హృదయానికి ప్రేమలేఖ

    0
    7

    [box type=’note’ fontsize=’16’] ఓ ప్రేయసి తన ఊహలని, ఊసులని అందమైన ప్రేమలేఖగా మార్చి తన ప్రియుడికి తన మనోభావాలను వెల్లడించిన వైనం చొప్పదండి సుధాకర్ కథ “హృదయానికి ప్రేమలేఖ“.[/box]

    ఎంతకీ పూర్ణరాత్రి కాలేని అర్ధరాత్రి,

    రెండు ముళ్ళు ఒక్కటవుతోన్న క్షణం.

    నీవు అనబడే నాకు!

    [dropcap]కి[/dropcap]టికీలోంచి నిండు చందమామ నన్నే లక్ష్యంగా చేసుకొన్నట్టు తన సుతిమెత్తని కిరణాలను సూటిగా ఎక్కుపెడుతున్నాడు! చుట్టూ అలవి కాని నిశ్శబ్దం. మనసులో చెలరేగుతున్న జ్ఞాపకాల అల్లకల్లోలం! ఎంత వొద్దనుకున్నా నువ్వే గుర్తుకొస్తున్నావ్…! ఏం చేయనూ? ఎందుకోగానీ కొంచెం సేపు నన్ను నేను మనఃస్ఫూర్తిగా ఆవిష్కరించుకోవాలనిపిస్తోంది. అలుసుగా తీసుకోవుగా నేస్తం! ఆడపిల్లని – అంతకన్నా మార్గాంతరం లేదు మరీ! కొబ్బరాకుల మీదుగా స్వచ్ఛంగా ప్రతిఫలిస్తోన్న నీ నవ్వులాంటి వెన్నెల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాను. కాసేపు నేను మాట్లాడతాను! నీ కోసమే బతికే నా కోసం విను…!

    నువు నాకు నచ్చుతావ్… కానీ నచ్చడం లేదు. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. కానీ ఇష్టం లేదు. ఎందుకంటే – నీలో ఎన్నో లోపాలు… అవి నువ్ మార్చుకుంటే… ఆ ఖాళీని పూడ్చుకుంటే ఇంకా… ఇంకా నచ్చుతావ్. ఇవన్నీ నీతో మనసు విప్పి చెప్పాలనే ఉంటుంది. కానీ ఎపుడూ తీరిగ్గా సమయం దొరకదు. ఎపుడయినా కాసింత సమయం దొరికిందా – నిన్ను అట్లా ఒంటరిగా కలుసుకోవడం అనే ఆలోచనే ఎంతో థ్రిల్ కలుగజేస్తూ ఒళ్ళంతా పులకలు రేగి అనిర్వచనీయమైన గగుర్పాటు…

    చెమరింత అట్లా కమ్మేస్తాయ్..! ఆ వెంటే నేనున్నానంటూ చలిగాలిలా సిగ్గు కమ్మేస్తుంటుంది. ఆ రెండిటి దాడిలోంచి బయటపడేలోపు ఎవరో ఒకరు దిగబడిపోతారు. ఏకాంతం భగ్నమయిపోతుంది. చెప్పరాని కసి, ఉడుకుమోత్తనం, కోపం తన్నుకొస్తాయి. ఆ వచ్చిన వాణ్ణి లేదా ఆవిడని గొంతు పిసికి చంపేయాలన్నంత ఉక్రోషం పొడుచుకొస్తుంది. వీటన్నింటికి తోడు ఆ వచ్చినవాళ్ళు మన గురించి ఏమనుకొంటారో అనే శంకతో వాళ్ళ మెప్పు కోసం (వాళ్ళు చివరికి ఇంట్లో వాళ్ళయినా) నీతో అందాక ముభావంగా ఉన్నట్టు మొహం పెట్టి, ముఖం మాడ్చుకుని కూర్చుంటాను లేదా వంటింట్లోకి వెళతాను! మళ్ళీ మనసంతా ఒకటే ఊగిసలాట! నువ్వేమనుకొన్నావోననీ – ఏమీ అనుకోవని కూడా కొంచెం ధీమా! అయినా మనసు ఒకచోట నిలవదు… ఏదో వెలితి… ఇంకేదో ఆతృత! హు… అదో నరకమంటే నమ్ము – నీతో ఇవన్నీ చెప్పలేక, చెప్పకుండా ఉండలేక… ఛ – ఏం జీవితమో ఏమో? క్షణాల్ని రోజులుగా సాగదీస్తే ఎంత బాగుండునూ?

    ఒక రోజంతా నీతో ఏకాంతంగా ఒక ద్వీపంలో గడిపే అదృష్టమొస్తే బాగుండును! అందుకోసం ఎటువంటి ఘోర తపస్సుకైనా సిద్ధపడేదాన్ని. అబ్బే… సిద్ధపడతానూ ఇప్పటికీ. ఇంకా జన్మజన్మలకీ…!

    ఎక్కడ దారి తప్పాను? నీతో ఇదే చిక్కు… నువ్వొక సుడిగుండానివి! నీ ఆలోచనొస్తే చాలు. నన్ను నేను కోల్పోతాను. ఏం ఆలోచిస్తానో ఎట్లా ప్రవర్తిస్తానో… నా మెదడుకు మాట్లాడే మాటకి మధ్య లింకు ఉంటుందో, తెగుతుందో లేశమైనా తెలిసి చావదు.

    నువు నన్ను అస్తమానం సౌజన్యం, సౌశీల్యం, నిండైన స్త్రీత్వం కలబోసిన ‘మేలిమి బంగారం’ అంటూ ప్రస్తుతిస్తావు గానీ, వాస్తవానికి నా అంతటి కోతి మరొకరు లేరు. కానీ ఎందుకో నీ సమక్షంలో… ఒక్క సమక్షంలో ఏమిటి? ఉత్త పేరు వింటే చాలూ! గొప్ప సంచలనానికి లోనవుతాను. అలర్ట్ అయిపోతాను. ఇక అంతే…! నా మాట, నడక, ఆలోచనా అన్నీ నీ చుట్టే త్రికరణ శుద్ధిగా తిరుగుతాయి.  ఒంటి తీగ మీద బాలెన్స్ చేస్తూ నడిచే సర్కస్ కళాకారుడిలా ఏకాగ్రతలోకి వచ్చేస్తాను. ఇక నన్ను నేను ప్రదర్శించుకోలేను. నీకేది నచ్చుతుందో అచ్చంగా అలాగే ఒదిగిపోతాను. రాష్ట్రాలు, ఎల్లలు దాటి బంగాళాఖాతంలో కలిసే గోదారిని సీసాలో బంధించినట్టు ‘కామ్’ అయిపోతాను.

    కొంతమందినీ, వాళ్ళ వృత్తిని విడదీసి చూడలేం! కనీసం అట్లా భ్రమించలేం. ఉదాహరణకు సచిన్ క్రికెట్, ఘంటసాల పాటలు, టాటా బిజినెస్సూ, మైఖల్ జాక్సన్ డాన్స్, బిల్ గేట్స్ కంప్యూటర్స్ నేను… నిన్ను ప్రేమించడం. మ్… విన్నావా? వినకుండా ఉండి ఉంటే బాగుండను. కాదు. విన్నా విననట్టు ఉంటూ ఆ మాటని నీ గుండెల్లో పదిలపరుచుకుని నా ప్రేమనూ – నన్నూ గుర్తిస్తే బాగుండును. నాకు తెల్సు నేనంటే నీకు ఎంతటి ‘సాంద్రతో’. కానీ నువ్వెప్పుడూ నాకు స్పష్టంగా చెప్పలేదు. నీకు నాపై గల ప్రేమ గురించి, నేనూ నీకు చెప్పలేదనుకో… అయినా నువు చెప్పలేదన్న కోపం రోజురోజుకి పెరిగిపోతోంది. బహుశా ఇదేనేమో అసలయిన ప్రేమంటే, తనకు నచ్చిన వాడిని ఏకకాలంలో ప్రేమించడం, ద్వేషించడం. ద్వేషిస్తూనే ప్రేమించడం ఒక్క ప్రేమికుల మధ్యనే ఉంటుంది కాబోలు. ఇదొక నిర్వచనం కోట్ చేసుకో!

    సరేనబ్బా – ! ఎక్కడో దారితప్పాను. ఇది రెండోసారి కదూ! పోనీ ఎన్నిసార్లయితేనేం? నీ ఊసే కదా – ! ఊఁ – నువు నాకు నచ్చుతావ్. కానీ నచ్చడం లేదూ. ఎందుకంతే నువ్ మారాలి. అన్ని రకాలుగా మారాలి. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే నాకు అనువుగా మారాలి. మారినాకా ఆ ‘నువ్వు’ నాక్కావాలి!

    అయితే మారకున్నంత మాత్రానా నిన్ను మర్చిపోలేను. అంతమాత్రానా మారకుండా ఉండిపోతావా? మారకున్నా నువు కావాలి. కాని మారితే మరీ మంచిది. మారితే నువ్వు మరీ – మరీ – నచ్చుతావ్. అందుకే నువు నాకు నచ్చినా నచ్చడం లేదు. ఇపుడర్థమయిందా ప్రేమ సూక్ష్మం! నువ్వొక ముద్ద బంగారానివి. దాన్ని నాకు నచ్చిన నగగా మార్చుకొంటే తప్పేమిటీ? నాకు నచ్చిన నగను వేసుకొన్నట్టు నచ్చినవాడిని దిద్దుకొంటే పోయేదేమిటీ!

    నువు కనిపిస్తే ఒక రంధి, కనిపించకపోతే మరింత రంధి. వెరసి నీ ఊహే ఒక రంధి మహాసముద్రం! ఈ రంధిలోనే నిరంతరం కొట్టుమిట్టాడుతూ, చచ్చినట్టు బతుకుతూ, ఉండాలన్న కోర్కె ఉంది చూశావ్! అదొక పసిఫిక్ లాంటి లోతైన, నైలునది అంతటి పొడవైన జలసర్పం!

    నిన్ను ‘మీరు’ అనాలనిపిస్తుంది. కానీ చెప్పరాని తొట్రుపాటు, సిగ్గు పాటమరింపు రెండు కలబోసుకొన్న ఒక జలందరింపు పెదాలని హైజాక్ చేసేస్తాయి. ఫలితంగా ఎప్పట్లానే ‘నువ్వ’నే అంటాను. నిన్ను నిజంగా ‘మీరు’ అంటే నువు చూసే ఆ కళ్ళ తాలూకూ ‘చికిలింత’లో నేను ఉక్కిరిబిక్కిరయి కొట్టుకుపోతానేమో? నిజమా, అబద్ధమా, అబద్ధమైతే – అమ్మో నిజమైతే ఎంత బాగుండును. ఎందుకులే ఈ తికమక! ఓసారి నీ గుండెనే అడిగేస్తాను. మెల్లిగా అదీ నువు వినకుండా – !

    నిన్న రాత్రి కల్లోకొచ్చావ్ బాబూ! ఛ – చెప్పగూడదనుకొన్నాను. కానీ నీ ముందు ఏదీ దాచలేను కదా! కానీ – అదీ – ఏంటమ్మా ఆ విషయం తలచుకొంటేనే ఒళ్ళంతా సిగ్గుతో చితికిన కోడిగుడ్డయిపోతోంది.

    స్నానం చేద్దామని సిద్ధమవుతున్నానా! ఎక్కడినుండి ఊడిపడ్డావో లేక చుప్పనాతి ఇంట్లోనే దాక్కుని ఉన్నావో, రెప్పవాల్చవూ – అడుగు కదల్నీయవూ – నువ్వక్కడ – నేనిక్కడా ఇద్దరి మధ్య అడుగు కూడా లేని దూరం కాని దూరం. దగ్గరగా రావూ – దూరంగా వెళ్ళిపోవూ – సాలార్‌జంగ్ మ్యూజియంలో శిల్పాలు పరికించి చూసినట్టు ఆ రెప్పవాల్చని చూపేమిటి? అయ్యో – ఇంట్లో వాళ్ళంతా ఎక్కడ చచ్చారో – ఎవరయినా వచ్చి ఈ ఇబ్బందికర సన్నివేశాన్ని భంగపరిస్తే బాగుండును! రోజూ మనల్ని క్షణం కూడా ఒంటరిగా వొదలని ఈ ప్రపంచం, కుటుంబమూ ఇవాళేమిటీ? ఇంత విచ్చలవిడిగా వొదిలేసింది. బహుశ కల అని కాబోలూ – !

    గడియారం తిరగడం లేదూ – సూర్యుడూ కూడబలుక్కున్నట్టు కదలడం లేదు. నేనూ స్తంభించిపోయాను. నువ్వింకా చూస్తూనే ఉన్నావ్ – కదలాలని గొప్ప ప్రయత్నం! కాళ్ళు కదిలినట్టే అనిపించినా ఉన్న చోటు నుంఛి మిల్లీమీటర్ కూడా కదలడం లేదు. పోనీ పాపం ప్రియురాలు కదా! ఏదో షాక్‍లో కొట్టుమిట్టులాడుతోంది, నేనయినా వెళ్ళిపోవాలన్న సిగ్గు నీకన్నా ఉండద్దూ? – అబ్బే – దొరికింది అవకాశం అన్నట్టు కన్ను మూస్తే ఎక్కడ చేజారిపోతుందో అన్నట్టు సన్నని గీతల్లాంటి కళ్ళు కలువపూవుల్లా విప్పజేసుకొని, చూడడం తప్ప జీవితానికి మరో పరమార్థం లేనట్టు మరీ కరువుతో అల్లాడిపోతున్నట్టు – ఛ – ఛ – చచ్చిపోయాననుకో! ఇక ఈ ఆనందం భరించడం నావల్ల కాదనుకొని ఒక్కసారి అలా నిట్టూర్చానో లేదో, కొల్లేటి సరస్సు మొత్తం క్షణంలో ఘనీభవించి ఒకే ఒక బిందువుగా రూపాంతరం చెందినట్టు మెలకువ వచ్చింది.

    “ఛ – కలా – అయ్యో ఇంకాసేపు వీలయితే జీవితకాలం ఇదే కల ఇట్లాగే కొనసాగితే ఎంత బాగుండునూ – ! నీ జ్ఞాపకంలో ఒళ్ళు తొలి చినుకుతో తడిసిన చిగురుటాకయిపోయింది.

    నువు లేవూ – నీ చూపూ లేదు – !! ఏడేడు సముద్రాలు ఉప్పొంగినట్టు ఏడుపు తన్నుకొచ్చింది.

    “ఏంటీ ఆంటీ – ఏడుస్తున్నావా – ?” మా అన్నయ్య కొడుకు బబ్లూ వేసిన ప్రశ్నకు దడుచుకున్నాను.

    “ఆఁ – ఏదో పీడకల రా!” తరతరాలుగా వినడానికి అలవాటయిన ఓ సాకులాంటి వాక్యం – అసంకల్పితంగా నోటికొచ్చింది.

    “ప్చ్ – నువు కలలో కొస్తే అది పీడకలా?” బతుకెంత దుర్భరమైపోయింది?

    నచ్చినవాడిని, నచ్చినట్టుగా చెప్పలేకపోవడం నా అసమర్థతా లేక చుట్టూ ఉన్న జనాలదా – అదీ ఇదీ కాక ఈ కనిపించని కట్టుబాట్లదా ఏమో – ఏమో?

    “అమ్మా – మనం ఒక పద్ధతిగా, నీతిగా బతకడానికి ఏనాడో పెట్టుకున్న కొన్ని ఆచారాలు, నేడు దురాచారాలుగా మారి మనుషుల్ని అవినీతిగా బతికేందుకు పురికొల్పుతున్నాయ్.” చిన్నప్పుడెప్పుడో సోషల్ మేస్టారు చెప్పిన మాటలు ఇపుడు గుర్తుకొస్తున్నాయ్.

    నిజమే అది ఏదయినా కావచ్చు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి హాని కలగకుండా చేసే ఏ పనయినా, ఎవరయినా ఎందుకడ్డుకోవాలి? తత్వవేత్తనవుతున్నానా? నా వాదన అంతా నీ కోసమే సుమా!

    Need is the first need of any invention.

    మనిషి నిప్పును కనుగొన్నాడు. దాంతో వాడి జీవనసరళియే మారిపోయింది. ఇపుడు దాన్ని పంచభూతాల్లో చేర్చి పూజిస్తున్నాడు వెధవ! వాడి జ్ఞానాన్ని వాడే అవమానపరచుకొన్నాడు. యుద్ధాలకు కొత్త కొత్త స్థలాలకు, మనుషులకు భయపడి మేనరికాలు అలవాటు పడ్డాడు. శతాబ్దాల తర్వాత ఆ సంబంధాలు మొహం మొత్తి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాల కోసం, సంబంధాల కోసం అర్రులు చాచాడు. అవీ ఇవీ దొరకనప్పుడు మరీ నీచమైన సంబంధాలు కూడా కలుపుకున్నాడు. వాటి కోసం వెంపర్లాడాడు. అయితే అన్ని ‘ఘనకార్యాలు’ తనకు నచ్చినవాటి కోసమే నచ్చిన దారిలోనే సాధించుకొన్నాడు. వేల సంవత్సరాలు ప్రయాణించాడు. పరిణతి సాధించాడు, పరుగులు తీశాడు, ఇదంతా ఒక వలయం!

    కానీ యిపుడే సంధియుగంలో కొట్టుమిట్టాడుతున్నాడు నచ్చింది చేయలేక, చేసేది నచ్చక తనను తాను అను నిత్యం మోసం చేసుకొంటూ దినదినం అనుక్షణం చస్తూ బతుకుతున్నాడు.

    అసలు ఒక వాదన చేద్దాం! నాకు నచ్చిన పని నేను చేయడానికి ఎందుకు భయపడాలి? నిన్ను ప్రేమిస్తున్నానీ, నీవు లేనిదే బతకలేనని ఎందుకు నీతో చెప్పలేకపోతున్నాను? ఇది ఇతరులు నాపై విధిస్తున్న ఆంక్షలా లేక నేనే వాళ్ళకి భయపడి నన్ను నేను మోసం చేసుకొంటూ వాళ్ళనీ వీళ్ళనీ ఒక సాకుగా చూపిస్తున్నానా?

    నాకేది చేదో మరేది ముద్దో సరిగా తెల్సుకొనే విచక్షణని కోల్పోతున్నానా? ఏమో – ఏమేమో? – అంతా అయోమయం -!

    అన్నట్టు ముద్దంటే గుర్తొచ్చింది. నిన్ను ముద్దాడిన ఆ రోజు నిజంగా నా జీవితంలో నేను నేనుగా జీవించిన రోజని ఘంటాపధంగా చెప్పగలను. నేను మొత్తంగా ఒక పాదరసం గోళీలాగా మారిపోయి నీ గొంతులోకి జారిపోయిన ఫీలింగ్! సముద్రంలో విసిరిన గులకరాయిలాగ నీలో అంతర్ధానమైపోయాను!

    ఆ రోజు, నిమిషం, క్షణాలు అన్నీ ఇప్పటికీ నాకు స్మృతిలోనే ఉండి ఇప్పుడో, అపుడో జరిగినట్టు ఇంకా అనుభూతి పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాయి. ఎవరయినా హఠాత్తుగా నా పేరడిగినా మర్చిపోతానేమోగానీ, ఆ క్షణాలు మాత్రం మరపుకి రావు.

    సరే, ఇక ముగిస్తానబ్బా! మొదలెట్టినపుడే తెలుసు ఎపుడో ఒకప్పుడు, ఎక్కడో ఓ చోట ముగించక తప్పదని. అయినా మళ్ళీ ఈ ముగించడం అనే అంకానికొచ్చినపుడు ఎవరో నా గుండెను చేతిలోకి తీసుకొని పిండేస్తున్నంత ఆవేదిన! అయినా ముగించక తప్పదు. ఎందుకంటే తెల్లవారిపోత్తోంది. తెల్లవారుతూనే మళ్ళీ రేపు జీవన సమరంలో కొట్టుకు చావాలి కదా! రాత్రి వేళ కాబట్టీ – అదీ – నిండా దుప్పటి కప్పుకొని చీకట్లో నీ రూపు ఊహించుకొని నా హృదయానికి అనగా అదే నీకు లేఖ రాయబూనుకొన్నాను. లేకపోతే నాకింత ధైర్యమెక్కడిదనీ – ?

    కాగితం మీది ప్రేమలేక కనిపిస్తుంది. హృదయానికి రాసిన ఈ లేఖ పూర్తిగా అదృశ్యం! అచ్చం  నా ప్రేమలాగే! అదీ నా ధీమా!

    ఒకటి మాత్రం వాస్తవం. నేను నిన్నెంత గాఢంగా ఇష్టపడుతున్నానో తెలియజేయడానికి నాకు ఈ జీవితకాలం సరిపోదు. కాగితం మీద పెట్టాలంటే భూగోళమంత వైశాల్యం గల కాగితం కూడా సరిపోదు. కాకపోతే అతి నీతో చెప్పడానికే సమయం కుదిరి చావడం లేదు. నేను చచ్చేలోగానయినా అది కుదురుతుందో లేదో తెలియడం లేదు. ప్రియతమ్! ఒక సూత్రీకరణ చేస్తాను.  నీ పట్ల నేనూ చూపే నా ద్వేషం పూర్తిగా ద్వేషం కాదు. నిజానికి అదీ ప్రేమే! అయితే ప్రేమని ప్రేమగా ఎకాఎకీ ప్రదర్శించలేక ఆ స్థానంలో నా చేతకానితనానికి ప్రతీకగా ద్వేషాన్ని ప్రదర్శించడం, అలా ప్రదర్శిస్తున్నట్టు నటించడం అలవాటు చేసుకొన్నాను.  ప్రేమని ప్రేమగా ప్రదర్శించలేనివారికి మిగిలింది ద్వేషభావమే! మళ్ళీ ఆలోచిస్తే అది ఖచ్చితంగా ద్వేషభావం కాదు. తాత్కాలికంగా ఒక వీలు కాని పరిస్థితి. అంతే ప్రేమని ప్రేమగానే ప్రకటించవచ్చునేమో గానీ, ప్రేమను ద్వేషించడం ద్వారా కూడా ప్రకటించవచ్చన్నది నా కొత్త సూత్రీకరణ! ద్వేషానికి ద్వేషమే దిక్కు గానీ, ప్రేమకు అప్పుడపుడు ద్వేషం కూడా దిక్కవుతుంది. ఏమిటో అంత్తా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదూ! అచ్చం నా బతుకు చిత్రంలాగే! పోనీ కొంచెం తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అమ్మాయిలు తమ ప్రేమను ప్రకటించడానికి అప్పుడప్పుడు ద్వేషించినట్టు కూడా నటిస్తారు. ఇది చుట్టూ ఉన్న సమాజమే కల్పించిన ఒక దిక్కులేని ప్రత్యామ్నాయం. కాబట్టి తెల్సుకో – ! ఆడపిల్లలు కోపిస్తున్నారంటే వాళ్ళని ఇష్టపడే అబ్బాయిలు నిరుత్సాహం చెందకూడదు. ఎందుకంటే బహుశ అదీ ప్రేమే కావొచ్చు. ఎక్కడో ఒకచోట కాకపోవచ్చు. అయితే ఆ రహస్యం ఒకటి రెండు కలయికల్లోనే తెల్సిపోతుంది. కానీ ఈ రెండు ముఖాల ప్రేమ విషయం కొంచెం కష్టమే! తేలిక సూత్రం ఒకటే – ఓ పక్క మాట్లాడుతూ, పనిలో పనిగా ఎదురుచూస్తూ, మరో పక్క అయిష్టత ప్రదర్శిస్తున్నారంటే ఖచ్చితంగా అది ప్రేమే!

    గొప్పగా చెప్పాను కదూ! కొంచెం మనసు తేలికపడింది. ఇదే మాట నీతో ముఖాముఖి చెప్పగలిగితే మనసు మరింత తేలిక అవుతుంది. హుఁ, అయితే ఆ రోజు ఎపుడొస్తుందో, అసలు వస్తుందో రాదో అన్నదే నా దిగులు! ఒకవేళ వస్తే మాత్రం నేనేమిటో, నా ప్రేమేమిటో నీకు నిరూపించి తీరతాను. ప్రపంచంలో ఎవరూ నిరూపించని రీతిలో!

    అందుకు నాక్కొంచెం ధైర్యమివ్వమని ఆ దేవున్ని నా తరఫున ప్రార్థించవూ! నువు కనిపించిన ప్రతీసారీ నిన్ను మాట్లాడించకుండా అవమానిస్తోన్నా మూగగా భరిస్తోన్న నీకు….!

    శతకోటి చుంబనాలతో!

    సెలవ్,

    ఇట్లు

    నీ ‘మేలిమి బంగారం’

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here