హిమాచల్ యాత్రానుభవాలు-6

0
7

[box type=’note’ fontsize=’16’] “మంచుని దగ్గరనుండి చూసి, ముట్టుకుని ఆడిన అనుభూతి కోసం వచ్చే వారిని అక్కడి వారు కంగాళీ చేస్తారు” అంటూ హిమాచల్ ప్రదేశ్‌లో తాము తాము పొందిన అనుభూతిని పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరిహిమాచల్ యాత్రానుభవాలు” అనే ఈ యాత్రాకథనంలో. [/box]

సోలంగ్ వాలీ:

[dropcap]మ[/dropcap]రునాడు మనాలి 14కిమీ దూరంలో ఉన్న సోలంగ్ వాలీకి బయలుదేరాము. టాక్సీలో వెళ్ళాము. వీలయితే సుమారుగా 80+ కిమీ దూరం ఉన్న మణికరన్ కూడా చూడాలనుకున్నాము. సోలంగ్ వాలీ అద్భుతంగా ఉంటుందని గూగుల్ మాత మాకు చెప్పింది.

ఈ వాలీ శీతాకాల, వేసవి క్రీడలకు పెట్టింది పేరట. సోలంగ్ వాలీకి రెండు పదాల కలయికతో పేరు వచ్చిందట. సోలంగ్, నాలా. సోలంగ్ అంటే ప్రక్కన గ్రామం. నల్లాహ్ అంటే నీటి సెలయేరు.

కులు లోయలోని  ఎత్తైన ప్రాంతం ఇది.

ఇక్కడ స్కీయింగ్‌కి శిక్షణ ఇస్తారట. శీతాకాల సాహస క్రీడ. ఎత్తైన మంచు కొండ వాలుల్లోంచి క్రిందకు జారతారట. వేసవిలో మంచు ఉండనందున వీలవదు. దానికి బదులుగా జొరఁబింగ్  అనే పెద్ద బంతిలో ఇద్దరు వ్యక్తులు ఉండి కదిలించే ఆట ఆడుతారు. వాటిని చూసాము. మౌంటెన్ బైక్ నడుపుతారట.

కానీ మేము వెళ్ళినప్పుడు అవేవి లేవు. రోప్ వే ఉంది. పైనుండి పారా గ్లయిడింగ్ ఉందంటే చూద్దామనుకుంటే కరెంటు లేదు అన్నారు. పరిసరాలు పచ్చగా లేవు. మా యాత్రలో నిరాశ పరచిన చోటు ఇదే.

నిరాశతో త్వరగా పయటపడి మణికరన్‌కి బయలు దేరాము. మనాలి నుండి మణికరన్‌కి చక్కని బస్సు వసతి ఉంది.

గులాబా:

గులాబా గ్రామం మనాలి నుండి 27 కిమీ, రోహతాంగ్ పాస్ నుండి 25 కిమీ దూరంలో ఉంది. ఈ గ్రామం జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ప్రకారం నిర్మితమై నియమాల ఆధారంగా పాలితమట. NGT Act ప్రకారం రోహతాంగ్ పాస్‌కి కేవలం రోజుకి 800 పెట్రోల్, 400 డీజిల్ వాహనాలను అనుమతిస్తారు. అందుకని అక్కడికి వెళ్లే వాహనాలు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. గులాబ్ పాస్ మార్గమధ్యంలో ఉంది. సముద్రమట్టానికి 14100 అడుగుల ఎత్తులో ఉంది. లేహ్ మనాలి జాతీయ రహదారిలో ఉంది. హిమాలయ పర్వత పీర్ పాంచాలీ పర్వత శ్రేణిలో ఉంది. భృగు సరస్సుకు వెళ్లే ట్రెక్కింగ్ నడక దారి ఇక్కడనుండి ప్రారంభం అవుతుందిట. ఈ ప్రాంతానికి కాశ్మీర్ మహారాజు గులాబీ సింగ్ పేరున గులాబ్ పాస్ అనే పేరు వచ్చింది. అద్భుతమైన మంచు పర్వతాలు, నది, అడవులు కనిపిస్తాయి. సాహస క్రీడలు ఉన్నాయి. ట్రెక్కింగ్, స్కీయింగ్ లాంటివి.

       

అక్కడికి మనాలి టాక్సీ స్టాండ్ నుండి లేదా ట్రావెల్ ఏజెంట్ టాక్సీలో వెళ్ళవచ్చు. మార్గమధ్యంలో స్నో గేర్ – అదేనండి! మంచుకు అనుకూలమైన దుస్తులు అద్దెకి ఇచ్చే షాప్స్ దగ్గర ఆపి దుస్తులు, స్నో బూట్స్… మనల్ని తీసుకోమని తొందరపెట్టి కంగారు పెడుతారు. అవసరమా? అంటే అవును, అవి లేకుంటే మంచుకు ఆరోగ్యం దెబ్బతింటుందని భయపెడతారు.

సెట్ రూ.300-400 తీసుకుంటారు. అవి వేసుకుంటే మనకు చంద్ర మండలంకి వెళ్లే వ్యోమగామి డ్రెస్‌లా అనిపిస్తుంది. అలా ఫీల్ కావచ్చు. డ్రెస్ వేసుకున్నాక టాక్సీ మహా ఇరుకుగా, ఎక్కి దిగటం కష్టంగా అనిపించింది. ఆ డ్రెస్ వేసుకున్నాక మనం హాలీవుడ్ ఫిలిమ్స్‌లో లాగా మంచు దృశ్యాలని ఊహించుకుంటాము. తప్పదు మరి.

గులాబ్ పాస్ చేరిన తరువాత వందల సంఖ్యలో వాహనాలు పార్క్ చేసి కనిపిస్తాయి. అక్కడ దిగి మరింత ముందుకు నడిచి వెళ్ళితే మంచు ప్రదేశం వస్తుందని చెప్పి పంపుతారు డ్రైవర్స్. వింతగా నడచుకుంటూ ముందుకు వెళితే జనసంద్రమైన కొండ ప్రాంతం కనిపించి, ఎగుడు దిగుడుగా ఎక్కి వెళ్ళితే మనకి అక్కడ పదుల సంఖ్యలో గుర్రాలు, వాటిని నడిపే వాళ్ళు మనల్ని చుట్టుముట్టి స్నో పాయింట్‌కి తీసుకు వెళ్తామని తొందరపెడుతారు.

గుర్రాల గమనాన్ని, పర్వతాన్ని చూస్తే భయం వేసి గుర్రం పై పైకి వెళ్లకుండా నెమ్మదిగా కొంత దూరం నడచి ఎక్కి దూరం నుండి మంచు చూసి, ఇంత దాకా ఎక్కింది చాలు, పద క్రిందకు అని వచ్చేసాము.

మంచుని దగ్గరనుండి చూసి, ముట్టుకుని ఆడిన అనుభూతి కోసం వచ్చే వారిని అక్కడి వారు కంగాళీ చేస్తారు.

వేసవిలో మంచు చూడటం కుదరదట. కొన్ని చోట్ల చాలా లోతులో కరుగుతున్న ఐస్ లాంటి దానిపై ఐస్ స్కూటర్ నడపనిస్తారు.

డ్రెస్‌లు మాత్రం పెద్ద మోసం. ఉక్క పెట్టి ఇబ్బంది పడ్డాము. ఎనీ వే అదొక అనుభవం. తిరుగు ప్రయాణంలో మాల్ రోడ్‌లో ఉన్న బౌద్ధ ఆలయం చూసాము. టిబెట్ నుండి వలస వచ్చిన వారు ఏర్పర్చుకున్న మొనాస్ట్రీలలో ఇదొకటి.

ప్రశాంత వాతావరణంలో పసుపు, ఎరుపు, బంగారు వర్ణాల మేలికలియికతో బౌద్ధ ఆలయ నిర్మాణ శైలితో అందంగా ఉంటుంది. ఎందరో యాత్రికుల మనసు దోస్తుంది. 1969లో నిర్మితం. బుద్ధుని ప్రతిమ మనస్సును అలరిస్తుంది.

స్థానికుల విరాళాలతో  నడుపుతున్నారు. అందులో ఆర్ట్ మరియు తివాచి అల్లిక స్కూల్ నడుపుతున్నారు. ప్రక్కనే ఉన్న మార్కెట్‌లో వారు అల్లిన ఉన్ని దుస్తులు దొరుకుతాయి. గుడి లోని గోడలపై బుద్ధుని జీవిత విశేషాలను తెలిపే అందమైన చిత్రాలు కనువిందు చేస్తాయి. కాలచక్రంను కూడా పెయింట్ చేశారు.

అదే ప్రాకారంలో మన్నే గా పిలవబడే సిలెండ్రికల్ డ్రమ్స్ ఉన్నాయి. వాటిని ఒక క్రమ పద్ధతిలో చేతితో తిప్పితే శుభం, మోక్షం కలుగుతుందని నమ్మకం. మేము తిప్పాము. దర్శనం తరువాత బస్సు ఎక్కి చీకటి పడే సమయానికి రూంకి చేరుకొని వేడి టీ తాగి రిలాక్స్ అయ్యాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here