ఇచ్చట జాతకాలు మార్చబడును

1
8

[విజయాచలం గారు రచించిన ‘ఇచ్చట జాతకాలు మార్చబడును’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]పా[/dropcap]ఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు గారు, బీరువాలో భద్రంగా దాచి ఉంచిన కూతురు కస్తూరి జాతకం కాగితాన్ని బయటకు తీశారు. అ కాగితాన్ని కవర్లో పెట్టి, కాశీలో ఉంటున్న జ్యోతిష్య పండిట్ అనంతశర్మ గారికి పోస్ట్ చేశారు.

అనంతశర్మ గారు, శ్రీనివాసరావు గారి తాతగారు ఒకే కాలేజీలో చదువుకున్నారు. కళాశాల విద్య అనంతరం అనంతశర్మ గారు వంశపారంపర్యంగా వస్తున్న జ్యోతిషంలో ప్రావీణ్యం సంపాదించారు. శ్రీనివాసరావు గారి ఇంట్లో వాళ్ళందరి పెళ్ళిళ్ళకి అనంతశర్మ గారే జాతకం వేసి ఇచ్చేవారు. ఆ ఆనవాయితీ ప్రకారమే కస్తూరి జాతకం పంపించారు. ఉత్తరం వేసి రెండు నెలలైనా ఆయన నుంచి బదులు రాకపోవడంతో “అనంతశర్మ గారు కాలం చేసి ఉంటారు! లేకుంటే మనం ఎప్పుడు ఉత్తరం రాసినా వారం రోజుల్లోనే ఆయననుండి బదులు అందేది” అన్నారు దిగులుగా శ్రీనివాసరావు భార్య గాయత్రితో.

“మరేం చేద్దాం ఇప్పుడు? ఆయననుండి బదులు వచ్చేదాకా ఎదురుచూస్తూ కూర్చుంటే ఎలా? కస్తూరి చదువు పూర్తయి రెండేళ్లు కావస్తుంది. ఇంకా ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు?” భర్త వంక ప్రశ్నార్థకంగా చూసింది గాయత్రి.

“మన ఊర్లోనే ఉన్న జ్యోతిష్య పండిట్ కర్పూర శాస్త్రి గారికి మన కస్తూరి జాతకం చూపిస్తే ఎలా ఉంటుంది?” అన్నారు శ్రీనివాసరావు గారు. “సరే! చేసేదేముంది ? అలాగే చేద్దాం. మీరు ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిరండి” అంది గాయత్రి .

***

కస్తూరి జాతక కాగితం చూసి, కర్పూర శాస్త్రి చెప్పిన మాటలు విన్న శ్రీనివాసరావు గారి గుండె ఆగినంత పని అయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒంట్లో సత్తువ సన్నగిల్లింది. నీరసంగా ఇల్లు చేరి, సోఫాలో దిగాలుగా ఎటో చూస్తూ కూర్చున్నారు శ్రీనివాసరావు గారు.

అప్పుడే వంటగదిలోంచి బయటికి వస్తున్న గాయత్రి భర్తను చూసి “ఏమైందండీ? వడదెబ్బ ఏమైనా తగిలిందా?” అంటూనే గబగబా వంటగదిలోకి వెళ్లి, గ్లాస్‌తో చల్లని నీళ్లు తీసుకువచ్చి భర్తకు అందించింది.

భార్య అందించిన నీళ్ల గ్లాసు అందుకుని, గడగడా తాగి పక్కన పెడుతూ.. “వడదెబ్బ కాదే! మన కస్తూరి జీవితానికే పెద్ద దెబ్బ తగిలింది. అసలు మన కస్తూరికి ఏం తక్కువే? ఏ వంకా లేని నెలవంక కదే మన కస్తూరి. ఏ రోజైనా దానికి దిష్టి తీయడం మానేవా నువ్వు? అలాంటి బంగారు బొమ్మ జాతకం ఇలా రాసాడు ఏంటే ఆ భగవంతుడు?” అని శ్రీనివాసరావు గారు దుఃఖంతో పొంగుకు వస్తున్న కన్నీళ్లను, రెప్పలు టపీ టపీ అని ఆడించి ఆపే ప్రయత్నం చేశారు అయినా రెండు చుక్కలు నేలరాలాయి.

“మీరు టెన్షన్ పడి, నన్ను టెన్షన్ పెట్టకండి. అసలు ఆ కర్పూర శాస్త్రి మన అమ్మాయి గురించి ఏం చెప్పారో చెప్పండి” అంది భర్త పక్కన కూర్చుంటూ గాయత్రి.

“గాయత్రి! అమ్మాయి జాతకం ఇప్పటిదాకా బాగానే ఉన్నా, పెళ్లి అయ్యి అత్తారింట్లోకి అడుగు పెట్టాక భర్తకి ,అత్తింటి వారికి దిన దిన గండమే నట. అది అక్కడ అడుగు పెట్టగానే ఆస్తులన్నీ అరాయించుకుపోతాయట. ఇది తెలిసి కస్తూరికి పెళ్లి చేయగలమా! అలా అని జీవితాంతం పెళ్లి, పేరంటం చేయకుండా దీని తలరాత ఇంతే అంటూ సరిపెట్టుకోగలమా?” అన్నాడు దుఃఖం పొంగుకు రాగా పూడుకుపోతున్న గొంతుతో. “అయ్యో! ఇది ఎక్కడ అన్యాయం అండీ? ఓరి భగవంతుడా!” అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తోంది గాయత్రి.

“కానీ మన అమ్మాయి కొంచెం ముందు పుట్టి ఉంటే మహర్జాతకురాలు అయి ఉండేదట. అయినా పర్వాలేదు కాంచీపురం లోని మా గురువుగారు ఇలాంటి గ్రహ దోషాలు గల జాతకుల జాతకాన్ని తిరిగి రాసి, వారిని మహర్జాతకులను చేయగలరు. ఇప్పటిదాకా ఇలా ఎంతో మంది నష్టజాతుకులను అదృష్ట జాతకులుగా మార్చి, వాళ్ళ జీవితాలు బాగుపడేట్టు చేశారు. నేను ఆయన్ని దీనికి పరిష్కారం కనుక్కొని చెప్తాను. మీరు రేపు రండి అన్నాడు కర్పూర శాస్త్రి. కానీ జాతకం తిరగరాస్తే జరిగేది జరగక మానుతుందా? అసలు అలాంటివి నమ్మొచ్చా!” అన్నారు శ్రీనివాసరావు గారు విరక్తిగా నవ్వి.

భర్త చెప్పిన మాటలు విని కాస్త స్థిమితపడి, కళ్ళు తుడుచుకుంటూ.. “ఏ పుట్టలో ఏ పాము ఉందో? ఏ మంత్రానికి చింతకాయలు రాలుతాయో! చెప్పడం కష్టం. సరే! ముందు ఆ పరిష్కారం ఏంటో కనుక్కుందాం. పోనీలెండి ఆ శాస్త్రి గారి రూపేణ మనకు ఒక తోవ చూపించాడా భగవంతుడు. దీని గురించి దిగులు పడకండి. అంతా మంచే జరుగుతుంది” అంది భర్తకు ధైర్యం చెబుతూ.. తన భయాన్ని బాధని దిగమింగి.

మర్నాడు తనకు తోడుగా, ధైర్యంగా ఉంటుందని భార్యని తీసుకొని కర్పూర శాస్త్రి ఇంటికి వెళ్లారు శ్రీనివాసరావు గారు. కర్పూర శాస్త్రి చిరునవ్వు చిందిస్తూ, “రండి.. రండి.. మీ గురించే అనుకుంటున్నాను. మా గురువుగారికి మీ అమ్మాయి జాతకం గురించి చెప్పాను. ఆయన దీనికో పరిష్కారం చెప్పారు. ఇక మీ అమ్మాయి భవిష్యత్తుకి ఏ డోకా లేదు. కాకపోతే అది అంత సులభం కాదు. మీ అమ్మాయి జాతకంలో అడ్డుగా ఉన్న గ్రహాలని పక్కకి తప్పించి, శుభగ్రహాలను ముందుకు రప్పించాలి. మీ శ్రీమతి గర్భం దాల్చిన ఫోటో, అలాగే మీ అమ్మాయి నెలల పిల్లప్పటి ఫోటో ఇవ్వండి. ఆ ఫోటోలతో పాటు నవగ్రహాల ఫోటోలను పెట్టి యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞంలో రాత్రి పది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు అంటే.. నిద్రపోయే సమయంలో మీ అమ్మాయి, శ్రీమతి ఆత్మలను ఆవాహనం చేసి, గ్రహాలకు అనుసంధానం చేస్తాం. అదెలాగా? అని ఆశ్చర్యపోకండి. సైకియాట్రిస్ట్ పేషెంట్‌ని హెపనటైజ్ చేసి గతంలోకి తీసుకువెళ్లినట్టు మీ అమ్మాయి, మీ శ్రీమతి కడుపులోకి వెళ్లేట్టు చేసి, మంచి గడియల్లో ప్రసవం అయ్యేట్టు చేస్తే మీ అమ్మాయి జాతకం మారుతుంది” అంటున్న కర్పూర శాస్త్రివైపు వింతగా చూశారు శ్రీనివాసరావు దంపతులు.

“ఇది మీకు వింతగా అనిపించవచ్చు. కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ యజ్ఞం ఐదు రోజులు అహోరాత్రాలు చేయాలి. చాలామంది పండితులు కావాలి. ఐదు లక్షలు ఖర్చు అవుతుంది. మీ ఇద్దరూ ఆలోచించుకుని చెప్పండి” అని కర్పూర శాస్త్రి అనగానే ,

గాయత్రి, శ్రీనివాస రావు గారు ఒకరినొకరు చూసుకుని, ఇప్పుడే వస్తామని చెప్పి పక్కకు వచ్చి నుంచున్నారు.

ఇది నమ్మొచ్చా! అన్నట్టుగా ఆలోచిస్తూ నుంచున్న భార్య వంక చూస్తూ.. “అమ్మాయి పెళ్లి కని ఉంచిన పది లక్షల్లో ఈ కార్యక్రమానికి ఐదు లక్షలు ఇస్తే! తర్వాత పెళ్ళికి ఇబ్బంది అవుతుందేమో!” అన్నారు శ్రీనివాసరావు గారు బుర్ర గోక్కుంటూ.. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టుగా మొహం పెట్టి .

గాయత్రి మంగళసూత్రాలను బయటకు తీసి కళ్ళకు అద్దుకొని మళ్ళీ లోపల పెట్టుకుని “నా మంగళ సూత్రాలు ఉంచుకొని గొలుసు, గాజులు, నెక్లెస్ ఇస్తాను. అమ్మాయి పెళ్లి కని దాచిన డబ్బులు తీయక్కర్లేదు. కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోమని చెప్పండి” అంది భర్తతో మీరేం దిగులు పడకండి అన్నట్టుగా.

కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పి, ఇద్దరూ బయలుదేరుతూ ఉండగా కర్పూర శాస్త్రి కాస్త ముందుకు వచ్చి, “ఒక నిమిషం ఉండండి. మేము యజ్ఞం మొదలుపెట్టిన దగ్గర నుండి ఒక ఐదు రోజులు మీరు, ఇటువైపు రావద్దు. ఎందుకంటే! ఇంటి తలుపులు మూసి ఉంటాయి. మీరు వచ్చి మా యజ్ఞానికి భంగం కలిగించ కూడదు. అలాగే మీ వాళ్ళ ఫొటోస్ ఇచ్చి వెళ్లండి. మంచి రోజు చూసుకొని కార్యక్రమం ప్రారంభిస్తాం” చెప్పాడు శాస్త్రి.

***

ఐదు లక్షలు శాస్త్రి ఎకౌంటుకి ట్రాన్స్‌ఫర్ అయ్యాక కార్యక్రమం మొదలు పెట్టాడు..

గాయత్రి కెందుకో అనుమానం కలిగి

“శాస్త్రి గారు వాళ్ళ ఇంటికి వచ్చి యజ్ఞానికి భంగం కలిగించవద్దు అన్నారు కానీ వాళ్ల వీధిలోకి రావద్దన లేదు కదా! అసలు అక్కడ ఏం జరుగుతుందో ఓసారి వెళ్లి చూసి రండి” అనేసరికి శ్రీనివాసరావు గారు శాస్త్రి ఇంటికి బయలుదేరి వెళ్లారు.

కర్పూర శాస్త్రి ఇంటి తలుపులు అన్నివైపులా మూసి ఉన్నాయి. ఇంట్లోంచి పొగలు వస్తూ, ఏవో మంత్రాలు వినపడుతూ ఉండేసరికి ‘అమ్మయ్య! కార్యక్రమం జరుగుతుంది’ అనుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న శ్రీనివాసరావు కళ్ళు మతాబుల్లా వెలిగాయి.

కార్యక్రమం ముగిశాక, శ్రీనివాసరావు గారు శాస్త్రిని కలిసారు. “ఇక మీ అమ్మాయి భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది. పెళ్లి కూడా శీఘ్రమే కుదురుతుంది. అంతా మంచే జరుగుతుంది” చెప్పాడు శాస్త్రి గర్వంగా .

అతను చెప్పినట్టుగానే నెల రోజుల్లో మంచి సంబంధం కుదరడం, కస్తూరి పెళ్లి జరగడం చకచకా అయిపోయాయి. శ్రీనివాసరావు దంపతుల ఆనందం అంబరాన్ని అంటింది.

***

పెళ్లైన రెండు నెలలకి ఓ రోజు కూతురు కస్తూరి నుండి ఫోన్ వచ్చింది. “నాన్న! మీ అల్లుడుగారి పరిస్థితి ఏం బాగాలేదు. కడుపునొప్పని ఆసుపత్రికి వెళ్తే, స్కాన్ చేసి ఇంకా ఏవేవో టెస్టులు చేసి, ఆయనకు క్యాన్సర్ అని, అది కూడా ఫోర్త్ స్టేజ్లో ఉందని అన్నారు వైద్యులు” అని ఏడుస్తూ చెప్పి, ఇక మాట్లాడలేక ఫోన్ పట్టుకుని కూర్చుండిపోయింది కస్తూరి.

కూతురి మాటలు విన్న గాయత్రి, శ్రీనివాస రావు గారిని పట్టుకుని “అయ్యో! ఇదేంటండి ఇలా జరిగింది? జాతకం మారిస్తే అంతా మంచే జరుగుతుంది అన్నాడు ఆ కర్పూర శాస్త్రి. అతన్ని నమ్మి, అన్ని లక్షలు పోసి యజ్ఞం చేపిస్తే ఆ పరిహారం శాస్త్రికి ఆహారం అయ్యిందే కానీ మన అమ్మాయి జాతకం మారలేదా? ఓరి భగవంతుడా! మమ్మల్ని ఎందుకు అయ్యా ఇలా పరీక్షిస్తున్నావ్?” అంటూ బోరున ఏడ్చింది గాయత్రి .

“జ్యోతిష్యం నిజమా? మోసమా? ఏం చేయాలో తెలియడం లేదే!” అంటూ తల కొట్టుకుంటూ కూర్చున్నారు శ్రీనివాసరావు గారు. గాయత్రి కాస్త తేరుకొని “చూడండి! ఇప్పుడు వెళ్లి ఆ శాస్త్రిని నిలదీసి, నిందించే అంత సమయం లేదు మనకిప్పుడు. ముందు మనం వెళ్లి, అమ్మాయిని ఓదార్చి అప్పుడు చూద్దాం అతని పని” అంది. “సరే పద!” అంటూ కళ్ళు తుడుచుకుని కూతురు ఊరికి బయలుదేరారు ఇద్దరు.

కస్తూరి అత్త వారి ఇంటి గేటు తీసుకుని శ్రీనివాసరావు, గాయత్రి గుమ్మం బయట చెప్పులు విడుస్తూ ఉండగా.. లోపల నుండి కస్తూరి ఆడపడుచు గొంతు వినపడింది.

“చూడమ్మా నీ కోడలు కాలు మోపిన వేళ అలాంటిది. లేకపోతే అప్పటిదాకా నిక్షేపంగా ఉన్న తమ్ముడికి ఇలా అవడం ఏంటి?” అంది కోపంగా శిరీష.

“అలా అనకే సిరి! వాడికి క్యాన్సర్ చివరి దశలో ఉందంటే ఎప్పటినుండో ఆ మాయదారి రోగం ఉన్నట్టేగా! మనమే అది దాచి, మీ తమ్ముడికి పెళ్లి చేసాం అనుకుంటారు అమ్మాయి తరఫు వాళ్ళు. అయినా ఆ అమ్మాయి ఏం చేస్తుంది పాపం! చాలా మంచి పిల్ల” అంది బాధగా కస్తూరి అత్తగారు.

ఆ మాటలు విన్న శ్రీనివాసరావు గారు ‘పోనీలే అత్తగారికి నా కూతురు మీద మంచి అభిప్రాయమే ఉంది’ అనుకుంటూ లోపలికి వెళ్లి.. కస్తూరి అత్తగారిని ఓదార్చి, కూతురికి ధైర్యం చెప్పి, ఇంటి ముఖం పట్టారు.

***

ఓ వారం తర్వాత, కస్తూరి ఫోన్ చేసి “అమ్మా! మా ఆయన స్నేహితుడు అవినాష్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ అట. అతను జపాన్‌లో నేర్చుకున్న కొత్త టెక్నాలజీ సాయంతో ఏ స్టేజ్‌లో క్యాన్సర్‌ని అయినా నయం చేయగలమని చెప్పాడు. ఇప్పటిదాకా క్యాన్సర్ చివరి దశలో ఉన్న పదిమందికి ట్రీట్మెంట్ ఇచ్చి, నయం చేశాడని చెప్పాడు. కాకపోతే ట్రీట్మెంట్ సక్సెస్ అయితే అదృష్టం, లేదంటే ప్రాణాలు స్పాట్లోనే పోయే ప్రమాదం కూడా ఉందని చెప్పడంతో అందుకు మా అత్తగారు ఒప్పుకోవడం లేదు. ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కనీసం కొద్దిరోజులైనా ప్రాణాలతో ఉంటాడని ట్రీట్మెంట్‌కి ససేమిరా అంటున్నారు ఆవిడ” అంది కస్తూరి ఏడుస్తూ .

రెండు రోజుల తర్వాత, కస్తూరి భర్త కార్తీక్ ఇంట్లో అందరినీ ఒప్పించి ట్రీట్మెంట్‌కి సిద్ధమై ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. డాక్టర్ అధునాతన చికిత్స ఫలించి, కార్తీక్ మృత్యుంజయుడయ్యాడు. అందరి ముఖాల్లో పున్నమి వెలుగులు పరుచుకున్నాయి.

ఇది జరిగిన పది రోజులకి, కాశీ నుండి అనంతశర్మ గారి నుండి ఉత్తరం వచ్చింది. అనంతశర్మ గారి ప్రియ శిష్యుడు శ్రీనివాస రావు గారికి రాసిన ఉత్తరం అది.

“శ్రీనివాసరావు గారు! మమ్మల్ని మన్నించమని అడుగుతూ వ్రాయునది.. మా గురువుగారి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆరు నెలలుగా ఆసుపత్రులోనే ఉండి చికిత్స పొందుతున్నారు. వారం క్రితమే ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు. మొన్న కాస్త ఆరోగ్యం కుదిరిపడ్డాక, ఉత్తరాల కట్టలో ఉన్న మీ ఉత్తరాన్ని చూసి, సమయానికి జవాబు ఇవ్వలేనందుకు వారు చాలా బాధపడ్డారు.

మీ అమ్మాయి జాతకం చాలా దివ్యంగా ఉందట. చాలా అదృష్ట జాతకురాలట.

ఆమె అడుగిడిన చోట అసాధ్యం సుసాధ్యం అవుతుందని, మృత్యువును కూడా పారద్రోల గల సతీ సావిత్రి జాతకం అని చెప్పారు. కాకపోతే అంతటి అదృష్ట జాతకానికి కూడా ఒక గండం కారణంగా చాలా ఆందోళనకు గురి అవుతారని, భరించలేని దుఃఖాన్ని అనుభవిస్తారని.. కానీ భయపడవలసిన పనిలేదని.. నాకు తెలిసి ఇప్పటికే ఆమెకు వివాహమై ఉంటుందని చెప్పారు” ఉత్తరం చదువుతున్న శ్రీనివాసరావు గారి చేతులు సంతోషం పట్టలేక వణికాయి. కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు జలజలా రాలాయి.

‘జాతకంలో ఉన్న దాన్ని ఏం చేసినా తప్పించలేం. అందుకే సమయానికి ఆయన ఉత్తరం అందుకో లేకపోయాను. బాధపడితే పడ్డాను కానీ, గండం నుండి బయటపడేసాడా భగవంతుడు. శాస్త్రికి ఏ జన్మలో బాకీ పడ్డానో అనుకొని ఊరుకోనా? లేక అతడిని తిట్టి అతను చేసిన మోసాన్ని బయట పెట్టనా?’ అంటూ ఆలోచనలో పడ్డారు శ్రీనివాసరావు గారు.

***

మర్నాడు కర్పూర శాస్త్రి ఇంటికి వెళ్లి, ఒక జాతకం కాగితం శాస్త్రికి ఇచ్చి చూడమన్నారు శ్రీనివాసరావు.

“జాతకం దివ్యంగా ఉంది. కానీ ఈ జాతకుడికి ఒక గండం ఉంది” అన్నాడు శాస్త్రి విచారంగా మొహం పెట్టి.

“ఆ గండం ఏమిటో నేను చెప్తాను” అన్న శ్రీనివాసరావు గారి వైపు ఆశ్చర్యంగా చూశాడు శాస్త్రి.

“ఈ జాతకం కర్పూర శాస్త్రి అనే ఒక మోసగాడిది. పాపం అతనికి జైలు గండం ఉంది. అది గట్టెక్కాలంటే! అతను చేసిన తప్పు ఒప్పుకొని, పరిహారంగా ఐదు లక్షలు చెల్లించాలి” అని నవ్వారు శ్రీనివాసరావు.

శాస్త్రికి విషయం అర్థమైంది. ఇక చేసేది లేక ఐదు లక్షలు తీసుకొచ్చి శ్రీనివాసరావు గారికి ఇచ్చాడు.

ఇక ఆ ఊర్లో ఉంటే తనకు దిన దిన గండమే అని తెలుసుకున్న శాస్త్రి ఇంకో ఊరికి మకాం మార్చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here