“ఇందు, ఔర్ వో చిఠ్ఠీ” మరో ప్రేమ కథ

0
9

[dropcap]ప్రే[/dropcap]మ కథలు ఎన్నో రకాలుగా చెప్పబడ్డాయి. కొన్ని తిన్నగా, సూటిగా వుంటే, కొన్ని కవితాత్మకంగా అందంగా. మరికొన్ని సెంటిమెంటల్‌గా mushyగా. కొన్ని ప్రాక్టికల్‌గా. కొన్ని ప్రపంచానంతర ప్రపంచంలో విహరణగా. అయితే ఎలాంటి ప్రేమ కథలైనా ముందు ఆకర్షిస్తాయి. ఆ తర్వాతే నచ్చడమో, నచ్చకపోవడమో. ఎందుకు? ప్రతి మనిషి లోనూ అన్ని సెంటిమెంట్లతో పాటు ప్రేమ అనేది వుంటుంది. మోతాదు తేడాలతో. తెర మీదా, మనసులోపలా వున్న ఆ రెండూ పరస్పర ఆకర్షితాలు. వివేకం ఆనక పని చేస్తుంది. నిగ్గు తేలుస్తుంది. అది పూర్తిగా వేరే కథ.
పంజాబీలో అమృతా ప్రీతం అని కవి. జ్ఞానపీఠం వచ్చింది. ఇప్పుడామె లేదు. ఆమె కవిత్వంతో పాటు కథలూ, నవలలూ వ్రాసింది. ఆమె కథల్లో, నవలల్లో కూడా నిండుగా కవిత్వమే ఉంటుంది. ఆకాశం ఓ మధుపాత్రికనెత్తి వెన్నెల పానం చేయిస్తోంది అని చందమామను సూచిస్తుంది. ఇలాంటి వాక్యాలు వుంటాయి. ఇక చాలా కథలలో ప్రేమ ప్రధాన పాత్ర వహిస్తుంది. దాని తో పాటే సమాజంలో స్త్రీ స్థానం, ఆమె ఆలోచనలు, ఆమె బలాలు బలహీనతలూ అన్నీ ఉంటాయి. బహుశా ప్రేమను అన్ని రకాలుగా కథలల్లినవారు మరెవరూ లేరేమో అనిపిస్తుంది.
ఇప్పుడు నేను పరిచయం చేస్తున్న లఘు చిత్రం “Indu Aur woh chitthi” కూడా ఒక సెంటిమెంటల్ కథ. ఒక అయిదు నక్షత్రాల హోటెల్ లో ఇందు అనే అమ్మాయి వెళ్ళి రిసెప్షన్ లో తను కరణ్ అగ్నిహోత్రి ని కలవాలని వచ్చింది అని చెబుతుంది. ఆ రిసెప్షనిస్టు ఇంటర్కాంలో తెలియచేస్తాడు. జవాబు నాకే ఇందూ తెలీదు, నేను కలవను అని వస్తుంది. అదే మాట చెబుతాడు. మొహం వేలాడదీసుకుని ఇందు అక్కడే ఓ సోఫా లో కూలబడుతుంది. కాసేపటికి కరణ్ రిసెప్షన్ కు ఫోన్ చేసి ఆమెను పంపమంటాడు. వెయ్యి వోల్టుల వెలుగుతో వున్న ఆమె మోము.
చాలా ఔపచారికంగా ఆహ్వానిస్తాడు కరణ్. మధ్య మధ్యలో ఏవో ఫోన్ కాల్స్ వచ్చి లోపలి గదిలో కెళ్ళి మాట్లాడతాడు. బయట ఇందు జ్యూస్ తాగుతూ బిక్కు బిక్కు మంటూ కూర్చుని వుంటుంది. లోపల కరణ్ చాలా కటవుగా మాట్లాడతాడు. ఫోన్ పెట్టేసాక కూడా కటువుగా ఎవేవో అంటాడు. తర్వాత బయటకొచ్చి ఏమీ జరగనట్టు ఆమెతో మాట్లాడతాడు, చాలా పొడి పొడిగా. మళ్ళీ ఫోన్ వచ్చి లోపలికెళ్ళి మళ్ళీ అదే తంతు : కటువుగా మాట్లాడటం. ఫోన్ పెట్టేసాక కూడా బయట ఆమెకు వినబడేలాగా మరింత కటువుగా, అవమానకరంగా మాట్లాడతాడు. పది ఏళ్ళ తర్వాత వచ్చేస్తారు ఏ మొహం పెట్టుకునో, నేనిక్కడ సత్రం తెరిచి పెట్టుకో లేదు వగైరా. నెమ్మదిగా మనకు తెలుస్తుంది అతను ఓ సినీనటుడనీ. ఆమె అతని చిత్రాలు అవీ చూస్తుందనీ. ఇందు తన పర్స్ తెరిచి ఓ ఉత్తరం తీసి అక్కడ పెడామని అనుకునీ మళ్ళీ మనసు మార్చుకుని పర్స్ లో పెట్టేసుకుంటుంది. వెళ్ళబోతూ కరణ్ ని పిలిచి వెళ్తున్నానంటుంది. ఆమె తలుపు దగ్గరికి చేరిందో లేదో వెనకాల అతను ఏడుస్తున్న ధ్వని వినిపించి మరలా వెనక్కి వస్తుంది.


ఇద్దరూ బాల్కనీలో నిలబడి పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఆ నాటి బంగారు క్షణాలు. అయితే కరణ్ మొదట నైనా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనెలా ప్రపోస్ చేస్తాడో ఇలాంటివన్నీ ఇందు తో చెబుతుండే వాడు. కానీ ఆ బంధం తెగిపోయినట్టు ఉంది. ఇప్పుడు ఆమె వ్రాసిన ఉత్తరం తీసుకుని ఇందు కరణ్ దగ్గరకొచ్చింది. తను చేసిన తప్పులకు క్షమాపణలు అడుగుతున్న లేఖ. అది చదివి అంటాడు బహుశా This must be what closure feels like అని.
కాసేపు తర్వాత శలవు తీసుకుంటూ ఇందు అంటుంది : ఈసారి మనం గనక తప్పిపోతే ఒకరినొకరం వెతుక్కుందాం అని. ఆమె బయటికి వెళ్ళాక తల్లితో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు అంటాడు ఇందుని చేసుకుందామనుకుంటున్నాను, ఏమంటావ్ అని. బయట ఉన్న ఆమె అది వింటుంది. కథ సుఖాంతం.
సెంటిమెంటల్ అన్నాను కదా, చాలా లోపాలు ఆనక ఇబ్బంది పెడతాయి. పదేళ్ళ గాప్ ఎందుకు? అతను ఏదో డ్రగ్ స్కాండల్ లో ఇరుక్కున్నట్టు ఉంది గాని, అది ఈ పదేళ్ళ వ్యవధిని సమాధాన పరచదు. నైనా కూడా ఎందుకు అతనికి దూరమైంది, అతను తనని మరచిపోయేలా చేయడానికి అతని మిత్రుల ముందే అతన్ని తిట్టడం వగైరా చేసింది. అదంతా సినేమేటిక్ కాదా? ఆమెకైనా ఈ లేఖ వ్రాయడానికి ఇన్నేళ్ళా? ఇలాంటివి చాలా వున్నాయి. అయినా చిత్రం ఎందుకు నచ్చుతుందంటే ఇందులో చూపించిన ప్రేమ నమ్మించేలా వుంది. ఇక అతను డ్రగ్ స్కాండల్ లో ఇరుక్కున్నాక తల్లి కూడా అతనితో మాటలు మానెయ్యడం, అతను మరింత ఒంటరిగా ఫీలవడం ఇలాంటివి కొన్ని నమ్మబలుకుతాయి.
ఇలాంటి కథలు అమృతా ప్రీతం లాంటి వారెవరన్నా వ్రాస్తే మనం చదివి చాలా ఎంజాయ్ చేస్తాం. కానీ భావనా ప్రధానమైన, ఇలాంటి కథను తెర మీద చూపడం కొంత ట్రికీ నే. సంభాషణలు ఎక్కువ వుంటాయి. ఒకటి కథ చెప్పడానికి. రెండోది అతని మనోభావాలు తెలియజేయడానికి. సంభాషణలు ఎంత కవితాత్మకంగా, అందంగా ఉన్నాయో మిగతాదంతా కూడా అంతే అందంగా వుంది. కచ్చితంగా సినేమేటిక్ అనుభూతినిస్తుంది ఇది. మధ్య మధ్య ఆ మౌనాలు, ఇద్దరి నటనా, ఆమె మారుతున్న హావభావాలు, బాడీ లేంగ్వేజ్, తటపటాయిస్తూ వేస్తున్న అడుగులు అన్నీ. ఇందు గా శుభా రాజ్ పూత్ బాగా చేసింది. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కరణ్ గా చేసిన వైభవ్ తత్త్వవాది నటన. తన లోపలి ఘర్షణను బాధను చాలా చక్కగా వ్యక్త పరిచాడు. అతని స్వరం, ఆ మాడ్యులేషన్ గొప్పగా వున్నాయి. ఎక్కడా ఒక్క గ్రాం ఎక్కువ గాని తక్కువ గానీ వుండవు. దర్శకుడు ఋతురాజ్ ధల్‌గాడే ది. బాగుంది. ఇతని గురించి ఎక్కువ సమాచారం లేదు. కానీ మంచి చిత్రాలు ఆశించవచ్చు ఇతన్నుంచి. శుభాంకర్ సంగీతం రొమాంటిక్ మూడ్ కి తగ్గట్టుగా బాగుంది. అతను వ్రాసిన ఒక పాట కూడా వుంది ఇందులో. “క్యా పతా” అనే పాట సాహిత్యమూ బాగుంది, బాణీ బాగుంది, అభయ్ జోధ్పుర్కర్ కూడా దాన్ని బాగా పాడాడు. రమేష్ భోస్లే చాయాగ్రహణం కూడా బాగుంది.
ఈ చిత్రం యూట్యూబ్ లో వుంది. చూడండి.


https://youtu.be/9B8K8SK7tGU


https://youtu.be/vEvSzVYRqd8

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here