హాస్యరంజని-10

0
13

[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.

91. ట్రాన్‌సిస్టర్

రాజేష్: నీకు ఇంత జనరల్ నాలెడ్జ్ ఎలా వచ్చిందిరా?

శ్రీకృష్ణ: నాకు వినడం వల్ల వచ్చింది.

రాజేష్: ఎవరు చెబితే విన్నావు?

శ్రీకృష్ణ: మా సిస్టర్ చెపితే విన్నాను.

రాజేష్: అసలు నీకు సిస్టర్స్ లేరు కదరా.

శ్రీకృష్ణ: ఒక సిస్టర్ ఉంది.

రాజేష్: నాకు ఎప్పుడూ కన్పించలేదే!

శ్రీకృష్ణ: ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది, బయటకు రాదు.

రాజేష్: నన్ను సతాయించకు రా, ఆ సిస్టర్ ఎవరో, ఎలా ఉంటుందో త్వరగా చెప్పరా!

శ్రీకృష్ణ: మా ఇంట్లో ఉంటుంది. రోజూ ఎంతో విజ్ఞానమిస్తుంది. వినోదాన్నిస్తుంది. అదే ట్రాన్‌సిస్టర్!

92. కంద పద్యము

ఆచార్యులు: శిష్యా! కంద పద్యము గూర్చి వివరించుము.

శిష్యుడు: గురువు గారూ! కంద కూర వండుట ఎంత కష్టమో, కంద పద్యము రచించుట అంత కష్టము.

93. డుమ్మా

యాంకరి: మీరు తీయబోయే చిత్ర విచిత్ర సినిమా పేరు ఏమిటో చెప్పండి.

డైరక్టర్: ముందుగా నా పేరు అడగండి.

యాంకరి: క్షమించండి, మీ పేరు ఏమిటి?

డైరక్టర్: నా పేరు ‘గైర్‌హాజర్ రాజా’. నేను స్కూలు, కాలేజీ క్లాసులకు గైర్హాజరై దాదాపు తెలుగులో వచ్చిన సినిమాలను చూసేశాను.

యాంకరి: ఓహో! అందుకేనా! మీరు ఇన్ని సినిమాలు తీయగలిగారు.

డైరక్టర్: ఔను! ఇది నా అనుభవం.

యాంకరి: ఇప్పుడు చెప్పండి మీ చిత్ర విచిత్ర సినిమా పేరు ఏమిటో?

డైరక్టర్: ‘డుమ్మా’.

94. తెర వెనుక

నాయకుడు: ఇదేమిటయ్యా! పార్టీ కార్యాలయంలో తెర కట్టారెందుకు?

కార్యకర్త: అప్పుడప్పుడూ మనం తెర వెనుక రాజకీయాలు కూడా చెయ్యాలి అని నిన్న మీటింగులో మీరే చెప్పారు కదా! అందుకనే తెర కట్టాను సార్!

95. శవానంద్

యాంకరి: మీకు ప్రత్యేక అవార్డు ఏ పాత్రకిచ్చారు?

శవానంద్: సహజంగా నటించినందుకు

యాంకరి: అదే ఏ పాత్రలో నటించారు, సారీ.. జీవించారు?

శవానంద్: శవంగా సహజంగా నటించినందుకు.

96. తప్పట్లు – చప్పట్లు

పండిట్: తప్పట్లకీ, చప్పట్లకీ తేడా ఏమిటిరా?

పండరి: విషయం నచ్చినా, నచ్చకపోయినా ఏదో తప్పదన్నట్లు కొట్టేవి తప్పట్లు, ఇక చప్పచప్పని ప్రసంగాలకు కొట్టేవి చప్పట్లు.

97. సర్‍పంచ్

టీచర్: సర్‌పంచ్ అంటే ఎవరు?

మున్నా: సర్‌ఛార్జి కట్టడానికి పంచె కట్టుకొని ఆఫీసుకు వెళ్ళేవాడే సర్‌పంచ్ సార్!

98. కెమిస్ట్రీ

హేమంత్: నువు డిగ్రీలో స్పెషల్‌గా ఏం తీసుకున్నావ్?

వెంకట్: నేను కెమిస్ట్రీ తీసుకున్నాను రా.

హేమంత్: కెమిస్ట్రీ చాలా కష్టమైనదిగా, అది ఎందుకు తీసుకున్నావు?

వెంకట్: నా గర్ల్ ఫ్రెండ్‌తో కెమిస్ట్రీ బాగా కుదురుతుందని!

99. డంపింగ్ ప్లానెట్

వినయ్: ఏంటిరా అంత సంతోషంగా, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు?

అజయ్: నాకో సూపర్ ఐడియా వచ్చిందిరా!

వినయ్: అదేంటో చెప్పరా.

అజయ్: మన భూమ్మీద చెత్త పడేయాటానికి డంపింగ్ యార్డులే లేవు కదా.

వినయ్: ఇదేమైనా కొత్త విషయమా?

అజయ్: ముమ్మాటికీ కొత్త విషయమేరా! నా ఐడియా, పరిశోధనలు మెచ్చి ప్రభుత్వం నాకు అవార్డ్ కూడా ఇస్తుందిరా.

వినయ్: అది ఏమిటో చెప్పరా.

అజయ్: మనం పడేసే చెత్తా చెదారాలన్నీ వేరే గ్రహం మీద పడవేస్తే అసలు మనకు డంపింగ్ యార్డ్ చెత్త సమస్యలు ఉండవు కదరా!

100. వెబ్ కౌన్సిలింగ్

పేరెంట్: ఇదేమిటయ్యా విద్యార్థులకు ‘వెబ్ కౌన్సిలింగ్’ ఈ పాడుబడ్డ భవనంలో పెట్టారు? పైగా ఈ భవనం కూలిపోయేలాగా కూడా ఉంది! ఆఁ..

నిర్వాకం: వెబ్ అంటే సాలెగూడే కదా! అలాంటి సాలెగూళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి. అందుకనే కౌన్సిలింగ్ ఏర్పాటు చేశాం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here