హ్యాట్స్ ఆఫ్ టూ ద…

0
7

[dropcap]’చ[/dropcap]ల్తీ కా నామ్ గాడీ’ అనుకొంటూ ఏదో నడూస్తున్న విధానాన్ని కొనసాగించకుండా ఓ కమీషన్ సిఫార్సు ప్రకారం ఈ పద్ధతిని అమలు చేయ సంకల్పించింది – ఎన్నెనో కమీషన్ రిపోర్టుల్ని అటకెక్కించగల్గిన ప్రభుత్వం. ‘పటూ, పటూ ఇస్తా’మంటే ఏదేదే కొడ్తూన్నట్లుగా దూరదూరంగా జరిగిపోయే వాళ్ళూంటారా? అలాగే నేనూ కూడా. ప్రభుత్వం యివ్వజూపిన దాన్ని పుచ్చుకోడానికే చేయి చాచాను. నా ‘ఐచ్ఛికత’ను తెలియజేశాను. ప్రభుత్వం ‘బలవంతం ఏమీ లేదు. యిష్టమైతేనే’ అంది. ‘ఇన్‌కంటాక్సు’ కూడా వుండని ఆలోజింపజేసే మొత్తమే. వద్దు అనాలన్పించలేదు. సీనియర్ ఆఫీసర్లు గదా! ‘కారే’సుకుని డ్యూటీకి సకాలంలో వస్తారన్నట్లు – ‘కన్వీయెన్స్ అలవెన్సు’గా మంచి మొత్తాన్నే యివ్వజూపుతోంది. అసలు నాకు కారే లేదన్న విషయాన్ని పట్టించుకోలేదు. నీకు ఏమున్నా లేకున్నా నాకెందుకు? ఈ మొత్తాన్ని నెల నెలా తీసుకుంటూ ఆఫీసుకు వచ్చేప్పుడు ఆలస్యం లేకుండా రావాలి, ఇంటికి పోయేప్పుడు ముందుగా పోగూడదు. ముందుగా రాకపోయినా, లేటుగా పోకపోయినా సరి. మిగిలినదంతా మీ యిష్టం! వచ్చేప్పుడూ, పోయేప్పుడూ పొరపాటున గూడా ప్రభుత్వ వాహనాన్నెక్క గూడదు. అంతే నడుచుకుంటూనైనా రండి గాక!

సీనియర్ ఆఫీసర్ సైకిల్ తొక్కుతూ కన్పిస్తే స్కూటర్ల మీద వచ్చే కింద వాళ్ళంతా చెప్పిన మాట వింటారా? మన ‘ఆంప్రరారోరసం’ బస్సుల్లో రోజూ రెండు మార్లు ఆఫీసుకు పోయేప్పుడు, ఇంటికి వచ్చేప్పుడు ఎక్కగల్గడమన్న విషయం ఊహించగల్గేదేనా? కారులో వస్తాడు గదా అని ప్రభుత్వం అంత మొత్తాన్ని యిస్తానంటూంటే ఏం చేయాలి? ఐదూ, ఐదూ పది కిలోమీటర్ల దూరం రోజూ గడిచేదెలా? మసక చీకట్లలోనైతే ఏదో పరుగు పందెం పేరు మీద పరుగెత్తవచ్చు గానీ మరీ ఆఫీసు వేళల్లో రోడ్ల మీద కుదరదు గదా. లావు తగ్గడానికి పరుగు పేరుతోనన్నా ఉత్సాహం ఉబికి వచ్చి పని నెరవేరుతుందేమో అనుకుంటే కూడా లావే లేని నా శరీరం మీద మనస్సు అందుకు ఉత్సాహం చూపిస్తుందా ఉరుకులు, పరుగులకు? ఉత్సాహమే చూపని మనస్సుతో శరీరాన్ని పని చేయించడం కుదరదు గదా.

ఇక తప్పేట్లు లేదు – ఓ స్కూటర్‌ను కొనక. అప్పటివరకూ నాదంటూ ఓ సైకిల్ కూడా లేదు. ఉన్నదేదో మా పిల్లలకు కొన్నది తప్ప. మా పిల్లలు పరుగెత్తడం నేర్చినాక నడవడం పూర్తిగా మర్చిపోయారు. తమకు కాళ్ళున్న సంగతే తెల్సిరాదు సైకిల్ కన్పిస్తే తప్ప. ఏదైనా చిన్న పని కోసం మా పెద్దవాడ్ని పురమాయిస్తే పావు ఫర్లాంగు దూరానికి “ఇప్పుడు సైకిలు లేదు. చిన్నవాడు తీసికెళ్ళాడు. వాడు వచ్చినాక గానీ కుదరదు” అని పనుల్ని పక్క కేసేవాళ్ళు – యిప్పుడు చేయాల్సివున్న పనుల్ని అప్పటికి. పుస్తకాల్లో చదివిన పాఠాన్ని ‘అబ్ కరేసో కల్ కరో’ అని అర్థం చేసుకున్నారు.

నేనేదో బక్క చిక్కిన సెకెండ్ హాండ్ మోపెడ్‌ను, సైకిలుగా చేతి బ్రేకుల దాన్ని కొనుక్కుందామన్న ఆలోచనలో వున్నాను. అది మోయాల్సిన బరువెంత? దూరమెంత? సమయమెంత? రోజంతా కల్పి మహా అయితే యాభై కిలోల బరువూ, రానూపోనూ పట్టుమని పది కిలోమీటర్ల దూరం. అరగంట సేపు, ఏడాదిలో అది పనిచేయాల్సింది ఎనిమిది నెల్లే. వానాకాలం నాల్గునెల్లు నలుబదేండ్ల కిందటే చచ్చి వున్నా దీని లెఖ్ఖలో వున్నట్లే. చచ్చిపోయినవాళ్ళు బ్రతికి వున్న లెఖ్ఖల్లోనే లేరా రేషన్ కార్డుల్లలో, ఎలక్షన్ లిస్టులల్లో. దాని నాల్గు నెళ్ళ వానాకాలం అంతేనా, సెలవలు, సిక్ లీవులు గట్రా.

నేను స్కూటర్ కొనక తప్పదన్నది నిర్ధారణ కాగానే, మా పెద్దవాడు వాటి రకాల గురించి నాకు తెలియకుండానే సీక్రెట్ ఏజెంటు డ్యూటీ చేపట్టాడు. నేను బక్క గుర్రాన్ని కొనాలనుకుంటున్నట్టు తెల్సి –

“అలాంటిదేం కుదరదు. రాక రాక  యిప్పటికి ఈ అవకాశం వచ్చింది, ఎంతో కాలంగా పడిగాపులు పడగా పడగా. అందరికీ, అక్కతో సహా కల్పుకుంటే ‘ఫలానా’ స్కూటరైతేనే అనుకూలంగా వుంటుంది. దాన్ని మాత్రమే కొనాలి” అన్నాడు. నా శ్రీమతికి స్వంతంగా తనకంటూ ఏ అభిప్రాయాలు లేవు. ఆమెది మెజారిటి పార్టీ. అందులో అది పిల్లల పార్టీ గదా. ఆమె గొంతును కూడ అటే కల్పింది. “ఒడ్డు వస్తే కనీసం యిద్దరినన్నా మోయాలి గదా!” అంది. చిక్కి ఉన్న వయసు మీద పడ్డ బక్క గుర్రం దిశగా మొహాలు తిప్పడానికి ఎవ్వరూ యిష్టపడలేదు.

వాళ్ళందరి కోరిక మేరకే అప్పటికి మార్కెట్‍లో వున్న అన్నింటి కన్నా ఖరీదైన కొత్త స్కూటర్‌ను కొన్నాము. దాని కలర్ కూడా మా పెద్దవాడి ఎంపికే. వాడు అనుకుని వుంటాడు – నాన్న, మిగిలిన వాళ్ళంతా దాని పేరుకే. అసలు వూరు తనదే గదా! అని. పాండవులలో ‘భీమభాగం’ తనదే. మిగిలిన దాంట్లోనే మిగిలిన వాళ్ళందరూ సరిపుచ్చుకుంటారు!

స్కూటర్ నడపాల్సిన వయసులో రాకపోయినా ‘గేర్ లెస్’ వెహికల్ లాంటి కన్సెషన్ల మీద డ్రైవింగ్ లైసెన్సు సంపాదించుకున్నాడు. నాకు స్కూటర్ డ్రైవింగు నేర్పింది కూడా మా పెద్దవాడే. కానీ, పాపం వాడి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. పొద్దున్న ఎనిమిదిన్నర మొదలు సాయంత్రం ఆరు వరకూ స్కూటర్ మా ఆఫీసు ముందు షెడ్డులోనే నిద్రపోతూంటుంది. ఇంక పిల్లలందరూ కలిపి దాన్ని నడపటానికి మిగిలి చచ్చిన టైమేది? చీకటి పడుతూండగా తప్ప. మరీ తెల్లవారక ముందు మసక చీకట్లలో నిద్రలేచి నడపలేరు గదా? మా అమ్మాయితో సహా అందరిదీ కలిపి ఒకే గొంతు – బలంగా – “ఖరీదైన కొత్త స్కూటర్‌ను కొన్నామన్న ఆనందమేదీ ఎవ్వరికీ మిగలడం లేదు. ఇలాగైతే కుదరదు. లేకలేక వచ్చిన ఒక్కగానొక్క స్కూటరును ఇంటి పట్టున వదలాల్సిందే. మీరేం చేస్తారో మాకనవసరం. అంతే” అన్నారు. మళ్ళీ నా శ్రీమతి ఓటు పోల్ అయింది ఆ పార్టీకే – పిల్లల ఆశ వేపే.

మా మిత్రులన్నారు “అంత ధర పెట్టి స్కూటరెందుకు కొన్నావు? దాంట్లో సగం ధర పెడితే సెకండ్ హాండు కారే వచ్చేదిగా” అని. కారుచవకగా ‘కారు’ వస్తే దాని బరువును బ్రతికినన్నాళ్ళూ నేనే మోయాలా? ఇప్పటికిప్పుడు నాకలాంటి చచ్చు ఆలోచనలేం లేవు. పిల్లకాయలకు ఆశలు లేకేం చేస్తాయి గానీ! తనుగు వుంది గదా అని బర్రెను కొంటానా? ప్రభుత్వం అలవెన్సు యిస్తుంది గదా అని పాత కారును కొంటే ఆ వచ్చే అలవెన్సు దాని మేతలో ఏ మూలకు?

ఇప్పుడు నేను మళ్ళీ ఆలోచనల్లో పడ్డాను. ఇంతకాలానికి స్కూటర్ కొంటే అది వాళ్ళ ఆశల మీద చన్నీళ్లు చల్లుతూన్నందుకు నాకు సమ్మతంగా లేదు. పిల్లల ఆశల్ని తీర్చాల్సిందే. కానీ మరి నా అవసరం ఎట్లా? ఓ ఆలోచన వచ్చింది. నేను మొదట్లో అనుకున్నట్లు ఈ కొన్న స్కూటర్ ఖరీదులో పదో వంతు పెడితే చాలు బక్క గుర్రం వస్తుంది కదా! దాంతో అందరివీ, పిల్లల ఆశలు, నా అవసరం అన్నీ తీరతాయి కదా! వెంటనే చుట్టూ రెండు మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న మెకానిక్ షాపుల్ని తిరిగాను. పాతవి అమ్మకానికి ఏం లేవు ఇప్పటికిప్పుడే. కనుక్కొని చెప్తామన్నారు అందరూ. ఒక్కడి దగ్గర మాత్రం ఒకే ఒకటి ఉంది గాని దాన్ని చూస్తే కొనాలనిపించలేదు. మెకానిక్ మాత్రం అన్నాడు “వాటిదేం వుంది సార్! చాలా చిన్న చిన్న విషయాలు. బాగాలేవు అనుకున్న వాటిని బయట పారేసి కొత్తవి ఫిట్ చేసుకోవచ్చు. పెద్ద ఖరీదేం కాదు” అని. అయినా కూడా దాని మీద మనసు మరలక రోజు ఆఫీస్ తర్వాత సాయంత్రం పూట అన్ని మెకానిక్ షాపుల్లో అటెండెన్స్ ఇచ్చేవాడ్ని. వారం – పది రోజులు – రెండు వారాలు గడిచిపోయాయి. మోపెడ్ మరేదీ దొరుకుతుందన్న ఆనవాళ్ళు కనిపించలేదు. అదేంటి! అన్ని షాపులూ, అన్ని రోజులూ తిరిగాను. అంటే పాతవాట్ని అమ్ముకొని – చవకగా, కొత్తవాటిని నాలుగైదు రెట్లు ఖరీదు పెట్టి కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్న మాట! ఉన్నవాటిని రిపేరు చేయించుకొని వాడుకుంటున్నారన్నట్లే గదా? ఆ ఒక్క మోపెడే ఆ దరిదాపుల్లో అన్ని మెకానిక్ షాపుల్ని తిరుగుతోందన్నమాట. ఎవ్వరూ వినడం లేదు. ఆ వున్న దాన్ని ఎవ్వరూ కొనడం లేదు. కొనదగ్గ వాటిని ఎవ్వరూ అమ్మడం లేదు.

మెకానిక్ అన్నట్లే తప్పలేదు. అసహ్యంగా కనిపిస్తున్న భాగాల్ని ఊడ పెరికేసి కొత్తవాటిని ఫిట్ చేయించుకుంటే బాగానే కన్పిస్తుంది గదా అనుకున్నాను. ఆ రోజు సాయంత్రన నేను వెళ్ళేసరికి దాన్నే ఒకతను బేరమాడుతున్నాడు. “నాకు దాని కాగితాల అవసరం కూడా లేదు. ‘ఇంత’కిస్తే తీసికుంటాను” అన్నాడు. మెకానికి అతని మాటను ఒప్పుకున్నా లేక మెకానిక్ మాటను అతడు ఒప్పుకున్నా నాకు అది కూడా నిరాశనే మిగుల్చుతుందన్న మాట. కానీ, మెకానిక్ ఒప్పుకోలేదు. అతడు వెళ్ళిపోయాడు. ఇంక నేను ఆలస్యం చేయకుండా “అతడిస్తానన్నదానికంటే ఓ వంద ఎక్కువిస్తా” అన్నాను. ఒప్పుకోలేదు. ఆఖర్న మెకానిక్ రేటుకే నేనొప్పుకుంటూ “అదో! ఆ కన్పిస్తుందే, అది మా స్నేహితుడి యిల్లు. అతడు ఆటోమొబైల్ ఇంజనీరు. ఓసారి అతడికి చూపించింతర్వాత తీసికుంటాను – తప్పకుండా తీసికుంటాను – రేపు – ఇంకెవ్వరికీ ఇవ్వవద్దు” అన్నాను.

“మీకన్నా ముందు ఎవ్వరైనా వస్తే అమ్మేస్తా సార్. మిరు తీసుకుంటారన్న నమ్మకమేమిటి?” అన్నాడు.

“ఇదో, ఈ అడ్వాన్సు తీసికో. ఇంక ఇప్పుడు నమ్మకమే గదా” అంటూ అడ్వాన్సు యిచ్చాను. రేపు నాకన్నా ముందెవరైనా గిరాకీ వస్తే అంతకు తక్కువ గాని మొత్తానికైతే అమ్ముకుంటాడు. ఎక్కువ వస్తే యింక చెప్పాల్సిన పనే లేదు. అయితే బండి నాకు దక్కుతుంది కాకపోతే నా అడ్వాన్సు తిరిగి వస్తుంది. అంతే.

మర్నాడు సాయంత్రం మోపెడ్ వుంది. నా మిత్రుడు ఓ ట్రయల్ వేసి “పర్వాలేదు… తీసికోవచ్చు. నీ అవసరం పెద్దదేం కాదు గదా. కాకపోతే ఓ వందన్నా తగ్గించాలి” అన్నాడు. మెకానిక్ తగ్గనన్నాడు. నేను అడ్వాన్స్ యిచ్చి వున్నాను గదా! యింక మిగిలిన డబ్బులు యిచ్చి వేసాను. మోపెడ్‌ను మా యింటికి చేర్చమని చెప్పి నేను వేరే పని మీద వెళ్ళిపోయాను.

మా యిల్లు చేరిన ఆ బండిని ఎవ్వరూ నచ్చలేదు. అది యిల్లు చేరుకున్న విషయాన్ని ఎత్తడానికి కూడా ఎవ్వరూ నోరు మెదపలేదు. దానికి పూజ చేయాలి గదా! పూజా పునస్కారాలంటే అమితానందాన్ని, పరమ భక్తి ప్రపత్తుల్ని చూపే నా శ్రీమతి ఆ బండికి మాత్రం అంటీ ముట్టనట్టే పూజ చేసినట్లనిపించింది! అంతే, యింక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని ముస్తాబు చేయించాలనుకున్నాను. మాసిపోయిన, చిరిగిపోయిన బట్టల్తో వుంటే అలాగే వుంటుంది గదా. కొత్త బట్టల్లో వుంటే మాట్లాడరా?

ఓ ట్రయల్ వేసి మా పెద్దవాడు ‘మండు వేసవిలో చలివేంద్రంలోని కుండల్లోని నీళ్ళలా తాగేస్తుంది పెట్రోల్ని’ అన్నాడు. మెకానిక్ దగ్గరకు తీసికెళ్ళాం. కార్బోరేటర్ కొత్తది వేయాలన్నాడు.

“అదేంటయ్యా! అంతా బాగానే వుందని నిన్ననే గదా అన్నావు, అమ్మావు?”

“బండి నాది కాదు గద సార్! రోజు అది ఎంత పెట్రోల్ తాగుతుందో మనకెట్లా తెలుస్తుంది? ఓనరు అమ్మమ్మన్న రేటుకి అమ్మడం మాత్రమే నేను చేసింది. దాని లోపల సంగతి నాకెలా తెలుస్తుంది? యిప్పుడు విప్పాం కాబట్టి మేడిపండులా పై కొచ్చాయి. ఈ ‘ఆటో క్లినిక్’లో విప్పి చూడందే జబ్బులు తెలుస్తాయా. ప్రస్తుతానికి మాత్రం తెల్సి వచ్చిన పెద్ద జబ్బు ఇదే” అన్నాడు. తప్పదు కదా. అది నన్ను రోజూ ఎక్కువ ఖర్చు పెట్టించకుండా ఆఫీసుకు తీసుకుపోయి తీసుకురావాలంటే జబ్బు నయం చేయించాలి గదా! దాని జబ్బు నయాలకూ, కొత్త బట్టలకూ, ముస్తాబులకూ ఓ ఐదు వందల కాగితం వేశాను.

ఇప్పుడు నా శ్రీమతి కళ్ళు దాన్ని పర్వాలేదే అన్నట్టు చూడగల్గాయి. ఆమెకు తెలియదు. చప్పిడి ముక్కు జీవితాంతం అలాగే వుండిపోవాల్సిందే గదా అన్న బెంగ తప్ప, ప్లాస్టిక్ సర్జరీ వుంటుందని యిప్పుడే తెల్సుకుంది.

మా పెద్దోడి శ్రద్ధాసక్తుల్ని గమనించిన మెకానిక్కులు “సార్! మీ అబ్బాయిని ఆటోమొబైల్ ఇంజనీరింగ్‍లో మాత్రమే చేర్పించండి” అని చెప్పి తమ ముచ్చట దీర్చుకున్నారు. అప్పట్లో మా అమ్మాయి అవసరానికి సైకిలు కొంటే దాన్ని విరుగ వాడిందల్లా అబ్బాయిలే. అమ్మాయికి ఆ సైకిల్ అవసరం తీరిపోయింది. అయినా మా పెద్దోడు ఓ సైకిల్ కొనమన్నాడు. ‘వేరే సైకిలెందుకు? అక్క సైకిల్‌ను వాడుకో’మన్నాను. ‘లేడీస్ సైకిలును నేను వాడతానా’ అన్నాడు. “లేడీస్ సైకిలే చాలా అనుకూలంగా వుంటుంది ఎక్కడానికీ, దిగడానికీ – భూమ్మీద కాళ్ళానించడానికి చాలా సులభం, సురక్షితం. మరేం పర్వాలేదు. వాడుకో” అన్నాను.

“మరీ తప్పదంటే వాడుకుంటాను గానీ, దాన్ని కట్టింగు చేయించి, వెల్డింగ్ చేయించి జెంట్స్ సైకిలుగా మార్చుకుని వాడుకోమంటే అభ్యంతరం లేదు” అన్నాడు. సరేనన్నాను. అలాగే చేశాడు. వెల్డింగ్ మెటిమల్ని చిదిమేశాడు ఓ ఫైలు కొనుక్కుని. వెల్డింగ్ వల్ల కమిలిపోయిన దాని చర్మాన్ని పెయింట్ డబ్బాలు కొనుక్కుని తెలియరాని అతుకులు వేశాడు. దానికి అవసరం అనుకునే బోల్డన్ని స్పేర్ పార్టుల్ని – బ్రేక్ షూలను, బేరింగ్ గుండ్లను కొనుక్కున్నాడు. నానా హంగామా. ఆసక్తి పెల్లుబికినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా రోజంతా, రోజులకు రోజులు శ్రద్ధగా సైకిలు మొత్తాన్ని చక్రాలతో సహా ఊడబెరికి, వాకిలంతా పర్చి, సబ్బునీళ్ళతో కడిగి, కిరోసిన్‍లో నానేసి, తుడిచి ఎండబెట్టి మునుపటి లాగే కూర్చి నిలబెట్టేవాడు. అప్పుడు సైకిలైనా, యిప్పుడు వెహికలైనా!

నా మోపెడ్‌ను స్టార్ట్ చేయడానికి నేను కిక్కులు కొట్టీ కొట్టీ యింక కొట్టలేక కూర్చుని మొసకొడ్తుంటే, వాళ్ళు దానిపైకెక్కి తొక్కుతూ త్రిప్పి స్టార్టు చేసేవాళ్ళు. అది దారి మధ్యలో సతాయించిన రోజులున్నాయి. మధ్యలో రోడ్డు ప్రక్కన కార్బోరేటర్‌ని క్లీన్ చేయాల్సివచ్చేది. ఓసారి ఉన్న ఫలంగా ఉన్న పెట్రోల్‌నంతా తాగేసింది అన్న అనుమానం వచ్చింది – తాటి కింద లొట్టిలా. ఇంక ఒక్క పూట కూడా ఆలస్యం చేస్తే, పెట్రోల్ కొంపలంటిస్తుంది. మామూలు మెకానిక్కుతో లాభం లేదని దాని ఎక్స్‌పర్ట్‌ దగ్గరకే తీసుకెళ్ళాను. అది మార్చాలి, ఇది మర్చాలి అన్నాడు ముందుగా. అది మార్చాల్సివచ్చింది, యిది మార్చాల్సివచ్చింది అన్నదాని కన్నా మిన్నగా అన్నాడు. మరో అయిదు వందల కాగితాన్ని ఎగురగొట్టింది. అయినా ఊహించినంతగా కుదురుకోలేదనిపించింది. కడగండ్లేం కనబడకుండా పోలేదు. తర్వాత తర్వాత తెల్సింది. అది అమాంతం ఏమీ పెట్రోల్ తాగేయ్యడంలేదు గానీ ఆఫీసు ముందు గేటవతల వెహికల్ షెడ్డు కాపలావాడు త్రాగేస్తున్నాడని. వేసవి వేడిలో స్టార్టు కావడానికి సతాయించకున్నా పెట్రోల్ దాహం ఎక్కువుండేది. చలికాలం చల్లగాలులకీ, వానాకాలం వాన జల్లులకీ తడిసి ఈడిగిలపడేది. ఓపికగా వున్న నేను మరేం ఫర్వాలేదు అంటున్నా కూడా, “రోజూ కిక్కు కొట్టి పిల్లలూ, మీరూ బేజారౌతున్నారు పాపం!” అంది నా శ్రీమతి. ఈ విషయంలో కుటుంబ సభ్యులెవరూ, ఎప్పుడూ నాతో ఏకీభవించలేదు. కాకి పిల్ల కాకికి ముద్దుగదా అన్నారు.

“సీనియర్ ఆఫీసర్‌వి. అంతా విలువ తక్కువ చేసి చూడరా? కొత్త బండిని కొనుక్కోండి” అన్నారు.

“లేని పోకడలకు పోవద్దు. ఇప్పుడు కొత్త బండికి తక్కువలో తక్కువ యిరవై వేల రూపాయకు కావాలి. ఇప్పటికే రెండు బంద్ల మీద అరలక్ష దాటింది. ఇప్పుడు అప్పు చేసి పెట్తాలా యిరవై వేలు?” నేను.

“ఇన్‌స్టాల్‌మెంట్‌లోనైనా తీసుకోవచ్చుగా?” వాళ్ళు.

“మన పక్కింటాయన కాలాన్ని ఎలా కడుపుతూ వచ్చాడో చూశారు గదా! పదిహేను రూపాయలకు మాంధాత నాటి సైకిల్‌ను కొనుక్కుని కాస్తంత ఖర్చు చేసి రిపేరు చేయించుకుంటే ఇంకా గూడా నడుపుతున్నాడు. కన్పించడంలేదా? దాన్ని గేటవతల్నే వదిలేస్తూంటాడు, రాత్రుళ్ళు కూడా ఎవ్వరూ ఎత్తుకెళ్ళరన్న ధీమాతో. చూడ్డం లేదా? దొంగలైతేనేం, కులం చెడ్డా సుఖం దక్కాలని కోరుకోరా? ఈ సైకిలు నెత్తుకెళ్ళీ, పట్టుబడితే తన్నులు తినేకన్నా ఊరుకోవడమే వుత్తమం అనుకుంటూన్నారు. దాన్ని ఎత్తుకెళ్ళి కిలో లెక్కిన అమ్మితే వచ్చేదెంత? పట్టుబడితే విరిగే ఎముకలకు కట్లుగట్టించుకుంటే అయ్యే ఖర్చెంతా, లెక్కలు చూసుకుని ఆ వేపు కన్నెత్తి చూసి కూడా మిన్నకుంటున్నారు. అందరూ అంతటి పొదుపుల్ని పాటిస్తుండడం కట్టెదురు చూస్తూ కూడా మోయలేని బస్తాల బరువుని నా మెడల మీదకెక్కించి కుంగదీయాలన్న నిరర్ధకపు ఆలోచన్లు మీ బుర్రల్లోకి ఎలా చొచ్చుకుపోతున్నాయా అని! అంతటి పొదుపు తెలివితేతల్నీ మీరు ఎప్పుడు అలవర్చుకుంటారో మరి! అసలు జీవితాంతంలో కూడా అవి మీకు అలవడుతాయా అని! పట్టుబడవని నిర్ధారణే అయింది” నేను.

“అదంటే సైకిలు. ఏమంత ఖర్చు, ఏమంత కష్టం? ఇది రిపేర్లు, పెట్రోలు, కిక్కులతో అందరి శరీరాలకు కడగండ్లు” వాళ్ళు.

నేను యింటికి సంబంధించిన ఓ పెద్ద పనిలో మునిగి ఆఫీసుకు నాలుగు నెలలు సెలవు పెట్టాల్సి వచ్చింది. ఆ నాలుగు నెల్లూ నా మోపెడ్ మూలనపడి వుంది. నాల్గు నెళ్ళాళ్ళ తర్వాత తిరిగి ఆఫీసుకు పోవాల్సిన ముందు రోజు దాని దుమ్ము తుడిచి, కడిగి స్టార్టు చేశాను. నాల్గునెలల తర్వాత కూడా మెకానిక్ సహాయమే లేకుండ నడవగల్గిన స్థితన్న మాట దానిది! అశ్చర్యం వేసినా ఆనందించాను. బండి అంటే అలా గుండాల మరి! అనుకున్నాను. నాల్గు నెళ్ళ తర్వాత కూడా అన్నే కిక్కులకు స్టార్టయింది. మా పిల్లల సహాయం కూడా తీసుకోలేదు. ఇంక ఈ బండికి చావన్నది వుండదు, తాబేలు లాగా – ఎవరెంత మోదినా కూడా – అయుస్సు కూడా అంతే! కొత్త బండిని కొనాలన్న మా వాళ్ళ మాటలిక నీటి మూటలే. కాకపోతే నాల్గునెళ్ళు ఆడించడం తప్పి తుప్పు పట్టి బ్రేక్ కదలడం లేదు. వెంటనే మా చిన్నవాడ్ని పురమాయించాను దగ్గరే వున్న మెకానిక్ దగ్గరకు తీసుకెళ్ళమని.

“రేపు ప్రొద్దున్న నేను డ్రాపు చేస్తాను కొత్త బండి మీద. ఆ తర్వాత దీని విషయం చూస్తాను” అన్నాడు. అలాగే చేశాడు. ఆ తర్వాత రోజూ మోపెడ్ అలాగే వుంది. అడిగితే, “తొందరేం వొచ్చింది, నేను కొత్త బండి మీద డ్రాపు చేస్తానుగా” అన్నాడు… అలా అలా రోజులు సాగాయి. అంటే ఆ బండిని యింక గడిచిపోయిన నాల్గు నెళ్ళ లాగే యిక ముందు కూడా మూలకే పడేయాలన్నదే కదా మా వాళ్ళ ఆంతర్యం… నేనూ ఆలోచించాను. పోన్లే నడిచిపోతోంది గదా ఏదో విధంగా అని అనుకున్నాను. నా బండి మూలకు కూర్చుంది చీపురు కట్టాలా…

రోజూ ఎవరో ఒకరు పెద్దవాడు కాకపోతే చిన్నవాడు నన్ను ఆఫీసుకు పోయేప్పుదు డ్రాపు చేస్తున్నారు. ఇంటికి వచ్చేప్పుడు ఎవరో లిఫ్టు కాకపోతే, ‘ఆంప్రరారోరసం’ బస్సు. నేను యింటికి వచ్చే సమయాల్లో ఆ బస్సులో రద్దీ తక్కువే. ఎటొచ్చీ ప్రొద్దున్నే యిబ్బంది – ఆ బస్సుల్తో. మా వాళ్ళ అభిమతం మేరకు ‘తక్కువ గాని విలువల్తో’ కిక్కుల కడగండ్లను బాసి అలా గడుపుతూ వచ్చాను.

తర్వాత తర్వాత నా ఆఫీసు సమయం, పిల్లల కాలేజీల సమయం కుదరక వాళ్ళు డ్రాపు చేయడం కుదరక పోయేప్పుదు కూడా ‘ఆంప్రరారోరసం’ బస్సుల్లో ఎక్కక తప్పలేదు.

అప్పట్లో ఫుట్ బోర్డుల మీద నిలబడాల్సి వస్తే భయంతో దిగిపోయేవాళ్ళు. ఇప్పుడు లోపల బస్సులో సరిపడా జాగా వున్నా కూడా కొందరు ఎంట్రన్సు కిరుపక్కలా ఒరగబడి ఎక్కేవాళ్ళకు స్వాగతం చెప్తూన్నట్లు, దిగిపోయేవాళ్ళకి వీడ్కోలందజేస్తూ కన్పిస్తుంటారు. ‘ఆంప్రరారోరసం’ అనధికారికంగా వాళ్ళకి ఎలాంటి జరిమానాల్ని విధించవద్దనుకుందేమో. ఆ విధంగా ‘ఆక్యుపెన్సీ రేషియో’ పెంచుకొని  నష్టాల్ని తగ్గించుకొవాలనుకుంటూంది కాబోలు. మొబైల్ కోర్టులు కూడా వున్నట్లు లేవు. కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్లు వీళ్ళు ఎంట్రన్సు దగ్గర ఆ పక్క ఒకరూ, ఈ పక్క ఒకరూ ఆనుకుని వెల్‌కమ్‍లు, గుడ్‌బైలు చెప్తూన్నందుకు కూడా కొన్ని కారణాలు వుండే వుంటాయనిపిస్తుంది. సరదా ఒకటి కావచ్చు, శాడిజం ఒకటి కావచ్చు. టికెట్టు కట్ చేయించుకోకపోవడం కావచ్చు. అన్నింటినీ మించి యింకేదైనా కారణం వుండి వుండవచ్చు.

ఆ రోజు ప్రొద్దున్న ఆఫీసుకని బస్సు ఎక్కాను. క్రిక్కిరిసిన బస్సు. ఫుట్‌బోర్డుకి ఇరుపక్కలా స్వాగతం అన్నట్లు బొమ్మలు నిలబడే వున్నాయి. బస్సు దిగాను ఆఫీసు ముందు స్టాపులో. వీడ్కోలు బొమ్మలు నిలబడే వున్నాయి. నా పాంటు ముందు భాగాన వున్న సీక్రెట్ పాకెట్‌లో వుండాల్సిన నోట్ల ఆనవాళ్ళు తగలలేదు. వివరంగా చూస్తే ఆ ప్రాంతంలో పాంటు, జేబు చీరబడి వున్నాయి. ఖాళీ జేబు! స్టాపుకు – స్టాపుకు మధ్య అంతటి తక్కువ వ్యవధిలో నా శరీర భాగాల కెలాంటి చురక అంటకుండా నోట్లని మాత్రం లాక్కోగలిగిన ఆ చేతులు గలిగిన వాడి ప్రజ్ఞ ఎప్పటికీ గిన్నీస్ బుక్కులో రికార్డు కెక్కే అదృష్టానికి బహుశా నోచుకుని వుండదు.

“ఇక ఇప్పుడన్నా నా మోపెడ్‍కి పని తగిలినట్టే గదా” అన్నాను.

“ఏదో ఎప్పుడో ఓసారి బస్సుల్లో యిలా జరిగితే యిక ఎప్పుడూ అలాగే జరుగుతుందా ఏమిటి? ఎప్పుడో అరువది ఐదేండ్లకొకసారి జరిగేదానికి జడిసి యిప్పుడు రోజూ ఆ బండితో కడగండ్లను ముందేసుకుంటారా? మరేం పర్వాలేదు. బస్సులోనే వెళ్ళి రండి!” అంది నా శ్రీమతి. అంటే సుదూర భవిష్యత్తులో నా పాంట్లన్నీ పనికి రాకుండా మూలకు పడుతుంటే కొత్తవాతికి వెచ్చించడమేనన్న మాట!

‘హ్యాట్సాఫ్ టూ ద పిక్ పాకెటర్! భవిష్యత్తులో నన్నా నీ పేరు గిన్నిస్ బుక్‍లో నమోదు అయిపోవు గాక. ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుందువు గాక! ఇవే  నీకు నా శుభాకాంక్షలు…’ అనుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here