ఇది నా కలం-28 : మద్దూరి బిందుమాధవి

0
10

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

మద్దూరి బిందుమాధవి

అందరికీ నమస్కారం.

నా పేరు మద్దూరి బిందుమాధవి. అరవయ్యేళ్ళ వయసులో మొదటి సారి కధా రూపంగా రచనని ప్రారంభించాను. అంతకు ముందు ఎప్పుడైనా దినపత్రికలకి నా స్పందనని లేఖల రూపంలో రాస్తూ ఉండేదాన్ని. సుమారు పన్నెండేళ్ళ క్రితం మా అమ్మాయి డెలివరీకి అమెరికా వెళ్ళాను. అప్పటి వరకూ బిజీ జీవితం గడిపిన నాకు, అక్కడ తెలిసిన వారెవరూ లేక… తోచక ఒంటరితనంతో బాధపడుతున్న నన్ను చూసి మా అమ్మాయి చి. సుష్మ విజయకృష్ణ ‘అంతర్యాగం’ అనే ఒక బ్లాగ్ తెరిచి, అందులో నా భావనా తరంగాలని వ్యాసాలుగా రాయమని ప్రోత్సహించింది.

నేను రాయాలని కానీ, రాయగలనని కానీ ఎప్పుడూ అనుకోలేదు. కానీ వార్తా పత్రికలు క్రమం తప్పకుండా చదువుతూ ఉండేదాన్ని. పెద్దగా పాఠశాల విద్య లేకపోయినా, పత్రికల్లో వ్యాసాలు చదివి, అవి మాతో చర్చిస్తూ మాలో సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించారు మా తల్లిగారైన ‘శృతకీర్తి’ గారు. ఆవిడ తన మాటల్లో సామెతల రూపంలో ఎన్నో జీవిత సత్యాలని అలవోకగా చెప్పేవారు.

నేను 24 ఏళ్ళు బ్యాంక్ ఆఫీసర్‌గా పని చేశాను. సర్వీసులో నా దినచర్య అవిశ్రాంతంగా ఉండేది. అప్పట్లో కంప్యూటర్లు లేవు. కొన్ని బ్రాంచుల్లో కాలిక్యులేటర్స్ కూడా లేవు. అన్ని పనులు మెదడు ఉపయోగించి చేత్తో చేసేవారం! యాజమాన్యం బదిలీ పాలిసీలో భాగంగా, ఆ 24 ఏళ్ళల్లో ఏడెనిమిది బ్రాంచులు తిరిగాను. అందులో నాలుగు, హైదరాబాద్ బయట వేరే ఊళ్ళు కూడా. నాది అత్త మామలు, ఆడపడుచులు ఉన్న ఉమ్మడి కుటుంబం. నాకు ఇద్దరు పిల్లలు. అంత మంది భిన్న వయసుల వారితో కలిసి మెలిసి బ్రతకటంతో అనేక రకాల మనస్తత్వాలు నాకు ఇంట్లోనే తెలిశాయి. ఆ అనుభవం నాకు ఉద్యోగంలో బాగా ఉపయోగపడింది అనుకోండి.

అలాంటి నా కుటుంబాన్ని హైదరాబాదులో వదిలి వెళ్ళినందువలన, నెలలో రెండు మూడు సార్లు రైలు ప్రయాణం చేసి వచ్చి వెళుతూ ఉండేదాన్ని. ఆ ప్రయాణాలు నాకు ఎన్నో అనుభవాలని అనుభూతులని ఇచ్చాయి.

ఇక బ్యాంక్ సర్వీస్ నాకు ఎంతో మందిని పరిచయం చేసింది. మంచి మానవ సంబంధాలని నేర్పటంతో పాటు అనేక రకాల మనస్తత్వాలు ఉన్న ఖాతాదారులతో అనేక రకాల అనుభవాలనిచ్చాయి. విషయావగాహన పెరిగింది. అనేక రంగాలతో పరిచయం ఏర్పడింది.

తరువాతి కాలంలో ప్రారంభించిన మా స్వంత నిర్మాణ కంపెనీలో నా ఉద్యోగ అనుభవం ఉపయోగించుకుని ఆఫీస్ నిర్వహణ పనులు చూసేదాన్ని. అవి కూడా మానేసి విశ్రాంత జీవితం గడపాలని నిర్ణయించుకుంటూ ఉండగా, తలవని తలంపుగా ఒక స్నేహితురాలు, శ్రేయోభిలాషి ఫోన్ చేసి… సరదాగా కథలు రాయచ్చు కదా అనడిగారు. అలా అన్నప్పుడు అసలు నేను రాయగలనా అనే సందేహం కలిగింది.

అప్పటి వరకు ముఖ పుస్తకంలో అడపా దడపా మిత్రులు ఇచ్చే శీర్షికలకి, పజిల్స్‌కి సమాధానాలు రాస్తూ ఉండేదాన్ని. నాకు ముఖ పుస్తకం మీద అప్పటికి పెద్దగా అవగాహన లేదు, ఆ మాటకొస్తే సదభిప్రాయం కూడా లేదు.

***

నా స్నేహితురాలు అడిగినప్పుడు… .పైన నేను చెప్పిన నా జీవిత నేపథ్యం, అందులోని పరిపుష్టమైన అనుభవాలని కథలుగా రాయచ్చేమో అనిపించింది. కానీ ఎక్కడ, ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. నాలో మాతృభాష పట్ల ఉన్న ప్రేమ, ప్రజలకి దాని పట్ల ఏర్పడుతున్న నిర్లక్ష్య ధోరణిని భరించలేని స్థితిని ఏర్పరిచింది.

తెలుగు మాధ్యమంలో చదువుకుంటే జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్టే అనే ఈ తరం వారందరిలో ఉన్న ధోరణి నాకు బాధ కలిగించింది. దీనికి తోడు, 1970-80 లలో విదేశాలు వెళ్ళిన మన తెలుగు వాళ్ళ పిల్లలు, సెలవులకి భారత్ వచ్చినప్పుడు తెలుగు మాత్రమే మాట్లాడగలిగిన అమ్ముమ్మలు, నాయనమ్మలు, తాతలతో తమ ముద్దు మాటలతో ముచ్చట్లు పంచుకోలేకపోవడం చూసి బాధ కలిగేది. ఇక్కడ వీళ్ళు ఆ మనవలని చూడాలని, దగ్గరగా హత్తుకోవాలని తపన పడుతూ ఎదురు చూస్తుంటే, తెలుగు రాని ఆ మనవలు దగ్గరకి రారు. వీళ్ళు అడిగే ప్రశ్నలకి, ఒక వేళ తమకి వచ్చీ రాని భాషతో మాట్లాడాలని ప్రయత్నిస్తే, వారి యాస.. మాట అర్థం కాక వీళ్ళు నవ్వుతారు. ఆ నవ్వులకి వాళ్ళు ముడుచుకుపోతారు.

మనసారా అర్థమయ్యేట్లు ఒకరితో ఒకరు సంభాషించుకోలేక మొహమాటంగా, దూర దూరంగా తిరుగుతున్న మనవలని చూస్తే ఈ దౌర్భాగ్యం మన తెలుగు వారికేనా, లేక విదేశాలు వెళుతున్న అందరు భారతీయులదీనా అనేది అర్థమయ్యేది కాదు. పైగా వేసవి కాలం అనేది… వారికి, మనకి వేరు వేరు టైముల్లో వస్తుంది. అక్కడ వారికి సెలవులిచ్చే సమయానికి మనకి భారత్‌లో స్కూళ్ళు తెరుస్తారు. అక్కడి నించి వచ్చే పిల్లలకి ఆడుకునేందుకు ఇక్కడ పిల్లలు ఉండరు… ఉన్న పెద్దలతో వాళ్ళు మాట్లాడలేరు. అందుచేత వాళ్ళు భారత్ రావటానికి ఇష్టపడరు.

విదేశీ వలస 1990లో ప్రారంభమయి, 2000 నాటికి బాగా ఊపందుకుంది. ఎవరి ఇళ్ళు దీనికి మినహాయింపు కాదు. అలా వెళ్ళిన మా పిల్లల పిల్లలు కూడా నేను పైన చెప్పినట్లు భారత్‌కి రారేమో అనే భయంతో… నేను మా పిల్లలు కూడా వారికి ప్రయత్న పూర్వకంగా తెలుగు మాట్లాడటం, రాయటం, చదవటం నేర్పాలని కంకణం కట్టుకున్నాము.

అలా మా చిన్నప్పుడు మా అమ్మ మాతో చర్చించినట్టు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, వంటలు-రుచులు, సాహిత్యం వారితో మాట్లాడుతూ ఉండేవారం. అలాంటి సందర్భాల్లో, మా అమ్మ దగ్గర నించి నేర్చుకుని నేను అలవాటుగా వాడే సామెతలు మా మనవడు ఒంటపట్టించుకున్నాడు. ఒక రోజు నేను మా మనవడిని ఇవ్వాళ్ళ అమ్మ వంటేం చేసింది అనడిగితే, “నిన్న చేసిన మిగుళ్ళు తగుళ్ళు పూర్తి చేశాం” అని యధాలాపంగా అన్నాడు. అప్పుడు పిల్లలకి మన భాష, సంస్కృతి, అలవాట్లు నేర్పకపోవటం మన దోషమే కానీ, నేర్చుకోవటంలో వారికి పట్టింపు ఉండదని నాకర్ధమయింది.

ఆ సంఘటనని ప్రేరణగా తీసుకుని, నా స్నేహితురాలి మాట మేరకు, అరవయ్యేళ్ళ నా అనుభవాలని ఉపయోగించి కథలు రాయటం మొదలుపెట్టాను. అలా ప్రారంభమైన నా రచనల వల్ల మాతృభాష వాడకంలో నా అనుభవం పెరిగింది. నా మాతృభాష ఎంత సమగ్రమైనదో తెలిసింది.

సంభాషణలో ఆంగ్ల పదాలు కలిపి కలగా పులగంగా మాట్లాడటానికి అలవాటు పడిన నేను రచనా వ్యాసంగం ప్రారంభించాక, వీలైనంతవరకు తెలుగే మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. చిన్నప్పుడు తెలిసి తరువాతి కాలంలో మర్చిపోయిన ఎన్నో అందమైన తెలుగుపదాలు, అసలు ఒక ఆంగ్ల పదం కూడా వాడకుండా ప్రవచనాలు చెప్పే చాగంటి వారి నోటి నించి విని మళ్ళీ వాడటం నేర్చుకున్నాను.

ముందుగా సామెతల ఆధారంగా కథలు రాశాను. నా రచనలు పంచుకోవటానికి ముఖ పుస్తకం చక్కటి వేదికనిచ్చింది. అలా రాసిన 100 కథలని పుస్తకంగా ప్రచురించాలనేది కూడా స్నేహితుల ప్రోద్బలమే! అలా ప్రచురితమైన నా మొదటి పుస్తకం “తెలుగు సామెతలు-కధా సంకలనం” పుస్తకం స్కూల్ టీచర్లని, తెలుగు భాషా ప్రియులని ఆకర్షించిందని తెలిశాక, శతక పద్యాల ఆధారంగా కూడా కథలు రాస్తే బాగుంటుందని అనిపించి ఆ ప్రయత్నం చేసి ఇటీవలే 50 కథలతో ‘శతక పద్యాలు-కధా కదంబం’ విడుదల చేశాను.

నా మొదటి పుస్తకం చదివిన ఒక ఐ.ఐ.టి ప్రొఫెసర్ గారు నాకు ‘శాస్త్ర సాంకేతిక సమాచారం’ అందించి నా చేత సైన్స్ కథలు రాయించారు. ఆ కథలు 12 ‘తెలుగుతల్లి కెనడ.కాం’ వారి వెబ్ పత్రికలో డిసెంబర్ 2020 నించి ధారావాహికంగా ప్రచురించబడుతున్నాయి.

ఈ యజ్ఞంలో అనేక పాత్రికేయ మిత్రులు, పాఠక మిత్రులు తమ ప్రోత్సాహాన్ని, సహాయాన్ని అందించారు.

కాస్త అనుభవం వచ్చాక, పాఠకులకి నా శైలి నచ్చుతున్నది అని నిర్ధారించుకున్నాక, కథలు ప్రింట్ పత్రికలకి పంపటం మొదలుపెట్టాను. కొన్ని పత్రికల వాళ్ళు తిప్పి పంపేశారు. కొంతమంది అసలు స్పందించనే లేదు. అలా అని వాళ్ళు ప్రచురిస్తున్న కథల ప్రమాణాలు చాలా గొప్పగా ఉన్నాయా అంటే ఏమో? కొంతమంది (తెలుగు వెలుగు మాసపత్రిక) వేసుకున్నారు. నా కథలకి ఆ పత్రికల పాఠకుల నించీ స్పందన నాకు మెయిల్స్ రూపంలో బాగానే వచ్చింది.

కధా రచనలో నా అనుభవం తక్కువే! కానీ రాయకుండా ఉండలేక, రాసింది నలుగురితో పంచుకోవాలనే ఆశతో ముఖ పుస్తకంలో అనేక బృందాల్లో సభ్యురాలినై, కథలు క్రమం తప్పకుండా రాస్తున్నాను. అందులో అభినందన పూర్వక పాఠకుల స్పందన అందుకుంటూ… కొనసాగింపుగా వెబ్ పత్రికలకి పంపించటం మొదలుపెట్టాను. నా కథలు ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్న వెబ్ పత్రికలు…’గో తెలుగు.కాం’, ‘మన తెలుగు కథలు.కాం’, ‘తెలుగుతల్లి కెనడా.కాం’, ‘మొలక న్యూస్.కాం’, ‘గణేష్ దిన పత్రిక’, ‘కధామంజరి’, ‘కౌముది’, మొ.. వారు నా కథలు ప్రచురిస్తూ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. మరిన్ని కథలు రాయమని కోరటంతో నేను సరైన దిశలోనే వెళుతున్నానని నమ్మకం కలిగింది.

మన తెలుగు కథలు.కాం వారు నా కథలకు ఉత్తమ కథలు శీర్షికన మూడు సార్లు బహుమతులు కూడా ఇవ్వటం జరిగింది. వారికి నా కృతజ్ఞతలు.

అయ్యగారి వసంత లక్ష్మిగారు, షుమారు ఏభై వరకు నా కథలని తన గళ విన్యాసాలతో ఆడియో కథలుగా మలిచి, తన ‘వసంతవల్లరి’ యూ ట్యూబ్ చానెల్లో కూడా పెట్టారని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను.

పిల్లలకి తెలుగు నేర్పితే ఇష్టంగా నేర్చుకుంటారు అనే నా భావనకి బలమిచ్చే విధంగా, నా నమ్మకం తప్పు కాదని నిరూపణగా.. UK లో ‘తెలుగు పుస్తక పఠన ప్రియుల సంఘం’ వారు నా పుస్తకాన్ని కొని చదవటమే కాక వారి వార్షిక సంచికలో నా కథ ప్రచురించారు. వాళ్ళు మాతృభాషని కాపాడుకోవటానికి చేస్తున్న కృషి చూస్తే ముచ్చటేసింది. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన సౌకర్యాలని ఉపయోగించుకుని తెలుగు పుస్తకాలు అప్‌లోడ్ చేసి, వాటిని చదివి పుస్తక సమీక్షలు నిర్వహిస్తున్నారు.

నేను ఆ బృందంలో సుశీల సోమరాజు గారి “ముగ్గురు కొలంబస్‌లు”, విజయ శేఖర్ ఉపాధ్యాయుల గారి “మరణంతో నా ప్రయాణం”, గొల్లపూడి మారితీ రావు గారి “ట్రావెలోకం..నా టాంజానియా యాత్ర”, “ద్వారక అస్తమయం” అనే పుస్తక సమీక్షలు రాశాను.

యూకే లోని ఆ బృందం వాళ్ళు తమ పిల్లలకి మాతృ భాష నేర్పటం కోసం, ముందుగా తాము తెలుగు పుస్తకాలు చదివి, అంతర్జాలంలో నించి పద్యాలు.. కథలు తీసుకుని వారి చేత చదివించి, దేవాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాష పుట్టిన చోట నిర్లక్ష్యానికి గురై, దేశం బయట బాగా బతికి బట్టకడుతున్నదని చెప్పటానికి ఎంతో సంతోషిస్తున్నాను.

ప్రచురణకర్తలు పడికట్టు ప్రమాణాలు.. నిబంధనలని అధిగమించి, కొత్త రచయితలని సమాదరించి, వారిని ప్రోత్సహిస్తేనే కొత్త అనుభవాలతో కొత్త రచనలు వెలువడతాయి అని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం సరైనదో కాదో పెద్దలు చెప్పాలి.

పాఠకుల..శ్రోతల ఆదరణ, విమర్శ, ప్రోత్సాహమే ఒక రచన బాగుందో -లేదో, అది మంచిదో కాదో నిర్ణయించే తీర్పు అని నా భావన. కానీ వారి దాకా రచన చేరాలంటే, ముందుగా రచయితలకి ఒక వేదిక దొరకాలి. రచన పదిమందికీ చేరాలి. దానికి ప్రచురణ కర్తలు ముందుకు రావాలి. వారి ఆదరణ రచయితల ప్రస్థానానికి ఇంధనం అంటే అతిశయోక్తి కాదేమో!

ఇదండీ నా రచనా ప్రస్థానం…..

ఎం బిందుమాధవి

bindumadhavi.madduri@icloud.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here