HOPE అంటే ఆశ

0
7

[dropcap]ఒ[/dropcap]క పెద్దాయన హుస్సేన్ సాగర్ ఒడ్డున ఇంట్లో ఉంటుంటాడు.

సాగర దృశ్యం కనిపించే విధంగా ఒక కిటికీ.

దాని ముందు కుర్చీలో కూర్చుని బైనాక్యులర్స్‌తో సాగర్ దగ్గర జరిగే సంఘటనలని సాక్షిలాగా చూస్తూ ఉంటాడు.

క్రమం తప్పకుండా వాకింగ్‌కి వచ్చే వాళ్ళు,  అప్పుడప్పుడు నిరాశతో, నిస్పృహతో జీవితం మీద నిర్వేదంతో మనుషులు.. అందులో విద్యార్థులూ ఉండచ్చు… ఆత్మహత్య చేసుకోవటాన్ని పరిశీలిస్తూ ఉంటాడు.

***

అదే సాగర పరిసరాల్లో పెద్దాయన కింది ఫ్లాట్‌లో పూజ అనే అమ్మాయి, తన తండ్రితో కలిసి ఉంటుంది. ఈ పెద్దాయనకి, పూజకి ఒక వ్యక్తే పని చేస్తూ ఉంటుంది. పూజ చెల్లెలు ఒకనాడు సాయంత్రం ఆ సాగరంలో కలిసిపోతుంది. ఆ సంఘటన తరువాత రోజూ అదే టైంకి పూజ, తండ్రి కలిసి వచ్చి ఆ ఒడ్డున బెంచి మీద కాసేపు కూర్చుని వెళుతుంటారు.

కూతురిని పోగొట్టుకున్న దిగులుతో ఒకనాటి సాయంత్రం గుండె ఆగి తండ్రి చనిపోగా పూజ ఒంటరిదౌతుంది.

పూజ తండ్రి చనిపోయిన షాక్ నించి కోలుకోవటానికి పెద్దాయన, పని మనిషి లక్ష్మి సహాయం చేస్తారు.

చెల్లి చనిపోయిన దగ్గర నించి ప్రతి శనివారం ఆఫీసు నించి నేరుగా ట్యాంక్‌బండ్‍కి వచ్చి కూర్చునే అలవాటు చేసుకున్న పూజ, ఒకనాడు అలాగే వచ్చి.. కెమిస్ట్రీలో మార్కులు తక్కువ వచ్చినందువల్ల ఆత్మహత్య చేసుకున్న చెల్లి గురించి ఆలోచిస్తూ ఉద్వేగానికి లోనవుతుంది.

అలాంటి ఒక బలహీన క్షణంలో తను కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం చేసి, పెద్దాయన దృష్టిలోపడి రక్షింపబడుతుంది.

అసలు పూజ చెల్లెలు లత ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది? తెలుసుకోవాలనిపించట్లేదా? అని ఒక ప్రశ్న సంధించి.. పూజ జీవితానికి ఒక దిశా నిర్దేశం చేస్తాడు.

పాత వార్తా పత్రికలో వచ్చిన ఒక వార్త వారిద్దరిని ఆకర్షిస్తుంది. కోచింగ్ సెంటర్లల్లో ఇచ్చే అలివిమాలిన శిక్షణా విధానంతో ఏర్పడే ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది ఆ వార్త.

“అదంతా ట్రాష్… వాళ్ళు అలా శిక్షణ ఇవ్వబట్టే ఎంతో తెలివైన మన విద్యార్థులు మరింత పదును దేలి ఐఐటి, ఐఐఎంలలో సీట్లు సంపాదించగలుగుతున్నారు. సమాజానికి మూలస్తంభాలైన ఎందరో డాక్టర్స్‌ని, ఇంజనీర్స్‌ని అందిస్తున్నది ఆ విద్యా విధానమే” అంటాడు ఆ పెద్దాయన.

***

డాక్యుమెంటరీ తీసే ఉద్దేశ్యంతో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజేష్ అమెరికా నించి హైదరాబాద్ బాల్య మిత్రులని కలవటానికి వస్తాడు.

వారితో సంభాషిస్తూ ఒక్క్కొక్క మిత్రుడి గురించి తెలుసుకుంటూ…. అప్పటికి రెండేళ్ళ క్రితం మరణించిన పులిట్జర్ అవార్డ్ పొందిన భారతీయ జర్నలిస్ట్ హైదరాబాద్ వాడేనని, ఆయన కథే తను తీసే డాక్యుమెంటరీ అని చెబుతాడు.

రాజేష్ మిత్రులు ఒక్కొక్కరే కలుస్తూ… తమతో చదువుకున్న తెలివైన విద్యార్థి చైతన్య గురించి మాట్లాడుకుంటూ.. అతను కొంతకాలంగా వీరికి టచ్‌లో లేడని గుర్తిస్తారు.

ఆ పెద్దాయన విసిరిన ప్రశ్నతో విద్యా వ్యవస్థ మీద అధ్యయనం మొదలుపెడుతుంది పూజ. అందులో భాగంగా సమాచారం సేకరించటం మొదలుపెట్టి… “లార్డ్ మెకాలే 1835 ప్రవేశపెట్టిన విద్యావిధానమే ఇప్పటికీ కొనసాగుతున్నదని… అందులో పిల్లలని మూడో ఏట స్కూల్ అనే ఫ్యాక్టరీలో పడేసి కఠినమైన శిక్షణ ఇస్తే ఇరవయ్యేళ్ళ తరువాత ఒక వస్తువు తయారైనట్టు ఏదో ఒక రంగంలో నిష్ణాతుడైన వ్యక్తి తయారై ఆ కర్మాగారం నించి బయటికొస్తాడు. ఈ ఇరవయ్యేళ్ళ కాలంలో వారికి అవసరమైన శిక్షణ శిబిరాలే ఈ కోచింగ్ సెంటర్లు” అని ఒక జర్నలిస్ట్ రాసిన వ్యాసం గురించి ప్రస్తావిస్తుంది, ఆ పెద్దాయనతో!

తన పరిశోధనలో భాగంగా ఆ వ్యాసం రాసిన వ్యక్తి హరినాధ్‌ని కలుస్తుంది. మాటల్లో చదువు రాని తన తండ్రి… నేటి చదువుల ఒత్తిడితో చిదిమివేయబడుతున్న బాల్యం గురించి ఆలోచించి, వారు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని వర్ణిస్తూ…. వారిని రక్షించటానికి ప్రయోగాత్మకంగా తాము నడుపుతున్న పాఠశాలల గురించి చెబుతాడు.

ప్రభుత్వ సబ్సిడీలతో చదువుకున్న ఐఐటి, ఐఐఎంల విద్యార్ధులు ఎంత మంది విదేశాలకి తిరిగి రాకుండా అక్కడే స్థిరపడిపోతున్నారో గణాంకాలు సేకరించి… వారి నించి ఆ సబ్సిడీ డబ్బు వసూలు చేసి పేద విద్యార్థుల మీద ఖర్చు పెడితే భారత్‌లో విద్యారంగంలో ఇంకా ఎంతో అభివృద్ధి సాధించచ్చు అని చెబుతాడు, హరినాధ్.

తన బంధువుని కలవటానికి యూనివర్సిటీకి వెళ్ళిన రాజేష్ అక్కడి పెద్దల మీటింగ్‌లో “స్టూడెంట్స్‌కి అనవసర స్వేచ్ఛ ఇవ్వకూడదనీ… అమలులో ఉన్న విధానం అనుసరించటం వరకే వారి పని” అని ఒక సీనియర్ ప్రొఫెసర్ వాదించటం విని ఆశ్చర్యపడతాడు.

పూజని అనుకోకుండా కలిసిన రాజేష్‌కి, ఆమె తన పరిశోధనలో సేకరించిన పేపర్ కటింగ్స్‌లో ‘ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి’ అనే ఫొటో ద్వారా…. ఆచూకీ తెలియక వెతుకుతున్న తమ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.

టాప్ ర్యాంకర్ అయిన అతను, అనుకున్న ర్యాంక్ రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.

***

గడచిన ఇరవయ్యేళ్ళుగా తల్లిదండ్రుల లక్ష్యం.. తమ పిల్లలు డాక్టర్స్, ఇంజనీర్సేనని.. అది ఇప్పటికీ కొనసాగుతున్నదని రాజేష్, పూజ ఇతర మిత్రులు మాట్లాడుకుంటారు. అనేక రకాల ‘సెట్’ పరీక్షల ద్వారా ఇంటర్మీడియెట్ పాసయ్యే లక్షల మంది విద్యార్థుల్లోంచి 10-15% విద్యార్ధులు సదరు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరగలరు అని పూజ చెపుతుంది. తనకి ఈ సమాచారం, కొలంబియా యూనివర్సిటీలో పని చేసిన ఒక ప్రొఫెసర్ R B V R Murty గారు రాసిన వ్యాసాల ద్వారా తెలిసిందని చెబుతుంది.

మిత్రులందరూ పూజ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవటానికి పూజ ఇంట్లో సమావేశమైన సందర్భంలో తలవని తలంపుగా మూర్తిగారు బతికే ఉన్నారని, అక్కడున్న పెద్దాయన ఫొటో చూసిన రాజేష్ చెప్పగా తెలుసుకుంటారు.

కార్ యాక్సిడెంట్‌లో కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకుని, అజ్ఞాతంలో బతుకుతున్నారని తెలుసుకుంటారు. ఇక అక్కడి నించీ ఆయన మార్గదర్శనంలో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, అందువల్ల నిండైన జీవితాలని ఆత్మహత్యల ద్వారా ముగించుకోవటం ఆపాలని.. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకుంటారు.

ఆత్మహత్యలు చేసుకున్న కొందరు విద్యార్థుల ఇళ్ళకి వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు… తన తల్లి టీచింగ్ సబ్జక్ట్‌లో తనకి మార్కులు తగ్గితే తల్లికి చెడ్డ పేరొస్తుందని ఒకరు, ఒక్క సెమిస్టర్‌లో తక్కువ మార్కులు వచ్చినందుకే తనని నెంబర్ వన్ గ్రూప్ నించి తీసి సెకండ్ గ్రూప్‌లో వేశారని… దానితో అనుకున్న ర్యాంక్ రాదేమో అని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని తెలుసుకుంటారు.

పిల్లల పట్ల చదువులు కలిగిస్తున్న ఒత్తిడి తల్లిదండ్రులు తెలుసుకోవాలని, తమకి ఒత్తిడి కలిగినప్పుడు నిర్భయంగా తల్లిదండ్రులతో చర్చించి వారి సహాయం తీసుకునే అవకాశం పిల్లలకుండాలని… అలాంటి ఒక కౌన్సిలింగ్ సెంటర్‌ని ప్రారంభించాలనుకుంటున్నానని పూజ చెప్పినప్పుడు…. ఆ సెంటర్ ప్రారంభించటానికి చేసే పరిచయ కార్యక్రమంలో తల్లిదండ్రులని, టీచర్లని, విద్యార్థులని కూడా సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకోవటం అవసరమని అందరికీ ఆలోచన వస్తుంది.

అలా అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక వేదిక ఏర్పాటు చేస్తారు.

ఉన్న వ్యవస్థని మార్చాల్సిన అవసరం లేదని, ఒక ప్రొఫెసర్ మొండిగా వాదిస్తే… అది అంత మంచిదే అయితే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయని అనడుగుతుంది పూజ… మనం గొప్పలు చెప్పుకుంటున్నట్టు నాసాలో అంతా మన సైంటిస్టులే… సాఫ్ట్‌వేర్ కంపెనీలనిండా మన ఇంజనీర్లే… ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా మన ఎక్స్‌పర్ట్‌లే అని గొప్పలు చెప్పుకోవటం కాదు.. మన దగ్గర ఉన్న నిరక్షరాస్యతని కప్పిపుచ్చుతున్నాం… కాలేజి నించి బయటికొచ్చిన లక్షల ఇంజనీర్లల్లో 5-6% కంటే ఉద్యోగాల్లో ప్రవేశించలేకపోతున్నారు లాంటి గణాంకాల గురించి ఎవ్వరూ మాట్లాడటానికి ఎందుకు ఇష్టపడరని హఠాత్తుగా సభలో ప్రవేశించిన మూర్తి గారు ప్రశ్నిస్తారు.

అంతటితో ఆగకుండా అందమైన భవిష్యత్తుని చూడాలనుకుంటున్న యువకులకి వ్యవస్థని మార్చే అవకాశం ఇచ్చి మార్పుని ఆహ్వానిద్దాం అంటాడు.

ఇలా అనేక రకాల మౌలిక విషయాలు చర్చించి ఆలోచింప చేసిన చిత్రం ఇది. ‘HOPE – నాకూ మార్పు కావాలి’ అనే ట్యాగ్ లైన్‌తో Tollywood Film City Media Pvt Ltd వారు హరినాధ్ పొలిచెర్ల సమర్పణలో డి. రామానాయుడు, కళ్యాణి, వైజాగ్ ప్రసాద్, హరినాధ్ ముఖ్య తారాగణంగా నిర్మించిన చిత్రం ఇది.

ముఖ్యమైన సమాచార సేకరణ చేసి పరిశోధన నిర్వహించిన వారు ‘అవీనా గూడపాటి’.

కథ, స్క్రీన్ ప్లే, సంభాషణ, దర్శకత్వ బాధ్యతలని K. Satyanarayana నిర్వహించారు.

తల్లిదండ్రుల ఆశల మీద నీళ్ళు గుమ్మరిస్తూ, అర్ధంతరంగా తమ జీవితాలు ముగించుకుంటున్న విద్యార్థులు, సమాజాని పట్టి పీడిస్తున్న ఈ ఆత్మహత్యలు… దానికి దారి తీస్తున్న కారణాల గురించి కనీసం ఆలోచించకుండా గొర్రెల మందలాగా చదువుల పిచ్చి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తల్లిదండ్రులని, సమాజాన్ని జాగృతం చెయ్యాలని ప్రయత్నించిన ఈ చిత్రం నిజంగానే ఆలోచింపజేస్తుంది.

ఇదే సమస్యని మరో కోణంలో చర్చిన మరొక చిత్రం ‘అక్షర’ గురించి వచ్చేవారం కలిసినప్పుడు మాట్లాడుకుందాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here