హాలోవీన్ వేళలో – హనుమాన్ చాలీసా

0
9

[dropcap]అ[/dropcap]ట్లాంటా నగరంలో, కమ్మింగ్ పట్టణంలో కేనీక్రీక్ వాడలో అలవాటుగ నడక సాగిస్తున్నారు మంగమ్మగారు.

“అమ్మా! నాలుగు అడుగులు నడిచి వచ్చేదానివి. వారం రోజులుగా బొత్తిగా వెళ్ళడం లేదు. ఈ రోజైనా కాసేపు నడిచిరా” అని అమ్మలు చెప్పడంతో, తప్పించుకోలేక అయిష్టంగా బయటకు అడుగు పెట్టిందావిడ.

ఎక్కడి కర్నూలు, ఎక్కడి అమెరికా! అందులోను ఈ అట్లాంటాకు చలికాలంలో రావడమంటే సాహసమే.

అడుగు బయట పెట్టాలంటే హిమాలయ పర్వతారోహకులలా కాళ్ళకు, చేతులకు, తలకు, చెవులకు, శరీరానికీ వెచ్చని ఉన్ని తొడుగులు కావలసిందే.

ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్న జానెడంత జరీ అంచులు, అరచేయంత జరీ బుటాలు వున్న గద్వాలు, నారాయణపేట, వెంకటగిరి చీరలు మాకెప్పుడు మోక్షం అన్నట్టు జాలిగా చూస్తున్నా, ఒక్కో బ్లౌస్ కుట్టడానికి మూడు నాలుగు వేలు పోసి అందంగా మగ్గం నగిషీ చేయించి కుట్టించుకున్న మాచింగ్ రవికెలు పెట్టె అడుగునుండి దీనంగా చూస్తున్నా పట్టించుకోకుండా, శరీరాన్ని గోనె సంచీ వంటి జీను పాంటులో, మందపాటి జాకెట్లో (అంటే స్వెటర్లో) కుక్కి, అడుగు ముందుకు వేయడానికి మొండికేసే కాళ్ళకు సాక్సులు, బూట్లూ తొడిగి యుద్ధానికి బయలుదేరినంత హంగులతో కాలినడకకు పూనుకోవడం అంటే ఎంత మానసిక బలం కావాలీ అన్నది మంగమ్మగారికే ఎరుక.

“అమ్మలూ! అలా నాలుగు అడుగులు నడిచి వస్తా” అని కూతురికి చెప్పి, వీర తిలకం కోసం ఎదురు చూడకుండా వీరోచితంగా బయలుదేరింది ఆవిడ.

మరి ఆవిడ నడకకు, కాఫీకి లంకె పెట్టింది కూతురు.

కదలను మొర్రో అని మారాము చేస్తున్న మనసుని అదిలించి శరీరాన్ని పద పదమని హెచ్చరిస్తూ బరువుగా అడుగులు వేస్తున్న ఆవిడ, వాళ్ళ ఇల్లు వున్న కల్ డి శాక్ (వీధి చివర వొంపు) నుండి పాతిక గజాల దూరం దాటగానే ఎరుపు దీపాలు చూసిన కారులా ఆగిపోయింది.

కాలిబాటను ఆనుకుని వున్న చెట్టుకు వ్రేలాడుతున్నదో అస్థిపంజరం. ముఖం వుండాల్సిన చోట వున్న పుర్రెలో కళ్ళ గుంటలు ఎర్రగా వెలుగుతున్నాయి. నోరంతా తెరిచి నవ్వుతున్నట్టు ముప్ఫైరెండు పళ్ళు కనబడుతున్నాయి.

అమెరికా ఆడ దయ్యం గనుక పొడుగ్గా వుండి, దర్జాగా పాంటు షర్టు తొడుక్కుని, చెట్టు కొమ్మనుండి విలాసంగా వూగుతోంది.

అంత చలిలోను మంగమ్మగారికి ముచ్చెమటలు పట్టాయి. అడుగు ముందుకు పడలేదు. కడుపులోనుండి గజ గజ మంటూ వస్తున్న వణుకు.

వెనక్కి తిరిగి పరిగెత్తలేకపోయినా పోయినా పాక్కుంటూ అయినా వెడదాము అంటే మోకాళ్ళ నొప్పుల మాట అటుంచి ఆ దయ్యం కాస్తా వెంటబడితే అన్న మీమాంస.

“జయహనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహులోక ఉజాగర..” అంటూ వణుకుతున్న పెదవులతో హనుమాన్ చాలీసా గొణుగుతూ ఒక క్షణం అలా నిలబడి పోయిందామె.

ఇంతలో రివ్వుమంటూ వచ్చిన గాలికి ఆ దయ్యం తలమీది జుట్టు ఎగురుతుండగా, గిర్రున గుండ్రంగా తిరిగింది.

మంగమ్మగారి పైప్రాణాలు పైనే పోయినంత పని అయ్యింది.

కలలో దయ్యం కనబడిందని భయపడిన మనవడికి ‘జై హనుమాన్’ అని తలచుకుంటే దయ్యాలు పారిపోతాయని చెప్పిన తానే ఇలా భయపడితే ఎలా అనుకుంటూ, గుండెలు చిక్కబట్టుకుని, ఆంజనేయుడి మీద భారం వేసి, “భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జబ్ నామ సునావై” అని చాలీసా వల్లిస్తూ కాలిబాట దిగి, రోడ్డుకి అటువైపుకు గబగబ అడుగులు వేసిందామె.

అప్పుడప్పుడు అటు ఇటు పరుగులు తీసే ఉడతలు, సకృత్తుగా కనబడే కుందేళ్ళు తప్ప మనుషుల జాడే కనబడని ఆ దారిలో ‘మరో పది అడుగులు వేసి వెనక్కి పోదాము’ అనుకుంటూ ముందుకే అడుగులు వేసింది.

కాస్త దూరం వచ్చేసరికి వున్నట్టుండి పక్కనుండి “హై గుడ్ ఈవెనింగ్” అని బొంగురు గొంతు వినబడి ‘అమ్మయ్య’ అనుకుంటూ అటువైపు చూసింది ఆ ఇంటివాళ్ళు ఎవరో వచ్చారనుకుని.

అక్కడ ఆమెకు కనబడిన దృశ్యం చూసి ఆవిడ గుండె కొట్టుకోవడం ఒక క్షణం ఆగిపోయింది.

ఆ ఇంటి ముందు వేసివున్న ఇనప సోఫాలో నిక్కరు, చొక్కా వేసుకుని విలాసంగా కాళ్ళు ముందుకు జాపి కూర్చుని కనిపించింది మరో అస్థిపంజరం.

ఎడమ చేయి సోఫా హాండ్ రెస్ట్ మీద సుఖంగా చాపుకుని, కుడిచేయి పైకి ఎత్తి పట్టుకుని, హాయ్ అని పలుకరిస్తున్న భంగిమలో వున్న అస్థిపంజరం మరోసారి “హాయ్ గుడ్ ఈవెనింగ్” అంది బొంగురు గొంతుతో.

మసక చీకటి పడుతున్న వేళలో, నర సంచారమంటూ లేని వీధిలో, నడిచే దారికి పక్కగా లోతుగా పారుతున్న కేనీ క్రీక్ లోని నీళ్ళ సవ్వడి ‘వెనుక వాయిద్యం’గా వినిపిస్తుంటే ఎదురైన ఈ సన్నివేశం ఆవిడను ఒకలాటి భ్రమలో పడేసింది.

అటు చూస్తే గొయ్యి, ఇటు చూస్తే నుయ్యి అన్నట్టు వున్న పరిస్థితిలో వెనక్కి పరిగెత్తాలా ముందుకు దూకాలో తోచక చెవులు రెండూ గట్టిగా మూసుకుని “శాకినీ ఢాకినీ గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి” అనీ పైకే గట్టిగా పలుకుతూ కాలిబాట నుండి గభాలున ఒక్క అంగలో రోడ్డుమీదకి వచ్చి పడ్దారు మంగమ్మగారు.

అప్పుడెప్పుడో చూసిన గీతాంజలి సినిమాలో “నంది కొండ వాగుల్లోన, నల్ల తుమ్మ నీడల్లొన చంద్రవంక కోనల్లొనా, సందెపొద్దు చీకట్లో నీడల్లే వున్నా.. నీతో వస్తున్నా” అంటూ సమాధులలో నుండి పైకి లేచిన ఆకారాలు కళ్ళ ముందు మెదిలి ఆవిడ ఒళ్ళు గగుర్పొడిచింది.

“శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రభావం” అంటూ వణుకుతున్న గొంతుతో పలుకుతూ ఇంటి దారి పట్టి గబ గబా నడవడం మొదలు పెట్టింది.

ప్రైవసీ కోసం ప్రాకులాడే వాళ్లకు వరంలా ఒక ఇంటికి మరొక ఇల్లు మరొకటి అంత దూరాన వుండేట్టు కింద బేస్మెంట్, నడుమ లివింగ్ ఏరియా, పైన నాలుగు, క్రింద మెట్లు ఎక్కలేని పెద్దవాళ్ళకోసం వున్న పడక గదితో కలిపి అయిదు పడక గదులతో కట్టిన విశాలమైన ఇళ్ళతో, ఇళ్ళ వెనుక చిన్నపాటి అడవిలా పెరిగిన గుబురైన వృక్షాలతో, సతత హరిత వనంలా ప్రకృతి అందాలను కళ్ళముందు ఆవిష్కరించే ఆ చోటు చీకటి పడే వేళలో ఇలా భీతిగొలిపేలా కనబడడం ఆవిడకే ఆశ్చర్యంగా వుంది.

ఇంటి దగ్గరకు వస్తుండగానే మూడో ఇంటిముందు ఖాళీ స్థలంలో సమాధుల మీది పలకల్లాటి పొడుగైన రాళ్ళు పాతి, వాటిపక్కన కర్రలకు నల్లని బూజులు వ్రేలాడదీసి వుండడం కనబడింది.

ఇంతలో సాయంకాలం తను నడక మొదలు పెట్టినప్పుడు ఖాళీగా కనిపించిన తమ ఎదురింటి ముందు భాగంలో నిలువెత్తు పక్షి ఒకటి నిలబడి పెద్ద రెక్కలు కదుపుతూ, మెడ అటు ఇటు తిప్పుతూ, తలలో వున్న ఒంటికన్ను మెరుస్తుండగా తనవైపే చూస్తూ కనబడింది. కదిలితే కోడిపిల్లని తన్నుకు పోయినట్టు కాళివ్రేళ్ళ మధ్యన ఇరికించుకు ఎగిరిపోయేంత భీకరంగా వుంది.

అంతలో ఎవరో దూరం నుండి మీట నొక్కినట్టు తమ పక్కింటి ముందు నేలమీద నుండి రాకాసి గుర్రంలా కనిపించే ఒంటి కొమ్ము జంతువు (యూనికార్న్) మెల్లిగా పైకి లేవడం చూసి మంగమ్మగారి గుండె జారిపోయింది.

ఆ జంతువు పొట్టలో దీపం వెలుగుతున్నట్టు కనిపించిన వెలుగులో కంకాళాలు నాట్యం మొదలు పెట్టాయి. వాటికి వాద్య సంగీతంగా భయం కలిగించే ధ్వనులు తోడు కావడంతో గజ గజ వణుకుతున్న కాళ్ళు ఎలాగో కదిలించి తమ గుమ్మం లోకి వచ్చి పడింది ఆమె.

ఇల్లు దగ్గరవుతుండంతో కాస్త ధైర్యం వచ్చిందామెకు. వున్నట్టుండి ఆమె బుర్రలో దీపం వెలిగింది. గత వారం రోజులుగా తను బయటకు అడుగు పెట్టలేదు గనుక గమనించలేదు. ఇది హాలోవీన్ సమయం అని మరచి పోయింది.

తాను పుట్టి పెరిగిన దేశంలో బొమ్మల కొలువుల్లో బొమ్మలు పేర్చిన మెట్లకి ఒక పక్కన చిన్న పెళ్ళిపందిరి ఏర్పాటు చేసి, అందులో పెళ్ళికొడుకు బొమ్మ, పెళ్ళికూతురు బొమ్మ పీటల మీద కూర్చోబెట్టి, ఎదురుగా పెళ్ళికి వచ్చిన స్త్రీ, పురుషుల బొమ్మలు, పురోహితుడు, ఒక పక్కన డోలు సన్నాయి వాయించే వారి బొమ్మలూ పెట్టడం చూసింది. అలాగే మరో పక్కన కాస్త మట్టి పోసి, చుట్టూ ఆవగింజలు మొలకెత్తించి ఉద్యానవనంలా ఏర్పాటు చేసి అందులో బల్లల మీద బొమ్మలను కూర్చోబెట్టడం తెలుసు, అలాగే దసరాకు ఇళ్ళముందుకు వచ్చే పులి వేషగాళ్ళను, ఆడవేషంలో వచ్చే పగటి వేషగాళ్ళను చూసింది గానీ ఇలా సమాధులు, శ్మశానాలు, భయం గొలిపే జంతువులు, పక్షులు పెట్టడం చూడలేదామె.

తమ ఇంటి ముంగిటికి చేరాక మంగమ్మగారి గుండె కాస్త కుదుట బడింది.

‘అమ్మయ్య’ అని పెద్ద నిటూర్పు వదిలిందామె.

ఎందుకన్నా మంచిదని వెనక్కి తిరిగి చూడకుండా, కళ్ళు మూసుకుని, “సూక్ష్మ రూపధరి సియహి దిఖావ, వికట రూపధరి లంక జలావా, భీమ రూప ధరి అసుర సంహారే” అని హనుమాన్ చాలీసా వల్లిస్తూ, తమ ఇంటిగుమ్మం ముందున్న నాలుగు మెట్లు ఎక్కి కళ్ళు తెరిచారు మంగమ్మగారు.

రాక రాక వచ్చిన అతిధిని పలుకరిస్తున్నట్టు వీధి గుమ్మానికి అటు,ఇటు తియ్య గుమ్మడి కాయంత ముఖంలో, దీపాల లాగా వెలుగుతున్న ఎర్రని కళ్ళతో నేలమీద మొలచినట్టున్న రెండు తలలు కిల కిల నవ్వాయి.

“జయ హనుమాన్ జయ హనుమాన్” అని వణుకుతున్న గొంతుతో పలుకుతూ, తలుపుతోసుకుని లోపల పడిపోతే చాలు ననుకుంటూ అడుగు లోపలికి వేసిందామె.

చీకటిగా వుంది ముందు హాలు.

అంతలో తల మీద కొమ్ములు, ముఖాన వికటహాసంతో నల్లని స్కేరీ జోకర్ ముసుగుతో వున్న నాలుగు అడుగుల ఆకారం ‘హాయ్’ అంటూ మంగమ్మగారిని రెండు చేతులతో ఆలింగనం చేసుకుంది.

ఆవిడ బెదిరిపోయి కెవ్వుమని అరిచే లోపల “ఒరేయ్ అమ్మమ్మని అలా బెదిరించకు” అంటూ అమ్మలు హాల్లో దీపం స్విచ్ వేసింది.

“అమ్మమ్మా! హౌ డు యు లైక్ మై కాస్ట్యూం?” అంటూ ముఖానికి వున్న ముసుగు తీసాడు ఆమె మనవడు.

“చాలా బావుంది నాన్నా!” అని సోఫాలో కూలబడి “అమ్మలూ కాసిని మంచి నీళ్ళు ఇవ్వు తల్లీ!” అన్నారు మంగమ్మగారు నీరసంగా.

ఇంతలో వీధిగుమ్మంలో పిలుపు గంట మోగింది.

ఉలికిపడి నిఠారుగా కూర్చున్నారు మంగమ్మగారు..

ఆమె మనవడు పరుగున వెళ్ళి తలుపుతీసాడు.

తలుపుకు అవతల భయం గొలిపే రకరకాల వేషాలలో పిల్లల గుంపు ప్రత్యక్షం అయ్యింది “ట్రిక్ ఆర్ ట్రీట్” అని అరుస్తూ.

మంగమ్మగారు నోరు తెరుచుకుని చూస్తుండగానే, అమ్మలు చాకొలెట్స్ నింపిన బుట్ట వాళ్ళ ముందు వుంచింది.

సందడిగా కలబడి, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని, మరో ఇంటి మీదకు వెళ్ళిపోయిందా పిల్లల దండు.

“అమ్మా! అమ్మమ్మ చెప్పేది వాళ్ళ చిన్నప్పుడు దసరాకు బడిపిల్లలు మాస్టారుతో కలిసి ఇలా గుంపుగా ఇళ్ళకు వచ్చేవారటగా, ‘అయ్యవారికి చాలు అయిదు వరహాలు పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు’ అని పాడుతూ” నవ్వుతూ అంది అమ్మలు.

“అవును. మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు మా తాతగారి పల్లెలో మేమూ వెళ్ళేవాళ్ళం.” దయ్యాల గోల మరచిపోయి నవ్వుముఖంతో అన్నారు మంగమ్మగారు.

“బాయ్ మమ్మీ” అంటూ ఆ గుంపును కలుసుకోవడానికి బయటకు పరిగెడుతున్న మనవడి వెంట నడుస్తూ “భయమేస్తే జై హనుమాన్ అనుకో నాన్నా!” అని గుర్తుచేసారు మంగమ్మగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here