ఇది నా కలం-20 : కిరణ్ విభావరి

9
8

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

కిరణ్ విభావరి

[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం.

ఈరోజు చదివి రేపు మర్చిపోయే రచనల్ని సాహిత్యం అనరు. ఆలోచన రేకెత్తించాలి. పదికాలాల వరకూ గుర్తు పెట్టుకోవాలి. ఒక కథ చదివాకా ఆ పాఠకుడు ఉద్వేగానికి లోనవ్వాలి. “ఇది రా రచనంటే” అని నలుగురితో చదివించాలి. ఒక మంచి సినిమా చూసొచ్చాకా అందరికీ ఆ సినిమా గురించి కథలు కథలుగా ఎలా చెప్పుకుంటామో అలా మన రచన గురించి చెప్పుకోవాలి. వారి అంతరంగంలో చెరగని ముద్ర వెయ్యాలి. ఇదీ సాహిత్యం పట్ల నాకున్న అభిప్రాయం.

నా పేరు కిరణ్. గురుమంచి రాజేంద్ర శర్మ గారి కథ చదివి అందులోని విభావరి పాత్ర నచ్చి, నా పేరుకి తోక తగిలించాను. నిజానికి నా పేరు వినూత్నంగా వైవిధ్యంగా ఉండడానికి విభావరి అనే ఈ కలం పేరే దోహదం అని అనిపిస్తోంది.

నేను పుట్టింది అందమైన వైజాగ్ నగరంలో… పెరిగింది అందర్నీ ఆదరించే హైటెక్కుల రాజధాని భాగ్యనగరంలో. చిన్నప్పటి నుండీ నాకు సాహిత్యం పట్ల ఎందుకో చెప్పలేనంత ఆసక్తి. ఏ పేపర్ కనిపించినా చదవకుండా వదిలిపెట్టలేను. తద్వారా పుస్తకాల పురుగనే ఉపనామం కూడా సాధించాను. ఆ అభిలాషను ప్రోత్సహిస్తూ మా నాన్నగారు యెన్నో పుస్తకాలను తెచ్చేవారు. నిజానికి మా నాన్నగారు రాంచీలో పెరగడం మూలానా ఆయనకు తెలుగు రాదు. ఇంట్లో కూడా తెలుగు సాహిత్యం గురించి మేము మాట్లాడుకునేది చాలా తక్కువ. ఎక్కువగా సుబ్రమణ్య భారతి, ప్రేమ్‌చంద్, నిరాలా, Gulzar వంటి హిందీ సాహిత్య శిఖామణుల గురించే తప్పా, నాకు జాషువా , గురజాడ, తిలక్.. వీల్లేవరూ నామ మాత్రం కూడా తెలియరు. మా పాఠశాలలో కూడా తెలుగు ద్వితీయ భాష కావడం మూలానా నా తెలుగు సాహిత్యం పూర్తిగా అటకెక్కింది. హిందీ ఇంగ్లీషు భాషల్లో మాత్రమే రచనలు చదువుతూ, అప్పుడప్పుడూ రాస్తూ ఉండేదాన్ని.

నేను రాయడం కన్నా ఎక్కువగా చదవడానికి ఇష్టపడతాను. స్వభావ రీత్యా కూడా మాట్లాడటం కన్నా వినడానికే మొగ్గు చూపిస్తూ ఉంటాను. బహుశా అదీ ఒక కారణం కావొచ్చు కానీ ఇప్పటివరకు వందలాది కథలు చదివానని మాత్రం సగర్వంగా చెప్పగలను. అలా కథలు చదువుతూ ఉండగా నాలో కూడా రాయాలనీ, నా ఆలోచనల్ని అందరితో పంచుకోవాలని తాపత్రయం కలిగింది. ఎందుకంటే మన ఆలోచనలు మనతోనే ఉంటే అవి మనవరకే ఉండిపోతాయి. మన స్నేహితులతో చర్చిస్తే ఆ చర్చల్లో కాసేపు నలిగి రాలిపోతాయి అదే కాగితం మీద పెడితే మరికొన్ని ఆలోచనలకు కొత్త రూపునిస్తాయి.

మన కథలు ఆవేశపరిచేది కాకుండా ఆలోచింపచేసేవిగా ఉండాలని ఒక రచయిత సలహా ఇచ్చారు. కానీ నేను మటుకు నా రచనల్లో ఆలోచనతో పాటు భావావేశం కూడా ఉండాలి అనుకుంటాను. ఎప్పుడైతే పాఠకుడు రచనలో తనను తాను ఊహించుకుంటాడో , అందులో లీనమై నవరస భరితమైన భావావేశానికి గురి అవుతాడో అప్పుడే ఆ రచన అతడి స్మృతిపథంలో ఎల్లకాలం నిలిచిపోతుంది. అలా నిలిచిన నా కథ ‘కాఫీ పెట్టవు’. ఈ కథ కోసం నేను ఎక్కువగా వ్యయప్రయాసలు పడలేదు కేవలం ఒక గంటలో రాసిన కథ. కానీ ఈ కథ నాకు ఎందరినో అభిమానులుగా చేసి పెట్టింది. మరి ఎందరివో ఆశీస్సులను అందించింది. అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఇప్పటికీ ఈ కథ గురించి మాట్లాడే వారు చాలా మంది ఉన్నారు.

కథలు ఇలాగే రాయాలి. ఇలా రాయకూడదు. ముగింపు ఇలా ఉండాలి. ఎత్తుగడ అలా ఉండాలి అనే సూత్రాలు నాకు అస్సలు ఒంటబట్టవు. ఒక భావ స్రవంతిలో నా పంథాలో నేను రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎవరి కోసమో కాదు నాకోసం నేను రాసుకున్న కథలు ఎన్నో బహుమతులను తెచ్చిపెట్టాయి.

ఇక కవితల విషయానికి వస్తే, నేను కవితలు చదవడానికే కానీ రాయడానికి పెద్దగా మొగ్గు చూపను. కానీ నేను రాసిన  నాలుగు కవితలకి విశిష్టమైన పురస్కారాలను అందుకున్నాను. NATA, NATS, జాషువా పురస్కారాలు ఒకే కాలంలో అందుకోవడం నిజంగా మరిచిపోలేని తియ్యని అనుభూతి.

అయితే మొదట్లో చెప్పినట్టు నాకు తెలుగు సాహిత్యం గురించి ఇసుమంత కూడా జ్ఞానం లేదు. దాంతో ఎందరినో ఎన్నో రకాల సందేహాలను అడుగుతూ వాటిని నివృత్తి చేసుకుంటూ తెలుసుకుంటూ వచ్చాను. ఈ నా పయనంలో కొందరు ఆత్మబలంగా నిలిచి వెన్నుతట్టి ప్రోత్సహించారు. మరికొందరు నా రచనల్ని అవహేళన చేస్తూ విమర్శించారు. కానీ ఏ కథనైతే అయితే వారు విమర్శించారో  పట్టుదలకు పోయి ఆ కథను మూడు పోటీలకు పంపించాను. ఆ మూడింటిలోనూ అది ప్రథమ బహుమతి తెచ్చుకుంది. అందుకే నాకు విమర్శకులను చూస్తే నవ్వొస్తుంది. పైపెచ్చు జాలి కూడా వేస్తుంది. వారి విలువైన సమయాన్ని వేరొకరి తప్పులు ఎన్నడంలో ఖర్చు చేస్తున్నందుకు. సమీక్షలంటూ ఒకరి రచనల్ని ఆకాశానికి ఎత్తడం, విమర్శలంటూ ఒకరిని రచనల్ని కించపరచడం నేను ఎప్పుడూ చేయలేదు. భవిష్యత్తులో కూడా చేయను అనే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఒక రచన విలువను గుర్తించాల్సింది పాఠకులు. ఒక విమర్శకుడు వచ్చి ఇది చెత్త రచన అని చెప్పాల్సిన పని లేదు. అందులోని దోషాలను వెతికి పట్టుకొని నలుగురి ముందు ఉంచి ఆ రచయితను కించపరిచాల్సిన అవసరం లేదు. తమను తాము మేధావులుగా చిత్రీకరించుకునే క్రమంలో రచయితలోని రచనా శక్తిని చంపేస్తున్నారు. వీటికి నేను పూర్తిగా విరుద్ధం.

ఇక నా గురించి చివరిగా చెప్పుకోవాల్సి ఉంటే అది ‘తపన’ రచయితల కర్మాగారం అనే గ్రూపు గురించి మీతో కొన్ని మాటలు చెప్పి తీరాలి. ఈ గ్రూపు మొదలుపెట్టి ఏడాది కూడా ఇంకా పూర్తి కాలేదు దాదాపు 5 వేల మంది ఔత్సాహిక యువ రచయితలతో పాటు లబ్ధప్రతిష్ఠ రచయితలూ ఉన్నారు. పిల్లల పెద్దల మేలుకలయికతో వారి అనుభవాలు సూచనలు సలహాలతో గ్రూపు నుండి ఎందరో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. సాహిత్యం గురించి తెలుసుకునే పరంలో నేను ఏదైతే అనుభవించానో అది మరొకరు అనుభవించకుండా ఉండేందుకు ఈ గ్రూపును ఏర్పాటు చేశాను. ఎటువంటి సాహిత్యపరమైన సందేహం అడిగినా చిటికెలో సమాధానం దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? కొత్తగా రాయాలి అనుకున్నవారు, రాస్తున్నవారు ఎవరైనా సరే, సీనియర్ రచయితల భిన్న అనుభవాల నుండి ఎంతో కొంత తెలుసుకుంటూ ముందుకు సాగవచ్చు. ఇబ్బడిముబ్బడిగా ఉన్న రచయితల్లో రచన సామర్థ్యం కొరతగా ఉంది. వారిలో  కొత్త కొత్త ఆలోచనలు ఉన్నా వాటికి అక్షర రూపం ఇవ్వడంలో కాస్త తడబడుతున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చే విధంగా ప్రతి వారం, కొన్ని కొత్త పాఠాల్ని చెబుతూ కొందరు మార్గదర్శకులు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు.

కేవలం ఈ ఏడాదిన్నర నా సాహితీ ప్రయాణం మున్ముందు ఇంకా వైవిధ్యమైన రచనలతో ముందుకు సాగిపోవాలని,  కాల పరీక్షను తట్టుకుని నిలబడగలి సాహిత్యంలో నిలిచిపోయే రచనల్ని నేను చేసేందుకు మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలానే ఉంటుందని ఆశిస్తూ…

మీ కిరణ్ విభావరి

kiranias444@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here