సంభాషణం: రచయిత అంబల్ల జనార్దన్ గారి అంతరంగ ఆవిష్కరణ

0
10

(సంచిక కోసం – రచయిత అంబల్ల జనార్దన్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.)

ముంబైలో ‘తెలుగు సాహితీసూరీడు’ శ్రీ అంబల్ల జనార్దన్..!!

[dropcap]మా[/dropcap]తృభాష మీద మమకారం వున్నవారు ఎవరైనా ఏ దేశమేగినా, ఏవృత్తిలో స్థిరపడినా, యే భాషతో తప్పనిసరి బంధాలు ఏర్పడినా తల్లిభాషను మాత్రం మరచిపోవడం జరగదు. తెలుగు రాష్ట్రాలకు ప్రక్కన ఉన్న ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలు దీనికి అతీతం కాదు!

నిజానికి, తెలుగుభాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు సాహిత్యాన్ని, సజీవం చేసే కృషిలో, స్వరాష్ట్రాలలో కంటే, ఇతర రాష్ట్రాలలో లేదా ఇతర దేశాలలో ఎక్కువ కృషి జరుగుతున్నదని చరిత్ర రుజువు చేస్తున్నది.

దీనికి చక్కని ఉదాహరణ (మన దేశానికి సంబంధించి) ముంబై (నాటి బొంబాయి) లో స్థిరపడి, తెలుగుభాష కోసం, తెలుగు సాహిత్యం కోసం అపారమైన కృషిచేసిన/చేస్తున్న, సాహిత్యకారుడు శ్రీ అంబల్ల జనార్దన్.

సంచిక పాఠకుల కోసం, ఆయన అందించిన ఆయన సాహిత్య ప్రస్థాన విశేషాల కోసం పదండి మరి.. ముందుకు..

~

1) జనార్దన్ గారు.. ‘సంచిక‘-అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం, నమస్కారం.

 నమస్కారం డాక్టర్ ప్రసాద్ గారూ!

2) మీ చదువు సంధ్యల గురించి, కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా?

మాది నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ మండలం, ధర్మోరా గ్రామం. నేను పుట్టకముందే మా తల్లిదండ్రులు, పొట్టచేత బట్టుకొని ముంబయి(అప్పటి బొంబాయి)కి తరలి వచ్చారు.

జనార్దన్ గారి జననీజనకులు

నేను, ముంబయి నడిబొడ్డులోని లోయర్ పరేల్ ప్రాంతంలో బట్టల మిల్లుల రణగొణుల మధ్య పెరిగాను. రెండవ తరగతిదాకా మునిసిపల్ పాఠశాలలో చదివిన నన్ను  మా తల్లిదండ్రులు, మా ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఉన్నత పాఠశాలలో, మూడవ తరగతిలో చేర్చారు. ఆ పాఠశాల అల్ప ఫీజు కూడా అప్పుడు మా కుటుంబానికి భారమైనా, నన్ను ఆ స్కూల్లో చేర్చడానికి కారణం, అక్కడ పదకొండవ తరగతి వరకు తెలుగు బోధించే సౌకర్యం ఉండడమే. ఉద్యోగం పొందడానికి అవసరమైన ఇంగ్లీషు మాధ్యమంలో మిగతా విషయాలు నేర్చుకొనే వీలుండడం కూడా మరో కారణం. దానికి నేను రోజూ, రెండు సబర్బన్ రైళ్ళు మారి స్కూలుకు పోవలసి వచ్చేది. అప్పుడు బొంబాయి మొత్తంలో పదకొండవ తరగతి వరకు తెలుగు బోధించే ఏకైక పాఠశాల ‘ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఉన్నత పాఠశాల’. ఆ పాఠశాల వేసిన పునాదిపైనే, నా విద్యా జీవిత భవనం నిటారుగా నిలబడింది.

చదువు స్థాయి కూడా మెరుగ్గా ఉండేది. అప్పుడు మాకు మూడవ, నాలుగవ తరగతిలో ఆంధ్రభూమి పూర్వ సంపాదకులు శ్రీ సి. కనకాంబర రాజు గారు తెలుగు నేర్పారు. నేను ఆ పాఠశాల చదువు పూర్తిచేసి యభైఐదేళ్లైనా, అప్పటి మా తెలుగు ఉపాధ్యాయులు, ఉభయ భాషా ప్రవీణ, తెలుగు, సంస్కృతంలో కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత శ్రీ ఓగేటి పరీక్షిత్ శర్మ గారు నేర్పిన పాఠాలు ఇప్పటికీ నా చెవుల్లో గుణ గుణ మంటున్నాయి.

నా పాఠశాల చదువు పూర్తైంతర్వాత, కాలేజి చదువుకు వెళ్లే ఆర్థిక స్తోమత మా కుటుంబానికి లేకపోయింది. మా అవ్వ (అమ్మ) అంబల్ల నర్సవ్వ ఇచ్చిన మనోధైర్యంతో, కొందరు సహృదయ మిత్రులు ఇచ్చిన అప్పు(రెండు వందల రూపాయలు) తో నా కాలేజీ చదువుకు శ్రీకారం చుట్టాను. ఇంటర్మీడియెట్ అయ్యేసరికి నాకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉద్యోగార్హత ఏర్పడడంతో నేను, చిన్న, చితక పనులు చేస్తూ, ఉదయం కాలేజీలో నా బీ.కాం. చదువు కొనసాగించాను. డిగ్రీ పూర్తి కాకుండానే నేను, నాకు పందొమ్మిదేళ్లపుడు వ్రాత, మౌఖిక పరీక్షలు పాసై, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ గా ఎంపికయ్యాను. అప్పటినుండి, మా కుటుంబ దశ తిరిగింది. ఉద్యోగం చేస్తూనే యం.కాం., ఎల్ ఎల్.బి. సి.ఎ.ఐ.ఐ.బి. పుర్తిచేసి ఉద్యోగంలో పదోన్నతులు పొందాను.

3) తెలుగు భాష మీద మీకు ఇంత పట్టు ఎలా దొరికింది? అసలు మీరచనా వ్యాసంగం, ఎప్పుడు, ఎలా ప్రారంభం అయింది?

తెలుగు భాష పట్ల నాకు ఇష్టం ఏర్పడడానికి ప్రేరణ, మా అమ్మ గారు. తనకు చదువు అస్సలు రాదు కాని, మన భాష అంటే ప్రాణం. నా చిన్నప్పటినుంచి, తెలుగు భాషన్నా, తెలుగు వారన్నా ఎంతో మక్కువ. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నా నాకు, తెలుగు పత్రికలు, తెలుగు పుస్తకాలు చదవడంపైనే ఆసక్తి ఎక్కువ. అలా ఇప్పటికీ మాతృభాషతో నా అనుబంధాన్ని కొనసాగిస్తున్నాను. నా చిన్నప్పుడు ఇరవైఐదు పైసల వారపత్రిక కూడా కొనే స్తోమత ఉండేది కాదు. మా చాల్లో(బిల్డింగ్‌లో) ఒకాయన ఆ వారపత్రిక తెప్పించి చదివేవారు. ప్రతి మూడు నాలుగు నెలలకోసారి అవి చెత్త పేపర్ల వాడికి తూకానికి అమ్మేవారు. నేను, నా ఇంకో మిత్రుడు వంగరి బాలయ్య కలిసి, ఆ పత్రికలు అదే తూకం ధరకు కొని చదివేవాళ్లం. అలా తక్కువ ఖర్చులో ఎక్కువ పత్రికలు చదివే వీలు కలిగేది. అలాగే అప్పుడు ‘యువ’, ‘జ్యోతి’ దీపావళి సంచికలు వచ్చేవి. ఏ మూడు రూపాయలో ఉండేవి. అవి కూడా మేము క్రమం తప్పకుండా కొని చదివే వాళ్లం. అలా తెలుగు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది.

స్కూల్లో ఉన్నప్పుడే పాటలు, గేయాలు రాసి పాడడం అలవాటుగా ఉండేది. అలాగే పాటలకు పారడీలు రాసి పాడడం కూడా చేసేవాణ్ణి. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో చురుకుగా పాల్గొనడంతో నా రచనా వ్యాసంగానికి అప్పుడే బీజం పడింది.

బొమ్మ వెనుక – ఆవిష్కరణ హైదరాబాద్

ఉద్యోగంలో చేరాక, పత్రికలు, పుస్తకాలు కొనడానికి కొంత డబ్బు కేటాయించి, నా తెలుగు పుస్తకాల పఠనం కొనసాగించాను. కొన్ని కుటుంబ బాధ్యతలు ఓ కొలిక్కి వచ్చాక, రచనలు, ముఖ్యంగా కథానికలు రాయాలనే సంకల్పం బలపడింది. అదృష్టవశాత్తు పాత్రికేయులు శ్రీ వై. ఆర్. గాంధీ గారిని ఓ సాహితీ సమావేశంలో కలుసుకున్నాను. వారు నడిపే ‘రచయితల జర్ననిస్టుల నికేతనం (రజని)’ లో సభ్యత్వం తీసుకొని, వారిచ్చిన అభ్యాసాలు పూర్తి చేసి, రచనలు చేయడంలోని మెళకువలు తెలుసుకున్నాను. ఆ తర్వాత శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారి పరిచయ భాగ్యం కలగడంతో వారు కూడా కొన్ని సూచనలు చేశారు. రచనలు చేయడం మొదలు పెట్టే ముందు, ప్రముఖ రచయితల పుస్తకాలను చదివి, వారి రచనా విధానాన్ని ఆకళింపు చేసుకోవాలన్నారు. అంతే కాదు, అప్పుడు, అంటే 1993 లో అందుబాటులో ఉన్న మంచి తెలుగు పుస్తకాల జాబితా కూడా ఇచ్చారు. దాదాపు మూడు వేల రూపాయలు వెచ్చించి ఆ పట్టికలో ఉన్న అన్ని పుస్తకాలూ కొని చదివాను. సర్వశ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీపాద, బుచ్చిబాబు, గోపీచంద్, ఉన్నవ అక్ష్మీనారాయణ, చలం, కొడవటిగంటి కుటుంబరావు, రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు, చాసో, జ్యేష్ట, మొదలగువారి సాహిత్యంతో పరిచయం చేసుకున్నాను. అలా నాకు తెలుగు భాషపై పట్టు వచ్చింది.

ఆ తర్వాత, నా నలభై మూడో ఏట, కథా రచనకు శ్రీకారం చుట్టాను. అదృష్టవశాత్తు నా కథలు, వివిధ పత్రికల్లో వెలుగు చూశాయి. నా రచనా వ్యాసంగ తొలిరోజుల్లో ప్రముఖ రచయితలు శ్రీ విహారి, శ్రీ చంద్ర శేఖర ఆజాద్ గార్లు నా కథల లిఖిత ప్రతులు చదివి, కొన్ని సూచనలు చేశారు. వారికి కృతజ్ఞతలు. వారి సూచనలు ఇప్పటికీ పాటిస్తూ, నా కథా రచన కొనసాగిస్తున్నాను.

బొంబాయి నానీలు ఆవిష్కరణ హైదరాబాద్

4) మీరు ఒక తెలుగు రాష్ట్రవాసి అయివుండి ముంబై మహానగరానికి వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోవడానికి గల నేపథ్యం వివరించండి.

నిజం చెప్పాలంటే, నేను తెలంగాణ మూలాలున్న ముంబయి వాసిని. మా తల్లిదండ్రుల పది మంది సంతానంలో నేనే మొదటి వాణ్ణి అవడం వల్ల, మా అమ్మగారు కేవలం ప్రసవానికి బొంబాయినుండి నిజామాబాద్ జిల్లాలోని ‘దొన్ కల్’ గ్రామానికి వెళ్లి, ప్రసవం అయ్యాక, నాకు మూడు నెలలు రాగానే తిరిగి బొంబాయి వచ్చారు. బీడీలు చుట్టడంతో మొదలు పెట్టిన మా నాన్న గారు, బట్టల మిల్లులో, బొంబాయిలోని ఇతర చోట్ల ఉద్యోగాలు చేసి, చివరికి బీడీలు చుట్టించి అమ్మే వ్యాపారంలో స్థిర పడ్డారు. అలా నా జీవితమంతా అంటే దాదాపు డెబ్బై రెండు సంవత్సరాలు ఇప్పటి ముంబయితో పెనవేసుకున్నాయి.

5) రచనా వ్యాసంగం మీరు మీరు ముంబై లో స్థిరపడ్డాక మొదలయిందా లేక అంతకు ముందే మొదలు పెట్టారా?

ఇందాక చెప్పినట్టుగా నేను పుట్టిన్నుంచి ముంబయిలో స్థిర పడడం వల్ల, ముంబయిలోనే రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టాను.

6) ముంబైలో తెలుగుభాషా వికాసానికి అక్కడి మన తెలుగు వాళ్ళు చేస్తున్న కృషి ఎలాంటిది? అందులో మీ పాత్ర ఏమిటీ?

తెలుగు భాషా వికాసానికి మన వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ముంబయిలోని అన్ని సంస్థలకు మకుటాయమానంగా ఉన్న ముంబయి ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా ద్వారా తెలుగు భాషా వికాసానికి ఇతోధిక కృషి జరుగుతోంది. సాహిత్య విభాగానికి ప్రత్యేకంగా ఒక ఉపాధ్యక్షుని ద్వారా సాహితీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను కూడా ఆ సంస్థ ఉపాధ్యక్షునిగా సాహిత్య గోష్ఠులు, కవి సమ్మేళనాలు నిర్వహించాను. 1995 లో పన్నెండు మంది రచయితలతో ముంబయిలో మూడు రోజుల్లో ఆరు సాహితీ సదస్సులు ఏర్పాటు చేశాను. వర్లీ, నాయగాం, ఐ. ఐ. టి. పొవై. అణుశక్తి నగర్, బేలాపూర్ నవీ ముంబయి, ముంబయి ఆంధ్ర మహాసభ, దాదర్‌లో ఏర్పాటు చేసిన ఆ సదస్సులు, ఇక్కడివారిలో తెలుగు సాహిత్యం పట్ల మక్కువను కలుగజేశాయి. శ్రీ కాళీపట్నం రామారావు, కవన శర్మ, వివిన మూర్తి, రచన శాయి, యర్రంశెట్టి శాయి, వేదగిరి రాంబాబు, వై. ఆర్. గాంధీ, పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, పొనుగోటి క్రిష్ణారెడ్డి, పొత్తూరి విజయలక్ష్మి మొదలగు వారు వారి ప్రసంగాలతో ముంబయి తెలుగువారిని అలరించారు. నేను ఆఫీసుకి పదిహేను రోజులు సెలవు పెట్టి, ఐదు రోజులకై ఒక మినీ వ్యాన్ మాట్లాడుకుని, జేబునుంచి ఇరవై వేల రూపాయలు వెచ్చించి, వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పించడమే కాక, ఎలిఫెంటా కేవ్స్, ముంబయి దర్శన్ చేయించాను. అలా రచయితలతో నా అనుబంధం బలపడింది.

పద్మశాలి మిత్ర – సన్మానం

‘ముంబయి తెలుగు సాహిత్య వేదిక’, ‘ముంబయి భారతి’ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ముంబయి/మహారాష్ట్ర లోని యువకులను ప్రోత్సహించి వారికి తెలుగులో రచనలు చేయడంలోని మెళకువలు నేర్పించడం, వారి పుస్తకాలకు ముందు మాట రాయడం, ముంబయిలోని పద్మశాలి మిత్ర మండలి సౌజన్యంతో సాహిత్య గోష్ఠులు నిర్వహించడం, ఇక్కడి రచయితలవే కాక, తెలుగు రాష్ట్రాల్లోని కవుల, రచయితల పుస్తకాల ఆవిష్కరణ, పరిచయ సభలు ఏర్పాటు చేస్తున్నాను.

7) ప్రాంతీయేతరులుగా అక్కడ మీరు భాషా పరంగా గానీ,ప్రాంతం పరంగా గాని ఏదైనా వివక్షతకు గురి అయ్యారా?

ఆ కోణంలో వివక్ష అస్సలు లేదు కదా, గౌరవం ఉంది. ముంబయిలోని ‘మరాఠీ సాహిత్య సంఘ్’ వారి డెబ్భై ఐదవ అమృత మహోత్సవాలలో ఒక తెలుగు రచయితగా నన్ను ఆహ్వానిస్తే ‘మరాఠీతో నా అనుబంధం’ గురించి పదిహేను నిమిషాలు మరాఠీలో ప్రసంగించాను. నా హిందీ పుస్తకావిష్కరణ ‘ముంబయి ప్రాంతీయ రాష్ట్రభాషా ప్రచార్ సభ’, ‘ జీవన్ సౌరభ్’ సంస్థల్లో జరిగింది. నా మరాఠీ కథల పుస్తకం, మారాఠీలో వంద పుస్తకాలకు పైగా రాసిన రచయిత్రి శ్రీమతి గిరిజా కీర్ ఆవిష్కరించారు.

8) ముంబై అనేటప్పటికీ, మళ్ళీ అక్కడ తెలుగు వాళ్ళు, రెండు తెలుగు రాష్ట్రాలనుండి, వివిధ ప్రాంతాలవారు వుండే అవకాశం వుంది. వీరి మధ్య ఎలాంటి వాతావరణం కొనసాగుతున్నది?

ముంబయిలో అలాంటి ప్రాంత భేదాలు లేవు. ఇక్కడ తెలుగు వారందరు ఒకటే.

అపూర్వ అవార్డు సభ

9) నవల, కథ, కవిత, వ్యాసం వంటి ప్రక్రియలలో మీరు ఏ ప్రక్రియను ఎక్కువగా ఇష్టపడతారు? ఎందుచేత?

పై అన్ని ప్రక్రియల్లో రచనలు చేసినా నా ఇష్టమైన ప్రక్రియ కథ. నా భావాలకు, ఆలోచనలకు నేను నమ్మే కొన్ని విలువలకు, సిద్ధాంతాలకు అక్షరరూపం ఇవ్వడానికి కథానికా మాధ్యమాన్ని ఎన్నుకున్నాను, ఎందుకంటే కథలు, సామాన్య పాఠకులకు కూడా అర్థమౌతాయి. వారు చదివే కథల పాత్రల్లో తమను, తాము చూసుకుంటారు. వాటితో మమేకమౌతారు. ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నా, నేను తెలుగులోనే రాయడానికి మొగ్గుచూపుతాను. మాతృభాషలోనే అభివ్యక్తి ప్రభావవంతంగా ఉంటుందని నా గట్టి నమ్మకం.

10) మన రచనల్లో మాండిలిక భాషా ప్రయోగం, ఎంతవరకూ అవసరం? ఎందుచేత?

ఒక రచనలో సహజత్వం ఉట్టి పడాలంటే, ఆయా పాత్రల మాండలికంలో సంభాషణలు ఉండాలి. కథనంలో మాత్రం శిష్ట వ్యవహారికం వాడితే, ఏ ప్రాంత పాఠకుడికైనా అర్థమౌతుంది. మొత్తం కథ మాండలికంలో ఐతే వేరే ప్రాంత పాఠకులకు అర్థం కాకపోయే అవకాశం ఉంది. మాండలికం అనువాదంలో ఇబ్బంది ఉంది.

బాపు రమణ గార్లతో

11) అనువాద ప్రక్రియల మీద మీ అభిప్రాయం ఏమిటీ? ఎందుచేత?

రచనల అనువాదాలు చాలా అవసరం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి వెళ్లాలి. ఐతేనే వారికి మన భాష సత్తా తెలుస్తుంది. ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదం ఐనట్టుగా తెలుగు నుంచి ఇతర భాషల్లోకి, ముఖ్యంగా ఆంగ్లంలోకి అనువదాలు అంతగా జరుగలేదు. అది జరగాలి.

బొంబాయి కథలు ఆవిష్కరణ – హైదరాబాద్
బొంబాయి కథలు ఆవిష్కరణ – బొంబాయి

12) మీ రచనల గురించి వివరించండి.

       1.”బొంబాయి కథలు” కథానికా సంపుటి – 1998,

  1. “బొంబాయి నానీలు “కవితా సంపుటి – 2001,
  2. “అంబల్ల జనార్దన్ కథలు” కథానికా సంపుటి – 2004,
  3. “ముంబయి మువ్వలు” కవితా సంపుటి – 2007,
  4. “చిత్ ఆణి పట్” సొంత 26 తెలుగు కథల, మరాఠీ అనువాద సంపుటి – 2008,
  5. ” బొమ్మ వెనుక – మరికొన్న్జి కథలు” కథానికా సంపుటి -2009,
  6. “లివ్ లైఫ్ కింగ్ సైజ్” సొంత 31 తెలుగు కథానికల, ఇంగ్లీషు అనువాద సంపుటి-2010
  7. “ముంబయి (చాట్) భేల్” కవితా సంపుటి-2010
  8. “వ్యాస గుచ్ఛం”వ్యాస సంపుటి-2010
  9. “జిబ్నారా సత్యతా” సొంత 21 తెలుగు కథానికల ఒడియా అనువాద సంపుటి-2012
  10. “మహారాష్ట్రలో తెలుగువారు” లఘు గ్రంథం. 4 వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆం.ప్ర.ప్రభుత్వం ద్వారా ప్రచురితం.-2012
  11. “ముంబయికీ కహానియా” సొంత 32 తెలుగు కథానికల హిందీ అనువాద సంపుటి-2013
  12. “మలుపులు – అంబల్ల జనార్దన్ కథలు” కథానికా సంపుటి – 2015.
  13. “మనోల్ల ముంబయి కతలు” 55 కథల కథానికా సంపుటి – 2017.
  14. “ముంబయి చూపుతో… తెలుగు కథానికలు 46 కథల సంపుటి – 2019
  15. “ముంబయి తీర తరంగాలు” 45 ఖండికల కవితా సంపుటి 2021
  16. “ముంబయినీ ఛత్రఛాయా మా” గుజరాతీ కథా సంపుటి ముద్రణలో – 2022

13) ఇతర భాషా ప్రియుల కోసం, మీ రచనలు ఏమైనా అనువదింప జేసారా? అయితే అది ఎలా సాధ్యం అయింది?

నా కథలు చదివిన కొందరు వాటిని అనువాదం చేయడానికి ముందుకు వచ్చారు. అలా నా కథలు మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, ఒడియా, గుజరాతీ భాషల్లోకి అనువాదమైతే వాటిని నేను స్వఖర్చుతో సంపుటాలుగా ప్రచురించాను. వాటికి మంచి స్పందన లభించింది.

14) ముంబై మహానగరంలో ని, తెలుగు పాఠకుల కోసం, నడుస్తున్న తెలుగు పత్రికలు గురించి, వాటి భాషా సేవ గురించి చెప్పండి.

‘ఆంధ్ర పత్రిక’ ముంబయిలో పురుడు పోసుకున్న సంగతి చాలా మందికి తెలుసు. ఆ తర్వాత, నేడు అనే దినపత్రిక వచ్చి కొన్ని నెలల్లో ఆగిపోయింది. ముంబయి వన్ పక్ష పత్రిక కూడా కొంతకాలం నడిచి, పాఠకుల ఆదరణ లేక ఆగిపోయింది. ఈనాడు దిన పత్రిక ముంబయి ఎడిషన్ 2002 లో మొదలై 2020 లో కోవిడ్ మహమ్మారి లాక్ డౌన్ తో ఆగిపోయింది. ప్రస్తుతం కేవలం సాక్షి దిన పత్రిక మహారాష్ట్ర ఎడిషన్ వస్తోంది.

అహ్మదాబాదులో పుస్తకావిష్కరణ

15) నేడు విరివిగా మన ముందుకు వస్తున్న అంతర్జాల పత్రికలపై మీ అభిప్రాయం చెప్పండి. ఆ పత్రికలు మీకు ఎంతవరకు ఉపయోగ పడుతున్నాయి ?

దృశ్య మాధ్యమం ఏలుతున్న నేటి లోకంలో పత్రికలకు పాఠకుల ఆదరణ కరువైంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వార, మాస పత్రికలు మూతబడ్దాయి. ఈ సందర్భంలో అంతర్జాల పత్రికలే నిజమైన తెలుగు పాఠకులకు సాంత్వన ఇస్తున్నాయి. ఇంతకు ముందు అంతర్జాల పత్రికలకు రచనలు పంపనివారు, గత్యంతరం లేక అంతర్జాల పత్రికలను ఆశ్రయిస్తున్నారు. నా మట్టుకు నేను అచ్చు పత్రికలవైపే మొగ్గు చూపుతాను. మొబైల్‌లో, కంప్యూటర్ సిస్టంలో చాలా సేపు చదవలేను. రెండు మూడు అంతర్జాల పత్రికలు మాత్రం చదువుతున్నాను.

శ్రీ బి.ఎస్. రాములు, శ్రీ అంపశయ్య నవీన్‌లతో

16) అష్టావధాన ప్రక్రియపై మీ స్పందన. ముంబై నగరంలో ఎప్పుడైనా అవధాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారా?

నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ అవధానం. కొన్ని అవధానాల్లో పృచ్ఛకుడిగా పాల్గొన్నాను. ముంబయిలో ఒక సారి శతావధానం, ఒకసారి ద్విగుణ అష్టావధానం, ఎన్నో సార్లు అష్టావధానాలు జరిగాయి. డాక్టర్ మేడసాని మోహన్, శ్రీ గరికపాటి నరసింహారావు, శ్రీ శ్యామలానంద ప్రసాద్ గార్లు ముంబయిలో అవధానాలు చేశారు. గత ఐదారు సంవత్సరాలుగా ముంబయిలో అవధానాలు ఏర్పాటు చేయలేదు.

వెంకయ్య నాయుడు గారితో

17) అక్కడే పుట్టి, అక్కడే పెరుగుతున్న తెలుగు పిల్లలపై, తెలుగు భాషా ప్రభావం ఎలావుంది? ఎందుచేత?

ఇక్కడ పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలకు తెలుగు పట్ల అంత మమకారం లేదు. అసలు చాలా మంది తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పాలని లేదు. కొందరింట్లో మాత్రం తమ తల్లిదండ్రుల ప్రమేయంవల్ల పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు తప్ప, వారికి తెలుగు చదవడం, రాయడం రాదు.

తెలంగాణ రాష్ట్ర కవి సమ్మేళనం

18) ముంబై మహానగరంలో, తెలుగు పాఠశాలలు ఉన్నాయా? అక్కడ తెలుగు భాషా భోదన మీకు తృప్తికరంగా అనిపిస్తున్నదా?

1932 లో మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాల ముంబయిలో నెలకొల్పడానికి మన వాళ్లు చాలా కృషి చేశారు. ఆ తర్వాత ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో యాభై ఆరు ప్రభుత్వ పాఠశాలలు ఏడవ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో బోధన చేయసాగాయి. ప్రస్తుతం విద్యార్థులు కరువై అవి చాలా వరకు మూత పడ్దాయి. కూలీ పని చేసేవాళ్లు కూడా తమ పిల్లలను ఇంగ్లీషు మాధ్యమం పాఠశాలలకు పంపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు స్థాయి అంతంత మాత్రమే. కేవలం నేను చదివిన ఆంధ్ర ఏడ్యుకేషన్ వారి ఉన్నత పాఠశాలలో తెలుగు బోధన సంతృప్తికరంగా ఉంది. గత ఇరవై రెండు సంవత్సరాలుగా నేను రాసిన కొన్ని కథలు విడతల వారీగా ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండవ తరగతులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

కారా.. మాష్టారితో

19) అక్కడి తెలుగు పిల్లలు మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తారా? లేక ప్రాంతీయ భాషకు ప్రాధాన్యతనిస్తారా? ఎందుచేత?

ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగుపై అంత మక్కువ లేదు. అంతకంటే ఎక్కువ తల్లిదండ్రులకే లేదనడం సబబు. ఏ నా లాంటి కొందరు తప్ప, తమ పిల్లలకు తెలుగు చదవడం రాయడం నేర్పరు. ఇంటి బయట తెలుగు మాట్లాడే అవకాశాలు లేనందున, మన మాతృభాష ప్రాముఖ్యత ఇక్కడి తెలుగు పిల్లలకు తెలియదు.

20) మీ సన్మానాలు, అవార్డుల గురించి వివరించండి.

పురస్కారాలు / సన్మానాలు : 

  • విశాల సాహితీ పురస్కారం -2001,
  • “ముంబయి తెలుగు రత్న” బిరుదు – 2005
  • “కవి రత్న పురస్కార్” – నవచింతన్ సంస్థ, ముంబయి. –
  • మానస ఆర్ట్స్ థియేటర్స్ హైద్రాబాద్ వారి ఉగాది పురస్కారం – 2009.
  • ఆచార్య ఆత్రేయ సాహితీ పురస్కారం –ఇందూరుభారతి- జిల్లా రచయితల సమాఖ్య, నిజామాబాద్. –
  • గుత్తి నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, జోళదరాశి, బళ్ళారి జిల్లా –
  • ముంబయి మరాఠీ సాహిత్య సంఘ్, ముంబయి వారి అమృతోత్సవ సందర్భంగా 2010 లో సన్మానం.
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా, సృజనాత్మక సాహిత్యానికి కీర్తి పురస్కారం -2011
  • 29 డిసెంబర్, 2012న, 4 వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికపై “మహారాష్ట్ర లో తెలుగువారు” లఘుగ్రంథానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి గౌ.సాకె శైలజానాథ్, అధికార భాషా సంఘ అధ్యక్షులు గౌ.మండలి బుధ్ధప్రసాద్ గారిచే తిరుపతిలో సన్మానం.
  • ఓం పద్మశాలి సేవా సంఘం ద్వారా సాహిత్యరంగంలోని కృషికి నవరత్న పురస్కారం – ఫిబ్రవరి
  • గోల్డెన్ స్టార్ యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారి ఉగాది విశిష్ట పురస్కారం మరియు ” ముంబయి కథా కెరటం” బిరుదు, జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత, పద్మభూషణ్ సి. నారాయణ రెడ్డి గారి కరకమలాల ద్వారా ప్రదానం. – ఏప్రిల్, 2013.
  • సాహితీ గౌతమీ-కరీంనగర్ వారిచే “బొమ్మ వెనుక” కథా సంపుటికి గాను శ్రీ గండ్ర హన్మంతరావు స్మారక సాహితీ పురస్కారం – జూన్
  • మహారాష్ట్ర తెలంగాణ తెలుగు మంచ్ మరియు మహారాష్ట్ర తెలుగు మంచ్ వారి “వారధి” కార్యక్రమంలో తెలుగు –మరాఠి సాహిత్యాల్లో కృషికి గాను సన్మానం- జులై, 2015
  • మహారాష్ట్ర మండళ్, హైద్రాబాద్ మరియు జ్ఞాన ప్రభోధిని సంస్థ, కోల్హాపూర్ ద్వారా “రాజర్షి శాహూ మహారాజ్ ఒక విప్లవం సృష్టించిన రాజు” మరాఠీ నుండి తెలుగు అనువాద గ్రంథం, తెలుగు భాషను సంస్కరించి, డీ.టీ.పీ. చేయించి, ప్రూఫులు దిద్ది, ప్రింట్ కాపీ తయారు చేయడంలో ఎనలేని కృషి చేసినందుకు గాను, రవీంద్ర భారతి, హైద్రాబాద్ లో 05-07-2015 న సన్మానం.
  • గుజరాతీ నుండి తెలుగులోకి అనువాదం చేసిన కొన్ని కథలు, కవితలు గుజరాత్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన “గుజరాతీ సాహిత్యం, ఒక విహంగ వీక్షణం” లో ప్రచురితం.“రాష్ట్రేతర తెలుగు సమాఖ్య” ద్వారా అక్టోబర్ 2016 లో జరిగిన ‘జాతీయ సాహిత్యోత్సవం’ లో ఆ గ్రంథావిష్కరణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంచే సన్మానం.
  • శ్రీ సోమనాథ కళాపీఠం, పాలకుర్తి వారిపందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్మారక స్వచ్చంద భాషాసేవ పురస్కారం, 8 జులై 2017 న పాలకుర్తిలో రాజ్యసభ సభ్యులు శ్రీ ఆనంద భాస్కర్ గారిచేతుల మీదుగా ప్రదానం.
  • ఆంధ్ర సంఘం పుణే వారిచే తెలుగు సాహిత్య పురస్కారం డా. మేడసాని కరకమలాల ద్వారా తేది 17-09-2017 న ప్రదానం.
  • గురజాడ ఫౌండేషన్ (యు.ఎస్. ఎ) వారి గురజాడ సాహితీ పురస్కారం – 2017
  • సిరి కల్చరల్ అసోసిఏషన్, హైద్రాబాద్ వారి ఉగాది ప్రతిభా పురస్కారం – 2018
  • బహుజన సాహిత్య అకాడెమీ వారి “సాహిత్య రత్న” పురస్కారం – 2018
  • క్రియేటివ్ ప్లానెట్, ముంబయి వారిచే “కొణకంచి జాతీయ సాహితీ పురస్కారం” – 2018
  • నాషనల్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ వారిచే గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం – 2019
  • మానస ఆర్ట్ థియేటర్స్ & త్యాగరాయ గాన సభ సంయుక్త ఆధ్వర్యంలో ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్మారక పురస్కారం -2019
  • కథా రచన విభాగంలో ఇందూరు అపురూప అవార్డ్-2019 – జనవరి
  • “మనోల్ల ముంబయి కథలు” సంపుటికి రాజా వాసిరెడ్ది ఫౌండేషన్ వారి సాహిత్య, కళా, సేవా రంగాల జాతీయ పురస్కారం –
  • కొన్ని కథలు/కవితలకు వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన పోటీల్లో బహుమతులు లభించాయి.
  • “అంబల్ల జనార్దన్ కథలు – సవిమర్శక పరిశీలన” అనే అంశం పై పరిశోధన చేసిన శ్రీ జి. ఆంజనేయులు గారికి, యూనివర్సిటీ ఆఫ్ హైద్రాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) చే యం. ఫిల్. పట్టా ప్రదానం. – 2010.

ధన్యవాదాలు జనార్దన్ గారు.

నమస్కారం డాక్టరు గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here