కాజాల్లాంటి బాజాలు-114: ఇలా చేయండి

1
12

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]పొ[/dropcap]ద్దున్నే రమ ఫోన్ చేసింది. అంత అవసరమేవిటని అడిగితే

“ఏం చెప్పను స్వర్ణా, ఈ పల్లవితో పడలేకపోతున్నాననుకో.. పెళ్ళయి మూణ్ణెల్లు కాలేదు, రోజూ ఏదో గొడవే.. దీనికి సర్ది చెప్పలేకపోతున్నాను. పొద్దున్నే వచ్చేనా ఇక్కడికి.. ఇద్దరూ రాత్రి పోట్లాడుకున్నారో యేమో.. ఎడమొహం పెడమొహాలతో ధుమధుమ లాడిపోతున్నారు. సంగతేంటని అడిగితే ‘నా గొడవ నే చూసుకుంటాలే’ అంటోంది. నాకేం చెయ్యాలో తెలీక నీకు ఫోన్ చేసేను.”

“కొత్తగా పెళ్ళైంది కదా! ఇంకా ఒకళ్ళ కొకళ్ళు పూర్తిగా అర్థం కాలేదేమోలే.. చిన్నపిల్లలు కాదు కదా! వాళ్ళే సద్దుకుంటారు” అనునయంగా చెప్పేను.

“ఏమోనే.. వీళ్ళ గొడవలు ఎక్కడ దాకా వెడతాయోనని భయంగా ఉంది. ఈ ఈగో ప్రోబ్లమ్‌లు ఒకటి కదా ఈ రోజుల్లో పిల్లలకి. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందోనని భయంగా ఉందే.”

“ఎక్కువగా అలోచించి నువ్వేం కంగారు పడకు. సాయంత్రం పల్లవిని తీసుకుని వదిన దగ్గరికి రా.. వదినయితే అన్నీ బాగా కనుక్కుంటుంది.” అన్నాను వదిన మీద నాకున్న పూర్తి విశ్వాసంతో.

“నిజమేనే.. వదిన అయితే అన్నీ బాగా కనుక్కుంటుంది. అయితే సాయంత్రం అయిదింటికి వదినింట్లో కలుద్దాం.” అంటూ సంబరపడిపోతూ ఫోన్ పెట్టేసింది రమ.

రమ నా చిన్నప్పటి స్నేహితురాలు విజయవాడలో ఉంటుంది. వాళ్లమ్మాయి పల్లవి చాలా తెలివైన పిల్ల. హైద్రాబాదులో హాస్టల్లో ఉంటూ సెంట్రల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పిహెచ్.డి. చేసింది. రీసెర్చ్ అయ్యే సమయానికే చంద్రతో పెళ్ళైంది. చంద్ర హైద్రాబాదులోనే డిఫెన్స్ లేబ్స్‌లో సైంటిస్ట్‌గా చేస్తున్నాడు. ఇద్దరి కుటుంబాలూ, జాతకాలూ, చదువూ, సాంప్రదాయం అన్నీ కుదరడంతో పెద్దలు అంగరంగ వైభవంగా పెళ్ళి చేసేరు. పెళ్ళయేక పల్లవి సిటీలోనే ఓ కాలేజీలో లెక్చరర్‌గా చేరింది. అన్నీ బాగున్నా యనుకున్నప్పుడు మరింక పల్లవి చంద్రతో గొడ వెందుకు పడుతున్నట్టు! నాకేమీ అర్థం కాలేదు. సంగతంతా వదినకి ఫోన్ చేసి చెప్పి, సాయంత్రం వస్తున్నామని చెప్పేను. తప్పకుండా పల్లవితో మాట్లాడి సంగతేమిటో కనుక్కుంటానని వదిన హామీ ఇచ్చింది.

సాయంత్రం వదినింట్లో రమ, పల్లవి, నేనూ సమావేశమయ్యేం. కొత్తగా పెళ్ళైన పల్లవిని విశేషాలేమిటని అడిగింది వదిన.

“ఏముంటాయాంటీ.. ఇదివరకు హాస్టల్లో ఉన్నప్పుడే బాగుండేది హాయిగా.. ఇప్పుడేంటో చేతులూ, కాళ్ళూ కట్టేసేరు మా అమ్మావాళ్ళూ నాకీ పెళ్ళి చేసి”. వదిన సానునయంగా అడిగినదానికి ఒక్కసారిగా బరస్ట్ అయింది పల్లవి.

“అంటే చంద్ర మంచివాడు కాదా!” అని వదిన అడిగిన ప్రశ్నకి,

“మంచంటే ఏంటాంటీ!” అని ఎదురు ప్రశ్న వేసింది.

“చెడ్డవాడు కాకుండా ఉండడం’”

“చెడ్డవాడంటే..”

“చెడ్డవాడంటే తాగుబోతు, తిరుగుబోతు, చెడు స్నేహాలూ, నిన్ను తిట్టడం, కొట్టడం.. ఇంట్లోంచి పొమ్మనడం.. ఇలాంటివాడా..! అని”

“అబ్బెబ్బే.. చంద్ర అస్సలు అలాంటివాడు కాదాంటీ..” గబుక్కున వదిన మాటలకి అడ్డుపడుతూ అంది పల్లవి.

“మరీ..”

“ఒట్టి మొండిఘటం.. తన మాటే నెగ్గాలనే పంతం, పట్టుదలా ఎక్కువ ఆంటీ.. నా మాట అస్సలు వినిపించుకోడు.”

“ఏ విషయంలో..!”

“అన్నింట్లోనూ.. ఫరెగ్జాంపుల్.. నాల్రోజులక్రితం మా కొలీగ్ తన కొడుకు బర్త్ డే ఓ పెద్ద హోటల్లో సెలబ్రేట్ చేసింది. చంద్ర తను రాననడమే కాకుండా అంత రాత్రి సిటీకి దూరంగా ఉన్న ఆ హోటల్‌కి నన్ను వెళ్ళొద్దంటాడే.. అతను రావడం రాకపోవడం అతనిష్టం. నన్ను వద్దనడానికి అతనెవరూ! నా కొలీగ్ పిలిస్తే వెళ్ళాలో వద్దో డిసైడ్ చేసుకోవల్సింది నేను కదా! నా మీద అతని పెత్తనం ఏంటీ!” పల్లవి ఆవేశంగా అడిగింది.

“నీ సేఫ్టీ కోసమే చెప్పాడనుకోవచ్చు కదా!” అన్న వదిన మాటలకి,

“నా సేఫ్టీ నాకు తెలీదా! ఇదివరకంతా యూనివర్సిటీ నించి అర్ధరాత్రైనా కూడా విజయవాడ వెళ్ళేదాన్ని కాదా! అప్పుడు నన్ను నేనే చూసుకున్నాను కదా!.. ఇప్పుడు విజయవాడ వెడతానంటే తనొచ్చి దగ్గరుండి బస్సెక్కిస్తానంటాడేంటీ ఏదో నన్నుధ్ధరిస్తున్నట్టూ.. అంతే కాదు.. ఇదివరకు టూ వీలర్ మీద ఎక్కడికైనా వెళ్ళేదాన్నా.. ఇప్పుడు అలా వెళ్ళకూడదంటాడు. అన్నింటికీ అతనితోనే, అతని వెనకాలే, అతను ఎక్కడికి తీసికెడితే అక్కడికే వెళ్ళాలి. ఇంక నాకంటూ ఓ ఇష్టమూ ఏవీ ఉండకూడదన్నమాటేగా..”

కాస్త ఊపిరి పీల్చుకుని మళ్ళీ అందుకుంది పల్లవి.

“ఇంట్లో కూడా అంతే. అతనికి బర్డెన్ అవకుండా ఇంట్లో అన్నీ నేనే చూసుకుంటాను. నేను స్వతంత్రంగా ఫోన్ బిల్లూ, పవర్ బిల్లూ కట్టినా అతని మొహం ముడుచుకుపోతుంది. మెయిడ్‌కి కూడా నేనే పే చేస్తాను. అదీ నచ్చదు అతనికి. నేను అతని గురించి అంత మంచిగా ఆలోచిస్తుంటే అత నెందుకు నన్ను అర్థం చేసుకోడూ!”

పాపం పల్లవి తన బాధ నంతా వెళ్ళగక్కేసుకుంది. అంతా శాంతంగా విన్న వదిన చిన్నగా నవ్వింది.

“అమ్మా పల్లవీ, చంద్రకి ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. అందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా.. నీకున్న ఇలాంటి ప్లస్ పాయింట్లని చూసుకో. మరింకిన్నాళ్ళూ స్వతంత్రంగా ఉన్న నీకు ఇప్పుడు ఇంకొకళ్ళు చెపితే వినడానికి నీ వ్యక్తిత్వం ఒప్పుకోదు. కానీ, ఒక్క మాట గుర్తు పెట్టుకో. నువ్వు పని చేసే చోట నిలదొక్కుకోడానికి నువ్వు వాళ్ల రూల్సూ, రెగ్యులేషన్సూ ఎలా ఫాలో అవుతావో.. అలాగే నీ కాపురం హాయిగా సాగాలంటే దానికి సంబంధించిన రూల్సూ, రెగ్యులేషన్సూ ఫాలో అవాల్సిందే..”

“అంటే.. నేను చంద్రాకి బానిసలా పడుండాలా..!” ఆవేశపడింది పల్లవి.

“అస్సలు ఒద్దు. కానీ అలా ఉన్నట్టు అతనికి కనిపించు, చాలు..” నెమ్మదిగా ఏదో సూత్రం బోధించినట్టు చెప్పింది వదిన. వదిన చెప్పిన తీరుకి పల్లవితోపాటు నేనూ, రమా కూడా వదినని చిత్రంగా చూసేం. వదిన చెప్పడం మొదలుపెట్టింది.

“శారీరకంగా మగవాళ్ళూ ఆడవాళ్ళ మధ్య ఉన్న తేడాలు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. దానితోపాటు మనం పెరుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. గత ఇరవై సంవత్సరాలుగా ఆడపిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళకి కావల్సిన ఉద్యోగం చేసుకునే చదువు చెప్పించి, వాళ్లకి ఒక వ్యక్తిత్వం వచ్చేలా చేసేరు వాళ్ల అమ్మానాన్నలు. కానీ మగపిల్లల్ని పెంచుతున్నప్పుడు ఎప్పట్లాగే చదువూ, ఉద్యోగానికే ప్రాముఖ్యమిచ్చేరు కానీ, ఇంట్లో ఆడవాళ్ళుకూడా తమతో సమానమే అనే జ్ఞానం చెపుతూ పెంచలేదు. అందుకే ఎంత తనతో సరిసమానంగా ఉద్యోగం చేస్తున్న భార్యయినా కొంతైనా తన మీద ఆధారపడాలని ప్రతి మగాడూ, మొగుడూ కోరుకుంటాడు. అలా కానప్పుడు మగవాళ్లమనే వాళ్ళ ఈగో దెబ్బతింటుంది, అటువంటప్పుడు వచ్చే ఉడుకుమోత్తనంతో ఇలాంటి అరుపులు, కేకలు సహజంగా వచ్చేస్తాయి. అంతమాత్రం చేత నీ స్వతంత్రం, స్వేచ్ఛ పోయాయనుకోవడం నీ తెలివితక్కువతనమే..”

స్పష్టంగా చెప్పిన వదిన మాటలకి రోషంగా చూసింది పల్లవి.

“ఆంటీ మీరు కూడా పాతకాలంవాళ్ళలా అలా మొగుడి కాళ్ళ దగ్గర పడి ఉండమంటారా!”

“అస్సలు ఉండొద్దు..” నవ్వుతూ చెప్పింది వదిన. ఆశ్చర్యంగా చూసింది పల్లవి.

“జస్ట్.. చిన్నచిన్న మాటలతో, చేతలతో అతని అహాన్ని తృప్తి పరిస్తే నీ కాపురం స్వర్గమే అవుతుంది. అంతా నీ చేతుల్లోనే ఉంది..”

“ఎలా!” ప్రశ్న అడిగింది పల్ల వయినా, నేనూ రమా కూడా వదిన ఏం చెపుతుందా అని ఆత్రంగా ముందుకి వంగాము.

“ఇంట్లో ఫోన్ బిల్లూ, పవర్ బిల్లూ నువ్వు కట్టకు.. అతన్నే కట్టనీ.. అలాగే మెయిడ్‌కి కూడా నువ్వెందుకు ఇస్తావూ.. అతన్నే ఇవ్వనీ.. ఇలా నాకూ స్వతంత్రం ఉంది కదాని నువ్విలాంటివన్నీ చేస్తే ఇంక అతను ఇంటి విషయాలే పట్టించుకోని పరిస్థితి వస్తుంది. అందుకని ఇల్లంతా అతని సంపాదన మీదే నడుస్తోందనే తృప్తి అతనికి దక్కనీ. ఏ మగాడయినా భార్యని తను గొప్పగా చూసుకోవాలన్న భావంతో ఉంటాడు. అందుకని నువ్వు ఎక్కడికి వెడుతున్నా, ఎప్పుడు వెడుతున్నా తనొక్కడే రక్షణ ఇవ్వగలననుకుంటాడు. ఆ సంతృప్తి అతనికి దక్కనీ. అంతేకానీ, నేనూ నీతో సమానమే అని భార్య అంటే మటుకు ఆ భర్తకి ఆ మాట గొంతులోంచి దిగడం కష్టమే అవుతుంది. మన ముళ్ళపూడివారు చెప్పింది వినలేదా.. ‘భర్త భార్య కన్న కొంచెం ఎక్కువ సమానం’ అని.. అలా అనుకున్నప్పుడే అతనూ మనశ్శాంతిగా ఉంటాడు. మనకీ హాయిగా ఉంటుంది.”

“అంటే ఇప్పుడు నేను రోజూ అతని కాళ్లకి మొక్కాలా!” ఉక్రోషంగా అంది పల్లవి.

“మీ అమ్మ అలా చేసిందా! నేను చేసేనా!” సూటిగా అడిగింది వదిన. మాట్లాడలేదు పల్లవి.

“ఆవేశాలకి పోకుండా ఆలోచనతో కాపురం చెయ్యడం ఎలాగో చెప్తాను విను. స్వేచ్ఛా, స్వతంత్రం అనుకుంటూ ఏదో సూపర్ వుమన్ లాగా ఫీలయిపోయి ఇంటా బయటా అన్ని పనులూ నెత్తినేసేసుకుని చేసేస్తుంటే చేయించుకునేవాళ్లకి అది బాగానే ఉంటుంది. కొన్నాళ్లకి మొత్తం నీ నెత్తి మీదే పెట్టేసి వాళ్ళెంచక్క రిలాక్సయిపోతారు. అలాంటి ప్రమాదం తెచ్చుకోకు. ఇల్లు మీ ఇద్దరిదీ. ఏది చేసినా ‘ఇలా చేస్తున్నాను..’ అనే కన్నా. ‘ఇలా చేద్దామనుంది.. నువ్వేమంటావూ..’ అంటూ అతన్ని సలహా అడగాలి. ఆ తర్వాత ఆ సలహా పాటించడం పాటించకపోవడం నీ ఇష్టం. నిర్ణయం ఎప్పుడూ నీదే.. కానీ అతని సలహా తీసుకున్నట్టు మటుకు కనిపించాలంతే.”

“అలా ఎలా ఆంటీ!”

పల్లవి అడిగిన ప్రశ్నకి వదిన నవ్వుతూ ఇలా జవాబు చెప్పింది.

“ఇప్పుడు నువ్వు చెప్పిన మీ కొలీగ్ కొడుకు బర్త్ డే సంగతే తీసుకో.. మీ ఇద్దరి మధ్యా సంభాషణ ఎలా ఉండాలంటే..

పల్లవి – చంద్రా, చూసేవా మా కొలీగ్ తన కొడుకు బర్త్ డే గ్రేండ్‌గా చేయ్యాలంటూ ఎంత దూరంలో పెట్టిందో. అసలు అంత దూరం బర్త్ డే కి ఎవరైనా వస్తారా!

చంద్ర – కొడుకు బర్త్ డే గ్రాండ్‌గా చేసుకోవాలనుకున్నారేమో. అందులో తప్పేవుందీ!

పల్లవి – నిజవే చంద్రా.. సునీత కూడా అలాగే అంది. రాత్రి చాలా పొద్దు పోతుందని వాళ్ళాయన్నికూడా రమ్మందిట.. అదేంటో.. నాకు కుదరదనేసేట్ట ఆ మహానుభావుడు. భార్య సాయం రమ్మంటే ఎవరైనా అలా అంటారా! అంతదాకా ఎందుకూ.. నువ్వే చెప్పు.. నువ్వు నన్నలా వదిలేస్తావా!

చంద్ర – ఏంటో.. కొందరలాగే ఉంటార్లే.. ఇంతకీ ఏ రోజన్నావూ.. కాస్త తొందరగా వచ్చేస్తా నారోజు..

ఇలా మాట్లాడి చూడూ.. నేను చెప్పినట్టు చంద్ర నీతో రాకపోతే నన్నడుగు. కాస్త తెలివిగా మసులుకో పల్లవీ. ‘నువ్వే గొప్ప, నీకన్న గొప్ప మొగుడు లేడూ’ అనే భార్య మాటని ఏ మొగుడూ దాటలేడు.”

వదిన చెప్పింది శ్రధ్ధగా విన్నాం ముగ్గురం. పల్లవి వినడమే కాదు, ఆచరణలో కూడా పెట్టేసింది.

ఇప్పుడు ఎంచక్కా పల్లవీ, చంద్రాఎంతో సంతోషంగా ప్రథమ వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్నారు.

మీక్కూడా ఏమైనా సలహాలు కావాలంటే రండి.. మా వదిన దగ్గరికి తీసికెడతాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here