హిచ్‌కీ: కాళ్ళను కట్టేసే సంకెలు కావు, దాటాల్సిన విశేషానికి ప్రతీక

0
13

[box type=’note’ fontsize=’16’] “జీవితంలో అన్నీ ఇలా సుఖంతం కావేమో గాని, ప్రేక్షకులని తమ ఆలోచనలను వొకసారి పునరాలోచించేలా చేస్తుంది ఈ చిత్రం” అంటూ “హిచ్‌కీ” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

కొన్నాళ్ళ క్రితం థియేటర్‌లో చూడటం కుదరని, ఇప్పుడు అమేజాన్ పుణ్యమాని చూసిన రాణీ ముఖర్జీ సినెమా “హిచ్‌కీ”. వొక బాలీవుడ్ వ్యాపార్ చిత్రం. కాని ఇంత చక్కగా వ్యాపార చిత్రాలు తీసినా గొప్పే అనిపిస్తుంది.

మనకు విద్యా వ్యవస్థ మీద “3 ఇడియట్స్” లాంటి చిత్రాలు, “మానసిక లేదా శారీరిక వికలాంగ విద్యార్థుల” (అలా అనబడే) మీద “తారే జమీఁ పర్” లాంటి చిత్రాలు, ఇంకా పిల్లల అల్లరి మీద పాత “పరిచయ్”, కొత్త “స్టాన్లీ కా డబ్బా” లాంటి చాలా చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆ కోవలో మరొక చిత్రం, ఇది బ్రడ్ కోహెన్ ఆత్మ కథ ఆధారంగా కొంత భారతీయత కలిపి తీసినది.

ప్రేంనాథ్ మనవడైన సిద్దార్థ పి మల్హోత్రా 2010లో “వి ఆరె ఫేమిలి” తో దర్శకుడుగా లోకం ముందుకొచ్చాడు. అది ఆడలేదు. ఆ తర్వాత ఈ యేడాది తీసిన “హిచ్‌కీ” తో గుర్తింపులోకొచ్చాడు. చాలా మట్టుకు వూహించతగ్గ మలుపులతో వొక వ్యాపార చిత్ర బాణీలో తీసినా, విలువైన కథా వస్తువు, మంచి నటనలతో యెక్కడా విసుగనిపించకుండా తీయగలిగాడు. ఇంతకంటే యేం కావాలి! ఈ మాట యెందుకంటున్నానంటే కొన్ని కథలు ప్రజల వరకూ వెళ్ళడం అవసరం కదా.

నైనా మాథుర్ (రాణి ముఖర్జీ) కు విచిత్రమైన నరాల వ్యాధి — టూరెట్ సిండ్రోం. దాని కారణంగా ఆమె నియంత్రణ లేకుండానే యెక్కిళ్ళ లాంటి శబ్దాలు వస్తుంటాయి. ఆ వొక్క కారణంగా ఆమె చిన్నప్పట్నించీ అనేక రకాలుగా వివక్షకూ, అవమానాలకు గురి అవుతుంది. చిన్నప్పుడు బడిలో సాటి పిల్లలు నవ్వడమే కాదు, టీచర్లు కూడా తట్టుకోలేరు. ఆమెను ప్రతి బడీ ఈ సాకుతో తీసేసేది. తండ్రి కూడా, కూతురికి బాసటగా వుండాల్సింది పోయి, న్యూనతగా భావిస్తుంటాడు. హోటెల్లో కూతురు మాట్లాడలేక ఇబాంది పడుతుంటే తనే ఆమె తరఫున ఆర్డరిస్తాడు. అలా పెద్దైన నైనా మాత్రం ఆత్మ న్యూనతకు గురి కాకుండా ఆత్మ విశ్వాసం గల యువతిగా యెదుగుతుంది. తన పరిస్థితులకి అతి కష్టమైన టీచర్ ఉద్యోగమే చేయాలనుకుంటుంది. చాలా చోట్ల తిరస్కరించబడ్డా, చివరికి వొక మంచి స్కూల్లో ఆమెకు ఉద్యోగం దొరుకుతుంది. అది కూడా వాళ్ళకు మార్గాంతరం లేక పోవడం వల్ల. Right to education చట్టం వచ్చిన దగ్గరనుంచీ ప్రతి బడిలోనూ కొంతమంది పిల్లలను వెనుకబడ్డ వర్గమ్నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సి వుంటుంది . చట్టం ఉద్దేశంలో వాళ్ళు కూడా అందరితో కలిసి చదువుకోవాలని వుంటే, ఇక్కడేమో అలాంటి పిల్లలను వొక వేరే క్లాస్ (9F)లో పెట్టి చదివిస్తారు. ఈ వివక్షకు వొళ్ళు మండి వాళ్ళు ఆకతాయిగా మారడం, యే టీచరు నెల కంటే యెక్కువకాలం వుండకపోవడం; ఇలాంటి పరిస్థితుల్లో నైనా కి ఉద్యోగం దొరుకుతుంది. ఆమె ఆత్మ విశ్వాసంతో పని మొదలు పెట్టి యెలా ఆ పిల్లలను దారికి తెస్తుందో, వాళ్ళు బాగుపడే పిల్లలు కాదు అన్న వాళ్ళ అభిప్రాయం తప్పని యెలా నిరూపిస్తుందీ అన్నది మిగతా కథ.

పైకి ఇది వొక అశక్తత గురించిన కథ. కాని దాన్ని వాడుకుని దర్శకుడు చాలా విషయాలు మన ముందు చర్చకు పెడతాడు. విద్య యెప్పుడూ ధనిక వర్గానికే అందుబాటులో యెందుకుండాలి? వెనుక బడ్డ వర్గానికి అందుబాటులో తేవడానికి చట్టాలు చేస్తే పరిణామాలెలా వున్నాయి? కలిసి చదువుకుంటున్న ఆ రెండు వర్గాల మధ్య దూరం యే కాస్తైనా తగ్గిందా? తగ్గకపోవడానికి కారణమేమిటి? వ్యక్తి స్థాయిలో వొకామెకి టూరెట్ సిండ్రోం వేధిస్తే, సమూహానికి అలాంటిదే మరేదో వేధిస్తూ వుండి వుండాలి. అలాగే సమూహం లోని ప్రతి వ్యతికీ వేర్వేరు టూరెట్లు వేధిస్తూ వుండాలి. వాటిని యెవరు గుర్తించాలి, వాటిని యెలా అధిగమించాలి? ఆత్మ న్యూనత బారిన పడకుండా, ఆత్మ విశ్వాసంతో యెదిగే సమాజానికి ప్రతి వ్యక్తీ చేయగలిగినదేమిటి? ఇలాంటివి అన్నీ మన ముందుకొస్తాయి. వీటి కారణంగానే ఇలాంటి చిత్రాలు తప్పక రావాలి, వ్యాపార మూసలోనైనా సరే.

ఇంకా చిన్న చిన్న విషయాలు అలా మన ముందుకు తెచ్చి వదిలి పెడతాడు దర్శకుడు. నైనా తమ్ముడికి (హుసేన్ దలాల్) వంట ఇష్టం. అతను తన పని కూడా రెస్టారెంట్ పెట్టడం ద్వారా తన ఇష్టమైన రంగంలోనే పని యెంచుకుంటాడు. తల్లి దండ్రులు విడిపోయారు. కాని తల్లి వో single motherగా పిల్లలను పెంచుతుంది. తండ్రి చుట్టం చూపుగా వచ్చి పోతుంటాడు, వచ్చినప్పుడల్లా నైనా మనసు గాయపరుస్తూనే వుంటాడు : కూతురి టూరెట్ కు తను సిగ్గు పడుతుండడం వల్ల. వాడియా (నీరజ్ కాబి ) అన్న టీచర్కు 9ఎఫ్ క్లాస్ పిల్లలమీద తీవ్రమైన ఏహ్యభావం వుంటుంది. టీచర్ ను చూసే పిల్లలు కదా, వాళ్ళూ అలాగే వ్యవహరిస్తారు. చివర్న వాడియా తన తప్పు అర్థం చేసుకోవడం, వొక వ్యక్తిగా వొక టీచర్‌గా, దాన్ని సరిదిద్దడమూ చేస్తాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను చాలా ప్రతిభావంతంగా చిత్రీకరించాడు.

ఇక కొన్ని రొడ్డకొట్టుడు కథనాలున్నాయి. ఆ స్కూల్ ప్రాజెక్టును తీసుకుని నడిచిన డ్రామా, అన్ని సమస్యలకు చివర్న పరిష్కారం దొరకడం, పేపర్లు లీక్ అవడం ఇలాంటివి. కాని పెద్ద చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటివి సహించవచ్చనిపిస్తుంది.

రాణీ ముఖర్జీ నటన ఆసాంతం చాలా బాగుంది. శివ్ సుభ్రహ్మణ్యం, నీరజ్ కాబి లాంటివారు కూడా బాగానే చేశారు. అయితే, తల్వార్, షిప్ ఆఫ్ థీసియస్ లాంటివాటితో పోల్చవద్దు నీరజ్ కాబి ని. పిల్లలందరూ బాగా చేశారు. ముఖ్యంగా హర్ష్ మేయర్. ఇతనికి “I am Kalam (2010) చిత్రానికిగాను ఉత్తమ బాల నటుడిగా జాతీయ పురస్కారమూ లభించింది. జస్లీన్ రాయల్ సంగీతమూ, పాటలూ బాగున్నాయి. (ఈ మధ్య హిందీ చిత్రాలలో కొత్త కొత్త సంగీత దర్శకులు వచ్చి మనకు వైవిద్యభరితమైన సంగీతం ఇస్తున్నారు. అలాగే గీత రచయితలు కూడా). జీవితంలో అన్నీ ఇలా సుఖంతం కావేమో గాని, ప్రేక్షకులని తమ ఆలోచనలను వొకసారి పునరాలోచించేలా (retrospect/introspect) చేస్తుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here