[box type=’note’ fontsize=’16’] అందరికీ తెలిసినా అనుభవిస్తేకానీ అర్ధంచేసుకోలేని నిజాన్ని సున్నితంగా ఎత్తి చూపించిన భరధ్వాజ్ వెలమకన్ని కథ ‘గురుస్సాక్షాత్ పరబ్రహ్మ’. [/box]
“ఏరా, ఏంటీ లేటూ? టైమౌతోంది బయల్దేరూ!” బయటనుండి అరుస్తున్నారు నాన్న.
“వస్తున్నా నాన్నా! ఒక్క నిముషం ఉండూ!” అని నా బేగ్ తీసుకుని ఒక్క ఉదుటున ఆయన పక్కన కారు సీట్లోకి ఉరికాను నేను.
“పేపర్ వర్క్ అంతా సరిగ్గా ఉందా?” ఆనందమూ, ఉత్కంఠతా కలిపి ధ్వనిస్తున్నాయి ఆయన మాటల్లో.
“ఆ! అంతా పెర్ఫెక్ట్!”
“కొంచం జాగ్రత్త వాడితో. కాస్త వళ్ళు దగ్గర పెట్టుకునుండు. అసలే నీకు కోపమెక్కువ” తండ్రి జాగ్రత్తల చిట్టా విప్పుతున్నారాయన.
“అబ్బా తెలుసులే నాన్నా. ఆ విషయం నాకొదిలెయ్!”
“హలో రేవంత్!” అన్న మదన్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిపడ్డా. “ఏంటీ ఇంతపొద్దున్నే వచ్చావ్?”
“బాస్ రమ్మన్నాడు, ఏదో క్లైంట్ మీటింగట”
“రియల్లీ? ఇవాళ ఆయన మీటింగ్ రేమాన్ గ్రూపుతో. ఈ క్లయింటు దగ్గరికి సాధారణంగా ఎవరినీ తీసుకెళ్లడే! అప్పట్లో తీసుకెళ్ళిన ఇద్దరినీ రెండ్రోజుల్లో ఏదో కారణంతో ఫైర్ చేశాడు”
“నిజమా?”
“అవును బాస్. ఇక్కడ అయిదేళ్ళుగా చేస్తున్నా. నువ్వోచ్చి ఏడాదేకదా అయ్యింది?”
నాకు గుండెల్లో రాయిపడింది.
“అంటే షుడ్ ఐ బీ వర్రీడ్ మదన్?”
“అలా అనేమీ కాదు, ఇది సాధారణంగా జరిగేది కాదు”
కొద్ది క్షణాల నిశ్శబ్దం ఇద్దరి మధ్యా!
“అసలీ కంపెనీకి వచ్చి తప్పుచేశానేమో అనిపిస్తోంది. ఏడాదిపాటు అనుభవించిన వేదన అంతా ఇంతా కాదు. ఏదో నాన్న బలవంతం వల్ల…”
“అన్నట్టు నాకు ఇక్కడ పనిచేసేవాళ్ళందరి హిస్టరీ తెలుసు గానీ అసలు నీ సంగతి తెలుసుకునే అవకాశం రాలేదు. మనవాడింకా రాలేదుగా? అసలిక్కడికెందుకు ఎలా వచ్చావో చెప్పరాదూ?” పాతకాలపు అమ్మలక్కల్లా మొహం పెట్టి అడిగాడు మదన్, “ఇష్టం లేకపోతే వద్దులే, ఐ యామ్ జస్ట్ క్యూరియస్ అంతే”
“అరే అదేం లేదు మదన్, నాకున్న అతికొద్దిమంది స్నేహితుల్లో నువ్వొకడివి. ఈ కంపెనీ మొత్తమ్మీద నేను తెలుగులో మాట్లాడగలిగేది నీతోనూ, మన బాస్ తోనూ అంతే. నీక్కాక ఇంకెవరికి చెప్తా?”
నా మది గతంలోకి పరుగులు తీస్తోంది …
గ్రాడ్యుయేషన్ అయ్యాక రెండేళ్ళు ఒక చిన్న ఇంజనీరింగ్ కంపెనీలో డిజైనర్‌గా చేసిన నన్ను ఆ కంపెనీ నష్టాల బారిన పడడంతో తీసేశారు. దాదాపు ఆరు నెలలు నిరుద్యోగిగా ఉన్న నన్ను చూసి తట్టుకోలేని నాన్న, చిన్నదే అయినా, గొప్ప పేరు ప్రఖ్యాతులు మూటగట్టుకున్న తన బాల్యస్నేహితుడి కంపెనీకి నన్ను తీసుకొచ్చి బలవంతంగా చేర్పించారు. అలాంటి చేరిక నాకు ఇష్టం లేకపోయినా, గతిలేక ఇదొక్కటే దిక్కవడంతో ఒప్పుకోవలసి వచ్చింది. సాధారణంగా నాలుగయిదు రౌండ్ల ఇంటర్వ్యూ అయితేగానీ ఎవరినీ పనిలోకి తీసుకోని ఆయన నన్ను అయిదంటే అయిదే ప్రశ్నలు, అవి కూడా నా సబ్జెక్టుకు సంబంధం లేనివి, వేసి ఒక ఏడాదికి నాకుద్యోగం ఇవ్వడానికి కమిట్ అయ్యాడు. ఏడాదయ్యాక నా పురోగతిని బట్టీ నన్ను ఉంచడమో తీసెయ్యడమో చేస్తానని మొదటిరోజే చెప్పాడు. చచ్చినాడి పెళ్ళికి వచ్చిందే కట్నమన్న చందాన నాన్న కూడా ఒకే అన్నారు. నాకయితే ఆయన నా ప్రతిభమీద నమ్మకంతోకాక ఎప్పుడో చిన్నతనంలో నాన్న ఆయనకు చేసిన సహాయనికి ప్రతిగా నాకీ ఉద్యోగం ఏడాదిపాటు ఇచ్చాడని అనిపిస్తోంది
“లక్కీ మేన్!” అన్నాడు మదన్ అప్పటిదాకా నేను చెప్పింది ఓపిగ్గా విని.
“ఏమి లక్కీనో, నీకూ తెలుసుగా. వచ్చిన మూడు నెలలలోనే నాలుగు డిజైన్లు ప్రపోస్ చేసా, ఆయన ఇచ్చిన ఛాలెంజెస్‌కి. దేనినీ ఆయ ఒప్పుకోలేదు. నాకయితే అవి బాగానే చేశాననిపించింది. పోని మొదటిది బాలేదనుకున్న రెండు, మూడూ బాగానే ఉన్నాయి, నాలుగోది చాలా బాగా వచ్చింది”
“అవును, రేవంత్, అది నేను కూడా చూశాను. చాలా బ్రిలియెంట్ అనిపించింది. దానిని బాస్ కాదనడం నాకు కూడా అర్థం కాలేదు”
“పోనీ అది కూడ వదిలెయ్యి మదన్. ఆ తరవాత ఏడు నెలలు కష్టపడి లేటెస్ట్ ట్రెండ్స్‌తో అయిదోది ప్రపోస్ చేశాను. అదికూడా ఒక సారి చూసి బాలేదన్నాడు.”
“విన్నాను” అన్నడు మదన్ నిర్లిప్తంగా.
“అయితే ఈ సారి బాస్ మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ మారడం చూశాను మదన్!. అది నిరుత్సాహమో, కోపమో, షాకో అర్థం కాలేదు. ఇంతకు ముందు నా ప్రపోసల్స్ చూసినప్పుడు ముఖకవళికల్లో అస్సలు మార్పుండేది కాదు”
“అవునా? చాలా విచిత్రంగా ఉందే! ఆయన ఫీలింగ్స్ దాచుకోవడం నేనెప్పుడు చూడలేదు”
“ఆయన స్నేహితుడి కొడుకుననేమో?”
“మే బీ! మే నాట్ బీ!!”
“ఇప్పుడు నువ్వు చెప్పిన దానిబట్టీ చూస్తే, ఆయన నాకు ఏడాదికి కమిట్ అయ్యాడు, ఆ ఏడాది పోయిన వారంతో పూర్తయ్యింది, ఈ ఏడాదిలో నేను కంపెనీకి వెలగబెట్టిందేమీ లేదు. ఈ క్లయింటు దగ్గరికి ఆయనతో వెళ్ళినవాళ్ళ ఉద్యోగాలు వెంటనే ఊడాయి. దీనర్థం?”
“అంత ఖంగారు పడద్దు రేవంత్. నిజం చెప్పాలంటే ఆ ఉద్యోగం పోయిన ఇద్దరికీ తెగ ఏటిట్యూడ్ ప్రాబ్లం ఉండేది. ఆయన్ని పట్టుకుని మొహం మీదే ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవారు. చూసి చూసీ విసిగిపోయి వాళ్ళని సాగనంపాడని సీనియర్ల ఉవాచ” అన్నాడు మదన్.
“ఏ సాకుతో సాగనంపాడు మరి?”
“ఈ విషయంలో మాత్రం మనవాడో తిక్క శంకరయ్య. ఇలాంటి పనులెందుకు చేస్తాడో తెలియదు”
“అంటే?”
“ఏముందీ? ఈ క్లయింటుతో మనవాడికి సత్సంబంధాలున్నాయి. మన అవసరం వీళ్ళకి చాలా ఉంది. సో ఓ పదేళ్ళదాకా మనల్ని వీళ్ళు వదులుకునే సమస్యేలేదు. అందుకే వాళ్ళ చేత నో అనిపించాడు”
“అర్థం కాలేదు మదన్!”
“ఏమీ లేదు. ఆ కంపెనీలో పెద్ద లీడర్లని తప్పించి, చిన్నా చితకా మేనేజర్లతో ఒక మీటింగ్ పెట్టి, వీళ్ళ ప్రపోసల్స్ వాళ్ళకి చూపించి, వాళ్ల చేతే రిజెక్ట్ అవ్వబడేలా చేశాడు. వాళ్ళు ఆ షేమింగ్ నుండి తేరుకునేలోగానే వాళ్ళకి పింక్ స్లిప్ ఇచ్చాడు”
“అంటే తన చేతులకి మట్టంటకుండా పని కానిచ్చాడన్నమాట. రెండువారాల క్రితం నేను కూడ ఆయనతో చిన్నపాటి వాదన పెట్టుకున్నా. ఏమీ అతిగా ప్రవర్తించలేదనుకో, కానీ ఒక్క విషయం. ఈ ఏడాదిలో మిగిలినవాళ్లకి ఆయన స్వయంగా ఇచ్చిన ట్రెయినింగులో నాకు మూడోవంతు కూడా ఇవ్వలేదు. మిగిలిన వాళ్లతో తన టెక్నికల్ అనుభవాల్ని పంచుకున్నాయన నా ముందు ఆ ఊసే తీసుకురాలేదు”
“అసలు ఈ క్లయింటు గురించీ, ఆయన ప్రపోస్ చెయ్యబోతున్న ప్రాజెక్ట్ గురించి నీకేమీ చెప్పలేదా రేవంత్?”
“లేదు మదన్. అస్సలు చెప్పలేదు”
“ఈయనకి జనాలకు షాకులివ్వడం మహా సరదా! ఈ ప్రాజెక్ట్ పేరుతో మరో ఆర్నెల్లు నిన్ను ఎక్స్టెండ్ చేస్తున్నానని చివర్లో చెప్తాడేమో” అన్నాడు మదన్ నవ్వుతూ
“దినదిన గండం నూరేళ్లాయుష్షులా ప్రతీ ఆర్నెల్లకీ ఇలా టెన్షన్ పడడం నావల్లకాదు. దానికన్నా నన్ను తీసేశానని చెబితే వేరే ఉద్యోగం వెతుక్కుంటా. సరే, అదిగో ఆయనొస్తున్నాడు, ఇంక వెళ్తా. సీ యా లేటర్!” అని బయల్దేరాను.
“సరే! ఆల్ ద బెస్ట్!” అంటూ మదన్ కూడా తన సీట్లోకి వెళ్ళిపోయాడు.
“గుడ్ మార్నింగ్!” చిరునవ్వుతో పలకరించాడు మా బాస్ రమేష్
“మార్నింగ్ రమేష్!” ప్రతిగా నేను.
‘రెడీనా? మనం ఇప్పుడు చూడబోతోంది మన టాప్ క్లయింటు రేమాన్ గ్రూపుని”
సరేనన్నట్టు తలూపాను.
“లెట్స్ గో!”
ఇద్దరం బయల్దేరాం.
దారిపొడుగునా ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకున్నాం గానీ ఈ కొత్త ప్రాజెక్ట్ గురించీ, క్లయింట్ గురించీ ఒక్క మాటకూడా మా మధ్య రాలేదు. నేను అడగాలేదూ, ఆయన చెప్పలేదు!
కారు దిగి క్లయింట్ ఆఫీసులోకి వెళ్ళాక ఆయన నన్ను లాబీలో కూర్చోమని ఎవరినో కలిసి ఒక అరగంటలో వస్తాననీ ఆ తరవాత ఇద్దరం కలిసి కాన్ఫరెన్స్ రూములోకి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాడు. నేను తీరిగ్గా ఓ కప్పు కాఫీ తీసుకుని పక్కనే ఎవరో వదిలేసిన జర్నల్ తిరగెయ్యడం మొదలు పెట్టా. కొన్ని పేజీలు తిప్పాక అక్కడ కనిపించిన విషయం నాకో విద్యుద్ఘాతంలా తగిలింది.
ఆ ఆర్టికల్ ఒకవిధమైన డిజైన్‍లో ఉండే రిస్కులూ, లోపాల గురించి, ఎం.ఐ.టీ. ప్రొఫెసర్లు వ్రాసింది. వాళ్ళు ఉటంకించిన డిజైన్ నేను నెలలకొద్దీ కష్టపడి రూపొందించిన అయిదో డిజైన్‌కు చాలా దగ్గరగా ఉంది. వెంటనే కవర్ పేజీ మీద అది ప్రచురించబడ్డ తేదీ చూసా – మూడు నెలల క్రితంది. అంటే ఈ ఆర్టికల్ వచ్చాకే నేను నా డిజైన్ మా బాసుకి చూపించా. జర్నల్ పేపర్లని ఎప్పటికప్పుడు చదివే మా బాస్, ఈ ఆర్టికల్ని ఎప్పుడో చదివుంటాడు. అందుకే నా డిజైన్ చూసిన వెంటనే బుట్టదాఖలు చేశాడు. అంటే నేను పడ్డ శ్రమంతా వ్యర్థమేనా? నాలో అణువణువునా నిరుత్సాహం పేరుకుపోయింది.
జరిగిన సంఘటనలన్నిటినీ పేర్చుకుని చూస్తే నాకింక ఉద్వాసన తప్పదనిపించింది. ఉద్యోగం పోతుందన్న బాధ కన్నా నా డిజైన్ ఫెయిలయ్యిందన్న భావన నన్ను లోలోపల దహించివేస్తోంది.
“పద రేవంత్. మీటింగ్ టైమవుతోంది!” అంటూ వచ్చాడు రమేష్. నా ఆలోచనల్లోంచి నన్ను బయటపడేస్తూ. సరేనని అతనితో నడవడం మొదలుపెట్టాను.
కాన్ఫరెన్స్ రూం …
మేము చేరేసరికే లోపల ఏడెనిమిది మంది ఉన్నారు. అందరూ ముప్పయ్యయిదూ, నలభై మధ్యనున్న కుర్రాళ్ళే!
‘అంటే ఈ మీటింగు జూనియర్లతోటా?’ నా గుండే కొట్టుకునే వేగం పెరిగింది
వాళ్ళందరూ రమేష్‌కి సుపరిచితుల్లా ఉన్నారు. అందుకే పేరు పేరునా హలోలు చెప్పి, నన్ను వారికి రేవంత్ అంటూ పరిచయం చేసి, వెంటనే మీటింగ్ మొదలు పెట్టేశాడు. తనతోబాటుగా తెచ్చిన ప్రింటవుట్లని అందరికీ పంచుతూ నాకు కూడా ఒక కాపీ ఇచ్చాడు.
దాన్ని చూసిన నాకు మరీ పెద్ద షాక్ తగలకపోయినా, కాస్త ఆదుర్దా కలికింది. అది నేనాయనకిచ్చిన అయిదో డిజైన్! కాసేపటిక్రితం చదివిన మేగజైన్ ఏకిపారేసిన డిజైన్. నా ఉద్యోగం పోవడానికి కారణమవ్వబోతున్న డిజైన్.
మా బాస్ వ్యూహమేంటో పెద్దగా ఊహించాల్సిన అవసరం రాలేదు, మదన్ ఇచ్చిన సమాచారాన్ని బట్టీ. సరేననుకుని ఆ డిజైన్‌ని అక్కడున్న జూనియర్లకి ప్రెసెంట్ చెయ్యడానికి కూర్చీలోంచి లేచాను.
వెంటనే రమేష్ నన్ను కూర్చోమన్నట్టు సంజ్ఞ చెయ్యడంతో వెనక్కి తగ్గి కుర్చీలో కూలబడ్డాను.
‘ఏం చెయ్యబోతున్నాడీయన?’ మెదడంతా అయోమయం.
ఆయన మెల్లిగా లేచి ఆ ప్రెసెంటేషన్ తనే చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు. నాకర్థం కాలేదు. హరికృష్ణ సీతయ్య సినిమా గుర్తొచ్చింది – ‘ఏం జరుగుతోందిక్కడ? నాకు తెలియాలి!”
తప్పుడు తడకల డిజైన్ చూపించి నన్ను అవమానిస్తాడనుకుంటే తనే దాన్ని ఎందుకు ప్రెసెంట్ చేస్తున్నాడో తెలియట్లేదు. ప్రెసెంటేషన్ మొదలయ్యింది. మొదటి స్లైడు నుండే అదెంతగొప్పదో అందరికీ వివరిస్తున్నాడు. నాకు వింతగా ఉంది. దానిలో అంత గొప్పదనముందని నాకే తట్టలేదు. అక్కడున్నవాళ్ళు మధ్యమధ్యలో ఆయన్ని ఆపి ప్రశ్నలడుగుతున్నారు, ఆయన ఓపిగ్గా జవాబులిస్తున్నాడు ‘అసలు నేనే అంతబాగా దాన్ని వివరించగలిగేవాడిని కాదేమో!’
సమావేశం తారస్థాయికి చేరినప్పుడు నాకనుమానమొచ్చింది. కొంపదీసి దీనిలో ఉన్న లోపాల సంగతి రమేష్‌కి తెలియదా? ఒక వేళ ఆ పేపర్ ఈయన చదవక, నా డిజైన్ తెగ నచ్చేసి అందరిముందూ తన దానిగా చూపించుకుంటూ, కఠినమైన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నన్ను పక్కన పెట్టుకున్నాడా?
స్వాతికిరణం సినిమా గుర్తొచ్చింది – ‘నా శ్రమను ఈయన దొంగిలిస్తున్నాడా?’
‘ఇంతకు ముందిచ్చిన నాలుగు డిజైన్ ఇలాగే చేశాడా? ‘
‘అవి కాస్త సులభమైనవి. సమాధానం చెప్పడానికి నేనక్కరలేదు. ఒకవేళ వాటిని కూడా ఇలాగే అమ్మేసుకునుంటే?’
‘ఆయన కంపెనీ యజమాని. నా అయిడియాలని అమ్ముకోవడంలో తప్పులేదు. కానీ నాకు కనీసం చెప్పకపోవడం, అంతా తన పేరుమీద పెట్టుకోవడం నైతిక ద్రోహం. రమేష్ అంత ద్రోహా?’
నాలోని ఆలోచనల పరంపర సాగుతూనే ఉంది.
ఈలోగా అక్కడున్న ఒక కుర్రాడు బాంబు పేల్చాడు. నేను అంతకు ముందే చదివిన వ్యాసాన్ని ఉటంకిస్తూ, ఈ డిజైన్ ఉన్న లోపాన్ని ఎత్తి చూపాడు.
దానికి రమేష్ సమాధానం నన్ను నిజమైన షాకుకి గురిచేసింది – “మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. కానీ మీకొక విషయం ఇక్కడ చెప్పాలి. దీనిని రూపొందించింది నేను కాదు. మా ఇంజనీర్ రేవంత్!” అంటూ నావైపు చూశాడు. వాళ్ళందరూ నాకేసి అదోలా చూసిన చూపులు … మొదటిసారిగా మా బాస్ మీద అసహ్యం వేసింది. సరే, ఇంక తప్పొప్పుకుందామని లేచి నిలబడి నేను మాట్లాడబోయేంతలో “ఒక చిన్న బ్రేక్ తీసుకుని దీనిగురించి మాట్లాడదామా?” అన్నాడు రమేష్. సరేనని అందరూ బయటకు నడిచారు. మతిపోయిన స్థితిలో ఉన్న నేను అలాగే స్థాణువులా కుర్చిలో ఉండిపోయాను కొన్ని సెకన్లపాటు.
కాసిని మంచినీళ్ళుతాగి స్థిమితపడ్డాక యథాలాపంగా ఆ ప్రింటవుట్‌ని తిరగేసా. చివరి పేజీలలో కొచ్చేసరికీ నాకు తెలియని ఒక పేజీ కనిపించింది. అది చదివిన నాకు మరొక షాక్. ఇప్పటిదాకా కొట్టిన షాకులలో అతిపెద్ద షాక్!
ఎం.ఐ.టీ వారి ఆర్టికల్ చూపించిన లోపాన్ని ఎలా సరిచెయ్యవచ్చో ఆ పేజీలో ఉంది. అది నా ప్రపోజల్లో లేనే లేదు. ఇక్కడికెలా వచ్చిందీ? అంటే రమేష్ నా ప్రపోజల్ చదివి, దానిలోని లోపాన్ని గుర్తించి, దానికి విరుగుడు కనిపెట్టి, ఈ ప్రెజెంటేషన్లో ఇరికించి, మొత్తం క్రెడిట్ నాకే… నా మెదడు పనిచెయ్యడం మానేసింది. ఆ కాన్ఫరెన్స్ రూము జనాలు మళ్ళీ ఎప్పుడొచ్చారో, ఆ కుర్రాడి ప్రశ్నకి, మిగతా వాళ్ళ ప్రశ్నలకీ రమేష్ ఏం జవాబులు చెప్పాడో, అంతా ఒక కలలా గడిచిపోయింది. ఒక గంట ఒక నిముషమైంది.
రూముకే లంచ్ తెప్పించారు. ఆ సమయంలో ఆ కంపెనీ ఛైర్మన్ కూడా మమ్మల్ని కలిశాడు. తనని నాకు పరిచయం చేసుకుని “మా సీ.ఐ.ఓ, సీ.ఎఫ్.ఓ., సీ.టీ.ఓ, సీ.ఓ.ఓ నీ గురించి చాలా గొప్పగా చెప్పారు. గుడ్ జాబ్!” అని మెచ్చుకున్నాడు, మా మీటింగుకొచ్చిన ఓ నలుగురు కుర్రాళ్ళని చూపిస్తూ. నా పరిస్థితి వర్ణనాతీతం. రమేష్ షాకులిస్తాడని మదన్ చెప్పాడుగానీ మరీ ఇలాంటివిస్తాడని చెప్పలేదే!
‘దేవుడా! షాకులిలా కూడా ఉంటాయా?’
తిరిగి వెళ్తున్నప్పుడు ఉండబట్టలేక రమేష్‍తో అనేశా “నన్ను క్షమించండి రమేష్ గారూ! నేను మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నా!”
“అవునా ఏమపార్థం చేసుకున్నావేంటీ?” అడిగాడాయన. విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాను. అప్పుడు చిద్విలాసంగా నవ్వుతూ ఆయన
“రేవంత్. నువ్వింకా కుర్రాడివి. ఎదగాల్సింది చాలా ఉంది. కానీ ఈ మాటలు గుర్తుపెట్టుకో. నిజమే ఇంటర్వ్యూలో నేను నిన్ను సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలేవీ అడగలేదు. నీకు సబ్జెక్టు మీద పట్టుందని మీ నాన్న మాటలవల్లే అర్థమైంది. ఆ సమయంలో నేను వెతుకుతోంది సరైన ఏటిట్యూడ్, తెలివీ ఉన్నవాళ్లకోసం. అందుకే సిట్యుయేషనల్ ప్రశ్నలడిగాను. నువ్వు చెప్పిన సమాధానాలు చాలా సృజనాత్మకంగా ఉన్నాయి. అప్పుడే నిర్ణయించుకున్నా, నువ్వు ఈ కంపెనీకి చాలా మేలు చేస్తావని. నీ మొదటి నాలుగు డిజైన్ బాగానే ఉన్నా, నాకెందుకో అవి నీ స్థాయికన్నా తగవనిపించింది. అందుకే వాటిని కాదని ఇంకా పెద్ద ఛాలెంజ్ విసిరాను. నీ అయిదో డిజైన్ నన్ను ఆశ్చర్య చకితుణ్ణి చేసింది. ఈ కంపెనీని ముందుకు తీసుకెళడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనిపించింది. అయితే నువ్వు చెప్పినట్టుగా నేను ఆ అర్టికల్ అప్పటికే చదివుండడంవల్ల నీ డిజైన్ని లోపాన్ని కనిపెట్టి ఒక నాలుగు రోజులు పనిచేసి ఆ సమస్యకి పరిష్కారాన్ని ఇరికించేసాను” అన్నాడు.
“కానీ మీరు చేసిన పనికి కూడా క్రెడిట్ నాకే ఇవ్వడం …”
“రేవంత్! నాకు ఈ క్రెడిట్ వల్ల వచ్చిన లాభం లేదు. కానీ నీ జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతోంది. నీ మెంటార్‌గా అది నా బాధ్యత”
“మీకెలా థేంక్స్ చెప్పాలో తెలియట్లేదు” అని బయటికన్నానేగానీ మనస్సులోని అపరాధభావన నన్ను తొలిచేస్తోంది – ‘ఎంత అపార్థం చేసుకున్నానీ మనిషిని!’
ఆయన మళ్ళీ అందుకున్నాడు “ఏమీ అక్కర్లేదు గానీ, ఇక ట్రెయినింగ్ విషయం. నేను నీకు ఒక ఉపాధ్యాయుడిలా కాక ఒక గురువులా, ఒక కోచ్‌లా ఉండాలని నిశ్చయించుకున్నా. అందుకే క్లాస్‌రూం పాఠాలేమీ నీకు చెప్పలేదు. నా అనుభవాలు నీతో పంచుకోలేదు. నిన్ను నా ఆలోచనలతో ప్రభావితం చెయ్యదలుచుకోలేదు. అందుకే నిన్ను ఛాలెంజ్ చేశాను, రెచ్చగొట్టాను. కష్టపెట్టాను. నీలో ఉన్న కసి ఒక అత్యుత్తమమైన డిజైన్ తీసుకొస్తుందని ఆశించాను. అంతా అనుకున్నట్టే జరిగింది.
ఉపాధ్యాయుడికీ, గురువుకూ ఉన్న తేడా అదే. ఉపాధ్యాయుడు విషయాన్ని బోధిస్తాడు, గురువు మాత్రం ఆ శిష్యుడే తనంతట తాను విషయాన్ని గ్రహించేలా చేస్తాడు. ఉపాధ్యాయుడు టెక్నికల్ స్కిల్స్‌ని బోధిస్తాడు, గురువు లైఫ్ స్కిల్స్‌ని కూడ జత చేసి శిష్యుడు వాటిని నేర్చుకునేలా చేస్తాడు. శిష్యుడు ఆపదలో ఉన్నప్పుడు గురువు తగిన చేయూతనిస్తాడు. గత ఏడాది బట్టీ నిన్నూ, నీ ప్రొగ్రెస్‌నూ చూస్తూంటే ఒక గురువుగా నేననుకున్నది సాధించాననే అనిపిస్తోంది.
అన్నట్టు మరో విషయం, రేమాన్ గ్రూపు ఈ ప్రాజెక్టును ఓకే చెయ్యబోతోంది. నాకు దీనిని పట్టించుకునే సమయంలేదు. అందుకే దానికి నిన్ను కోఆర్డినేటర్‌ని చేద్దామనుకుంటున్నాను. ఏమంటావ్?”
మూర్ఛపోవడమొకటే తక్కువైన నాకు మా కారు ముందు వెడుతున్న లారీ వెనక కనిపించిన అక్షరాలు…
“తస్మై శ్రీ గురవేనమః”
- భరద్వజ్ వెలమకన్ని