‘హృదయనేత్రి’ నవలలో పాత్రల విశ్లేషణ

0
13

[మాలతీ చందూర్ గారు రచించిన ‘హృదయనేత్రి’ నవలలోని పాత్రలను విశ్లేషిస్తున్నారు శ్రీమతి మణినాథ్ కోపల్లె.]

[dropcap]భా[/dropcap]రతీయ సాహిత్యానికి విశిష్ట సేవలందించిన రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని 1955 నుంచీ ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అందిస్తోంది. 1992లో డా. మాలతీ చందూర్ రచించిన ‘హృదయనేత్రి’ నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకుంది.

‘హృదయనేత్రి’ నవలా నేపథ్యం భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు చీరాల పేరాల ఉద్యమ సంఘటనలతో మొదలవుతుంది. పది సంవత్సరాల గోపాలం తన మేనత్తతో ప్రయాణం సాగిస్తూ ఆనాటి చీరాల – పేరాల ఉద్యమాన్ని కళ్ళారా చూస్తాడు. దేశం ఉద్యమాల వేపు ఎలా ఆకర్షితుడయింది నవల ఆరంభంలో చెబుతారు. ఈ నవలా నాయకుడు గోపాలం. స్వాతంత్య్రానంతర దేశము ఎలా మారిపోయింది, తిరిగి ఆతని ఆశయాలకు ఊపిరి పోస్తూ మనవరాలు స్వరాజ్యలక్ష్మి నిర్ణయంతో నవల ముగుస్తుంది.

కథాంశము:

గోపాలానికి చిన్నతనం నుంచే తనని ఎంతో అభిమానంగా చూసే రాముడత్తయ్య అంటే విపరీతమైన అభిమానం. తన భర్త వాసుదేవరావుతో పాటు స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ వుంటుంది. అత్త పెంపకంలో సీతా నగరం చేరిన గోపాలం ఆనాటి సమాజ పరిస్థితులు తెలుసుకుంటూ ఉద్యమాల వేపు ఆకర్షితుడౌతాడు. మొదటిసారి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని అత్తా వాళ్ళ ఇంట్లోనే చూస్తాడు. బెజవాడలో జరిగిన కాంగ్రెస్ కార్య వర్గ సమావేశాల్లో గాంధీ గారిని దూరం నుంచి చూశాడు.

చీరాల పేరాల ఉద్యమంలో అందరూ ఇళ్లు ఖాళీ చేసి వూరి చివరగా శిబిరాల్లో తలదాచుకునే వూరి వారి మధ్య తానూ వున్నాడు. ఆ ఉద్యమం సాగినంత కాలమూ ఎన్నో ప్రశ్నలు ఉదయించేవి. ఆ సందేహాలను అత్తయ్య ద్వారా తీర్చుకునేవాడు. చీరాల పేరాల ఉద్యమంలో రామదండు స్వాగతం పలుకగా గాంధీజీని దగ్గర నుంచీ చూసాడు. ఆయన తలమీద చేయివేసి నవ్వినప్పుడు గోపాలంలో అపూర్వమైన ప్రకంపన కలిగింది. చీరాల పేరాలలో జనాలు ఊరు ఖాళీ చేసి వెళ్ళినపుడు పోలీసులు వారి ఇళ్లకు నిప్పు పెట్టినపుడు ఆ మంటల్లో శివయ్య దూకి ఆత్మహత్య చేసుకున్నపుడు కాలిన అతని శరీరం చూసిన అతనికి భయంతో జ్వరం వచ్చింది. రామలక్ష్మమ్మ ఇచ్చిన ధైర్యంతో కోలుకుంటాడు. గోపాలానికి రాముడత్తయ్య అంటే ఆరాధ్య దేవత. పోలీసులు అయినా ఆగకుండా వారి జులుం ప్రజలపై ప్రదర్శించి వాసుదేవరావు గారిని, జానకమ్మ గారితో సహా పదిమందిని అరెస్టు చేస్తారు. పన్ను నిరాకరనోద్యమం పదినెలలు పాటు సాగి గోపాలం మీద తీవ్రమైన ప్రభావం చూపింది. చీరాల పేరాల ఉద్యమ సమయంలో వూరి చివర కలిసి మెలిసిన ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వచ్చాక మళ్ళీ కుల విభజనలు, మడీ ఆచారం అంటూ మారిపోయారు.

గోపాలం కుటుంబం పల్లెటూరు నించి బందరు చేరుకొని, బందరు జాతీయ విద్య పరిషత్తులో చేరి చదువు కొన సాగించాడు. ఖద్దరు దుస్తులు ధరించే వాడు. నందూతో స్నేహం. కులాల తేడాతో అందరూ దూరం పెట్టినా రాను రాను అతనితో స్నేహం చేసేవారు. నందూ నిషేధ నవల ‘మాలపిల్ల’ బహిరంగంగా చేతిలో పట్టుకెళ్ళినందుకు పోలీసులు అరెస్ట్ చేసి రెండేళ్లు జైలు శిక్ష వేశారు. ఇది గోపాలం బాల్యంలో విద్యార్ధిగా వున్నపుడు జరిగిన సంఘటన,

చిన్నతనంలో ఉన్నప్పుడు ఎందరు వీరులు త్యాగాలు చేసారో ఎందరు మహానుభావులు కారాగారాల పాలయ్యారో, అందరి మదిలో దేశభక్తి ఎంతలా నిండి పొయిందో, స్వయంగా చూసినవాడు, అనుభవించిన స్వచ్ఛమైన దేశభక్తుడు గోపాలం. సహాయ నిరాకరనోద్యమం లోనూ, చీరాల పేరాల ఉద్యమాల లోనూ ప్రత్యక్షంగా చూసిన వాడు, పాల్గొన్న వ్యక్తి గోపాలం.

సుబ్బమ్మ తన ఆడపడుచు ప్రభావంతో గోపాలంలో పెరుగుతున్న దేశభక్తిని గమనించి చదువుతుండగానే బలవంతంగా పెళ్లి కుదిర్చి, ఘనంగా ఐదు రోజుల పెళ్లి చేయిస్తుంది.. వివాహం అనంతరం బెనారస్ యూనివర్సిటీలో చదువు కోసం వెళ్ళిన గోపాలం శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొని జైలుకి వెడతాడు.

స్వాతంత్య్రం వచ్చిన అనంతరం భారతదేశంలో వచ్చిన మార్పులు జీర్ణించుకోలేక పోతాడు. అందరిలో స్వార్థం, డబ్బు కోసం ఆరాటం, మనస్తత్వాలలో మార్పులు.. ఇలా అంతటా మార్పులే! ఎక్కడా స్థిరంగా వుండలేక పోతాడు.

ఈ నవలలో చిన్నారి స్వరాజ్యలక్ష్మి పెరిగి పెద్దదయి కాలేజీలో చదివేటప్పుడు స్నేహితురాలి కోసం జైలుకి వెడుతుంది. ఆమెని విడిపించటానికి తన మనసు అంగీకరించక పోయినా తమ్ముని సహాయం తీసుకుంటాడు గోపాలం.

గోపాలం స్వచ్ఛమైన దేశ ప్రేమికుడు. తన జీవితంలో జరిగిన సంఘర్షలు, ఒడిదుడుకులు, మధ్య స్థిరత్వం లేని జీవితం అతనిది. స్వార్థ జీవితపు మనుషుల తత్వానికి దూరంగా వుంటాడు. స్వాతంత్య్రం రాక ముందు దేశ భక్తి మెండుగా చూపిన వారు బ్రిటీషు వారి పాలన అంతమయి స్వేచ్ఛా వాయువులు పీల్చిన ప్రజలలో తెచ్చిన మార్పుని అతని మనసు అంగీకరించలేడు. డబ్బు, పదవి వ్యామోహ కాంక్షలు పెరిగి పోయాయని, దేశం రెండు భాగాలుగా విడిపోయిందని బాధ పడతాడు. ఉన్నత పదవులు అందుకున్న నందూ, డబ్బే ధ్యేయంగా బతికే తమ్ముడు బుచ్చి, నగల కోసం తల్లినే హతమార్చిన వ్యక్తులు ఎవరో తెలిసినా ఏమీ చేయలేని తనం, ఇలా సమాజ మార్పుని అంగీకరించలేని గోపాలం చేసే ఉద్యోగాన్ని వదిలేసి చీరాలలో ఆశ్రమ జీవితం గడుపుతాడు. కానీ అక్కడా స్థిరంగా ఉండలేడు.

కొడుకు శ్రీనివాస్ కమ్యూనిస్ట్ ఉద్యమకారుల్లో కలిసిపోతూ తండ్రికి రాసిన లేఖ గోపాలరావుని అతని దేశ త్యాగాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. గోపాలరావు తరం స్వాతంత్ర్యం కోసం పోరాడి, ప్రాణాలు సైతం అర్పించి స్వాతంత్ర్యం సంపాదించినా దేశంలో సమానత్వం మాత్రం రాలేదు. ‘ఆకలితో వున్న వారికి ఆకలి తీర్చే శక్తి లేదు. ఆర్ధిక అసమానతలు కారణం. తండ్రి అహింసా మార్గం ఎన్నుకుంటే, తాను తుపాకీని ఆయుధంగా ఎన్నుకున్నాను’ అంటూ తన మనసులోని ఆక్రోశం అంతా వెళ్లగక్కిన కొడుకు ఉత్తరం ఆలోచింప చేస్తుంది. మనుమరాలి బాధ్యత మీద పడిన నాడు తిరిగి ఉద్యోగంలో చేరి పసిపిల్ల స్వరాజ్యాన్ని పెంచి పెద్ద చేస్తాడు. ఆమె కళ్ళలో తన రాముడత్తయ్య మెరుపు కళ్ళను చూసి తన బాధ్యత గుర్తు చేసినట్లుగా అనిపిస్తుంది. కాలక్రమంలో ఇందిరా గాంధీ హత్యా ఉదంతం, స్వతంత్ర భావాలు కల స్వరాజ్యంపై ప్రేమ, ఆమె వివాహం పై ఆమెకు వున్న భావాలు, ఇలా ఎన్నో సంఘటనల మధ్య నవల ముగుస్తుంది.

హృదయనేత్రి నవల పాత్రల చిత్రణ:

‘హృదయనేత్రి’ ఈ నవలలో ప్రధాన పాత్రలు రామలక్ష్మి, గోపాలం, స్వరాజ్యం. ఈ పాత్రల చుట్టూ అల్లుకున్న మరి కొన్ని పాత్రలు.

గోపాలం: ‘హృదయనేత్రి’ నవలా నాయకుడు..

రామలక్ష్మి: గోపాలం మేనత్త

సుబ్బమ్మ: గోపాలం తల్లి.

పార్వతి: గోపాలం భార్య

జానకమ్మ: కాంగ్రెస్ ఉద్యమ నాయకురాలు.

స్వరాజ్యం: గోపాలం మనవరాలు.

~

రామలక్ష్మి:

రచయిత్రి రామలక్ష్మి పాత్రను ఎంతో ఉన్నతంగా తీర్చి దిద్దారు.

నవల ఆరంభంలోనే రామలక్ష్మమ్మ సంభాషణతో ఆరంభమవుతుంది.

“పొందూరు ఖద్దరు చీరె గోచీపోసి కట్టుకుని, గుండ్రటి సిగ మధ్యన రాళ్ళ చామంతి పువ్వు చుట్టుకున్న రాముడత్తయ్య అంటే పదేళ్ల గోపాలానికి ప్రాణం.” ఇలా సాగుతుంది నవాలారంభం. తెల్లవారిని తరిమి కొట్టి స్వరాజ్యం తెచ్చి పెట్టే గాంధీ గారి కథలు చెప్పే రాముడత్తయ్య అంటే మరీ ఇష్టం. పిల్లలు లేని ఆమె గురించి అప్పట్లోనే పెద్దవాళ్లు విడ్డూరంగా చెప్పుకోవటం కూడా విన్నాడు. ఎర్రగా పొడవుగా వుండి రాట్నం వడుకుతూ నూలు తీసే రాముడత్తయ్య అంటే ఆరాధన కూడా.

ఆడామగా అందరితో సమంగా మాట్లేడే రామలక్ష్మి గురించి అందరూ నానా రకాలుగా మాట్లాడినా పట్టించుకోని వ్యక్తిత్వం ఆమెది..

ఆధునిక భావాలతో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వనిత ఆమె.. భర్త వాసుదేవరావు రామలక్ష్మికి తోడూ నీడగా వుంటూ, ఆమెని విద్యాధికురాలిని చేస్తూ, తనతో పాటు కాంగ్రెస్ సమావేశాలకు తీసుకువెళ్తూ భార్యకు ఎంతో సహకరిస్తాడు.

ఖద్దరు దుస్తులు ధరించి కాంగ్రెస్ సమావేశాలకు హాజరయేది. కాంగ్రెస్ మహా సభల్లో సరోజినీదేవి, ఉన్నవ లక్ష్మీబాయమ్మ వంటి స్త్రీలను అక్కడ చూసి తను కూడా వారి వలే కార్య రంగంలో దూకాలి అని కలలు కంటుండేది. గాంధేయ వాది. తన భర్తను కోల్పోయినా చివరి వరకు ఆమె ఒంటరి పోరాటం సాగించింది. అంతే తప్ప పుట్టింటికి చేరలేదు. దేశ స్వాతంత్ర్య ఆదర్శాలకు కట్టుబడి జీవించింది. ఈ నవలలో ఆమె పాత్ర ఎంతో ఉన్నతమైనది. అందరి స్త్రీల మాదిరిగా వస్తువులపై మమకారం పెంచుకోలేదు. ఉన్న నగలను కూడా మహాత్మా గాంధీజీకి దేశ పోరాటానికి దానం చేసిన ధీర వనిత ఆమె..

కొన్ని సార్లు ఆమెలో కొత్త మనిషి, తెలియని వ్యక్తి కనిపించేది గోపాలానికి. “మనకి స్వరాజ్యం రావాలంటే ఇల్లు వాకిళ్ళు అన్నీ పోగొట్టుకునేందుకు సిద్ధంగా వుండాలి. మన సుఖాలు త్యాగం చెయ్యాలి.” అనేది . “స్వేచ్ఛ అంటే నీ యిష్టం వచ్చిన విధంగా బతక గలగాలి” ఇలా స్వాతంత్య్ర గురించి బలమైన భావాలు వుండేవి రాజ్యలక్ష్మి గారిలో..

జానకమ్మ:

ఈ నవలలో మరో స్త్రీ పాత్ర జానకమ్మ. శ్రోత్రీయ కుటుంబంలో పుట్టిన ఆమె బాల వితంతువు.

ఆమెకు ఆచారం ప్రకారం జుట్టును తీయించిన పెద్దలు. వంటింటికే పరిమితం అయిన ఆమె గాంధీజీ బోధనలకి ప్రభావితురాలై ఖద్దరు చీరలు ధరించేది. ఖద్దరు బట్టలు తలమీద పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి అమ్మేది. హిందీ నేర్చుకుంది. నూలు కూడా బారులు బారులు తీసేది. అవసరంలో వున్న వారిని ఆదుకునే కరుణామూర్తి. పురిటి సమయంలో గర్భిణీ స్త్రీలకు పురుళ్లు పోసేది. కొన్ని రోజులు వెలివేయ బడిన ఆమె “మంచి మాల అయితే.. మాల నేను అవుతాను” అనేది. కులమత బేధాలు చూడకుండా అందరితో కలిసి ఉద్యమాల బాటలో పయనించినపుడు ఆమె ఇంటివారు ఆమెకు విడిగా భోజనం పెట్టినపుడు, అది అవమానంగా భావించి ఆమె తీసుకోకుండా అప్పటి నుంచి వుడికిన పదార్థాలు తిననని శపథం పట్టి అపక్వాహారం తీసుకుంటూ, దేముడి గుళ్ళో పడుకునేది. జానకమ్మగారు గాంధీజీ స్వరాజ్య నిధికి బంగారు ‘కంటే కాసులపేరు’ దానం చేసిన వ్యక్తి.

ఆమెతో పాటు మాగంటి అన్నపూర్ణాదేవి, జానకమ్మ గారు, రామలక్ష్మమ్మ ఇంకా ఎంతో మంది మహిళలు తమ వంటి మీది నగలను నిధికి ధార పోశారు.

రాయవెల్లూరు జైలులో జానకమ్మగారిని పోలీసులు దొంగలతో పాటు వుంచటం, ఆమె తినే అపక్వాహారంతో కాకుండా రాళ్ళ అన్నం దేవతా పులుసూ ఇచ్చేవారు. (రాళ్లూ, ఇసుకా కలిపిన పప్పు పులుసు, గొడ్డు కారం- బొద్దింకలు- మట్టి ముంతల్లో ఇవ్వటం) ఇటువంటి వాటితో ఆహారం లేక ఎముకల గూడులా మారింది జానకమ్మ.

జైలు నుంచి విడుదల అయిన జానకమ్మని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తెచ్చిన ఆమె మెడలో ఖద్దరు దండ వేసిన గోపాలం ఎముకల గూడులా, అంగుళం ఎదిగిన జుట్టుతో ముసుగులేని ఆమె రూపు చూసి భయం వేసింది గోపాలానికి.

కొద్ది రోజులకి ఆమె మనో ధైర్యంతో మళ్ళీ పుంజుకుని కాంగ్రెస్ సభలకి హాజరయ్యేవారు. ఒంటరిదయిన జానకమ్మ స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాట వీరులకి అందించిన ఐదు ఎకరాల పొలాన్ని తీసుకుని అందులో ఇతరులని భాగస్వాములని చేస్తూ వారికి నిలువ నీడని ఇచ్చింది.

చీరాలలో రామలక్ష్మమ్మ ఇంటిలో పాఠశాల నిర్వహించటానికి అనుమతిని ఇచ్చింది. తదనంతరం ఆ ఇంటిని మంచి పనికోసం ఉపయోగించమని గోపాలానికి ఆ ఇంటి కాగితాలను అందజేసింది జానకమ్మ. ఈమె పాత్ర కూడా ఎంతో ఉన్నతంగా చిత్రించారు మాలతీ చందూర్ గారు.

సుబ్బమ్మ:

గోపాలం తల్లి. పాత కాలం మనిషి. ఆడబడుచు రామలక్ష్మి అభిరుచులు, ఆశయాలు అంటే అసలు పడవు. తన కొడుకును రామలక్ష్మమ్మతో పంపితే దేశ సేవంటూ తిరిగి చెడిపోతున్నాడని ఆమె భావం. అందుకే తొందరపడి గోపాలానికి వద్దంటున్నా డబ్బున్న అమ్మాయితో పెళ్లి చేస్తుంది. కాంగ్రెస్ సభలంటూ ఉపన్యాసాలిస్తూ అన్ని కులాల వారితో తిరుగుతూ వుంటుందని, షోకులు చేసుకుంటుందని.. ఇలా ఎన్నో చెడు అభిప్రాయాలతో వుంటుంది సుబ్బమ్మ. అందుకే కొడుక్కి పిల్లని చూపించకుండానే 12 సంవత్సరాల లోపు వయసున్న పార్వతినిచ్చి బాల్య వివాహం జరిపిస్తుంది. ఉన్నన్నాళ్ళూ గోపాలం కుటుంబం మీద అయిష్టము, బుచ్చి అంటే అభిమానమూ చూపేది.

కానీ చివరికి ఆమె వద్దనున్న నగల గురించి బుచ్చి ఇంట్లో గొంతు నులిమి హత్య గావించబడుతుంది.

పార్వతి:

ఏలూరులో చిన్న జమీందారు కుటుంబం నుంచి వచ్చింది. చిన్నతనం లోనే గోపాలంతో వివాహం జరిగిన గృహిణి. గోపాలం దేశభక్తి అంటూ ఉద్యమాల వెంట దేశాలు తిరిగినపుడు, జైలు పాలయినపుడు కొడుకుతో పాటు తండ్రి ఇంట్లోనే చాలా కాలం వుంటుంది.

స్వరాజ్యం:

గోపాలం కొడుకు శ్రీనివాస్ కూతురు. తాతయ్య ఆదర్శాలు నచ్చినా స్వతంత్ర భావాలతో పెరుగుతుంది. ఇందిరా గాంధీ అంటే అభిమానం. “తనకి నచ్చి, తన అభిప్రాయాలను గౌరవించేవాడు, తన ఆశయాలకు అనుగుణంగా నిలిచేవాడు ఎదురయితే తప్పకుండా వివాహం చేసుకుంటాను” అని తన అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పే స్వరాజ్యం తన గమ్యాన్ని తానే ఎంచుకుంటుంది.

“అన్ని జీవితాలకూ పెళ్ళే గమ్యం కాదు. అంతకు మించిన ఆదర్శాలు వుంటాయి.” అని అనే స్వరాజ్యం చీరాలలో రాముడత్తయ్య ఇంటిని హోమ్ లాగా తీర్చి దిద్ది, దయనీయ స్థితిలో వున్న ఎందరో వృద్ధులకి ఆశ్రయం ఇవ్వాలనుకుంటుంది. దేశానికి సేవ చేసిన జానకమ్మగారు, బంధువులకి, ప్రభుత్వానికి అక్కరలేని ఎందరో వృద్ధులని చెరదీసే ఆదర్శ భావాల స్వరాజ్యం.

సమాజంలోని వివాహ వ్యవస్థ:

రచయిత్రి ఆనాటి సమాజంలోని వివాహ వ్యవస్థ గురించి ఈ నవలలో చెప్పారు.

బాల్య వివాహాలు, ఆనాటి సమాజంలో సహజమనీ, శారదా ఆక్ట్ వచ్చేలోపు ఆడపిల్లలకి వివాహం జరిపించాలానే తల్లితండ్రులు ఎక్కువగానే వున్నారనీ, సమాజంలో వివాహాలు ఎలా వుండేవో ‘హృదయనేత్రి’ నవలలో చక్కగా వివరించారు రచయిత్రి.

పెళ్లి చూపులు ఆచారం కాదనీ, ఆడపిల్లలు చదువు కోకూడదనీ, పెళ్ళిలో భోగం మేళాలు వుంటాయనీ, అలకపాన్పు అనే వేడుక వుంతుందనీ, ఐదురోజుల పెళ్ళిళ్ళు ఆ కాలంలో జరిగేవని చెప్పారు.

ఈ నవలలో ఆనాటి సమాజ కట్టుబాట్లు, దేశభక్తికై ఉద్యమాల బాట పట్టే ఉద్యమకారుల నడుమ జరిగే సంఘర్షణల సమాహారం కనిపిస్తుంది. దేశం కోసం ఆనాటి వీరులు ప్రాణ త్యాగాలు చేసారు.

ఈ నవలలో రచయిత్రి ఆ రోజుల్లోనే అభ్యుదయ భావాలతో రచించారు. కథలలోని పాత్రలు ముఖ్యంగా స్త్రీ ఎదుర్కునే సమస్యలు సమాజంలో నిత్యమూ వుండేవే. స్త్రీల పాత్రలు ఆత్మవిశ్వాసంతో వుండి, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కలిగి వుంటాయి.

రచయిత్రి గురించి క్లుప్తంగా: (1928-2013)

‘హృదయనేత్రి’ నవలా రచయిత్రి డా. మాలతీ చందూర్. సాహితీ జగత్తులో ఆమె పేరు వినని వారుండరు. 26, డిసెంబరు, 1928న నూజివీడు గ్రామంలో జన్మించిన వీరి వివాహం మేనమామ అయిన చందూర్ గారితో 1947లో జరిగింది. చెన్నైలో ఉన్నప్పుడు ప్రముఖ సాహితీ వేత్తలతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1949 నుంచి రచనలు చేస్తున్న వీరు ప్రముఖ రచయిత్రిగా అందరికీ పరిచయం. తన రచనల ద్వారా ఎందరినో ప్రభావితం చేసారు. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా తన రచనల ద్వారా సమాజాన్ని మానసికంగా తయారు చేసేవారు. ముఖ్యంగా మాలతీ చందూర్ గారు తెలుగు పాఠకులకు చిరపరిచితులు. 1950 నుంచి కొన్ని దశాబ్దాల పాటు పాఠకుల ప్రశ్నలకు ఆంధ్రప్రభ వార పత్రికలో ప్రమదావనం శీర్షిక ద్వారా ‘జవాబులు’ అందించేవారు. ఎందరికో ఆ శీర్షిక మనోధైర్యాన్ని అందించేది. పరిష్కారాలు చూపేది. తెలియకుండా వారు అందరికీ ఆత్మీయురాలై పోయారు. చాలామంది ఆ ‘జవాబులు’ శీర్షికని బుక్ బైండింగులు చేసుకుని దాచుకునేవారు. స్వాతి వార పత్రిక ద్వారా ‘నన్ను అడగండి’ శీర్షిక ద్వారానూ పాఠకులకు మరింత దగ్గరయ్యారు.

స్వాతి మాస పత్రికలో ‘పాత కెరటాలు’ శీర్షికన దాదాపు 400 పైగా ప్రసిద్ధ నవలలను పరిచయం చేశారు. ఎన్నో నవలల సారాంశాన్ని, చరిత్రను పాఠకులకు పరిచయం చేసారు. ఒక ఎన్‌సైక్లోపీడియా అని చెప్పచ్చు. మాలతీ చందూర్ సాహిత్య విజ్ఞాన గని.

జీవితంలో అధిక భాగం రచనల పైనే గడిపిన వీరు సామాజిక సేవలోనూ విశేషమైన కృషి చేసారు. అంధ్ర మహిళా సభ నిర్వహణలో భాగస్వామ్యం వహించారు.

కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా వున్నారు. అనువాదకురాలు కూడా.

వీరి రచనల్లో వంటలు పిండి వంటలు, అందాలు అలంకారాలు, పాత కెరటాలు, జాబులు జవాబులు ఎంతో ప్రసిద్ధి చెందిన రచనలు. ‘వంటలు-పిండి వంటలు’ పుస్తకం దాదాపు 33 సార్లకు పైగా ముద్రించబడింది అంటే ఆ పుస్తకం ఎంతగా ప్రజల్లో ప్రాచుర్యం పొందిందో తెలుస్తుంది.

మొదటి కథ ‘రవ్వల దుద్దులు’ ‘అంధ్ర వాణి’ లో వచ్చింది. ఎన్నో కథలు రచించారు. భూమి పుత్రి, హృదయనేత్రి, శిశిర వసంతం, కలల వెలుగు. మనసులోని మనసు, అనే నవలలు ప్రసిద్ధి పొందాయి. వీరి రచనలు గుజరాతీ, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషలలోకి అనువదించ బడ్డాయి.

పాత్రల చిత్రణ:

వీరు తను ఎన్నుకున్న ఇతివృత్తం లోనూ, కథా కథన గమనంలోనూ ప్రత్యేక మైన శైలి కనిపిస్తుంది. ‘చంపకం- చెదపురుగులు’ 1955 లో తొలి ముద్రణ. ఇతర ప్రముఖ నవలలు శతాబ్ది సూరీడు, కాంచన మృగం, మనసులో మనసు, వసంత, మొదలైన పాతిక నవలలు రచించారు. అనేక ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు.

ప్రపంచ సాహిత్యాన్ని చదవటమే కాదు ఆ సాహిత్య సారాన్ని నలుగురికీ తన రచనల ద్వారా పంచారు. ‘హృదయ నేత్రి’ నవల భారత స్వాతంత్ర్య సమర నేపథ్యంతో సాగుతుంది. ఈ నవల కలకత్తా లోని భారతీయ భాష పరిషత్ వారి ప్రతిష్ఠాత్మకమైన అవార్డుని అందుకుంది. ఈ నవలను శాంతా దత్ గారు ‘ఇదయ విలిగల్’ అన్న పేరుతో తమిళంలో అనువదించారు.

స్త్రీల సమస్యలు, గృహ హింసలు కథా ఇతివృత్తాలు వుండి, వాటి పరిష్కారాలూ చూపుతాయి.. వాస్తవానికి దగ్గరగాను, మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించే రచనలు చేసారు. మాలతి గారి రచనలు మానవ సంబంధాలకు విలువ నిస్తాయి. కథానాయిక పాత్ర ఎంతో ఉన్నతంగానూ, ఆత్మగౌరవంతోనూ కనిపిస్తాయి. ఓటమిని ఎరుగని స్త్రీ పాత్రలు. స్త్రీల సమస్యలను వివిధ కోణాల్లో తన రచనల్లో ప్రతిబింబింప చేసేవారు. ఉత్తమ రచయిత్రిగా పేరు పొందారు.

మాలతీ చందూర్ హైస్కూలు వరకే చదువు కున్నారు. ఆమె వివాహానంతరం చందూర్ గారి ప్రోత్సాహంతో చదువుకున్నారు. పి.జి. కూడా చేశారు. అంధ్ర విశ్వవిద్యాలయం వారిచే డాక్టరేట్ అందుకున్నారు. పొట్టి శ్రీరాములు అసువులు బాసిన భవన సంరక్షణ విషయం లోనూ, నిర్వహణ బాధ్యతలను మాలతీ చందూర్ దంపతులు చేపట్టి ఎంతో కృషి చేసారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ సంస్థ అధ్యక్షురాలిగా కూడా వున్నారు. వీరు అందుకోని అవార్డులు లేవు.

ఈ నవలలో స్త్రీలను ఎక్కడా గృహ హింసకు పాల్పడే పాత్రలు కానీ, అణగార్చే పాత్రలు కానీ కనిపించవు.

ఆనాటి సమాజంలో మహిళలు ఎదుర్కునే సమస్యలను చూపించారు. ఎక్కువగా ఆనాటి దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో నిజంగా జరిగిన సంఘటనలు వర్ణించారు రచయిత్రి. అవి చదువరులను ఎంతో ప్రభావితం చేసేవి. ఈ నవల 1992లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకుంది అంటే అందులోని ఇతివృత్తం ప్రధానాంశం. కథని నడిపిన తీరు. విసుగు కలిగించదు. నవలలో కథా కాల గమనం చాలా సంవత్సరాలు గడచినా చదువుతుంటే ఎక్కడా బోరు కలగదు. ఆసక్తికరంగా సాగుతుంది.

నవలలో స్వాతంత్ర్య ఉద్యమాలు:

రచయిత్రి స్వాతంత్ర్యం సాధించటానికి భారతదేశమంతా జరిగిన నాటి ఉద్యమాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. చదువరులకు ఆనాటి దృశ్యాలు కళ్ళముందు నిలుస్తాయి.

పలనాటి ఉద్యమాల్లో ఎదురు నిలిచిన కన్నెగంటి హనుమంతరావుని పోలీసులు చుట్టుముట్టి తుపాకీలతో కాల్చి, బానెట్లతో తూట్లు పొడిచిన తెల్లవారి పోలీసుల దౌర్జన్యాలు, దాహం, దాహం అంటూ నీటికోసం అలమటించే ఆయన దగ్గరకు ఎవరినీ రానీయని పోలీసుల అరాచకాలు ఇవన్నీచదువుతుంటే అందరి కళ్ళ ముందూ సజీవ సంఘటనలుగా నిలుస్తాయి.

ఆంధ్ర దేశ ఉద్యమాలే కాదు దేశం అంతా జరిగే ఉద్యమాల గురించి ప్రస్తావించారు రచయిత్రి ఈ నవలలో. భగత్ సింగ్ కుట్ర కేసు, అరెస్ట్ అయిన రాజకీయ ఖైదీలను, మామూలు ఖూనీకోరులు అందరినీ ఒక చోట బంధించటం సరి కాదంటూ రాజకీయ ఖైదీలు నిరాహార దీక్షలు చేపట్టటం, ఎటువంటి స్పందనా లేక పోవటంతో చాలా మంది వారి దీక్షను విరమించినా బెంగాలీ యువకుడు ‘జితేంద్రనాథ్’ మాత్రం రాజకీయ ఖైదీలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పరచాలి అంటూ చేసిన నిరాహార దీక్ష అరవై మూడు రోజులు చేసి అరవై నాలుగో రోజున ప్రాణాలు కోల్పోయాడు. అతని వీడ్కోలుకి లక్షలాది మంది ఆ స్వాతంత్య్ర యోధునికి వీడ్కోలు పలికారు.

సైమన్ కమీషన్ ఉదంతం:

సైమన్ కమీషన్ గురించి సర్వే కోసం బ్రిటీష్ అధికారులు వచ్చినపుడు, వారు ప్రయాణించిన రైలు మార్గంలో ఉద్యమకారులందరూ నిశ్శబ్దంగా వుండి గో బాగ్ సైమన్ అంటూ చేసిన నినాదాలు, ఉప్పుసత్యాగ్రహం- గాంధీజీ పర్యటనలు, శాసనోల్లంఘనం చేసి ఉప్పు చేయటం, దాని ప్రభావం. దేశ పరిస్థితులు ఇవన్నీ కూడా రచయిత్రి చాలా హృద్యంగా వివరించారు.

క్విట్ ఇండియా ఉద్యమాలు, గాంధీజీ ‘డు ఆర్ డై’ అన్న పిలుపులూ వాటికి ఉత్తేజితులై కదన రంగాన దూకిన యువత ప్రభుత్వ ఆస్తులు అన్నిటినీ తగులపెట్టటం, మళ్ళీ అరెస్ట్‌లు, వారితో పాటు జైలు జీవితం గడిపిన గోపాలరావు.. ఆ సమయంలోనే రాముడత్తయ్య మరణ వార్త..

సామూహికంగా కాక వ్యక్తిగతంగా శాసనోల్లంఘన చేయమన్న గాంధీజీ పిలుపు మేరకు గోపాలరావు కూడా పాల్గొన్నప్పుడు పోలీసుల దౌర్జన్యం వల్ల దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయిన గోపాలరావుని రాజమండ్రి జైలుకి పంపటం, అక్కడ నుంచి కడలూరు జైలులో మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తరువాత విడుదలైన తరువాత ఎంతో మార్పుని గమనిస్తాడు గోపాలం. ఈ నవలలో మాలతీ చందూర్ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు గారి దీక్ష గురించి, వారి చివరి రోజుల గురించి ఎంతో హృద్యంగా చిత్రించారు. చదువుతున్న వారికి ఆ నాటి రోజులు కళ్ళముందు మెదులుతాయి.

ఎన్ని బాధలను అనుభవించారో వివరించారు రచయిత్రి. స్వాతంత్య్ర సిద్ధి, అనతి కాలంలోనే గాంధీజీ మరణ వార్త, ఎవరి కోసమూ ఆగని కాలం. పెరిగి పెద్దదైన మనవరాలు.

తన మనుమరాలు పుట్టినపుడు ఆ పాప కళ్ళల్లో తన మేనత్త కళ్ళనే చూసాడు. పెరిగి పెద్దైన ఆ మనుమరాలి అభిప్రాయాలు కూడా అభిమానించేవాడు. స్వతంత్ర భావాలు కల స్వరాజ్యం అంటే ఎంతో ఇష్టం గోపాలరావుకి.. శత వృద్ధురాలయిన జానకమ్మగారు కలలు కన్న స్వరాజ్యం తన ‘హృదయ నేత్రం’తో చూస్తున్నదా అన్నట్లు స్వరాజ్యం నిర్ణయం తెలుపుతోంది. ఈ వాక్యంతో హృదయనేత్రి నవల ముగుస్తుంది.

డా. మాలతీ చందూర్ గారు అనారోగ్యంతో 21, ఆగస్టు, 2013 లో మరణించారు. ఇంత చక్కటి నవలను అందించిన మాలతీ చందూర్ గారు చిరస్మరణీయులు.. సాహిత్యమున్నంత కాలం వీరి సాహిత్యం కూడా అజరామరమై సాహితీలోకాన నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here