సంభాషణం: డా.ఎన్.వి.ఎన్. చారి అంతరంగ ఆవిష్కరణ

31
9

[box type=’note’ fontsize=’16’] సంచిక కోసం బహుముఖ ప్రజ్ఞాశాలి డా.ఎన్.వి.ఎన్. చారి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది. [/box]

[dropcap]అ[/dropcap]భిరుచి ఉండాలి గానీ, అనుకున్నది సాధించడం అంత కష్టమైన పని ఏమీ కాదు. పట్టుదల, దానికి తోడు క్రమశిక్షణ, పెద్దల ప్రోత్సాహం, సహాకారం, వాటికి కలిసివచ్చే వాతావరణం, ఇవన్నీ అనుకున్న పనికి సానుకూలత ఏర్పడే అంశాలు. అలాగే, ఒక పనిలో లేదా తన వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి, ప్రవృత్తిలో కూడా సమానమైన లేదా అంతకు మించిన విజయాలు సాధించకూడదనీ లేదు! అయితే ఇలాంటి వ్యక్తులు బహు అరుదుగా వుంటారు. అలాంటి అరుదైన ప్రజ్ఞావంతుల్లో, ప్రత్యేక సాహిత్యకారుడు డా. ఎన్.వి.ఎన్. చారి గారు. ఆయన సాహితీ జీవితాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందామా!

***

1) డా. చారి గారూ.. మీలో సాహిత్యాభిలాష ఎప్పుడు మొదలైంది? రచనా వ్యాసంగంలోనికి, ఎప్పుడు, ఎలా ప్రవేశించారు?

డా.ఎన్.వి.ఎన్. చారి

♣ మొదట గృహ వాతావరణం. బ్రహ్మీ ముహూర్తంలో లేచి, పనులు చేసుకుంటూ, అమ్మ పాటలు, పద్యాలు, శ్లోకాలతో చేసిన వీనుల విందు, రోజూ చెప్పిన కథలు, నాన్న జ్యోతిష్య పౌరాణిక ప్రభావం, నిత్యపూజలు, ఎన్నో అనుభూతులను నింపాయి. వారిద్దరూ నిత్యం పఠించేవి మాకు నోటికి వచ్చాయి. దానితో పాటు మా ఇల్లు ఒక గ్రంథాలయం కూడా!

ద్రావిడ, సంస్కృత, తెలుగు గ్రంథాలతో పాటు, అనేక నవలలు ఉండేవి. విశ్వనాథ, పడాల, కొవ్వలి, చిలకమర్తి వంటి లబ్ధప్రతిష్ఠుల రచనలు బాల్యంలోనే చదివే సౌభాగ్యం నాలో సాహితీ పరిమళాలు అద్దింది. ఇక రచనా వ్యాసంగం మాటకొస్తే, హనంకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల (1974-76) వార్షిక సంచిక కోసం, ‘ఎవరు గొప్ప’ అనే ఆరు పద్యాల కథను పంపాను. వాటిని అచ్చులో చూసుకున్నప్పుడు, అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. తరువాత కాకతీయ డిగ్రీ కళాశాలలో, బి. కామ్ -మొదటి సంవత్సరంలో

“నేను గాంచితి స్వప్నము నేటి రాత్రి,
మాత భారతి కనిపించే మమత తొడ,
కనుల భాష్పాలు కాల్వలై కారసాగే,
కష్ట కారణం బడిగితి కౌతకమున”

అంటూ, ‘మాతృ బోధ’ శీర్షికతో ప్రకటించాను. అభ్యుదయ భావ జ్వాల రగిలే వయసు కదా, అలాంటి భావాలే ప్రతిఫలించాయి. నాటి స్థానిక పత్రికలో అవి చోటు చేసుకున్నాయి.

2) విద్యార్థి దశలో ఏ భాష పట్ల మీకు ఎక్కువ మక్కువ ఉండేది? ఎందుచేత?

♣ నిశ్చయంగా తెలుగే! అమ్మ భాష అనండి లేదా ఇంటి భాష అనండి అది ఇంపైన భాష, పదునైన భాష! మనసులోని భావాలు మన భాషలో చెప్పినంత స్పష్టంగా పరాయి భాషలో చెప్పలేము. నాకు సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలలో ప్రవేశం వున్నా వాటిలో చెప్పాలన్న ఆవేశం ఉండేది కాదు. మన భాష అర్థం కాని ప్రేక్షకులున్న సదస్సులలో, గోష్ఠులలో తప్ప నేను ఎప్పుడూ ఇతర భాషలలో ప్రసంగించలేదు. ఒక భాషా నిర్మాణం సంపూర్ణంగా అధ్యయనం చేస్తే ఇతర భాషలు సులభంగా నేర్చుకోవచ్చు.

3) మీరు చదువుకున్నది, బోధించినది వాణిజ్య శాస్త్రంకదా! తెలుగు సాహిత్యం పట్ల మీకు ఇంత అభిరుచి కలగడానికి గల కారణం?

♣ వాణిజ్యంలో వున్న ‘వాణి’దయే నండీ! డిగ్రీలో తెలుగులో 90 మార్కులొచ్చాయి. తేనెలొలికే తెలుగు సాహిత్యం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు! మా అన్న శ్రీనివాస రంగాచార్య, నా తెలుగు గురువులు సంపత్కుమార వంటి వారి ప్రేరణ ఒకటైతే, లష్కర్ బజారు హైస్కూల్‌లో, ఇంటర్, డిగ్రీలలో వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో/కథలు, కవితల పోటీలలో బహుమతి పొందిన అనేక సాహిత్య గ్రంథాలు మరింత ఉత్ప్రేరకాలయ్యాయి. వీటికి తోడు సహజ సిద్దమైన దైవ సంకల్పం బలీయంగా ఉన్నది.

4) ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో వుండి, మీ ప్రవృత్తుల్లో ఒకటైన తెలుగు సాహిత్య రచనా వ్యాసంగంలో కూడా పట్టు సాధించడం మీకు ఎలా సాధ్యం అయింది?

♣ ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రవృత్తిని వృత్తిలో భాగంగా చేసుకోవడమే! విద్యార్థులలో కూడా వృత్తిపరమైన బోధనలే కాక, సాహిత్యాభిలాష కలిగించడం, సాహిత్య -సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా పనిచేయడం వల్ల నన్ను చాలా మంది తెలుగు ఉపన్యాసకునిగా భావించేవారు. ప్రతి రోజూ తెల్లవారు ఝామునే లేచే అలవాటు వల్ల, ఆ సమయంలో సాహిత్య సృజనకు అవకాశం దొరికేది. రెండు కన్నుల్లా సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం ప్రణాళికాబద్ధంగా నా సమయాన్ని కేటాయిస్తాను. చిన్ననాటి అధ్యయనం విద్యార్థి దశలో(డిగ్రీ) అన్ని తరగతుల విద్యార్థులకు వారి వారి అవసరాలను బట్టి, ఆంగ్లం-తెలుగు-లెక్కలు వంటి అన్ని సబ్జెక్టులు బోధించడం వల్ల ‘వ్యయే కృతే – వర్ధతేవ నిత్యం’ అన్నట్లుగా లభ్యమైన జ్ఞానం, జిజ్ఞాస, సమయ పాలన నాకు లభించిన దైవ దత్త వరాలు, అవే నా సాహిత్యాభరణాలు.

చుక్కా రామయ్య గారితో డా. చారి

5) కథకుడిగా, కవిగా, పద్య కవిగా, వ్యాసకర్తగా, పాఠ్యపుస్తక రచయితగా, నటుడిగా, ‘సహృదయసంస్థలో ప్రధాన పాత్రధారిగా, సామాజిక సేవా కార్యకర్తగా, ఆధ్యాత్మిక సేవకుడిగా, ఇలా మీరు ప్రతిదానిలోనూ విజయం సాధించడం ఎలా సాధ్యపడింది?

♣ మేనేజ్మెంట్ – మానవ స్వభావ శాస్త్రాల ఉపన్యాసకునిగా మీకు ఒక విషయం చెబుతాను. ప్రతి వ్యక్తి నిజ జీవితంలో, తండ్రి-కొడుకు, భార్య-భర్త, ఉద్యోగి -వ్యాపారీ, ఇలా అనేక పాత్రలను పోషిస్తాడు. అందుకేనేమో జీవితం ఒక నాటక రంగం అన్నారు. ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందులో లీనమైతేనే పాత్ర రక్తి కడుతుంది. అందుచేత తరగతి గదిలో వున్నప్పుడు బోధనా బాధ్యత మాత్రమే నిర్వహిస్తాను. కవిత్వం రాసేటప్పుడు, కవి మాత్రమే బయటికి వస్తాడు. సేవ చేసే సమయంలో దృష్టి అంతా దానిపైనే, చేస్తున్న పనిపట్ల ఏకాగ్రతతో అంకితభావం కలిగి చేయడమే నా అలవాటు. ఏకాగ్రత, చిత్త శుద్ధి, సమయజ్ఞత, సంకల్ప బలం ఉంటే ఎవరైనా తాము పోషించే అన్ని రంగాల్లోనూ రాణిస్తారు.

6) ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థవరంగల్‌కు దక్కిన ఒక గొప్ప సంస్థగా పేరుపొందింది కదా! ప్రస్తుతం ఆ సంస్థకు మీరు ప్రధాన కార్యదర్శిగా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి? మీ అనుభవాలు జోడించి చెప్పండి!

♣ 1996లో మానవీయ, నైతిక విలువల ప్రాతిపదికపై సాహిత్య, సాంస్కృతిక రంగాల ద్వారా, సమాజంలో మృగ్యమైపోతున్న భారతీయ- సంస్కృతీ, సాహితీ సంపదలను పరిరక్షించి, ప్రజానీకానికి అందించే సదుద్దేశంతో ‘సహృదయ’ సంస్థ ఏర్పడింది. దానికి చెరగని బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు, వనం లక్ష్మీకాంతా రావు, ఏ. వి. నరసింహా రావు, డి.వి శేషాచారి, డాక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్, కుంధావజ్జుల కృష్ణమూర్తి, లక్ష్మణ రావు వంటి అనేకమంది పెద్దలు సంస్థకు చక్కని బాట వేశారు. ఆ బాటలో దారి తప్పకుండా, సునాయాసంగా ‘సహృదయ’ వాహక బాధ్యతలు నిర్వహించగలుగుతున్నాను.

శత పద్య కవి సమ్మేళనంలో డా. చారి

ముఖ్యంగా తెలుగు భాషా – ఆహ్వాన నాటిక పోటీలు గత 20 సంవత్సరాలుగా, ఘనంగా నిర్వహిస్తున్నాం. రామాయణ, భారత, భాగవత, భగవద్గీత, ఉపనిషత్తులు – వేదసూక్త నిధి వంటి బృహత్కార్యక్రమాలను నిర్వహించాం. తెలుగు రాష్ట్రాలలోని లబ్ధప్రతిష్ఠులైన పండితులు, ప్రవచకులు, కవులు, మొదలైన వారంతా ‘సహృదయ’ వేదికపై ప్రసంగించినవారే! తెలుగువాడి గర్వ చిహ్నమైన అవధానాలను నిర్వహించాము. ముఖ్యంగా వరంగల్‌కు చెందిన (ఇనుగుర్తి) సుప్రసిద్ధ కవులు ‘ఒద్దిరాజు సోదర కవుల’ జ్ఞాపకార్థం వారి వారసులు, సంస్థ ప్రస్తుత కోశాధికారి శ్రీ ఒద్దిరాజు వేణుగోపాలరావు సౌహార్ద్రంతో ప్రతి సంవత్సరం ఒక సాహిత్య ప్రక్రియకు (ఉత్తమ నవల/కథ పద్యకావ్యం, కవితా సంపుటి, సాహితీ విమర్శ) బహుమతిగా పది వేల రూపాయలు నగదు పురస్కారం అందిస్తూ, ఆయా రంగాలలోని రచయితలను, కవులను ప్రోత్సహిస్తున్నాము. దీన్ని ప్రతి యేటా సంస్థ వార్షికోత్సవంలో సమర్పించి సత్కరిస్తున్నాం. ‘సహృదయ’కు ఆప్తులు, ప్రముఖ అవధాని, కవి పండితులు – శ్రీ కవితాప్రసాద్ పేరిట సాహితీవేత్తలైన పాలనాధికారులకు ‘సహృదయానంద’పురస్కారం అందిస్తున్నాం.

7) సాహితీ రంగానికి సంబంధించి వరంగల్‌లో మీరు గమనిస్తున్న పురోగతి ఏ స్థాయిలో వుంది? ఇంకా మీరు ఎలా వుండాలని ఆశిస్తున్నారు?

♣ అలనాటి సాహితీ వైభవ ప్రాభవం ఇప్పుడు తగ్గుతుందనే చెప్పాలి. వాసి కంటే రాశికి ప్రాధాన్యత పెరిగింది. కవులు పెరిగారు, కవిత్వం తగ్గింది.

ఎంతో మంది ఏవేవో ప్రక్రియల పేరిట కవిత్వం వెలయిస్తున్నారు. అక్షరాల లెక్క కంటే కవితాత్మను చెక్కడం ముఖ్యమని గ్రహించాలి. దీనికోసం కార్యశాలలు నిర్వహిస్తే కవిత్వం నిగ్గు తేలుతుంది. యువకవులను ప్రోత్సహించే సమ్మేళనాలు బహుళ సంఖ్యలో నిర్వహించాలి పాఠశాల/కళాశాల స్థాయిలో సాహితీ సమావేశాలూ,కవిత/కథల పోటీలు నిర్వహించడం అవసరం.

కుటుంబ సభ్యులతో డా. చారి

8) నేటి యువతీ యువకుల్లో తెలుగుభాష పట్ల ఎలాంటి అభిప్రాయం వుంది? ఎందుచేత?

♣ ‘ఫాస్ట్ ఫుడ్ కల్చర్’ యువతీ యువకుల్లో ప్రబలిపోయింది. చదివే సంస్కృతీ అంతరించి పోతున్నది. విచిత్రం ఏమిటంటే పరీక్షలకు ముందు స్మార్ట్ ఫోనులో డౌన్‌లోడ్ చేసుకుని పాస్ అయితే చాలు అన్న వైఖరి కనిపిస్తున్నది. కాన్వెంటు విద్యా విధానం కూడా తెలుగును దూరం చేస్తున్నది. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు సాధిస్తామనే అపోహ కూడా వారిని తెలుగు పట్ల విముఖులను చేస్తున్నది.

9) పుస్తక రూపంలో వచ్చిన మీ రచనల గురించి చెప్పండి?

♣ పుస్తకరూపం దాల్చిన వాటికంటే అచ్చువేయని పుస్తకాలే ఎక్కువ వున్నాయి.1) నవస్వరాలు 2) విజయ గణపతి శతకం 3) శ్రీవత్సాంకం {స్మృతికావ్యం – మా బాబు స్మృతిలో} 4) తెలుగు అకాడమీ, స్పెక్ట్రమ్- పబ్లికేషన్స్, అంబేద్కర్ విశ్వవిద్యాలయం ద్వారా 17 పాఠ్య పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

10) మీరు అందుకున్నసత్కారాలు అవార్డుల గురించి వివరిస్తారా?

♣ చాలా వున్నాయి, కొన్నిమాత్రం వివరిస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, చదలవాడ కృష్ణమూర్తి – తేజా చారిటబుల్ ట్రస్టు – తిరుపతి విద్యా సంస్థల ద్వారా ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ పురస్కారం, విశ్వశాంతి, ఒంగోలు వారి జాతీయ ఉత్తమ పద్య కవి పురస్కారం, సంస్కార భారతి ఉగాది పురస్కారం వంటి అనేక పురస్కారాలు నా బాధ్యతను నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. ‘సంచిక’ వంటి ఒక మంచి పత్రికలో నన్ను పాఠకులకు పరిచయం చేసినందుకు,గర్వంగానూ,ఆనందము గానూ వుంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here