ఇంతకూ అదేమిటి?

0
10

[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘ఇంతకూ అదేమిటి?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]విత్వం – ఆనందమా, ఏడుపా?!
అర్థమై అఘోరిస్తే ఆనందమే,
లేదా, వొఠ్ఠి ఏడుపు పురాణమే!
***
కవిత్వం – తెలుపా నలుపా?!
అక్షరాలకు జాతి భేదం లేదు, తెల్సా?!
అందంగా అల్లితే, అది ఇంద్రధనుస్సే!
***
కవిత్వం – ఉప్పా, లేక కారమా?!
ఆడవాళ్ళు రాస్తే ఉప్పు, వారు లావణ్యులు!
మగవాళ్ళు రాస్తే కారం, వీరు పుంస్కారాలు!
***
కవిత్వం – వసంతమా, శిశిరమా?!
మాటల పూలు కూర్చగల్గితే వసంతమే!
ఎటు దటు జలజలా రాలితే, శిశిరమే!
***
కవిత్వం – నీ కోసమా, ఇతరులకా?!
నాతో ఆరంభమై, పరులను చేరేది!
ఇతరులు కాదంటే, తూణీరం మరలేది!
***
కవిత్వం – పానకమా, కషాయమా?!
పదుగురు చదివితే, తీపి పానకమే!
పదిలంగా దిండైతే, కటు కషాయమే!!
***
కవిత్వం – ప్రాసా, లేక భావమా?!
ప్రాస కోసం భావం బలైతే, ప్రమాదమే!
ప్రాస లేకున్నా, భావం బలమైతే, మోదమే!
***
కవిత్వం – ఛందస్సా, వ్యాకరణమా?!
ఛందస్సొక్కటే అయితే ప్లాస్టిక్ పూవే!
వ్యాకరణం మాత్రం అయితే, మరబొమ్మే!
***
కవిత్వం -గణ బధ్ధమా, స్వతంత్రమా?!
ఉడుపులు పట్టువైతే, కాదనే వారెవరూ?!
ఒడుపుగా చెప్తే, వచనమూ దైవం మెచ్చదూ!!
***
కవిత్వం – రసోల్లాసమా, విరసోత్కటమా?!
తొమ్మిదిలో ఒకటైతే, సరస రసమే!
ఆ మెట్టు దాటిందో, విరస సారసమే!
***
కవిత్వం – కల్పనలా, వాస్తవికతా?!
ఆకలి తీరితే, కల్పనా కౌముదీయమే!
కడుపు కాలితే, వాస్తవిక సూర్యమే!
***
కవిత్వం – కుడి ఇజమా, లెఫ్టిజమా?!
అతి మతంతో కొడితే, రైటిజమే!
మితి మంత్రమైతే, పుర్రచెయ్ వాటమే!
***
కవిత్వం – నీతిచిట్టాలా, ధర్మసూత్రాలా?!
రెమ్మ చాటు మల్లె తావైతే, సేగేది?!
ఆకు మాటు మావి తీపైతే, ఓగేది!?
***
కవిత్వం – కూటికా, గూటికా, గుడ్డకా?!
మూడూ ఉన్నవాడికి, అది బలవర్ధకం!
ఏదీ లేనివాడికి, నవ పథ నిర్దేశకం!
***
ఇంతకీ, దీని తత్త్వం ఏవిఁటీ?!
ఇంతకు ఇంత, అంతా కలిస్తేనే అది!
వంతకు, పాలపుంతకు, అన్నిటికీ అదే!
***
ఎగసే ఊహలకు ఓ పుష్పకం
అలసే మనసుకు ఓ సాంత్వనం
మనిషి నక్కున జేర్చే భావుక వనం!
***
ఏ పోతలో ఒదగని సౌందర్యం
ఏ కలనేతను మించిన సమ్మిశ్రం
ఏ కలమూ గిరి గీయని విస్తారం!
***
అక్షరం అమృతమై, ప్రాణం నిలిపేది!
అక్షరం ఆశీస్సై, బ్రతుకుల నడిపేది!
తపింప జేసి, ఓ చలనం తెప్పించేది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here