ఇదే ఆఖరు

0
9

[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో సాధారణ బహుమతి గెలుచుకున్న కథ ఇది. రచన మంగు కృష్ణకుమారి. [/box]

[dropcap]వి[/dropcap]ద్య కొడుకు‌ శైలేంద్ర, కూతురు కమలిని తెలివి తప్పి మంచం మీద పడి ఉన్న తల్లిని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.

భర్త రాఘవ రెప్ప వాల్చకుండా భార్య విద్యనే చూస్తున్నాడు. ఆమె ఊపిరి ఏ నిమిషాన అయినా ఆగిపోతుందని అక్కడ ఉన్న అందరికీ తెలుసు.

కమలిని భర్త చక్రధర్ బయట వెయిట్ చేస్తున్నాడు. ‘ఫేమిలీని తప్పితే ఎవరినీ రూమ్ లోకి రానివ్వం’ అని డాక్టర్లు మొదటే చెప్పేరు. విద్య చేతులకీ, ముక్కుకీ అన్నీ తగిలించేరు. ఒక డాక్టర్ తరవాత ఇంకొకళ్ళు వస్తూ చెక్ చేస్తున్నారు.

ఆ చెకింగ్ ఆఖరి మాట చెప్పిందికే అని అందరికీ బోధపడుతూనే ఉంది.

కోడలు సహజ మామగారి మనసు ఎంత గాయపడి ఉన్నాదో అర్థం చేసుకుంటూ అతన్నే చూస్తోంది.

భర్తగా అంత గొప్ప మగవాళ్ళు తక్కువమంది ఉంటారని ఆమెకి తెలుసు. అన్యోన్య దాంపత్యాలు చాలా ఉండి ఉండవచ్చు.

కానీ, ఈ వయసులో కూడా భార్యని ఓ మల్లెపూవుని చూసినట్లు చూస్తూ, ఆమె సమీక్షంలో ఇష్టాన్ని ప్రకటిస్తూ ఆ అనుభూతిని చూపుల్లో, మాటల్లో ఇష్టంగా ప్రకటించే మాఁవగారంటే సహజకి ఎనలేని ఇష్టం. అపరిమితమైన గౌరవం. వాళ్ళిద్దరి మమైక్యతని ఇష్టంగా, నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది.

శైలేంద్ర భార్యని చాలా బాగా చూసుకుంటాడు. చక్రధర్ కూడా కమలినిని, ప్రేమగా చూస్తాడు. అయినా తమ మధ్య లేని అపురూపాలు, ఆత్మీయత ప్రకటనలూ విద్యా, రాఘవల మధ్యే ఉన్నాయని సహజ ఎప్పుడో గ్రహించింది. కానీ ఒక్కరోజు కూడా తన భావాలు బయట పెట్టలేదు.

తనకి‌ కానీ, కమలినికి కానీ సంసారాల్లో ఏ లోటూ లేదు. భార్యని ఇలా లాలించగలగడం ఒక కళ. ఆ కళ పిల్లలకి రాలేదేమో. ఆ మాట పైకి అని తన సంసారంలో ఆనందాన్ని, అత్తగారి మురిపాల దాంపత్యాన్ని ప్రభావితం చేయడం సహజకి ఇష్టంలేదు.

పొద్దుట కాఫీ రాఘవే కలిపి ప్రేమగా విద్య చేతికి అందిస్తాడు. గ్రిల్ గదిలో కాఫీలు తాగుతూ వాళ్ళిద్దరూ సరదాగా చెప్పుకుంటూ ఉంటే సహజకి అటు వెళ్ళడం ఇష్టం ఉండదు. పిల్లలు లేవరు కాబట్టి ఫరవాలేదు.

“విద్యాదేవిగారూ.. ఈరోజు ఇంత మౌనంగా ఉన్నారేమిటి? కొంపతీసి నేను కాఫీలో పాలుగానీ మర్చిపోయేనా? ఏదీ నీ గ్లాసు ఇలా ఇయ్యి” అంటూ ఆమె చేతిలో గ్లాసు లాక్కొని తన గ్లాసు ఆమెకి ఇవ్వడం సహజకి తెలుసు.

ఎక్కడికయినా వెళ్ళిందికి విద్య గంజి పెట్టిన చీర కట్టుకుంటూ ఉంటే చీర కుచ్చిళ్ళు తనే తీరుగా సర్దుతాడు రాఘవ.

విద్య కాస్త సిగ్గుతో “అయ్యో… ఈ వయసులో ఇదేమిటండీ…” అంటే, “ఏం ఈ వయసులో నువ్వు నా భార్యవి కావా? భార్యని భార్యలా చూస్తున్నాను. తప్పేంటి” అంటుంటే, విద్య తనలో తను మురిసిపోడం ఆమెకి ఎప్పుడూ గురుతే.

ఒకటా, రెండా? వాళ్ళ ఆత్మీయతా సంభాషణలు, సంఘటనలు – మరువం, దవనం కలిపిన దండలా సహజ పరిమళాలతో విలసిల్లుతూ ఉండేవి.

కమలిని ఘొల్లుమనడంతో సహజ ఉలిక్కిపడి చూసింది. డాక్టర్ మొహం సీరియస్‌గా ఉంది. నర్స్ చేతికి పెట్టిన సెలైన్ తీసేసింది.

“ఐయామ్ సారీ మిస్టర్ శైలేంద్రా…” అంది డాక్టర్.

సహజ రాఘవ వేపే చూసింది. అతని మొహం అభావంగా ఉంది. విద్య చేయి తన చేతిలో ఉంచుకున్నాడు.

చక్రధర్ తరవాత ఫార్మాలిటీస్ అన్నీ చకచకా పూర్తి చేయించేడు. ఇంటిదగ్గర ఉన్న తన తల్లికి జరిగినదంతా చెప్పి తామందరం వచ్చేస్తాం అని చెప్పేడు.

అంబులెన్స్ వచ్చింది బాడీని ఇంటికి తీసుకెళ్ళడానికి. హాస్పిటల్ స్టాఫ్ విద్య బాడీని అంబులెన్స్ లోకి తీసుకెళుతున్నారు. వెనకాతలే రాఘవ కూడా వెళ్ళేడు. కమలిని ఏడుస్తూ “నేనూ అమ్మతో కలిసి వస్తాను” అని నడవబోయింది.

సహజ గట్టిగా కమలిని చెయ్యి పట్టుకుంది. “మనం ఎవరం వద్దు కమలినీ, అందరూ ఒకసారి వినండి. మావయ్యగారినే అత్తయ్యగారిని ఇంటికి తేనీండి. వాళ్ళమధ్య ఎవరూ వద్దు” అంది.

కమలిని ఏడుస్తున్నా ఆశ్చర్యంగా “అదేమిటి వదినా… ఇలాటప్పుడు ఎందుకంటావేమిటి? నాన్న ఒక్కడూ అయిపోడూ?” అంది.

“ఇలాటి సందర్భం కాబట్టే మనం ఒద్దంటున్నా కమలినీ, అత్తయ్యగారికి అన్ని మావయ్యగారే…. వాళ్ళిద్దరే ఉండగలిచగే ఆఖరి అవకాశం ఇదే… మనం డిస్టర్బ్ చేయవద్దు. మనం కారులో వెళదాం” అంటూ సామాన్ల బేగులు పట్టుకొని అంబులెన్స్ దగ్గరకి వెళ్ళి రాఘవతో “మేం కారులో వస్తాం. మావయ్యా… మీరు అత్తగారిని ఇంటికి తెండి. మేమే ముందు వచ్చేస్తాం. డ్రైవర్, పదండి. మీ దగ్గర ఇంటి రూట్ మేప్ ఉంది కదా…” అంటూ చకచకా నడిచింది తన కన్నీరుగానీ, మనోభావాలు గానీ రాఘవకంట పడకుండా..

అంబులెన్స్ కదిలింది. భార్య పార్థివ దేహాన్ని కౌగలించుకొని, ఆమె చెంపలమీద తన పెదవులు ఉంచుతూ “నన్ను వదిలి వెళిపోయేవా? విద్యా… నేనూ వచ్చిస్తాను నీతో కలిసి” అని ‘వెక్కి వెక్కి’ ఏడుస్తున్నాడు రాఘవ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here