హరికథా భిక్షువు – శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అయ్యవారి జీవన దర్శనం – పుస్తక పరిచయం

0
12

[dropcap]శ్రీ[/dropcap]పతి పండితారాధ్యుల సాంబమూర్తి అయ్యవారు ప్రముఖ హరికథా భాగవతార్. ప్రముఖ గాయకుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రిగారు. ఆయన జీవితగాథని పుస్తకరూపంలో అందించారు ఎమ్మెస్. సూర్యనారాయణ. ఈ పుస్తకంలో 13 అధ్యాయాలు, 2 అనుబంధ వ్యాసాలు ఉన్నాయి.

***

“గుండె గర్భగుడిలోంచి వికసించి తాను ‘రామదాసై’…, ‘కాళిదాసై…’, ‘నందనారై..’ కంఠసీమ నెర్రెలు విచ్చినా విచ్చుకున్న హరికెందామరై గంటల తరబడి నిలబడి… నిలబడి… నిలబడి… సంసార సాగరంలో కడగండ్ల మొసలి పిక్క పట్టుకుని పీడించినా… ‘అన్యథా శరణంనాస్తి’ అన్నట్లుగా శ్రీ సాంబమూర్తి హరిహరకథ కొనసాగింది. హరికథ, త్యాగరాజ భిక్షువుగా ఆయన జన్మ చరితార్థమయ్యింది!” అన్నారు ఈ పుస్తక రచయిత ఎమ్మెస్‌ సూర్యనారాయణ.

***

“హరికథ అనేది ఒక సామాజిక కళ, సామాజిక రుగ్మతలకు నివారణోపాయాలను కళాత్మకంగా మృదుమధురంగా జనం హృదయాలకు హత్తుకుపోయేలా చెప్పటానికి హరికథ ఒక ఉత్తమ సాధనప్రక్రియ. శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారితో ప్రారంభించి, ఈ కళద్వారా సామాజిక ప్రయోజనాన్ని సాధించాలనే ఏకైక లక్ష్యంతో హరికథకులు తెలుగులో అభివృద్ధి చేసిన సామాజిక కళ. దానికి సామాజిక ప్రయోజనాలే ఎక్కువ. ప్రజలు భక్తితో పాటు జాగరూకతను కూడా అలవాటు చేసుకునేలా చేయటం హరికథకుల లక్ష్యం. సాంబమూర్తిగారి హరికథా శైలి శ్రోతల్ని కేవలం ఆకట్టుకునే రీతిలో కాకుండా వారిని మంత్రముగ్ధుల్నిచేసి జాగృతపరిచే విధంగా ఉండేదని చక్కగా వివరించారీ పుస్తకంలో రచయిత శ్రీ ఎమ్మెస్ సూర్యనారాయణ” అని వ్యాఖ్యానించారు శ్రీ మండలి బుద్ధప్రసాద్ ‘పరిపూర్ణ మానవుని సంపూర్ణ జీవన చిత్రణ’ అనే ముందుమాటలో.

***

“జీవిత చరిత్ర రాయడం కష్టం. అందునా ఒక అరుదైన హరికథారాధ్యుని కథ రాయడం ఇంకా కష్టం. దాన్ని కవితాత్మకంగా రాయడం మరీ మరీ కష్టం. మళ్ళీ మళ్ళీ చదివించేలా రాయడం మహామహా కష్టం. ఆ కష్టాలన్నిటీ ఇష్టంగా స్వీకరించి అసిధారావ్రతం లాంటి బృహత్కార్యాన్ని భుజానికెత్తుకుని ఈ బృహత్కావ్యాన్ని అవలీలగా పూర్తిచేసిన శ్రీ యం.ఎస్. సూర్యనారాయణగారు అభినందనీయుడు.

శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తిగారంటే సంగీత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. హరికథాగానంలో ఒక శకం. నాటకరంగంలో ఒక అంకం. కాళిదాసుని కళ్ళకు కట్టించిన పండితుడు. అనాథశవాన్ని మోసిన ఆరాధ్యుడు. భక్తపాదరేణువుగా తన్నుతాను సంబోధించుకున్న వినయమూర్తి. త్యాగరాజ స్మరణోత్సవాల కోసం జోలెపట్టిన భిక్షాటనాస్ఫూర్తి. ఒక్క మాటలో నెల్లూరు త్యాగయ్య మా సాంబయ్య. ఆ హరికథా భిక్షువు జీవన దర్శనం చేసిన దివ్యచక్షువు సూర్యనారాయణగారు” అన్నారు వెన్నెలకంటి ‘కళాత్మక జీవిత చరిత్ర’ అనే ముందుమాటలో.

***

“బాలుగారి తండ్రిగారైన సాంబమూర్తిగారి జీవనచిత్రణ ఇది. రసవంతమైన కావ్యంలాగ స్పూర్తిమంతమైన చరిత్రలాగా ఒక హరికథా కళాకారుడి కథ.. ఎంతో పరిశోధించి, ఎన్నో పరిశీలించి అంతకుమించి పరవశించి రాసిన గ్రంథం. ఏదో ఒక శుభ ముహూర్తాన ఎమ్మెస్‌కి అలా నిపించింది. ఆరు నెలలకి ఇలా తయారైంది!

దీనికి ఎంతోమంది మాట సాయం చేసారు. కొంతమంది బాట సాయం కూడా చేసారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఈ హరికథా బిక్షువుకి తంబురా లాంటివాడు. హృద్యంగా నేపథ్యంలో ఉంటాడు.

ఇది చదివితే మనకి హరికథ మీద భక్తి పెరుగుతుంది. హరికథకుల మీద గౌరవం కలుగుతుంది! సాంబమూర్తి గారి ఆత్మకు అప్రయత్నంగానే నమస్కారం చేస్తాం!

ఇది హరికథ చెప్పే గిరి కథ!” అన్నారు తనికెళ్ళ భరణి

***

హరికథా భిక్షువు

శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అయ్యవారి ‘జీవన దర్శనం’

రచన: ఎమ్మెస్‌ సూర్యనారాయణ

శ్రీపతి పండితారాధ్యుల ప్రచురణ

పేజీలు: 198, వెల: రూ.200,

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here