ఇద్దరు ఘనులు

0
7

[box type=’note’ fontsize=’16’] జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ గోపీనాథ్ మహంతి ఒడియా భాషలో రాసిన కథని తెలుగులో అనువదించి పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి చాగంటి తులసి. [/box]

[dropcap]ఆ[/dropcap]యన ఈయన్ని ఘనుడు అనుకుంటే ఈయన ఆయన్ని ఘనుడు అనుకుంటాడు. జగూ పరిఢా, గుంఫస్వాములు. నీ అంతటివాడు లేడంటే నీ అంతటివాడు లేడని ఒకరినొకరు ఆకాశనికెత్తుకుంటూ పొగుడుకుంటూ ఉంటారు. ఇద్దరూ కులాసాగా సిగరెట్టు దమ్ము పీలుస్తూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఆఫీసునుండి గుంఫస్వామి ఇంటివేపు బయల్దేరారు.

ఒకరు కుజొంగొ షొండొ కువొకు చెందినవారు. ఆయన తన సంగతులు చెప్పుకుపోతున్నాడు. ఎలా మురీలు తింటూ రెండు కోసుల దూరం కాలినడకని బడికి వెళ్ళి తను ప్రాథమిక విద్యని పూర్తిచేశాడో, ఆ తర్వాత కుజొంగొలో మేనేజరు బాబు ఇంట్లో వంటపని చేస్తూ హైస్కూలు పూర్తి చేశాడో, కటక్‍లో ట్యూషన్లు చెప్పుకుంటూ ఇటు పట్టుదలా అటు పరిస్థితులతో యుద్ధం చేస్తూ మనిషి అయ్యాడో చెప్పాడు. దొరికింది తిని, చిరిగిన బట్టలు వేసుకుని పస్తులతో ఆకలితో బతుకుతూ మునుగుతూ తేలుతూ బతుకు పడవని నడుపుకు వస్తున్నాడో చెపుతూ వీటన్నిటి మధ్యా తమ్ముణ్ణి చదివించాననీ, ఇద్దరు అప్పచెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేశానని అన్నాడు. తండ్రి మంచాన పడినప్పుడు ఆయన వైద్యానికి దగ్గర దగ్గర ఏడువందలు ఖర్చు అయ్యాయి. అయినా ఆయన్ని కాపాడలేకపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు! ఇటు తన సంసారం – ముగ్గురు కూతుళ్ళు, ఓ కొడుకు, తనూ, పెళ్ళాం. కూడబెట్టినదేమీ లేదు. కొద్దిగా అప్పు ఉంది. దాన్ని తీర్చేస్తాడు. సొంత ఇల్లు లేకపోయినా అద్దె ఇల్లు ఉంది. ఫర్వాలేదు. పొలం పుట్రాలేదు. అయితేనేం? ఉద్యోగం ఉంది. దేవుడున్నాడు. వాడు అందర్నీ కాపాడతాడు. ఇంకెవరు కాపాడతారు? వాడ్నే నమ్ముకున్నాడు!

గుంఫస్వామికి పరిఢా మాటలు వీనుల విందుగా ఉన్నాయి. సన్నగా గిడసబారిన మనిషి ఈ పరిఢా. పొట్టి. తన చెవుల వరకూ వస్తాడు! కళ్ళకింద దవడ ఎముకలు పొడుచుకువచ్చినట్టు ఉబ్బెత్తుగా ఉంటాయి. గెడ్డం- తవ్వుకోలమొనలా సూదిగా, ముక్కూ సూదిగా గుచ్చుకునేటట్టు ఉంటుంది. ఆ కళ్ళూ, మొహం, ముక్కూ ఏ ఉద్దేశం కలిగి జేవురించుకుపోతాయి! కల్లా కపటం తెలీదు! దళసరి పెదాలు. మంచి మాట్లాడ్డానికే అలవాటు పడ్డట్టు! నిశ్చింతా ఆరోగ్యకరమైన మెరుపుతో – పొడుంరంగు ఒళ్ళు!

ఈయన ఎవరిలా ఉన్నాడబ్బా? భుజాలు ఎగరేస్తూ మాటల మధ్య!! పసిపిల్లాడిలా కళ్ళు నవ్వుతూ? ఎవరి పోలిక చెప్మా?? ఆఁ గుర్తుకువచ్చింది మరెవరు, అపూదొరైలా ఉన్నాడు. తన కాలేజీ రోజుల్లో అపూ తనకి దగ్గరి స్నేహితుడు. అపూదొరై అయ్యరు సింగపూర్ వెళ్ళిపోయాడు. తర్వాత మరి కలవనే లేదు. తన పెళ్ళి అయింది. అపూ తన పెళ్ళాన్ని చూడనేలేదు! ఆ రోజుల్లో తాము పెళ్ళాడబోయే భార్యల గురించి ఊహించుకుంటూ వెటకారాలాడుకునే వాళ్ళు. అపూ ఇదిగో నీకు రాబోయే భార్య ఇలా ఉంటుందని బొమ్మగీసి చూపెట్టేడు. ఆశ్చర్యం!! తను చేసుకున్న అమ్మాయి ముమ్మూర్తులా అలాగే ఉంది! వాడెలా ఊహించగలిగాడో!! అపూదొరైకి తన భార్యని చూపెట్టాలని ఎంతగా అనుకున్నాడో, ‘చూడరా! నీ వదిన్ని. నువ్వు ఊహించినట్టే ఉంది. కాళ్ళకి దణ్ణం పెట్టూ!’ అనాలని ఎన్నిసార్లు అనుకున్నాడో! కాని అది జరగలేదు. అపూ తనకున్న నాలుగేళ్ళు చిన్నవాడు!

ఈ సంగతులు అన్నీ పరిఢాకి చెప్పేడు. తను వయసు పైబడ్డాక చదువుకున్నాడు. వాడు ఎక్కడో త్రిచూర్ జిల్లావాడు!! తనకి ఏడేళ్ళు బాయి తండ్రి చనిపోయారు. తల్లి తన ఆసరాతో ఓ కొట్టుపెట్టింది. తనకన్నా ఐదేళ్ళ చిన్నవాడు తమ్ముడు. వాడి తర్వాత చెల్లి మూడేళ్ళది. కడసారపు పసిపిల్ల తొమ్మిది నెలలది!

చీకటి ఉంటూ ఉండగానే లేచి అమ్మకి ఇడ్లీ దోసె చెయ్యడానికి సాయపడాల్సి వచ్చేది. రోజంతా పనే! విస్తరాకులు కుట్టడమే కాదు, వంటా వార్పూ కూడా నేర్చుకున్నాడు. పాటలు పాడ్డం నేర్చుకున్నాడు. ఓ గుడ్డి ముసలివాడు రోజంతా ముష్టెత్తుకుని రాత్రిపూట వాళ్ళ వరండాలో పడుకునేవాడు. వాడికి త్యాగరాజు స్వామివారి కీర్తనలు ఎన్నోవచ్చు. రాగాలూ వరసలు తెలిసీ పాడేవాడు. గాత్రం మాత్రం బాగుండేది కాదు. పాపం ఎప్పుడూ దగ్గుతూ కఫంతో బాధపడుతూ ఉండేవాడు. తనది తియ్యటి గొంతు. తను పాడుతూ ఉంటే అందరూ మెచ్చుకునేవారు. సాయంత్రాల వేళ గొంతెత్తి హాయిగా పాడుతూ ఉంటే ఫలహారాలు తినే జనం ముమ్మరంగా వచ్చేవారు. ఆ వచ్చే వాళ్లలో ఒకాయన తనకు చదువు చెప్పించాడు. మళయాళీ. పేరు భద్రప్ప? ఆయన ప్రయత్నం సాయం వల్ల ఆయన అక్కడున్న నాలుగేళ్ళలో నాలుగు క్లాసులు పాసయ్యి స్కాలర్‍షిప్పులు తెచ్చుకుని మరో నాలుగు క్లాసులు పైకి వెళ్ళేను! మాస్టర్ని అయ్యాను. ఇటు కాఫీ హోటలు పని, అటు ఇంటిపనీ రాత్రి పదకొండు గంటలనుంచి రెండుగంటలవరకూ కాలేజీ పాఠాలు చదివేవాణ్ణి.

పరిస్థితులతో పోరాటం! చలికాలం వొస్తే స్వెట్టరు లేదు. రాత్రివేళ చలికి ఒళ్ళు కొంకర్లు పోయేది. నిద్రకి రెప్పలు బరువెక్కి వాలిపోతూ ఉండేవి. పచార్లు చేస్తూ ఒంటిని చేతుల్తో రుద్దుకుంటూ, చలికి తట్టుకోలేనప్పుడు ఒళ్ళు వేడెక్కడానికి గుంజీలు తీస్తూ చదువు సాగించేవాణ్ణి. పాలు కాచుకునే కుంపటి ఒకటే ఉండేది. అది పడుకున్న ముగ్గురు చిన్నవాళ్ళ దగ్గర ఉండేది. ఎండలు సరేసరి – వడగాలి వీచేది. ఒళ్ళు వంచి కష్టపడవలసి వచ్చేది. పస్తులూ ఉపవాసాలు అలవాటైపోయాయి. బియ్యే పాసయ్యాను. ఓ ఉద్యోగమూ దొరికింది!

ఏదో బతుకు నడుస్తోంది! లోటులేని బ్రతుకు మాత్రం అవలేదు. అమ్మ కాలం చేశాక హోటలు మూత పడింది. అయినా తమ్ముణ్ణి చదివించేడు. వాడూ వాడి కాళ్ళమీద నిలుచున్నాడు. ఓ చెల్లెలి పెళ్ళి చేసేడు. ఇప్పుడు తనూ తన భార్యా, ఆఖరి చెల్లెలు, తన పిల్లలు ఐదుగురు? కూడబెట్టుకున్నది ఏ లొడ్డూ లొసుగూ లేదు. పొలం పుట్రా లేదు. ఉండీ లేకా రోజులు గడిచిపోతున్నాయి. ఆఁ అయితే అప్పులు లేవులెండి!

జగూ పరిఢా ఆయన వేపు ప్రేమగా చూసేడు. చెయ్యెత్తు మనిషి. కర్ర శరీరం, కర్రలాంటి కాళ్ళు చేతులు! కండ కలిగిన మొహం, తలమీద జుట్టును రెండు సగాలుగా ఇటూ అటూ దువ్వుకుంటాడు. వంకీల జుట్టు రెండువేపుల రింగు రింగులుగా చుట్టుకుని ఉంటుంది. నుదుటిమీద కుంకం బొట్టు. నవ్వుతున్న పెదాలు, సగం మూసుకున్న కనురెప్పలు మధ్య మధ్య పూర్తిగా తెరుచుకున్నట్టు తోస్తాయి. అప్పుడు ధనుస్సులాంటి కనుబొమల కింద చూపు ప్రశాంతంగా ఉన్న మొహం నిండా వికసించి కనపడుతుంది. ఆ చూపునిండా ఔదార్యమే! తనని ఆ చూపే ఆకర్షించింది. శాంతంగా ఎంతో సహనం ఉట్టిపడుతున్న చూపు. ఆయనకి తన భోగట్టాలన్నీ ఏ దాపరికం లేకుండా చెప్పేసుకుంటే తన మనసు తేలికపడుతుంది అనిపిస్తుంది. అంతా వింటూ ఆయన కుడివేపు ఎడంవేపూ తల ఆడిస్తారే అప్పుడు ఆయన నవ్వులో అమాయకమైన స్నేహం జిగేలుమంటుంది!

ఇద్దరూ వేరు వేరు ప్రాంతాలవారు. పరిచయం అయి పక్షం రోజులే అయింది. భువనేశ్వర్‍కి ఆఫీసు మార్చేరు. గుంఫస్వామి బదిలీమీద ఇక్కడికి వచ్చేడు. జగూ పరిఢా కేంద్ర కార్యాలయంలోనే ఉన్నాడు. కార్యాలయంతో పాటు ఆయనా ఇక్కడికి వచ్చేడు! ఏడువందలమంది ఉద్యోగులు – ఏ గ్రామాల నుంచో, ఏ పట్టణాల నుంచో వచ్చిన జనం! ఓ దగ్గర పనిచేస్తున్నారు. సాయంత్రం అయిదు అయేసరికి అంతా బయటపడతారు. తమ తమ తోవని! ఎన్నో దిక్కులవేపు! సైకిళ్ళు! కబుర్లాడుతూ వెళ్ళే చిన్న చిన్న సమూహాలు! ఆడవాళ్ళు ఓ సమూహంగా!!

ఈ చిన్నలోకంలో జగూ పరిఢా, గేదెల గుంఫస్వామి ఒకరినొకరు ఎంచుకున్నారు. పొడుగ్గా ఉన్న గదిలో ఆ కొసని ఒకరు ఈ కొసని ఒకరు కూచుని పనిచేస్తారు. వాళ్ల మధ్య టేబిళ్ళు, కుర్చీలు, బీరువాల వరసలు! ఫైళ్ళ దొంతరలు! రెండువేపులా పావురాళ్ల గూళ్ళలా చిన్న చిన్న గదులు! బీరువాల వలయంలో ఇంకెన్నెన్నో! మధ్య ఎన్నెన్నో మొహాలు! ఎన్నెన్నో బతుకు కథలు! అయినా ఈవేపు నుండి ఈయన వస్తాడు. ఆవేపు నుండి ఆయన వస్తాడు. ఆలోచించుకుని, అర్థం చేసుకుని, మంచీచెడ్డా తెలుసుకుని ఆ పొడుగుగది మూలలనుండీ, మధ్యలనుండీ ఎంచుకుని ఒకరినొకరు వెతుక్కుని కార్యాలయం నుండి బయటపడ్డారు!

ఎలా మొదలయిందీ అంటే చెప్పడానికి పెద్దగా ఏం లేదు! పడమటి గుమ్మంవేపు మూత్రవిసర్జన గది ఉంది. ఐదు చిన్నగోడల చాటుతో అయిదు జాగాల ఏర్పాటు ఉన్నప్పటికీ అన్నిటినీ కలిపి మూసే తలుపుని మూత్రవిసర్జనకి వెళ్ళేవాడు మూసేస్తాడు!

తొందర తొందరపడుతూ జగూ పరిఢా ఆవేపు వెళ్తున్నాడు. ఇంతలో సిమ్మెంటు వరండాలో టకటక బూట్ల చప్పుడుతో ఎవరో తనకన్నా ముందు లోపలికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఆ ముందు మనిషి తనని చూసి, వెనక్కి తగ్గి నిలబడిపోయాడు. జగూ అతని మొహాన్ని తిన్నగా చూడనన్నాలేదు. లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు. తను బయటికి వచ్చేవరకూ ఆ మనిషి అలాగే ఎదురుచూస్తూ నిలుచుని ఉన్నాడు. తను ఆయన వేపు చూడగానే చిరునవ్వుతో చూసి తలుపు తోసుకు లోపలికి వెళ్ళేడు!!

అది మామూలు సంఘటన. అయినా ఎంతో చెప్పలేనంత మానవత్వాన్ని ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. జగూ పరిఢా తన సీటుకి వెళ్ళకుండా అక్కడే ఆయన కోసం ఎదురుచూస్తూ నిలుచున్నాడు. ఫినాయిలు, నాఫ్తలీను ఉండల వాసన ముక్కు ఎగరగొడ్తుంది. అది నిల్చునే స్థలం కాదు!

జగూ పరిఢా పచార్లు చేస్తూ అటువేపు తెరిచి ఉంచిన కార్యాలయం గుమ్మంలోంచి కనబడే ఆకాశాన్ని, మేడల్ని, ఇళ్ళని, చెట్లని అన్నిటీని చూస్తూ ఉన్నా ఆయన దృష్టి వాటన్నిటినీ దాటుకుని తన ఊరుని – చిన్న కొండవాలుని దిగిపోతూ దిగిపోతూ దూరంగా ఉన్నదానిని చూస్తోంది! ఆ ఊళ్ళో గుబురుగా పెరిగిన చెట్ల వరసలు కనిపించాయి. మెట్ట మీద నాలుగు పక్కలా చెట్లు ఆకులు తింటున్న మేకలు, తెల్లగా విద్యుత్ స్తంభాలు, ఎగురుతున్న పిట్టలు, వీటన్నితో పాటు ఆ అపరిచితుడి మొహమూనూ!! ఆయన తనకేమీ అవడు! తనకీ ఆయనకీ ఏ సంబంధమూ లేదు. మూత్ర విసర్జన గదిలోకి తను ముందు దూరిపోకుండా అతనినే వెళ్ళనియ్యవలసింది! అదే అలాచేస్తే బాగుండి ఉండేది అని ఆయనకి అనిపించింది!

ఆయన తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు. తెల్లగా మెరిసే పళ్ళతో నవ్వుతూ చూశాడు.

మాటలు కలిశాయి. మాటలు తక్కువ! అనుభూతి ఎక్కువ. మాటలాడే మాధ్యమం ఒడియా కాదు. తెలుగు కాదు! ఇంగ్లీషు! ఉచ్చారణ వింటే చాలు జగూ ఒడియా పలుకుతున్నాడని ఎవరన్నా చెప్పేస్తారు! గుంఫస్వామి మాటలు తెలుగులా వినిపిస్తున్నాయనీను! దొరల్లా మాట్లాడాలని వాళ్ళు అనుకోలేదు. అందుకు ప్రయత్నించలేదు. ఒకరిమాటలు ఒకరికి అర్థం అవుతున్నాయి. ఇంకేం కావాలి?

గేటు బయటికి వచ్చారు. కొంచెం దూరంలో ఆఫీసుగేటుకి దగ్గరగా తోవ పక్క కిళ్ళీకొట్టు ఉంది. గుంఫస్వామి సిగరెట్లు కొన్నాడు. జగూకి ఇచ్చాడు. జగూ కిళ్ళీ కొని స్వామికి ఇచ్చాడు. ఒక కొత్త సంబంధానికి నాంది వాచకం అయింది!!

ఆ తర్వాత రోజూ కలవడం – కష్టసుఖాలు చెప్పుకోవడం, తొందరలోనే దగ్గరితనం గట్టిపడింది. బతుకుపోరాటంలోని ఇబ్బందుల్ని ఒకరి దగ్గర ఒకరు ఏకరువు పెట్టుకుంటూ మనసుని తేలికపరచుకోవడం మొదలుపెట్టారు. ఒకరిమీద ఒకరు ఆధారపడ్డారా అన్నంతగా దగ్గరతనం పెరిగింది. ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవాళ్ళని ఇద్దరికీ అర్థం అయింది.

అదే – ఒళ్ళు గుల్ల చేసుకునేంత శ్రమపడే వర్గం. అతికష్టం మీద బతుకుబండిని లాక్కునే వర్గం. పడవ ఈ క్షణంలో మునిగిపోతుంది – ఈ క్షణంలో మునిగిపోతుందన్నట్టు ఉంటుంది. అయినా మునగదు! పెనవేసుకున్న డబ్బు దస్కం ఏదీ ఉండదు! పొలంపుట్రా ఆస్తీగస్తీ ఉండవు. మాదీ అని చెప్పుకోడానికి ఓ కొంప ఉండదు. ఎప్పుడూ ఏదో ఓ దానికి లోటే! లేనితనం నడుం వంచేస్తుంది. ఆకలి కాల్చుకుతింటుంది. చాకిరీకి ఒళ్ళు హూనం అవుతుంది. రోగాలు వచ్చి ఏదోలా ఈడుస్తున్న సంసారాన్ని వీధిని పడేస్తాయి! ఒక్కోసారి అప్పుకోసం వెర్రెత్తి ఏ దిక్కూ తోచక తిరగాల్సి వస్తుంది! అయినా ఇల్లు గడుస్తూ ఉంటుంది. పొయ్యి మీదకి గిన్నె ఎక్కుతుంది. పిల్లల్ని మనుషుల్ని చేయవలసి వస్తుంది. పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ, పండగలూ పబ్బాలూ వచ్చాయి! మధ్య మధ్య అప్పటప్పట అంతా ఠక్కని ఆగిపోయినట్టుగా తోస్తుంది. కాని ఏదో ఆగిపోదు!! ఈ అన్నిటిమధ్యా సామాజిక మర్యాదలు! పెద్దమనిషి వేషం వేయాల్సి ఉంటుంది. ఆశనీ, నమ్మకాన్నీ, మానవత్వాన్ని కలల్ని నిలుపుకోవలసి ఉంటుంది.

ఆయన గురించి ఈయనా, ఈయన గురించి ఆయనా తమ తమ ఇళ్ళళ్ళోనూ చెప్పుకుంటూ ఎవరు ఏ సంగతి ఏమన్నారో వివరించుకుంటూ పూర్తిగా ఏకం అవుతున్నారు!

ఓ రోజు ఐదున్నర గంటలకి ఆఫీసునుంచి ఇళ్ళకి బయల్దేరినప్పుడు గుంఫస్వామి జగూ చెయ్యిపట్టుకుని “ఇవాళ మా ఇంటికి రావాలి. చాలారోజులబట్టి వస్తా వస్తానంటున్నారు. ఒకసారైనా రాలేదు. ఇవాళ వదిలేది లేదు” అన్నాడు. జగూ నవ్వుతూ సరే అన్నాడు.

అన్ని ఇళ్ళు ఒకలాగే ఉన్నాయి. చిన్న చిన్న ఇళ్ళు! ప్రతి ఇంటిముందూ చిన్నతోట. ఇనపతీగెల కంచె. కర్రగేటు. ఆ తోటలతో ఆ ఇళ్ళ విశిష్టత కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఎన్నెన్నో రంగురంగుల పువ్వుల చెట్లు. కొన్నిచోట్ల ఆకుకూరల మడులు, మరికొన్ని చోట్ల అవీ ఇవీ అన్నీను!

గుంఫస్వామి ఇంటి తోటలో ఎడంవేపు వరసవరసల అరటి బోదెలు, కొన్నిటికి అరటిగెలలు నిండుగా! కుడివేపు రెండువరసల బొప్పాయిలు – నిండా పళ్లతో రెండు చెట్లు – కొంతమేర టమాటాలు – కొంతమేర వంగమొక్కలు – చిన్న చిన్న పందిళ్ళు ఆనప గుమ్మడిపాదులు – చిన్న చిన్న మడులు – పచ్చగా తలలూపుతూ ఆకుకూరలు – గుమ్మానికెదురుగా గుండ్రటి జాగా. దానినిండా చేమంతులు! సంధ్యాసమయంలోనూ వెన్నెల విరిసినట్టు! ఇదీ ఈ తోట విశిష్టత! లేపోతే అందరింటి తోటల్లోనూ అరటి, బొప్పాయి, ఆనప, గుమ్మడి ఉంటూనే ఉంటాయి!

పన్నెండేళ్ల పిల్లాడు గునపంతో తవ్వుతున్నాడు. రెండు మూడేళ్ల వయసు తేడాలు ఉన్న చిన్నపిల్లలు బాల్టీలతో రెండువేపులా ఉన్న మొక్కలకి నీళ్ళు పోస్తున్నారు. ముగ్గురూ ఒక్కలా ఉన్నారు. ఒఠి ఒళ్ళు! నిక్కర్లతో!!

“ఇదే మా ఇల్లు! రండి” అంటూ గుంఫస్వామి కర్రగేటు తీశాడు. ముగ్గురు అబ్బాయిలు నిల్చుని నవ్వేరు. “పెదనాన్నగారు! దణ్ణం పెట్టండి” అన్నాడు గుంఫస్వామి. ముగ్గురూ దగ్గరకొచ్చి నమస్కరించారు. జగూ పరిఢా ఎవరు ఏ క్లాసు చదువుతున్నారు? వంకాయలు బాగా కాస్తున్నాయా? మొక్కలకి పొయ్యడానికి కుళాయిలో నీళ్లు బాగా వస్తాయా? అంటూ ప్రశ్నలు వేశారు.

“అమి ఏదీ?” గుంఫస్వామి అడిగాడు. అమి వాళ్ల చెల్లెలు. అమి పక్కింటికి వెళ్ళింది. అతిథి మర్యాద ఆలస్యం అయినట్టు తొందరపడుతూ గుంఫస్వామి జగూని ఎంతో ఆదరంతో లోపలికి తీసుకెళ్ళాడు. భార్యని పిలిచాడు. జగూ స్వామి భార్యకి ప్రణామం చేశాక మాటల్లో పడ్డారు.

ఆ ఇంటికి తను మొదటిసారి వచ్చినట్టు జగూకి అనిపించలేదు. ఏనాటినుంచో వస్తున్నట్టు, ఆ ఇల్లూ, మనుషులూ, మాటలూ, వ్యవహారం అంతా ఎంతో ఆత్మీయంగా తోచింది. ఆడంబరం ఏదీ లేదు. తను తమవాడే అన్నట్టుగా సహజమైన రీతిలో తమతోపాటు కలిపేసుకున్నారు. ఆయనపట్ల వాళ్లు చూపెట్టే ప్రేమాభిమానాలు వాళ్ళ మొహాల్లో కొట్టొచ్చినట్టు కాంతివంతంగా కనబడుతున్నాయి!!

జగూకి గుంఫస్వామి భార్య తనకు ఎప్పట్నించో తెలుసునన్నట్టుగా అనిపించింది. కాస్త కోలమొహం, చురుకైనది. కష్టసుఖాలతో రాటుదేలిన అనుభవం ఆ మొహంలో గోచరిస్తుంది. ఐదుగురు పిల్లలు! పెంపకం! సమస్యల మధ్య తనను తాను లీనం చేసుకుని కుటుంబం కోసం పంచ ప్రాణాలు పెట్టి పడే కష్టం! ఆవిడ వ్యక్తిత్వం మీద నానారకాల కష్టసుఖాలు అచ్చుగుద్దినట్టు ఉన్నాయి!

సన్నటి నడుం కట్టులో పమిటకొంగు దోపుకుని చీపురుతో ఇల్లూ వాకిలి నడుం విరిగేటట్టు చెత్తా చెదారం ఎత్తిపోస్తూ ఉండి ఉంటుంది! గిన్నెలు తోముతూ, బట్టలు ఉతుకుతూ, వండివార్చి వడ్డిస్తూ ఉండి ఉంటుంది! మధ్య మధ్య పిల్లల్లో ఒకరికి నీళ్ళ విరేచనాలు, ఇంకొకరికి ఊష్ణం, దగ్గులూ జలుబులూ! కంటిమీద కునుకన్నది లేకుండా రాత్రిపగలూ పిల్లలని కనిపెట్టుకుని ఉండి ఉంటుంది. యంత్రంలా పనిలో మునిగిపోయి ఉండి ఉంటుంది. పని…. పని…. ఒకటే వరస పని! ఇది చెయ్యను, అది చెయ్యను అని గాని, అది కావాలి ఇది కావాలి అని గాని ఏనాడూ కోరడం, అభ్యంతరాలు చెప్పడం అనేమాటే లేదు. అన్నిటినీ భరించడమే తప్ప!! తాను జబ్బు పడ్డా ముక్కుతూ మూలుగుతూ వండివార్చి పిల్లల్ని మొగుణ్ణి చూసుకుని ఉండి ఉంటుంది. అలివి కానప్పుడు దుఃఖంతో నిట్టూర్పులు విడిచి ఉండి ఉంటుంది. దేవుడా! దేవుడా! అని తను నమ్మిన భగవంతుడికి మొరపెట్టుకుని ఉండి ఉంటుంది. ఇక నా వల్ల కాదు, ఇక భరించలేను తండ్రీ అని కంట తడి పెట్టుకుని మనోభారాన్ని తగ్గించుకుని ఉండి ఉంటుంది. కొన్ని సమయాల్లో నవ్వీ ఉంటుంది! ఆ మనసు ఉత్సాహంతో సంతోషంతో ఉరకలు వేసీ ఉంటుంది. ఆశగా ఆనందంతో ఎదురుచూసీ ఉంటుంది.

తెల్లగా సన్నగా ఎత్తైన మనిషి! పెద్ద పెద్ద పాదాలు, చప్పిడి ముక్కు, శరీరాకృతితో పోల్చి చూస్తే చేతులు బలిష్టంగా కనబడుతున్నాయి. సాపుగా ఉన్న అరచేతులు – లావుగా దృఢంగా చేతి వేళ్ల కణుపులు – కాస్త పెద్ద మొహం, మొద్దు బండ పెదిమలు, వాలిన కళ్ళల్లో గాంభీర్యం, దట్టంగా నల్లటి కనుబొమలు. ప్రకటన బొమ్మల్లో కనిపించే స్త్రీ మూర్తి అందం కాదది!! ఏ వంకరా లేని తీరైన శరీర సౌష్టవం కాదది! దానిదే అయిన అందం, చక్కదనం దానికి ఉంది! చూడగానే కళ్ళకి చల్లదనాన్ని శాంతిని ఇచ్చే చక్కదనం! సాంత్వన ఇచ్చి మనసును కుదుట పరిచే అందం! ఆశానిరాశల్లో మునిగితేలి రాటుతేలిన అనుభూతులతో నిండిన బతుకు అందం! ఆ అందంలో గెలుపు ఓటముల కథ ఉంది! ఆ చక్కదనం ఆ అందం పరిఢా కంటికి ఆనింది. ప్రణామం చేసిన తర్వాత కూడా ఆయన తన చూపులతో ఆవిడకు నమస్కరిస్తూనే ఉన్నాడు. ఆయన చూపులు మిమ్మల్ని నేనెరుగుదును. నూర్రూపాయల నెల జీతంతో రెండొందల అవసరాలని ఏ రసాయనంతో తీర్చగలగవచ్చో, లోకం అంతా ఏకమై అన్నివేపుల నుండీ పీక్కుతింటూ కుటుంబాన్ని కూల్చబోతూ ఉంటే ఏ బలంతో అడ్డుకుని నిలబెట్టి వృద్ధిపరచడం ఎలాగో తెలిసిన స్త్రీకి ప్రతీక మీరు!! సజీవరూపం మీరు!!

ఆవిడ వచ్చీరాని ఇంగ్లీషులో మాటాడింది. దక్షిణాది యాసతో! జగూ ఒడియా ఉచ్చారణతో మాటాడాడు ఇంగ్లీషులో!

దక్షిణాది పద్ధతిలో పొడుగైన నీలంరంగు చీరలో ముసుగు వేసుకుని, దక్షిణాది పద్ధతిని వేసుకున్న సిగలో తురుముకున్న చేమంతి పూలతో, ముక్కూ చెవులకు, మెళ్ళోనూ కొద్దిపాటి దక్షిణాది నగలతో ఉన్న ఆవిడ వేషభాషలకి తమవేపు స్త్రీ వేషభాషలకి ఉన్న తేడాలు జగూ మనసుకి పట్టలేదు! ఆయనకి నచ్చినది ఆత్మీయత! తన సమాజం, తనకి తెలిసిన సమాజం, తను చూసిన సమాజం – తల్లి, పింతల్లి, అక్కలు, చెల్లెళ్ళు, ఒదినలు – తన భార్య అందరూ ఇలాగే ఉన్నారు. ఇదే వర్గం వారు. ఒకటే రూపం. ఒకటే బాధ్యత – కర్తవ్య నిర్వహణలో మునిగి తేలుతున్న స్త్రీ మూర్తులు!

ఆవిడ కాసేపు మాటాడి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇద్దరు మిత్రులు లోకాభిరామాయణంలో పడ్డారు. ఒకరినొకరు ఇష్టపడే వాళ్ళిద్దరూ తమలోని కొత్త కొత్త కోణాల్ని చూడ్డంలో మునిగిపోయారు. పాతమాటలు కావు. అవి ఎప్పుడూ మాటాడూకున్నవే. తెలిసినవే! ఉద్యోగ విషయాల మీద ఆసక్తి లేదిప్పుడు! మనుషులు – సంఘం – తీరుతెన్నులు – సంప్రదాయానుగుణమైన ఆలోచనలు, త్రిచూరు నుంచి కుజొంగొ వరకూ కబుర్లే కబుర్లు! రాజకీయాలు – స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం సిద్ధించాక పరిస్థితులు ఎలా ఉన్నాయో.

వాళ్ళిద్దరికీ ఇద్దరి అనుభవాలు చాలా విషయాల్లో ఒకేమాదిరిగా ఉన్నాయనీ, అభిప్రాయాలు ఒక్కలాగే ఉన్నాయని తెలిసింది. అభిప్రాయ భేదాలున్న సంగతులు సంభాషణా ఇద్దరికీ ఆనందాన్నే కలిగించింది. కాఫీ టిఫిన్లు – ఇడ్లీ, దోసె, చట్నీ సాంబారు అప్పడాలు – గుంఫస్వామి భార్య వాళ్ళ మాటలతో తనూ మాట కలిపి కాస్సేపు వాళ్ళతో ఉండి మళ్ళీ తన పనుల్లో తాను పడ్డది. చీకటిపడి దీపాలు వెలిగాయి. పిల్లలూ టిఫిన్లు తిని చదువుకోడానికి తమ గదిలోకి వెళ్ళేరు. మిత్రుల మాటలు సాగుతూనే ఉన్నాయి!

ఇద్దరికిద్దరూ సామాన్య మనుషులు. వార్తాపత్రికల్లో పేరన్నా అచ్చవని వాళ్ళు. వాళ్ల పేర్లు ఎవరినోటా వినపడమన్నా వినపడవు. వాళ్ళ అభిప్రాయాలు అధికారం చలాయించే ఏ ఆఫీసరు చెవికీ చేరవు. ఒకవేళ చేరినా వాటికి పిసరంతైనా విలువ ఉండదు. జాతీయభాష గురించీ, మన దేశపు విదేశీ విధానం గురించి, ఆర్థిక విధానాలు, పంచవర్ష ప్రణాళికల గురించీ, పాలనా విధానాలూ, శరణార్థుల సమస్యలు – ఒకటనేమిటి అన్నిటి గురించీ ఎంతో స్పష్టంగా విమర్శా ప్రతివిమర్శా చేస్తూ సంభాషించారు. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్సు – ఏదీ మిగల్లేదు! టిఫిన్లయేక సిగరెట్లు ముట్టించారు!

ఏ ముసుగులూ, ఏ దాపరికాలూ లేకుండా మనసు విప్పి ధారాళంగా మాట్లాడుకుంటున్నారు. ఆ బాతాఖానిలో ఆఫీసులో లాగ నోటికి ఏ తాళం వేసిలేదు! ఎవడన్నా వింటాడని గాని, వాడు ఇంకెవరితోనన్నా అంటాడని గాని వ్యతిరేకంగా రాస్తాడని గాని ఏ భయమూ, సంకోచం లేవు! ఇల్లు ఇది! స్వేచ్ఛ! ఇచ్ఛానుసారం అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. గట్టిగా అసమ్మతిని ప్రకటించనూ వచ్చు! ఒకరి మాటలు ఇంకొకరిని ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ ఉంటే ఆ మాటలకు ఇంక అడ్డూ ఆపూ లేకుండా పోయింది. ఆ మాటల ధాటీలో ఏమయిందో ఏమిటయిందో తెలీదు. ఇద్దరి మొహాలు జేవురించుకుపోయాయి. హావభావాలు మారిపోయాయి. ఒకరిగొంతు మరొకరి గొంతుకన్నా పెద్దదయింది. వాళ్ళ గొంతులు పెద్దవై గట్టిగా వినిపించేసరికి పిల్లలు చదువుకోవడం మానేసి గుమ్మం ముందు కొచ్చి నిలబడ్డారు. వంటింట్లో పొయ్యి దగ్గర కూచున్న గుంఫస్వామి భార్యా వాళ్ల అరుపుల గొంతులు విని, చేస్తున్న పని ఆపేసి, ఏమయిందా అనుకుంటూ ఇటువేపు చెవిపెట్టింది. వాళ్ళున్న గదిలోకి వెళ్ళాలా వద్దా అన్న సంశయంలో పడ్డాది. ఆవిడ మొహంలోని ప్రసన్నత మాయమైపోయింది. మొహంనిండా ఆదుర్దానే! ఏమయిందీ? ఏమై ఉంటుందబ్బా? ఆవిడకి ఆరాటం పెరిగింది.

మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ వైరి పక్షాల సైనికుల్లా మారిపోయారు. పూరీ – కోణార్క్ – భువనేశ్వర్ – సింహాచలం – తిరుపతి దేవాలయాల్లోకి చరిత్రలోకి దిగేరు. పక్క పక్క రాష్ట్రాలు ఒడిశా ఆంధ్రాలు గతించిన కాలంలో ఎన్నెన్నో వివాదస్పద చారిత్రక కథాంశాలు! వాటిని పట్టుకున్నారు!!

జగూ పరిఢా పెద్ద గొంతుకతో చెప్తున్నాడు – “మా దేశమే వీరుల దేశం! ఒడిశా రైతు సైనికులు భారతదేశం మొత్తానికే పేరెన్నిక గన్న వాళ్ళు! ఖండా (కత్తి) శబ్దం నుండే ఖండాయిత్ అన్న మాట పుట్టింది. మా చిత్రమైనది మా గండాయుత్ జాతి!”

“మా ఆంధ్రాలోనో? ప్రఖ్యాత వీరులు మావాళ్లు తెలగా, నాయుడు, రాజులు! వాళ్ళ నెత్తురుతో ఎప్పటికీ చెరగని చరిత్రని లిఖించారు!”

“అసలు ఒడిశాలోనే కృష్ణా కావేరీ నదుల మధ్య భాగం ఉండేది. ఒడియా వాళ్లు ఇళ్ళూ వాకిళ్ళు కట్టుకుని ఉన్నారు. ఆ ప్రాంతం అంతటినీ పాలించిన వాళ్ళు మా వాళ్ళే!”

“కానే కాదు!” గుంఫస్వామి తల అడ్డంగా తిప్పుతూ గట్టిగా అరిచాడు. “ఒడిశానా? మాకు తెలీదా? ఏ చిలికా వరకే ఉండేది! తర్వాత అదీ లేదు – అక్కణ్ణించీ ఒడ్డివారు అవతలకే వెళ్ళిపోయారు! ఋషికుల్య ఉత్తర భాగం మాత్రమే ఒడిశా! దక్షిణాన ఉన్నది అంతా ఆంధ్రానే!”

“ఏఁవిటేఁవిటీ? చరిత్రని నమ్మరా ఏం? మా పురుషోత్తమ చనిపోయింది ఎక్కడటా? చెప్పండి! కృష్ణానది ఒడ్డున! ప్రతాపరుద్రుడి కాలంలో రాయ్‍రామానంద్ రాజధాని రాజమహేంద్రవరం!”

“అది తాత్కాలిక యుద్ధ విజయం! ఒక్కోజాతి దైవానుకూలం లేక ఒక్కో సమయంలో బలహీనపడుతుంది. కొద్దిరోజులు ఓ జాతి ఆ దేశం మీద అధికారం చలాయిస్తుంది. అంతమాత్రాన అక్కడి జనం ఆ మట్టిని, పుట్టిన తమ భాషని వదులుకోరు!” అన్నాడు గుంఫస్వామి!

“ఏం కాదు – ఎక్కడ చూడండి. అన్నీ ఒడియా పేర్లే! కళింగ నగరం, కళింగ పట్టణం – విశాఖపట్టణం, విజయ – బాహుడా – ఇంగ్లీషువాళ్ళు వచ్చేక ఆ పేర్లన్నిటినీ తెలుగుగా చేసేశారు! జెమ్‍షెడ్‍పూర్‍ని జమిడిపేటా, కంకడా కొండని ఎండుకగా, గడగుడాని గెడ్డగా!! కోటల్లో దేవాలయాల్లో లెక్కలేనన్ని శిలాశాసనాలు ఉన్నాయి! దానపత్రాలు! ఒడియాలో రాసినవి ఉన్నాయి! చరిత్ర రాయడం అన్నది తర్వాత కదా జరిగింది! నోటిమాటతో అవన్ని అబద్దాలని ఎవడు అనగలడండీ? ఒడియాజాతి నోరు నొక్కేసారండీ బాబూ! మేదినీపూర్ పోయింది. సింహభూమి పోయింది! రాయపుర్, ఫల్‍ఝర్, బస్తర్, ఎంతెంత పోయింది? ఇచ్ఛాపురం, జలంత్ర, బూఢారసింహ, మంజూష, టెక్కలి, గంగరాజ్, మాడగోలు – దక్షిణ ప్రాంతంలోని మొత్తం మా దేశం అంతా పోయింది. నిన్నా మొన్నటి సంగతి – సఢేయీకేలా, గరసుకా కూడా తీసేసుకున్నారు!” జగూ పరిఢా గొంతులో అత్మాభిమానం దెబ్బతిన్న ఆవేదన!

“ఇంకెక్కడన్నా పోతే పోయిందేమోగాని దక్షిణాన మాత్రం ఒడిశాలోది ఏ మాత్రం ఏదీ పోలేదు! నిజం చెప్పాలంటే ఆంధ్రాదే మొత్తం అంతా పోయింది! పర్లాఖిమిడి సంగతే చూడండి. ఏ ఆధారంతో ఏ తర్కంతో ఒడిశాలో కలిపేశారట! కోరాపుట్ జిల్లా, రాయగడా, గుణుపుర్ తాలూకాలో? ఎవరికన్నా అక్కడ ఒడియా అర్థం అవుతుందా? ఆంధ్రావాళ్ళ నోరు నొక్కేశారా! ఏ కారణం లేకుండానే! ఆంధ్రాలోని లక్షలాది అమాయక జనం మీద ఒడిశా పాలనని రుద్దీశారు!”

“ఏమిటేమిటీ మీరనేది? పర్లా, రాయిగడా, గుణుపూర్? అక్కడ ఉన్న తెలుగు వాళ్ళెంత మందిట? ఎప్పుడన్నా వెళ్ళారా అక్కడికి? ఆ జాగాలన్నీ మీరు చూసొచ్చారా?”

“చూస్తే ఏమొస్తుందండీ? మహాశయా! నేను చూడకపోతేనేం? ఎంతమందో చూశారు. తెలుసుకున్నారు. రాశారు!! మీరు అన్ని జాగాల పేర్లు ఏకరువు పెట్టారు. మీరు మహా చూసొచ్చారా వాటన్నిటినీ?”

“గెజెట్లండీ గెజెట్లు! చూడండి! కమీషను తర్వాత కమీషను వేశారు. చూడండి ఆ రిపోర్టులు. చరిత్ర చదవండి. చోడగంగ నరసింహతో మొదలుపెట్టి ముకుంద దేవ వరకూ!”

“చదివానండీ! నేను చరిత్ర విద్యార్థినండీ! మీరు ప్రతాపరుద్రుడి పేరు ఎత్తేరు! కృష్ణదేవరాయల్ని మరిచిపోకండి! విద్వాంసుడు, సంగీతజ్ఞుడు, మహావీరుడు, ఔదార్యవంతుడు! అలాంటి రాజుని మరొకణ్ణి దేశంలో చూపెట్టండి! ఉన్నాడా ఎవరన్నా?? ఆయన రాజాస్థానం సాక్షాత్తు విక్రమాదిత్యుని రాజాస్థానం లాంటిది. ఆంధ్రా గౌరవ కిరీటం కృష్ణదేవరాయలు!! చారిత్రక ఆంధ్ర శాతవాహన చక్రవర్తుల ప్రఖ్యాతిని గుర్తుతెస్తాయి రాయల వారి కార్యకలాపాలు!! అన్యాయంగా ఆంధ్రలో చాలా పెద్ద భాగాన్ని ఒడియా రాజు పాలిస్తూ వచ్చేరు. కృష్ణదేవరాయలు ఎదిరించాడు. మొదట ఉదయగిరి దుర్గాన్ని విడిపించాడు. ప్రతాపరుద్రుడి పింతండ్రి తిరుమలై రావు తరాయ్‍ని బందీగా పట్టుకున్నాడు. కృష్ణానది ముఖతీరాన్ని ఉన్న పేరుపొందిన కొండవీటి దుర్గం మీద జెండా ఎగరేశాడు. వినుకొండ కోటలను స్వాధీన పరుచుకున్నాడు. ఆ తర్వాత ప్రసిద్దమైన కొండపల్లి దుర్గాన్ని!! ప్రతాపరుద్రుడి రాణుల్లో ఓ రాణీ, కొడుకులు ఇద్దరు, ఏడుగురు మంత్రులు పట్టుబడ్డారు! అక్కణ్ణుంచి సింహాచలం!! అక్కడ విజయ స్థంభాన్ని కట్టాడు!! అట్నించి ఉత్తరంగా వెళ్ళి మొత్తం సముద్రతీర ప్రాంతాన్ని చేతిలోకి తెచ్చుకున్నాడు! ప్రతాపరుద్రుడు ఏ షరతులతో సంధి చేసుకున్నాడో మీకు తెలిసే ఉంటుంది?” నవ్వుతూ గట్టిగా చెప్పేడు గుంఫస్వామి. “మహానుభావా! ప్రతాపరుద్రుడు ఆయనని అల్లుణ్ణి చేసుకున్నాడు! తన కూతురు తుక్కా వివాహాన్ని రాయలతో చేసేడు. మీరు ముకుంద దేవుడి సంగతీ ఎత్తేరు కదా? ముకుందుడు తెలుగువాడు. రాజు. ఆయన ఒడిశా సింహాసనాన్ని అధిష్టించాడు. ఇదండీ చరిత్ర!”

“కాదు! ముమ్మాటికీ కాదు. కల్పిత కథలు ఎన్నో కలిసిపోయాయి. ముకుంద తెలుగువాడు కాదు. దక్షిణప్రాంతం వాడు. ఆయన పాటించిన ఆచార వ్యవహారాల వల్ల ఆయన్ని తెలుగువాడని అన్నారు.”

సంభాషణ మట్టానికి దిగిపోయింది. మట్టానికి దిగిపోవడమే కాదు, మట్టమే లేకుండా పోయింది.

గుంఫస్వామి అత్యుత్సాహంతో పరిఢాని ఆహ్వానించినప్పుడున్న ఉద్వేగం; జగూ పరిఢాలో కలిగిన స్నేహ గాద్గదికత – గుంఫస్వామి భార్య ఆదరణ, సాయంత్రం వచ్చినప్పుడున్న భావాలన్నీ మాయమైపోయాయి. ఇద్దరు మిత్రులు కారు! అపరిచిత శత్రువులు ఎదురయ్యారు. ఒకరినొకరు దెబ్బ తియ్యాలనుకున్నారు. కొట్లాటకి సిద్ధపడ్డారు.

సరిగ్గా ఆ సమయంలో తలుపు తెరుచుకుని గుంఫస్వామి భార్య, ఆవిడ వెనకనే పిల్లలందరూ గదిలోకి వచ్చారు.

భయాన్ని నవ్వుతూ కప్పిపుచ్చుకుంటూ గుంఫస్వామి భార్య “ఏమిటి అంత పెద్దగా చర్చిస్తున్నారూ? రాజా మరో రాజుల కథలేనా? వీధి గాయకులు పాడుతూ ఉండే పాటలేనా?” అంటూ ప్రశ్నించింది.

“ఛ…ఛ… అవి కావు. ఇది చరిత్ర” అని ఎంతో గంభీరంగా బదులు చెప్పేడు గుంఫస్వామి.

“మీరూ మీ చరిత్రను! అడగక్కరలేదు. మహాభారతం చదివిన రోజున ఇంట్లో దెబ్బలాట తప్పదని సామ్యం! ఏమిటి మీరు అనుకుంటున్నది? మీ కృష్ణదేవరాయలు ఉంటే మిమ్మల్ని మంత్రిని చేసేస్తారు! ప్రతాపరుద్రుడూ పురుషోత్తముడు ఉంటే ఈ పెద్దమనిషిని వారి అమాత్యులుగా పెట్టేసుకుంటారు!!

మహానుభావుల్లారా! ఆ కాలంలోనూ బీదవాళ్ళు పొట్టపోసుకోవడానికి ఒళ్ళు హూనం చేసుకునేవారు. దిక్కూ తెన్నూ తెలీక తిరుగులాడేవారు. ఆడవాళ్ళు ఇల్లు ఎలా గడుస్తుందా అని తలలు పట్టుకునేవారు. పొయ్యిలో పిల్లి పడుకోకుండా, పొయ్యి ముట్టించగలమా, కడుపున పుట్టిన పిల్లల నోట్లో రెండు ముద్దలు పెట్టగలమా, వాళ్ళ బాగోగులు చూసుకోగలమా అని అల్లల్లాడేవారు. మీ కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుల యుద్ధాల వల్ల వాళ్ల నెత్తిని పెద్ద పిడుగుల దెబ్బే పడేది వాళ్ళ ఇళ్ళమీదా, వాళ్ళ వంటింటి పొయ్యిమీదా! పొయ్యిలో పిల్లులే పడుకునేవి! తెగిపడిన తలల కుప్పల మీద విజయస్తంభాలు నిర్మించి ఉంటారు!”

కన్నీళ్ళతో తడిసి ఆవేశపడ్తున్న ఆవిడ మొహాన్ని చూసి ఇద్దరూ గతుక్కుమన్నారు. కూచున్నవాళ్ళు గభాలున లేచి నిల్చున్నారు.

“ఏ చరిత్ర మీ పిల్లలకి రెండుపూటలా కడుపు నింపుతోంది? నడ్డి వంచి పనిచెయ్యాలి. బతుకుతెరువుకి కష్టపడాలి. ఒళ్ళు హూనం చేసుకోండి, సంసారాన్నీ ఇంటిని నిలబెట్టుకోండి. ఏదో ఓ భాష మాటాడండి. తమిళమో, తెలుగో ఒడియానో, బెంగాలీవో! ఏ వేషం బట్టలు కట్టుకోవాలని ఉంటే ఆ వేషం ఆ బట్టలూ వేసుకోండి. దేవుడే దిక్కని నమ్మి నిజాయితీగా నడవండి. మనుషులుగా అప్పుడు బతగ్గలరు. ఏం మగవాళ్ళండీ బాబూ!! అయ్యయ్యో!! ఆడవాళ్ళం ఎంత ఓర్చుకుని ఎంత కష్టపడి అన్నిటినీ తీర్చిదిద్దుతాం. అందరినీ కలిసికట్టుగా ఉండేటట్టు చూస్తాం. మీ నెత్తిని ఏ దెయ్యం ఆవహించిందంట! ముక్క చెక్కలు చేసి ద్వేషాలతో మంటపెట్టి బూడిద చెయ్యడానికి ఎంతమాత్రం వెనుకాడరు!”

“అబ్బెబ్బే! ఏదో పిచ్చాపాటీ మాటాడుకుంటున్నాం. అంతే!” అన్నారు ఇద్దరూ ఒకేసారి.

ఆ గతించిన కాలం చరిత్ర మాయమైపోయి ప్రస్తుతంలోకి వచ్చేసారిద్దరూ!

ఇద్దరూ నవ్వుతున్నారు.

“రేపు సాయంత్రం పిల్లలతో మీరిద్దరూ మా ఇంటికి రావాలి. నేనేవచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను” అంటూ జగూ ఆహ్వానించాడు.

“తప్పకుండా… తప్పకుండా అలాగే వస్తాం” గుంఫస్వామి తలే కాదు, మొత్తం శరీరం ఆ ఆహ్వానానికి అంగీకారం తెలిపింది.

ఆనందంతో గద్గదమవుతూ పరిఢా “ఇంక సెలవు తీసుకుంటాను” అంటూ బయటికి వచ్చాడు. ఆయన అరచేతిని తన పిడికిలితో గట్టిగా పట్టుకుని “మనిద్దరమూ అన్నదమ్ములం” అని గుంఫస్వామి అన్నాడు.

జగూ పరిఢా గుంఫస్వామి నడుమును తన చేత్తో చుట్టుకుపోయి “ఈ జన్మలోనే కాదు. జన్మజన్మల అన్నదమ్ములం” అని అన్నాడు.

~ ~

ఒడియా : గోపీనాథ్ మహంతి

తెలుగు : చాగంటి తులసి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here