ఇజియోమా ఉమేబిన్ యూ నాలుగు చిన్న కవితలు

1
9

[వర్తమాన ఆఫ్రికన్ కవయిత్రుల కవితలను పాఠకులకు పరిచయం చేసే క్రమంలో నైజీరియన్ కవయిత్రి ఇజియోమా ఉమేబిన్ యూ రచించిన నాలుగు కవితలని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి]

~

1) ఆమెని నిందించకండి (Don’t blame her)
————————-
కొంతమంది స్త్రీలు..
తిరిగి కోలుకోవడానికి వీలు లేనంతగా మనసు విరిగిపోయి ఉంటారు.
మరి కొంతమంది స్త్రీ లను చూడండి..
ప్రేమించబడడానికి సిద్ధం కాబడనంతగా హృదయం ముక్కలై ఉంటారు.
అది కూడా మంచిదే!
ఇక ఆమెను తనంత తానుగా తనను కనుక్కోనివ్వండి.
దానికోసం నడవ లేకపోతే.. పాకుతూ వెళుతుంది.
కావలిస్తే దాని కోసం ఆమెను రెండుగా చీలిపోనివ్వండి!
ఆమెకి తెలిసిందంతా ప్రశ్నించనివ్వండి!
ఆమెను తనంత తానుగా స్వంత సూర్యుడిగా మారిపోనివ్వండి., ప్రకాశించ నివ్వండి!!
ఆమెని ఆపకండి!
***
2) గాయపడ్డ హృదయాలు/కోల్పోతున్న మా ఇళ్లు
————————-
ఎంబసీలో.. వాళ్ళు ఏదో ఒక రోజు
అమెరికా ఒంటరై పోతుందని చెప్పలేదు..!
పోనివ్వండి., మేము
మా మాతృభాషని పోగు చేసుకుంటాము..
హడావుడిగా మాకే చెందిన పదాలని
గుటకలుగా మింగుతూ ఉంటాము.
అది మాకు.. మా దేశంలోని మా ఇంటిని
మధురంగా జ్ఞాపకం చేస్తుంది.. మమ్మల్ని నులివెఛ్చగా ఉంచుతుంది!
***
3) ఇప్పుడే మొదలు పెట్టు!
————————-
ప్రారంభించు ఇప్పుడే!
ఎక్కడ ఉన్నదానివి అక్కడ నుంచే మొదలు పెట్టు!
భయంతో మొదలు పెట్టు..!
నొప్పితో మొదలు పెట్టు..!
వణికిపోతున్న చేతులతో మొదలు పెట్టు..!
కంపించిపోతున్న గొంతుతోనే మొదలు పెట్టు.. కానీ మొదలు పెట్టు!
మొదలు పెట్టాక ఇక ఆపకు!
నువ్వెక్కడున్నావో అక్కడి నుంచే మొదలు పెట్టు!
నీ దగ్గర ఏముందో దానితోనే మొదలు పెట్టు!
బస్.. మొదలు పెట్టేయ్ అంతే!!
***
4) ప్రవాసీ విషాదం! (డయాస్పోరా బ్లూస్)
———————-
ఒహ్హ్.. ఇక్కడ ఉన్నావా నువ్వు?
నీ స్వంత ఇంట్లో పూర్తిగా విదేశీయుడి లాగా..
ఇక్కడ పరదేశంలో కూడా ప్రవాసిగా!
ఎప్పటికీ రెంటికీ సరిపోకుండా!

~

మూలం: ఇజియోమా ఉమేబిన్ యూ

అనువాదం: గీతాంజలి


ఇజియోమా ఉమేబిన్ యూ నైజీరియన్ కవయిత్రి. సబ్-సహారా ఆఫ్రికన్ కవయిత్రుల్లో ఉత్తమ ఆధునిక కవయత్రిగా పరిగణించబడుతున్న వర్తమాన కవయిత్రి. స్టాక్ హోమ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ జర్నల్‍లో, ద రైసింగ్ ఫీనిక్స్ రివ్యూ, ద మాక్ గఫిన్ లాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పత్రికల్లో ఆమె కవిత్వంపై సమీక్షలు వచ్చాయి. ఇజియోమా తన ఏడేళ్ల నుంచే కవిత్వం రాయడం మొదలు పెట్టింది. ఆమె టెడేక్స్ టాక్ నిశ్శబ్దంగా ఉండే ప్రమాదకరమైన సంస్కృతిని బద్దలు కొట్టే షో గా ప్రసిద్ధి పొందింది.

ఆమె కవితా సంపుటి ‘అడా సంధించిన ప్రశ్నలు’ గా అత్యంత ప్రజాదరణ పొందింది. దీనిలో స్త్రీవాదం, తనను తాను అంగీకరించుకోవడం, ప్రేమించుకోవడం ముఖ్యమైన ఇతివృత్తాలు. ఇజియోమా కవితలు టర్కిష్, పోర్చుగీస్, రష్యన్, ఫ్రెంచ్ లాంటి అనేక ప్రపంచ భాషల్లో తర్జుమా అయ్యాయి. ఆఫ్రికన్స్ ఎలా తమ దేశంలోనే ప్రవాసీలుగా జీవిస్తున్నారో.. వాళ్ళ దుర్భరమైన అనుభవాలు.. ఇజియోమా కవితా వస్తువులు. ఒక రకంగా ఇజియోమా రాసిన స్త్రీ వాద కవితలు బాధిత ఆఫ్రికన్ స్త్రీలకు బైబిల్ లాంటిదని విమర్శకులు వ్యాఖ్యానిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here