాడు. మనకు బిల్డింగ్ కడుతాడు. నీ పేరు మీద ఐదులక్షలు, నా పేరు మీద ఐదు లక్షలు పెడుతాడు. నీకు పుస్తెల తాడేంది నల్లపూసలదండ చేయిస్తాడు.”
“వాడు చేస్తడు మనం చూస్తం” అన్నది శివమ్మ.
***
ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకునే సరికి కళ్లు నీళ్లతో నిండాయి.
“ఏమయ్యా! కొడుకు జ్ఞాపకమొచ్చిండా! ఏడుస్తున్నవయ్యా!”
“ఏడుపు కాదిది ఆనంద బాష్పాలు. “
“ఔ నాకు నీ ఆనంద బాష్పాలు తెలువది. బాధ తెలువది. ఎన్నడన్న నాకు తెలిస్తేనా ఏంది?” అని శివమ్మ భర్త కళ్లను కొంగుతో తుడిచి వంటింట్లకి వెళ్లింది.
గురువయ్యస్వామి మంచం పైన కొంత సేపు విశ్రమించాడు. లేచి ముఖం కడుక్కునే సరికి చాయ తెచ్చింది శివమ్మ.
చాయ తాగి ఒక్కరిద్దరికి పంచాగము చూసే సరికి రాత్రి ఎనిమిది గంటలైంది.
“ఏమయ్యా! ఇంకా భోజనం చేయవా? తొందరగా పడుకుంటే….. మళ్లీ తొందరగా లేవొచ్చు. రేపు పిత్రు అమవాస్య. ఇడ్డుం బియ్యం పదిహేను రోజులకు సరిపడు కూరగాయలు దొరుకుతాయి” శివమ్మ అనగానే…
“ఏం కూర జేసినవు తిను… తిను అంటున్నావు.”
“అయ్యో! శివశివ… నీ కిష్టమని గుత్తి వంకాయ వేపుడు భక్ష్యాలు చేసిననయ్య!”
“భక్షాలంటే… మా నాన్నకు ఇష్టం. మా అమ్మ పదిహేను రోజులకు ఒకసారి భక్షాలు చేసేది… ఇప్పుడు నాన్న ఉంటే ఎంత బాగుండునో” అంటూ…. పక్కన పగిలిన గురువయ్యస్వామి “నాకు చావన్న రాకపోయే. చస్తేనన్న నాన్నను, అమ్మను కైలాసంలోకలిసేవాడిని.”
“శివశివ… ఏమా మాటలు… నువ్వున్నప్పుడే నీ కొడుకు నన్ను చూస్తలేడు. నువ్వు లేకపోతే నేను అగాధమైత. నీముందరనే సుమంగళిగా చావాలి నేను.”
“…..”
“శివైక్యం చెందిన అమ్మను, నాన్నను డైబ్బై ఏండ్ల వచ్చినా నువ్వే జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ కొడుకు భూమ్మీద ఉన్న మనల్నేమరచిండు.”
“ఏమోలే… ఏం జేస్తాం మన కర్మ…” అని నిట్టూరుస్తూ భోజనం చేసి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు.
ప్రొద్దున్నే లేచిన శివమ్మ భిక్షానికి వెళ్లడానికి భర్తను ‘లేవయ్యా… పొద్దు పోతది’ అని చేయి పట్టి లేపపోతే చేయి ఎక్కడ పెడితే అక్కడే వాలిపోయింది.
ముక్కు కాడ శ్వాస తగులుతదేమోనని చేయి పెట్టి చూసింది. శ్వాస లేదు. గుండె మీద చెవి పెట్టి గుండ కొట్టుకోనిది చూసి… చనిపోయిండని లబోదిదో మంటూ ఏడ్చింది.
ఊరు వూరంతా వచ్చారు. గురువయ్యస్వామి భిక్షానికి వెళ్లినప్పుడు మహిళలను ‘దీర్ఘ సుమంగళీభవ’ అని జంగమదేవరగా దీవెనలిచ్చేవాడు. శివమ్మకైతే భర్త దీవెనలు సుమంగళిని చేయలేకపోయాయి.
సర్పంచే అమెరికాలోని లోకేశ్‌కు ఫోను చేసి జరిగిదంతా చెప్పాడు.
“నాకు వీలు కాదు. ఆ ఖనన కార్యక్రమం దయచేసి మీరే చూడండి” అన్నాడు లోకేశ్ సర్పంచ్‌తో…
ఈ మాటలు విన్న శివమ్మ కైలాసం చేరిన భర్త చెవిన పడేంత ఏడ్చి ఏడ్చి భర్త మీద పడగా గుండె ఆగింది.
శివమ్మ పుట్టినప్పటి నుండి మెడలో ఉన్న లింగమయ్య ప్రాణాలు కాపాడలేక, గుండె ఆగిపోయిన శివమ్మ గుండె పై బాధతో ఊగిపోయాడు.