ఇదేం బహుమతి కథ కాదు

0
12

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘ఇదేం బహుమతి కథ కాదు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]“ఒ[/dropcap]రేయ్ మధూ, ఇక్కడ ఐరన్ చేసి పెట్టుకున్న నా టి షర్టు చూశావా” అరిచాడు శేఖర్.

ఆ అరుపులు వింటూనే బాల్కనీ లోంచి వచ్చిన మధు, తన మొహం అద్దంలో చూసుకుని మురిసిపోతూ, “ఆమె నిన్నా, మొన్నా మన బాల్కనీ ఎదురుగా ఉన్న మేడ మీద వెయిట్ చేస్తుంటే, ఎవరి కోసమో అనుకున్నాను. నా కోసమే అన్నమాట. నేను సరిగ్గా సాయంత్రం కాఫీ తాగే సమయానికి ముందే వచ్చి వెయిట్ చేస్తోంది. కొంచెం సేపు నన్ను చూసి నవ్వుతూ, తర్వాత సిగ్గుపడుతూ లోనికి వెళ్లిపోతోంది. ఇది నేను నమ్మలేకపోతున్నాను రా.”

“నేనూ నమ్మలేకపోతున్నాను. నిన్ను జిడ్డు మొహంతో, చింపిరి జుట్టుతో చూస్తే నాకే నవ్వొస్తుంది. ఇక ఆ అమ్మాయి నవ్వితే వింతేముంది. అయినా నా బట్టలు వాడద్దురా నాయనా అంటే మళ్ళీ నా టి షర్టు వేసుకున్నవా” అడిగాడు.

“ఇదిగో అలా కుళ్ళుకుని చావకు. ఆ అమ్మాయి నవ్వింది నన్ను ప్రేమగా చూసే, సందేహం లేదు.”

“ఆ అమ్మాయి నిన్ను చూసి నవ్వుతోంది సరే, నువ్వూ రోజూ ఆ అమ్మాయిని మన బాల్కనీ నుండి చూస్తున్నావ్ సరే, కానీ తర్వాత ఏం చేద్దామని” అడిగాడు శేఖర్.

“రేపో మాపో నా ఉద్యోగం, ఆస్తి పాస్తి, నేను ఎలాంటి వాడినో చెప్తాను. ఆమె ఒప్పుకుంటే చక్కగా పెళ్లి చేసుకుని లైఫ్ స్టార్టు చేసేస్తాను.”

“ఆమె ఎవరో ఏంటో తెలియకుండా, పైగా ఆస్తి లేని అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవడం దండుగ. రేపు నువ్వు ఎవరైనా అమ్మాయిని అరేంజ్‌డ్ మేరేజ్ చేసుకుంటే బోలెడు కట్నం తీసుకునే అవకాశం కూడా ఉంది, ఆలోచించావా.”

“ఏడిసినట్టుంది. బోడి కట్నం కోసం, మనసిచ్చి ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాలా. మనసు చంపుకుని మనల్ని మనం అమ్ముకుని బ్రతకాలనుకోవడం, ఛీ ఛీ నేను అలా చేయలేను, ఆమె మనసు గెలుచుకుంటాను, ఆమెని ఆమెగా చూసి నాదానిగా చేసుకుంటాను” చెప్పాడు మధు.

“ఇదే నీ నిర్ణయమా.”

“ఔను నూటికి నోరు శాతం.” .

“అయితే నీకో నిజం చెప్పాలి. ఆమెని నేను సంవత్సరంగా ప్రేమిస్తున్నాను. ఈ మధ్య నా బట్టలు నువ్ వేసుకోవడం వలన అలా ఆమె నిన్ను నన్ననుకుని నవ్వి ఉంటుంది. నువ్వు నేను కాదని తెలిస్తే, నిన్ను ఆమె కన్నెత్తి కూడా చూడదు సరికదా, కాలెత్తి తంతుంది. అయితే ఆమెకి కొంచెం ఐ సైట్ ఉండటం వల్ల ఈ అనర్థం జరిగింది. పైగా కళ్ళజోడు ఎప్పుడూ పెట్టుకోదు. అందుకే ఇలా జరిగి ఉండవచ్చనిపిస్తోంది” హేళనగా నవ్వాడు శేఖర్.

“ఇప్పుడు నేనూ నీకో నిజం చెప్తాను. మొన్న లలిత నువ్ లేనపుడు వచ్చి, తనని ఈ మధ్య దూరం పెడుతున్నావని భోరుమంది. నీ మోసం తెలిసి బాధపడింది. ఏం చేయాలో తెలియడం లేదని చెప్పి వెళ్లిపోయింది. అపుడే నేను ఒక ఉపాయం ఆలోచించాను. నేను కూడా లలితని ప్రేమిస్తున్నట్టు నటిస్తే, నువ్ జలసీతోనో, పొససివ్‌నెస్‌ తోనో మళ్ళీ ఆమెకి దగ్గరవుతావనుకున్నాను” అని మధు ఇంకేదో చెప్పేంతలోనే

“చాలు, ఈ కథకి ముగింపు అర్థమైంది. నాలో మార్పు రావాలని నువ్ ఇలా నాటకం అడావన్నమాట.”

“నాటకం ఆడాలనే మొదలు పెట్టాను. కానీ నిజంగానే ఆమె ప్రేమలో పడిపోయాను. కానీ ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని ఆమెకి దగ్గరవ్వు. నేను తప్పుకుంటా” చెప్పాడు మధు.

“నేను ఆమెని నిజంగా ప్రేమించి ఉంటే నువ్వన్నట్టు జరిగేది. నేను ఆమెని ప్రేమించింది ఆమె జీతం చూసి. కానీ ఈ మధ్యే, ఆమెకి ఓ చెల్లెలు ఉందని తెలిసింది. ఇక ఆమె పెళ్లి కూడా ఈమె బాధ్యతే. కనుక ఇంకెందుకు అని డ్రాప్ అయిపోయాను. పైగా మా ఊర్లో ఇరవై లక్షల విలువ చేసే ఎకరం పొలం ఇచ్చే ఓ పెళ్లి సంబంధం కుదిరింది. పాపం లలిత, నా ప్రేమ నిజమనుకుంది” అన్నాడు శేఖర్ నవ్వుతూ.

అప్పుడే వచ్చి వారి మాటలు విన్న లలిత, “అక్కరలేదు, నువ్ నాపై జాలి పడక్కరలేదు. కళ్ళజోడు పెట్టుకోకపోయినా, కొద్ది రోజుల క్రితమే కాంటాక్టు లెన్సు తీసుకున్నాను. అతన్ని స్పష్టంగా చూసే ఇష్టపడ్డాను. నేను పెళ్లి మాట ఎత్తగానే నువ్ కొద్ది వారాలుగా మొహం చాటేస్తూ వచ్చావ్. కానీ మధు, నిన్ను ప్రేమిoచానని తెలిసి కూడా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు. ఇలాంటి వ్యక్తిని ఏ ఆడపిల్లా దూరం చేసుకోదు” చెప్పింది లలిత మధుకి దగ్గరగా జరుగుతూ.

“ఏడిసినట్టుంది. అయినా నాతో అన్ని ఫోటోలు దిగి, అంత తిరిగావు. వీడికి ఇవాళ కాకపోయిన రేపైనా నీ మీద అనుమానం వస్తుంది. అపుడు నిన్ను వేపుకు తింటాడు. ఇక నా విషయం అంటావా, మా ఊరి అమ్మాయిని చేసుకుంటే ఎకరం పొలం వస్తుంది. ఇరవై లక్షలు తెలుసా. నీకేం ఉంది? వయసు మళ్ళిన జబ్బు నాన్న, పెళ్ళికెదిగిన ఓ బుల్లి చెల్లి. పైగా నువ్వు ఉండేది అద్దె కొంప”, మరోసారి హేళనగా నవ్వాడు.

“నీ బొంద, నీలా రోజుకో రంగు మార్చేవాడు ఏ అమ్మాయి మనసునీ గెలవలేడు. మధు గతం తవ్వేవాడు కాదు, భవిష్యత్తుని అందంగా నిర్మించాలనుకునేవాడు. ఇక కొసమెరుపు లేకుండా కథ ముగిస్తే చప్పగా ఉంటుంది. కనుక కొసమెరుపు ఏవిటంటే, ఆ అమ్మాయి నా సొంత చెల్లి కాదు, మా బాబాయి వాళ్ళమ్మాయి. ఇంజనీరింగ్ చదవడం కోసం ప్రస్తుతం మా ఇంట్లో ఉంటోంది. ఇక మేము ఉంటున్న రెండు వందల గజాల ఇల్లు మాదే. స్లాబ్ పెచ్చులు ఊడుతుంటే, అద్దె ఇంట్లోకి మారాం. సంవత్సరం క్రితం డబ్బు చూసుకుని బాగు చేయించి, మేవే మా సొంత ఇంట్లోకి వచ్చేశాం. ఈ ఏరియాలో స్థలం, గజం లక్ష. ఇది నీకు పెళ్లయ్యాక చెప్పి సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నాను. నీ బ్యాడ్ లక్” చెప్పింది లలిత తేలిగ్గా చూస్తూ.

ఆమె మాటలు వింటూనే, “అంటే, ఇరవై లక్షల కోసం రెండు కోట్ల ఆస్తి నష్టపోయానా, వ్వా, తూచ్, ఇది తొండి. నేనొప్పుకోను.” అని ఏడుపుగొట్టు మొహంతో బయటికి వెళ్లిపోయాడు శేఖర్.

అతను వెళ్ళిపోయిన వైపు చూస్తూ, “వాడికి ఇలా జరగాల్సిందే. ఆ ఇల్లు మీ సొంతం అని తెలియక, నిన్ను చేఙేతులా కాదనుకున్నాడు, దురదృష్టవంతుడు” అన్నాడు మధు.

మధు మాటలకి చిన్నగా నవ్వుతూ, “ఇదేం బహుమతి కథ కాదు, చివర్లో చెడుపై మంచి విజయం సాధించడానికి” చెప్పింది లలిత.

“అంటే” అడిగాడు మధు ఆశ్చర్యంగా.

“ఆ ఇల్లు మా సొంత ఇల్లు కాదు. నన్ను కాదని వాడు సంతోషంగా ఉండకూడదని, నేనే అలా అబద్దం చెప్పాను. అది అద్దె ఇల్లే” చెప్పింది నవ్వుతూ.

“ఔనా” అంటూ మధు కూడా గట్టిగా నవ్వేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here