ఇంతేనా అనుబంధం

4
10

[dropcap]ఆ[/dropcap] రోజు ఉదయం ఎనిమిది గంటల వేళ. నేను పయనిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ ప్లాట్‌ఫామ్ పై మెల్లగా కుయ్యో-మొర్రో అంటూ ఆగుతోంది. నా బోగీలో జనాలు ఎవరి సామాను వారు తీసుకుని దిగే ప్రయత్నంలో ఉన్నారు. నేను కూడా ఇంక మన ట్రైన్ ముందుకు వెళ్ళదు అన్న ధీమా వల్ల సావకాశంగా నా ఒక్క సూటకేసు, హ్యాండు బేగు పట్టుకుని దిగే ప్రయత్నంలో నా ముందున్న వారిని అనుసరిస్తున్నాను. అప్పుడు పడింది నా దృష్టి, ఎదురు బర్త్ క్రింద ఉన్న రెండు సూట్‌ కేసుల పైన. వెను తిరిగి చూశాను వేరే ప్రయాణికులు ఎవరైనా ఊన్నారేమో అని. ఎవరూ లేరు. నేనే ఆఖరుగా దిగుతున్నది. ఆ కోచ్‌లో నాది ఆఖరి సీట్ అవటంతో నా ముందున్న వారి దృష్టి వాటి పై పడలేదులా ఉంది. బరువు సూట్ కేసులు కదా. వాటి యజమాని కూలీని పిలుచుకురావటానికి వెళ్లాడేమో! నేను కోచ్ నుంచి దిగేంత వరకు వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నా, రెండో ద్వారం నుంచి వచ్చి ఆ సూట్ కేసులు దించుకుంటారేమో అని. కానీ అలాంటిది ఏమీ జరగ లేదు. నేను దిగి నా తోటే ప్రయాణం చేసిన ఒక పెద్ద మనిషికి విషయం చెప్పాను.

“ఆఁ, ఎవరిదో అయి ఉంటుంది లేమ్మా. వారే చూసుకుంటారు లేమ్మా. రైల్వే వారిదేనేమో. మీకు ఎందుకమ్మా గొడవ?” అంటూ వెళిపోయాడు ఆ పెద్ద మనిషి. ఆయన మాట విని వెళ్ళిపోవటానికి నాలోని ఆదర్శ పౌరురాలు ఒప్పుకోలేదు. అసలే మన టివీల్లో రోజూ ప్రసారమయ్యే క్రైమ్ పెట్రోల్ ప్రభావమూ, మన చుట్టు ప్రక్కల ఎవారికి చెందని వస్తువులు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా పోలీసు రిపోర్ట్ చేయమంటారు కదా…. నేను ఆలస్యం చేయకుండా తిన్నగా సికింద్రాబాద్ స్టేషన్ మాస్టర్ ఆఫీస్ కి దారి తీశాను నా సామానుతోసహా. యాదృచ్ఛికంగా ఇంటి దగ్గర కూడా నాకోసం ఎదురు చూసేవారు ఎవరు లేనందు వల్ల నేను ఆ పని చేయ గలిగాను. ఆ సూట్కేసుల్లో నుంచి ఏం బైట పడతాయో అన్న కుతూహలం నాకు ఎక్కడ లేని ఓపిక తెచ్చి పెడుతోంది.

స్టేషన్ మాస్టారు నా వివరాలు నేను చెప్పిన వివరాలూ రాసుకుని, ఎవరివి కావని వదిలి పెట్టిన వస్తువుల్ని తనిఖీ చేసే బాంబు స్క్వాడ్‌ని పిలిచి నేను చెప్పిన కోచ్ దగ్గరకు పంపారు. అంతటితో భారతీయ పౌరురాలిగా నా కర్తవ్యం నెరవేరింది. ఆ ఆఫీసర్ కూడా ‘ఇంక మీరు వెళ్ల వఛ్ఛు’ అన్నారు. కానీ నాలోని కుతూహలం పెరిగి, ఇంటికి వెళ్ళ వల్సిన అవసరాన్ని అణచి వేసింది. ఒక పక్క ఆ సూట్ కేసుల్లో నుంచి నరికేసిన మనిషి మొండెం బయట పడుతుందేమో అన్న ఆలోచన రావటంతో భయం జుగుప్స కలిగి ఒళ్లు జలదరించింది. అయినా కూడా అసలు విషయం తెలుసుకోకుండా ఆ స్థలం వదలటానికి మనస్సు ఒప్పుకోలేదు. నాలోని కుతూహలం, భయాన్ని జుగుప్సని కూడా అతిక్రమించింది.

బాంబు స్క్వాడ్ వారు తమ పరికరాలతో సన్నిహితులై ఆ రెండు సూట్ కేసుల్ని తీసుకుని స్టేషన్‌కి దూరంగా జనసంచారము లేని ప్రదేశానికి వెళ్లిపోయారు. స్టేషన్ మాస్టారు నేను ఇంకా అక్కడే ఎందుకు ఉన్నానా అన్నట్లు చూశారు నావైపు.

“వాటినుంచి ఏం బయట పడ్తాయో తెలుసుకుఉందామని వేచి ఉన్నాను సర్.” చెప్పాను నేను. ఆయన ఒక నవ్వు నవ్వి తన ఆఫీసు రూమ్ లోనికి వెళ్లి పోయారు. ఆయనకు విషయం తెలియంగానే తనకి చెప్పమని చిన్న విన్నపం చేసుకుని కాఫీ టిఫిన్ స్టాల్ల్ వైపు నడిచాను. సమయం వృథా చేయకుండా దొరికిన చల్లారి చచ్చి పోయిన రెండు వడలు కాఫీ తెచ్చుకుని తినటం ప్రారంభించాను. పదిహేను నిమిషాలకు ఆఫీసులో ఫోను మోగింది. తాగుతున్న కాఫీ కూడా ఆపి చెవులు రెక్కించాను.

“ఆహ! అంతేనా! ఇదేదో విచిత్రంగా ఉందే! సరే ఆ రెండూ సామానుతో సహా ఇక్కడ తెచ్చి పడేయండి. తరువాత సంగతి చూద్దాం.” అని ఒక ఆదేశం జారీ చేసి, “ఇదిగో మీ పేరు ఏమన్నారు,ఆ రెండు సూట్ కేసుల్లో ఆడా-మగా దుస్తులు తప్పితే మరేం లేవుట.” అని ఇంత సేపు వేచి ఉన్నందుకో ,లేక నా బాధ్యత నేర్వేర్చుకునందుకో నా చెవిలో ఒక సూచన వేశారు, స్టేషన్ మాస్టారు.

చెప్పకూడదు కానీ నేను కొంత నిరాశ చెందాను. ఉట్టి దుస్తుల్తో నిండి ఉన్న సామాను అలా ట్రయిన్‍లో పెట్టి వదిలేయటానికి కారాణం ఊహించలేక పోతున్నాను. ఇంట్లో బట్టలు ఎక్కువ కూడుకుపోతే పేదవారికి పంచివేయొచ్చుకదా! ఇంత కష్టపడి రెల్వే స్టేషన్‌కి వచ్చి ట్రెన్ ఎక్కించి వదిలేయటం దేనికి? నేను అనుకున్న విధంగా వాటిలో నుంచి మనిషి మొండెం కానీ బాంబు కానీ బైట పడక పోవటంతో నిజం చెప్పొద్దూనేను నిరాశ చెందాను. ఇది ఎవరో కావాలని రెల్వే పోలీసుని ఆట పట్టించటానికి చేసిన పని లా కినిపిస్తునది. అప్పటి వరకు తెలీని నీరసం నాకు అప్పుడు తెలిసి వచ్చింది.

***

పై సంఘటన జరిగిన పది రోజులకి మా మేనత్త, తన కొడుకు మురళి దగ్గరకి వచ్చిందని తెలిసి బేగంపేట వెళ్లాను అత్తని కలవటానికి.

మొన్నటి వరకూ అంటే మా అత్తకు డభ్భయి అయిదేళ్ల వరకు భర్తతో కళకళలాడుతూ మసిలారు. ఈ మధ్యనే భర్త పోయాక అత్త పాపం దాదాపు తన అరవై ఏళ్ల సహచర్యం నుంచి ఒక్క సారిగా తన కొడుకూ-కోడలి దగ్గర ఉండటానికి రావల్సి వచ్చింది. జీవితంలో వచ్చిన ఈ మలుపు మనస్సు స్వీకరించక పోయినా, ఒక్కర్తీ ఉండటం అలవాటు లేనందున కొడుకు దగ్గరకు రాక తప్ప లేదు. మా అత్తా-మావకు ఇద్దరు కూతుళ్లు ఉన్నాకానీ వారు దూరప్రాంతాల్లో ఉన్నారు. మా మావకు ఎందుకు వచ్చిందో ఊహ కానీ, గత ఏడాది తన ఆస్తి పంచి పెట్టి ఒక వంతు మా అత్త పేరున రాశారు.

అత్తా-మావ గురించి ఆలోచిస్తూ ఆటో దిగి మురళి ఇంటి వేపు నడిచాను.

బేగంపేటలో ఒక పెద్ద ఫ్లాటుకు యజమాని మురళి. ముందర హాలులో ఎవరు లేరు. పక్క పడక గదిలోంచి మా అత్త స్వరం వినిపిస్తున్నది. దగ్గరకు వెళ్తే అభిమానంగా కౌగలించుకుని కన్నీళ్లతో పలకరించింది అత్త  “ బాగున్నవే ఆమ్మాయ్? నాది కూడా నీ లాగానే ఒంటరీ జీవితం అయిపోయిందే.” అంటూ.

“ఒంటరిదానివి కాదత్తా. మేమందరం లేమా నీకు?” అని ధైర్యం చెప్పాను. అప్పుడు చూసా – మావ వేపు బంధువు అనుకుంటా, ఎదురుగా కూర్చుని ఉన్నాడు ఆతడు. ఆయనతో మునుపు పరిచయం లేకపోయినా ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఆయన ఏమనుకున్నాడో ఏమో నేను కూర్చొన్న వెంటనే లేచి అత్తతో మళ్లీ కలుస్తానని చెప్పి వెళ్లిపోయాడు. “మీ మావయ్యకు పింతండ్రి కొడుకు. నువు ఎప్పుడూ కలవలేదు కదా. నన్ను వెంట పెట్టుకుని, మురళి ఫ్లైట్‌లో తీసుకు వచ్చాడు. అక్కడ రాయచూర్‌లో ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నంలో సామానంతా అందరికీ పంచేసినా కూడా ఇంకా నావి మీ మావ దుస్తులు బోలెడు ఉండి పోయినాయి. అవన్నీ రెండు సూట్‌ కేసుల్లో వేసి, అదిగో అతనికి ఇచ్చి, ట్రైన్‌లో తీసుకు రమన్నా. సరే అన్నాడు. కానీ ట్రెయిన్‌లో బర్త్ కింద పెట్టిన సూట్కేసుల్లోనుంచి బట్టలు అన్నీ దోచుకు పోయారుట. చాలా బాధ పడుతూ చెప్పాడు అతడు.”

“ఎప్పటికీ అయినా, అవన్నీ ఎవరో ఒకరికి ఇవ్వవల్సినవే. ఐనా అవి ఇలా ఎవరో దోచుకు పోవటం బాగోలేదు సువర్ణా. ఆ దుస్తులు మీ మావకి నాకూ చాలా ప్రియమైనవి. అందుకే అన్నీ పంచిపెట్టేసినా ఇవి వీలైనంత వరకు నా దగ్గరే ఉంచుకుందామని ఆశ పడ్డానే. ఏం చేస్తాం? మనం ఒకటి అనుకుంటే విధి మరోలా రాసి పెట్టింది. మీ మావ లేక పోయినా ఆయిన దుస్తుల్తో, వస్తువులుతో మోహం వదులుకో లేకపోయాను.” అంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంద అత్త.

నాకు ఒక్కసారి ట్రయిన్‌లో చూసిన ఆ రెండు సూట్ కేసులు; ఆ వెంటనే, ట్రయిన్‌ దిగాక ఆ విషయం చెప్పిన ఆ పెద్దమనిషి ముఖం కళ్ల ముందు నిల్చింది. అవును ఈయనే కదా, రెండు సూట్ కేసులు ఎవరివో ఏమిటో అని నేను అంటే, అదేం పట్టించుకోవద్దని నాకు సలహా ఇచ్చి వడి వడిగా వెళ్లిపోయారు.

ఆ విషయం గుర్తుకు వచ్చాక, అత్తతో మాట్లాడుతున్నంత సేపు కూడా, ఆ పెద్దాయన ఎందుకు అలా చేసి ఉంటారా ఆన్న ఆలోచన మనస్సుని వేధిస్తూనే ఉంది. కాసేపు కబుర్లు చెప్పి, నేను తిరిగి వెళ్లటానికి క్రిందకు దిగాను. ఆటో స్టాండ్ వేపు అడుగులు వేస్తున్న నా ముందు ఆ మనిషే వచ్చి నిలబడ్డాడు. నా కోసమే ఎదురుచూస్తూ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర కాచుకుని కూర్చొన్నారు అనుకుంటా. నేను ఏమీ అనకుండానే చెప్పటం మొదలెట్టాడు ఆయన, నాతో పాటు ముందుకి అడుగు వేస్తూ –

“మూడు గదుల ఫ్లాట్ అయినా కూడా నిండా బట్టల్తో ఉన్నసూట్ కేసులు ఎక్కడ పెట్టుకోను. అమ్మ చాదస్తంగా ఏవేవో దుస్తులు పెట్టి పాక్ చేసెసింది. అమ్మతో ఏం అనలేక పోయానురా. ఆ రెండు సూట్ కేసులు ఎక్కడైనా వదిలేసి రా” అని వేడుకున్నాడు. సరే అని ,ఆ రోజు అలా త్రేయన్ లో ఆ రెండు సూట్ కేసులు వదిలేసి వచ్చానండి. మీరు నా గురించి ఏమనుకుంటారో అని, ఇంత సేపు మీ కోసం కాచుకుని వచ్చి చెప్పాను. దొడ్డమ్మతో చెప్పకండి ఈ విషయం బాధ పడుతుంది పాపం.” చెప్పి నా వేపు చూశాడు ఆయన, నేను ఏమంటానో అని.

“అత్తయ్య మాట ఏమో కానీ నాకు చాలా బాధగా ఉంది, మీరూ మురళి కలిసి చేసిన పనికి. పాపం అత్త, కనీసం యాభై ఏళ్ల అనుబంధం ఆవిడకు వాటితో. ఇన్నాళ్లూ ఎంత భద్రంగా దాచుకుందో ఆ వస్తువుల్ని. అటువంటిది మీరు మురళి కలిసి, రెండో ఆలోచన లేకుండా ఎలా చేయగలిగారు ఇలాంటి పని. ఐనా అలా గాలికి వదిలేసి వచ్చేకాడికి అంతా కష్టపడి ట్రయిన్‌ ఎక్కించటం ఎందుకు వాటిని. అక్కడే రాయచూర్‌లో నడి రోడ్డు మీద వదిలేసి వస్తే పోయేదిగా. ఇలా నాలాంటి వారినీ, రైల్వే వారిని ఎందుకు కష్ట పెట్టటం?” అని గట్టిగానే మందలించాను.

“ఏమోనండి, నేను అంత ఆలోచించలేదండి. మురళి చెప్పినట్లు చేశాను.” అని నాకు సంజాయిషీ చెప్పుకుని వెళ్లి పోయాడు ఆయన.

నాకు మురళిపై ఎంత కోపం వచ్చిందంటే, అతను ఇంట్లో లేడు లేకపోతే, తిరిగి వాళ్లింటికి వెళ్లి మరీ అతన్ని గట్టిగా నిలతీద్దును- ‘ఏంరా అంత ఇంటిలో తల్లివీ రెండు పెట్టెలు ఉంచుకోవటానికి చోటు లేదా? ఆ రెండింటిలో అత్త చెరీ ఒక్క పదివేల రూపాయలు పెట్టి ఉంచీనా అలాగే వదిలేద్దువా, నిన్ను కనీ పెంచిన తల్లి యొక్క భావాలకి అనుబంధాలకి ఏ విలువ లేదా?’ అని.

భౌతిక పదార్థాలకే గాని మనసును తాకే సున్నితమైన భావాలకు ఏ విలువా లేదా? ఇన్ని రకాల ఆలోచనలు మనసులో మెదులుతుంటే, మా ఇంటికి వెళ్ళే ఆటో ఎక్కాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here