హరిగాడి సినిమా కష్టాలు

0
8

[dropcap]ఆ[/dropcap]కాశాన్ని అందుకోవటానికి ప్రయత్నిస్తున్న నా ఊహల అలలను ఒక్క కనుసైగతో ఆపివేసింది……

నాకే తెలియని ఆ రూపం నా హృదయ వీణ ను మీటి వెళ్లిపోయింది….

నా యద లోతుల్లో మధురిమలను పలికిస్తుంది…

నా చేతుల గీతలపై ప్రేమలేఖలు రాస్తుంది..

నా ఊహల సామ్రాజ్యాన్ని ఉర్రూతలూగిస్తున్న ఆ రూపాన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు.

చిరుజల్లులా వచ్చి మెరుపల్లే మాయమవుతుంది..

పట్టుకోవడానికి ప్రయత్నించాను కానీ

అది ఒక అందని ఆశని

నిరాశను మిగిల్చి వెళ్లిపోయింది….

ఇంతలో టి.టి వచ్చి నిద్రలో ఉన్న నన్ను లేపి టికెట్ చూపించమన్నాడు, మంచి కలను పాడు చేసాడని చిరాకు పడుతూ “ఇదిగో టికెట్” అని గట్టిగా అరిచాను. నన్ను అర్థం చేసుకొని “ఏంటి బాబు కలలోకి ఐశ్వర్యరాయ్ వచ్చిందా?” అంటూ వెళ్లిపోయాడు..

మధ్యాహ్నం రెండు గంటలయింది. ఏదో తెలియని బాధతో ట్రైన్ దిగి చక్కటి పొలాల మధ్య నడుచుకుంటూ వస్తున్నాను….

ఎందుకో ఆ చక్కటి పొలాల మధ్య కాసేపు ఆగాలనిపించింది….

అనుకోని ప్రకృతి వైపరీత్యం ఒక్కసారిగా చీకటి పడినట్లయింది..

ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకు వొస్తున్నాయి, పచ్చని పొలాల మధ్య నుంచి వచ్చే చల్లని గాలి మనసును ఉత్తేజపరుస్తుంది…

అలానే నిలబడి ఆలోచిస్తున్న నా మనసుకి ఏదో అద్భుతం జరుగుతుందేమో అనిపిస్తుంది…

వర్షపు చిరుజల్లులు నాహృదయాన్ని తాకుతున్నాయి….

ఆ నల్లని మబ్బులు చీల్చుకుంటూ ఒక అద్భుతమైన మెరుపు మెరిసింది…….

ఆ మెరుపు వెలుగులో సుదీర్ఘంగా ఆలోచిస్తూ వర్షపు చిరుజల్లులో తడుస్తున్న నా కన్నులకు కలువ పువ్వులు కంటే అందమైన రెండు పాదాలు మువ్వల సవ్వడులతో నావైపు వస్తున్నట్లు అనిపించింది….

మరొక మెరుపు కోసం నా మనసు కుతూహలంతో ఎదురు చూస్తుంది, ఇన్ని అలజడులు మధ్య నా మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంది…

ఇంతలో మరొక మెరుపు వెలుగులో మునిపంటి కింద నలిగి ఎరుపెక్కిన పెదవులను చూశాను…..

తను తలకురులను సర్దుకుంటూ జారి పడతానేమో అన్న భయంతో పరిగెడుతూ వస్తున్న ఆమెని చూసి ఎల్లోరా శిల్పం ఎదురుగా వస్తుందేమో అనిపించింది….

అంతలో కనుచూపుమేరలో పర్వతాలను సైతం బ్రద్దలు కొట్టేటువంటి పిడుగు పడింది, ఆ శబ్దానికి ఆమె నన్ను గట్టిగా పట్టుకుంది. అప్పుడు ఆమె హృదయంతో నా హృదయం ఏదో మాట్లాడినట్లనిపించింది…..

నాకు తెలియటం లేదు నేను ఎవరో ఏదో కొత్త ప్రపంచం కనుల ముందు కనిపిస్తుంది… నా మనసు స్వర్గపు సరిహద్దులను తాకి వచ్చింది…

ఇంతలో చిరుజల్లు మాయమయ్యింది. ప్రకృతి ప్రశాంతంగా మారిపోయింది, ఆమె నన్ను వదిలి “ఐ యాం సారీ” అంటూ ఏదో మాట్లాడుతుంది, అవేమీ నాకు వినిపించడం లేదు కదులుతున్న మధురమైన పెదవుల వైపు మాత్రమే చూస్తున్నాను….

ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వెనుక నుంచి చెయ్యి వేసి “ఎవరు బాబు నువ్వు ఇంత ఎండలో ఏం చేస్తున్నావు?” అన్నాడు, నేను ఇంకా ఆ కల గురించి ఆలోచిస్తూ “ఆ అమ్మాయి మీ అమ్మాయా?” అని అడిగాను, “ఏ అమ్మాయి నాకసలు అమ్మాయిలు లేరు. కల ఏదైనా కన్నావా?” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు…

ఎలా అయితేనేం ఊరు చేరుకున్నాను. అవునట్టు మా ఊరు గురించి చెప్పడం మర్చిపోయాను కదూ….

మాది ఒక అందమైన ఊరు. చెప్పడానికి పల్లెటూరైనా, మేధావులకు మహానగరం, చూడడానికి భారత్‌కు శ్రీలంకలా ఉన్న ఆంధ్రదేశానికి ప్రత్యేక తెలంగాణలా ప్రవర్తిస్తూ ఉంటుంది. మా ఊరికి సెక్యూరిటీ గార్డు లాంటి రెండు కళ్ళు కట్లుకు మధ్యన పేడ చెరువుకి పక్కన ఉంటుంది, వాస్తు కోసం రైస్ మిల్లు ఆగ్నేయంలోన, అమ్మవారిని ఈశాన్యాన ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుంది. పదహారేళ్ల పడుచు పిల్లలేని మా కాలనీలో ఎన్ని పాపాలు చేసినా అవి అక్కడే ఆపు స్వామి అన్నట్లుగా ద్వారం దగ్గర వినాయకుడు గుడి ఉంటుంది…

మా అందమైన కాలనీలో వెంకటేశ్వర స్వామికి సుప్రభాతంల 3 తిట్లు, 4 శాపనార్థాలతో తెల్లవారుతుంది, ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా గడియారంలో తిరిగే చిన్న ముళ్ళు 10 నీ చూపించేసరికి శ్రీవారి సుప్రభాత సేవ ముగుస్తుంది, నాయురాళం నలుగురున్నామంటూ అసెంబ్లీలో మంత్రుల్ల కాకుండా గోడలకు చెవులుంటాయి ఏమోన్నట్లుగా మీటింగులు మొదలుపెడతారు…. సాయంత్రానికి స్వాగతం పలుకుతూ మొగుడు పెళ్లాల మధ్య మొదలవుతుంది. నువ్వు ఎదవ అంటే నువ్వు ఎదవని మొదలయ్యి పడుకోకపోతే పాతిపెడతా అన్న దగ్గర ఆగుతుంది…

ఇంత అందమైన కాలనీలో ఇన్ని విచిత్రాలని ఆశ్చర్యపోతున్నారా ఇంకా చాలా ఉన్నాయి…

మా కాలనీలో మూలస్తంభాలు అని ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు వీళ్లే మా కాలనీకి విలేఖరులు.. ఇందులో ఉత్తరాన ఉన్న విలేఖరి ‘మీ ఇంటి పక్కన జరిగింది మీకు తెలియదు మాకు తెలుసు’ అనే క్యాప్షన్‌తో బెస్ట్ జర్నలిస్టుగా పేరు తెచ్చుకుంది, ఊరి మధ్యలో ఉన్న ఆవిడ అంబేద్కర్ కళ్ళద్దాలు అద్దెకు తెచ్చి పెట్టినట్లుగా ఉంటుంది… ఏ దిక్కున నువ్వున్నా ఎగిరి వస్తా పావురమా అంటూ, అందుగలడు ఇందు లేదనక ఎందెందు వెదికిన అందందే గలడు అన్నట్లుగా న్యూసు అరక్షణంలో ఆంధ్రదేశానికి అందజేస్తుంది…

మీడియాకు మూలస్తంభం దక్షిణ భాగంలో ఉంది, చూడటానికి తింగరిగా ఉండి కళ్లుచెవులు కోపరేట్ చేయకపోయినా ఐడియాలను అరకిలో క్రింద అమ్మేస్తుంది…

నన్ను మించిన వీరుడు ఎవ్వడు, మగ వాడు లేడు,

బ్రాందీ తాగడంలో అయితే – బంగారు పతకాన్ని సాధిస్తా,

రమ్ము తాగడంలో అయితే – రజిత పతకం సాధిస్తా,

కల్లు తాగడంలో అయితే – కాంస్య పథకాన్ని తీసుకొస్తా…

అని పాడుతూ తనదైన శైలిని ప్రదర్శించి గత పది సంవత్సరాలుగా ప్రశంసలు అందుకుంటున్న కురువృద్దులు మన ఊర్లో ఉండటం మనకి గర్వకారణం… కల్లు త్రాగడంలో కాంస్యమే కాదు బంగారు పతకాన్ని సాధిస్తాంటున్న కుర్రోళ్ళు కూడా ఉన్నారండోయ్…. నేను ఉన్నానని పచ్చ కోక కట్టి పదహారు ఏళ్ల పిల్లల తయారయ్యే అంటిలే కాదు పెడతట్ట పక్కనపెట్టి పాండ్స్ పౌడర్ రాసుకునే వారు కూడా ఉన్నారు….

40 ఇల్లులు 400 జనాభా ఉన్న మా ఊర్లో ఉన్నారు పెద్దలు, వీరిలో కర్ణుడికి కజిన్ బ్రదర్స్ దుశ్శాసనుడికి బావమరదలు కూడా ఉన్నారండోయ్… చేతిలో పైసా పెట్టకపోతే పోయారు గానీ చీమలు బెల్లాన్ని ఎలా ముట్టుకోవు అలా ఎవరూ కూడా గ్రామము సొమ్ము తినరు..

సత్య హరిశ్చంద్రుడు ఎన్ని అబద్దాలు ఆడుతాడు అన్ని నిజాలు చెప్తారు… ఇవన్నీ కాదుకానీ మా కాలనీని ఒంటి చేతిమీద నడిపిస్తూ అరకిలో దగ్గరే ఐదు రూపాయలు మిగిలితే బాగుణ్ణు అనుకునే కోమటిఅమ్మ అర్ధ రూపాయి బిళ్ళలాంటి ఇడ్లీలు, అర డబ్బా చట్నీలో ముంచిన అంటుకోకుండా బయటకు వచ్చే కళానైపుణ్యంతో టిఫిన్ సెంటర్ నడిపించపడుతుంది. ఇది మా గ్రామం

యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్…..

మరి నా గురించి చెప్పలేదుగా… నా పేరు హరి బాబు

విశాఖపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలో ఓ కుగ్రామానికి చెందిన కుర్రాణ్ణి. నాది చాలా చిన్న ప్రపంచం. అమ్మ నాన్న, అక్క, మామయ్య ఒక స్నేహితుడు అంతే..

కష్టాలను కన్నీళ్లతోను సుఖాలను నవ్వులతోను కొలిచే ఈ సమాజంలో నాక్కూడా చిన్న గుర్తింపునిచ్చింది నా వ్యక్తిత్వం.

పెద్దగా విధివిపరీతాలేవి చోటు చేసుకోకుండా పడగలిగినన్ని కష్టాలు, ఎంజాయ్ చేయగలిగినన్ని సుఖాలు నా జీవితంలో విచ్చలవిడిగా ఉంటాయి..

నాకు ఎక్కువగా ఆనందాన్నిచ్చేవి చాలా తక్కువ, అమ్మానాన్నలతో సినిమా చూడటం మా రాంబాబుతో పానీపూరి తినడం, మా అమ్మతో గంటలకొద్దీ మాట్లాడటం అంతే…..

ఇష్టం లేనివి చాలా ఉన్నాయి. పేజీలు చాలవేమో, ప్రపంచంతో పోటీ పడడం అస్సలు నచ్చదు, ఎందుకంటే నాకంటూ నిర్మించుకున్న ప్రపంచంలో పోటీ అవసరం లేదు అంతే కదా..

వాస్తవానికి దగ్గరగా పోవాలనుకోవడమే నేను ఈ సమాజంలో చేసే పెద్ద తప్పు….

మొహమాటానికి కాస్త దూరంలో జీవిస్తున్న నన్ను అమ్మాయిలు తప్ప అన్ని ఆకర్షించాయి….

అంతేకాదు ఖాళీగా ఉన్నప్పుడు జిమ్ము, చిరాకుగా ఉన్నప్పుడు రన్నింగ్, బాధగా అనిపించినప్పుడు భగవద్గీత నన్ను బిజీగా ఉంచుతాయి..

పర్వాలేదు ఆ దేవుడి దయవలన మంచి కలరు, మీడియం హైటు, బాగానే ఉంటాను..

కోరుకున్న వాటికన్నా జీవితంలో ఇప్పటి వరకు అన్ని ఎక్కువగానే లభించాయి కష్టాలు కన్నీళ్లు అధిక మొత్తంలోనే వస్తుంటాయి,

మా అమ్మనాన్న అంటే ఇష్టం, నాకు నేను అంటే చాలా ఇష్టం..

సంవత్సరానికి ఒక పది రోజులు భక్తి కూడా కేటాయిస్తాను, మిగిలిన రోజులు భగవంతుడికి మనకి పెద్ద లావాదేవీలు ఏమీ ఉండవు…

దేవుడు కన్నా తల్లిదండ్రులు గొప్పవాళ్లు అని నమ్మే మనస్తత్వం నాది. ఎందుకంటే నీకు ఏది జరగాలో అదే జరుగుతుంది, నువ్వు ఎంత మొక్కిన భగవంతుడు దానిని మార్చడు, కానీ అమ్మనాన్న ఎప్పుడూ మనకోసమే బ్రతుకుతారు..

ఉందో లేదో తెలియని దాన్ని నమ్మటం కన్నా కనిపించే వీళ్లను పూజించడం భావ్యం అనిపించింది… అయినా ఎవడు ఒపీనియన్ వాడిది. అంతేకదా…..ఇదేనండి నా బ్రీఫ్ ఇంట్రడక్షన్….. ఏదో చిన్న కంపెనీలో పని చేసుకుంటున్నా ప్రశాంతమైన జీవితం….

సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నా. సంక్రాంతి అంటే చాలా ఇష్టం, జనవరిలో వచ్చే సంక్రాంతి కోసం సంవత్సరంతా కుతూహలంగా వేచిచూస్తూ ఉంటా.. పచ్చికబయలు మీద కురిసిన మంచు తుంపరలను చూస్తుంటే ఏదో తెలియని కొత్త ఉత్తేజం నా ఒళ్ళంతా పరిగెడుతూ ఉంటుంది….

ఈ సంక్రాంతికి చాలా విశేషాలు ఉన్నాయి.

ఇంటి దగ్గర చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు నాకు పెళ్లి చేయాలని. అంతే కాదు చాలా మంది అమ్మాయిల్ని చూసి ఉంచారు, ఇప్పుడు నేను వెళ్లిన వెంటనే మళ్ళీ అవే పెళ్లి చూపుల కష్టాలు…

నేను మాత్రం అవుననకో కాదనకో మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా ఉన్న ….. అమ్మనాన్న మాత్రం చాలా దృఢంగా నిర్ణయించుకున్నట్లు ఉన్నారు, ఈ సంవత్సరం ఎలాగైనా పెళ్లి చేయాలని….

అవునులే మన వాతావరణంలో కూడా మార్పులు వచ్చేశాయి…. పదిమంది ఆడవాళ్ళలో ఆరుగురిని తప్పుడు దృష్టితో చూస్తున్నాను. పెళ్లి చేసుకోవడం చాలా అవసరం ఏమో అనిపిస్తుంది…..

జీవితం కోసమేగా ఎన్ని కష్టాలు పడుతున్నా, అలాంటప్పుడు జీవితంలో ఒక భాగమైన పెళ్లిని వాయిదా వేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది..

కానీ ఏదో తెలియని నమ్మకం, జీవితం ఏదో బలమైన మలుపు తిరుగుతుందని ఎప్పటినుంచో ఒక చిన్న నమ్మకం.

పెళ్లి ఆ నమ్మకానికి సమాధి అవుతుందేమో అని భయం…….

ఉద్యోగ పరంగానూ లేక వ్యాపారపరంగానూ ఏదో ఒక తెలియని ఉప్పెనలాంటి మార్పు కోసం ఎదురు చూస్తున్న నన్ను పెళ్లి వైపు మొగ్గు చూపేటట్లు చేయాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ కనబడడం ఆశ్చర్యపరుస్తుంది…

ఒక విలువైన గమ్యం మనకున్నప్పుడు అనేకమైన విలువలు కలిగిన వాటిని నిస్సంకోచంగా వదిలేయ్ అప్పుడే అది నీకు దక్కుతుంది…

అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల మధ్యలో నిలదొక్కుకోవడానికి వీలుకాని సమాజంలో నాతో ఉన్న ఒక మనిషిని నేను ఆనందంగా చూసుకోగలనన్న ప్రశ్నకు అందరి దగ్గర సమాధానం ఉంది, కానీ నా దగ్గర మాత్రం లేదు…..

అలా అని పరిస్థితులకు తలవంచుకొని బ్రతకడం నాకిష్టం లేదు, బరువు అనే పదం నా భార్యను ఉద్దేశించి వాడటం నాకు ఇష్టం లేదు…..

పెళ్లయిన నాలుగు నెలలకి తల్లిని చేసి ఇంటి దగ్గరే వదిలేసి నా అంతట నేను ఉద్యోగానికి పోయే భర్తగా కూడా బ్రతకడం నాకిష్టం లేదు….

నా జీవితంలోకి వచ్చే అమ్మాయికి 15 సెంటీమీటర్ల తాళిని కట్టి ఆడపిల్లకు ఉన్న అన్ని హద్దులను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసే మూర్ఖత్వపు భర్తగా జీవించలేను…

అందుకనే కనీసం ఒక సంవత్సర కాలంలో ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి జీవితం అంటే ఉన్న అభిప్రాయాన్ని మార్చగలిగే అంతటి ఆర్థిక, మానసిక, స్తోమత నాకు ఉంది అని అనుకునే అంతవరకు నేను పెళ్ళికి అర్హుడిని కాదు అనే నేను నా మనస్పూర్తిగా భావిస్తున్నాను….

రేపే పెళ్లి చూపులు మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇంతలో రాజు గాడు కనిపించాడు.. ఎప్పుడు కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించే వాడు..

కానీ ఈ రోజు నన్నుచూసి ఎందుకు తలదించుకుని వెళ్లిపోతున్నాడు అర్థం కాలేదు, “రాజు రాజు” అని గట్టిగా పిలిచా.

అయిష్టంగానే దగ్గరకు వచ్చి “ఎప్పుడొచ్చావు?” అన్నాడు.

కన్నీటి పర్యంతమైన మనస్సు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది…

“ఏమైందిరా రాజు?” అని అడిగాను. “స్వప్నకి పెళ్లి అంటరా” అన్నాడు..

ప్రేమ అనే మాట వింటేనే భగ్గుమనే నేను వాడి ముఖం చూసి ఒక్కసారిగా బాధనిపించింది..

ఉద్యోగం లేదని వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తున్నారా అన్నాడు……

వాడు చెప్పే ఒక్కో మాట నా చెవులలో ఇప్పటికీ మారుమోగుతున్నది… తాజ్‌మహల్ చూపించి అది మన ప్రేమకు చిహ్నం అని అంటే తెలుసుకోలేకపోయాను మామా, ప్రేమకు చిహ్నం కాదు సమాధి అని…..

నాకైతే మాత్రం ఈ ప్రేమ మీద నమ్మకం లేదు…

నేను మాత్రం నాజీవితంలోకి వచ్చిన భార్యను మాత్రమే ప్రేమించాలని కోరుకుంటున్నా….

నేను మాత్రం ఒక్కటే నమ్ముతా తల్లిదండ్రులను మోసం చేయగలిగిన పిల్లలు, భర్త భార్యను, భార్య భర్తను కూడా మోసం చేసుకుంటారు అందుకే

అమ్మను ప్రేమించే లేనోడు అమ్మాయిని కూడా ప్రేమించు లేడు…..

అని నమ్ముతున్నాను

చెప్పాలంటే పెళ్లి చూపుల కన్నా కష్టమైన పని ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు ఇప్పుడే అర్థమైంది….

ఒక్క క్షణ కాలంలో కొన్ని వందల ఆలోచనలు ఎక్కడ మొదలయ్యి ఎక్కడికి పోతున్నాయ్యి కూడా అర్థం కాలేదు..

ఏంటి అవి అని ఆగి చూస్తే ఒకటి లేదు ఇదేదో కొత్త ఫీలింగ్…

భయం కాదు భ్రమ కాదు…….

కోపం కాదు సరదా అయితే అస్సలు కాదు ……

కొద్దిగా కంగారులానిపిస్తుంది కానీ అది కూడా కాదు..

ఏ యాక్షన్ లేకుండా చమటలు పట్టించిన క్షణం….

ఇంతటి భయంకరమైన క్షణం తర్వాత 30 నిమిషాలు మూడు రోజులు గడిచాయి. రెండంతస్తుల మేడమీద నుంచి నన్ను అందరూ దూకమని తోస్తున్నారు అనిపిస్తుంది….

చాతిలో ఉండాల్సిన గుండె చేతిలోకి వచ్చేసింది..

ఏదో నరం పట్టేసినవాడు మెడ తిప్పుతున్నట్లుగా మెడ తిప్పుతున్నాను, బాడీలో ఉన్న ఏ అంగం మీద కంట్రోల్ లేదు. మైండ్ ఎదో చెపుతుంది బాడీ ఇంకేదో చేస్తుంది….

నా ఎడమ చేయి వణుకుతున్న కుడి చేతికి ధైర్యం చెప్తూ నాక్రింద వెనుక పాకెట్లో ఉన్న కర్చీఫ్ లాగటంలో బిజీగా ఉంది…..

ఇంతలో మొహం మీద ఉన్న చెమట చుక్క పైనుంచి దొర్లుకుంటూ గడ్డం వరకు వచ్చేసింది….

నా కుడి చెయ్యి ఎప్పుడూ నువ్వు లేట్ అని ఎడమ చెయ్యిని తిడుతూ రాలడానికి రెడీగా ఉన్న చెమట చుక్కల్ని తుడుస్తూనే ఉంది. చివరిదాకా….

నా రెండు కళ్ళు సెకనుకు ఒకసారి నా వాచ్‌ని కాలం ఎప్పుడు గడుస్తుందని చూస్తూ బిజీగా ఉన్నాయి..

ఇంతలో అమ్మాయి వచ్చి నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది..

స్టోరీ ఇప్పుడే మొదలైంది.

సినిమా పేరు – ‘హరి గాడి సినిమా కష్టాలు’.

ఎంత బిజీగా ఉన్నా నామైండ్‌ని “ఏం పేరు బాబు” అనే ఒక ప్రశ్న సడన్‌గా ఢీకొట్టింది, నా తలని 45 డిగ్రీలు తూర్పు తిప్పి చూశా ఎవరా అడిగిందని.

నా గొంతు నుంచి సమాధానం బయటకి వచ్చేలోపే “ఎక్కడ ఉంటావ్, ఏం చేస్తుంటావ్? అన్నీ ప్రశ్నల వర్షం కురిపించింది……

ఆ దెబ్బకి మాకు తొమ్మిదో తరగతిలో హిందీ చెప్పిన ఉదయశ్రీ మేడం గుర్తుకు వచ్చింది..

ఈ ప్రశ్నలన్నీ చెవుల నుంచి బ్రెయిన్ లోపలికి వెళ్ళి, నోట్లో నుంచి సమాధానం బయటకు వచ్చే లోపు మా మామయ్య సమాధానం చెప్పేశాడు..

హమ్మయ్య అనుకొని కొద్దిగా శ్వాస పీల్చుకొని నా తలను యథాస్థానానికి తీసుకువచ్చి కొద్దిగా కిందకు దించా..

రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ చూపించినట్లు, పాదాల దగ్గర నుంచి చూడటం మొదలు పెడదాం అనుకున్నాను..

ఎందుకైనా మంచిదని తల మరో 30 డిగ్రీలు కలిపి మొత్తం సుమారుగా భూమి నుంచి 70 డిగ్రీలో పెట్టి ఇరువైపులా చూసా ఎవరైనా నన్ను చూడటం లేదు కదా అని..

అక్కడ ఉన్న వాళ్లంతా నన్ను చూస్తున్నారు ఏదో పక్క గ్రహం నుంచి పారిపోయి వచ్చిన ఏలియనా….

అవును ఎక్కడ ఆపేను రాఘవేంద్రరావు సినిమా దగ్గర కదా……..

తలను క్రిందకు దించి రెండు కళ్లను అమ్మాయి కాళ్లవైపు ఫిక్స్ చేశాను………

స్లో మోషన్లో పైకి తెలుస్తున్నా మధ్యలో చిన్న టేబుల్ ఉంది. అందువలన పాదాలు కనబడలేదు…..

అలా మెల్లగా ఇంకా పైకి తెలుస్తున్నా, ఇంతలో నాకు ఎడమవైపు ఎదురుగా కూర్చున్న వాళ్ళ అన్నయ్య ఇంకో ప్రశ్న సంధించాడు – అబ్బాయిది ఏ నక్షత్రం అని….

అంతే తల అదే యాంగిల్లో ఒక్కసారిగా ఆపాను.. ఇంతలో మామయ్య పునర్వసు మూడోపాదం అని సమాధానమిచ్చాడు…..

దాంతో గార్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గూడ్స్ రైళ్లలా మెల్లగా తలను పైకి లేపుతున్నా…..

ఒక చేతిలో నలిగిపోతున్న మరో చేతిని చూసా..

ఓరి దీనమ్మ జీవితం, ఇది నా కన్నా తెల్లగా ఉన్నట్లుంది అనుకున్నా…

ఆ తర్వాత స్టాపేజీ లేని ట్రైన్ రైల్వేస్టేషన్లో ఎలా పరుగెడుతుందో అలా ఒక్కసారిగా మొహం చూసి, అరగంట తీసుకుని ఎత్తిన తలను అరక్షణంలో కిందకు దించేశా…

కొద్దిగా గాలిపీల్చుకుని హమ్మయ్య అయిపోయిందిరా పెళ్లిచూపులు అనుకున్నా….

ఏదో వరల్డ్ కప్పు సాధించినట్లు నా భుజం మీద చెయ్యి వేసుకుని శభాష్ హరిబాబు అనుకున్నా…..

చివరిగా ఒక డౌట్ వచ్చింది, ఇన్ని అవస్థలు పడుతున్న నన్ను ఆ అమ్మాయి చూసింది అంటావా అని… చూసే ఉంటుందిలే అమ్మాయిలు ఎలాయినా చూసేస్తారు…

ఏదోలా దేవుడి దయవల్ల పెళ్లి చూపులు అయిపోయాయిరా బాబు అనుకున్నా…..

ఊళ్లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి..

రంగురంగుల బట్టలలో పసికూనల పరవశాలు…

వలపులను విరబూసిన వయ్యారి భామలు…

పంచెకట్టు అంచులలో పౌరుషం దాచిన పెద్దలు…

పాదరసం కత్తులతో ఎగిరెగిరి కొట్లాడుతున్న పందెంకోళ్ళు…

సంక్రాంతికే ఆయువు పట్టుయిన పేకాట రాయుళ్లు..

గంగిరెద్దులు, రొమ్ము తప్పెట్లు, తప్పెటగుళ్ళు, కర్ర సాము,

బుర్రకథలు, శాస్త్రీయ నృత్యాలు ఒక్కటేంటి ఇలా వందల సాంస్కృతిక కార్యక్రమాల నడుమ, పండగకి ఊరుకు తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరితో ఊపందుకున్న ఊరి వైభవం తారాస్థాయికి చేరుకుంది……

బాల్య మిత్రులు మరియు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, ఐస్ క్రీమ్ కోసం చేసిన అల్లరి, రంగులరాట్నం నుంచి పడినప్పుడు తగిలిన దెబ్బ రంగు సోడా ఇప్పించమని మామయ్య వెంటపడిన మధురక్షణాలు నెమరువేసుకుంటూ అలా తీర్థంలో నడుచుకుంటూ వెళ్తున్నాను…..

వేసిన ప్రతి అడుగులోనూ ఓ జ్ఞాపకం..

పరిగెడుతున్న ప్రతి పిల్లవాడిలోనూ కనిపించే నా పసితనం….

ఆ క్షణం బాల్యాన్ని ఇంకోసారి బ్రతకాలి అనిపించింది…

నాగరికత సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాగిపోతున్న ఊరి వైభోగాన్ని చూసి ఇలాంటి సంక్రాంతి వారానికి ఒకసారి వస్తే బాగుండు అనిపించింది….

అలా దీర్ఘంగా ఆలోచిస్తూ నడుస్తున్న నా కంటికి దూరంలో ఒక ఆవిడ చిన్నపిల్లవాడిని చేత్తో పట్టుకుని పక్కనున్న వ్యక్తిని ఏదో కొనమని అడుగుతూ కనిపించింది, బహుశా వాళ్ళ భర్త అనుకుంటాను…..

ఎందుకో తను మాతో పదో తరగతి చదువుకున్న శ్రావ్య ఏమో అనిపించింది, తను కాదు అనే అనుమానం తోనే దగ్గరికి వెళ్లి ‘శ్రావ్య’ అని పిలిచా… బొమ్మల కోసం ఆరాటపడుతున్న పిల్లవాడిని వెనక్కి లాగుతూ ఒక్కసారిగా నావైపు చూసి, “హరీ ఎలా ఉన్నావు చాలా రోజులు కనిపించావు” అంది… పిల్లవాని ఎత్తుకొని నన్ను వాళ్ళ ఆయనకి పరిచయం చేసింది, “ఇతను హరి మాతో చదువుకున్నాడు అండి” అని, ఆయన నన్ను పలకరించిన వెంటనే మళ్ళీ పిల్లవానికి బొమ్మలు కొనడంలో బిజీ అయిపోయారు.. శ్రావ్య నా వైపు చూస్తూ పిల్లవానితో మామకి నమస్కారం పెట్టు అంటుంది….

ఒక్కక్షణం నాకు అనిపించింది, రేగు ఒడియాల కోసం కొట్టుకునే చిన్నారులేనా ఈరోజు చిన్నపిల్లల జీవితాలను తీర్చిదిద్దే తల్లులు అయిపోయారు…..

అలాఅలా తిరిగితిరిగి అలసిపోయిన తరువాత ఇంటికి చేరుకుని అమ్మ చేసిన చిల్లిగారులు నాటుకోడి మాంసంలో ముంచుకొని తింటుంటే ఇల్లు వదిలి వెళ్లాలనిపించనేలేదు…

వారం రోజులు క్షణాలమీద గడిచి పోయినట్లు అయిపోయింది, ఎప్పుడొచ్చావని అడిగేవాళ్ళు అందరూ ఎప్పుడు వెళ్తున్నావని అడగడం మొదలు పెట్టేశారు…

ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఆనందం అయితే ఉంటుందో ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అంతకు రెట్టింపు బాధగా ఉంటుంది..

అయినా పొట్టకూటి కోసం పరిగెట్టక తప్పదు కదా……

ఇంతలో కోటిగాడు పరిగెట్టుకుంటూ వచ్చి “ఒరే హరి రాజు గారి ఇంటికి వెళ్లాం పద” అన్నాడు..

“ఏమైందిరా?” అని కొద్దిగా భయంతో కూడిన ఆతురతతో అడిగాను….

ఇద్దరము పరిగెట్టుకుంటూ రాజుగాడు ఇంటి వైపు బయలుదేరాము.. “ఈ కాలం కుర్రవాళ్ళు మన మాట విన్రమ్మ” అంటూ గుసగుసలాడుతున్న ఆరుబయట ఆడవాళ్లను చూసి ఇంకా కంగారు అనిపించింది…

పొద్దుట నుంచి ఏడుస్తూ ఉన్న వాళ్ళ అమ్మ నన్ను చూసి “హరి నువ్వైనా చెప్పరా” అని ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది..

నులక మంచం మీద అటువైపుగా తిరిగి ఉన్న రాజు గాడిని పిలిచి “ఏందిరా రాజుగా ఇది, ఏమైందిరా నీకు .. ఏం చేస్తున్నావు….” అని కోపంగా అడిగా…

“స్వప్న లేకపోతే బ్రతకలేనేమో అనిపిస్తుందిరా” అన్నాడు….

“అందుకని ఆత్మహత్య చేసుకోవడం ఏందిరా?” అడిగా….

మొహం నీరసంగా పెట్టి అటువైపు తిరిగి కళ్ళల్లోకి చూడకుండా తప్పించుకుంటున్నాడు…

ఒక నిమిషం ఆలోచించి చెంపమీద ఒక్కటి కొట్టాను…

పల్లెటూర్లలో తల్లిదండ్రుల కష్టాలు పిల్లలకు తెలియకూడదనే ఉద్దేశంతో పిల్లలను చాలా గారాబంగా పెంచుతారు……

మాలానే కూలి పనిచేసి కష్టాలు పడకూడదని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించడం తప్ప స్వార్ధం లేని వారి ప్రేమ ముందు, వారి కష్టాలను తెలియకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు…

తాము చీకట్లో ఉండయినా సరే పిల్లలను వెలుగులో చూడాలనుకుంటారు.. కానీ కొంతమంది పిల్లలు వాళ్ల ప్రేమను గుర్తించలేక పోవడమేకాక విలువలేని వ్యసనాలక ఆకర్షితులవుతారు…

వీడికి మాత్రం తల్లిదండ్రుల విలువ మరియు బరువు బాధ్యతలను తెలియచేయాలని నిర్ణయించుకున్నాను……..

మరుసటి రోజు నాతో పాటు రాజుగాడిని కూడా విశాఖపట్నం తీసుకు వెళ్లి పోయాను….

రెండు రోజులు కంపెనీలో సెలవు తీసుకొని, ఊరు చూపిస్తానని తెల్లవారుజామునే లేపి బండి ఎక్కించుకున్నాను.

మొదటిగా వీడికి తల్లిదండ్రులు లేని పిల్లల యొక్క ఆవేదన ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో, దగ్గరలో ఉన్న రెండు అనాథాశ్రమాలకు తీసుకు వెళ్ళాను…..

వాళ్ల జీవనశైలిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత తల్లిదండ్రులున్నందుకు మనం ఎంత అదృష్టవంతులమో అర్థమయ్యే భావన కలిగేటట్లు చేశాను… అక్కడనుండి నేరుగా ఒక వృద్ధాశ్రమానికి తీసుకు వెళ్ళాను, అక్కడ యుక్తవయసులో ఉన్న కొడుకులను కోల్పోయిన తల్లుల ఆవేదనని కళ్లకు కట్టినట్లుగా కనపడేటట్టు చేశాను…….

వాళ్లని చూసిన మరుక్షణం రాజుగాడిలో నేను ఎంత పెద్ద తప్పు చేయబోయాననే పశ్చాత్తాపం కళ్లకు కట్టినట్లు కనిపించింది……

అక్కడ నుండి నేరుగా సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ, అహర్నిశలు కష్టపడుతున్న కోచింగ్ సెంటర్స్ హాస్టల్‌కి తీసుకు వెళ్ళాను…..

లక్ష్య సాధనకై పరితపిస్తూ, చిన్నచిన్న సుఖాలను త్యాగం చేస్తూ, పుస్తకాలతో కుస్తీలు పడుతున్న యువతను చూపించాను …..

ఆరుగంటల ఈ పయనంలో ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదు…..

అక్కడ నుంచి నేరుగా బస్టాండ్‌కు తీసుకువెళ్లి, ఒకే ఒక్క మాట చెప్పాను …. “ఇక నీ ఇష్టం ఆత్మహత్య చేసుకుంటావో, అమ్మాయిల వెంట పడతావో, ఏం కావాలంటే అది చేసుకో…. మన కోసం బ్రతికే తల్లిదండ్రులు, మనల్ని ప్రేమించే స్నేహితులు, ఏదో సాధిస్తామని నమ్మిన బంధువులు, వీటన్నిటికన్నా ఒక అమ్మాయి జీవితంలోకి రావడమే ముఖ్యం అని ఇప్పటికీ నీకు అనిపిస్తే జీవితంలో నీకు స్నేహితుడున్నాడు అన్న సంగతి కూడా మర్చిపో…..” అని.

వాళ్లమ్మకి ఫోన్ చేసి, “పెద్దమ్మ రాజు గాడిని బస్సు ఎక్కించాను” అని చెప్పాను…..

“ఏమైంది బాబు, నీ దగ్గర ఉండనని అంటున్నాడా?” అంది…

“లేదు పెద్దమ్మ వాడిని తీసుకుచ్చిన పని అయిపోయింది అందుకే వెనక్కి పంపేసా…”

ఇంటి దగ్గర నుంచి వచ్చి వారం రోజులు అవుతుంది, అమ్మ దగ్గరనుంచి ఫోన్ వచ్చింది – నీకు ఇష్టమైతే ఆ సంబంధం కన్ఫామ్ చేద్దామని.

సిగ్గు పడుతూ “నాన్నకు, నీకు నచ్చితే నాకు నచ్చినట్లే” అన్నా…

“ఒరేయ్ నాటకాలు చేయకురా. నీకు నచ్చితే చెప్పు లేకపోతే లేదు” అంది అమ్మ.

“హరిబాబుగాడి టైం అయిపోయిందమ్మా” అన్నా నవ్వుతూ…

అయ్యో దేవుడా నా రోజులు అయిపోయినట్లున్నాయి…

అన్నవరం సత్యనారాయణస్వామి పాదాలవద్ద అమ్మాయిగారు మన జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ పొట్టి పిల్లకు నాలో ఏం నచ్చిందో తెలియదు కానీ నా జీవితంలోకి నా భార్యలా దూసుకొచ్చి నా మీద చూపించే ప్రేమ, ప్రేమ అనే పదం పై నాకున్న వ్యతిరేకతను పూర్తిగా మార్చేసింది……

అమితమైన ప్రేమ, అనంతమైన సుఖాలు, పడగలిగినన్ని కష్టాలు, జీవితం చాలా సుఖాంతంగా సాగిపోతుంది….. ఆ ప్రేమ మత్తులో ఎన్నో కవితలు రాసిన తక్కువ అనిపించింది….

నిదుర మరచి మరచి మలిచినేమో ప్రతిమ…

కనులు తెరచి తెరచి ప్రాణం పోసినేమో బ్రహ్మ..

కలువ రేకులను తలచి కనురెప్పలు చెక్కినేమో…

నీలి మబ్బులను దువ్వ నీలాల కురులుగా మార్చనేమో…..

లేత వెన్నెలను దోసెడు పోసి ఈ పసిడి వెన్నెలకి ప్రాణం పోసేనేమో… మంత్రముగ్ధుడై అయిన బ్రహ్మ

చేత వీణలేని ఈ సరస్వతిని చూడగా…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here