హర హర మహాదేవ – రేడియో నాటిక – శ్రావ్య సుందర వీక్షణం

0
13

[box type=’note’ fontsize=’16’] మహా శివరాత్రి సందర్భంగా – శ్రీ శంకరమంచి సత్యం గారు రచించిన ‘హర హర మహాదేవ’ రేడియో నాటికలోని విశేషాలను అందిస్తున్నారు శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల. [/box]

[dropcap]హా[/dropcap]యిగా కళ్ళు మూసుకుని కూచుంటే అనేక దృశ్యాల అనుభవం కలిగిస్తుంది రేడియో నాటకం. సామాజిక సంఘర్షణలను సామాన్యుని పరిధికి తెస్తుంది.

రేడియో దూరాన్నే కాదు కాలాన్ని కూడా జయించింది. భౌతిక దూరం అనివార్యమైన ఆపన్న కాలంలో పూర్వ నాటకాలను ఆకాశవాణి ప్రసారంలో వింటుంటే అపూర్వమైన అనుభూతి కలుగుతుంది.

అమరావతి పేరు వినగానే అపురూప శిల్పాల ప్రసక్తి వస్తుంది. కాని 1980 తరువాత అమరావతి పేరు వింటే సాహిత్య పాఠకులకు సత్యం శంకరమంచి గారి పేరు జ్ఞాపకం రావటం మొదలయింది అన్నారు వావిలాల సుబ్బారావు గారు. సత్యం శంకరమంచి గారి కథలను చదువుతుంటే సున్నితమైన స్పందన కలుగుతుంది. మట్టి వాసనల పరిమళానికి దృశ్య రూపం కలుగుతుంది.

శ్రీ శంకరమంచి సత్యం గారి రచన, నిర్వహణ పర్యవేక్షణలో వచ్చిన రేడియో నాటిక ‘హరహర మహాదేవ’. 1972-73 ప్రాంతంలో ఈ నాటకాన్ని సత్యం గారు రాసారు. ఈ నాటకం విజయవాడ, హైదరాబాదు, కడప, కేంద్రాల ద్వారా 1976లో ప్రసారమయింది. రేడియోలో ఒక గంట కాలావధిలో వినిపించిన ఈ నాటిక అపార స్పందనను కలిగించింది. “హర హర మహా దేవ” బాగా ప్రాచుర్యం పొందిన తరువాత గుంటూరు లోని ఒక నాటకాభిమాని ప్రోత్సాహంతో, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు రెండు గంటల స్టేజి నాటకంగా రచించారు. స్టేజి మీద ఈ నాటకం చాలా పర్యాయాలు ప్రదర్శనను పొందింది.

‘హర హర మహాదేవ’ పంచారామాలలో ఒకటైన అమరారామం నేపథ్యంగా గల అపురూపమైన శ్రవ్య నాటకం. శంకరమంచి సత్యం గారికి బాగా పరిచయమున్న వారు ఆయన అమరావతి కథల కంటే ‘హర హర మహాదేవ’ నాటకాన్నే తన ముఖ్య రచనగా ఇష్టపడేవారని చెప్తారు. ఒక రకంగా ఇది శంకరమంచి సత్యం గారి ఆత్మకథా రూపకమైన నాటకం అనవచ్చునని అభిప్రాయ పడ్డారు. ‘హర హర మహాదేవ’ రేడియో నాటికను పరిశీలించడమే ఈ వ్యాస ఉద్దేశం.

నాటిక కథ:

సంక్షిప్తంగా ‘హర హర మహాదేవ’ రూపకం వ్యవస్థలోని తారతమ్యాన్ని గురించి ఆలోచనలను కలిగిస్తుంది. అర్చకుల దైవభక్తిని నిరూపిస్తుంది. ధర్మకర్తల అహంభావాన్ని ప్రదర్శిస్తుంది. సంఘంలో కలుగ వలసిన మార్పును చర్చిస్తుంది. పేదల ఆత్మీయతను, నిర్మల మైన అంతరంగాన్నీ చూపుతుంది. ధర్మ కర్తలు దేవాలయం ద్వారా సంక్రమించే ఆస్తిని తమ స్వంత విషయాలకు వాడుకోవడం, అర్చకులను అవమానించడం, కులాంతర వివాహాన్ని అడ్డుకోవడం మొదలయిన అంశాలను, ప్రయోక్త మైన పాత్రలతో, ప్రాసంగిక విలువలతో ధ్వని పూర్వకంగా మనసుకు హత్తుకునే చిత్రానికి శబ్ద కల్పన చేస్తుంది.

నాటికా నిర్వహణ:

ప్రశాంతమైన ఉదయ రాగాల నేపథ్యంతో గుడిగంటల శ్రావ్య ధ్వనితో శివస్తుతితో ఈ నాటిక ఆరంభ మవుతుంది. పూజారి మహదేవయ్య ,కుమార స్వామితో, సీత ఇంకా పూలను తేలేదా? అని అడుగుతాడు.

సీత పూజకు పూలను తీసుకుని వస్తుంది. సీత ఎక్కడ పుట్టిందో ఎలా పెరిగిందో వివరాలు తెలియవు. వానొచ్చినా వరదొచ్చినా వేళకు పూలను తెస్తుంది. అంత చిన్న వయసులో ఈశ్వరుడు కల్పించిన భక్తి సీతది.

పూజ మంత్ర నిష్ఠతో కొన సాగింది. ఈ జన్మలో ఈశ్వరుని సేవా భాగ్యం కలిగింది. జన్మ జన్మలకూ ఆ భాగ్యం కలిగించమని వేడుకున్నాడు పూజారి మహదేవయ్య.

సీతకు సాంబనికి పూలు సమర్పించుకుంటే గాని తెల్లవారి నట్లుండదు. సీత తెచ్చిన పూలతో అర్చిస్తే తప్ప పూజారికి తనివి తీరదు. ఆ స్వామి మొహం నవ్వినట్లుండదు.

సీత వెళ్ళి వస్తానని సెలవు నడిగింది. వెళ్ళిరా అని దీవెనలిచ్చాడు మహదేవయ్య.

ఇప్పుడింకొక ప్రధాన కథా సందర్భం మొదలవుతుంది.

పూజారి గారి కొడుకు కుమార స్వామి, వెళ్ళబోతున్న సీతను ఆపి “ఓయ్ సీతా నన్ను సెలవడగలేదేం” అని చనువుగా అంటాడు. సీత నవ్వుతూ, “నువ్వు చిన్న స్వామివి కదా” అని గేలిచేసింది. చిన్నస్వామి సీతకు మందారపువ్వునిచ్చి సిగలో తురుముకోమంటాడు. సీత శివ పార్వతులను అమ్మ అయ్యలని సంబోధిస్తూ వాళ్ళిద్దరూ ఒకటే కదా అని అమాయకంగా అంటుంది.

అందుకు కుమార స్వామి తనకా విషయం తెలియదనీ తానింకా ఒంటరిననీ చెప్పి, తానిప్పుడు జంటను కోరుతున్నట్లు సూచిస్తాడు. సీత చిలిపిగా నవ్వుతూ వెళ్ళిపోతుంది.

పూజారి అనుష్ఠానానికి కదిలాడు. బాబాయి ప్రసక్తి వచ్చింది. మాటలవల్ల బాబాయి ఆచార, వ్యవహారాల పట్ల స్వతంత్రుడని, ప్రకటమవుతుంది. బాబాయి పేరు శివయ్య.

మేనేజింగ్ ట్రస్టీ వీరాస్వామి గుళ్ళో పరిశుభ్రత లేదని విసుక్కుంటూ ప్రవేశిస్తాడు. కుమార స్వామి బాబాయికి ఆయన రాకను గురించి హెచ్చరిస్తాడు.

ఆయనకి చెప్పాల్సిన మంత్రపుష్పం నాదగ్గరుందిలే అంటూ బాబాయి, ఆయన గుట్టు తనకు తెలిసినట్లు తేలికగా మాట్లాడుతాడు.

శివయ్య వీరాస్వామికి దండం పెట్టడు. అది ఆ ట్రస్టీకి ఇబ్బందిగా ఉంటుంది. చీటీని తీసుకోకుండానే హారతి నిమ్మంటాడు. శివయ్య ఉచిత కర్పూరం లేదని ఎదురు మాటలాడుతుండగా మహదేవయ్య వచ్చి తాను అర్చన చేస్తానంటాడు.

అర్చకుడంటే అలా ఉండాలంటాడు వీరయ్య. మహదేవయ్య సౌజన్యమూర్తి. భక్తిపరుడు. శివయ్య లౌకికుడు. కుమార స్వామి యౌవనంలో ఉన్న లలిత భావావేశ పరుడు. సీత ముగ్ధ. కోమలి. వీరాస్వామి స్వార్ధపరుడు. లోభి. ఇలా మొదటి ఘట్టంలో ముఖ్య పాత్రల పరిచయ సంభాషణలు వ్యక్తిత్వానికి రూపు దిద్ది నాటిక వస్తు సంవిధానానికి గట్టి ప్రాతి పదికను వేశాయి.

ఇప్పుడు మరొక సన్నివేశం ఆరంభం అవుతుంది.

వీరాస్వామి అసిస్టెంటు సుబ్బారావుతో ఎక్సిక్యుటివ్ ఆఫీసర్‌ని పిలవమంటాడు. ఆయన వచ్చాక ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తాడు. రాత్రి ఈశ్వరుడు కల్లో కనుపించి మహా పుణ్యక్షేత్రం అయిన ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టమని నిర్దేశించాడంటాడు.

ఆఫీసరు నిజాయితీగా దేవాలయం శిధిలావస్థలో ఉందనీ తప్పక ఆ పని చేపట్టాలని అంటాడు. వీరస్వామి నానుస్తూ నిర్మాణ పథకాలను చెప్తాడు. ఆయన చెప్పిన వన్నీ చేయడానికి చాలా ఖర్చు అవుతుందని అన్న ఆఫీసరుతో వెటకారం చేస్తూ టెండర్లు వేయడం తమకు అలవాటు లేదని మనసులోని గుట్టు విప్పుతాడు వీరాస్వామి.

నిధులు సంపాదించాడానికి సమయం పడుతుంది కనుక ప్రస్తుతం ఆఫీసరు దగ్గరున్న ఆలయ ఆదాయం అయిదు వేలను ఇమ్మంటాడు.

బోర్డ్ మీటింగ్ అక్కర లేదంటాడు, తాను ఆలయాన్ని బాగు చేయాలని తపన పడుతుంటే అడ్డంకు లెందుకని అంటాడు. ఆతని మాటలను సుబ్బారావు సమర్థిస్తాడు.

సుబ్బారావు కొత్త ఆఫీసర్‌కు వీరాస్వామి ఎలాంటివాడో చెప్తాడు. “ఆయన మెల్లగా మాట్లాడితే పాము బుస గొట్టినట్టుంటుందనీ పెద్దగా మాట్లాడితే సింహం గర్జించినట్లు అంటాడు”. ఆయనను కాదంటే ఈ పరగణాలో పచ్చి మంచినీళ్ళు పుట్టవు, పోటీ పడ్డ వాళ్ళ ఎడ్రసన్నది ఇపుడు లేదంటాడు.

అన్నీ సక్రమంగా జరిగినట్టు తప్పుడు రికార్డులు చూపించడం ఇంతవరకు వీరాస్వామి చేస్తున్న పని. ఎదిరించడానికి, బెదిరించాడానికి ఆఫీసర్ తన సమఉజ్జీ కాడంటూ అహంకారం చూపుతాడు. ఆఫీసర్‌ను భయ పెడతాడు.

నేరాలు అపవాదులు వేసి డబ్బు స్వాహా చేసినట్లు ఋజువు చేస్తానంటాడు. ఉద్యోగం తీయించేస్తానంటాడు. తేడా వస్తే ఊరు పొలిమేర కూడా దాటి పోలేరంటాడు. తనకెవ్వరూ ఎదురు తిరగలేరంటాడు. తాము చేస్తున్న పని తప్పు కాదంటూ ఆఫీసరును తెలివిగా బుజ్జగిస్తాడు. తానొక్కడేకాదు ఆఫీసర్‌కు కూడా భాగం ఇస్తానంటాడు. ఆఫీసరు వీరాస్వామి మాటలకు లోబడక తప్పలేదు.

ఆలయాని కొచ్చే ఆదాయాన్ని మోస మార్గాలలో పెంచే ఉపాయాన్ని ఆలోచిస్తాడు. ఉచితంగా పంచే ప్రసాదాల అమ్మకానికి చీట్లు పెట్టే ఉపాయం బాగుందనుకుంటాడు వీరాస్వామి. ప్రసాదాల అమ్మకానికి గుడి గోపురం పక్కనున్న ఆ స్థలాన్ని కాజేయాలని ఆలోచిస్తాడు. ఈ ప్రసాదాల అమ్మకం విషయంలో అర్చకుల సహాయం కావాలంటాడు సుబ్బారావు. మహదేవయ్య భక్తుడు లౌకిక విషయాలేమీ పట్టవు, తమ్ముడు శివయ్య చేష్టలను సాగనివ్వ కూడదంటాడు.

వారి ప్రసంగంలో శివయ్యకు దేవదాసి మనోరంజనితో సంబంధం ఉందని వెల్లడి అవుతుంది. ఆ సంబంధాన్ని కొన సాగనివ్వకూడదని దురాలోచన చేస్తాడు వీరాస్వామి.

రంగం మారుతుంది గుడి ప్రాంగణం: శివయ్యను వీరా స్వామి పిలిచాడు.

శివయ్య ఆర్చకుడు ఉండవలసిన తీరులో లేడని హెచ్చరించబోతాడు. “లేకపోతే నా పాపాన నేనే పోతానంటాడు” శివయ్య. మనోరంజనితో వ్యవహారం ఏమటని ధిక్కరిస్తాడు వీరాస్వామి.

ఆమె నా సహ ధర్మచారిణి లాంటిదంటాడు శివయ్య.

శివయ్య తాను చేసే చేష్టలన్నీ అందరికీ తెలిసేటట్టే చేస్తానంటాడు. ఆభ్యుదయ భావాలు కలిగిన శివయ్య వీరాసామితో సాగించిన సంభాషణ కట్టె విరిచి పొయిలో పెట్టినట్లు ఉంటుంది. దేవదాసితో సంతానాన్ని కనాలని శివయ్య బాహాటంగా వీరాసామితో అనడం రచయిత ఆశించిన ఆదర్శాన్ని తెలుపుతుంది. వారిరువురి మాటల్లో ఒకరికున్న నిక్కచ్చితనం, మరొకరి దౌష్ట్యం వ్యక్తం అవుతాయి

గుడి గోపురం పక్కనున్న స్థలం: జోగి గంగన్న తాత తంత్రిని మీటుతూ శివుని తత్వ పదం ఆలపిస్తుంటాడు.

అన్నీ అర్పిస్తావు నరుడా నీవు

ఆత్మ నర్పింపవె పామరుడా ::-

జోగితో కలిసి సీత గొంతు కలుపుతుంది.

కళ్ళు లేని జోగి గంగన్న ప్రకృతి నాదాలలో తనకు శివుడు కనిపిస్తాడంటాడు.

సీతనతడు పెంచాడు. గంగన్నకు సీత ఆప్తురాలు. పెళ్ళి అయి అత్తగారింటికి తనతో పాటు జోగిని తీసుకుని వెళ్తా నంటుంది సీత.

చక్కని పాట -“గంధమునివరమ్మా కామినిలార. ……” సమయ నిర్దేశనను కావిస్తూ సంగీతం వినిపిస్తుంది.

కుమార స్వామిని కృష్ణుడు మన్నెందుకు తిన్నాడని అడుగుతుంది సీత. అది ఆకలికి కాదు, కృష్ణుడు వియోగాన్ని సహించ లేక భూదేవిని కలుసుకున్నా డంటాడు. విరహం సంగతి పెళ్ళి అయితే తెలుస్తుందని మనసులో సీత మీదున్న ప్రేమను ఉద్వేగ భరితంగా మాటల్లో వ్యక్తం చేస్తాడు.

రంగం మారుతుంది:

క్లబ్బులో పాశ్చాత్య సంగీతం వినిపిస్తుంది. కుమార స్వామి మిత్రులతో. సరదాగా ఉంటాడు. యువకుల సంభాషణ కులాంతర వివాహాల ప్రస్తావనతో ఆహ్లాదంగా సాగింది.

“కుమార స్వామి వేషం బాగలేదంటాడు. క్రాఫ్ పనికి రాదంటాడు” వీరాస్వామి.

తనను విమర్శిస్తున్న వీరాస్వామితో వాళ్ళబ్బాయి తనూ కలిసి చదువుకున్నారు. అతడిలా తానుంటే తప్పేమిటి? అంటాడు కుమార స్వామి.

తను అర్చక విధిని సక్రమంగా పాటి స్తున్నాడు. ఎవరి ఉద్యోగం వాళ్ళది. ఉద్యోగ సమయం అయిన తరువాత ఎవరి ఇష్టం వాళ్ళది అంటాడు. దేవుడి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్న మిగతా వాళ్ళు కూడా ముండనం చేయించుకుంటే తానూ చేయించుకుంటా నంటాడు. ఈ వాదన వీరాస్వామికి నచ్చదు.

గాలి గోపురం పక్కనున్న ఆ స్థలం గుడ్డి గంగన్నదని వాకబు చేసి తెలుసుకుని వచ్చి చెప్తాడు సుబ్బారావు. సులభంగా ఆ స్థలాన్ని చవకగా కొట్టేయవచ్చంటాడు.

రంగం మారుతుంది :

గంగన్న ఆ స్థలం ప్రసాద విక్రయాలకు ఇవ్వను అంటాడు.

డబ్బు తనకు వద్దంటాడు. తను సంపాదించిన డబ్బునే దానం చేస్తున్నానంటాడు.. పండుగలకు పబ్బాలకు బిచ్చగాళ్ళక్కడ ఉండి వండుకుని తిని పడుకుంటారు. ఆ స్థలం అమ్మే హక్కు తనకు లేదంటాడు.

ప్రసాదం తప్ప ఇంకేమీ ముట్టని గంగన్నకు ప్రసాదం దక్కనీయనీయడు వీరాస్వామి.

ఈశ్వర ప్రసాదం తప్ప ముట్టని గంగన్న ఆకలితో నీరసించాడు. అధికారులు తనకెందుకు అన్యాయం చేసారో తెలియని అల్లాడి పోయాడు.

మహాదేవయ్య తాను తెచ్చిన మహానివేదనను గంగన్నకు ఇవ్వబోయాడు. వాడిని ముట్టుకున్నందుకు వీరాస్వామి నిందిస్తాడు.

మహా దేవయ్య తన చేతుల తో గంగన్నకు తినిపిస్తాడు.

గంగన్న ఆనంద పరవశుడవు తాడు.

“దేవ దేవునకు గంధములివ్వరమ్మ.. భావములు చిగురింపగా …” సంగీతం వినిపిస్తుంది.

ప్రతి రోజూ సాయంత్రం సీతా కుమారస్వామి కలుసుకుంటున్నారు

గంధమాదన పర్వతం ఆయన పాదాల వద్ద ఉండగా ఆయన వేరే గంధం అద్దుకోవాలా? సీత కెప్పుడూ కలిగే సందేహమే కలుగుతుంది. పార్వతీ దేవే స్వయంగా అర్పిస్తే ఆ పరిమళం గొప్పగా ఉంటుంది – కుమార స్వామి అన్యాపదేశంగా తన ప్రేమను తెలుపుతునే వుంటాడు.

ఇరువురు ప్రేమ పరవశులవుతారు. వెండి వెన్నెలలో మల్లెల వాన కురిసినట్లుంది అంటుంది సీత ..కుమార స్వామి చేయి పట్టుకుంటాడు.

మంచిముత్యానికి ఇసుకరేణువుకూ సామ్యం కాదంటుంది సీత. నన్ను చూడకుండా ఉండగలవా? వివశత్వంతో అడుగుతాడు.  ఉండలేను లేనంటుంది. సీత కుమార స్వామిని ఇష్టపడింది. కాని తామిరువురకూ గల అంతరాన్ని తలచి అతనితో ఇక ఎప్పుడూ కలవనని దుఃఖంతో వెళ్ళి పోతుంది.

మరొక సన్నివేశం:

చేసిన పుణ్యము నరుడా నీ చివరంట వచ్చేను నరుడా

ఏటికెదురీదేవు నరుడా…

జోగి పాటకు

దుఖం కూడుకున్న గొంతు కలుపుతుంది సీత.

గంగన్న కలవర పాటుతో, ఆమెను ఎవ్వరైన ఏమైనా అన్నారా! అని అడుగుతాడు

ఎవ్వరూ ఏమి అనలేదు. గడ్డిపువ్వును చందమామ పెళ్ళడతా నన్నాడంటుంది. తాను అతనితో ఇంక కలువనని వచ్చేసా నంటుంది.

గంగన్న నలుగురి విషయం తరువాత… ఒకరు బ్రాహ్మలయి మరొకరు కాకుండా పోతారా? ఇది పరమేశ్వరుని సంకల్పం చిన్నా పెద్దా అనేది సృష్టిలో లేదంటాడు. వెళ్ళి కుమార స్వామిని కలసి రమ్మంటాడు.

ఏకాంతమ్మున నీదు బోధనలకై ఏతెంచితిన్ కూర్మినన్ చేకోవే అమరావతీ పురవరా

అని స్తుతిని చేస్తున్న కుమార స్వామి దగ్గరకు సీత వస్తుంది.

ఇక ఎప్పుడూ రానని చెప్పినందుకు క్షమించ మంటుంది. కలిసిఉందామని అంటుంది

జడను లాగుతాడు. పూలు అతని ఒడిలో రాలాయి. ప్రకృతి పులకించింది.

ఇకనుంచి వేరొక పిల్లను కంట చూస్తివా ఊరుకోను అంటుంది.

రెండు కళ్ళూ నిన్ను చూడడానికే చాలటం లేదంటాడు

చిలిపి మాటలు సరస సంభాషణల తరువాత రస పరవశత్వంతో తన తనువు మనసు నిస్తానంటుంది.

ప్రకృతి నేపథ్యం కిలకిలలు వినిపిస్తాయి. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించారు.

ఆలయ ప్రాంగణం :

వర్ణ సంకరం ఒప్పుకోమంటూ పెద్దలు తీర్మానిస్తారు. అర్చకుడు కులాంతర వివాహం చేసుకుంటే గుడిలో యాత్రికులు అడుగు పెడతారా? పెద్దలు ప్రశ్నిస్తారు. పెద్దలకు బదులు చెపుతూ తన వయసున్న ఇతర యువకులకూ తనకూ తేడా ఏమిటంటాడు. అర్చకుడైనంత మాత్రాన మనస్సు కట్టేసుకోవాలా అడుగుతాడు. అర్చకుణ్ని హింసిస్తున్నారని అంటాడు కుమార స్వామి.

అర్చకుడంటే గౌరవ స్థానం లో ఉన్నాడు గనుక ఇటువంటివి చెల్లవని వారంటే అర్చకులను శఠగోపం పెట్టించుకుని పైసలు వసూలు చేసే బిచ్చగాడిలా చూస్తున్నారు, అర్చకునికి సమాజం ఇస్తున్న గౌరవాన్ని పరిశీలించమంటాడు. స్వేచ్ఛ వీలు లేదంటున్నారు…. అర్చకుడు ప్రాపంచిక సుఖాలకు అర్హుడు కాడా? ఆవేశం ధ్వనిస్తూ కుమార స్వామి జవాబు చెప్పమంటాడు. అర్చకుడు కూడా ఉప్పూ కారం తినే మనిషి. గ్రహించ మంటాడు.

వితండ వాదం చేస్తున్నాడంటారు.

ధర్మం నీతిని గురించి చెప్పిన వాళ్ళు దేవుని పేరిట వ్యాపారం చేస్తున్నారంటాడు.

వాళ్ళు చెప్పే నీతిని తిరస్కరిస్తున్నానంటాడు కుమార స్వామి.

మహ దేవయ్య ఈ వివాహం సమ్మతి కాదు. శివుని పూజకే తమ జీవితాలు దత్తం చేయాలి. తక్కినవన్నీ సుఖాలనిపించే కష్టాలు అని కొడుకుకు తాను నమ్మిన పూర్వాచార ప్రతిపత్తిని వివరించి నచ్చ జెప్ప బోతాడు. ప్రాపంచిక సుఖాల కోసం తప్పు దారి పట్టవద్దంటాడు.  విరాగివయ్యే అవకాశం కోల్పోకు అని అర్చకుల విధిని అనుసరించమని అంటాడు.

“ఈ కాలం లోకాన్ని చూడమని” తండ్రికి చెప్తాడు కుమార స్వామి. అమాయకురాలికి అన్యాయం చేయనంటూ తన నిశ్చయాన్ని తెలుపుతాడు.

ప్రగతి పరుడైన బాబయ్య మనసుకు నచ్చింది చేయమంటాడు. కుమార స్వామి ధైర్యం గా సీతను వివాహం చేసుకుంటాడు.

“సల్లలితాంగుడగు శివుండిల్లాలిన్ గూడి యుండె ఏకాంతమునన్ ….” పద్య నేపథ్యం సందర్భాన్ని సూచిస్తుంది.

స్వామిని భద్రంగా కాచి ఉండమని అష్ట దిక్పాలకులకు హెచ్చరిక వినవస్తుంది. “పార్వతి శివునితో మేలమాడిందట -నాకు అమ్మా, నాన్నా ఉన్నారు నీకు లేరు అని -అప్పుడు ఈశ్వరుడు నాకు అత్తా మామా ఉన్నారు నీకు లేరు అన్నాడట” – అనుకుంటూ ఒకరికొకరు తోడుగా జీవితం పంచుకోవాలని ఉల్లాసంగా తృప్తి పడ్డారు నవ దంపతులు.

తెల్లారితే శివరాత్రి, కృష్ణలో స్నానంచేసి శివుని దర్శించుకుందామా అంది సీత.

ఆ పుణ్య క్షేత్రం జనుల భక్తి నినాదాలతో కోలాహలంగా ఉంది. శివ దర్శనం చేయనున్న యువ దంపతులు కుమార స్వామి, సీతలను వీరాస్వామి ఆదేశంతో పెద్దలు అడ్డగిస్తారు.

ఈ పర్వదినాన దర్శనమే లేదా, నిషేధమా! ఇదివరలో ప్రతి నిత్యం తొలి పూజ చేసిన తనకు ఈ రోజు దర్శనం నిషేధమా? ఆవేదన చెందుతాడు కుమార స్వామి.

తాండవ నేపథ్యం ఢమరుక నాదం భక్తుని ఎదలోని కల్లోలాన్ని ప్రత్యక్షం చేస్తుంది.

వేలాది భక్తులలలో భ్రష్టులెవరో నిర్ణయించే అధికారం ఎవరిచ్చారంటూ కుమార స్వామి ఉగ్రుడయ్యాడు. ఈశ్వర దండకం ప్రతిధ్వనించింది.

కందర్ప దర్పహర శ్శరభశ్శరభా నినాదం. భక్తుల కోలాహలం పెచ్చు మీరింది.

నాన్నను అడిగాడు. శివరాత్రి నాడు స్వామిని చూడకుండా ఎలా ఉండగలను? విలపించాడు.

“దైవ దర్శనానికి డబ్బులు వెచ్చించలేక బయటనే ఉండి పోయిన భక్తులలో నువ్వూ ఒకడవే” అంటూ మహదేవయ్య పరిస్థితులకు తల వంచి, తొలగి పోతాడు.

ఆమె తెచ్చిన పూలు పనికి వచ్చినప్పుడు ఆమెకు నిషేధం ఎందుకు సమాధానం లేక పరితపించాడు కుమార స్వామి.

సాంబ సదాశివా! బయటకు రా మమ్మల్ని ఆదుకో అంటూ ఎలుగెత్తి పిలిచాడు

అపరాధం ఏమిటని పదే పదే విలపించాడు.

హృదయమందిరాల్లో నివసించు

కదిలి రా! అంటూ నినదించాడు. హరా కదలిరా అంటూ ప్రళయ గర్జనచేసాడు.

తర తరాల సంప్రదాయం మౌనం వహించింది.

వాగర్థావివ సంపృక్త మయిన ఆది దంపతుల కరుణతో కల కలం ఆగింది. వాతావరణం శాంత గంభీరమయింది.

శ్రవ్య నాటిక హర హర మహదేవ ముఖ్య కథాంశం దైవత్వానికీ, మానవత్వానికీ నడుమ గల సంఘర్షణను ప్రకటించింది. అనుకూల ప్రతికూల పాత్రల సంభాషణా ద్వంద్వ సమన్వయం కథా గతికి దోహద మయింది. సన్నివేశకల్పన సమర్థ వంతంగా నాటిక విలువలను పెంచింది. ముగింపు ఉత్కంఠను పెంపొందించింది.

హర హర మహాదేవ నాటిక వివిధ ఘట్టాల కూర్పుతో వస్త్వైక్యతను సాధించింది. సన్నివేశ కల్పనకు సంప్రదాయ సంగీతం భావానుగుణమైన తోడ్పాటును కలిగించింది. పాత్రధారుల వాచికం స్వభావ ప్రకటనను చేసి ఆంగిక మైన చేష్టలను కళ్ళ ఎదుటకు చేర్చింది. ఒక గొప్ప నాటకాన్ని శ్రుతి శుభగంగా వింటూ చూచిన తన్మయతలో అకలంక సమాజ దీక్షకు ఈశ్వరుడు దిగి వచ్చిన అనుభూతి కలుగుతుంది.

ఈ నాటిక నిరూపణకు సహాయకులు: సి. రామ్మోహనరావు, నండూరి సుబ్బారావు గార్లు: పాత్రధారులు: మహదేవయ్య శ్రీ సి. రామ్మోహనరావు, – శివయ్య ఎస్. పూర్ణానంద శాస్త్రి, – కుమార స్వామి ఏ బి ఆనంద్ – సీత వి బి కనక దుర్గ – వీరాస్వామి ఎం. వెంకటేశ్వరరావు, ఆఫీసర్ పున్నమరాజు శ్రీ హరనాథ్, – సుబ్బారావు ఎ. ఎస్. రామచంద్రరావు – గంగన్న శంకరమంచి సత్యం, – వెంకట స్వామి సత్యనారాయణ – మిత్రులు గన్నేశ్వరరావు, నండూరి సుబ్బారావు, – మనోరంజని ఎం. నాగరత్నమ్మ – సంప్రదాయ గానం మల్లిక్, శ్రీరంగం, కనకదుర్గ గార్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here