గుర్తుండిపోయే ఓ షార్ట్ ఫిల్మ్ – ‘టైమ్’

2
11

[ఇటీవల తాను చూసిన ‘టైమ్’ అనే ఓ మలయాళ లఘుచిత్రం గురించి వివరిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]ఇ[/dropcap]టీవలి కాలంలో రీల్స్, షార్ట్స్ జనజీవితంలో విడదీయరాని భాగాలైపోయాయి. ఏదైనా సంఘటన జరిగినా, లేదా ఏదైనా పాట హిట్ అయినా, లేదా, ఓ సినిమాలో సన్నివేశమో, ఓ నటి/నటుడి హావభావాలో నచ్చినా, ట్రెండింగ్‌లో ఉన్న వాటిని అనుకరిస్తూ రీల్స్/షార్ట్స్ చేసి ఫేస్‍బుక్ లోనో యూ-ట్యూబ్ లోనో ఇన్‍స్టా లోనో పెట్టడం సాధారణమైపోయింది. ‘బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా’, ‘నా ఫోటో తీస్తున్నడే సీమ దసర చిన్నోడు’, ‘పుష్ప’ సినిమా లోని ‘తగ్గేదే లే’ అనే డైలాగ్‌కీ; ఇదే సినిమాలోని ‘శ్రీవల్లి’ పాటలోని అల్లు అర్జున్ స్టెప్స్‌కీ, నాని కీర్తి సురేష్‌ల సినిమా ‘దసరా’ లోని ‘సూరిగాడున్నా అత్తా’ అనే డైలాగ్‌కీ; ఇదే సినిమాలోని ‘చెమ్కీల అంగీ లేసి ఓ వదినె’ పాటకి లెక్కలేనన్ని రీల్స్/షార్ట్స్ వచ్చాయి. కుటుంబంతో కారులో వెళ్తూ ‘చెమ్కీల అంగీ లేసి ఓ వదినె’ పాటకి ఓ పాప చేసిన రీల్ అప్పట్లో బాగా వైరల్ అయింది.

కొందరు హాస్యం ప్రధాన థీమ్‍గా తీసుకుని, అప్పుడప్పుడు చిన్న చిన్న సందేశాలతో షార్ట్స్ చేస్తారు. Jenjoy Buddy అనే థీమ్‍తో ఆంధ్రా పెళ్ళాం – తెలంగాణ మొగుడు రీల్స్/షార్ట్స్ చేసే జయచంద్ర, గౌతమి; నందూస్ వరల్డ్ నిర్వాహకులు Madhua Nandu దంపతులు, రాయలసీమ అమ్మాయి – గుంటూరు అబ్బాయి అనే పేరుతో రీల్స్/షార్ట్స్ చేసే అఖిల మార్టిన్ దంపతులు ప్రసిద్ధులు.

కొన్ని పాపులర్ అయిన వెబ్ సీరీస్‌ల ఎపిసోడ్స్ లోని సన్నివేశాలు రీల్స్‌/షార్ట్స్‌గా వస్తుంటాయి. ‘ఫామిలీ బండి’ సీరిస్ రీల్స్/షార్ట్స్ లోని హర శ్రీనివాస్, రాజకుమారి యండ్రపల్లి, సౌజన్య అల్లరల్లరి చేస్తారు. అలాగే, ‘పెళ్ళివారమండి’ సీరిస్ లోని ప్రసాద్ బెహరా, విరాజిత, జెడివి ప్రసాద్ రీల్స్ అలరిస్తాయి. ‘రేయ్ తౌఫిక్’ అంటూ రీల్స్‌లో ఐటి మేనేజర్‌గా హడావిడి చేసే సాయి కిరణ్ ఏడిద, ‘హాస్టల్ వార్డెన్’ సీరిస్‍లో వరంగల్ వందన, ఇంకా ప్రశ్శు, ధరణి, అచ్యుత సద్దికుట్టి వంటి వారు వీక్షకులను నవ్విస్తారు.

శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ అనే ఛానల్‍లో శ్రీనివాస్ పరిమి, అతని కొడుకూ; ఎస్.ఎస్. కపుల్‍గా సందడి చేసే సంధ్య శ్రీకాంత్‌లు, ఇంకా ఎందరెందరో ప్రేక్షకులని ఆకట్టుకుంటారు. దుర్గారావ్ ఛానల్ అఫీషియల్ అనే ఛానెల్ ద్వారా రీల్స్/షార్ట్స్ చేసే దుర్గారావు, గంగారత్నం దంపతులు; తిరు నేచురల్ అనే పేరుతో షార్ట్స్/రీల్స్ చేసే తిరు యర్రవరపు, ఈయన రీల్స్‌లో కనబడే ఆయన చెల్లెలు కూడా తెలుగు వాళ్ళకి సుపరిచితులు.

Travel Vlogs చేయడంలో ‘నా అన్వేషణ’ అనే ఛానెల్‍కి చెందిన యూ-ట్యూబర్ అన్వేష్ ప్రసిద్ధులు. ‘మహాతల్లి’ రీల్స్/షార్ట్స్‌తో – జాహ్నవి, ‘దేత్తడి’ రీల్స్/షార్ట్స్‌తో అలేఖ్య హారిక చాలా పాపులర్. చుట్కీ ఫ్యామిలీ షో ఛానెల్ నిర్వహించే సింధూ, రోహిత్‍ల రీల్స్/షార్ట్స్ బావుంటాయి. బ్యాంకాక్ పిల్లగా శ్రావణి సందడి చేస్తారు.

ఇక వంటలు/పచ్చళ్ళు/కూరలు/రోటీలు/స్వీట్స్ – వంటి విషయంలో ఎన్నో రీల్స్/షార్ట్స్ ఉన్నాయి. Vismai Food అనే ఛానెల్ ద్వారా వీడియోలు చేసే తేజ పరుచూరి గారి చక్కగా మాట్లాడుతూ, వివరంగా చెప్తారు. అందమైన స్వరం ఆయనకి ఆస్తి. పళనిస్వామి వంటలు అనే ఛానెల్ నిర్వహించే పళనిస్వామి చెప్పే కొన్ని పాత కాలపు వంటకాలు, శాకాహార వంటలు బావుంటాయి. నాన్నా, ఒరే అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ.. ఆయా వంటలు ఎలా చేసుకోవాలో చెప్తారీయన. హైదరాబాద్ రుచులు ఛానెల్ ఇందిర గారి రీల్స్, షెఫ్ సరూ ఛానెల్లో అత్తాకోడళ్ళు చేసి చూపే వంటల రీల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

సనాతన్ శ్రీ కృష్ణన్ అనే ఛానెల్ నుంచి నాలుగు దక్షిణాది భాషలూ + హిందీ పాటలు పాడే తల్లీ కొడుకులు కూడా ఫేమస్. ‘Multilanguage Mash up with Amma’ అనే ఆ తల్లీ కొడుకుల పాటల రీల్స్ వీనుల విందు చేస్తాయి.

పిఆర్ మ్యూజికల్ ఛానెల్‍కి చెందిన పొట్టిమామ (రవీంద్ర), ఉష, కుసుమ తదితరుల డాన్స్ రీల్స్ హుషారుగా ఉంటాయి. చక్కని లొకేషన్స్‌లో సినిమా పాటల డాన్సులని ఈ బృందం సభ్యులు బాగా చేస్తారు.

వీటిల్లో అధిక శాతం వినోదం కోసమే అయినా, అందరికీ ఉపయోగపడే అంశాలతో కొందరు ప్రత్యేకంగా రీల్స్/షార్ట్స్ చేస్తారు. అతి తక్కువ బడ్జెట్‍తో ప్రయాణాలు చేయడం ఎలా, అంతగా ప్రసిద్ధవమని దర్శనీయ స్థలాలకు వెళ్ళమనే సూచనలూ, ట్రైన్ రిజర్వేషన్స్ అప్పటికప్పుడు ఎలా పొందాలీ, ల్యాప్‍టావ్‌లో మెమొరీ నిండిపోతే ఏం చెయ్యాలి, ఇన్‍కమ్‍టాక్స్‌లో రాయితీలూ, షేర్ మార్కెట్ పెట్టుబడులూ, కొత్తగా ఓపెన్ అయిన హోటల్స్, లేదా ప్రసిద్ధమైన వంటకాలు లభించే అవు‍ట్‍లెట్స్, డైట్ కంట్రోల్ – వెయిల్ లాస్ గురించిన రీల్స్, ఇలాంటి ఉపయుక్తమైన సమాచారాలతో చిన్న వీడియోలు ఫేస్‍బుక్/ఇన్‍స్టాగ్రామ్/యూ-ట్యూబ్‍లో పోస్ట్ చేస్తారు.

కొందరు టీచర్లు ప్రత్యామ్నాయ బోధనా పద్ధతులతో పిల్లలకి పాఠాలు చెబుతూ, వాళ్లల్లో స్ఫూర్తి నింపుతుంటారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే Bompelly Bhavani గారు చేసే – లెక్కలు ఎక్కాలు చేయడంలో ట్రిక్స్, పిల్లలకి ఆటపాటలతో వ్యాయామాలు, ఆంగ్లంలోని అక్షరాలతో ఎ ఫర్, బి ఫర్ అంటూ రాముడి పేర్లు చెప్పించడం వంటి రీల్స్/షార్ట్స్ బావుంటాయి.

సరే ఉపోద్ఘాతం ఎక్కువైనట్లుంది.. ఇక నేనూ ఈ మధ్య చూసిన ఓ రీల్ విషయానికొస్తాను.

ఆ మధ్య ఓ మిత్రుడు ఏదో రీల్ లింక్ పంపితే ఓ రాత్రి పడుకునే ముందు దాన్ని చూద్దామని నొక్కాను. అదయ్యాకా, ఒకదాని తరువాత ఒకటిగా అలా చూస్తూ వెళ్ళాను. ఉన్నట్టుండి మలయాళంలో ఉన్న ఓ రీల్ వచ్చింది. ఓ మనిషిని పైకి తీసుకెళ్ళడానికి యముడు ఆ ఇంటికి వస్తాడు. చూసినప్పుడు బావుందనిపించింది. డైలాగ్స్ మలయాళంలో ఉన్నా, ఇంగ్లీషు సబ్ టైటిల్స్ ఉండడంతో బాగానే అర్థమయింది. కొన్ని రోజులయ్యాకా, ఎందుకో ఆ రీల్ మళ్ళీ గుర్తొచ్చింది. ఫేస్‍బుక్‍లో వెతికితే కనబడలేదు. ఓ రెండు రోజుల ముందు ఫోన్‍లో హిస్టరీ అంతా క్లీన్ చేయడంతో, ఆ రీల్ మళ్ళీ చూద్దామన్నా కనబడలేదు. ఫేస్‍బుక్‍లో రీల్‍గా వచ్చినప్పుడు అప్‍లోడ్ చేసిన వ్యక్తి ఆ రీల్‍ని ముందర వచ్చే పేర్లు అవి తీసేసినట్టున్నాడు. సో, సెర్చ్ చేయడానికి నాకు కీ వర్డ్స్ ఏమీ దొరకలేదు. గ్రాండ్ మదర్, యమ, మలయాళం రీల్ అంటూ వెతికినా నాకు కావల్సిన రీల్ దొరకలేదు. రెండు మూడు రోజులు గడిచాకా, హఠాత్తుగా గుర్తొచ్చింది.. దానికి #TimeShortFilm అనే హ్యాష్ ట్యాగ్ ఉందని. అంతే, యూ-ట్యూబ్‍కి వెళ్ళి టైమ్ మలయాళం షార్ట్ ఫిల్మ్ అని సెర్చ్ చేస్తే, ఆ పేరుతోనే ఉన్న నాలుగైదు వీడియోల తర్వాత నాకు కావల్సిన వీడియో దొరికింది.

నిజానికది ఓ షార్ట్ ఫిల్మ్. ఫేస్‍బుక్ రీల్స్‌లో అప్‍లోడ్ చేసినవారెవరో ముందు వచ్చే టైటిల్స్ తీసేసినట్టున్నారు.

పరిమిత నిడివి అయినా, అమితమైన ప్రభావం చూపుతూ గుర్తుండిపోయే షార్ట్ ఫిల్మ్ ఇది.

ఓ మధ్యతరగతి కుటుంబం. ఇల్లు పొందికగా సర్ది ఉంటుంది. కెమెరా ముందుగదిలోని గడియారాన్ని చూపిస్తూ, డైనింగ్ రూమ్ మీదుగా, నెమ్మదిగా ఓ బెడ్‍రూమ్ లోకి వెళ్తుంది. ఓ ముసలావిడ మంచం మీద పడుక్కుని ఉంటుంది. ఇంతలో హఠాత్తుగా యముడు అక్కడ ప్రత్యక్షమవుతాడు.

మంచం దగ్గరకి వచ్చి ముసలామెను తట్టి నిద్ర లేపుతాడు. ఎవరూ అనుకుంటూ మెల్లగా కళ్ళు విప్పుతుంది. కాస్త అస్పష్టంగా ఉన్న ఆకారం కనబడుతుంది. కళ్ళు నులుముకుని మళ్ళీ చూసేసరికి యముడు కనబడతాడు. ఒక్క క్షణం బెదిరిపోయినా, వెంటనే మొహం మీద చిరునవ్వుతో, “వచ్చేశావా, నీ కోసం ఎంత కాలం నుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా?” అంటుంది. “పెద్దమ్మా, టైమ్ అవకుండా నేను రాలేను కదా, సమయం వచ్చినప్పుడే నేను రాగలను” అంటాడు యముడు. “అవునవును” అంటూ తలాడిస్తుందామె. “నాక్కొంచెం టైమ్ ఉందా?” అంటుంది. యముడు తన స్మార్ట్ వాచ్ కేసి చూసుకుని ఉందన్నట్టుగా నవ్వుతాడు. మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ కాస్త చెయ్యి అందించమంటుంది. యుముడి ఆసరాతో లేచి, డైనింగ్ హాల్లోకి వచ్చి “అదిగో అదే నా కుర్చీ” అంటూ అందులో కూర్చుంటుంది.

యముడికేసి చూస్తూ, “నాదో చిన్న కోరిక” అంటుంది. “చెప్పు పెద్దమ్మా” అంటాడు యముడు. “లడ్డూ తినాలని ఉంది” అంటుంది. “అవునా” అంటాడు యముడు. ముసలావిడ తలాడిస్తుంది. “కిచెన్‍లో ఉంటాయి” అంటుంది. “నేవెళ్ళి తెస్తాను” అంటాడు. సంతోషంతో తల ఊపుతుంది. యముడు వంటింట్లోకి వెళ్ళిన సమయంలో ఎదురుగా గోడ మీద తను కొడుకు ఉన్న ఫొటోని చూస్తుంది.. అప్పుడామె ముఖంలో వెలుగు. ఫోటోలో కొడుకు కూడా సంతోషంగా ఉంటాడు. దాని పక్కనే కొడుకూ కోడలు ఉన్న ఫోటో ఉంటుంది. దాన్ని చూసి ముఖం మాడ్చుకుంటుంది. భార్యతో ఉన్న ఫోటోలో కొడుకు ముఖం వేలాడేసుకుని ఉంటాడు. అతని టీషర్ట్ మీద Everything will be Ok అని రాసి ఉంటుంది. భార్య ముఖం ధుమధుమలాడుతున్నట్లు ఉంటుంది. ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయాం అన్నట్లు చేతులాడిస్తూ, హావభావాలను ప్రదర్శిస్తుంది ముసలామె. ఈ రెండు ఫోటోల ద్వారా ఆ ఇంటి పరిస్థితిని గొప్పగా చెప్పేశాడు దర్శకుడు.

ఇంతలో కిచెన్ నుంచి పాత్ర ఏదో జారిపోయిన శబ్దం వస్తుంది. “అయ్యో, విరగ్గొట్టకు” అని అరుస్తుంది. “నా కోడలికి తెలిస్తే, నువ్వు యముడివని కూడా చూడదు, నీ సంగతి తేలుస్తుంది, జాగ్రత్త” అంటూ బెదిరిస్తుంది. “అదృష్టం, పగల్లేదు” అంటూ, లడ్డూల పాత్రని తెచ్చి ఆమె ముందు పెడతాడు యముడు. నవ్వుతూ యముడి కేసి థాంక్స్ అన్నట్టుగా చూస్తుంది. తర్వాత ఓ లడ్డూని కొరికి, దాని రుచిని ఆస్వాదిస్తుంది. “నువ్వూ ఒకటి తీసుకో” అని యముడితో అంటే, “వద్దమ్మా” అంటాడు. “ఏం, సుగర్ ఉందా నీకు”’ అని అడుగుతుంది. “అదేం లేదు” అంటాడు యముడు. “అందరూ అనుకునేట్టుగా నువ్వేమీ లావుగా, బానపొట్టతో లేవు. కాలుడివి కదా, ఫిట్‍గా ఉన్నావు” అంటుంది. “నేను డైటింగ్ చేస్తున్నా పెద్దమ్మా” అంటూ నవ్వుతాడు యముడు. “అవునా” అంటూ నవ్వుతుంది.

ఇంతలో వీధి తలుపు తీసిన చప్పుడవుతుంది. కోడలు ధుమధుమలాడుతూ లోపలి వస్తూ.. “వాట్ ది ఫ..” అంటూ చేతిలోని హ్యాండ్ బాగ్‍ని పక్కకి విసిరేసి, “ఓ ముసల్దానా, ఇంటి ముందు ఆ దున్నపోతేంటి?” అని రంకెలేస్తుంది. అప్పటి దాకా నవ్వుతూ ఉన్న యముడి ముఖంలో గాంభీర్యం! కోడలి కేసి చూస్తాడు. కోడలు యముడిని చూస్తూనే కొయ్యబారిపోతుంది. క్రమంగా ఊపిరాగిపోయి, నేల కూలుతుంది. ముసలావిడ తికమకగా చూస్తూంటూంది. షాక్‍తో కుర్చీ లోంచి లేవబోతుంది. యముడు మళ్ళీ తన స్మార్ట్ వాచ్ కేసి చూసుకుంటాడు. కోడలి శరీరం పక్కన ఆమె ఆత్మ నిలుచుని ఉంటుంది. ఆ ఆత్మని చూస్తూ, “వెళ్దామా?” అంటాడు యముడు. అయిష్టంగా తలూపుతుంది. ముసలామె ఇంకా నమ్మలేనట్లుగానే చూస్తూ ఉంటుంది. “సరే, వెళ్ళొస్తాను పెద్దమ్మా” అంటూ యముడు లేస్తాడు. ముసలామె గోడ కేసి రకరకాల భావాలతో చూస్తూండిపోతుంది. నేపథ్యంలో ‘వాట్ ది ఫ..’ అని వినబడి, TIME అని డిజిటల్ ఆంగ్ల అక్షరాలు కనబడడంతో ఈ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది.

~

Naughty Boy Pictures అనే బేనర్ పై Syam దర్శకత్వంలో Sumod Kumarr ఈ షార్మ్ ఫిల్మ్‌ని నిర్మించారు. ఫిల్మ్‌లో యముడి పాత్రని నిర్మాతే పోషించారు. ముసలావిడగా సేతులక్ష్మి అద్భుతంగా నటించారు. ఆమె నటనను చూస్తే, నాకు నిర్మలమ్మ, అన్నపూర్ణమ్మ గుర్తొచారు. కోడలిగా నేహా మాథ్యూ నటించారు. నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. మలయాళం భాష తెలియదు కాబట్టి ఒరిజినల్ డైలాగ్స్ సంగతి చెప్పలేను కానీ, ఆంగ్ల అనువాదం (సబ్ టైటిల్స్) బావున్నాయి.

4.47 నిమిషాల ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మనం నేర్చుకోదగ్గవి:

  • వృద్ధులను గౌరవించడం. చిన్నవాళ్ళను ఆదరంగా చూడడం.
  • గడిచిన కాలం తిరిగి రాదని గ్రహించి, అందుకు తగ్గట్టుగా మసలుకోవడం.
  • చిన్న చిన్న కోరికలు తీర్చుకోడానికి చివరి దాకా ఆగనక్కరలేకపోవడం.
  • శరీరాన్ని, మనసుని ఫిట్‍గా ఉంచుకోవడం (యముడంతటి వాడే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటుంటే, మానవులం మనమెంత?).
  • చేసే వృత్తి ఎంత కఠినమైనదైనా, ముఖంపై చిరునవ్వు చెదరకపోవడం.
  • సాంకేతికతని అందిపుచ్చుకోవడం.
  • ఎవరి పట్లా అకారణ ద్వేషం పెంచుకోకపోవడం, సౌమ్యంగా ఉండడం.
  • కుటుంబ సభ్యుల మధ్య అభిమానాలూ, ఆప్యాయతలు తొలగిపోకుండా చూసుకోవడం.
  • మనల్ని గాయపరిచిన వారినైనా, క్షమించి ముందుకు సాగిపోవడం.

ఇంకా చాలా చాలా స్ఫురిస్తాయి ఈ షార్ట్‌ ఫిల్మ్ చూస్తుంటే.

***

తెలుగు వారికి యముడంటే పెద్దగా భయం లేదేమో.. యముడిని హాస్యపాత్రగా మార్చేసి ఎన్నెన్ని సినిమాలు తీశారో. యమగోల, యముడికి మొగుడు, యమలీల, మగరాయుడు, యమదొంగ, యమహో యమ, హలో యమ, యమగోల మళ్ళీ మొదలయింది, యమజాతకుడు, దరువు.. ఇలా ఎన్నెన్నో. కానీ ఈ షార్ట్ ఫిల్మ్‌లో యముడి పాత్రని ఎంత హుందాగా చూపించారో.

“అదృష్టం, పగల్లేదు” అని యముడన్నప్పుడు (మలయాళంలో ‘భాగ్యం’ అంటాడు), మొదట నేను యముడి అదృష్టం అనుకున్నా.. కానీ తరువాత స్ఫురించింది.. అది యముడి అదృష్టం కాదనీ, ముసలావిడ అదృష్టమని. అయినా దైవానికి అదృష్ట దురదృష్టాలేం ఉంటాయి?

మరోలా కూడా అర్థం చేసుకోవచ్చు. యముడు ఓ దిక్పాలకుడు. పరమాత్మ తనకి అప్పగించిన విధులను నిర్మోహంగా నిర్వర్తిస్తున్నాడు. అతనిదే అదృష్టం అనుకుంటే.. యముడు సైతం తల ఒగ్గేదేదో ఇంకా పెద్ద శక్తి (సూపర్ పవర్) ఉందనిపిస్తుంది.. కొద్దిగా ఆలోచిస్తే బహుశా అదే కర్మఫలమేమో అనిపిస్తుంది.

అసలు దేవుళ్ళకి శరీరాలుంటాయా, దైవం నిర్గుణ నిరాకారుడనే వారికి నేనేం చెప్పలేను. కానీ భౌతిక శరీరం ఉన్న మనిషి భావనల ప్రకారం భగవంతుడు కూడా ఓ ఆకృతి దాల్చి దర్శనమిస్తాడని మన నమ్మిక. పైగా మన పురాణ గ్రంథాలలోనూ, ఇతిహాసాలలోనూ దేవుళ్ళు శరీరధారులే.

వద్దులెండి, వేదాంత చర్చలోకి పోవద్దు.. ఎందుకంటే ఈ విషయాలలో నాది పరిమితమైన అవగాహన! 😊

***

మృత్యువనేది ఎవరికి ఎలా ఎప్పుడొస్తుందో తెలియదు.. సికింద్రాబాద్ ఏ.ఎస్. రావు నగర్‍లో ఓ డాక్టర్ మిత్రుడున్నారు. కరోనా కాలంలో మా కుటుంబం అందరికీ ఎంతో భరోసా కల్పించారు. మందుల కన్నా ముఖ్యంగా ఆయన పేషెంట్‍లో నింపే నమ్మకం ఎంతో గొప్పది. ఓ ఇరవై రోజుల క్రితం అనుకుంటా.. ఆయన ఓ రోజు సాయంత్రం షేవింగ్ కోసం సెలూన్‌కు వెళ్ళారట. అక్కడ ఆ సమయంలో బాగా రద్దీగా ఉండడంతో వెనక్కి మళ్ళి కారెక్కబోతుండగా.. మాసివ్ హార్ట్ ఎటాక్.. అక్కడికక్కడే పడిపోయారు. క్షణాల్లో అంతా అయిపోయింది. ఆ రాత్రికే ఆయన భౌతికకాయాన్ని చెన్నయ్ లోని వారి స్వగృహానికి తీసుకెళ్ళిపోయారు. మాకు మర్నాడు మధ్యాహ్నానికి గాని వార్త తెలియలేదు. చాలా బాధేసింది. డాక్టరే కదా, ఆయనకి ముందస్తుగా సింప్టమ్స్ ఏవీ తెలియలేదా అని అనుకున్నాను. ఆయన వయసు 50-51 సంవత్సరాలుంటుంది. ఆయన మిసెస్ అక్కడే ఉండిపోవడంతో మరిన్ని వివరాలు తెలియలేదు. ఏది ఏమైన ఆయనిక లేరన్నది మాత్రం కఠిన వాస్తవం!

లైఫ్ ఈజ్ షార్ట్ అని కొందరంటారు. నిజమే, ఉన్న షార్ట్ టైమ్ లోనే దాన్ని మెమొరబుల్ చేసుకోవడం మన చేతిలో ఉంది. కల్ హో యా న హో అనుకుంటే.. రేపన్నది మనకి ఉంటుందో లేదో అనుకుని వర్తమానంలో జీవిస్తే, మనల్ని పట్టి పీడించే అనవసరమైన బెంగలు, ఆందోళనలు సగానికిపైగా మాయమవుతాయి.

అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైన సమస్యలే కాకుండా చాలామందిని బాగా ఇబ్బంది పెట్టేది – తమని జనాలు లోకువ చేస్తున్నారని ఓ తెగ మథన పడిపోవడం! 😔

బయటివాళ్ళో, అయినవాళ్ళో మనల్ని లైట్ తీస్కుంటున్నారని (పట్టించుకోవడం లేదనో చులకన చేస్తున్నారనో) చాలాసార్లు గింజుకుపోతాం. దానికి బదులుగా మనమూ ‘లైట్’ తీస్కుంటే (ప్రకాశాన్ని ఆహ్వానిద్దాం, విజ్ఞానపు వెలుగుని నింపుకుందాం) మన మనసు శాంతిస్తుంది. మంచి పుస్తకాలు చదువుకోవడం, పాడగలిగితే  హాయిగా మనకు నచ్చిన పాటలు పాడుకోవడం, వంటలో ఆసక్తి ఉంటే కొత్త ప్రయోగాలు చేసి రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండే పదార్థాలు వండడం, చిత్రలేఖనం, కుట్లు అల్లికలు, ఇంకా ఏ హాబీ అయినా – కొత్త విషయాలు నేర్పే పనిలో మనం లీనమైతే.. మనతో మనం సంతోషంగా ఉంటాం.. నెగటివ్ ఆలోచనలూ దూరమవుతాయి. ఉన్నంత కాలం, వీలైనంత ఆనందంగా గడపడానికి ప్రయత్నిద్దాం.

ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి, స్నేహాలను, బంధాలను, బాంధవ్యాలను దూరం చేసుకోకుండా మన టైమ్ వచ్చే వరకూ హాయిగా ఉందాం.

ఇక ముగిద్దాం అనుకుంటుంటే ‘అప్నాపన్’ అనే సినిమాలోని, ఆనంద్ బక్షీ రచించిన, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించిన, లత రఫీలు గానం చేసిన ఈ పాట ఎందుకో మనసులో మెదిలింది.

ఆద్మీ ముసాఫిర్ హై, ఆతా హై, జాతా హై

ఆతే జాతే రస్తే మే యాదేం ఛోడ్ జాతా హై’

~

ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ చూడాలంటే ఎలా అనుకుంటున్నారా, ఇదిగో యూట్యూబ్ లింక్. చూసెయ్యండి.

https://www.youtube.com/watch?v=JzHeB955grY

హ్యాపీ టైమ్!

PS:

‘అమ్మాచీ’ అనే మలయాళ పదానికి mother, elder woman అనే అర్థాలున్నాయి. నేను ‘పెద్దమ్మ’ అని వాడాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here