కథా, నవలా రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ

1
10

(ఫ్రఖ్యాత కథా, నవలా రచయిత పాణ్యం దత్తశర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ సంచిక పాఠకుల కోసం)

సంచిక టీమ్: నమస్కారం పాణ్యం దత్తశర్మ గారు.

దత్తశర్మ: నమస్కారం

~

ప్రశ్న1: ‘సాఫల్యం’ నవల సృజనకు బీజం ఏమిటి? ఎందుకని నవల రాయాలని అనిపించింది?

జ: ఒక అర్ధ శతాబ్దం అంటే, చరిత్రలో ఒక ఎవల్యూషన్‌కు కారణం అవుతుంటూంది. రెవల్యూషన్‍లన్నీ ఎవల్యూషన్‍లోని భాగాలే అని నా అభిప్రాయం. 50 సంవత్సరాల కాల పరిభ్రమణంలో సమాజంలో, వ్యక్తులలో, దృక్పథాల్లో, విద్యా విధానంలో, ప్రదేశాలలో – ఇలా బహుముఖంగా ‘మార్పు’ వచ్చింది. దాన్ని ఫిక్షన్‍గా మలిస్తే ఎలా ఉంటుందనే ఊహ వచ్చింది. అంత విస్తృత పరిధి ఉన్న ఇతివృత్తానికి, సహజంగానే అనేక విధాలైన పాత్రలు, సంఘటనలు, అనుషంగికంగా ఉంటాయి. దాన్ని చిత్రీకరించడానికి నవలే సరైన మీడియం అనిపించింది. అదే ‘సాఫల్యం’ సృజనకు బీజం.

ప్రశ్న2: మీరు కథలు రాశారు కానీ, నవల రాయలేదు.. ‘సాఫల్యం’ మీ తొలి నవల.. నవల రాయటానికి ఎలా ప్రణాళిక వేసుకున్నారు?

జ: నిజమే, నేను చాలా కథలు వ్రాశాను. ఇంచుమించు అన్నీ ప్రచురింపబడ్డాయి. కొన్నిటికి బహుమతులు, అవార్దులు, ఉత్తమ కథానికా పురస్కారాలు లభించాయి. ‘సాఫల్యం’ నా తొలి ప్రయత్నం. 1964లో ప్రారంభమై, 2017లో ముగుస్తుంది. పతంజలి అనే క్యారెక్టర్ నా మనసులో రూపుదిద్దుకుంది. అతని బాల్యం, విద్యాభ్యాసం, ప్రేమ, పెళ్ళి, వ్యవసాయ జీవితం, వ్యాపార జీవితం, ఉద్యోగ జీవితం, ఇలా విభజించుకున్నాను. అతని తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులు, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగంలో అతని జీవితంలో సహగాములందరినీ కూడగట్టాను.

ప్రతి దశలో protagonist ఎదుర్కున్న సంఘర్షణలు, అతని confessions, అతనికి ఇతరులిచ్చిన మార్గనిర్దేశనం, వీటిన్నిటి ఆధారంగా అతని క్యారెక్టర్‍ను అభివృద్ధి చేశాను. సహజంగా నాకు సంస్కృత, ఆంగ్ల, తెలుగు సాహిత్యాలలో కొంత పరిచయం ఉంది. సందర్భానుసారంగా, ఆయా చోట్ల మన వేదాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, ప్రబంధాలు, భగవద్గీతా, ఇంగ్లీషు సాహిత్యంలోని literary parallels, పద్యాలు, శ్లోకాలు, ఇవన్నీ కథా సంవిధానానికి ఆటంకం కలగనట్లుగా చొప్పించాను.

ఎక్కడా జీవితం పట్ల నకారాత్మక దృక్పథం ప్రదర్శించకుండా జాగ్రత్త పడ్డాను. పాత్రలలో శ్రామికులు, ఉద్యోగులు, పండితులు, అధికారులు, సామాన్య జనం అందరూ ఉన్నారు. ఎవరి పరిధిలో వారి లోని ప్రత్యేకతను, సుగుణశీలతను చూపాను. సంచిక సంపాదకులు తమ ముందుమాటలో చెప్పినట్లు “మానవ జీవితంలోని విభిన్నమైన పోరాటాలను, సందిగ్ధాలను, వైరుధ్యాలను, తాత్త్వికతను ప్రదర్శిస్తూ ఒక వ్యక్తి – శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలను – బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అత్యంత సరళంగా, హృద్యంగా అరుదైన గాఢతతో, నిజాయితీగా” రాసుకుంటూ వెళ్ళాను.

ప్రశ్న3: కథ రాయటానికి, నవల రాయటానికి తేడా ఏమిటి? రచయితగా మీరు ఏది రాసేందుకు ఇష్టపడతారు? కథనా? నవలనా? ఎందుకని?

జ: నా అభిప్రాయం, కథ రాయడం కష్టం. నవల రాయడం సులభం అని అనలేను కాని, దానికున్న vast canvass వల్ల రచయితకు నవలలో అవకాశం ఎక్కువ ఉంటుంది కథలో చెప్పదలచుకున్నది క్లుప్తంగా, సరళంగా, ప్రభావవంతంగా చెప్పాల్సి ఉంటుంది. దీనినే simple and effective అంటారు. నా మటుకు నేను కథలను సింగిల్ సిటింగ్‍లో రాస్తాను. ‘సాఫల్యం’ నవల పూర్తి చేయడానికి నాకు ఇంచుమించు ఆరు నెలలు పట్టింది. కథకున్న import వెంటనే తెలుస్తుంది. నవలకున్న import క్రమంగా విశదమవుతుంది. నవల కూడా కథే కదా! నిడివిని బట్టి కాకుండా, art and craft ను బట్టి చూస్తే, నవల కంటే కథని shrewd గా, brief గా, direct గా చెప్పాల్సి ఉంటుంది. సర్ ఫిలిప్ సిడ్నీ అనే ఆంగ్ల సాహిత్య విమర్శకుడన్నట్లు, “It calls forth children from play, and old men from the chimney corner”. నవలకున్న విస్తృత పరిధి వల్ల జీవితాన్ని సమగ్రంగా విశ్లేషించి, ఆవిష్కరించడానికి రచయితకు సౌకర్యంగా ఉంటుంది. “Novel unfolds life in an elaborate manner, representing it in toto” అంటారు అలివర్ గోల్డ్‌స్మిత్. ఆయన రాసిన ‘The Vicar of Wakefield’ నవలే, కందుకూరి వీరేశలింగం గారి ‘రాజశేఖర చరిత్రము’కు ప్రేరణ అంటారు. ఒక విధంగా నాపై కూడా, గోల్డ్‌స్మిత్ గారి ప్రభావం, విశ్వనాథ వారి ప్రభావం చాలా ఉంది. రచయితగా నేను రెండూ పండించటానికి ఇష్టపడతాను. కథ ప్రచురింపబడిన తరువాత మళ్ళీ ఏదైనా స్వీయ సంపుటంలోనో, కథా సంకలనంలోనో చోటు చేసుకుంటే తప్ప, దానికి ఒక శాశ్వతత్వం సిద్ధించదు. నవల సీరియల్‌గా ప్రచురింపబడుతున్నంత కాలం, పాఠకులు దానిని, నచ్చితే own చేసుకుంటారు. ప్రతి వారం దాని కోసం ఎదురు చూస్తారు. కాబట్టి నాకు రెండూ ఇష్టమే.

ప్రశ్న 4: ‘సాఫల్యం’ నవల ఇంతగా పాఠకులను ఆకర్షించేందుకు కారణం మీ ఉద్దేశంలో ఏమిటి?

జ: పాఠకులే ప్రతి వారం తమ కామెంట్ల ద్వారా దీనిని తెలియజేస్తుండేవారు. నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో పతంజలిని తమతో ఐడెంటిఫై చేసుకున్నారు. పతంజలి super human character కాదు. మామూలు మధ్య తరగతి వాడు. లేమిని అనుభవించినవాడు. కృషితో ఎదిగి ఉన్నత స్థానానికి వచ్చినవాడు. సమాజంలో పతంజలి లాంటి వాళ్ళే ఎక్కువ అనుకుంటాను. అందరూ ‘born with a silver spoon in mouth’ కాదు కదా! ప్రతి వ్యక్తి ఎదుగుదలకు అతని పేరెంట్స్, ఫ్రెండ్స్, టీచర్స్, కొలీగ్స్, ఇంకా తాత్కాలికంగా తారసపడే ఎందరో ఉంటారు. వాళ్ళందరూ అతన్ని ఏదో విధంగా ప్రభావితం చేస్తారు. పాఠకులు, ‘సాఫల్యం’ నవల చదువుతున్నప్పుడు, ఆయా మైనర్, మేజర్ పాత్రలు ఎక్కడో ఒక చోట, సరిగ్గా అలాంటివి కాకున్నా, వాటిని పోలిన వ్యక్తులు, తమకు కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట తటస్థించిన వైనాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు కొందరయితే నాకు ఫోన్ చేసి మరీ చెప్పేవారు. అలా ‘సాఫల్యం’ అందరి మనసులనూ చూరగొన్నది.

నవలలో కోట్ చేసిన పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, సేయింగ్స్ అన్నీ పాఠకులను బాగా educate చేసేవి వాటిని abstract గా చెబితే అంత ప్రభావం ఉండదు. వాటిని కథలో dexterous గా మమేకం చేయడం వల్ల, మన భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సంస్కారాన్ని అమితంగా తెలుగు పాఠకులు ఇష్టపడతారని, అలాంటి రచనలను విశేషంగా ఆదరిస్తారని, ‘సాఫల్యం’ నిరూపించింది. కస్తూరి వారన్నట్లు, పాఠకులు “పతంజలి జీవితానికి సమాంతరంగా తన జీవితాన్ని నిలిపి పోల్చుకుని, విశ్లేషించేట్టు చేస్తాయి”. అట్లే, ఆయన మాటల్లోనే, ‘మానవ సంబంధాలలోని ఆరోగ్యకరమైన అనుబంధాలు’ పాఠకులను అమితంగా ఆకర్షించాయి. అలాంటి అనుబంధాలలోనే కదా ఉత్తములైన వారు entangle అయి ఉండేది!

ప్రశ్న 5: ‘సాఫల్యం’ నవలలో పలు మరపురాని పాత్రలున్నాయి.. పాత్రల వ్యక్తిత్వ చిత్రీకరణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ: నేను పాత్రలను నా పరిశీలన ప్రకారం యథాతథంగానే చిత్రించాను. ‘స్వభావో దురతిక్రమః’ అని పరమాత్మ గీతలో ప్రవచించినట్లు, వారి వారి సహజ స్వభావాలనే చిత్రీకరించాను. అంతే కాని, ప్రత్యేకమైన attributes ను పాత్రలపై impose చేయలేదు. Negative approach ఉన్న పాత్రలను గ్లోరిఫై చేయలేదు. నా పాత్ర లందరూ ఇంచుమించు మంచివాళ్ళే. అందరూ నా నిజ జీవితంలో తారసిల్లిన వాళ్ళే. కానీ fiction కాబట్టి వారిని కథకు తగినట్టుగా మార్చుకున్నాను. మంచితనం, పరోపకారం, హాస్యప్రవృత్తి, సహజ బలహీనతలు – కులానికి, మతానికి, సోషల్ స్టేటస్‍కు అతీతమైనవని నా అభిప్రాయం. అదే విషయాన్ని నా పాత్రలలో ప్రతిబింబింప చేశాను. నా ఉద్దేశంలో, సమాజంలో మంచివారే సింహభాగం ఉన్నారు. “Let not evil bear the upper palm” అంటారు ఆంగ్ల కవిత్వానికి ఆది కవి అయిన Geoffrey Chaucer. ఆయన రాసిన ‘The Canterbury Tales’ ను మన కాశీ మజిలీ కథలతో పోల్చవచ్చు. Multiplicity of characters ను సృష్టించడం Chaucer ప్రత్యేకత. సమాజంలోని శ్రామిక వర్గాల నుంచి, ధనవంతులు, మతాధికారుల వరకు ఆయన పాత్రలలో ఉంటారు. నేను కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందాను.

‘సాఫల్యం’ నవలలో పాలేర్లు, లారీ డ్రైవర్లు, హోటల్ సర్వర్స్, కూరగాయలమ్ముకునేవాళ్ళు, తోటి ప్రయాణీకులు ఇలా చాలామంది ఉంటారు. నవలలో వారు వచ్చేది తాత్కాలికంగానైనా, వారు పాఠకులను బాగా ఆకర్షించారు.

పతంజలి నిమ్మకాయల బస్తాలు, వాళ్ళ ఊరివాళ్ళ ఉల్లిపాయల లోడుపై, మద్రాసుకు తీసుకెళుతుంటాడు. రాత్రి చాగలమర్రి దగ్గర ఒక చోట కారం దోశలు పోస్తుంటుంది ఒకామె ఒక రోడ్ సైడ్ హోటల్‍లో. డ్రైవర్ మస్తాన్ పతంజలికి ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్‌మేట్. వాడు ఆమెకు “కారం బాగా పూయమ్మేవ్, రోట్టు చేయగాకు, నూనె కొంచెం ఎక్కువ వెయ్యాల చూడు. మా సామి (పతంజలి) బాగుందనాల!” అంటూ చెబుతుంటే, ఆమె నవ్వుతూ ఇలా అంటుంది.

“తినే ఒక్క దోశకు ఎంత సదువు సదివితివిరా తురక నా బట్టా”.

అందులో అపేక్ష మాత్రమే ఉంది. దీనిని చదివిన వెంకటరెడ్డి అనే పాఠకుడు నాకు నంద్యాల నుంచి ఫోన్ చేసి, “సార్, అచ్చం, ఇట్లాగే మాట్లాడుకుంటాం మా జిల్లాలో. చూసినట్టు రాసినారే! చానా బాగుందప్పా” అని ప్రశంసించినాడు. నేను నా జీవితంలో రకరకాల వృత్తులలో, రకరకాల వ్యక్తులతో expose అయినాను, వారిని,  మ్యానరిజాన్ని, మాండలికాన్ని బాగా పరిశీలించాను. ఒక్క రాయలసీమే గాక, కోస్తాంధ్రా, తెలంగాణ ప్రాంతల్లో కూడా నేను నా జీవితాని గడిపాను. అన్ని చోట్లా హ్యాపీగా ఉన్నాను. ఆయా వ్యక్తులను, కొంత కల్పన అద్ది, పాఠకుల ముందుకు తెచ్చాను. క్రెడిట్ అంతా వారిదే.

ప్రశ్న 6: మీరు సృజించిన ఇన్ని పాత్రలలో ప్రధాన పాత్ర కాక మీకు బాగా నచ్చిన పాత్ర ఏమిటి?

జ: ఒకటి కాదు, చాలా పాత్రలున్నాయి. తోకోడు అనే మా జీతగాని పాత్ర. సుంకన్న అనే మరో జీతగాడు. వారు నాకు ప్రాణ స్నేహితులు. వారి పాత్రలను కొంత మార్చాను. వ్యవసాయంలో మెళకువలు నేర్పింది వారే. స్వచ్ఛమైన స్నేహం వారిది. తరువాత బాజిరెడ్డి పాత్ర నాకెంతో యిష్టం. అది పూర్తిగా కల్పితం. అట్లే మద్రాసులో పెంచలయ్య పాత్ర.

ఇక మార్కండేయ శాస్త్రి, పతంజలి తండ్రి పాత్ర. మా నాన్నగారికీ ఆయనకూ చాలా పోలికలున్నాయి కాని, ఆయన క్యారెక్టర్‍ను పూర్తిగా మార్చాను. రాధా సారు పాత్ర కూడా గొప్పదే. గుణ గ్రాహిత్యానికి, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి గొప్ప ఉదాహరణ ఆయన. మా గురువు గారు మహమ్మద్ ఆజాం, శంకరయ్య సారు కూడా నాకిష్టమైన పాత్రలే. కథకు తగ్గట్టు వారి పాత్రలలో చాలా మార్పులు చేశాను. కాబట్టి ఒక్క పాత్రను పేర్కొనడమంటే కష్టం. చివరికి మంగళగిరిలో హోటల్ సర్వర్ పాత్ర కూడా నాకిష్టమే. అలా కుదరదు, ఒక్క పాత్ర పేరు చెప్పమంతే పతంజలి బావ రామ్మూర్తి అంటాను. అది పూర్తిగా కల్పిత పాత్ర.

ప్రశ్న 7: నవల కథాకాలం దాదాపుగా ఆరేడు దశాబ్దాలు. నేపథ్యంలో కాలానికి సంబంధించి స్ఖాలిత్యాలు దొర్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏమైనా రిఫరెన్సులు వాడారా?

దీని కోసం, సంవత్సరాలను ఉటంకిస్తూ వెళ్లాను. 1964లో ప్రారంభమవుతుంది నవల. ఆయా కాలాల్లో టిఫిన్లు, సినిమాల టికెట్లు బస్, రైలు టికెట్లు, ఇతర విషయాల ధరలు నాకు గుర్తున్నంత మటుకు చెప్పాను. దీనికై ఏ విధమైన రిఫరెన్సులు వాడలేదు. రచయిత్రి, విమర్శకురాలు ప్రొఫెసర్ సిహెచ్. సుశీలమ్మ గారు (గుంటూరు) నేనెక్కడయినా దొరికిపోతానేమోనని చాలా జాగ్రత్తగా probe చేసేవారట. ‘జ్వాలాదీప రహస్యం’ అనే సినిమాకు వెళతారు పతంజలి, వసుధ, భువన. సుశీలమ్మ గారు “కరెక్ట్‌గా ఆ సంవత్సరంలోనే ఆ సినిమా వచ్చింది. ఎక్కడా క్రొనొలాజికల్ ఆర్డర్ మిస్ కావడం లేదు” అని నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. నన్ను ‘సాఫల్యం దత్తశర్మ’ అంటారామె అభిమానంగా.

మద్రాసు, భద్రయన్ వీధిలో నిమ్మకాయల కమీషన్ ఏజంటు పెంచలయ్య ‘ఈనాడు’ పేపర్ చదువుతూ కూర్చున్నాడని వ్రాశాను. మే 1974 అది. ఒక పాఠకుడు ఫోన్ చేసి “అప్పటికి ఈనాడు లేదు” అని సున్నితంగా చెప్పాడు. ఆయనకు సారీ చెప్పాను. తర్వాత విచారిస్తే ‘ఈనాడు’ 10, ఆగస్టు 1974 న ప్రారంభించబడిందని తెలిసింది. అక్కడ మాత్రం తప్పులో కాలు వేశాను. ఒక మూడు నెలలు తేడా వచ్చింది. అది తప్ప, ఎక్కడా కాల స్ఖాలిత్యాలు దొర్లలేదు.

 

ప్రశ్న 8: నవలలో వ్యవసాయం గురించి ముఖ్యంగా పట్టు పురుగుల పెంపకం గురించి చాలా వివరంగా ఎంతో అనుభవమున్న వాడిలా రాశారు. మీకు ఈ అంశాలలో వ్యక్తిగతానుభవం వుందా?

జ: ఇంత వివరంగా పట్టు పురుగుల పెంపకాన్ని గురించి రాయగలగటానికి కారణం, నాకు, అందులో ఉన్న అనుభవమే. నేను దాదాపు పది సంవత్సరాలు వ్యవసాయం చేశాను. నిమ్మతోట, కూరగాయల పెంపకం, వేరు శనగ సాగు, వ్యవసాయ పరికరాలు, ఎద్దులు, వాటితో అనుబంధం, ఇవన్నీ నాకు బాగా అనుభవం. సెరికల్చర్ డిపార్ట్‌మెంట్ వారు మాకు ఎంతో శిక్షణ యిచ్చారు. సబ్సిడీపై బ్యాంకు ఋణాలు ఇచ్చారు. వాటికి పెంపకం చాలా సున్నితం. వాటి మార్కెటిమ్గ్ కూడా కర్నాటకలో. కాని, మా కర్నూలు జిల్లాలో పట్టు పురుగుల పెంపకం అంతగా రాణించలేదు. అనంతపురం జిల్లాలో మాత్రం ఇప్పటికీ మల్బరీ సాగు బాగా ఉంది.

పట్టు పురుగుల ఎపిసోడ్ వస్తున్నప్పుడు బేతంచెర్ల నుంచి, ఒక విశ్రాంత గ్రామీణ బ్యాంకు మేనేజరు గారు నాకు ఫోన్ చేసి, “సార్, మాకు అప్పట్లో మూడు రోజులు సెరికల్చర్ డిపార్టుమెంటు వారు హిందూపురంలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అప్పుడు నాకంతగా బోధపడలేదు. కానీ మీ ‘సాఫల్యం’ చదువుతుంటే క్లియర్‍గా, ఆ ప్రాసెస్ అంతా అర్థమైంది!” అని చెప్పారు. ఒక రచయితకు అంతకంటే కావలసినదేముంది? ఆ విషయంలో ఏ మాత్రం కల్పన, ఊహ లేవు. ఆంతా ప్రాక్టికల్‍గా చేసిందే రాశాను.

కాని, ఆసక్తికరంగా ఉండడం కోసం, మెటీరియల్ సప్లయి చేసిన ఉరుకుందప్ప పాత్రను, సెరికల్చర్ అసిస్టెంటు (ఈయనకు పేరుండదు) కల్పించాను. అందులో కూడా human element పెట్టాను. పట్టు పురుగుల పెంపకం చాలా drag on అయిందని, digressive గా ఉందని, దాన్ని బాగా తగ్గించడం మంచిదని, మా పెద్దక్కయ్య, శ్రీమతి అవధానం లక్ష్మీదేవమ్మ గారు (ఆమె కూడా రచయిత్రే, నవలలో వాగ్దేవి పాత్రకు స్ఫూర్తి ఆమే. కానీ చాలా మటుకు ఆమె క్యారెక్టరైజేషన్ మార్చాను) సూచించారు. కాని అలా ఎవరూ పాయింట్ అవుట్ చేయలేదు. కొందరు, చాలా బాగుందన్నారు. లక్నో నుంచి శ్రీ కె.ఎస్.ఆర్. శాస్త్రి గారు (Retd Deputy Post Master General) “మీ నవల చదివి, పట్టు పురుగుల పెంపకం, ట్యుటోరియల్స్, బుక్ షాపు, పబ్లికేషన్స్ లాంటివి ఎవరైనా సులభంగా నిర్వహించవచ్చు” అని ఫోన్ చేశారు. ధన్యోస్మి!

ప్రశ్న 9: నవల చదివిన పాఠకులు మీరే పతంజలి అనుకుంటున్నారు. మీకెలా అనిపిస్తుంది. ఇంతకీ పతంజలిలో మీ పాళ్ళెంత? కల్పన ఎంత?

జ: Autobiographical element అనేది ప్రతి రచననూ ప్రభావితం చేస్తూనే ఉంటుంది. “A Writer can not escape from his self” అన్నారు ఛార్లెస్ డికెన్స్, తన ‘Oliver Twist’ నవలలో “నవలలో మీరే ఆలివర్ కదా?” అని అడిగినప్పుడు. ‘సాఫల్యం’ నవలకు నా జీవితం, నా భావజాలాలు base మాత్రమే. అందుకని అది నా జీవిత చరిత్ర కానే కాదు. ‘Skeleton’ గా ఉన్న జీవితానికి fiction అనే flesh and blood సమకూర్చాను. కానీ చాలామంది పాఠకులు దీన్ని నమ్మడం లేదు. ‘నేనే పతంజలిని’ అంటూ నన్ను దబాయిస్తారు పైగా! అది వారి అభిమానం. అంతగా మమేకమైపోయారు వారా పాత్రతో!

ఈ విషయంలో సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు చక్కటి విశ్లేషణ, తమ ముందుమాటలో చేసి, నా నెత్తిన పాలు పోశారు. ఆయనంతటి వాడు వివరించిన తరువాత గానీ చాలా మంది కన్విన్స్ అవలేదు. ‘వేయి పడగలు’లోని ధర్మారావు విశ్వనాథ వారే అని చాలామంది వాదించేవారని కస్తూరి సూచించారు. ఆ మహానుభావునితో ఇసుమంతయినా నాకు పోలిక లేదు. కానీ సంపాదకుల వారు దీనిని అద్భుతంగా క్లారిఫై చేశారు. పాఠకులు నన్ను పతంజలిగా భావించడం ఒక రచయితగా నేను సాధించిన విజయమని, నా సృజనాత్మక ప్రతిభకు నిదర్శనమనీ ఆయన అనడం నాకెంతో గర్వకారణం. ఆయనకు నా కృతజ్ఞతలు.

ప్రశ్న 10: ఇది మీ తొలి నవల. దాదాపుగా ఆరువందల పేజీల నవల. రాస్తున్న సమయంలో ఇంతపెద్ద నవల ఎవరు చదువుతారు? అన్న ఆలోచన రాలేదా? వస్తే ఎలా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుని రచనలో ముందుకు సాగారు?

జ: ఆరు దశాబ్దాల జీవితాన్ని ప్రతిబింబించాలంటే, ఆ నిడివి అవసరం అని నేను భావించాను నిడివిని కుదిస్తే పర్టిక్యులర్ అథెంటిసిటీ తగ్గుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా తాపీగా రాసుకుంటూ పోయాను. మొదట ఈ నవలను ‘విశాలాంధ్ర’ దినపత్రికలో ‘డెయిలీ సీరియల్’గా ప్రచురించడానికి దాని సంపాదకులు శ్రీ  ముత్యాల ప్రసాద్ అంగీకరించారు. ఒక రెండు వందల పేజీలు ‘ఎడిట్’ చేస్తే మేలన్నారు. దురదృష్టం, ఆయన కోవిడ్‍తో మరణించారు. అలా అది నిలిచిపోయింది. తర్వాత విజయనగరం వాస్తవ్యులు, నా మిత్రులు, రచయిత, పబ్లిషర్ శ్రీ ఎన్.కె. బాబు గారు నన్ను కస్తూరి వారికి పరిచయం చేశారు. నేను జంకుతూ, “చాలా పెద్ద నవల, 584 పేజీలు వచ్చింది” అంటే, ఆయన “ఎక్స్‌లెంట్! మాకు పంపండి” అని ప్రోత్సహించారు. నవల చదివి, “మాకు ఒక magnum opus ను ఇచ్చారు శర్మగారూ!” అన్నారు. నిడివిని నిర్బంధించని ఏకైక పత్రిక సంచిక! తర్వత కస్తూరి వారితో నా అనుబంధం ఎంత బలపడిందంటే ఆత్మీయ సోదరుడైనాడు ఆయన నాకు!

విశేషమేమంటే, 54 వారాలు సీరియల్‍గా వచ్చినా, ‘సాఫల్యం’ ఎవరి సహనాన్ని పరీక్షించలేదు. చాలా మంది “అప్పుడే అయిపోయిందా? ఇంకా ఉంటే బాగుండేది” అన్నారు. తర్వాత అది పుస్తక రూపంలో ఎప్పుడొస్తుందని, ఏక మొత్తంగా నవల చదవాలని ఉందని చాలామంది అడిగారు.

కాబట్టి, నిడివి విషయంలో నాకున్న అనుమానాలను పటాపంచలు చేశారు కస్తూరి వారు. పాఠకులు నిడివిని అసలు పట్టించుకోలేదు.

ప్రశ్న 11: రచనలో మీకు ఆదర్శం ఎవరు?

జ: రచనలో నాకు ఆదర్శం శ్రీ చివుకుల పురుషోత్తం గారు. ఆధ్యాత్మిక విషయాలను సైతం సులభంగా ఫిక్షన్ రూపంలో చెప్పారాయన. కొమ్మూరి వేణుగోపాలరావు గారు కూడా నాకు స్ఫూర్తినిచ్చారు. ఇంగ్లీషులో డి.హెచ్. లారెన్స్, జార్జ్ బెర్నార్డ్ షా, సంస్కృతంలో కాళిదాసు, వాల్మీకి నాకు ఆదర్శ స్రష్టలు. విశ్వనాథ వారికి నేను వీరాభిమానిని.

ప్రశ్న 12: తెలుగులో మంచి నవలలు రావటం లేదని అంటూంటారు. ఇటీవలి కాలంలో మీరు చదివిన చక్కని నవలల పేర్లేమయినా చెప్పగలరా?

జ: తెలుగులో మంచి నవలలు రావటం లేదన్న మాట కొంత వరకూ నిజమే. ఇటీవల నేను చదివిన నవలల్లో యశస్వి జవ్వాది వ్రాసిన ‘స్మృతిపథం’ నాకు నచ్చింది. విహారి గారి ‘జగన్నాథ పండితరాయలు’ నవల గొప్ప ప్రయోగం. సలీం గారి ‘వెండి మేఘం’ అంటే నాకిష్టం. నేను ముందు పాఠకుడినే. తర్వాతే రచయితను. మంచి పాఠకుడే మంచి రచయిత కాగలడని నా నమ్మకం.

ప్రశ్న 13: నవల రచన విషయంలో భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ‘సాఫల్యం’ రాయటంలో మీ ఉద్దేశం ఏమిటి? నవల రచనలో మీ ఉద్దేశం నెరవేరిందనుకుంటున్నారా?

జ: ‘సాఫల్యం’ తరువాత నాలుగు నవలలు వ్రాశాను. ‘గుండె తడి’ అనే సైకలాజికల్ నవల, ‘ఆపరేషన్ రెడ్’ అనే క్రైమ్ థ్రిల్లర్, ‘జయభారత జనయిత్రి’ అన్న నవల, ‘ప్రాచ్యం-పాశ్చాత్యం’ అన్న నవల రాశాను. ‘మహా ప్రవాహం’ అన్న నా నవలను గ్లోబలైజేషన్ గ్రామీణ వృత్తులను ఎలా దెబ్బతీసిందో అనే ఇతివృత్తంతో రాశాను. అది పూర్తిగా, కర్నూలు జిల్లా మాండలికంలో ఉంటుంది. అది కూడా దాదాపు మూడు దశాబ్దాల పరిణామ క్రమాన్ని కథగా వివరిస్తుంది. త్వరలో అది మన సంచికలో ధారావాహికగా రాబోతోంది.

‘సాఫల్యం’ (The fulfillment) అనేది గొప్పవారికేనా, మనలాంటి సామాన్యులకు ఉండదా? అని ప్రశ్న నన్ను నిరంతరం వేధించేది. చివరకు నాకు సమాధానం దొరికింది సాఫల్యం అనేది వైయక్తికం అనీ, వ్యక్తి ఒక కొడుకుగా, తండ్రిగా, భర్తగా, అన్నగా, ఒక మంచి ఉద్యోగిగా తన పాత్రను తాను చక్కగా పోషిస్తే చాలని, అదే సాఫల్యమనీ, నవల చివర పతంజలికి కృత్తివాసన్ ముఖర్జీ అన్న యోగితో చెప్పించాను. ‘యోగః కర్మ సుకౌశలమ్’ అన్న గీతా వాక్యమే నాకూ, నా నవలకూ స్ఫూర్తి. నవల ద్వారా నా ఉద్దేశం నెరవేరింది. ముగింపును అనేక మంది పాఠకులు స్వాగతించి, దానితో ఏకీభవించారు.

ప్రశ్న 14: ‘సాఫల్యం’ పుస్తక రూపంలో ప్రచురితమయింది! ఆ అనుభవం ఎలా వుంది? అమ్మకాలెలా వున్నాయి?

జ: ‘సాఫల్యం’ నవలను ‘సదరన్ స్ప్రింగ్స్ పబ్లిషర్స్, తార్నాక’ వారు ప్రచురించారు. ఇంత వరకు దాని ఆవిష్కరణ సభ కూడా జరుగలేదు. పుస్తకాన్ని ఐతే ప్రచురించారు గాని, దాని ప్రమోషన్ గురించి వారేమీ శ్రద్ధ చూపడం లేదు. నా అభిమానులే 60, 70 మంది నవలను కొన్నారు. ఇంతవరకు వేసిన 500 కాపీలలో, వందకు పైగా మాత్రమే అమ్ముడయినట్లు తెలిసింది. ఆన్‍లైన్‍లో కూడా అమ్మకానికి పెట్టలేదు. సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేశారు. అంతే! నవలను వారికిచ్చి పొరపాటు చేశాననిపిస్తుంది. ‘పేరున్న రచయితలే, సొంత డబ్బుతో తమ పుస్తకాలు ప్రచురించుకుంటున్నారు కదా, వీళ్లు నా నవల పబ్లిష్ చేస్తామని ముందుకొచ్చారు. మంచిదే, మనం సొంతంగా వేసుకునే పరిస్థితి తప్పింది’ అని సంతోషపడ్డాను. కాని, అసలుకే మోసం వస్తుందని ఊహించలేదు. నాకు కాంప్లిమెంటరీ కాపీలు కేవలం పది మాత్రమే ఇచ్చారు. సాహితీ ప్రచురణలు లాంటి సంస్థలు, తరువాత మనకు మన పుస్తకాలు కావాలంటే, పుస్తకం ధరలో 40 శాతానికే మళ్ళీ కాపీలు ఇస్తారు. నా కథాసంపుటం ‘దత్త కథాలహరి’ 500 కాపీలు వేశాము. 300 కాపీలు అమ్ముడుపోయాయి. మిగతావి సాహితీ వారి దగ్గరే ఉన్నాయి. వారు పుస్తకాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.  కావల్సినప్పుడల్లా పది, ఇరవై కాపీలు అడిగితే పంపిస్తున్నారు. వీళ్ళు దానికీ స్పందించరు. జూమ్ మీటింగ్‍లో ఒకసారి పుస్తక పరిచయం చేశారు. దాని వల్ల ఏ ప్రయోజనమూ లేదు.

కాబట్టి రచయితలకు, నా స్వానుభవం మీద ఇచ్చే సలహా ఏమిటంటే, మీ పుస్తకాలను ఎవరయినా పబ్లిష్ చేస్తామని అన్నా తొందరపడకండి. వారి గత పబ్లికేషన్స్ ఎలా ప్రమోట్ చేశారో కనుక్కోండి. సొంతంగా వేసుకుంటే, మన సొంత బాధ్యతతో ప్రమోట్ చేసుకోగలం.

పుస్తక ముద్రణ విషయంలో, ఆర్థికంగా నాకేమీ నష్టం లేదు కానీ, అంత ప్రాచుర్యం పొందిన ‘సాఫల్యం’, ప్రమోషన్ విషయంలో ఘోరంగా వైఫల్యం చెందిందని తెలపటానికి విచారిస్తున్నాను. ఒకవేళ పబ్లిషర్స్ ఈ ఇంటర్వ్యూని చదివి, 40 శాతం ధరకు నాకు పుస్తకాన్ని కొన్ని కాపీలుగా ఇవ్వగలిగితే (అదేమీ ఫేవర్ కాదు, పబ్లిషర్స్ అనుసరించే సంప్రదాయం) సంతోషిస్తాను.

చివరకు ఏ సంబధం లేని గ్రేటర్ రాయలసీమ ఆఫ్ తెలంగాణ (GRAT) లాంటి సంస్థలు ‘సాఫల్యం’ నవలని లాంఛ్ చేస్తామని, ప్రమోట్ చేస్తామని ముందుకొచ్చాయి. బహుశా ఆగస్టులో ఆ సభ ఉంటుంది. మరి మా పబ్లిషర్స్ దానికైనా కలిసొస్తారో లేదో? నా బాధ అల్లా పాఠకులను పెద్ద ఎత్తున చేరాల్సిన రచన ఎవరినీ చేరకుండా అవుతోందని అంతే తప్ప ప్రచురణకర్తలపై నాకు ఎలాంటి కోపంలేదు. నవల పదిమందిని చేరితే వారికే లాభం కదా!!!

ప్రశ్న 15: ‘సాఫల్యం’ నవల మీ జీవిత చరిత్ర అని అధికులు భావిస్తున్నారు. అలాంటప్పుడు మీ జీవిత భాగస్వామి స్పందన ఏమిటి?

జ: ‘సాఫల్యం’ నవల నా జీవిత చరిత్ర కాదు, కానే కాదని పునరుద్ఘాటిస్తున్నాను. నవలలో పతంజలి, వసుధల ప్రేమ ప్రణయం, అనురాగం, వైవాహిక జీవితం అన్నీ కల్పితాలే. మాది మేనరికమే గాని, పెద్దలు కుదిర్చిన వివాహమే. ప్రేమలు అవీ ఏమీ లేవు. నవలలో కొంచెం రొమాంటిక్ టచ్ కోసం వారి మధ్య ఆసక్తికరమైన ప్రేమ, మోతాదు మించని శృంగార సన్నివేశాలు కల్పించాను.

నా శ్రీమతి హిరణ్మయి. ఆమె గృహిణి. నా సాహిత్యాన్ని చదువుతుంది. అవసరమైతే విమర్శిస్తుంది. నా భావజాలాన్ని, వ్యక్తిత్వాన్ని ‘సాఫల్యం’లో ఆవిష్కరించానని ఆమె అంటుంది. ప్రతి వారం సీరియల్ ఫాలో అయ్యేది. నవలపై ఆమెది అనుకూల స్పందనే.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు దత్తశర్మ గారు.

దత్తశర్మ: మీకు కూడా ధన్యవాదాలు.

***

సాఫల్యం (నవల)
రచన: పాణ్యం దత్తశర్మ
ప్రచురణ: సదరన్ స్ప్రింగ్స్ పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్
పేజీలు: 584
వెల: ₹ 475
ప్రతులకు:
ప్రచురణకర్తలు
9100942260, 9100942275

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here