కాజాల్లాంటి బాజాలు-84: హతోస్మి..

1
9

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ని[/dropcap]న్న పొద్దున్నే అభయాంబక్కయ్య ఫోన్ చేసింది.

ప్రతి పదిహేనురోజులకీ ఒకసారి ఫోన్ చేస్తుంది. నిన్న కూడా అలాగే చేసింది.

“అంత సరిగ్గా పదిహేనురోజులకే ఎలా గుర్తొస్తాను అక్కయ్యా..”  అడిగేను నేను.  పకపకా నవ్వేసింది.

“నేను డైరీలో అందరి పేర్ల దగ్గరా ఎన్నాళ్ళ కోసారి మాట్లాడాలో మర్చిపోకుండా రాసి పెట్టుకుంటాను తెల్సా! అమ్మా, అక్కచెల్లెళ్ళూ, వదినామరదళ్ళతో రోజు విడిచి రోజు మాట్లాడతాను. ఆడపడుచులు, తోడికోడళ్లతో నాల్రోజుల కోసారి మాటలాడతాను. ఇదివరకు పక్కింట్లో వుండి వెళ్ళిన హనుమాయమ్మతోనూ, మావారి కొలీగ్ వెంకట్రావు వాళ్ళావిడ రుక్మిణితోనూ వారాని కోసారి మాట్లాడతాను. స్నేహితులతో అయితే పదిరోజుల కోసారి మాట్లాడతాను”. అంటూ ఊపిరి పీల్చుకుందుకు ఆగింది అభయాంబక్కయ్య..

“అంటే స్నేహితుల కన్నా దూరమయ్యానన్న మాట నేను..” నిష్ఠూరమాడేను.

“అబ్బే.. అది కాదు స్వర్ణా.. వాళ్లందరూ నాతో సరిగ్గా వాళ్ళిళ్ళ కబుర్లు కూడా చెప్తారు. నువ్వు ఉట్టినే వింటావు తప్పితే ఏవీ చెప్పవు.. అందుకే  ఆ కబుర్లన్నీ నీకు చెప్పడానికి ఇలా చేస్తుంటాను.”

నిజవే కదా అనిపించింది నాకు.. అభయాంబక్కయ్య తనకి తెలిసిన చుట్టపక్కా లందరి కబుర్లూ అరగంటకి తక్కువ కాకుండా చెపుతూంటుంది. కాలక్షేపం కబుర్లు చెపితే పరవాలేదు.. కానీ అదేంటో ఆ కబుర్లన్నీ చాలా విచారకరంగా, బాధ కలిగించేలా వుంటాయి. అంతేకాదు ఆ కష్టాలూ, బాధలూ అన్నీ తన కొచ్చేస్తాయేమో నని ఖంగారు పడిపోతుంది. ఆ కబుర్లు వింటూంటే నేను ఏం మాట్లాడాలోకూడా తెలీని స్థితిలో పడిపోతుంటాను. అయినా ‘రోటిలో తలదూర్చి రోకటిపోటుకి వెరిస్తే ఎలా’  అనుకుంటూ,

“ఇంతకీ కబుర్లేవున్నాయేంటీ ఇవాళ..” ఉత్సాహం గొంతులో వినపడాలని కాస్త గట్టిగా అన్నాను.

“నీకు మా పెద్దక్కయ్య తెల్సుకదా.. దానికి ఇద్దరూ ఆడపిల్లలే. వాళ్ళ పెళ్ళిళ్లైకూడా పదేళ్ళు దాటేయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ పోట్లాడుకుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోడం మానేసేరుట. ఇద్దరూ కల్సి వాళ్ళమ్మ దగ్గర ఒకళ్ళ నొకళ్ళు తిట్టుకుంటారుట. అలా ఉన్న ఇద్దరు పిల్లలూ బధ్ధశత్రువుల్లా పోట్లాడుకుంటుంటే పాపం మా అక్కయ్య ఫోన్ చేసి ఒకటే ఏడుపనుకో.. రేప్పొద్దున్న నా పిల్లలిద్దరూ కూడా అలా దెబ్బలాడుకుంటారేమోనని గుండెల్లో దడొచ్చేసింది. వాళ్ళిద్దర్నీ పిల్చి మీరిద్దరూ అలా దెబ్బలాడుకుని, మాట్లాడుకోడం మానెయ్యకండర్రా…ఈ తల్లి మనసు తట్టుకోలేదూ అంటూ వాళ్ల దగ్గర భోరుమన్నాను.”

అక్కయ్య చెప్పింది వింటూంటే నాకు నిజంగానే గుండెల్లో దడొచ్చినట్టైంది.

“ఇంతకీ మీ పిల్లలేవన్నారూ..” గొంతు తడారిపోతుంటే అడిగేను.

“ఏవంటారూ.. నా ఏడుపంతా విని నన్నో పిచ్చిదాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయేరు..” అంది అక్కయ్య.

ఫక్కున రాబోయిన నవ్వుని ఆపుకున్నాను.

అభయాంబక్కయ్య మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.

“మొన్న మా పెద్దవదినకి చేసేనా..”

మళ్ళీ శ్రధ్ధగా వినడం మొదలెట్టేను.

“మా వదినా వాళ్ళన్నయ్య వాళ్ళమ్మనీ, నాన్ననీ వృధ్ధాశ్రమంలో చేర్పించేట్ట. వాళ్ళ వదిన మహాగయ్యాళిలే. అత్తమామల్ని ఇంట్లోంచి గెంటేస్తే కానీ అన్నం ముట్టనని కూర్చుందిట. వాడు మటుకు ఏం చేస్తాడు పాపం.. అని మా వదిన చెప్తే ‘పోనీ, నువ్వు తీసుకురాలేపోయేవా వదినా…మీ ఇంటికీ..’ అన్నాను నేను.. దానికి మా వదిన ‘ఆడపిల్లింటి కొచ్చి ఉండడం మర్యాద కాదు. మీ అన్నయ్యకి చెడ్డపేరొస్తుంది. అయినా మేవే కావాలని  మా వయసువాళ్లతో గడపొచ్చని ఇక్కడ చేరేం. మీ అన్నయ్య నెల నెలా డబ్బులు కట్టే మంచిదాంట్లోనే చేర్పించేడు.’ అని చెపుతున్నారుట. పాపం మా వదిన ఒకటే ఏడుపనుకో.. ఇది వింటుంటే నాకెంత భయమేసిందనుకున్నావు స్వర్ణా. రేప్పొద్దున్న మా పిల్లలిద్దరూ మమ్మల్ని కూడా ఇలాగే బైటకి గెంటేస్తారంటావా!.”

“ఆమాట మీ పిల్లల్ని పిలిచి అడగాల్సింది….దెబ్బకి తేలిపోను”…అందామనుకుని బలవంతాన ఆగిపోయేను.

“నిన్న హనుమాయమ్మ ఏం చెప్పిందో తెల్సా!”

మళ్ళీ కుతూహలం రేగింది నాలో. నా స్పందనకోసం చూడకుండానే వదిన అందుకుంది.

“వాళ్ళ చుట్టాలమ్మాయిట…సరిగ్గా పెళ్ళి రేపనగా ముందురోజు రాత్రి జంప్ జిలానీట..”

“అంటే..” అన్నాను అర్ధంకాక..

“హయ్యో.. అదీ తెలీదూ.. ముందురోజు రాత్రి  ప్రేమించినవాడితో ఇంట్లోంచి పారిపోయిందిట. ఈమధ్య ఇలాంటివి బాగా అవుతున్నాయిలే.. పోనీ పెళ్ళి కుదిర్చే ముందే పెద్దవాళ్లకి చెప్పొచ్చుగా…హబ్బే… అప్పుడు నోట్లో ముద్దెట్టుకు కూర్చుంటారూ… ముచికలో కొచ్చేక ఇలా చేస్తారు.. ఏమో.. రేప్పొద్దున్న నా కూతురు ఇలా చెయ్యదు కదా!  నాకిప్పట్నించీ భయమేసేస్తోంది స్వర్ణా.. అడగమంటావా దాన్నీ..”

అయ్యబాబోయ్.. ఇంకా ఇలాంటి కబుర్లు ఎన్ని వినాలో అనుకుంటూ…పోనీ అభయాంబక్కయ్య ఆలోచనల్లో కాస్త మార్పు తెద్దావని అనిపించి “అక్కయ్యా, నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్తాను..” అన్నాను.

“చెప్పమనేకదా నిన్నడిగిందీ..” అంది అక్కయ్య అభయమిస్తూ..

“కొన్ని విషయాలు మన చేతిలో వుంటాయి.. కొన్నుండవు.. మన చేతిలో వున్నవాటి గురించి మనం జాగ్రత్త పడాలి. అందులో తప్పు లేదు. కానీ ఆ జాగ్రత్త కాస్తా శృతిమించి పిచ్చి ఆలోచనలు పెంచుకుని నువ్వు బాధపడి ఎదటివాళ్లని బాధ పెట్టకూడదు.”

“నాకేం అర్థం కాలేదు.. ఓ వైపు జాగ్రత్తగా వుండాలంటావు.. మళ్ళీ ఏదో అంటావు..” అని మాట మధ్యలో ఆపేసింది అక్కయ్య.

“సరే.. నీకర్ధమయేలా చెప్తాను.. విను.. మనం రైలు ప్రయాణం చేస్తున్నావనుకో.. టికెట్టు కొనుక్కుని దాన్ని జాగ్రత్త పెట్టుకోడం, రైలెక్కినప్పుడు మన సామానూ గట్రా జాగ్రత్తగా చూసుకోడం.. ఇవన్నీ మనం తీసుకోవల్సిన జాగ్రత్తలు. అంతవరకే మన చేతిలో ఉంది.. కానీ రైలెక్కిన దగ్గర్నించీ ఆ రైలు నడిపేవాడు తాగేసి నడుపుతున్నాడేమో.. సిగ్నల్స్ సరిగ్గా పడతాయో లేదో… మధ్యలో ఎవరైనా పట్టాలు పీకేసేరేమో… లేకపోతే ఎదురుకుండా వచ్చే రైలు కూడా ఈ పట్టాలమీదకే వచ్చి రెండు రైళ్ళూ ఢీ కొట్టుకుంటాయేమో… ఈ యాక్సిడెంటులో కాళ్ళూ చేతులే పోతాయో లేకపోతే ప్రాణవే పోతుందో.. ఈ కబురు నావాళ్లకి ఎప్పటికి తెలుస్తుందో… ఇలా మనం చెయ్యలేని, మన చేతిలో లేని, అస్సలు పనికిరాని అలోచనలతో బుర్ర పాడుచేసుకుంటే నీకూ, నీతోపాటు నీ చుట్టూ వున్నవాళ్ళకీ కూడా పిచ్చెక్కిపోతుంది. కొన్ని మనం వదిలేసుకుంటేకానీ మనం బతకలేం..”

నా మాటలకి అట్నించి ఓ నిమిషందాకా స్పందనేమీ వినిపించలేదు. రెండో నిమిషంలో అభయాంబక్కయ్య గట్టిగా ఇలా అంది..

“స్వర్ణా.. సరిగ్గా గుర్తు చేసేవ్.. రేపు మీ బావగారు ఆఫీసుపనిమీద గుంటూరు వెడుతున్నారు.. నువ్వన్నట్టు రైలు కేమీ ప్రమాదం జరగదు కదా!..”

“హతోస్మి..” అనుకోకుండా వుండలేకపోయేను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here