గురువు సేవ కంటే గుర్రం సేవ కష్టం

0
10

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

[dropcap]బూ[/dropcap]రుగుపుట్టు గ్రామంలో పాడ భీమన్న, కొర్ర రామన్న అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వీరు రాజన్న అనే గురువు దగ్గర చెట్లు నరకడం, పసరు వైద్యం, కొన్ని మంత్రాలు, పాటలు నేర్చుకున్నారు. గురువుకు అడవి నుండి అడ్డపిక్కలు, ఎండుకట్టెలు, కరక్కాయలు, నల్లజీడిపిక్కలు, వనమూలికలు తెచ్చి ఇచ్చేవారు. సంతలో గురువు కోసం కొత్త తువ్వాళ్లు, పొగాకు కొని తెచ్చేవారు. తమ ఇళ్లకు పిలిచి మాంసాహార భోజనం పెట్టి, కల్లు త్రాగించి ఆనంద పెట్టేవారు.

భీమన్న, రామన్నలు సంతలకు వెళ్లడానికి రెండు గుర్రాలు (కంచర గాడిదలు) కొనుక్కున్నారు. వాటికి రోజూ గుగ్గిళ్లు ఉడికించి పెట్టడం, మాలిష్‌ చేయడం, నీరు త్రాగుటకు కొండ వాగు దగ్గరకు తీసుకెళ్లడం చేసేవారు. తాము పండించిన పంటలను మూటలు కట్టి గుర్రాల మీద సంతలకు తోలుకెళ్లి విక్రయించేవారు. సంతలో తమకు కావలసిన దినుసులు కొనుక్కుని గుర్రాల మీద కూర్చుని ఇళ్లకు చేరుకునేవారు. ఇంటి దగ్గర ఒక చెట్టుకు వీటిని కట్టేవారు. సంతలు లేని రోజుల్లో వీళ్ల పిల్లలు గుర్రాల మీద కూర్చుని సరదాగా ఊరంతా తిరిగేవారు.

ఒకనాడు రామన్న, భీమన్న సంతకు వెళ్లారు. గుర్రాలను చెట్టుకు కట్టి తమ ఉత్పత్తులు వ్యాపారులకు విక్రయించేందుకు వెళ్లారు. వారు వ్యాపారులు ఇచ్చిన డబ్బులతో సంతలో తమకు కావలసిన దినుసులు కొనుక్కున్నారు. కల్లు త్రాగారు. కారం గారెలు కొనుక్కుని తిన్నారు. తమ గుర్రాల దగ్గరకు వెళుతుండగా కొందరు పరిచయస్థులు కనిపించగా వారితో మాట్లాడసాగారు. ఈలోగా కొందరు ఆకతాయిలు వీళ్ల గుర్రాలకు కట్టిన తాళ్లు విప్పి కొరడాతో కొట్టి తోలేసారు. ఈ గుర్రాలు పరుగెడుతూ తమ గ్రామాలలోని యజమానుల ఇళ్లకు చేరాయి.

రామన్న, భీమన్న గుర్రాలు కనిపించక గాబరాపడ్డారు. చీకటి పడడంతో తమ సామాన్లు మోసుకుంటూ తమ గుర్రాల గురించి అందరినీ అడగసాగారు. వారు తమకు అవి కనిపించలేదని చెప్పారు. ఇవి ఎక్కడికి పోయాయోనని బెంగతో ఇళ్లకు చేరారు. ఇళ్ల దగ్గర వీళ్ల గుర్రాలు కనిపించే సరికే ఆశ్చర్యపోయారు. అన్నం తిని పడుకున్నారు. తెల్లారి లేచి గుర్రాల కోసం గడ్డి తేవడానికి పచ్చిక బయళ్లకు వెళ్లారు. గడ్డి తినిపించి, నీరు త్రాగించారు. సాయంత్రం వాటిని నూనె రాసి మాలిష్‌ చేస్తూ “గురువు సేవ కంటే గుర్రం సేవ కష్టం రా బాబూ” అని ఒకరితో ఒకరు చెప్పుకుని బాధపడ్డారు. వారి ఈ మాటలు సామెతగా మారాయి. “గురువు సేవ కంటే గుర్రం సేవ కష్టం” అని అందరూ అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here