కథా, నవలా రచయిత శ్రీ సయ్యద్ సలీం ప్రత్యేక ఇంటర్వ్యూ

2
11

[సంచిక పాఠకుల కోసం కథా, నవలా రచయిత శ్రీ సయ్యద్ సలీం గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం సలీం గారూ.

సలీం: నమస్కారమండీ

~

ప్రశ్న 1. ఎల్‍ఓసి దగ్గరలో నివసించే వ్యక్తుల పరిస్థితి ప్రతిబింబించే నవల రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: బార్డర్‌కి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్న జోరాఫాం అనే గ్రామం జమ్మూలో ఉంది. సైనికుల క్రాస్ ఫైరింగ్ వల్ల ఈ గ్రామం ఎంత నష్టపోయిందో, ఎంతమంది గ్రామస్థులు చనిపోయారో చదివినపుడు మొదటిసారి బార్డర్‌లో నివసించే ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని నవలగా రాయాలని సంకల్పించాను. దినదిన గండమే వాళ్ళ బతుకు.. ఎప్పుడు నెత్తిమీద బాంబులు పడ్తాయో తెలియదు. ఏ వైపు నుంచి తూటా దూసుకొస్తుందో తెలియదు. రాత్రి పడుకున్నాక ఉదయం వరకు బతికుంటారో లేదోనన్న అనుమానం వాళ్ళని పీడీస్తో ఉంటుంది. ఎన్నో విషాదాల్ని మోస్తూ బతికే సరిహద్దు గ్రామాల్లోని ప్రజల జీవితాల్ని అక్షరబద్ధం చేయాలనే ఉద్దేశంతో ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవల రాశాను.

ప్రశ్న 2. ఈ నవల మీకు పూర్తిగా పరిచయం లేని వాతావరణానికి సంబంధించింది. అయినా నవల సాధికారికంగా రచించగలిగారు. ఇందుకోసం ఎలాంటి పరిశోధనలు చేశారు?

జ: ఈ నవల రాయడానికి నేను ఎన్నుకుంది పాకిస్తాన్ సరిహద్దుకి సమీపంగా ఉన్న హుందర్మో బ్రోల్మో అనే గ్రామాలు. దేశ విభజన సమయంలో ఈ రెండు గ్రామాలు పాకిస్తాన్‌లో చేర్చబడ్డాయి. కానీ 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో మన సైనికులు హుందర్మో గ్రామాన్ని హస్తగతం చేసుకున్నారు. రాత్రికి రాత్రి హుందర్మో గ్రామ ప్రజలు భారతదేశ పౌరులైపోయారు. ఆ రెండు గ్రామాల మధ్య సరిహద్దు మొలుచుకొచ్చింది. దానివల్ల ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. తమ ఆత్మీయుల నుంచి కొంతమంది విడిపోయారు. వాళ్ళను తిరిగి కల్సుకోవాలని తపిస్తూ, ఆ కోరిక తీరకుండానే కొంతమంది చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి.

ఈ రెండు గ్రామాలతో పాటు జమ్ము కాశ్మీర్ లోని జోరాఫాం అనే గ్రామం, పాకిస్తాన్ లోని లాహోర్ నగరం, స్కర్దూ పట్టణం నవలకు నేపధ్యంగా తీసుకున్న ప్రాంతాలు.

వీటిని నేనెప్పుడూ చూళ్ళేదు. నవల్లో ఆ ప్రాంతాల గురించి రాయాలంటే వాటి గురించి తెలిసి ఉండాలి. ముఖ్యంగా వాటి భౌగోళిక స్వరూపం, వాతావరణ పరిస్థితులు, అక్కడి ప్రజల అలవాట్లు, జీవన విధానం, అక్కడి వీధులు, మసీదులు, గుళ్ళు.. ఇలా చాలా సమాచారం సేకరిస్తే గానీ సాధికారికంగా వాటి గురించి రాయలేం. ఈ విషయంలో నాకు ఇతోధికంగా సహాయపడింది ఇంటర్నెట్. ఈ ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు చూస్తూ నోట్స్ రాసుకున్నాను. టూరిస్ట్‌లు కొంతమంది బైకుల మీద ప్రయాణిస్తూ తమ జర్నీని వీడియోలు తీసి నెట్లో పోస్ట్ చేస్తుంటారు. అటువంటి వీడియోలు నాకు చాలా ఉపయోగపడ్డాయి.

దేశ విభజనకు ముందున్న పరిస్థితులు, విభజన సమయంలో జరిగిన హింసాకాండకు సంబంధించి Nisid Hajari రాసిన Midnights’ furies అనే పుస్తకం నాకు బాగా ఉపయోగపడింది.

ఏదైనా నవల రాయడానికి నాకు రెండు నెలల సమయం పడ్తుంది. కానీ ఈ నవల రాయడానికి ఎనిమిది నెలలకు పైగా పట్టింది. మూడు వందల పేజీలకు పైగా సమాచారాన్ని ల్యాప్‌టాప్‌లో భద్రపర్చుకున్నాక, నవలకు అవసరమైన సమాచారాన్ని దాన్నుంచి తీసుకుంటూ మూడు కుటుంబాల నేపథ్యంతో ఈ నవలను అల్లుకున్నాను.

ప్రశ్న 3. కొందరు రచయితలు తాము అనుభూతి చెందనివి రాయలేమంటారు. మీరెప్పుడూ ఎల్‌ఓసి దగ్గరకు వెళ్ళలేదు. అయినా కళ్ళకు కట్టినట్టు వర్ణించగలిగారు. అదెలా సాధ్యమైంది?

జ: రచయిత తన అనుభవంలోకి వచ్చిన, తను అనుభూతి చెందిన విషయాల గురించే రాస్తే సాహితీ సృజన కొన్నిటికే పరిమితమైపోతుంది. సృజన విస్తృత పరిధిలో జరగాలంటే రచయిత కొన్ని జీవితాల్లోకి, కొందరి వ్యక్తిత్వాల్లోకి పరకాయప్రవేశం చేసి రాయాల్సి వస్తుంది. నేను నల్లమల అడవుల్లో నివసించే చెంచుల జీవన విధానం గురించి ‘గుర్రపుడెక్క’ నవల రాసే ముందు చెంచు పెంటలకెళ్ళి వాళ్ళెలా బతుకుతున్నారో గమనించాను. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ అనుభవాల్ని విని, రికార్డ్ చేసుకున్నాను. అలానే మహారాష్ట్రలోని పార్థీ తెగ గురించి ‘అరణ్యపర్వం’ నవల రాసేముందు పార్థీ తెగవాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ బతుకుపోరాటం గురించి తెల్సుకున్నాను. కానీ హైద్రాబాద్ ఓల్డ్ సిటీలోని పేద ముస్లిం బాలికల్ని అరబ్ నిఖాల పేరుతో ముసలి అరబ్ షేకులకు కట్టబెడ్తున్న వైనం గురించి రాసిన ‘ఎడారిపూలు’ నవల కోసం అరబ్ నిఖాల్ని చేసుకుని వేదన అనుభవిస్తున్న ముస్లిం స్త్రీలనెవర్నీ కల్సుకోలేదు. ఎటొచ్చీ ఆ నవల్లోని జుబేదా, రెహనా అనే పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ బాధల్నీ, కన్నీళ్ళను, కష్టాలను అనుభూతి చెంది రాశాను. ఈ నవల చాలా మందికి నచ్చింది.

 

ప్రశ్న 4. పాత్రల సృజనలో, వారి వ్యక్తిత్వాలు తీర్చిదిద్దడంలో కశ్మీరీయులకు అతి దగ్గరగా ఉండేట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ. చాలా యేళ్ళ క్రితం నేను జమ్ము, శ్రీనగర్ సందర్శించాను. ఓ నాలుగు రోజులు శ్రీనగర్‌లో గడిపాను. ప్రముఖ సాహితీవేత్త శ్రీ కస్తూరి మురళీకృష్ణ రాసిన ‘నీలమత పురాణం’ సంచికలో సీరియల్‌గా వస్తున్నప్పుడు విడవకుండా చదివాను. బెంగుళూర్‌లో ఓరాకిల్ సంస్థలో మేనేజర్‍గా పనిచేస్తున్న కాశ్మీరీ మిత్రుడొకతనున్నాడు. గొప్ప సాహిత్యాభిమాని. అతను యింగ్లీష్‌లోకి అనువాదమైన నా పుస్తకాలన్నీ తెప్పించుకుని చదివాడు. అతనిచ్చిన సమాచారం కూడా నాకు ఉపయోగపడింది.

ప్రశ్న 5. ఈ నవలలో వర్ణించిన గ్రామాలు వాటి పేర్లతో సహా నిజంగా ఉన్నాయా?

జ. కథ, సంఘటనలు, సంభాషణలు నా సృజన. ఈ నవల్లో వర్ణించిన గ్రామాలు వాటి పేర్లతో సహా నిజం గానే ఉన్నాయి.

ప్రశ్న 6. ఈ నవలలో వర్ణించిన సంఘటనలు ఎంతవరకు నిజం? చారిత్రక నేపథ్యం సరిగ్గా ఉండేట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ. దేశ విభజన సమయంలో జరిగిన మారణకాండ, ర్యాడ్ క్లిఫ్ దేశవిభజన చేసిన విధానం, 1971 యుద్ధ సమయంలో మాన్‌సింగ్ తన సైనికులతో వెళ్ళి హుందర్మోతో పాటు మరికొన్ని సరిహద్దు గ్రామాల్ని హస్తగతం చేసుకోవడం, హుందర్మో ప్రజలు కొండమీదున్న గుహలోకి వెళ్ళి తలదాచుకోవడం, హరిసింగ్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ప్రోత్సహించిన పరిస్థితులు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్.. ఇవన్నీ నిజాలు, చారిత్రక నేపథ్యంలో పొరపాటు దొర్లకుండా ఉండటం కోసం మిడ్‌నైట్ ఫ్యూరీస్ పుస్తకంతో పాటు ఇ౦టర్నెట్లో ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా వాడుకున్నాను.

ప్రశ్న 7. నవల పట్ల తెలుగు సాహిత్య ప్రపంచం స్పందించిన తీరు మీకు సంతృప్తికరంగా ఉందా? లేకపోతే ఎందుకని?

జ. ఈ నవల నవ్య వారపత్రికలో పదివారాలు సీరియల్‌గా వచ్చాక పత్రిక ఆగిపోయింది. కొన్ని వారాలు ఓ పత్రికలో సీరియల్‌గా వచ్చి ఆగిపోయిన నవలని మిగతా పత్రికలు గానీ వెబ్ మ్యాగజిన్లు కానీ పునః ప్రచురించడానికి ఒప్పుకోరు. కానీ ఈ నవలని సంచిక వెబ్ మ్యాగజిన్లో పునః ప్రచురించడానికి శ్రీ కస్తూరి మురళీ కృష్ణగారు ఒప్పుకున్నారంటేనే అది నవల విజయంగా భావిస్తున్నాను. ఆ నవల పాఠకులకు చేరాల్సిన అవసరముందని శ్రీ మురళీకృష్ణగారు భావించడం వల్లనే ఒప్పుకున్నారనుకుంటున్నాను.

ఈ నవల ఆవిష్కరణ వరంగల్‌లో శ్రీ అంపశయ్య నవీన్ గారి చేతుల మీదుగా జరిగింది. “నీ వెండిమేఘం ఎంత గొప్ప నవలో ఈ నవల కూడా అంత గొప్ప నవల” అని శ్రీ అంపశయ్య నవీన్ గారు కితాబిచ్చారు. ఆ తర్వాత చీరాల, విజయనగరం, విశాఖపట్టణాల్లో నవల పరిచయ సభలు జరిగాయి. విశాఖపట్టణంలో నవలను పరిచయం చేసిన శ్రీ కె.జి. వేణుగారు “తెలుగు నవలాసాహిత్యంలో ఒక ధృవతారగా మిగిలిపోయే నవల ‘రెండు ఆకాశాల మధ్య’” అన్నారు.

విశాఖలో రెండు ఆకాశాల మధ్య పుస్తక పరిచయ సభ
విజయనగరంలో రెండు ఆకాశాల మధ్య పుస్తక పరిచయ సభ

కానీ చాలా నిరాశకు గురిచేసిన రెండు విషయాలు చెప్పాలి. పుస్తకం ప్రింట్ అయి వచ్చాక, ఓ పాతిక ముప్పయ్ మంది సాహితీవేత్తలకు రిజిష్టర్ పోస్ట్‌లో పంపించాను. ఒక్కరంటే ఒక్కరు కూడా మీ పుస్తకం అందిందని మెసేజ్ ఇవ్వలేదు. పుస్తకం చదివి తమ అభిప్రాయం ఎవ్వరూ పంచుకోలేదు. రెండో విషయం ఏంటంటే రివ్యూల కోసం పుస్తకాన్ని చాలా పత్రికలకు పంపించాను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, వార్త, విశాలాంధ్ర, ప్రస్థానం.. ఇలా దాదాపు డజను పత్రికలకు పంపి ఉంటాను. విశాలాక్షిలో శ్రీ కె.జి. వేణు రాసిన రివ్యూ, సంచికలో కొల్లూరి సోమ శంకర్ రాసిన రెవ్యూ తప్ప ఇప్పటివరకు మిగతా పత్రికల్లో ఈ నవల గురించి రివ్యూ రాలేదు.

ప్రశ్న 8. మీరు మీ నవలల్లో విభిన్నమైన అంశాలు కేంద్రంగా తీసుకుంటారు. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? మీరు రాసింది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. వివాదాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించారు?

జ. తెలుగు సాహిత్యంలో చాలా తక్కువమంది స్పృశించిన అంశాలు తీసుకుని నవలలు రాయడానికి పూనుకుంటాను. ‘వెండి మేఘం’ నవల కోస్తాంధ్ర ముస్లింల జీవితాల్ని చిత్రించిన మొట్టమొదటి నవల. మెర్సీ కిల్లింగ్ గురించి నేను రాసిన నవల ‘మరణకాంక్ష’ కూడా విభిన్నమైనదే. తెలుగులో ఈ సబ్జెక్ట్ మీద ఒకటో రెండో పుస్తకాలు ఉంటాయేమో. దుబాయ్ షేకులకు ముక్కుపచ్చలారని ముస్లిం అమ్మాయిల్ని యిచ్చి నిఖా చేయడం మీద నేను రాసిన ‘ఎడారి పూలు’ కాకుండా మరో నవల వచ్చిన దాఖలాలు లేవు. దూదేకుల ముస్లి౦ల గురించి కథలు వచ్చాయి కానీ నవలారూపంలో నేను రాసిన ‘దూదిపింజలు’ నవలే మొదటి నవల. అలానే ‘రెండు ఆకాశాల మధ్య’ నవల కూడా ఇప్పటివరకు ఎవరూ స్పశించని అంశంతో రాసిన నవల. తెలుగులో దేశ విభజన నేపథ్యంతో చాలా తక్కువ నవలలు వచ్చాయి. అందులోనూ 1971లో జరిగిన బంగ్లాదేశ్ విమోచన కోసం జరిగిన యుద్ధం నేపథ్యంలో నవలలు రాలేదు. ‘రెండు ఆకాశాల మధ్య’ నవల ఆ వెలితిని పూరించింది. మన హైద్రాబాద్‌లో పార్థీవాడ ఉంది. కానీ మనలో చాలామందికి పార్థీల జీవన విధానం గురించి తెలియదు. నేను రాసిన ‘అరణ్య పర్వం’ నవలలో వాళ్ళ జీవన వైవిధ్యాన్ని చిత్రించాను. కరోనా చేసిన విలయతాండవం గురించి చాలా కథలొచ్చాయి. కథా సంకలనాలు వెలువడ్డాయి. కానీ నవలలు రెండో మూడో వెలువడ్డాయి. అందులో నా నవల ‘లోపలి విధ్వంసం’ కూడా ఒకటి.

 

‘వెండిమేఘం’ నవల రాసినప్పుడు నా మీద ఫత్వా జారీ అవుతుందని మిత్రులు కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ అలా జరక్కపోవడానికి కారణం నేనెక్కడా నేరుగా ముస్లింల మత విశ్వాసాలు దెబ్బతినకుండా రాయడమే. అందులో బుర్ఖాని నిరసించాను. నాలుగు పెళ్ళిళ్ళను తప్పు పట్టాను. అదంతా కథలో భాగంగా చూపించడంతో ఎవ్వరికీ అభ్యంతరం లేకుండా పోయింది. ‘రెండు ఆకాశాల మధ్య’లో కూడా ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా బ్యాలెన్సెడ్ గా రాశాను. లాహోర్‌లో ఉన్న శంకర్‌లాల్ కుటుంబం అక్కడి పఠాన్ల మతోన్మాదానికి బలౌతుంది. కూతుర్ని ఓ పఠాన్ ఎత్తుకెళ్ళిపోతాడు. అంతటి రక్తపాతాన్ని చూసిన కొడుకు మానసికంగా దెబ్బతింటాడు. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఢిల్లీలో జరిగిన మారణహోమంలో ఉస్మాన్ ఖాన్ కుటుంబం సిక్కుల, హిందువుల మతోన్మాదానికి ఎలా బలి అయిందో రాశాను.

ప్రశ్న 9. కథాగమనం చెడకుండా చారిత్రిక, మానసిక, సామాజిక అంశాలను ఎలా కథలో భాగం చేశారు? ఈ కథన శైలి ప్రక్రియను వివరిస్తారా?

జ. నవలలో కథ ముఖ్యం. దానికోసం సృష్టించే సంఘటనలు ముఖ్యం. పాఠకుల్లో ఆసక్తి తగ్గిపోకుండా కథా కథనంలో కలిపేసి కొన్ని చారిత్రక అంశాలు రాశాను. నాకు స్కర్దూ పట్టణం యొక్క సౌందర్యం బాగా నచ్చింది. అక్కడి ఎత్తయిన పర్వతాలు, జలాశయాలు వీటి గురించి రాద్దామనుకున్నాను. షరీఫ్ ఈ ప్రదేశాల్ని సందర్శించినట్టు రాస్తూ వాటిని వర్ణించాడు. హుందర్మో గ్రామస్థులు గుహలోకెళ్ళి దాక్కోవడం అనేది నిజంగానే జరిగింది. నేను దానికి వూహను జోడించి, గుహలో వాళ్ళు పడిన కష్టాలు, నీళ్ళ కోసం, కట్టె పుల్లల కోసం ఇద్దరేసి బైటికెళ్ళడం, వాళ్ళలో ఇద్దరు మోర్టార్ పేలి చనిపోవడం గురించి రాశాను. మాన్‍సింగ్ హుందర్మోను హస్తగతం చేసుకోవడం చరిత్ర. దానికి నా కల్పనను జోడించి, అతను గుహలోకెళ్ళి గ్రామస్థులతో మాట్లాడినట్టు, తన మాటలు చేతల ద్వారా వాళ్ళకు ప్రీతిపాత్రుడైనట్టు రాశాను.

ప్రశ్న 10. ఈ నవలలో మీరు సృజించిన పాత్రల్లో ఏ పాత్ర మీకు అన్ని పాత్రలకన్నా అధికంగా నచ్చింది?

జ. నాకు షామ్లీ పాత్ర చాలా ఇష్టం. పదమూడేళ్ళకే ఓ పఠాన్ చేతికి చిక్కి, అతని చేత మానభంగానికి గురై పేరు మార్పించబడి అతని రెండో భార్యగా మారి, పిల్లల్ని కని.. తల్లిదండ్రులకు దూరమై నలభై యేళ్ళయినా వాళ్ళను చూడాలని పరితపించే పాత్ర.. దేవుడూ, మతం రెండూ చాలా బలమైన విశ్వాసాలు. రాతిలో చెక్కిన అక్షరాల్లా హృదయంలో స్థిరపడిపోతాయి. అలాగే తన పేరు కూడా. మనిషి తన పేరుని గాఢంగా ప్రేమిస్తాడు. షామ్లీని ఈ మూడింటికి దూరం చేస్తారు. పేరుని గోరీబీగా మారుస్తారు. నమాజ్ చదవమంటారు. తన దేవుళ్ళనుంచి దూరం పెడ్తారు. ఎంత గుండె కోత! యిష్టంగా, మనస్ఫూర్తిగా మతం మారడం వేరు. కానీ బలవంతంగా మతం మార్పించబడిన వ్యక్తులు ఎంతటి నరకం అనుభవిస్తారో కదా. షామ్లీ ఎన్ని రకాల హింసల్ని సహించిందో.. ఎన్ని రకాల వేదనలకు బలైందో.. ఆ పాత్రని తల్చుకుంటే దుఃఖం పెల్లు బుకుతుంది కన్నీళ్ళు వస్తాయి. నిజంగానే చరిత్రలో అలాంటి అభాగినులు ఎంతమందో!

వాఘా బార్డర్ దగ్గర జీరో లైన్‌కి అటువైపు గోరీబీ, ఆమె కొడుకు మజీద్ ఖాన్, ఇటువైపు నలభై యేళ్ళ క్రితం ఎడబాసిన తన కూతుర్ని కల్సుకోడానికి తహతహలాడే శంకర్‌లాల్.. ఆ దృశ్యాన్ని తల్చుకుంటేనే మనసెలాగో అయిపోతుంది. కూతుర్ని కల్సుకుని కొన్ని నిమిషాలు మాట్లాడాక ‘నలభై యేళ్ళ క్రితం విడిపోయిన కూతురితో నలభై నిమిషాలు కూడా మాట్లాడుకునే అవకాశం ఇవ్వని ఈ ములాఖత్‌ల వల్ల ప్రయోజనం ఏమిటి? మరింత దుఃఖాన్ని కలుగజేయడం తప్ప’ అని ఆవేదన చెందుతున్న శంకర్‌లాల్‌తో మనమూ మమేకమౌతాం.

ప్రశ్న 11. ఏ పాత్ర సృజన మిమ్మల్ని బాగా కష్టపెట్టింది?

జ. షరీఫ్ పాత్రని సృష్టించడంలో కొతం కష్టపడాల్సి వచ్చింది. షరీఫ్ సున్నిత మనస్కుడు. అతనికి తన భార్య హసీనా అన్నా, మూడో కూతురు ఆస్మా అన్నా ప్రాణం. వాళ్ళని క్షణం కూడా వదిలి ఉండలేనంత ఇష్టం. కూతురి పెళ్ళికి బట్టలు కొనడానికి బ్రోల్మోలో ఉన్న అక్కతో కలిసి స్కర్దూ వెళ్ళిన రోజు, హుందర్మో భారతదేశంలో భాగమైపోతుంది. హుందర్మోకి బ్రోల్మోకి మధ్య సరిహద్దు రేఖ నిప్పుల నదిలా పుట్టుకొస్తుంది. హుందర్మోకి బ్రోల్మోకి మధ్య దూరం రెండు మైళ్ళు. కానీ తను తన భార్యా పిల్లల్ని కల్సుకోవాలంటే పాస్‌పోర్టులు, వీసాలు సంపాయించి కొన్ని వేల మైళ్ళు ప్రయాణిస్తే గాని హుందర్మో చేరుకోలేడు. ఎంతటి మానసిక క్షోభకు లోనవుతాడో.. దాన్ని అక్షరాల్లోకి అనువదించాలి. తన వాళ్ళని కల్సుకోడానికి అతను ఇరవై యేళ్ళ పాటు పడిన ఆరాటాల్ని, కష్టాల్ని, ఆవేదనల్ని రాయాలి. ఇరవై యేళ్ళు అతను ఎలా గడిపాడో రాయడం కోసం కొన్ని సంఘటనల్ని, కొన్ని పాత్రల్ని సృష్టించుకోవాల్సి వచ్చింది. హోటల్లో సర్వర్‌గా పనిచేసే సల్మాన్, మత కల్లోలాలకు భయపడి డిల్లీ నుంచి లాహోర్‌కు వచ్చిన ఉస్మానాఖాన్, అతని కొడకు ఖాలిద్ పాత్రలు ఇందుకోసం సృష్టించబడినవే. అతను ఇరవై యేళ్ళపాటు ఎలా ఎదురుచూస్తూ గడిపాడో పాఠకుడికి ఆసక్తి సడలకుండా సంఘటనలు సృష్టించుకోవాల్సి వచ్చింది.

ప్రశ్న 12. మీరు ముగింపు అనుకుని నవల ఆరంభించారా? లేక నవల సాగుతుంటే ముగింపు వచ్చిందా? మీ నవల రచనా పద్ధతి ఏమిటి?

జ. 2015లో ఇలియాస్ అన్సారి అనే హుందర్మో గ్రామస్థుడు తన ఇంటిని మ్యూజియంగా మార్చాడు. దాన్ని హుందర్మాన్ మ్యూజియం ఆఫ్ మెమోరీస్ అని పిలుస్తారు. అందులో హుందర్మో గ్రామస్థులు వాడిన వస్తువులతో పాటు 1971 తర్వాత బార్డర్‌కి అటువైపు నుంచి వచ్చిన ఉత్తరాలు కూడా ఉన్నాయి. అందులో ఒక ఉత్తరం అన్సారి మేనమామ రాసింది. 1971 యుద్ధం తర్వాత అతను బ్రోల్మోలో చిక్కుబడిపోయాడు. హుందర్మోకి తిరిగిరావాలనే ఆశతో కొన్నేళ్ళు పరిస్థితులతో పోరాడి, చివరికి, తన కోరిక తీరకుండానే అక్కడే చనిపోయాడు. నేను మొదట నవలని షరీఫ్ తన భార్యాపిల్లల్ని కల్సుకోకుండానే లాహోర్‌లో చనిపోయినట్టు ముగిద్దామనుకున్నా. ఆ తర్వాత మరో రెండు రకాల ముగింపులు అనుకున్నా. షరీప్ యిండియాకి వచ్చి కార్గిల్ నుంచి బస్‌లో  హుందర్మో వస్తూ బస్ లోనే ప్రాణాలు విడిచినట్టు ముగిద్దామనుకున్నా. మరో ముగింపులో షరీఫ్ బదులు తను ఎవర్ని కల్సుకోడానికి యిరవై యేళ్ళుగా ఎదురుచూశాడో ఆ హసీనా చనిపోయినట్టు రాద్దామనుకున్నా. ఈ మూడు ముగింపులు రాసి శ్రీ కె.పి. అశోక్ కుమార్ గారికి వారి అభిప్రాయం కోసం పంపించాను. చివరికి హసీనా మరణం తర్వాత ఆమె సమాధి మీద, ‘సర్‍హద్ జమీన్ బాంట్ సక్తీ హై పర్ దిల్ నహీ’ అనే ఎపిటాఫ్‌తో ముగిద్దామని నిర్ణయించుకున్నా.

ఈ నవల ముఖ్యంగా సరిహద్దు రేఖకి దగ్గరగా ఉన్న గ్రామస్థుల జీవితాల్లోని సంక్షోభాల్ని రాయాలనే ఉద్దేశంతో మొదలెట్టాను. ముగింపు ముందుగా అనుకోలేదు. ముగింపు ముందుగా అనుకుని రాసిన నవలలు కూడా ఉన్నాయి. గుర్రపుడెక్క, మరణకాంక్ష, ఎడారి పూలు, పడిలేచే కెరటం అలా రాసిన నవలలే..

ప్రశ్న 13. భవిష్యత్తులో యింకా ఏయే అంశాల ఆధారంగా నవలలు సృజించాలనుకుంటున్నారు?

జ. ఇటీవల ‘మనోజ్ఞ’ అనే మనో వైజ్ఞానిక నవల రాశాను. ఇది తొందర్లోనే పుస్తకరూపంలో వెలువడనుంది. మనిషి మెదళ్లో ఇప్పటికీ ఛేదించబడని ఎన్ని రహస్యాలో.. ఎన్ని చీకటి కోణాలో.. ఎన్ని అద్భుతాలో.. మరెన్ని అగాధాలో.. సైకియాట్రీ చేయడం వల్ల ఆ రహస్యపు గదుల్లో కొన్నిటికైనా తాళం చెవులు దొరుకుతాయనుకుని, తీరా మానసిక వైద్యురాలిగా అనుభవం గడించాక, మనిషిలోని వింత పోకడల గుట్టుని పూర్తి విప్పే దిశగా మనోవిజ్ఞాన శాస్త్రం యింకా అభివృద్ధి చెందాల్సి ఉందని మనోజ్ఞకు ఎందుకనిపించిందో తెలిపే నవల ఇది. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే కిరణ్, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్‌తో బాధపడే మేఘన జీవితాల్లోని ట్రామాటిక్ అనుభవాల గురించి కూడా ఈ నవల్లో రాశాను.

సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో.. కాలం మారేకొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్నిటి గురించయినా నవలలు రాయాల్సిన అవసరం ఉందనుకుంటాను. తెలుగు సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ రాసే రచయితలు చాలా తక్కువమంది ఉన్నారు. డా. చిత్తర్వు మధు, కస్తూరి మురళీకృష్ణ లాంటి ముగ్గురు నలుగురు రచయితలు తప్ప ఈ దిశగా కృషి చేస్తున్న రచయితలు లేరు. నేను పిల్లల కోసం కొన్ని సైఫై నవలికలు రాశాను. భవిష్యత్తులో సైఫై నవలలు రాయాలన్న కోరిక. తాత్విక నేపథ్యంతో ‘అన్వేషణ’ అనే నవల రాశాను. అటువంటి నవలలు మరిన్ని రాయాలన్న కోరిక..

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సలీం గారు.

సలీం: మీకు కూడా ధన్యవాదాలు.

***

రెండు ఆకాశాల మధ్య (నవల)

రచన: సలీం

ప్రచురణ: అనుపమ ప్రచురణలు

పేజీలు: 251

వెల: ₹ 200

ప్రతులకు:

నవోదయ బుక్ హౌస్, కాచీగుడా హైదరాబాద్. 90004 13413

ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here