ఇంద్రగంటి జానకీబాల కథల్లో మానవీయ దృక్కోణం

1
9

[శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారికి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం అందిన సందర్భంగా ఈ వ్యాసం ప్రత్యేకంగా అందిస్తున్నారు శ్రీమతి వారణాసి నాగలక్ష్మి.]

[dropcap]1[/dropcap]945లో జన్మించిన శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల ఎన్నోకథలు, నవలలు రచించారు. 2010 వరకు ఆమె రచించిన 26 కథలను ‘నిర్ణయానికి అటూ ఇటూ’ అనే కథాసంపుటిగా వెలువరించారు.

ఇంద్రగంటి జానకీబాల గారి కథల్లో అచ్చమైన మధ్య తరగతి తెలుగు జీవితాలు దర్శనమిస్తాయి. కథ చదువుతుంటే ఆ పాత్రలన్నీ సజీవంగా ప్రత్యక్షమై కథాప్రాంగణంలోకి పాఠకులని అప్రయత్నంగా లాక్కుపోతాయి. అనవసర వర్ణనలు లేకుండా, కథకు ముఖ్యలక్షణమైన క్లుప్తతని వీడకుండా, కథాంశం పక్కదారి పట్టకుండా ఈమె కథని నడిపే నైపుణ్యం పాఠకులని ఆకట్టుకుంటుంది.

జానకీబాలగారు ఆశ్చర్యం గొలిపే విషయాలో, అరుదైన అంశాలో కాకుండా తరచుగా కనిపిస్తున్న విషయాల్లోనే మనం గమనించని కోణాన్నెన్నుకుని రచన సాగిస్తారు. చకచకా నాలుగు గీతల్లో స్కెచ్ గీసి చూపే ప్రతిభావంతుడైన చిత్రకారుడిలా పరిమిత వాక్యాల్లో నేటి సమాజాన్ని స్ఫుటంగా చిత్రిస్తూ, ఇదే సమాజం ఎలా ఉండచ్చో, ఎలా ఉంటే బావుంటుందో అన్యాపదేశంగా సూచిస్తారు.

సాహిత్యంలో సమకాలీన సమాజం ప్రతిబింబిస్తుంది. ఒకప్పటి సాహిత్యం నిండా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక చితికిపోయిన మధ్యతరగతి తల్లితండ్రులు, వృద్ధకన్యలు, భర్త నిరాదరణకు గురై పుట్టింట్లో మగ్గిపోయిన యువతులు, కట్నకానుకల కోసం లాంఛనాల కోసం ఆడపెళ్లివారిని వేధించే మగపెళ్లి వారు, గయ్యాళి అత్తగార్లు, వారి ఆధిపత్యం కింద నలిగిపోయే కోడళ్లు ఎక్కువగా కనిపించేవారు.

ప్రపంచీకరణ తరువాత సమాజంలో చోటు చేసుకొన్న మార్పులు ఆ తరువాత వచ్చిన సాహిత్యంలో ప్రతిబింబించాయి. నిరాడంబర జీవనం, పొదుపు, నీతినిజాయితీ, చేతకానివాళ్లు వల్లె వేసే పనికిమాలిన పదాలుగా మారిపోయాయి. వ్యక్తి గొప్పదనాన్ని అతను వాడే కారు, కళ్లజోడు, చేతి గడియారం, అతను నివసించే ఇల్లు, వాడే సాంకేతిక పరికరాలని బట్టి; అతను పెట్టే విచ్చలవిడి ఖర్చుని బట్టి అంచనా వేయడం మొదలైంది. డబ్బుకి మునుపెన్నడూ లేనంత ప్రాముఖ్యత ఏర్పడింది.

తాము కోరుకున్నంత డబ్బు వేరే ఏ విధంగానూ సంపాదించడం సాధ్యం కాదని గ్రహించిన మధ్యతరగతి తల్లితండ్రులు పిల్లల సాంకేతిక విద్యమీదే తమ పెట్టుబడిని కేంద్రీకరించి వాళ్లు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకి వెళ్లి డాలర్లలో సంపాదించేందుకు దారి ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా విదేశాలకు వెళ్లి స్థిరపడిపోయిన పిల్లలూ, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న వృద్ధాప్యంలో ఆధారంలేక ఒంటరైపోయిన తల్లిదండ్రులూ, సమాజంలోనూ, సాహిత్యంలోనూ చోటు చేసుకున్నారు.

ఈ పరిస్థితికి కారకులు తల్లిదండ్రులా, పిల్లలా అనేది వివాదాస్పదమైన విషయమే. దేశంలోనే ఉన్నా అత్తమామల పొడగిట్టని కోడళ్ళూ, భార్య మాట జవదాటని కొడుకులూ.. ఈ ఇతివృత్తంతో కూడా అసంఖ్యాకంగా రచనలు వచ్చాయి. వృద్ధులైన పెద్దవాళ్లు ఒంటరిగా జీవిస్తుంటే తప్పంతా వారి పిల్లలదే అనే జడ్జిమెంటల్ ధోరణి, అలాంటి కోడళ్ళకి బుద్ధి చెప్పాలన్న ప్రయత్నం చాలా కథల్లో తీవ్రస్థాయిలో కనిపిస్తున్న నేపథ్యంలో జానకీబాల గారి ‘ఫలశ్రుతి’ కథ ఈ సమస్యకి మూలా లెక్కడున్నాయో వెతికి చూపిస్తుంది.

ఫలశ్రుతి కథ అత్తగారిని మరిది ఇంటికి పంపేయమని కమల తన భర్త సూరిబాబు మీద విరుచుకుపడడంతో మొదలవుతుంది. ఆమె ప్రదర్శించే ఆవేశం, విచక్షణా రాహిత్యం, అసహనం పాఠకుడిలో ఆ పాత్ర పట్ల వ్యతిరేక భావాన్ని రేకెత్తిస్తాయి. ఆయా లక్షణాల మోతాదు కొంచెం ఎక్కువా తక్కువా కావచ్చుగాని అలాంటి పాత్రలు ఎన్నో నిజ జీవితంలో మనకి తారసపడతాయి. కోడళ్ళ స్వార్థపూరిత మనస్తత్వమే దీనికి కారణమని ఒక్కముక్కలో తేల్చిపారేసే కథలెన్నో వచ్చాయి. దీనికి భిన్నంగా జానకీబాల ఇదే అంశాన్ని కథగా అల్లుతూ ఈ సమస్య మూలాలను తవ్వితీసి, ఈ పరిస్థితికి కారకులెవరో చురుక్కుమనేలా స్పష్టం చేస్తారు. మనిషి మనిషికీ రూపురేఖల్లో, మాటతీరులో తేడాలున్నట్లే, వ్యక్తిని బట్టీ, కుటుంబ నేపథ్యాన్ని బట్టి సమస్యల్లోనూ, వాటికి పరిష్కార మార్గాలనన్వేషించడంలోనూ తేడాలుండడం సహజం. వృద్ధులంతా మంచివాళ్ళూ, నిస్సహాయులూ.. యువత అంతా చెడ్డవాళ్ళూ కారని చెపుతూ ‘చర్యని బట్టి ప్రతిచర్య’ ఉంటుందని వివరిస్తారు.

పద్దెనిమిదో ఏట పెద్దకోడలిగా అత్తగారింట్లో అడుగుపెట్టిన కమలకీ, బీపీతో ఊగిపోతూ విచక్షణ కోల్పోయి మాటమాటకీ రెచ్చిపోయే నేటి కమలకీ ఇంతటి వ్యత్యాసం ఎలా వచ్చిందో సమర్థవంతంగా వివరించి, పాఠకుడిలో ఆ పాత్రపట్ల ఏర్పడ్డ వ్యతిరేక భావాన్ని తుంచేసి, ఆ స్థానంలో ఒక సహానుభూతిని మొలకెత్తిస్తారు జానకీబాలగారు.

‘మన వ్యవస్థలో పెళ్ళి అనేది రెండు కుటుంబాల మధ్య స్నేహానికి బదులు శత్రుత్వాన్ని నెలకొల్పిన దాఖలాలే మనకి కనిపిస్తాయి’. ‘మనం తూలనాడి, ద్వేషం ప్రదర్శించి, వాళ్ళు మనల్ని ప్రేమించాలి, గౌరవించాలి అని ఆశించడం అవివేకం. అలాంటి అవివేకమే మన కుటుంబాలలో కరడు కట్టుకు పోయి ఉండిపోయింది. ఆనాటి రాక్షస అత్తగార్లందరూ ఇప్పుడు ముసలివాళ్ళయి, కోడళ్ళు పెట్టే గుప్పెడు మెతుకుల కోసం దేబిరించాల్సిన స్థితికి చేరుకున్నారు’.

‘ప్రతీవాళ్ళూ ముసలి తల్లిదండ్రుల్ని పిల్లలు చూడటం లేదని, వృద్ధాశ్రమాల దుష్టసంస్కృతి మనకీ వచ్చిందని ఈ మధ్య తెగ బాధపడిపోతున్నారు. తల్లులు కొడుకుల్ని వారి బ్రతుకు వారిని బ్రతకనివ్వకుండా అన్నీ తామే నిర్దేశిస్తామంటారు. సంసారం చేయడం దగ్గర్నుంచి, సామాను కొనడం వరకు అంతా అత్త పెత్తనం సాగాలంటారు.. ముసలి అత్తలతో వేగలేక అనారోగ్యవంతులై, చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు వచ్చి, ఓపిక నశించి, కసితో కుతకుతలాడిపోతూ బతుకుతున్న కోడళ్ళు అడుగడుగునా కనిపిస్తారు. వృద్ధాప్యంలో అత్తల దైన్యస్థితి ఎంత బాధాకరమో నడివయస్సులో అత్తగారు, భర్తల ఆధిపత్యానికి నరకం అనుభవించే కోడళ్ళ స్థితి కూడా అంతే బాధాకరం’

పై వాక్యాలలో రచయిత్రి నిశిత పరిశీలనా దృష్టి పాఠకుడికి అవగతమవుతుంది. ఈమె తన దృష్టిలో సమంజసం కాదనిపించిన విషయాలను నిర్భయంగా ప్రశ్నించి, నిష్కర్షగా ఖండించడానికి వెనుకాడకపోవడం గమనార్హం. ఈ కథలోనే అమెరికాలో ఉన్న మూడోకొడుకు దేశానికి రావడాన్ని కొసమెరుపుగా చూపిస్తారు. వస్తూనే మాతృత్వం గురించి, భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి అతను పెద్ద ఉపన్యాసమివ్వడం, మూడో కోడలు అత్తగారి చేతులు బాగానే ఉన్నా గిన్నెలో అన్నం కలుపుకొచ్చి, చెంచాతో అమెరికన్ పద్ధతిలో అత్తగారికి తినిపించడం వర్ణించి, ‘వాళ్ళ ధైర్యం ఒక్కటే ఆ ముసలావిడని చూడవలసిన బాధ్యతగాని, ఆవిడ మలమూత్రాలు ఎత్తి పారబోయాల్సిన పనిగాని వారి మీద పడదని’ అంటారు. చివరికి రెండో కొడుకూ కోడలూ ‘ముసలివాళ్ళ గతం తవ్వి, వాళ్ళమీద కక్షసాధించడంలో ప్రయోజనం లేదు. ఒక బాధ్యతగా వాళ్ళని కడతేర్చాలి’ అనుకోవడంతో కథకి సానుకూలమైన ముగింపునిస్తారు.

‘రాణీఈగ’ కథలో చదువుకుని స్వతంత్రంగా జీవించగలిగే శక్తి ఉండీ తనకు తగిన వ్యక్తి ఎన్నికలో చొఱవ చూపలేక తల్లిదండ్రుల మీద ఆధారపడిన యువతి గురించి రాస్తూ, కనీసం కాబోయే భర్త అభిరుచులు, అభిప్రాయాలు ఎలాంటివో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా తన జీవితాన్ని అతని చేతుల్లో పెట్టడానికి తయారైపోవడాన్ని ప్రశ్నిస్తారు. చదువుకున్నా వ్యక్తిత్వం సంతరించుకోని యువతీ యువకుల పెళ్ళిళ్ళు ఎలా ఉండే అవకాశం ఉందో వర్ణిస్తారు. కథ ఎత్తుగడ, ముగింపు, మధ్యలో కథాగమనం అంతటా రచయిత్రి ప్రతిభ కనిపిస్తుంది.

భర్త, అత్తమామలూ తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, సంపాదననీ హరిస్తూ తనమీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నా, ‘పెళ్ళి, సంసారం ఆడపిల్లకి ఎంత ముఖ్యమో, మగవాడికీ అంతే ముఖ్యం’ అని గ్రహించకుండా కాపురం కూలిపోతుందేమో అని భయపడే శ్రీవల్లి లాంటి ఆడపిల్లల్ని, ఎపార్ట్మెంట్లలో సన షేడ్స్ కింద తేనెపట్టుని పెట్టి, తేనె కూడబెట్టి, ఎన్నిసార్లు నిప్పుపెట్టి చెదరగొట్టినా మళ్ళీ అక్కడే పట్టుని పెట్టే రాణీఈగ తో పోల్చి ‘మరోచోట పెట్టుకునే జ్ఞానం దానికి లేదు’ అని శ్రీవల్లి తల్లిచేత అనిపిస్తారు.

‘కాళ్ళా, వేళ్ళా పడి బతిమాలితే వచ్చిన శ్రీవల్లి మొగుడ్ని ఒక తేనెటీగ కుట్టనే కుట్టింది. గిట్టక తేనెటీగ చేత కుట్టించారని అత్తగారు పెద్ద రాద్ధాంతం చేసింది’. ఇన్ని జరుగుతున్నా శ్రీవల్లి ఏం చేసింది అంటే చెప్పడం కష్టమే. తఱచూ ఏడుస్తూ ఆడవాళ్ళకి కష్టాలు సహజమేనని నమ్మి, కొన్నాళ్ళు భరించాలని నిర్ణయించుకుని ఉండవచ్చు.

‘వచ్చిన జీతంలో లెక్కలు సరిగా లేవని తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చేస్తోందని అనుమానంగా వుందని అల్లరిచేస్తే భరించలేక అమ్మ దగ్గర కొచ్చేసింది శ్రీవల్లి.. మర్నాడు పే సర్టిఫికేట్‌తో సహా చూపించి తమ కుమార్తె నిజాయితీని బలప్రదర్శనలో నిరూపించుకుని పిల్లని అత్తగారింటికి పంపారు. కాలేజీలో వాళ్ళు ముక్కుమీద వేలు వేసుకున్నారు. కానీ ఆ తల్లిదండ్రులు పిల్ల అత్తారింటికెళ్ళినందుకు గుండెల మీద చెయ్యేసుకున్నారు’. పై వాక్యాల్లో రచయిత్రి శైలి, కథన చాతుర్యం ప్రతిఫలిస్తాయి.

‘ఏకలవ్యం’ కథలో ఇద్దరు స్నేహితుల మధ్య నిరాటంకంగా సాగిన రాకపోకల్ని చిత్రిస్తూ, అదే విధంగా ఎన్నో ముఖ్య సందర్భాలలో కూడా కలుసుకోలేకపోయిన స్నేహితురాళ్ళిద్దరి బంధాన్ని, వాళ్ళు కలుసుకోలేక పోవడానికి కారణాల్ని వర్ణిస్తారు. ‘సంసారమనేది రెండు చక్రాల బండనీ, దానికి భార్యాభర్తలు చక్రాలనీ చక్కని ఉదాహరణలు చెప్తారు. ఇద్దరూ సమానులే. అయితే పురుషులు కొంచెం ఎక్కువ సమానులు. వారికి ఈ సంసారంవల్ల, పిల్లలవల్ల, తమ తల్లిదండ్రులవల్ల, భార్యవల్ల వారి సరదాలు, పనులు ఏవీ ఆగిపోవు’, ‘ఇంట్లో ఎవరికి బాగుండకపోయినా, ఇల్లాలుగా, కోడలిగా, తల్లిగా, భార్యగా ఆమె ఉండితీరాలి. ఆమె బాధ్యతను కొంచెం సమయమైనా ఎవరూ తీసుకోరు’ అంటూ సంసారబంధం లోని అసమానతని ఎత్తి చూపిస్తారు.

తెరమీది బొమ్మ కథలో అంతవరకు ఏ విషయంలోనూ భార్య అభిప్రాయానికి విలువనివ్వకపోయినా కొడుకు పెళ్ళికి కట్నం లాంఛనాల విషయంలో మాత్రం తెలివిగా తను తెర వెనక్కి తప్పుకుని భార్య చేత మాట్లాడిస్తాడు రఘునాథరావు. కీలుబొమ్మలాగా భర్త సూచనల ననుసరించి ఆడపెళ్ళివారితో గీసి గీసి బేరమాడి, రెండులక్షల కట్నాన్ని మూడు లక్షలకి పెంచుతుంది పార్వతి. పెళ్ళికొచ్చిన ఆడపడుచు వదినగారిని నిలదీసి, ఆమె ఎంత పొరపాటు చేసిందో చెపుతుంది.

‘పెత్తనం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు తెలివితేటల్ని ఉపయోగించి కట్నం పెంచావు. దానివల్ల నువ్వు నీ సాటి మనిషైన కోడలికెంత ద్రోహం చేస్తున్నావో ఆలోచించావా? ఆ అమ్మాయికి రేపు నీ మీద కొంచెమైనా గౌరవం ఎలా వుంటుంది?’ అని అడిగినపుడు పార్వతి మనసు గాలితీసిన బుడగలా అయిపోతుంది. ఆడపడుచుతో సంభాషణలో ఎన్నో విషయాలు చర్చలోకి వచ్చి పార్వతిలో అంతర్మథనం మొదలవుతుంది.

‘ఇద్దరు ఆడవాళ్ళు ఒకే ఇంట్లో బతకాల్సి వచ్చినపుడు వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమ, అవగాహనకు బదులుగా పోటీ, ద్వేషం, అపార్థాలు, అనుమానాలు చోటు చేసుకోవడానికి కారణాలేమై వుంటా’యని తీవ్రంగా ఆలోచిస్తుంది పార్వతి.

తనూ, కోడలు ఎంతో స్నేహంగా ఒకరిపట్ల ఒకరు ప్రేమగా గౌరవంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలన్నా పునాది వ్యతిరేకంగా పడింది. ఇప్పటికే ఆ అమ్మాయి మనసులో ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. అదే అభిప్రాయం రేపు తన కొడుకు మనసులోకి పాకుతుందని గ్రహిస్తుంది.

చివరికి పెళ్ళికూతురు మేనమామ కట్నంలో ఒక లక్ష తక్కువైందనీ, పెళ్ళయిన నెల్లాళ్ళకు సర్దుతామనీ బతిమాలడానికి వచ్చినపుడు ఆమె మనసు ఆ వచ్చిన అవకాశానికి ఎగిరి గంతేస్తుంది. భర్త హితబోధలన్నీ పెడచెవిన పెట్టి “అలాగే కానియ్యండి” అనేస్తుంది. పెళ్ళి ముందురోజు రెండులక్షలు కట్నం ఆడపెళ్ళివారు అందజేస్తే ఆ డబ్బు పళ్ళెంలో పెట్టి పెళ్ళికూతురికి కానుకగా ఇచ్చేస్తుంది. అత్తాకోడళ్ళ అనుబంధానికి పునాది వెయ్యవలసింది అత్తగారేననీ, అది సరిగా పడితేనే ఆపై నిర్మించే సౌధం పటిష్ఠంగా నిలబడే అవకాశం వుంటుందనీ సూచిస్తారు రచయిత్రి ఈ కథలో.

ప్రపంచీకరణ వల్ల వృత్తి రీత్యానో, వ్యాపార సంబంధంగానో కొత్త కొత్త దేశాలకు వెళ్ళే వ్యక్తులకు ధైర్యాన్నీ, భరోసానీ ఇచ్చే అంశాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ మొదటిది కావడం సహజం. ఏ బంధాలైనా పటిష్టం కావాలంటే అవి కాలపరీక్షకు తట్టుకు నిలబడాలి. తరాలుగా కాకపోయినా కొన్ని దశాబ్దాలుగా ఒకేచోట నివసించే అవకాశాలు లేనపుడు తల్లిదండ్రులు ఏర్పరచుకున్న స్నేహసంబంధాలు, బంధువులతో అనుబంధాలు వారి పిల్లల తరం వచ్చేసరికి పలచబడిపోతాయి. ప్రవహించే నీటిలో మొక్కలు పెరగనట్టే పరుగులు తీస్తున్న నేటితరం పటిష్టమైన మానవీయసంబంధాల కోసం ప్రయత్నించలేకపోతోంది.

అయితే సమాజంలో ఇటీవల వచ్చిన మార్పులన్నీ అవాంఛనీయమైనవే అనడానికి వీల్లేదు. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో మోసేవాడి మీదే అంతా భారం మోపేవారు. సోమరిపోతులకీ, భజనపరులకీ ఎక్కడో ఒకచోట జరుగుబాటు దొరికేది. వారి భారాన్ని అతి మంచివాళ్ళూ, మెతకవాళ్ళూ మోసేవారు. ఉమ్మడి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోవడం మొదలయ్యాక వ్యక్తులలో బాధ్యతారాహిత్యం కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. స్త్రీ విద్య, ఆర్థిక స్వాతంత్ర్యాల వల్ల సమాజంలో గొప్ప మార్పు వచ్చింది. ఆడపిల్లల తల్లిదండ్రుల జీవితాలు అనూహ్యమైన రీతిలో మెరుగయ్యాయి.

‘ఈ ముప్పై నలభై సంవత్సరాల కాలంలో మన కుటుంబాలలో వచ్చిన ముఖ్యమైన మార్పు తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య ఉన్న అనుబంధం అని చెప్పుకోవచ్చు. చిన్న కుటుంబాలుగా మారిన సందర్భంలో పిల్లలు తండ్రి దగ్గర పొందిన చనువు అందరి ఆలోచనల్ని మార్చింది. స్వేచ్ఛగా మాట్లాడటం – సంప్రదించటం – వాళ్ళ అభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించడం పిల్లలకి సహజమైపోయింది. ఈ మార్పు మధ్య తరగతి కుటుంబాలలో గొప్ప చైతన్యం తీసుకువచ్చింది..’ అంటారు జానకీబాల ‘రంగులవల’ కథలో.

విభిన్న కథాంశాలతో వైవిధ్యభరితంగా సాగిన ఈ కథలన్నిటా రచయిత్రి మానవీయ దృక్కోణం, మానవసంబంధాల పట్ల స్పష్టమైన అవగాహన ప్రదర్శితమై పాఠకులకి సంతృప్తి లభిస్తుంది. తను నిశితంగా పరిశీలించి చూసిన మధ్యతరగతి జీవితాల్లోని అన్యాయం, మూర్ఖత్వం, అస్తవ్యస్తతల పట్ల రచయిత్రి పడే వేదన ఈ కథలన్నిటిలో అంతర్లీనమై కనిపిస్తుంది. కథకి ఆమె సూచించే ముగింపు ఆమె విశ్లేషణా సామర్ధ్యాన్ని ప్రస్ఫుటం చేస్తుంది.

(‘శత వసంతాల తెలుగు కథకు మల్లెపూదండ’ తెలుగు కథానిక – మానవీయ సంబంధాలు జాతీయ సదస్సులో చేసిన పత్ర సమర్పణ, 21, 22 సెప్టెంబరు 2011)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here