హర హర మహాదేవ శంభో శంకర!

0
14

[‘హర హర మహాదేవ శంభో శంకర!’ అనే భక్తి కవితని అందిస్తున్నారు గొర్రెపాటి శ్రీను.]

[dropcap]‘ఓం[/dropcap] నమఃశ్శివాయ’ అంటూ నిన్ను తలిస్తే చాలు
కష్టాలన్ని పటాపంచలు చేస్తూ
సౌఖ్యాలను ప్రసాదించే
కరుణామయుడవు నువ్వే శివయ్య!
పార్వతీదేవికి అర్ధ తనువునిచ్చి
అర్ధనారీశ్వరుడుగా ఇలలో కీర్తినందుకుంటున్న
మహిమాన్వితుడవు నువ్వే శివయ్య!
నార వస్రాలని ధరించి
నాగులను హారాలుగా భావించి
గరళాన్ని కంఠాన దాచి
గంగమ్మను శిరమున నిలిపి
మూడు కాలాలకు సూచికగా త్రిశూలాన్ని చేతబట్టి
త్రికాల గమనంతో కాలాతీతుడవైన
పరమేశ్వరుడవు నువ్వే శివయ్య!
ఓంకార స్వరూపా..
అంబికా ప్రియ వల్లభా..
అనంత విశ్వాన్ని కాపాడే
దయామయుడవు నువ్వే శివయ్య!
హృదయమంతా నీపై ప్రేమని పెంచుకుని
చెంబెడు నీళ్ళతో అభిషేకిస్తే ఆనందస్వరూపడవై
అనంత ఆనందాలు అష్టైశ్వర్యాలు
ప్రసాదించే పావనమూర్తి నువ్వే శివయ్య!
భోళాశంకరా.. భళిరా నా శంకరా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here