సంభాషణం: డా. మచ్చ హరిదాసు అంతరంగ ఆవిష్కరణ

3
1

[box type=’note’ fontsize=’16’] తెలుగు యాత్రాచరిత్రలపై తొలి పిహెచ్‌డి పట్టా పొందిన డా. మచ్చ హరిదాసు గారితో కొల్లూరి సోమ శంకర్ జరిపిన సంభాషణం ఈ నెల ప్రత్యేకం. [/box]

[dropcap]డా[/dropcap]క్టర్ మచ్చ హరిదాసు కవి, రచయిత, పరిశోధకులు. 22 ఆగస్టు, 1950న కరీంనగర్ జిల్లా గునుకుల కొండాపురం మండలం లోని గన్నేరువరంలో జన్మించారు. ఎం.ఏ (తెలుగు), పి.జి.డి.టి., పిహెచ్.డి పట్టాలు పొందారు. 34 సంవత్సరాలు తెలుగు అధ్యాపకులుగా పనిచేసి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసారు.

‘తథ్యము సుమతీ’ (1984), ‘తెలుగులో యాత్రా చరిత్రలు’ పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం (1992), ‘గోరుకోయ్యలు’ నానీలు (2006), ‘యేనుగుల వీరాస్వామి’ జీవిత చరిత్ర (2011), ‘వ్యాసలహరి’ సమీక్షలు (2012), ‘యాత్రా చరిత్రలు’ (2012), ‘గునుకుల కొండాపురం పద్మశాలీయులు బూట్ల వంశం ఏడు తరాల చరిత్ర’ (2018) వీరి రచనలు.

సాహిత్యం, విద్యా రంగాల్లో చేసిన కృషికి ‘కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రం’ (2004) లభించింది. ‘డా. జైశెట్టి రమణయ్య ఉత్తమ అధ్యాపక సత్కారం’ (2005) ‘రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు’ (2008) అందుకున్నారు. ‘తెలంగాణ స్థాయి యం.వి. నరసింహారెడ్డి సాహితీ పురస్కారం’ (2015), ‘బొందుగులపాటి సాహితీ పురస్కారం (2016), ‘డా. మూడ నాగభూషణం గుప్త తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం’ (2018) మొదలగునవి వీరికి లభించిన పురస్కారాలు.

తెలుగు యాత్రాచరిత్రలపై తొలి పిహెచ్‌డి పట్టా పొందిన డా. మచ్చ హరిదాసు గారితో కొల్లూరి సోమ శంకర్ జరిపిన సంభాషణం ఈ నెల ప్రత్యేకం.

మచ్చ హరిదాసు గారు, నమస్కారం. సంచిక వెబ్‍పత్రికతో సంభాషిస్తున్నందుకు ముందుకు మీకు ధన్యవాదాలు.

నమస్కారం.

మీ రచనల గురించి, మీ పరిశోధన గురించి చర్చించే ముందుగా మీ కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తారా? మీ బాల్యపు అనుభవాలు మిమ్మల్ని ఏ రకంగా సృజనాత్మకత వైపు, పరిశోధన వైపుకు నడిపించాయో చెబుతారా?

తప్పకుండా. మా ఊరు కరీంనగర్ జిల్లాలోని బావుపేట. దాన్ని ఆసిఫ్‌నగర్ అని అంటున్నారిప్పుడు. కరీంనగర్‌కి పది కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. మా తాతగారి ఊరది. మా తాతగారు తత్వాలు పాడేవారని విన్నాను. నేను ఆయనను చూసింది లేదు. మా తాతగారు మా నాన్నగారి చిన్నప్పుడే చనిపోవడంతో నాయనమ్మని, నాయనను, నాయన చెల్లెలును గునుకుల కొండాపురం తీసుకొచ్చారు నాయనమ్మ నాన్న. తర్వాత మా నాయనను మా తాతగారు (అమ్మమ్మ భర్త) ఇల్లరికం చేసుకుని వాళ్ళకుండే భూమిలో మా మేనమామకీ, మా నాయనకి చెరి సగం ఇచ్చినారు. ఆ కారణంగా కుటుంబ బాధ్యత అంతా మా నాయనగారిమీదే పడింది. మరదళ్ళిద్దరి, బావమరిదికి పెళ్ళిళ్ళు చేశాక, తర్వాత వేరుపడ్డారు. ఆ ఊర్లోనే ఒక చోట ఇల్లు కట్టుకున్నారు. మా నాయన పేరు మచ్చ వీరయ్య. అమ్మ పేరు బుచ్చి రామక్క. అమ్మానాయనలకు నేనొక్కడ్నే సంతానం.

మా నాయనకు చిన్నప్పటి నుంచీ తాత్త్విక చింతన ఎక్కువ. అంటే తండ్రి లేడు కాబట్టి మేనమామ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు బాధ్యతలు ఎక్కువైపోయి భగవంతుని మీద దృష్టి ఎక్కువ సారించాడాయన. చిన్నప్పటి నుంచే ఆశువుగా కవిత్వం రాసేవాడు. ఏ చిన్న సంఘటన కనపడ్డా కూడా దాని మీద కవితను అల్లేవాడు. నాయన మీద శేషప్ప కవి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ పద్యాలను చదివి చదివి, వాటి మార్గంలో తను కూడా సీసపద్యాలు కొన్ని రాసినాడు.

శేషప్ప కవి గురించి కాస్త వివరిస్తారా?

శతక సాహిత్యంలో ముఖ్యమైనదిగా ఖ్యాతి గడించిన నరసింహ శతకం రాసిన కవి ఈయనే. శేషప్ప కవి ధర్మపురిలో ఉండేవారు. ఆయన నృసింహ శతకం రాశాడు. ఈ పద్యాలన్నీ శ్రీధర్మపుర నివాస అనే మకుటాన్ని కలిగి ఉంటాయి. ఆయన పద్యాలను నాయన బాగా ధారణ పట్టేవాడు. ఇదంతా నాకెలా తెలుసంటే – నాయన మగ్గం నేస్తూ చెప్తుంటే నేను రాసి పెడుతుండేవాణ్ణి. అప్పుడు నేను ఏడవ తరగతి చదువుతున్నట్టు గుర్తు. ఆ రకంగా నా పదో తరగతి వరకు గునుకుల కొండాపురంలో ఉన్నాము. అక్కడ నేతవృత్తికి ఆదరణ లేకపోవడం వల్ల, నన్ను పై చదువులు చదివించడం కోసం నాయన కుటుంబాన్ని కరీంనగర్‌కి తెచ్చిండు. అప్పట్లో ప్రభుత్వం కరీంనగర్‌లో పద్మనగర్ పేరుతో పద్మశాలీలకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇచ్చినది. అట్లా నాయన కూడా మమ్మల్ని పద్మనగర్‌కి తెచ్చిండు. బడికి పోయేటందుకు రోజూ నేనే వంట చేసుకుని వెళ్ళేది. ఈ కష్టాన్ని తప్పించేందుకు నాయన నన్ను కరీంనగర్‌లో చదివిద్దామని ఇక్కడకు వచ్చేసిండు. నేను టెన్త్ నుండి బిఎ వరకు కరీంనగర్‌లోనే చదువుకున్నాను. నాకు టెన్త్‌లో చింతల నారాయణ అనే ఒక గురువు ఉండేవారు. వారు తెలుగు అద్భుతంగా చెప్పేవారు. ముఖ్యంగా ఛందస్సు మీద నాకు మమకారం ఏర్పడడానికి ఆయన మూలకారుకుడనే చెప్పాలి. ఆయన ప్రభావం ఎంతలా ఉండేదంటే ఛందస్సు నేర్చుకుని  నా క్లాసు వాళ్ళకి నేనే చెప్పేటంత! ఒక టీచరు చెప్పినట్లుగా చెప్పేది. ఛందస్సుని నాకు బాగా లోతుగా ఆయన అనుభవంలోకి తీసుకువచ్చినారు. అప్పుడు నాకు తెలుగు సాహిత్యం మీద కొంత అభిమానం ఏర్పడ్దది.

బి.ఎ.కు వచ్చిన తర్వాత నేను కాలేజీ టాపర్‌ని అయినాను- తెలుగులో. సెకండ్ లాంగ్వేజే అయినప్పటికీ నాకు అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినయి. అది నన్ను తెలుగులో ఎం.ఎ. చేసేందుకు ప్రోత్సహించింది. డిగ్రీలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లను ఇంగ్లీషు మీడియంలో చదివానా… భవిష్యత్తులో తెలుగు పాఠాలు బోధించాలని నిర్ణయించుకున్నా కాబట్టి ఎం.ఎ. తెలుగుతో చేశాను. నా సహాధ్యాయిలు కూడా తెలుగులో ఎక్కువ మార్కులొచ్చినాయని నన్ను బాగా ప్రోత్సహించేవారు. చేస్తే తెలుగు ఎం.ఎ. చేయాలనే బీజం నాకక్కడ పడింది. మొదటగా తాతగారి ద్వారా, తర్వాత నాయన ద్వారా తెలుగు సాహిత్యం నా మీద ప్రభావం చూపింది.

ఎం.ఎ. తెలుగు చేసేడప్పుడు  నా క్లాసే‍మేట్స్, నా రూమ్‌మేట్ అనుమాండ్ల భూమయ్యగారు, తంగడి కిషన్ రావు గారు. మాకు కొంచెం దూరంలో ఎన్. గోపి గారు ఉండేవారు. ఈ ముగ్గురు సహచర్యం వల్ల నేను కొంచెం ఎక్కువగానే కృషి చేయవలసి వచ్చింది. ఆ రకంగా నేను తెలుగు సాహిత్యం మీద ఎక్కువ ఆసక్తిని పెంచుకున్నాను.

ఆ కాలంలో విద్యార్థులకి, ఉపాధ్యాయులకీ మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేవి? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే మీరు చెప్తున్నవారంతా ఇప్పుడు ప్రముఖులు.. అనుమాండ్ల భూమయ్య గారు గానీ ఎన్. గోపి గారు గానీ! అసలు విద్యార్థి దశలో మీరంతా కలిసి ఎలా ఉండేవారు?

చాలా బాగా కలిసి ఉండేవాళ్ళం. అనుమాన నివృత్తి చేసుకునేవాళ్ళం. అంటే ఏదైనా విషయం మీద సందేహాలుంటే తీర్చుకునేవాళ్ళం. మా ఎన్.గోపి ఎంత సమర్థుడంటే ఆయన తన ఈడు పిల్లలకు ఏ విషయంలోనైనా సందేహ నివృత్తి చేయగలిగేవాడు. ఆయన బిఎలో తెలుగు లింగ్విస్టిక్స్ తీసుకున్నాడు. ఆయనొక్కడే విద్యార్థి. ప్రొఫెసర్లందరూ ఆ ఒక్కడికే పాఠాలు చెప్పేవారు. తెలుగులో నిష్ణాతుడైపోయినాడు. తెలుగు సాహిత్యంలో గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. ఆయనిచ్చిన భరోసాతో, ఆయనిచ్చిన ధిలాసాతో నేను తెలుగు సాహిత్యంలో మంచి అభిలాషను కనబరిచిచాను. ఆయన నాకు బాగా దగ్గరి మిత్రుడు. ప్రాణమిత్రుడన్నా తప్పేమీ లేదు. ఈ ముగ్గురు మిత్రులు నాకు దొరకడం నా అదృష్టం. వీళ్ళు ముగ్గురు సామాన్యమైన జీవితం గడిపేవారు. వీరితో కలిసి ఉండడం వల్ల నాకు సమాజం బాగా అవగమమైపోయింది. హెచ్చులకు పోకుండా సాధారణ జీవితం గడపడానికి నాకు వీరు ఉపకరించారు. సాహిత్యంలో కూడా ఏ అనుమానం వచ్చినా వారు తీర్చేవారు. మాకు వేరే ఫ్రెండ్స్ ఉండేవారు కాదు. ఆ కాలంలో రౌడీయిజం వుండేది కానీ మేం ఎవరి జోలికీ పోయేది కాదు. అందరం కలిసి లైబ్రరీకి వెళ్తుండేవాళ్ళం. తరువాత నేను లెక్చరర్ జీవితంలోకి ప్రవేశించాను.

మరి పరిశోధనవైపు ఎలా వచ్చారు? పరిశోధనకి యాత్రా చరిత్రలే ఎందుకు ఎంచుకున్నారు?

లెక్చరర్ అయినాక ఒక పది సంవత్సరాల పాటు నిస్తేజంగానే ఉన్నాను. రచనల మీద ఎక్కువ ఆసక్తి చూపలేదు. 1977లో నేను గోపితో కలసి తంజావూరు వెళ్లాను. ఆయన 1977-78లో వేమన మీద పిహెచ్.డి. చేస్తున్నారు. ఆ ప్రయాణంలో నేను రాత్రంతా మేల్కొని ఉండి ఏ యే స్టేషన్లు వస్తున్నాయి, ఏ టయానికి వస్తున్నాయని అని డైరీలో నోట్ చేసుకున్నాను. ఇది ఆయన గమనించినాడు. అప్పుడేమీ అనలేదు. 1978లో వేమన పద్యాల గురించి మళ్ళీ తంజావూరు పోయినాం. కానీ అక్కడేం దొరకలేదు. అయితే సుమతీ శతక పద్యాలు తాళపత్రాలలో కనిపించినాయి. రెండు తాళపత్రాలు, రెండు రాతప్రతులు కనిపించినాయి. “దాసూ, రాసుకో ఇవి. ఎందుకైనా పనికొస్తాయి” అన్నాడాయన. రాసుకున్నాను. రాసుకున్న తర్వాత కూడా ఆరేండ్లు ఖాళీగానే వున్నాను. 1984లో అడిగాడు – “నువ్వు పిహెచ్.డి ఎందుకు చెయ్యవు… మన వాళ్ళందరు చేసినారు గదా, భూమయ్య చేశాడు, నేను చేశా… నువ్వు కూడా చేస్తే బాగుంటుంది” అని అన్నాడు. ఆయన రెండు అంశాలు సూచించాడు – గ్రంథ పరిష్కరణ పద్ధతులు ఒకటి; కరీంనగర్ జిల్లా గ్రామ నామాలు ఒకటి. సూచించినాడు గాని తర్వాతి కాలంలో గ్రంథ పరిష్కరణ పద్ధతులు నాక్కొంచెం కష్టమయితుందని భావించాడు. రెండవది గ్రామనామాలపై అప్పటికే ఎవరో పరిశోధన చేస్తున్నారట. అప్పుడాయనకి రైల్లో ప్రయాణం చేసిన సంఘటన ఫ్లాష్‌లా తట్టింది. అప్పటికే మా గురువుగారు నాయని కృష్ణకుమారిగారు కాశ్మీర దీపకళిక రాసి ఉన్నారు. ఆయనని ఆలోచన వచ్చింది. “నువ్వు యాత్రా చరిత్రల మీద పరిశోధన ఎందుకు చేయకూడదు?” అన్నాడు. ఇంటర్వ్యులో తను కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళకు చెప్పి ఒప్పించినట్లున్నాడు. ఆ అంశం మీదే పరిశోధన చేయడానికి అనుమతి లభించింది.

అయితే అప్పుడు ప్రొఫెసర్లు – ‘తెలుగులో యాత్రా రచనలు రెండు మూడు కంటే ఎక్కువ లేవు. దీని మీద నువ్వు పరిశోధన ఏం చేస్తావు’ అన్నారు. అప్పుడు వారికి ఏం జవాబు చెప్పిననో జ్ఞాపకం లేదు. ఎందుకంటే చాలా ఏండ్ల క్రిందటి విషయం కదా! మొత్తం మీద సీట్ అయితే వచ్చింది. అప్పుడు నేను నిర్మల్‌లో డిగ్రీ కాలేజిలో పనిచేస్తున్నాను. మా నాయన కరీంనగర్‌లో ఉన్నాడు. నిర్మల్‌లో నా సంసారం ఉంది. నేనేమో ఇక్కడికి రావాలి. పరిశోధన చేయాలంటే అప్పట్లో ఇన్-సర్వీస్ ఇచ్చేటోళ్ళు కాదు. నేను నలిమెల భాస్కర్ వంటి ఓ పది పదమూడు మందిమి ఉండేవాళ్ళం. అందరికీ అప్పడు ఇన్-సర్వీస్ వాళ్ళకి పిహెచ్.డి సీటు ఇచ్చినారు.

మీ పరిశోధనా క్రమం ఎలా సాగింది? యాత్రా చరిత్రలను ఎలా సేకరించారు?

సీటు రాగానే నేను రంగంలోకి దిగినా. నిర్మల్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడి కాలేజ్ లైబ్రరీ చాలా పెద్దది. అక్కడ వ్యాస రచనల సూచి అనే పెద్ద పుస్తకం నాకు లభించింది. అవన్నీ నోట్ చేసుకున్నాను. వ్యాసాలైనా సరే అనుకున్నా. భారతి లాంటి పత్రికల నుండి 80 వ్యాసాల దాకా దొరికినాయి. అవన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టుకున్నా. తర్వాత అప్పుడప్పుడు లీవ్ పెట్టి హైదరాబాదుకు వచ్చి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీలలో, కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం లాంటి గ్రంథాలయాలలో తిరుగుతూ 80 పుస్తకాలు సేకరించినా. సేకరించడమంటే… ఆ రోజుల్లో జిరాక్స్ చేసేటంత ఆర్థిక స్తోమతేం లేదు. డిగ్రీ కాలేజీల పనిచేస్తున్నప్పటికి వెయ్యి, పన్నెండొందలకి మించి ఎక్కువ జీతం లేదు. పైగా మూడు చోట్ల కుటుంబాన్ని పోషించాలి. ఇక్కడ మళ్ళీ హైదరాబాదులో ఉండాలి. అందుకని జిరాక్స్ చేయకుండా నాకు ఏదైతే అవసరమో ఆ పాయింట్లు నోట్ చేసుకునేవాణ్ణి. ఆ నోట్ పుస్తకాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. ఓ పది పన్నెండు పుస్తకాలలో రాసుకున్నాను. ఈ పుస్తకంలోంచి, ఏ లైబ్రరీలోంచి రాసుకున్నానో నోట్ చేసేవాడ్ని. దాదాపు ఆరు నెలల్లో 80 పుస్తకాల గురించి 80 వ్యాసాలు సేకరించగలిగాను. ఈ కారణంగానే నేను అందరికంటే ముందు పిహెచ్.డి.ని సబ్మిట్ చేయగలిగినా. 1987లో నాకు రిజిస్ట్రేషన్ అయ్యింది. ప్రీ పిహెచ్.డి. టెస్ట్ పూర్తయ్యాకా వెంటనే రంగంలోకి దిగి ఒక ఆరు నెలలలో రచన పూర్తి చేసినాను. అంటే ఆరు నెలలు లీవ్ పెట్టి పూర్తి చేసినా. మధ్యమధ్యలో కృషి చేస్తునే ఉన్నా, ఈ పదమూడు మందిలో అందరికంటే ముందుగా నేనే సబ్మిట్ చేసినా. ఒక్క కాశీయాత్రా చరిత్ర మీద మాత్రం ఎక్కువ కృషి చేసినా. అది మూడు వందల ఎనభై పేజీల పుస్తకం. దాన్ని ఏ యాభై సార్లు చదివినానో నా అంశం కొరకు. దాని మీద 25 శీర్షికలు పెట్టి, ఒక్కో శీర్షికకు మొత్తం పుస్తకమంతా చదివేవాడ్ని. ఇట్లా చేసి దాన్ని ఒక 120 పేజీల సారాంశంలా నా థీసిస్‌లో రాయగలిగాను. 1989 డిసెంబరులో ఉస్మానియా యూనివర్సిటీలో నా థీసిస్ సబ్మిట్ చేశాను. 1990లో నాకు పిహెచ్‌డి అవార్డు ఇచ్చారు, 1992లో థీసిస్‌ని ప్రింట్ చేసినాను – ప్రింట్ చేసుకుంటే నలుగురికి తెలుస్తుంది విషయం అనే ఉద్దేశంతోటి.

మీ పరిశోధన ద్వారా మీరేం తీర్మానించారు?

ఇందులో తీర్మానించడానికేం లేదు. కాకపోతే వీటిని ఎవరూ చదవడంలేదు. 1838 యేనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్రా చరిత్ర నుంచి మొదలుకొని 1989 వరకు దాదాపు 80 పుస్తకాలు సేకరించాను.

యేనుగుల వీరాస్వామి గారిపై మీరొక పుస్తకం రాశారు కదా…

అవును. ఆయన పేరుని ఏనుగుల వీరాస్వామయ్య అని వ్యవహరిస్తున్నారు. అది సరి కాదు. అయన పేరు యేనుగుల వీరాస్వామి. ఆయన మిత్రులు శ్రీనివాస పిళ్ళై గారు ఆయన మీది గౌరవంతో అయ్యగారు అనేవారు. అదే క్రమంగా వీరాస్వామయ్యగా మారింది. 2011లో సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు యేనుగుల వీరాస్వామి గారి జీవిత చరిత్ర రాయమని నన్ను సంప్రదించినారు. నాకంత శక్తిలేదని మొదట సంశయించినా.. అంగీకరించాను. తమిళనాడులో అనేక లైబ్రరీలు తిరిగినాను. ఎందరో పండితులను కలిసాను, ఎక్కడా సరైన సమాచారం దొరకలేదు. కొంతమంది పండితులు మీ థీసిసే ఉంది కదా, దాని ఆధారంగా మీరు ఆయన జీవిత చరిత్ర రాయండి సరిపోతుంది అన్నారు. నాకు ధైర్యం వచ్చేసింది. రాయడం మొదలుపెట్టినాను. ఈ విధంగా ‘తెలుగు జాతి రత్నాలు’ శీర్షికతో ఆ పుస్తకం వెలువడింది.

పరిశోధన కోసం మీరు సంప్రదించిన కొన్ని యాత్రా చరిత్రల పేర్లు చెబుతారా?

“ఆఁ. కోలా శేషాచలకవి నీలగిరి యాత్ర, 1868 అనుకొంటాను, తరువాత ముఖ్యమైనది 1967లో వచ్చిన నాయని కృష్ణకుమారి గారి కాశ్మీర దీపకళిక. ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటివి. కొంచెం సాహిత్యపు విలువలున్న రచనలివి. మిగతావన్నీ యాత్రలు చేసి రాసినవి. ఈ మధ్య కాలంలో మంచి రచనలు వచ్చినాయి. అవి నా థీసిస్‌లో రానప్పటికీ, నేను మళ్ళీ 70 పుస్తకాలు జనవరిలో సేకరించాను. యాత్రాచరిత్రలపై పరిశోధన చేసినానని ఈ రచయితలలో నన్నెవరు సంప్రదించనే లేదు. చాలామందికి అసలు తెలియదు. కేవలం యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్లకు మాత్రమే తెలుసు. నాకెలా తెలుసంటే అక్కడ నాకెవరు తెలియదు, కానీ నా పేరు చెప్పగానే తెలుగులో యాత్రా చరిత్రలపై పరిశోధన చేసింది మీరే కదా అంటారు. లేదు తెలుగులో యాత్రా రచనల ప్రస్తావన వచ్చినా మచ్చ హరిదాసు మీరే కదా అని అంటున్నారు. అంటున్నారే గాని ఎవరూ నా మీద ఒక వ్యాసం రాసినది లేదు, ఒకరిద్దరు రచయితలు ఈ ప్రక్రియ పేరుతోటి యాత్రా సాహిత్యం మీద వ్యాసాలు రాసినా ఆధారగ్రంథావళిలో నా పుస్తకం పేరుని కూడా ప్రస్తావించలేదు. ఇది నాక్కొంచెం బాధ అనిపించింది.

మీరు అప్పటి యాత్రా రచనలని, ఇప్పటి యాత్రా కథనాలని సేకరించి చదివారు కదా, ఈ రెండిటి మధ్య ఏదైనా తేడా కనబడుతోందా?

ఇప్పుడు రాస్తున్న యాత్రా రచనలలో నవలా రూపంలో రాస్తున్న మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక యాత్ర అని, అమెరికా అమెరికా అని పుస్తకాలు రాశారు. తరువాత పరవస్తు లోకేశ్వర్ గారు రాసేది బానేవుంది. గోపీగారు ఐదు విదేశీయాత్రలు చేసినారు. అఫీషియల్ టూర్స్ అన్నమాట. వాటిల్లో ఏంటంటే కొంత చరిత్ర కొంత స్వానుభవము ఉన్నాయి. కొంతమంది విహారయాత్ర పేరిట యాత్రలు చేస్తారు. కొంచెం చదివించే గుణం వీటిల్లో వుంది. పూర్వకాలం వాటిల్లో ఏంటంటే సాహిత్యపు విలువలున్నాయి. ఎం.ఎ. తెలుగు స్థాయి విద్యార్థులు వీటిని అర్థం చేసుకోగలరు. నాయని కృష్ణకుమారి గారిది గానీ, కోలా శేషాచలకవి గారిదైతే కొరుకుడు పడదు. పాషాణపాకంలో ఉంటుంది. పండితులకి మాత్రమే అర్థమవుతుందది. అన్నీ వచన రచనలే కాదు, పద్యరూపంలో వచ్చిన యాత్రాచరిత్రలు ఓ పది పన్నెండు ఉన్నాయి.

ఆచార్య ఫణీంద్ర లాంటివారు రాసినట్టున్నారు.

అవును. ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి. కాశీ వెళ్ళినవి, అమెరికా వెళ్ళినప్పటివి… నయాగారా అనీ.. ఇలా. ఆటాజనికాంచె అని ఎండ్లూరి సుధాకర్ గారు రాసినారు. జర్మనీ యాత్రలో కూడా కవితాయాత్ర గోపీ గారు రాశారు.

మీకు ఏ తేడా గోచరించింది ఈ రెండు రకాలలో?

యాత్రాస్మృతులు పద్య రూపంలో ఉన్నాయి, వచన రూపంలో ఉన్నాయి. నానీల రూపంలో కూడా ఉన్నాయి. నయాగారా అనేది నానీల రూపంలో రాసినదే. 1990 నుంచి ఇటీవలి కాలం వరకూ వచ్చిన 70 పుస్తకాలపై పరిశోధనతో రెండవ సంపుటం వేయాలనుకుంటున్నాను.

మీ అబ్జర్వేషన్స్‌తోనా?

అవును. ఒక అమెరికానే ముగ్గురు నలుగురు యాత్ర చేసినట్లయితే, తులనాత్మకంగా బేరీజు వేయాలని అనుకుంటున్నాను.

ఇటీవల కుమార్ కూనపరాజు అనే ఆయన రష్యా పర్యటన గురించి రాశారు….

“రాసిండ్రు కావచ్చు. నేను హైదరాబాదుకు పోతే ఎక్కువ నవోదయ బుక్ హౌజ్‌కే వెళ్తున్నాను. లైబ్రరీలు తిరుగుతున్నాను. నాకు దొరికినవి మాత్రమే సేకరిస్తున్నాను. నేనెవరికి పరిచయం లేకపోవడం వల్ల కావచ్చు… ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు యాత్రా రచనలు చేస్తున్నవారికి పెద్ద పెద్ద వాళ్ళే ముందుమాటలు రాస్తున్నారు.. వాళ్ళకు నేను తెలుసు. కాని ఎక్కడా కూడా ఒక వాక్యం… ఈ రంగంలో ఈ ప్రక్రియ మీద పరిశోధన జరిగింది అని చెప్పడం లేదు. అందుకే వాళ్ళెవరికి నేను పరిచయం కాలేకపోతున్నాను. లేకపోతే వాళ్ళు పుస్తకాలు పంపించేవారు.

అంటే మీరు ఈ రంగంలో పరిశోధన చేసినట్లు తెలిసి కూడా రాయలేదంటారా?

తెలిసి కూడా రాయలేదనే నేను అంటున్నాను. ఇది ఆన్ ది రికార్డే. నేను బాధ పడుతున్నాను కాబట్టి ఇలా చెప్పడం కరెక్టే. ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు.

తెలుగులో యాత్రా రచనలపై పిహెచ్‌డి చేసింది మీరొక్కరేనా?

లేదు. ఒకరు ఎం.ఫిల్ చేశారు. ఒకామె ప్రస్తుతం పిహెచ్.డి. చేసింది. 2015 రమ్యజ్యోతి అనే ఆమె ఎం.ఫిల్ చేసింది. 2018లో యాత్రారచనలపై పిహెచ్.డి. వచ్చింది. ఈ రెండూ కూడా సెంట్రల్ యూనివర్సిటీ నుంచే వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటిలో హిందీ డిపార్ట్‌మెంట్‍‌కి చెందిన పోతుకూచి మాధవి అనే ఆవిడ 1995లో అనుకుంటాను… నా థీసిస్‌ను ముందు పెట్టుకుని హిందీలోని యాత్రా రచనలతో 24 తెలుగువారి యాత్రా రచనలు పోల్చి తులనాత్మక రచన చేసింది. దాన్ని తెలుగు కిందకి కొంత తీసుకోవచ్చనిపించింది నాకు. ఎందుకంటే తెలుగువారి యాత్రా రచనలను దాంట్లో స్పృశించారు కాబట్టి. హిందీ తెలుగు యాత్రలపై తులనాత్మక పరిశోధన అయినా, ఉత్తర భారత యాత్రలపై దృష్టి ఎక్కువ పెట్టారు.

మీ మిగతా రచనలపై చర్చించే ముందు మీ పై మీ నాన్నగారి ప్రభావం ఎంత ఉందో వివరిస్తారా?

మా నాయనగారు చిన్నప్పుడు మూడో తరగతి మాత్రమే చదివినారు. మా ఊళ్ళో రెండవ తరగతి వరకే ఉండేది. రామానుజం అయ్యవారని మా ఊరికి దగ్గర గుండ్లపల్లిలో ఉండేవారు. ఆయన దగ్గరకి నడిచి వెళ్ళి చదువుకునేవారు. రామాయణం, భారతం, భాగవతం బాగా చదువుకున్నారు. తరువాతి కాలంలో ఆయన రామశతకం కూడా రాసినారు. సరస్వతీ మాత మీద ఒక శతకం రాసినారు. తత్వార్థ ప్రకాశిక అనే ఒక పుస్తకం రాసినారు. దాంట్లో రాగాలు, తత్వాలు, కీర్తనలను ఎక్కువగా రాసినారు. మాములుగా వరకవిలా ఆయన ఆశువుగా రచనలు చేసినారు. ఆయన రచనలను నేను రాస్తున్న క్రమంలో నాకు సాహిత్యంపై అభిలాష ఏర్పడింది. నాకు తెలియకుండా ఆయన ప్రభావం నాపై చాలా ఉందని అనిపిస్తుంది. ఆయన మీద ఈ మధ్య కాలంలో బి.వి.ఎన్. స్వామిగారు రేడియో ప్రోగ్రామ్ చేసినారు. తెలంగాణ తేజోమూర్తులలో ఆయనపై వ్యాసం కూడా వచ్చింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను.

మీరింత అత్యద్భుతమైన పాండిత్యము, సృజనాత్మకతా కలిగి ఉండి కూడా ఎందుకని పదిమందికీ తెలియకుండా ఉండిపోవాల్సి వస్తోంది?

అది నా స్వభావంలోనే ఉన్నట్టుంది. నాకు మొదటి నుండి కూడా ఎదుటివాళ్ళు ఏదైనా చెప్తే వినే అలవాటే ఉంది. మరి లెక్చరర్‌గా ఎలా రాణించారని మీరు అడగవచ్చు. తరగతి గదిలో వెళితే నేను మంచి వక్తగానే రాణించాను, విద్యార్థుల హృదయాలలో స్థానం సంపాదించాను. మాది హిస్టరి లాగానో, ఎకనామిక్స్ లాగానో కాదు కదా, పుస్తకం చేతిలో ఉంటుంది కాబట్టి పుస్తకంలోని పద్యం ఆధారంగా విశేషాంశాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. పుస్తకం లేకుండా చెప్పడం నాకు అలవాటు కాలేదు. అందుకే నేను బయట వక్తగా రాణించలేదు, పైగా నేను కవిని కూడా కాదు. కవిని కాకపోవడం వల్లా, వక్తను కాకపోవడం వల్ల నేను సమకాలీనులకు తెలియకుండా పోయినాను. “ఈయన రాత మనిషి కూత మనిషి కాదు” అని మా మిత్రుడొకాయన అంటాడు. అందుకే నన్ను వేదికలపైకి పిలవరు. అయితే పుస్తకం పంపితే సమీక్షలు చేయగలను. ఒక యాభై మందికి నేను సమీక్షలు చేశాను. వాటిని పుస్తక రూపంలో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను.

సమీక్ష ఎలా ఉండాలంటారు? సమీక్ష లక్షణాలేంటి?

సమీక్ష మొత్తం పుస్తకం యొక్క అంతస్సౌందర్యాన్ని వెలువరించేదిలా ఉండాలి. అతిగా పొగడకూడదు, అతిగా విమర్శించకూడదు. లోపాలుంటే సున్నితంగా తెలియజెప్పాలి. పొగడ్త ఎలా ఉండాలంటే సత్య విషయాన్నే మితంగా చెప్పాలి. స్తవం చెయ్యదు, వాస్తవం చెప్పాలనేది నా ఉద్దేశం. అతి పొగడ్త వల్ల ఎదుటివారు ఎదగరు. సమీక్ష రాతల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చదివేవారు మనల్ని తక్కువ అంచానా వేసేలా ఉండకూడదు. సమీక్ష అంటే ఇలా ఉండాలి అనుకునే విధంగా రాయాలి.

సమీక్షకీ, విమర్శకీ తేడా ఏమిటి? విమర్శ అంటే తింటడమే అనే అపోహ ఏర్పడిపోయింది.

విమర్శ అంటే మంచీ చెడుని విశ్లేషించడమేనని నా ఉద్దేశం. ఇటీవలి సమీక్షలలో చాలామంది తమ అభిప్రాయాలను పైపైన వెలిబుచ్చి, వ్యక్తి పొగడ్త ఎక్కువగా చేస్తున్నారు. అసలు లోపాలను బయటపెట్టడం లేదు. ఎందుకో మరి! అలా రాసేవాళ్ళకే ఇప్పుడు మంచి డిమాండు ఉంది. అలాంటి వాళ్ళతోనే రాయించుకుంటున్నారు. అలాంటివాళ్ళనే వేదికలపైకి పిలుస్తున్నారని నేను అనుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here