హెయిర్ కట్

4
11

[డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రచించిన ‘హెయిర్ కట్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“సా[/dropcap]ర్, ఈ ఆల్బమ్‌లో బోలెడన్ని హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. మీకు నచ్చినది చూజ్ చేసుకుంటే..” అని ఆ సెలూన్ అబ్బాయి చెప్తుంటే అసహనంగా ఉంది నాకు. “ముందు మా మనవడి సంగతి చూడు బాబూ”, అన్నాను మర్యాదగా. అతను మా వాణ్ణి తీసుకుని వేరే కుర్చీలో కూర్చోబెట్టాడు.

ఈలోగా నా మనసు భలే కోపాన్ని వెళ్ళగక్కుతోంది, అగ్నిపర్వతంలోని లావాలా! నేనసలు ఈ ఫ్యాషనబుల్ మంగలి కొట్లకి వెళ్ళడానికి ఇష్టపడను. ఇదివరకు ఆడవాళ్ళకి ఏ తిరుపతో, మరే పుణ్యక్షేత్రమో వెళ్తే తప్ప మంగలి అవసరమే ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా ‘యూ’ కట్టు, ‘వీ’ కట్టు, ‘సాధన’ కట్టు, నా పిండాకూడు కట్టు అనేసి ఆడ బార్బర్ల దగ్గరకి తెగ వెళ్ళిపోతున్నారు.

మేం మగపీనుగులం కేవలం జుట్టు మాత్రం కత్తిరించుకుంటుంటే, ఈ ఆడవాళ్ళు మానిక్యూర్ అని, పెడిక్యూర్ అని, ఫేషియల్ అని, హెన్నా అని, బ్లీచింగ్ అని, గాడిద గుడ్డనీ రోగమొచ్చినవాళ్ళలా ‘ట్రీట్మెంట్లు’ చేయించుకుంటారు. అంతఃసౌందర్యానికి మించిన అందం ఉండదని నమ్మే కొద్ది వాళ్ళలో నేనొకణ్ణి. కానీ, నా అంతశ్శత్రువు (అంటే అరిషడ్వర్గం అనుకునేరు- ఇంట్లోని శత్రువు అని అర్థం చేసుకోగలరు) అయిన ఏకైక పుత్రికకి ఇవన్నీ కావాలే మరి! కాలమహిమ! ఏం చేస్తాం?

పోనీ, ఆ కొట్లు రెండూ వేర్వేరుగా కూడా ఉండనక్కరలేదట. ఇప్పుడే వాళ్ళ పుత్రరత్నానికి హెయిర్ కట్ చేయించమని చెప్పి, మా అమ్మాయి ‘ట్రీట్మెంట్’ కోసం లోపలికి వెళ్ళింది. ఇది ‘యూనిసెక్స్ సలోన్’ అట. అంటే, ఆడా, మగా ఒకే చోట హెయిర్ కట్ చేయించుకుంటారట! ఏం చోద్యం!

అసలు ఈ సలోన్‌కీ, సెలూన్‌కీ తేడా ఏమిటో? పేరు మార్చుకోవడంలో తప్పులేదు. ఈ యూనీఫార్మ్ ఏమిటో, ఈ ఇంగ్లీషు మాటలేమిటో నాకు అంతుపట్టలేదు. బహుశః అదే తేడా అయ్యుండొచ్చు. నా వాలకం చూసి, పల్లెటూరి బైతుని అనుకుని నాకు తెలుగులో చెప్పాడేమో ఆ పిల్లాడు. ఇంతలో మరో యూనీఫార్మ్ ఉద్యోగి మరో గదిలోంచి హెయిర్ కట్ చేస్తున్న చోటికి వచ్చాడు.

“బాబూ, ఆడవాళ్ళ చోటు దగ్గర నీకేం పని?” అని అడిగాను కోపాన్ని కనబడనీయకుండా. “నేను హెయిర్ కట్ మాత్రమే చేస్తాను సార్. కొంతమంది లేడీస్ నా చేతే హెయిర్ కటింగ్ చేయించుకుంటారు. కానీ అది మొదటి రూమ్‌లో మాత్రమే చేస్తారు. లేడీస్‌కి ప్రైవసీ ఉంటుంది లెండి. మిగతా ట్రీట్మెంట్స్ ఇంకా లోపలి గదుల్లో చేస్తారు. అవి ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు. బై ది బై, నేను వచ్చింది జెంట్స్ ట్రీట్మెంట్ రూమ్ నుండి,” అన్నాడతను.

వెర్రి మొహం వేసుకుని చూస్తున్న నాతో, “జెంట్స్ మాత్రం అందంగా ఉండకూడదా సార్? వాళ్ళకి కూడా లేడీస్‌కి చేసే మెజారిటీ ట్రీట్మెంట్లు చేస్తాం. తప్పంటారా?” అన్నాడు. ఆహాఁ, ఆడవాళ్ళు వీడి చేతే జుట్టు గొరిగించుకుంటారట! కలియుగపు విడ్డూరాలు! అయినా, ఇలాంటి హై ఎండ్ చోటుకి వెళ్ళడం నాకు ఇదే మొదటిసారి. ఇంకేమైనా వాగితే తలవంపులని, తలాడించేసి, అక్కడ ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాను.

అక్కడ ఉన్న హెయిర్ స్టైల్స్ ఆల్బమ్ తిరగేస్తుంటే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఆంద్రె అగాసీ హెయిర్ స్టైల్, యానిక్ నోవా అనే ఫ్రెంచ్ ఆటగాడి జడలబర్రి హెయిర్ స్టైల్ చూసి విసుగొచ్చింది.

నేను అగాసీని మొక్కజొన్నపీచు గాడని పిలిచేవాణ్ణి; బుద్ధిగా పాపిడి తీసుకుని, నీటుగా క్రాఫ్ చేసుకుని ఉండే పీట్ శాంప్రాస్ అంటే అందుకే నాకు వల్లమాలిన ఇష్టం. అతణ్ణి అభిమానంతో ‘సంపరాయుడు’ అని కూడా పిలుచుకునేవాణ్ణి. కానీ, ప్రతీ ఇంట్లోనూ ఓ ప్రత్యర్థి ఉన్నట్టు, మా అమ్మాయి మాత్రం మొక్కజొన్నపీచు గాడి వీర ఫ్యాన్. బహుశః అందుకేనేమో ఈ పార్లర్లంటే ఎగబడుతుంది.

ఆ తరువాత జెఫ్ బీజోస్ ఉరఫ్ లలితా జ్యువెల్లర్స్ స్టైల్, పైనాపిల్ స్టైల్ కూడా దర్శనం ఇచ్చాయి. వేరెవరికో అవసరమని ఆ ఆల్బమ్ అడిగితే, ఇచ్చేసి, వీళ్ళిద్దరూ ఎప్పుడొస్తారా అని అనుకుంటూ కాలం గడిపాను (నేను కూడా అదే పని మీద వచ్చానని మరచిపోయి!).

ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి, నాకు పదియేళ్ళ వయసు దాటినా (ఓ ఓ మరచిపోయాను, ఇక్కడ అంకె పది సంవత్సరాలు కాదు, పదిని ఏడుతో గుణిస్తే వచ్చే సంఖ్య అని లెక్క చూసుకోవాలి!), సైడ్ బర్న్స్ అక్కడక్కడా నెరిసాయి తప్ప నేను ఏఎన్ఆర్, దేవానంద్‌ల లాగ ఎవర్ గ్రీన్ మనిషిని. మొహం మీద ఒక్క ముడత కూడా ఉండదు. అలాంటి నాకు ఈ సలోన్‌లో కట్టు అవసరమా?

***

ఈ తలపు రాగానే, నాకు గడిచిన కాలం గుర్తొచ్చింది. నేనెప్పుడూ మా వెంకన్న చేతే క్షవరం చేయించుకునేవాణ్ణి. అతని తండ్రి శీనయ్య మా ఇంటికి ఆస్థాన క్షురకుడు అనుకోవచ్చు. వెంకన్న కొట్టు పెట్టుకున్నాడు. పేరుకి తగ్గట్టు, దాన్ని దేవుళ్ళ కాలెండర్లతో అలంకరించే వాడు (మిగిలిన వారు చాలా మంది అసభ్యకర పోస్టర్లు పెట్టినా సరే).

నా ముద్దుల కూతురికి అప్పట్లో పేల వల్ల చీమున్న కురుపులు తలనిండా వస్తే, జాగ్రత్తగా డెట్టాల్ వేసి, కొన్ని మొండి కురుపులని ఆరనివ్వడానికి వీలుగా జుట్టు కత్తిరించి, ఆ కురుపులు మాడాక గుండు కూడా చేశాడు. అక్కడ జుట్టు కత్తిరించుకున్నా, గుండు చేయించుకున్నా, ఎవరికీ ఏ జబ్బూ వచ్చిన దాఖలాలు లేవు, ఇప్పుడు కోవిడ్, అదీ, ఇదీ అని అలాంటి చోట్లకి మనం వెళ్ళడంలేదు గాని!

మొదట అతని దుకాణం పేరు ‘వెంకన్న మంగలి కొట్టు’. సమయానుకూలంగా దాని పేరు ‘వెంకన్న బార్బర్ షాప్’ గాను, తరువాత ‘వెంకన్న హెయిర్ కటింగ్ సలూన్’ గాను నామాంతరం చెందినా, నాణ్యత అదే స్థాయిలో ఉండేది.

ఇక్కడందరూ ‘స్టైలిస్టు’లు కనుక ‘స్టైల్’గా మాట్లాడతారేమో గాని, ఆ అభిమానాలు అవీ ఈ రోజుల్లో ఉన్నాయా? మా అమ్మానాన్నలు పోయినప్పుడు వెంకన్న కూడా బాధపడ్డాడు. నిగనిగలాడే నా ఒత్తైన జుట్టుకి పిలక పెట్టడానికి దుఃఖించాడు కూడా.

***

“నాన్నా!” అని నా కూతురు పెట్టిన గావుకేకకి వర్తమానంలోకి వచ్చాను. “నిష్ణాత్ గాడికి హెయిర్ కట్ చేస్తుంటే మీరు దగ్గరుండి చూసుకోవద్దూ? చూడండి, వాడు పిలక పెట్టించుకున్నాడు. ఎవరైనా చూస్తే, నాకో, మా ఆయనకో ఏదో అయ్యిందనుకుంటారు!” అంది కోపం తాండవిస్తుండగా. ఈ కాకతాళీయపు విషయం గమనించి, కరెంట్ షాక్ తగిలిన కాకిలా అవాక్కయ్యాను.

చూస్తే, వాడి తలంతా గుండయ్యి, వెనక్కాల ఒక పిలక ఉంది. ‘ఏమిట్రా ఇది?” అని దీనంగా అడిగాను నిష్ణాత్‌ని. “తాతయ్యా, ఇది ‘చాణక్య హెయిర్ కట్’”, అని విశదంగా చెప్పాడు మావాడు. మన సంస్కృతి అర్థమవుతుందని ‘అమర్ చిత్ర కథ’ పుస్తకాలు కొని, వాడికి చదివి చెప్తే, వాడేమో ఇలా అర్థం చేసుకున్నాడు ఖర్మ!

“నా బిల్ కూడా నాన్న గారే ఇస్తారు”, అని, “ఇంకా మీరు హెయిర్ కట్ చేయించుకోలేదా? ప్చ్.. వాడికి గుండు, అంటే జెఫ్ బీజోస్ కట్టు, మీకు మామూలు కట్టు చేయించుకుని, బిల్ ఇచ్చేసి ఇంటికి రండి. ఈలోగా వంట చేస్తా”, అని విసుగ్గా నిష్క్రమించింది నా కూతురు.

నాలో పాపం చేసిన ఫీలింగ్ వెల్లువెత్తింది. వాడికి గుండే చేయించాలంటే ఆపదమొక్కులవాడి కళ్యాణ కట్టలోనో, మా క్షేత్రపాలకుడైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి భక్తితోనో జరిపించుకోవచ్చు కదా! ఒక బ్యూటీ పార్లర్‌కి సమర్పిస్తే, పుణ్యం-పురుషార్థం- ఇలాంటివి ఏవీ దక్కవు కదా! ఇక్కడికి వీళ్ళతో వచ్చి క్షమించరాని నేరం చేసినట్టు అనిపించింది.

ఈలోగా, వాడికి బీజోస్ కట్ చేస్తుంటే, ఒకబ్బాయి లేచాడు. వాణ్ణి చూసి జడుసుకున్నాను- అచ్చం బూచిలా ఉన్నాడు. ఉన్న జుట్టుకి ఒక పాయ మొక్కజొన్నపీచు రంగు, మరో పాయ రాగి రంగు- ఇలా కొన్ని రంగుల కలయిక సాక్షాత్కరించింది. పైగా అందమైన ఉంగరాల ఆ జుట్టు మొహం మీదకి పాయలు పాయలుగా పడిపోతోంది. ఇదేమిటాని కనుక్కుంటే, అది శ్రీలంక క్రికెట్ ఆటగాడు ‘లసిత్ మలింగా స్టైల్’ అట. నాకు మాత్రం కడుపులో దేవింది.

మావాడి గుండు పూర్తవగానే, వాణ్ణి ఒక చోట కూర్చోబెట్టి, కదలవద్దని చెప్పి, నేను కుర్చీలో కూర్చున్నాను. నా ‘స్టైలిస్టు’ నాపై ఇస్త్రీ చేసిన ఒక ఏప్రన్ కప్పాడు. “మామూలు క్రాఫ్ చెయ్యి బాబూ, వీలైనంత జుట్టు కత్తిరించేయ్”, అని అతనితో చెప్పాను. అతను పని మొదలు పెట్టాడు.

ఈలోగా ఒక కుర్ర తల్లి, ఒక ఆరేళ్ళ ఆడపిల్ల వచ్చారు. ఆ పిల్లకాయ్ క్లాసులో మరో పిల్లకాయ్ ఏదో మెక్సికన్ హెయిర్ కట్ చేయించుకుందట. అది ఈ పిల్ల చేయించుకోవాలట. ఆ హెయిర్ కట్టేమిటో తెలుసుకోవడానికి ఇక్కడున్న స్టైలిస్టులందరూ తెగ కష్టపడిపోయారు. నాకు క్రాఫ్ చేస్తున్న వాడు కూడా అర్థం కాని కాన్సెప్ట్‌లు ఏవేవో వాడుతున్నాడు.

భేష్! విలువలు తెలుసుకోవలసిన వయసులో, ఈ బొడ్డూడని పిల్లలు ఫ్యాషన్ గురించి తెలుసుకోవడం అపూర్వం! నా దురదృష్టం వల్ల, చప్పట్లు చరుద్దామంటే నా చేతులు కట్టబడి, సారీ, కప్పబడి ఉన్నాయి కదా! అందుకని కుదరలేదు. ఈ హడావుడి అంతా ఒక కాకిగోలలా నాకు గోచరించి, నేను నా ముద్దుల మనవడి చిన్నతనాన్ని కళ్ళు మూసుకుని గుర్తుచేసుకున్నాను.

***

మా నిష్ణాత్ గాడికి నేను ‘ఫెండ్’‌గా ఉండే రోజుల నుండీ తాతయ్యని అయ్యే వరకూ సంపరాయడి హెయిర్ కట్టే ఉండేది. వాడు ఇలా స్వాతంత్ర్యం ప్రకటిస్తాడని నేను కల గన్నానా? ప్చ్.. ఒకప్పుడు మా అల్లుడు భిలాయి స్టీల్ ప్లాంట్‌లో పని చేసేవాడు. అప్పుడే ఈ బడుద్ధాయి పుట్టాడు. ఈ కాలపు తెలుగు పిల్లలలాగా (అంటే అమెరికా మినహాయించి) వాడు పక్కా హిందీ పిల్లాడిలాగే మాట్లాడేవాడు.

అప్పుడప్పుడు ఆదివారాలనాడు, వీడియో కాల్‌లో ‘ఫెండ్, హమ్ కా గయే తే’, అని ఒక ‘రాయల్ వీ’ తగిలించుకుని మరీ నన్నడిగే వాడు. నాకు తెలియనట్టు ‘కా గయే’, అని అడిగేవాణ్ణి. వాడు తన స్వంత ట్యూన్ లో ‘బాల్ కతానే గయే తే’ అని ముద్దుగా చెప్పేవాడు. నేనొకసారి ఏమారుపాటులో, ‘ఆజ్ హెయిర్ కట్ కే లియే గయా క్యా?’ అని అడిగేశాను. ‘హా, హా ఏ కత్ కే లియే గయే తే’ అని మాట మార్చేశాడు భడవ!

కోవిడ్ అప్పుడు, పాపం, వాడి ఏ కత్‌కి భంగం కలిగి, వాడి వత్తయిన నల్లటి జుట్టు (అచ్చం నా పోలికే!) ఇంచుమించు కళ్ళ వరకూ వచ్చేస్తే, మా అమ్మాయి వాడికి కొమ్ముల్లాంటి రెండు పోనీటెయిల్స్ కట్టింది. ప్రాంతీయ వార్తలు ఒకప్పుడు చదివే కొప్పుల సుబ్బారావు గారి నుండి స్ఫూర్తిని పొంది, వాణ్ణి ‘కొమ్ముల నిష్ణాత్’ అని పిలిచిన రోజులూ ఉన్నాయి.

మా ఆవిడ పోయాక అల్లుడు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగం సంపాదించి, ఇక్కడికి వాళ్ళు వచ్చేశారు. నా డౌటనుమానమేమిటంటే, నా నెపం చెప్పి వాళ్ళిక్కడికి వచ్చారు అని. నాకు చేదోడు వాదోడుగా ఒక్క రోజు కూడా ఉన్న పాపాన పోలేదు వాళ్ళు. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో ఉంటారు.

నూటికీ, కోటికీ ఒకసారి, ఇలా తనకి కావలసిన పార్లర్‌కి గాని, బట్టల షాపుకి గాని, బంగారపు దుకాణానికి గాని వెళ్ళాలంటే ఇటొచ్చి, మా అమ్మాయి మా ఇల్లు పీకి పందిరేస్తుంది. నేను సర్దుకున్నవన్నీ కలగాపులగం చేసేస్తుంది. మనవడి కోసం ఇవన్నీ భరిస్తున్నాను.

ఇప్పుడు కూడా తను హీరోయిన్‌లా ముస్తాబయ్యి, వాళ్ళబ్బాయిని నాకు అప్పజెప్పి, ఇంటికెళ్ళి, దానిలాంటి దాని ఫ్రెండ్స్‌కి ఫోన్ కొట్టి ఆ ‘బ్యూటీ ట్రీట్మెంట్స్’ గురించి చర్చిస్తున్నా ఆశ్చర్యపోవనక్కరలేదు. పార్లర్ వాళ్ళ దగ్గర స్టంట్ కొడుతుంది కానీ, వంట మనిషి ఉన్న ఇంట్లో దీనికి వంట చేసే పనెక్కడిది? చూసే వాళ్ళు ఆమె తండ్రి ప్రేమను చూసి పొంగిపోవద్దూ?

***

ఈ ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నంత సేపూ నా స్టైలిస్టు నాతోనో, మరెవ్వరితోనో తెలియదు గాని, ఏదో తుమ్మెదనాదం చేస్తూనే ఉన్నాడు. నేను మధ్య మధ్యలో ఊ కొడుతూ నా ఆలోచనల్లో మునిగిపోయాను, హాయిగా! “తాతయ్యా, నీ హెయిర్ కట్ అయిపోయింది లే, లే”, అన్న మా నిష్ణాతుడి మాటలకి కళ్ళు తెరిచి, ఎదురుగుండా ఉన్న అద్దంలో నన్ను నేను చూసుకుని, భయపడి అరిచాను.

దెబ్బకి అంతటా నిశ్శబ్దం చోటు చేసుకుంది. “నా నల్ల జుట్టేమయ్యింది? నా క్రాఫ్ ఎక్కడ? ఎవరి చుండ్రు తెచ్చి ఇక్కడ నడినెత్తిన పెట్టావు?” అని ఆ అబ్బాయిని గట్టిగా గద్దించాను. నా తలపైన రెండంగుళాల పాటు పూర్తిగా బోడి చేసి, దానిపైన చూచాయగా జుట్టుంచి, నడినెత్తిన ఓ గుండ్రాన్ని పెట్టి, దానికి చిక్కటి చుండ్రు అతికించినట్టుంది నా హెయిర్ స్టైల్.

ఇలాంటి షాకులూ, అవీ అలవాటే కాబోసు, అతనేమీ వెరవకుండా, “సార్, ఇది వెస్ట్ ఇండీస్ ఆటగాడు షింరాన్ హెట్‌మేయర్ హెయిర్ స్టైల్ అండీ! ఇదిగో, చూడండి”, అని స్మార్ట్ ఫోన్లో నాలాంటి ఒక కుర్రాణ్ణి చూపించి, “అది చుండ్రు కాదు సార్. మీ హెయిర్ జస్ట్ బ్లీచ్ చేశాము, అంతే! మోరోవర్, మీ మనవడి చలాకీతనం చూసి, ముచ్చటపడి, సెలెక్ట్ చేయమని నేనడిగితే, చేశాడు; మీరు ‘ఊ’ అన్నారు కూడా, సార్!” అన్నాడు.

ఇంక నాకు ఈ వయసులో ఏడుపొక్కటే తక్కువ. నా ఎవర్ గ్రీన్ ఇమేజ్ ఏం కావాలి? పదియేళ్ళు దాటిన ముసలాడికిదేం మాయరోగం, అని మనుషులు అనుకోరూ, హవ్వ! అయినా, వెంకన్న కొట్టుకి వెళ్ళకుండా నా కూతురి మాటలు విని ఇటొచ్చాను కదూ, తప్పు ముమ్మాటికీ నాదే. బీజోస్ కట్టు చేయించుకుందామా అనుకుని, వీళ్ళ మీద తగలేసింది చాల్లే, వెంకన్న కొట్టుకెళ్ళి ఆ పని కానిద్దామని నిశ్చయించుకుని బిల్ అడిగాను.

మరో బడుద్ధాయి వచ్చి, బిల్ చూపిస్తూ, “సార్, మేడమ్ ఈ హెయిర్ కట్, హెయిర్ డై తోపాటు మరో రెండు ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు. వెరసి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు. బాబుకి చాణక్య కట్ పదిహేను వందలు, బీజోస్ కట్ వెయ్యి అయ్యాయి. హెట్‌మేయర్ కట్ మూడు వేల రెండొందల రూపాయలు.. వీటి టోటల్..” అని, ఆ అంకె చెప్పేలోపు వాణ్ణి అడ్డుకుని, “జిఎస్‌టితో కలిపి చెప్పు”, అన్నాను విసుగ్గా. “సిక్స్‌టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ సార్”, అన్నాడు అలవాటు ప్రకారం ఇంగ్లీషులో.

కార్డ్‌తో డబ్బులు కట్టి మనవడితో కలిసి బయటికి వస్తుంటే, నా గుండె బరువెక్కింది. హెయిర్ కట్ మాటేమో గానీ, నా కూతురు నా పాకెట్‌కి, నా మనవడు నా పరువుకీ గార్డెన్ సిజర్స్ వేశారు కదా మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here