గురజాడ పూర్ణమ్మ

0
9

[డా. సి. భవానీదేవి రచించిన ‘గురజాడ పూర్ణమ్మ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]క రచనను అర్థం చేసుకోవాలంటే ఆ రచయిత జీవితకాలం నాటి రాజకీయ సామాజిక పరిస్థితులు తెలుసుకోవాలి. ఈ దిశగా ఆలోచిస్తే గురజాడ కాలం నాటికి దేశం ఆంగ్లేయుల పాలనలో ఉంది. బీదరికం, సామాజిక అసమానతల వలన ప్రజలు అనేక మూఢవిశ్వాసాలకు లోనయి ఉన్నారు. ఒక మేధావిగా, కవిగా, నాటక రచయితగా, సంఘ సంస్కర్తగా, గురజాడ అప్పారావుగారు తన కాలంకంటే ముందు తరాలకు ద్రష్టగా పనిచేశారు. విదేశీ సాహిత్యం, జీవన విధానం, పాశ్చాచ్య ఆవిష్కరణలు, ఆంగ్ల విద్య, మన సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. గురజాడ ఎక్కువ ఆరోగ్యవంతులు కాకపోయినా సమాజానికి ఆరోగ్యవంతమైన సాహిత్యం అందించారు.

గురజాడ తన 21వ ఏట మొదటి రచన చేసినా ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ కథాకావ్యాన్ని ప్రౌఢవయస్సులో రాసినట్లు తెలుస్తోంది. కొద్ది మార్పులు చేర్పులతో గురజాడ స్వదస్తూరితో పాఠాంతరం దొరికింది. గురజాడ తన రచనల ద్వారా ఆందోళన చేసినవి స్త్రీల సమస్యలే!. ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ రచనలోని ఇతివృత్తం చిన్నపిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లిచేయటం, తద్వారా కొంతశుల్కం పొందటం. ఇది చేసేది ఆ అమ్మాయి తల్లిదండ్రులే. ఆడపిల్ల ఈడేరకముందే పెళ్లి చేయలేకపోతే సమాజం వెలివేస్తుంది. అది కూడా ఈ దురాచారానికి ఒక కారణం. సాహిత్యం సమాజానికి మేలు చేయాలని ఆశించిన గురజాడ వాడుకభాషలో సజీవ పాత్రల్ని మన కళ్ళ ముందుంచారు.

సమాజాన్ని అప్రతిష్ఠ పాలుచేసే మూఢనమ్మకాలు, అనైతిక ప్రవర్తనల్ని ఎండగట్టి చెడుని విప్పి చెప్పి ప్రజలను ప్రభావితం చేయటానికే గురజాడ సాహిత్య సృజన చేశారు. తనది ప్రజాఉద్యమమని చాటారు. కథాకావ్యం ఎక్కువగా జనబాహుళ్యంలోకి వెళ్తుందని భావించారు. నిజానికి ఆ కాలంలోని స్త్రీల సమస్యలను, ఆయా పాత్రల మనోవేదనలను, బాహ్యపరివర్తనలతోపాటు ఆంతరంగిక రహస్యాలను అడుగడుగునా చిత్రించారు. “ఆధునిక మహిళా చరిత్రను తిరగరాస్తుంది” అన్న వారి వాక్కు తదనంతర కాలంలో ఋజువవుతోంది.

కన్యాశుల్కంలో సుబ్బిపాత్రకూ, పుత్తడిబొమ్మ పూర్ణమ్మకూ తేడాలేదు. సుబ్బి సంబంధిత నాటకంలో మూలస్తంభమైన పాత్ర అయినా ఎక్కువగా ఇతర పాత్రలు వెలుగులీనాయి. సమస్య మాత్రం సుబ్బిదే! పూర్ణమ్మదీ అదే సమస్య. చిన్నపిల్లను ముసలిమొగుడికి కట్టబెట్టటం. ఆ పనికి తండ్రికి కాసులు కురుస్తాయి. ఎంత అమానవీయత! పూర్ణమ్మ కథాకావ్యంగా రాయటంవల్ల, కథను పూర్ణమ్మ పాత్రపరంగా చెప్పటంవల్ల ఒక అమాయక ఆడపిల్ల మనసును అందించటానికి వీలయింది. మన జానపదుల పాటల్లో ప్రజల నాలుకలమీద నర్తించే అనేక బాణీలు ఉన్నాయి. ఆయావరసల్లో వాటిసారాన్ని పట్టుకున్న గురజాడ కథాకావ్యం రాయటానికి తగిన బాణీని పదిలపరుచుకుని తేలిగ్గా అందరూ పాడుకోటానికి అనువుగా ముత్యాలసరాలు రూపంలో పూర్ణమ్మ కావ్యాన్ని కూర్చారు. ఇది ఒక ఆడపిల్ల కథ. ఆడవాళ్ళందరి నోళ్లకు ఎక్కాల్సిన కధ. అందుకే అంత అనువైన వరస కుదిరింది. పూర్ణమ్మకథ నాటి ఆడపిల్లల కథ. నిజమైన సమాజం కథ. చిన్నప్పుడు ఆడపిల్లలు అట్లతద్ది రోజున నోము నోస్తే ముసలిమొగుడు రాడని అనేవాళ్ళు. మరి అప్పటి ఆడపిల్లలు ఆ నోము నోచుకున్నా ఎక్కువమందికి ముసలిమొగుడే లభించేవాడు. పూర్ణమ్మలాంటి ఎందరో ఆడపిల్లలు బలయిన మూఢవ్యవస్థ గురించి చెప్పేటప్పుడు ఆసక్తికరంగా ఉండాలి కదా. కథలు మొదలుపెట్టేటప్పుడు అనగనగా.. అంటూ చెప్తుంటారు. అలాగే పూర్ణమ్మ కూడా కరుణ రసాత్మకమైన గేయకావ్యం. ఇతివృత్తం కన్యాశుల్కమే! నాటి సమాజంలో కన్యాశుల్కం దురాచారానికి బలవుతున్న బాలికలపట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికల ప్రతినిధిగా ‘పూర్ణమ్మ’ అనే పాత్రను సృష్టించి కథనాత్మకమైన కావ్యంగా రసభరిత గేయంగా వర్ణించారు.

కథ చెప్పేటప్పుడు ఒక ఎత్తుగడ, నడిపించే తీరు, నాటకీయత, ఒక పతాకస్థితి, ముగింపు ఉంటాయి. ఇలా రాసిన రచన ప్రభావవంతంగా ఉంటుంది. తేలిక పదాలతో ఆలోచింపజేసింది. నాటి కాలంలో ఈ సమస్య ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. నేటి వరకట్నంలా ఆ రోజుల్లో అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి పేరుతో వీలున్నంత ఎక్కువ ధనం చెల్లించేవారికి అతను రోగిష్టి అయినా కాటికి కాళ్ళు చాపుకున్న ముదుసలి అయినా పెళ్లి చేసేవాళ్ళు. అటువంటి పెళ్ళికొడుకులంతా కనీసం 50 ఏళ్లు పైబడినవారి నుండి రేపో మాపో చనిపోబోయేవారుంటారు. ఇంతటి అమానవీయ సమాజంలో ఆయా వర్గాలలో ప్రబలిఉన్న దురాచారాన్ని ఎండగట్టిన రచన ఇది. ఈ కథాకావ్యం ఇలా ప్రారంభమవుతుంది:

మేలిమి బంగరు మెలతల్లారా/కలువలకన్నుల కన్నెల్లారా!

తల్లులుగన్నా పిల్లల్లారా/విన్నారమ్మా ఈ కథనూ!”

ఇలా ప్రారంభంలోనే విరిసీ విరియని పూలలాంటి చిన్నారి బాలికలను ఉద్దేశించి కవి తన పాటను వినిపిస్తారు. స్వచ్ఛమైన బంగారుకాంతి శరీరంతో, కలువలవంటి కళ్ళతో యవ్వనంలోకి ఇంకా అడుగుపెట్టని బాలికలను సంబోధిస్తూ వాళ్ల కోసమే ఈ కథను చెప్తున్నానంటారు

ఆటల పాటల పేటికలారా/కమ్మని మాటల కొమ్మల్లారా!

అమ్మలగన్నా అమ్మల్లారా/విన్నారమ్మా ఈ కథనూ!”

అమ్మాయిలు ఆటపాటలతో సంతోషంగా కమ్మని మాటలు చెప్తుంటారు. వాళ్లకోసమే ఈ కథ అంటారు కవి.

కొండల నడుమను కోనొకటున్నది/కోనకి నడుమా కొలనొకటున్నది

కొలని గట్టునా కోవెల లోపల/వెలసెను బంగరు దుర్గమ్మ!”

అనగనగా కొండలమధ్య ఒక చిన్నతోట, ఆ తోట మధ్యలో ఒక చిన్నకొలను, ఆ కొలను ఒడ్డున ఒక గుడి. ఆ గుడిలో బంగారుతల్లిగా పూజలందుకునే దేవత దుర్గమ్మ. ఇది కథానేపథ్యం. ఈ కథలో ప్రధానపాత్ర పూర్ణమ్మ. ఆ అమ్మాయి ఒక పూజారి కూతురు. పుత్తడిబొమ్మ అనటంలోనే ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నదనే స్ఫురణ వస్తుంది. “అన్నల దమ్ముల కనుగై దుర్గకు/పూజకు పువ్వులు కోసేది” అనటంలో పూర్ణమ్మ అన్నదమ్ముల మధ్య గారాబంగా పెరుగుతూ దుర్గమ్మపట్ల ఎంతోభక్తిని పెంచుకుంటున్నది. దుర్గమ్మను పూర్ణమ్మ ఎలా సేవించేది..

ఏయే వేళల పూసే పూవుల/ఆయా వేళల అందించి

బంగరు దుర్గను భక్తితొ కొలిచెను/పుత్తడిబొమ్మా పూర్ణమ్మ”

కొన్ని పూలు ఉదయం వికసిస్తాయి. మరికొన్ని సాయంత్రం పూస్తాయి. గుడిలో దుర్గమ్మకు రెండుపూటలా పూజ జరుగుతుంది. అందుకే పూర్ణమ్మ ఏ సమయంలో పూసే పూలు ఏరి, కోసి తెచ్చి భక్తితో దుర్గమ్మకు సమర్పించేది.

ఏయే ఋతువుల పండే పళ్ళను/ఆయా ఋతువుల అందించి

బంగరు దుర్గను భక్తితొ కొలిచెను/పుత్తడిబొమ్మా పూర్ణమ్మ”

పూలలాగే పండ్లుకూడా ఒక్కో ఋతువులో ఒక్కోరకం పండుతాయి. పూర్ణమ్మ ఆయా ఋతువుల్లో పండే పళ్ళను దుర్గమ్మకు నైవేద్యంగా సమర్పించేది. ఇక ప్రధానమైన అంశంలోకి కథ ప్రవేశిస్తుంది.

పళ్ళను మీరిన తీపుల నడలును/పువ్వుల మీరిన పోడుములున్

అంగములందున అమరెను పూర్ణకు/సౌరులు మించెను నానాటన్”

ఇలా చెప్పటంలో కవి అన్యాపదేశంగా ప్రకృతిలో పూర్ణమ్మను ఉద్దీపనం చేస్తున్నారు. బాలిక అయిన పూర్ణమ్మలో యౌవ్వన దశ ప్రవేశిస్తోంది. దుర్గమ్మకు సమర్పించే పళ్ళలోని తీపిలా, ఆ పూలలోని సొగసులా పూర్ణమ్మ శరీరంలో యవ్వనచిహ్నాలు దిద్దుకుంటున్నాయి. ఇది ఒక ఆడపిల్ల బాల్యంనుండి కౌమారాన్ని చేరుకునే పరిణామదశ. ఇప్పుడు పూర్ణమ్మ కథావస్తువయిన కన్యాశుల్కాంకురం మొలకెత్తుతుంది. బాల్యవివాహాలు, కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లలపై జరిగే అమానుష అకృత్యాల రోజులవి.

కాసుకు లోనై తల్లీ తండ్రీ/నెనరూ న్యాయం విడనాడి

పుత్తడిబొమ్మను పూర్ణమ్మను వొక/ముదుసలి మొగుడికి ముడి వేస్రీ”

కాసు అంటే డబ్బు. అందమైన పూర్ణమ్మకు ధర బాగానే పలికినట్లుంది. డబ్బుకోసం ఆమె తల్లిదండ్రులే అన్యాయంగా ఆ అమాయకపు పిల్లను ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లిచే శారు. పెళ్లి అయినా ఆనాటి అమ్మాయి వ్యక్తురాలయేవరకు పుట్టింట్లో ఉండేది. అలాగే పూర్ణమ్మ కూడా పెళ్లయినా అమ్మానాన్నల దగ్గరే సంతోషంగా ఉంది.

ఆమని రాగా దుర్గ కొలనులో/కల కల నవ్వెను తారకలు

ఆమని రాగా దుర్గ వనములో/కిల కిల పలికెను కీరములు”

వసంతం వచ్చింది. అంటే పూర్ణమ్మ పూర్తిగా యవ్వనంలోకి ప్రవేశించిందని అర్థం. కవి సుకుమార సుందరభావనతో ఈ విషయాన్ని ప్రకృతిని ఆలంబన చేసి మనకు తెలిపారు. ఇది ఒక సంస్కారం. తామరలు, కీరములు వంటి అంత్యానుప్రాసలు ఈ గేయకావ్యంలో చాలాచోట్ల అందంగా అమిరాయి. అందంగా ఆనందంగా వికసించిన పువ్వులా, కిల కిల నవ్వులతో కనువిందు చేస్తున్నది పూర్ణమ్మ.

ముద్దు నవ్వులూ మురిపెములూ మరి/పెనిమిటి గాంచిన నిమిషమున

బాసెను కన్నియ ముఖ కమలమున/కన్నుల గ్రమ్మెను కన్నీరు”

ఆమె స్నేహితులు తాము కూడా కాలగతిలో ఈ దూరాచారానికి బలవుతామని తెలియక “నీ మొగుడు తాత” అని పూర్ణమ్మను ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. పాపం ఆ అమ్మాయి తన బాధ ఎవరికి చెప్పుకుంటుంది! ఈ వేదనను, చిన్నపిల్లల మనస్సును, గురజాడ ఎంత సుకుమార రసాత్మకంగా పట్టుకున్నారో చూడండి.

ఆటల పాటల తోటి కన్నియలు/మొగుడు తాత యని కేలించ

ఆటల పాటల కలియక పూర్ణమ/దుర్గను చేరీ దుఃఖించె

తాత వయసువాడు భర్త కావటం ఆమెకు ఎంతో దుఃఖకారణమయింది. తన మంచి కోరాల్సిన తల్లిదండ్రులే గొంతు కోశారు. అందుకే అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకు చెప్పుకుని ఏడుస్తుంది. ఇక ఆటలు.. పాటలు లేవు.

కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను/పుత్తడిబొమ్మ పూర్ణమను

చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను/పుత్తడిబొమ్మ పూర్ణమకు”

తనను కాపురానికి తీసుకెళ్లటానికి వచ్చిన ఆ ముసలి మొగుడు పూర్ణమ్మ కోసం చాలా నగలు, చీరెలు తెచ్చాడు. ఆడపిల్లలకు అవి ఆనందం కలిగిస్తాయని నాడూ నేడూ చాలామందికి ఉన్న అపోహ. ముసలివాడుగా అంత చిన్నపిల్లను భార్యగా కొనుక్కొని పెళ్లి చేసుకున్న అపరాధభావం అతనిలో ఉంటుంది కాబట్టి ఆ తప్పును చీరెలు నగలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు ఆ ముసలి భర్త.

పసుపు రాసిరి బంగరు మేనికి/జలకములాడెను పూర్ణమ్మ!

వదినెలు పూర్ణకు పరి పరి విధముల/నేర్పులు మెరసీ కై చేస్రీ

పూర్ణమ్మ భర్త వెంట కాపురానికి వెళ్ళే సమయం వచ్చేసింది. వదినెలు ఆమెకు పసుపురాసి స్నానం చేయించారు. పలు విధాలయిన మెలకువలు బోధించారు. పూర్ణమ్మ ఇక బయలుదేరాలి. అలాంటి సమయంలో పెద్దలకు నమస్కరించి దీవెనలు తీసుకోవటం సంప్రదాయం. ముందుగా అమ్మ నాన్నలకు మొక్కింది. వాళ్ళు “దీర్ఘ సుమంగళీభవా” అని దీవించారు. ఆ సందర్భంలో కాపురానికి వెళ్ళే కూతురిని అలాగే దీవిస్తారు.

పెద్దలకప్పుడు మొక్కెను పూర్ణమ/తల్లీ తండ్రీ దీవించ్రీ

దీవెన వింటూ ఫక్కున నవ్వెను/పుత్తడిబొమ్మా పూర్ణమ్మ!”

ఇక్కడ గురజాడ వింత అసందర్భ సందర్భాన్ని చెప్పారు. ముసలిభర్తతో పెళ్ళిచేసి అమ్మాయిని కాపురానికి పంపుతూ అలాంటి దీవెననిస్తే పూర్ణమ్మ ఫక్కుమని నవ్వింది. అక్కడ మనముంటేకూడా అలాగే నవ్వుతాముకదా! పూర్ణమ్మకి అన్నీ అర్థమవుతున్నాయి. కానీ ప్రతిఘటించలేకపోయింది. ఎందుకంటే రక్షించాల్సిన తల్లితండ్రులే పెళ్ళి పేరుతో ఆమె గొంతు కోశారు. పూర్ణమ్మ దుఃఖం, నిస్సహాయతతో ఉన్నది.

చిన్నల నందర కౌగిట చేర్చుకు/కంటను బెట్టెను కన్నీరు!

అన్నల తమ్ముల నప్పుడు పలికెను/పుత్తడిబొమ్మా పూర్ణమ్మా!”

పెళ్ళయినాక పుట్టిల్లు వదిలి కాపురానికి వెళ్ళే ఆడపిల్ల మనోగతం వాళ్ళందరికీ అనుభవైకవేద్యం. తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ తమ కుటుంబంలోంచి ఒక సభ్యురాలు తమను విడిచి వెళ్లిపోవటాన్ని భరించటం చాలా కష్టం. ఇది అభిజ్ఞానశాకుంతలంలో శకుంతలను అత్తవారింటికి పంపేవేళలో కణ్వముని మాటలు గుర్తుకొస్తాయి. పూర్ణమ్మ తనకంటే చిన్నవాళ్లను, అన్నదమ్ములను దగ్గరికి తీసుకుని వాళ్ళను విడిచి వెళ్తున్నందుకు కన్నీరు కార్చింది. వాళ్ళతో ఇలా చెప్పింది.

అన్నల్లారా తమ్ముల్లారా!/అమ్మను అయ్యను కానండీ!

బంగరు దుర్గను భక్తితొ కొలవం/డమ్మలకమ్మా దూర్గమ్మా!”

ఇక్కడ పూర్ణమ్మ మానసిక వేదనను కవి భారహృదయంతో చిత్రించారు. తాను నిత్యం పూజించే దేవతను అంతే భక్తితో కొలవమని తన వాళ్ళను కోరింది. ఆమె ప్రగాఢవిశ్వాసం గమనింపదగింది. ఇంకా ఇలా చెప్పింది.

నలుగురు కూచుని నవ్వే వేళల/నా పేరొక పరి తలవండి;

మీమీ కన్నబిడ్డల నొకతెకు/ప్రేమను నా పేరివ్వండి

ఇక తాను వాళ్ళతో గడపదు, అందుకే వాళ్ళు అమ్మానాన్నలను బాగా చూసుకోవాలనీ, తనను గుర్తుంచుకోవాలనీ, తమబిడ్డలలో ఒకరికి ప్రేమతో తనపేరు పెట్టాలనీ కోరుకుంది. తల్లిదండ్రులు డబ్బుకోసం తనను ముసలిమొగుడికిచ్చి వివాహంచేసినా వాళ్ళమీద ప్రేమను చంపుకోలేదు.. నిందించలేదు. ఆమె గొంతు రుద్ధమైంది. కన్నీరు తుడుచుకుంటూ నవ్వుతుంది. అది బలవంతపు నవ్వు.

బల బల కన్నుల కన్నీరొలికెను/పుత్తడిబొమ్మకు పూర్ణమకు

కన్నులు తుడుచుకు కలకల నవ్వెను/పుత్తడిబొమ్మా పూర్ణమ్మా”

ఆమె బాధ అందరికీ అర్థమయింది. కఠినురాలయిన తల్లి కూడా కంటతడి పెట్టింది. ధనం ముట్టింది కదా. తండ్రి ఒక్కడే సంతోషిస్తున్నాడు. పూర్ణమ్మ ప్రయాణమౌతున్నది.

యెప్పటి యెట్టుల సాయంత్రమ్మున/యేరిన పువ్వులు సరికూర్చి

సంతోషమ్మున దుర్గను కొలవను/వొంటిగ పోయెను పూర్ణమ్మ”

ప్రతిరోజూ ఉన్న అలవాటు ప్రకారం దుర్గమ్మ గుడికి ఒంటరిగా వెళ్ళింది. ఆపైన

ఆవులు పెయ్యలు మందలు జేరెను/పిట్టలు చెట్లను గుమిగూడెన్

మింటను చుక్కలు మెరయుచు పొడమెను/యింటికి పూర్ణమ రాదాయె!”

ఇక్కడ కూడా ప్రకృతి ద్వారా కథను సూచించారు కవి. పశువుల మందలు, పక్షులు ఇళ్లకూ, గూళ్లకూ చేరినా పూర్ణమ్మ ఇంటికి రాలేదు.

చీకటి నిండెను కొండల కోనల/మేతకు మెకములు మెసల జనెన్

దుర్గకు మెడలో హారము లమరెను/పూర్ణమ ఇంటికి రాదాయె”

చిమ్మచీకటి రాత్రి, మృగాలు వేటకు బయలుదేరాయి. దుర్గమ్మ మెడలో హారములమరటం అంటే పూర్ణమ్మ దుర్గమ్మను చేరుకుంది అని సూచ్యార్థం. ఆమె మరణించింది అనే సత్యం పఠితలకు తెలుస్తుంది.

కన్నుల కాంతులు కలవల చేరెను/మేలిమి చేరెను మేని పసల్

హంసల చేరెను నడకల బెడగులు/దుర్గను చేరెను పూర్ణమ్మ”

ఎంతో చక్కనైన పూర్ణమ్మ ఒక దురాచారానికి బలయింది. కలువలు ఆమె కళ్ల కాంతిని పొంది మరింత అందంగా వికసించాయి. ఆమె శరీరకాంతిని కలుపుకుని బంగారం మరింత మెరుస్తోంది. హంసలు ఆమె నడకల సొగసు గ్రహించి మరింత హొయలతో నడుస్తున్నాయి. ఆమె ఈ విధంగా దుర్గలో, ప్రకృతిలో ఐక్యమయింది.

ఇప్పుడీ కన్యాశుల్కం లేదు కానీ.. వరకట్నం రూపంలో ఆడపిల్లకు అదే విధమైన అన్యాయం జరగటం విషాదం. పెళ్లిలో డబ్బు ప్రమేయం ఏ రూపంలో ఉన్నా అది అమానుషం. గురజాడ పూర్ణమ్మ ముత్యాలసరాలలో పాడుకోటానికి వీలుగా సరళ వ్యావహారిక తెలుగులో రాయబడింది. తెలుగునాట ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం ఎక్కువగా పాటించిన ఈ దురాచారం విన్నా, చదివినా మనసు ఆర్ద్రమవుతుంది. స్త్రీల సమస్యల గురించి వాళ్ళ మనసుల గురించి ఆనాడే కలంపట్టిన మహాకవి గురజాడ ప్రాతఃస్మరణీయులు.

***

ఉపయుక్త గ్రంథాలు, వ్యాసాలు:
1. గురజాడ ముత్యాల సరాలు.
2. గురజాడ 150 వ జయంతి ప్రత్యేక సంచిక
3. గురజాడ.. వి. ఆర్. నార్ల
4. ప్రజాసాహితి ఆగష్టు- సెప్టెంబర్ 2012 సంచికలో 76-78 పేజీలలో చాగంటి తులసిగారి వ్యాసం
5. వికీపీడియా.. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
6. భాషాభారతి.. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
7. ఇల్లాలి ముచ్చట్లు.. ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ మొదలగునవి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here