హాస్యరంజని-3

0
12

[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.

21. అనాథ శవం

విలేకరి: మీకు సహజనటుడిగా అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు.

శ్యామ్: ధన్యవాదములు

విలేకరి: ఈ సినిమాలో మీరు నటించిన పాత్ర ఏది?

శ్యామ్: నా బాడీ లాంగ్వేజికి అవార్డు వచ్చింది. సినిమా పేరు ‘అనాథ శవం’. నేను ధరించిన పాత్ర టైటిల్ పాత్ర.

22. కలియుగ ధర్మము

ధర్మయ్య: అయ్యా యమధర్మరాజా! నేను నా జీవితమున అసలు పాపములు ఏమీయునూ చేయలేదు. నాకు స్వర్గప్రాప్తి లభించవలెను. కానీ నరకమున పడవేసినారెందులకు?

యమధర్మరాజు: చూడు ధర్మయ్యా! నీవు చెప్పినది ముమ్మాటికీ సత్యమే.  అది కృత, త్రేతా, ద్వాపర యుగములందు ధర్మము. కానీ కలియుగము నందు ధర్మము మారినది.

ధర్మయ్య: అది ఎటుల ధర్మరాజా?

యమధర్మరాజు: మీటరు లేకుండా దొంగతనముగా వాడిన కరెంట్ బిల్లులూ, ఉచితముగా ఇచ్చిన కరెంట్ చార్జీలను సర్‍ఛార్జ్ పేరుతో ప్రజలందరిపై వేయుటే కదా కలియుగ ధర్మము.

23. కొత్త రక్తం

నాయకుడు: మన కార్యకర్త కమలాకర్ అర్జెంటుగా ఎక్కడికెళుతున్నాడు?

కార్యకర్త: బ్లడ్ బ్యాంక్‍కి సార్!

నాయకుడు: వాళ్ళ చుట్టాలకెవరికైనా రక్తం కావాలా ఏమిటి?

కార్యకర్త: చుట్టాలకి కాదు సార్! మనకే!

నాయకుడు: మనకా? ఎందుకు?

కార్యకర్త: మన పార్టీని కూడా కొత్త రక్తంతో నింపాలని మీరు మీటింగులో చెప్పారుగా!

24. లాయర్

సాయి: విషయం తెలియకుండా వాదించకు.

గోపాల్: నిన్ననే నేను ‘ఫాదర్ ఇన్ లా’ అయ్యాను బాబూ! మాక్కూడా లా తెలుసు!

25. హ్యామర్ త్రో

ఫోర్‍మన్: అదేమిటయ్యా! మిషన్ మీద పని చేయకుండా సుత్తిని దూరంగా విసిరేశావ్?

రెడ్డిబాబు: వచ్చే నెలలో వచ్చే స్పోర్ట్స్ మీట్‌లో హ్యామర్ త్రో ఆడమని నిన్న మీరే చెప్పారు కదా! అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను సార్!

26. క్లాప్

డైరక్టర్: క్లాప్

క్లాప్‌బోయ్: క్లాప్స్ కొట్టాడు

డైరక్టర్: అదేమిటయ్యా క్లాప్‍బోర్డ్ లేదా?

క్లాప్‌బోయ్: ప్రొడ్యూసర్ గారు మన సినిమాకి బడ్జెట్ తగ్గించేశారండి. అందుకే నేనే మాన్యువల్‍గా క్లాప్ కొడుతున్నాను.

27. మెగా మూకుడు

నాగేంద్ర: అదేమిటి, ఆవిడ అంత పెద్ద బూరెల మూకుడు కొంటోంది?

సురేంద్ర: ఆవిడ రోజూ మొగుణ్ణీ వేపుకు తింటుందిలే!

28. కవి – మీడియా

టీచర్: కవికీ, మీడియాకి తేడా ఏమిటిరా?

విద్యార్థి: ఏ విషయమైనా కవి రెండు సార్లు చెపుతాడు. అదే మీడియా ఐతే నాలుగు సార్లు చెపుతుంది.

29. గుర్తొచ్చింది

పోలీస్: ఇది సినిమా హాలు. హాలులో పొగ త్రాగరాదని తెలియదా! ఎందుకని సిగరెట్ కాలుస్తున్నావ్.. ఆఁ..

రాజు: అసలు సిగరెట్ తాగాలనే ఉద్దేశమే నాకు లేదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు, పదే పదే సిగరెట్ త్రాగకూడదని తెర మీద చూపిస్తున్నారు. అప్పుడు గుర్తొచ్చి, సిగరెట్ వెలిగించాను.

30. బీభత్సం

దర్శకుడు: ఇదేమిటయ్యా? పాటని మరీ ఇంత బీభత్సంగా పాడావు?

గాయకుడు: పాటలో నవరసాలు ఉండాలని మీరే చెప్పారు కదండీ! అందుకే బీభత్స రాగంలో పాడేశాను.

దర్శకుడు: నువ్వు పాడేవు గానీ, నీ పాటతో నేను పాడెక్కేలా వున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here