ఇక యుద్ధం జరగదు…

0
14

[dropcap]మూ[/dropcap]డో ప్రపంచ యుద్ధం వస్తే… వస్తే…
ఈ కొత్త ఉదయంలో పండిన పంట ఏమౌతుంది?
ఈ భూమి మీద రక్తపు అంకురాలు మొలిస్తే
అమాయకపు హాలాల కోలాహలం ఏమౌతుంది?

ఈ నవ్వే గులాబీలు, సుగంధాన్ని వెదజల్లే తోటలు
అందరినీ మోహింప చేసే ఈ అందమైన మొగ్గలు
ఎంతో అందంగా ఊగిసలాడే ధాన్యం మొక్కలు
అల్లరిగా సజలంగా సిగ్గు పడుతున్న ఈ గోధుమ రాశులు

ఈ ఊగుతూ – ఊగుతూ చిరునవ్వులో ఒలికించే దానిమ్మలు
ఈ పెద్ద – పెద్ద ఊపులతో ఊగే మామిడిపిందెల అల్లరులు
ఈ నదుల అలలు ఉవ్వెత్తున లేస్తూ చేసే గలగలలు
ఈ నీళ్ళ సితారాల మీద పాడే సెలయేళ్ళ పాటలు

మైనాల చిలిపితనాలు, చిలకల అల్లరి
నెమళ్ళ కేకారాలు, తుమ్మెదల ఝుంకారాలు
పిడుగుల ఖడఖడలు, మేఘాల రాగాలు
మిణుగురు పురుగుల వెలుగులు, కీచురాళ్ళ కిచకిచలు

కిలకిలా నవ్వే పాల లాంటి పసిపాపలు
ఏ భయాలు లేకుండా ఉవ్వెత్తున ఎగిరే యువకుల టీపీలు
రతిని సైతం సిగ్గుపడేలా చేసే ఈ అందమైన ముఖాలు
సంగీతాన్ని దొంగిలించే గజ్జల గలగలలు

ఆల్వా (ఒక గొప్ప వీరుడు) సవాలు, డోలు పై థపథపలు
సూర్ మీరాల ఉపదేశాలు, కబీరు వాణి
నీళ్ళ రేవుల దగ్గర ఈ కుండల గిల్లికజ్జాలు
రాధతో మాధవుడి రహస్య కలాపాలు

వీటన్నింటిపైన మౌనం మరణాన్ని పరిచేస్తుందా?
పొగమంచు పొంగ అంతటా ఉండిపోతుందా?
కోయిల తోటలో కూస్తుందా?
చాతక పక్షి తన ప్రియురాలిని దగ్గరకి పిలుస్తుందా?

యుగం ఏ చరిత్రని రాస్తోందో
దాని సిరాతో రక్తం కలిసిపోతుందా
శవాల గుట్టల పైన సూర్యుడు దిగుతాడా?
ధ్వంసం అయిన శిధిలాలలో వెక్కిళ్ళు పెడుతూ చంద్రుడు ఏడుస్తాడు

శిశిరం ఈ పూల అందాలని దోచేస్తుందా?
ఎండ చీకటికి దాసోహం అవుతుందా?
క్రాంతి బంగారు సంకెళ్ళను తొడుక్కుంటుందా?
శాంతి సమాధులలో దాక్కుని నిద్రపోతుందా?

ఎడారి నర్మదా నదిని తాగేస్తుందా?
గంగా ప్రవాహం ఆవిరి అయిపోతుందా?
హిమాలయం తల వంచుతుందా?
వింధ్యాచలంలో శిశిరం మళ్ళీ వస్తుందా

పంటపొలాలలో వికసిస్తున్న బాల్యానికి
ఆ క్రూరుల ఒడే తప్పదా!
తనని తాను బలి చేసుకుని మట్టి తలపైన కిరీటం
ఆ శ్రమకి టాంకుల-మిషన్ల వయస్సు లభిస్తుందా

ఇప్పుడిప్పుడే సిందూరం పెట్టుకుని ఇంటికి వచ్చింది
ఆమె చేతుల గోరింటాకు ఇంకా తడి తడి గానే ఉంది
ఇంకా ఆమె ముఖం ముసుగు నుండి బయటకు తొంగి చూడలేదు
పసుపుతో తడిపిన ఆమె ఓణీ ఇంకా పసుపుపచ్చగానే ఉంది

ఎంతో ముద్దు మురిపంగా చూసుకున్న ఆ సోదరి
నగ్నంగా తన గాజులని బజారులో అమ్మేస్తుందా?
చేపుకు వచ్చిన స్తనాల నుండి వస్తున్న పాలను
ఇప్పుడిప్పుడే తల్లి అయిన ఆమె గుంజ కింద పాతిపెడుతుందా?

శ్రావనానికి తుపాకీ గోలీల వాన చినుకులా?
తోటలో వినాశనం ఉయ్యాల వేస్తుందా?
ఉద్యానవనంలోని కొమ్మలకు కొలిమిలు పూస్తాయా?
తుమ్మెదల సన్నాయిలో ఘృణ మోగుతుందా

నిస్సహాయ వృద్ధాప్యం స్మశానంలో ఏడుస్తుందా?
యౌవనానికి తుపాకీ మందు శృంగారం చేస్తుందా?
మానవత్వం పైన దానవత్వం విజయం పొందుతుందా?
అసలు ఈ కొత్త కథ ఏ విధంగా ముగుస్తుంది?

చాణక్య, మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, గాంధీ, సుభాష్
యుగాలన్నీ వీళ్ళ గొంతులనే మళ్ళీ మళ్ళీ వినిపిస్తాయి
తులసీ, వర్జిల్, హోమర్, గోర్కీ, షాహ్, మిల్టన్
రాళ్ళు కూడా ఇప్పటికీ వీళ్ళ గీతాలనే పాడుతాయి

గుడెసలకు అగ్గి పెట్టబడుతుంటే
వీళ్ళ కలాలలో చైత్యనం రాదా
ఆడపిల్ల రోడ్డు మీద పడి ఉంటే
వాళ్ళ సమాధులు పక్కకి ఒత్తిగిల్లవా?

ఆసియా గాయపడ్డ మనసుతో హాహాకరాలు పెడితే
వాల్మీకి ధైర్యం అటు – ఇటూ ఊగదా?
ఆకలి గొన్న ఖురాను లోని ఆయాతులు మసగబారుతూంటే
ఫిరదౌసి రక్తం మాట్లాడదా?

సౌందర్య – శవం రోడ్డు మీద కుళ్ళిపోతుంటే
మహళ్ళలో సాహిత్యం ఎట్లా ఉంటుంది?
ఇనుప పెట్టెలలో భోజనం ఖైదీ అయినప్పుడు
క్రాంతి – బీజం చెమటని నాటదా?

రైతులు కొడవళ్ళ తుప్పును వదిలిస్తున్నారు
కూలీవాళ్ళు గడ్డపారలకు పదును పెడుతున్నారు
ఆకాశం కొత్త తారల బస్తీని తయారు చేస్తోంది
భూమి కొత్త రక్తపు ఎరుపును ఒడిలోకి తీసుకుంటోంది

నిర్మాణాల రథం బాగా ముందుకు సాగింది
బాంబుల ఊబి అవరోధం కలిగించదు
ప్రతీ దారి పైన శాంతి అమరవీరుల మజిలీ ఉంటుంది
ప్రపంచం అంతటా శాంతి కావాలి, శాంతి కావాలి

ఇక యుద్ధం జరగదు…
ఇక యుద్ధం జరగదు…

హిందీ మూలం: గీత్ వసంత్ మహాకవి నీరజ్

తెలుగు: డా. టి.సి. వసంత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here