భక్తి, కవిత్వం కలగలిసిన ‘హనుమాన్ చాలీసా మొగ్గలు’

0
12

[dropcap]భా[/dropcap]రతీయ సాహిత్యంలో భక్తి, కవిత్వం జంటగా సాగాయి. ఎందరో భక్తాగ్రేసులు ఎన్నో భక్తి సంబంధిత కావ్యాలు వెలయించారు. ప్రాచీనులు భక్తితో కూడిన ఛందోబద్ధ కావ్యాలు వ్రాశారు, ఆధునికులు సభక్తికంగా సరళ కవిత్వమూ, తేలికపాటి వచనమూ అందించారు. వచన కవిత్వం పొందిన అనేక రూపాలలో మొగ్గలు ప్రక్రియ ఒకటి.

మన దేశంలో ఆంజనేయస్వామిని దైవంగా ఆరాధించేవారికి కొదవ లేదు. రామభక్తులందరూ హనుమంతుని ఆశ్రితులే. అందుకే ‘రామచరిత్ మానస్’ అనే రాముని కథని అవధి భాషలో రాసిన తులసీదాసే, స్వయంగా హనుమాన్ చాలీసాని కూడా అందించారు. రామనామంతో పాటు దేశమంతా హనుమాన్ చాలీసా కూడా వినిపిస్తుంది.

తులసీదాస్ హనుమాన్ చాలీసాని ఎమ్.ఎస్. రామారావు గారు తేట తెలుగులో అనువదించి, పాడి తరించారు, తరింపజేశారు.

ఇప్పుడు ఆయన బాటలోనే నడిచారు విశ్రాంత హిందీ పండిట్ శ్రీ కాటేగారి పాండురంగ విఠల్. హనుమాన్ చాలీసాని సరళంగా అనువదించి మొగ్గలు ప్రక్రియలో అందించారు.

ఈ పుస్తకానికి తమ ముందుమాటలో హనుమాన్ చాలీసా గొప్పతనాన్ని వివరించారు డా. భీంపల్లి శ్రీకాంత్.

తాను సాహితీరంగంలో ప్రవేశించి కొద్దికాలమే అయిందని, తాను మొదట ‘మణిపూసలు’ ప్రక్రియలో రచనలు చేపట్టానని రచయిత ‘నా మాట’లో తెలిపారు. మణిపూసలు ప్రక్రియ తర్వాత, సమ్మోహనాలు ప్రక్రియ, ఆ పిమ్మల మొగ్గలు ప్రక్రియలో అడుగుపెట్టినట్లు తెలిపారు. శ్రీమద్రామాయణాన్ని 2000 మొగ్గలలో రచించినట్లు తెలిపారు.

డా. భీంపల్లి శ్రీకాంత్ ప్రేరణతో  హనుమాన్ చాలీసాని మొగ్గలు ప్రక్రియలో రచించినట్లు విఠల్ తెలిపారు.

హనుమాన్ చాలీసాలోని ఒక్కో శ్లోకానికి చక్కని హనుమంతుని బొమ్మతో పాటు మొగ్గల ప్రక్రియలో చక్కని తెలుగు అనువాదం అందించారు విఠల్.

మూలంలోని ఒక్కో శ్లోకానికి మూడు పాదాల మొగ్గలులో తెలుగులో భావాన్ని అందించడం జరిగింది.

ఈ ప్రక్రియలో హనుమాన్ చాలీసా అచ్చమైన తెలుగులోకి అందంగా ఒదిగింది.

కొన్ని ఉదాహరణలు చూద్దాం.

“జయ హనుమాన జ్ఞాన గుణ సాగర।/ జయ కపీశ తిహు లోక ఉజాగర॥” అనే శ్లోకానికి “జ్ఞాన గుణములయందు సాగరుడై/ముల్లోకాలకు ప్రకాశమందించును/జ్ఞాన గుణ తేజో ప్రదాత కపీశుడు” అని మొగ్గలలో చెప్పారు.

“కంచన వరణ విరాజ సువేశా।/కానన కుండల కుంచిత కేశా॥” అనే శ్లోకాన్ని మొగ్గలలో – “స్వర్ణవర్ణుడై చెవుల కుండలములతో/ఉంగరాల నల్లని జుత్తుతో విరాజిల్లును/బంగారపు మేనితో శోభిల్లువాడు మారుతి” అని వ్రాశారు.

“విద్యావాన గుణీ అతి చాతుర।/రామ కాజ కరివే కో ఆతుర॥” అనే శ్లోకాన్ని “విద్యావంతుడు చతుర గుణవంతుడై/రామకార్యంను/విజయవంతం చేసేను/అతి చతురుడు శ్రీరామునికి దాసుడు” అని తెలుగులో రాశారు.

“రఘుపతి కీన్హీ బహుత బడాయీ।/తుమ మమ ప్రియ భరత సమ భాయీ॥” అనే శ్లోకానికి తెలుగులో – “రఘుపతి నిన్ను ఎంతో గొప్పగా పొగడి/భరతుని సమాన సోదరుడివని చెప్పెను/రాముని ప్రేమాభిమానాలు పొందె మారుతి” అని చెప్పారు.

తేట తెలుగులో హనుమాన్ చాలీసాని మొగ్గలు ప్రక్రియలో చదవడం గొప్ప అనుభవం. పుస్తకం చివర్లో హనుమన్ దండకం, హనుమాన్ అష్టోత్తర శతనామావళి పాఠకులకు అందించారు.

పుస్తకాన్ని సిందూరవర్ణంలో ముద్రించడం విశేషం.

***

హనుమాన్ చాలీసా (మొగ్గలు)
కాటేగారి పాండురంగ విఠల్
ప్రచురణ: పాలమూరు సాహితి, మహబూబ్‌నగర్
పేజీలు: 64
వెల: 30/-
ప్రతులకు:
డా. భీంపల్లి శ్రీకాంత్,
ఇం.నెం. 8-5-38, టీచర్స్ కాలనీ,
మహబూబ్‌నగర్
ఫోన్: 9032844017
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here