ఇది నా దేశం

0
6

[box type=’note’ fontsize=’16’] దేశం కోసం ఓ బాలుడు తీసుకున్న అనూహ్యమైన నిర్ణయాన్ని ‘ఇది నా దేశం‘ అనే బాలల కథలో వివరిస్తున్నారు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. [/box]

[dropcap]రా[/dropcap]జ్యలక్ష్మీ, చంద్రశేఖరాలకు లేకలేక పుట్టిన కొడుకు రాము. అలా అని గారంతో చెడిపోలేదు. మంచి వినయ విధేయతలు, తెలివితేటలు కలిగినవాడు. చదువులో అన్ని క్లాసులు ప్రథమ తరగతిలో ఉత్తీర్ణుడయ్యేవాడు.

లేక లేక కలిగినా ముత్యంలాంటి కొడుకు పుట్టినందుకు ఆనందించారు రాజ్యలక్ష్మీ, చంద్రశేఖర్‍. రాముని పెద్ద చదువులు చదివించి విదేశాలకు పంపాలని, అతని భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చాలని తపించారు. ఆ ఏడాది రాము పాఠశాల ప్రథముడిగా వచ్చాడు. వారి ఆనందానికి హద్దు లేదు.

రామూని పెద్ద చదువులు చదివించి, విదేశాలకు పంపే విషయం అంతవరకు మనసులోనే పెట్టుకున్నా ఇప్పుడు మాత్రం అతని తెలివి మీద భరోసాతో అందరికీ చెప్పసాగారు.

కానీ ఉన్నట్టుండి రామూలో చాలా మార్పు వచ్చింది. చదువులో వెనుకబడిపోయాడు. ఎప్పుడూ ప్రథమ తరగతిలో ఉత్తీర్ణుడయ్యే రాముకి సాధారణ మార్కులు రాసాగాయి. తీరా జీవితాన్ని మలుపు తిప్పే తరగతిలోకి వచ్చేసరికి మందకోడిగా అయిపోయాడు. పదవతరగతి పరీక్షలు అత్తెసరు మార్కులతో పాసయ్యాడు.

ప్రైవేటు పెట్టి చదివించినా ఇంటరు కూడా అలాగే ఉత్తీర్ణుడవడమే కాక, వారు ఎంత కృషి చేసినా ఎమ్.సెట్.లో అతని నెంబరు కూడా కనబడలేదు. రాము సాధించిన ఫలితం చూసి తల్లిదండ్రులు కొద్దిరోజులు కోలుకోలేకపోయారు. ఆ అపజయం వారిదే అన్నట్టుగా అయిపోయారు. ఎలాగో తట్టుకుని మరల ఇవ్వమని కోరినా రామూ వినలేదు. ఇక తనకి చదువు రాదని తెలిపాడు. తల్లిదండ్రులు హతాశులయ్యారు.

ఒకనాడు రాము సైన్యంలో చేరడానికి సంబంధించిన దరఖాస్తు తెచ్చి, తండ్రితో తాను సైన్యంలో చేరతానని, సంతకం పెట్టమని అడిగాడు.

“నాన్నగారూ, నేను మీ కోరిక తీర్చలేకపోయాను. క్షమించండి. నాకొచ్చిన మార్కులకు విదేశాలలోనే కాదు, ఇక్కడ కూడా మంచి ఉద్యోగం దొరకదు, పెద్ద చదువులకి సీటు రాదు. అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను” అన్నాడు.

“బాబూ ఒక్క కొడుకువి… నిన్ను సైన్యంలో చేర్చాలంటే…” ఆగిపోయాడు తండ్రి.

“దూరం, ప్రాణ భయం రెండూ…” అంది తల్లి సహజమైన కడుపు తీపితో.

“అలా మాట్లాడతావేంటమ్మా? నేను విదేశాలకు వెళ్ళినా దూరమే అవుతాను కదా, దానికి మీరు సిద్ధమయ్యారుగా. ఇక ప్రాణభయం అంటావా? అది ఎప్పుడు ఎవరికి, ఎలా, ఎక్కడ రాసి పెడితే అప్పుడు ఎవరికైనా అలా తప్పదు, సైన్యంలోనే కాదు బయట ఉన్నా. అది అందరికీ తెలిసిందేగా? అయినా అలా అందరూ భయపడితే దేశం ఏమవుతుంది?” అన్నాడు.

“మరోసారి పరీక్ష ఇచ్చి చూడరా” అన్నాడు తండ్రి ఆశ చావక.

“వద్దు నాన్నా. నాకింక చదువు రాదు. నన్ను వెళ్ళనీయండి” అన్నాడు.

అయిష్టంగానే ఒప్పుకున్నాడు చంద్రశేఖర్. అయినా అక్కడ సెలెక్ట్ అవ్వాలిగా అనుకున్నాడు.

విచిత్రంగా రాము అక్కడ అన్ని పరీక్షలలోనూ నెగ్గడమే కాక, ఉద్యోగంతో ఉన్నత పదవిని కూడా త్వరిత కాలంలోనే అందుకున్నాడు. తిరిగి అతనిలో పూర్వపు చైతన్యం వచ్చేసింది.

“అయ్యో మరోసారి ప్రయత్నించమంటే విన్నాడుగాదు కదా” అని బాధపడ్డాడు చంద్రశేఖర్.

ఒకనాడు రామూ పంతులుగారు ఇంటికొచ్చాడు. అతని చేతిలో డబ్బు ఉంది. ఆ డబ్బును చంద్రశేఖర్‌కి ఇచ్చేశాడు.

“ఇదేమిటి?” అన్నాడు చంద్రశేఖర్ ఆశ్చర్యంగా.

“ట్యూషన్ డబ్బు బాబూ. నేను మీ అబ్బాయికి నిజానికి ఏ చదువూ నేర్పలేదు. సరిగా రాలేదు కూడా. అతనికి అవసరం లేదు కూడా. ఎంతో తెలివైనవాడు. నేను చెయ్యనిదానికి డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు” అన్నాడు.

“ఏం తెలివి లెండి. అతని పరీక్షా ఫలితాలు చెప్పాయిగా” అన్నాడు నిర్లిప్తంగా. మళ్ళీ తనే మాట్లాడుతూ, “ఏ ఒక్క మంచి కాలేజీలోనూ, సబ్జెక్టులోనూ సీటు రాలేదు” అన్నాడు చంద్రశేఖర్ నిరాశగా.

“బాబూ, మీకొక నిజం చెబుతాను, వినండి. నిజానికి బాబుకి సీటు రాకపోవటానికి కారణం అతను చదవలేక, తెలివి లేక కాదు. కావాలనే అలా చేశాడు” అన్నాడు పంతులుగారు.

“కావాలనా? అంటే?” ఆశ్చర్యంగా అడిగాడు చంద్రశేఖర్.

“అతనేం చెప్పాడంటే – నేను బాగా చదివి ఉన్నత పదవుల్లో, విదేశాల్లో ఉంటే ఎవరికి లాభం? నా కుటుంబానికేగా? కాని ఇక్కడే ఉంటే నా దేశానికే లాభం రావచ్చు – నా తెలివి, శ్రమ వల్ల. తెలివి వుంటే, శ్రమ పడితే తగిన ఫలితం (డబ్బు) ఎక్కడైనా లభిస్తుంది. కాని ఇప్పుడు నేను బాగా చదివితే తప్పనిసరిగా విదేశాలకు పంపుతారు అన్నాడు. అందుకే అతను సరిగా రాయలేదు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తన తెలివిని ఉపయోగించి ఉద్యోగం, డబ్బు, ఉన్నత పదవి పొందగలిగే శక్తి రాముకి ఉంది. ఒకవేళ లేకపోయినా తగినట్లే జీవించి తల్లిదండ్రులకీ, దేశానికీ తగిన, చాతనైన సేవ చెయ్యాలని అతని కోరిక” అన్నారు మాస్టారు.

“ఇది నా దేశం. నా దేశానికి తగిన, చాతనైన సేవ చెయ్యాలి అన్నది అతని లక్ష్యం. బాలలు అందరు రామూలా ఇలా కాకున్నా, తమదైన రీతిలో, శైలిలో, దేశం కోసం ఆలోచిస్తే, సేవ చేస్తే దేశం ఎంత బాగుపడుతుంది? అయితే దీనికి తల్లిదండ్రుల తోడ్పాటు, కృషి కూడా అవసరం. పిల్లలకు ఇష్టం, తెలివి లేకున్నా కొందరు తల్లిదండ్రుల్లా బలవంతంగా తమ భావాలు, కోరికలు వారిపై రుద్ది అప్పుల పాలవడమో, ఒంటరితనంతోనో బాధపడే అవసరం తప్పుతుంది. దేశానికి లాభం చేకూరుతుంది. కదూ’ అన్నారు పంతులు గారు.

నిజమే అన్నట్లు తలూపాడు చంద్రశేఖర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here