32. సంభాషణం – రచయిత శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అంతరంగ ఆవిష్కరణ

10
11

[సంచిక కోసం ప్రముఖ రచయిత, ఉపాధ్యాయుడు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

కథా ప్రేమికుడు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ..

[dropcap]ఇం[/dropcap]టర్మీడియట్ నుండి తెలుగు రచనా వ్యాసంగంలో తనదయిన ముద్ర వేసుకొని, ఒక బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తితో క్షణం కూడా ఉపిరి పీల్చుకోలేనంతగా పని ఒత్తిడిలో వున్నా, తెలుగు సాహిత్యానికి, సంబంధిత రచనా వ్యాసంగానికి ప్రాధాన్యతనిస్తూ కథలు రాస్తున్న సాహిత్య పిపాసి శ్రీ గోనుగుంట మురళీకృష్ణగారు.

తెలుగు-ఆంగ్లభాషల్లో ప్రావీణ్యం వున్నా, మాతృభాషకు ప్రాధాన్యతనీయడం నిజంగా ఆయన గొప్పతనమే! సంచిక పత్రికను అంచనాలకు మించి అభిమానించే శ్రీ మురళీకృష్ణ, తన సాహిత్య రచనా వ్యాసంగం గురించి మరిన్ని వివరాలు అందిస్తున్నారు. పదండి మరి ముందుకు.

~

నమస్కారం మురళీ కృష్ణగారు! ‘సంచిక’ అంతర్జాల మాసపత్రిక మీకు స్వాగతం పలుకుతోంది.

నమస్కారమండి! దినదిన ప్రవర్ధమానమవుతున్న ‘సంచిక’కు అభినందనలు మరియు ధన్యవాదాలు.

ప్ర: మీకు ‘సంచిక’ అంతర్జాల పత్రిక ఎలా పరిచయం అయింది?

జ: నేను మొదట్లో పత్రికలకు కథలు రాసేటప్పుడు పత్రికలో వచ్చిన అన్ని కథలను, శీర్షికలను చదువుతూ ఉండేవాడిని. అందరితో పాటు అప్పుడు కస్తూరి మురళీకృష్ణ గారి కథలు కూడా చదువుతూ ఉండేవాడిని. ఇవి చాలా బాగున్నాయే అనిపించి ఒకటీ రెండుసార్లు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాను. కథల గురించి నా అభిప్రాయం చెప్పాను. నా కథలు కూడా పత్రికలలో చూస్తూఉంటాను అని అయన కూడా చెప్పారు. ‘టోరీ’ అని ఆన్‌లైన్ రేడియోలో కస్తూరి మురళీకృష్ణగారు ‘సృజనస్వరం’ అని రచయితలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తూ ఉండేవారు. అప్పుడు నాతో కూడా ఆ ఇంటర్వ్యూ నిర్వహించారు. అది రచయితగా నాకు మొదటి ఇంటర్వ్యూ. ఎలా మాట్లాడాలో కూడా అప్పట్లో సరైన అవగాహన లేదు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ‘ఆయనకి అవకాశం ఇవ్వకుండా ఎక్కువగా నేనే మాట్లాడేశానే!’ అనే గిల్టీ ఫీలింగ్ కలిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి సారీ చెప్పాను. అయన  “ఫర్వాలేదు. రచయితలతో మాట్లాడించటానికే కదా ఆ కార్యక్రమం!” అని అన్నారు. తర్వాత కొన్నిరోజులకు అనుకుంటాను ‘సంచిక’ వెబ్ పత్రిక లింక్ ఒకటి ఫోన్‌లో పంపించారు. నేను ‘యద్భావం తద్భవతి’ అనే కథను పంపించాను. అదే ‘సంచిక’లో వచ్చిన నా మొదటి కథ. ఆ తర్వాత నేను బిజీగా ఉండటం వల్లనూ, టెక్నికల్ నాలెడ్జ్ సరిగా లేకపోవటం వల్లనూ, ‘సంచిక’కు పంపలేదు. కరోనా సమయంలో ప్రముఖమైన పత్రికలు అన్నీ ఆగిపోయాయి. ఆ సమయంలో ‘సంచిక’కు మళ్ళీ విరివిగా పంపటం మొదలుపెట్టాను.

ప్ర: చాలా పత్రికలు ఉండగా ‘సంచిక’ను మీ రచనావ్యాసంగం కోసం ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నారు? ‘సంచిక’పై మీ అభిప్రాయాన్ని విపులంగా చెబుతారా!

జ: ఇతర ఆన్‌లైన్ మ్యాగజైన్ లకు కూడా పంపేవాడిని. అలా ఓ ఇరవై కథల వరకూ వాటిలో వచ్చాయి. నా కథలతో పాటు ఇతర రచయితల కథలు కూడా చదివేవాడిని. అవి చూస్తుంటే ఏదో అసంతృప్తిగా అనిపించేది. ‘సంపాదకులు వారికి వచ్చిన కథలను చదవకుండానే తీసేసుకుంటారా! ఇలాంటి కథలను ఎందుకు తీసుకున్నారు?’ అనిపించేది. అదే సమయంలో ‘సంచిక’లో వచ్చిన కథలను చూస్తే సంపాదకులు వారికి వచ్చిన కథలు పరిశీలించి, బాగున్నవే ఎంపిక చేస్తున్నారు అని అర్థం అయింది. ఇలాంటి పత్రికకి పంపించాలి అనిపించింది. అలా పంపటం అలవాటు అయింది.

సంచికలో ఇప్పుడు చాలా వైవిధ్యభరితమైన శీర్షికలు నిర్వహిస్తున్నారు. కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్, ఇంటర్వ్యూలు, గళ్ళనుడికట్టు ఇంకా.. చాలా రకాల శీర్షికలు వస్తున్నాయి. మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఒకప్పుడు ఆంధ్రభూమి, నది వంటి పత్రికల విషయంలో కూడా ఇలాగే అనిపించేది.

ఓ సభలో ప్రసంగిస్తున్న గోనుగుంట మురళీకృష్ణగారు

ప్ర: మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ఎలా మొదలైంది? అసలు మీ మనసు రచనా వ్యాసంగం వైపు మళ్ళటానికి సహకరించిన అంశాలు ఏమిటి?

జ: అచ్చులో నా పేరు చూసుకున్న తొలికథ ‘కాగితపు పువ్వు’. ఇది నేను ఇంటర్‌మీడియట్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు, అంటే 1984లో కాలేజీ మ్యాగజైన్‌లో ప్రచురించారు. అసలు నాకు కథల మీద ఆసక్తి కలగటానికి కారణం మా అమ్మగారు. నా చిన్నతనంలో, అంటే ఇంకా బడిలో చేరకముందే పరమానందయ్య శిష్యుల కథలు, పంచతంత్ర కథలు, అక్బర్ బీర్బల్ కథలు మొదలైనవి చెప్పేవారు. కథ చెప్పకపోతే నిద్రపోనని మారాం చేసేవాడిని. నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు మా పాఠశాల హెడ్ మాస్టర్ గారు యెండూరి లక్ష్మీ కాంతారావు గారని, వాళ్ళ పిల్లల కోసం చందమామ పత్రిక ప్రతి నెలా తెప్పించేవారు. వాళ్ళ పెద్దబ్బాయి పేరు శ్రీనివాస్, నా క్లాస్‌మేట్. చిన్నబ్బాయి నా కన్నా ఒక క్లాస్ తక్కువ. ఇక్కడ ఆ మాస్టారి గురించి రెండు మాటలు చెప్పాలి. అయన పైకి ఎంత సింహంలాగా భయమేసేటట్లు కనిపిస్తారో, మనసు అంత మెత్తనిది. సాయంత్రం పూట మేం పిల్లలందరం వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంతలో ఏదో పనిమీద అటుగా వెళుతున్న ఆయన్ని చూడగానే భయంతో బిగుసుకుపోయి చేతులు కట్టుకుని నిలబడిపోయేవాళ్ళం. అయన నవ్వి “చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి. ఇది ఆడుకునే సమయం. హాయిగా ఆడుకోండి!” అని చెప్పి వెళ్ళిపోయేవారు.

శ్రీనివాస్, నేను కలసి చందమామలో కథలు అన్నీ చదువుకునేవాళ్ళం. కథల మీద నా ఆసక్తి గమనించి మా నాన్నగారు నాకు బాలమిత్ర తెచ్చి ఇచ్చేవారు. నా స్నేహితుడు, నేను ఇద్దరం ఒకరి పుస్తకాలు ఒకరు మార్చుకుని చదువుకునేవాళ్ళం. అలా ఏడవ తరగతికి వచ్చేదాకా ఇద్దరం చదువుకునే వాళ్ళం. ఆ తర్వాత ఆ మాస్టర్ గారికి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయారు. నేను గ్రంథాలయానికి వెళ్లి చదవటం అలవాటు చేసుకున్నాను. అలా కథల మీద ఆసక్తి కలిగింది. చిన్నచిన్న కథలు, కవితలు రాసేవాడిని. కానీ నాకు కథల పట్లే ఎక్కువ ప్రోత్సాహం లభించింది.

ప్ర: విద్యార్థి దశలో మీరు రచనలు చేస్తున్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల నుండీ, బడిలో ఉపాధ్యాయుల నుండీ ఎలాంటి స్పందన లభించేది? అప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉండేది?

జ: నా మొదటి కథ జూనియర్ ఇంటర్‌లో ఉన్నప్పుడు వచ్చిందని చెప్పాను కదా! ఆ తర్వాత సంవత్సరం మ్యాగ్‌జైన్ కోసం మళ్ళీ కథ రాసి ఇవ్వటానికి వెళ్లాను. సంపాదకుడిగా వ్యవహరిస్తున్న తెలుగు లెక్చరర్ గుర్తుపట్టి “నిరుడు కూడా రాశావు కదా!” అన్నారు. ఆమాట వినగానే చాలా సంతోషం వేసింది. అవునన్నాను. ఫ్రెండ్స్ గుర్తించటం వేరు, పెద్దలు గుర్తించటం వేరు కదా! అలా ఇంటర్ రెండు సంవత్సరాలు, బియస్సీ మూడు సంవత్సరాలు మొత్తం అయిదు సంవత్సరాలు వరసగా కాలేజీ మ్యాగజైన్‌లో మొదటి కథ నాదే వచ్చేది. అవి చదివి మా నాన్నగారు మార్కులు వేసేవారు. ఏ కథకీ నూటికి తొంభై మార్కులు తగ్గలేదు. ఇంకా ఏవేవో రాసి ఫ్రెండ్స్‌కి చదవమని ఇచ్చేవాడిని. అవి చదివి అభినందించేవారు.

కొన్ని కవితలు, చిన్నచిన్న కథలు రేడియోకి పంపేవాడిని. అప్పట్లో రేడియోలో యువవాణి, అభిరుచి అనే కార్యక్రమాలు ప్రసారమవుతూ ఉండేవి. వాటిలో నా రచనలు వచ్చేవి. పత్రికలకు పంపించాలనే ఆలోచనే ఉండేది కాదు. ఎలా పంపాలో కూడా తెలియదు. ప్రభుత్వోద్యోగం రాకముందు కొంతకాలం ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ప్రిన్సిపాల్ మేడం ఈ మాట విని “ఏముంది? రేడియోకి పంపినట్లే! అడ్రస్ కూడ పత్రికలోనే ఉంటుంది” అన్నారు. అయినా చాలాకాలం పంపలేదు. అశ్రద్ధగా ఊరుకున్నాను. పత్రికలో అచ్చయిన నా మొదటి కథ ‘మనసు బరువు’ 2005లో అనుకుంటాను, ఆంధ్రభూమి వీక్లీలో వచ్చింది. అప్పటినుంచీ క్రమక్రమంగా పత్రికలకు పంపటం అలవాటు అయింది.

ప్ర: చదువుకూ రచనా వ్యాసంగానికీ మీకు లంగరు ఎలా కుదిరింది? ఈ రెంటినీ సమన్వయపరచుకుని మీరు ఎలా ముందుకి సాగగలిగారు? ఎప్పుడైనా అవాంతరాలు ఎదురయ్యాయా? వాటిని ఎలా అధిగమించగలిగారు?

జ: నేను ఎక్కువగా చదువు మీదనే ధ్యాస పెట్టేవాడిని. యం.యస్.సి., బి.యి.డి. చేసాను. రచనలు అప్పుడప్పుడు మాత్రమే చేస్తూ ఉండేవాడిని. ముందు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని పట్టుదలగా ఉండేది. అప్పటిదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకునేవాడిని. రాయటం తక్కువైనా పుస్తకాలు మాత్రం ఎక్కువగా చదివేవాడిని. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా యం.ఏ. ఇంగ్లీష్ లిటరేచర్ చేసాను. నేను ఉద్యోగంలో స్థిరపడి, వివాహం చేసుకున్న తర్వాతే రచనా వ్యాసంగం మీద పూర్తి దృష్టి పెట్టాను. కాబట్టి అవాంతరాలు కలగటం, వాటిని అధిగమించటం అనేవి జరగలేదు.

శ్రీమతితో మురళీకృష్ణ

ప్ర: ఇప్పుడు మీ ఆసక్తి అంతా కథారచన మీద ఉంది. కథా ప్రక్రియను అంతగా ఇష్టపడటానికి ముఖ్య కారణం ఏమిటి?

జ: ఇప్పుడు కాదు, మొదటి నుంచీ నాకు కథలే ఎక్కువ ఇష్టం. చెప్పాను కదా చిన్నప్పుడు మా అమ్మగారు కథలు చెప్పేవారని, చందమామ పుస్తకాలు రెగ్యులర్‌గా చదివేవాడిని అని! కాలేజీ చదువుకి వచ్చిన తర్వాత కవితలు కూడా రాసేవాడిని. అయితే కవితలు రాసేవారు చాలామంది ఉన్నారు. కథారచయితలే తక్కువ. పత్రికలకు పంపటం అలవాటు అయిన తర్వాత కథ, కవిత రెండూ పంపేవాడిని. కథ వెంటనే వేసుకునేవారు. కవితలు ఎన్ని నెలలు అయినా వాటి ఆచూకీ తెలిసేదికాదు. దానితో కవితలు రాయటం పూర్తిగా తగ్గించేశాను. ఇప్పుడు అలవాటు కూడా తప్పిపోయింది.

ప్ర: కవిత్వంపై విముఖత ఏర్పడటానికి గల ముఖ్యకారణం ఏమిటి?

జ: కవిత్వం మీద విముఖత ఏమీ లేదండి. వచన కవితలు రాయకపోవటం గురించి ఇప్పుడు చెప్పాను కదా! కానీ పద్యాలు, కావ్యాలు రాయకపోవటానికి కారణం ఏమిటంటే, మా పెద్దన్నయ్య గోనుగుంట వీరబ్రహ్మశర్మగారు మంచి సాహితీవేత్త. చాలా కావ్యాలు రచించారు. అష్టావధానాలలో పృచ్ఛకుడిగా వ్యవహరించారు. మహాభారతం ఉద్యోగ పర్వం మీద పి.హెచ్.డి. చేశారు. కానీ ఆయనకు తెలుగులో ఆశించినంత ప్రోత్సాహం దొరకలేదు. బ్యాంక్ జాబ్ వచ్చింది. అందుకని “తెలుగు చదువుకుంటే ఉద్యోగం రావటం కష్టం. సైన్స్ గ్రూప్ తీసుకో!” అని చెప్పారు. అప్పట్లో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలి, ఎదురుతిరగకూడదు అనుకునేవాళ్ళం. అందువల్ల స్వంత ఇష్టాయిష్టాల గురించిన ఆలోచనే రాలేదు. నేనే కాదు మా ఇతర అన్నయ్యలు, అక్కలు కూడా అలాగే ఉండేవాళ్ళం. నేను ఇంటర్‌లో బై.పి.సి. గ్రూప్ తీసుకుని, ఇంటర్ నుంచీ యం.యస్సీ వరకూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. తెలుగు పదవ తరగతిలోనే ఆపేశాను. పద్యాలు రాయాలంటే ఛందస్సు, సంధులు, సమాసాలు, అలంకారాలు మొదలైనవి నేర్చుకుని ఉండాలి. అందువల్ల పద్యసాహిత్యం మీద కృషి చేసే అవకాశం రాలేదు. పద్యాలు రాయకపోయినా పద్యకావ్యాలు చదివి అర్థం చేసుకుంటూ ఉంటాను. అలా చాలా గ్రంథాలు చదివాను.

ప్ర: ప్రైవేట్‌పరం గానూ, ప్రభుత్వపరం గానూ ప్రస్తుతం అవార్డుల విషయంలో వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయం చెప్పండి.

జ: ఎలాంటి విమర్శలు వస్తున్నాయో మీరు చెప్పలేదు. కానీ నా అనుభవం ఒకటి చెబుతాను. గతంలో నాకు ప్రభుత్వం తరపున ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వచ్చింది. దానికోసం దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి కాబట్టి వారి నిబంధనల ప్రకారమే అప్లై చేశాను. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డ్ వచ్చింది. కానీ అవార్డ్ ఎలా వస్తుందో తెలిసిన తర్వాత మనసులో ఏదో అయిష్టం కలిగింది. ‘నాకు ఫలానా అర్హతలు ఉన్నాయి అవార్డ్ ఇవ్వండి అని అడగటం ఏమిటి? బఫే డిన్నర్‌లో ప్లేట్ పట్టుకుని నిలబడి అన్నం పెట్టండి అని అడిగినట్లు ఉంది. ప్రభుత్వమే గుర్తించి ఇస్తే ఆనందంగా ఉంటుంది’ అనుకున్నాను. ప్రైవేట్ సంస్థలు అయినా వాటంతట అవే గుర్తించాలి, అప్లై చేయాల్సిన అవసరం నాకు లేదు అనుకున్నాను. అప్పటినుంచీ అవార్డుల కోసం ఎదురుచూడటం మానేశాను.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం సందర్భంగా..

ప్రైవేటు సంస్థలు నాకు చాలా అవార్డులు ఇచ్చాయి. నాకు వచ్చిన అవార్డులన్నీ నేను ఎలాంటి ప్రయత్నమూ చేయకుండానే వచ్చాయి. అసలు ఆ సంస్థలతో నాకు పరిచయమే లేదు. “మీ రచనలు పత్రికలలో చూస్తున్నాం. మిమ్మల్ని ఫలానా అవార్డ్‌కి ఎంపిక చేశాము” అని ఫోన్ చేసేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాతే వారితో పరిచయం. కొంతమందైతే నా అభిప్రాయం చెప్పిన తర్వాత “అలా అడిగేవారికి అసలు ఇవ్వం. అర్హతలను బట్టే ఎంపిక చేస్తాం” అనేవారు.

నవ్యాంధ్ర రచయితల సంఘం వారు నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి వచ్చినప్పుడు..

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నిష్కామకర్మ (నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితం నాకు వదిలెయ్యి అని శ్రీకృష్ణుడు చెబుతాడు) గురించి నమ్ముతాను నేను. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. గుర్తింపు దానంతట అదే వస్తున్నది.

ప్ర: కథలకు, మీరు తీసుకునే వస్తువుకు ప్రత్యేకత ఏదైనా ఉందా! ప్రస్తుత సమాజానికి ఎలాంటి కథలు ఉండాలని మీరు భావిస్తున్నారు? ఎందుచేత?

జ: క్షమించాలి. ప్రత్యేకత అంటే నాకు అర్థం కాలేదు. నేను ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. అనేక మందిని చూశాను. వారి జీవన విధానాలను పరిశీలించాను. వాటి ప్రేరణతో మానవ సంబంధాలనే కథా వస్తువులుగా తీసుకున్నాను. ఊహల్లో విహరింపజేసేవి రాయటం నాకు ఇష్టం ఉండదు. నా కథలు చదివిన తోటి రచయితలు “మీ కథల్లో పాత్రలు ఏవీ గగనవిహారం చేయవు. నేలమీదే నడుస్తాయి” అని అంటూ ఉంటారు. ప్రస్తుత యువతరానికి కూడా అలాంటి కథలే అవసరం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఊహాలోకంలో విహరించేవారు వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే కాఠిన్యాన్ని భరించలేరు. చేదుగా ఉన్నా వాస్తవం లోనే జీవించాలి అని నేను అనుకుంటాను.

ప్ర: మీరు సైన్స్ చదువుకున్నారు. ఆంగ్లం బోధిస్తున్నారు. తెలుగులో రచనలు చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అయింది? వివరంగా చెప్పండి.

జ: ఇంతక్రితం చెప్పాను. అప్పట్లో తెలుగు చదువుకుంటే ఉద్యోగాలు రావటం కష్టం అనుకునేవారు. అందువల్ల సైన్స్ గ్రూప్ తీసుకున్నాను. సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను. ఒకవేళ దూరప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సివస్తే హిందీ ఉపయోగపడుతుంది అని పెద్దవాళ్ళు చెప్పేవారు. సైన్స్ కన్నా ముందు ఆంగ్లంలో ప్రోత్సాహం లభించింది. కనుక ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాను. అయితే మా కుటుంబంలో ఎప్పుడూ సాహిత్య వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. మా పెద్దన్నయ్య శర్మగారు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నా పద్యకవి. అలాగే ఇంకో అక్క హైమవతి అని, ఆమె సోషల్ టీచర్. కానీ ఆమె కూడా సాహితీవేత్త, మంచి వక్త. అలా బ్రతువుతెరువు కోసం వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్నా మా కుటుంబ సభ్యులు అందరూ సాహిత్యాభిమానులు. నాకు కూడా సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. రామాయణ భారత భాగవతాలు, దేవీ భాగవతం, అష్టాదశ పురాణాలు, మనుచరిత్ర, కళాపూర్ణోదయం వంటి ప్రబంధాలు ఇంకా ఎన్నో చదివాను. నా సేకరణలో ఎన్నో అపురూపమైన గ్రంథాలు ఉన్నాయి.

ప్ర: ఒక బాధ్యత గల ఉపాధ్యాయుడిగా వృత్తిపరంగా ఆంగ్లానికి ప్రాధాన్యత ఇస్తారా! ప్రవృత్తిపరంగా తెలుగుకి ప్రాధాన్యత ఇస్తారా! ఎందుచేత?

జ: నా దృష్టిలో రెండూ సమానమే! మొదటిది కడుపు నింపితే, రెండవది మనసు నింపుతుంది. కానీ విద్యార్థుల ధోరణి ఎలా ఉంటుంది అంటే ‘ఇది చదివితే మార్కులు వస్తాయా! పరీక్షల్లో పనికి వస్తుందా! రానప్పుడు చదవటం వల్ల ఉపయోగం ఏమిటి?’ ఇలా అనుకుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మార్కులే చూస్తారు గానీ నాలెడ్జ్ చూడరు. ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత తెలివిగలవాడు వారి దృష్టిలో! విద్యాసంస్థలు కూడా తల్లిదండ్రుల అభిమతానికే ప్రాముఖ్యత ఇస్తాయి. కనుక నేను ఆంగ్లాన్ని లోతుగా అధ్యయనం చేసినా, అది ఉపయోగించుకునేవారు తక్కువ. “నువ్వే చదివి ఆనందించవచ్చుగా!” అని మీరు అనవచ్చు. అలాంటి ఆనందం నాకు ఆంగ్లంలో కన్నా తెలుగులోనే ఎక్కువ కలుగుతుంది.

ప్ర: కథారచనలో మీకు ఇష్టమైన రచయిత్రి ఎవరు? రచయిత ఎవరు? ఎందుచేత?

జ: ఇష్టాయిష్టాలు అనేవి వయసుని బట్టి మారిపోతూ ఉంటాయి. నేను ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి పుస్తకాలు చదివేవాడిని. హైస్కూల్‌కి వచ్చిన తర్వాత వారపత్రికలలో కథలు, సీరియల్స్ చదివేవాడిని. కాలేజీ స్టూడెంట్‍గా ఉన్నప్పుడు యద్దనపూడి సులోచనారాణి రచనలు ఎక్కువ ఇష్టపడేవాడిని. ఎందుకంటే ఆమె రచనలు జీవితం పట్ల ప్రేమ, మమత కలిగిస్తూ ఉంటాయి. బ్రతికినన్నాళ్లు ఆనందంగా జీవించాలి అనిపించేటట్లు ఉంటాయి. ఇంకా వాసిరెడ్డి సీతాదేవి, సి. ఆనందారామం, మాలతీచందూర్ నవలలు కూడా ఇష్టపడేవాడిని. రచయితలలో యండమూరి వీరేంద్రనాథ్ రచనలు మా ఫ్రెండ్స్ అందరం పోటీలుపడి చదివేవాళ్ళం. అయన వైవిధ్యభరితమైన సబ్జెక్టులు తీసుకునేవారు. ఇంకా మల్లాది వెంకట కృష్ణమూర్తి, యర్రంశెట్టి శాయి, కొమ్మూరి వేణుగోపాలరావు రచనలు, అలాగే ముదిగొండ శివప్రసాద్ రచించిన చారిత్రక నవలలు కూడా ఇష్టపడేవాడిని. ఇప్పుడు అయిదు పదుల వయసు నిండిన ఈ సమయంలో నవలల మీద ఆసక్తి తగ్గిపోయింది. పురాణేతిహాసాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. వాటిలో లోతైన విషయాలు కథలుగా మలచటం ఇష్టమైన ప్రక్రియ.

ప్ర: అనువాద పక్రియ, దాని అవసరం గురించి కాస్త వివరంగా చెప్పండి.

జ: అనువాద ప్రక్రియ అనేది అవసరమే! లేకపోతే వాల్మీకి, వ్యాసుడు వంటి వారు సంస్కృతంలో రాసిన పురాణాలు ఇప్పుడు ఎలా చదవగలుగుతారు? సంస్కృతం వచ్చినవారు ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఇప్పుడేకాదు ఓ నాలుగైదు దశాబ్దాల క్రితం మాత్రం ఎంతమంది ఉన్నారు? అంతేకాదు, బెంగాలీ రచయితలు రవీంద్రనాథ్ టాగూర్, శరత్ వంటి వారి నవలలు ఇప్పుడు చదవగలిగేవాళ్ళమా! అవన్నీ తెలుగులోకి అనువదించటం వల్లనే ఆ ప్రాంత ప్రజల ఆచారవ్యవహారాలూ, వారి జీవన విధానాలు కూడా తెలుసుకోగలుగుతున్నాం. అయితే మక్కీకిమక్కీ అనువాదం కన్నా స్వేచ్ఛానువాదం చేస్తేనే ఎక్కువ ఆకట్టుకుంటుంది అని నా అభిప్రాయం.

ప్ర: కులాలవారీగా, మతాలవారీగా, ప్రాంతాలవారీగా రచయితలు విడిపోవటం సమంజసంగా ఉందా! మీ స్పందన వివరించండి.

జ: ఆ విషయం గురించి నాకు తెలియదండి. అలాంటివి నా అనుభవంలోకి రాలేదు. నేను అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగుతాను.

ప్ర: మీ రచనల గురించి చెప్పండి.

జ: సుమారు మూడు దశాబ్దాల సాహితీ ప్రస్థానం గురించి మూడు ముక్కల్లో చెప్పటం కష్టం. అలాగని వివరంగా చెప్పటానికి స్థలాభావం కూడా చూసుకోవాలిగా! క్లుప్తంగా చెప్పాలంటే సామాజిక సమస్యలను ప్రతిబింబించే కథలు, బాలసాహిత్యం, సినీసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు, పుస్తక పరిచయం వంటివి మొత్తం కలిపి సుమారు ఐదువందల వరకూ రాసిఉంటాను. పత్రికలకు పంపిన దాదాపు అన్ని రచనలను ప్రచురణకు తీసుకునేవారు. తిరిగివచ్చిన రచనలు అనేవి చాలా తక్కువ. పత్రికలో నా కథ రాగానే పాఠకులు చదివి ఫోన్ చేసి అభినందించేవారు. వారు అలా చెబుతోంటే చాలా ఆనందంగా అనిపించేది. ఒకసారి ఆంధ్రభూమి డైలీలో ‘పరుగు’ అనే కథ వచ్చింది. ఆ కథ గురించి ఉదయం నుంచీ రాత్రి దాకా నిర్విరామంగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎంతోమంది అభినందించారు. అలాంటి అనుభవాలు చాలా జరిగాయి.

నా కథలలో కొన్ని ఎంపిక చేసి ‘గురుదక్షిణ’, ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’, ‘కథాంజలి’ అనే పేర్లతో మూడు కథా సంపుటులుగా ప్రింట్ చేయించాను. పుస్తకాలు అయితే ప్రింట్ చేయించాను గానీ అవి మార్కెటింగ్ చేయటం ఎలాగో తెలియలేదు. దానితో చేతులు కాల్చుకున్నట్లు అయింది. మళ్ళీ ప్రింటింగ్ జోలికి వెళ్ళలేదు.

ప్ర: మీ అవార్డులు, సన్మానాల గురించి చెప్పండి.

జ: నా సాహితీ జీవితంలో ఎక్కువ ఆనందం కలిగించిన అవార్డ్ ‘స్పూర్తి పురస్కారం’. దానికి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేశారు. సాహిత్య రంగంలో నాకు ఇచ్చారు. ఆ పురస్కారం మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా అందుకున్నాను.

స్ఫూర్తి పురస్కారం అందుకున్నప్పుడు..

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్, గ్రంథాలయ గాంధీగా పేరుపొందిన వెలగా వెంకటప్పయ్య అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ అవార్డ్, ప్రజాశక్తి సాహితీ పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారం, సాహితీ విభూషణ్, గురుబ్రహ్మ అవార్డ్ ఇంకా కొన్ని వచ్చాయి. ‘సాహిత్యరత్న’ అని బిరుదు ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ఒక్కటే ప్రభుత్వం తరపున అందుకున్నాను. మిగిలినవి అన్నీ ప్రైవేట్ సంస్థలు ఇచ్చినవి. సన్మానాలు చాలా సందర్భాల్లో జరిగాయి. అవి నేను గుర్తుపెట్టుకోలేదు.

ప్ర: వర్ధమాన కథా రచయితలకు మీరిచ్చే సలహా ఏమిటి?

జ: సలహాలు, సందేశాలు ఇస్తే తీసుకునే పరిస్థితిలో ప్రస్తుత తరం లేదు. ‘మీ కన్నా మాకే ఎక్కువ తెలుసు’ అన్నట్లు ఉంటారు. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. చదవాలి, చదవాలి, చదవాలి, చదువుతూనే ఉండాలి. ఒక్కపేజీ స్వంతంగా రాయాలంటే వంద పుస్తకాలు చదవాలి. కనుక రాయటం కన్నా ఎక్కువగా చదువుతూ ఉండాలి. నా నమ్మకం అదే! నేను నమ్మినదే మీకు చెబుతున్నాను.

ధన్యవాదాలు మురళీకృష్ణగారు.

ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here