ఇంద్రియ నిగ్రహానికి సద్గురువు సాయి చూపిన సాధనా మార్గం

0
8

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఇంద్రియ నిగ్రహానికి సద్గురువు సాయి చూపిన సాధనా మార్గం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ని[/dropcap]త్య జీవితంలో ఇంద్రియ నిగ్రహం ఎంతో అవసరం. ఇంద్రియ నిగ్రహం లేనివారి జీవితాలు అధోగతి పాలు కాక తప్పదని ఎన్నో శాస్త్రాలు హెచ్చరించాయి.

ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని రెండు రకాలుగా విభజించబడ్డాయి. వాటిలో మనస్సుకూడా ఒక ప్రధానమైన ఇంద్రియం. అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం. తనకు ఇష్టమైనదాని మీదకు పోవటం దాని సహజ లక్షణం. కష్టసాధ్యమైన పారమార్థిక విషయాల వైపు మనస్సు పోదు. అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్థికమైన విషయాల వైపు మళ్ళించటం కష్టసాధ్యమైన కార్యం. ఆ విధముగా మనస్సును మళ్ళించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు. కాబట్టి లౌకిక సుఖాన్ని కాదనుకుని పారమార్థిక సుఖానికై మానవుడు ప్రయత్నం చేయాలి అని పతంజలి యోగ సూత్రాలు తెలియజేస్తున్నాయి. ఇదే విషయాన్ని శ్రీ సాయి ఒక అద్భుతమైన లీల ద్వారా స్పష్టం చేసారు.

ఒకసారి ఇద్దరు ముస్లిం స్త్రీలు బురఖాలు ధరించి సాయి దర్శనానికి వచ్చారు. అందులో ఒక స్త్రీ బురఖా తొలగించి సాయి పాదాలకు నమస్కరించి తిరిగి బురఖా వేసుకుంది. బాబా ఎదురుగా కూర్చున్న నానా చందోర్కర్ ఆ స్త్రీ యొక్క సౌందర్యాన్ని చూసి ఒక్క క్షణం పాటు విచలితుడయ్యాడు. అప్పుడు సాయి నానా తలపై ఒక్క చరుపు చరిచి ఒక దివ్యమైన ఉపదేశం చేసారు.

“నానా, నువ్వు మానవుడివి కనుక నీ మనస్సు ఆ తల్లి సౌందర్యం చూడగానే చలించింది. ఇంద్రియాలు ఎప్పుడైతే బాహ్య సౌందర్యం వైపు పరిగెడతాయో అప్పుడు వాటిని స్వంతం చేసుకోవాలనే కోరిక జనిస్తుంది. తద్వారా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఇంద్రియ నిగ్రహం కోసం బాహ్య సౌందర్యం కాక అంతర్గత సౌందర్యం వైపు దృష్టి ప్రసరించాలి. బాహ్య సౌందర్యమే చూడాలనిపిస్తే అందమైన దేవాలయాలు, అందులో వున్న దైవం యొక్క అందమైన రూపాలను చూడడం అలవాటు  చేసుకోవాలి. అటువంటి సౌందర్యాన్ని సృష్టించిన దైవలీలలను అనుక్షణం మననం చేసుకుంటూ వుండాలి.”

ఇంద్రియనిగ్రహం లేకపోవడమే ఈ రోజు ఎన్నో అనర్థాలకు కారణం అని చెప్పక తప్పదు. మనిషి ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకోగలిగితే జీవితంలో ఉత్పన్నమయ్యే సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి. మోక్షాన్ని చేరుకునే క్రమంలో మన దృష్టిని గమ్యంపై కాక, గమనంపై కేంద్రీకరిస్తే ఇంద్రియాలను అదుపు చేయడం సాధ్యమౌతుంది. అప్పుడే అమ్మవారి కృపాకటాక్షం కనకధారగా మన ఇంటి ముందు వర్షిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here