సంభాషణం: కథా, నవలా రచయిత ‘గంటి రమాదేవి’ గారి అంతరంగ ఆవిష్కరణ

15
9

[dropcap]సం[/dropcap]చిక కోసం – కథా, నవలా రచయిత గంటి రమాదేవి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.

~

రచయిత్రిగా భ్రమ కలిగించిన రచయిత…!!

కథలు రాయడం, వాటికి పేరు పెట్టడం, ఎంత కష్టమైన పనో, వాటిని పాఠకుడి చేత చదివించేలా, ఆకర్షింప జేయడమూ అంతేకష్టమైన పని. దీనికి తోడు, అసలు పేర్లతో కాక, ఆకర్షణీయమయిన పొట్టి ‘కలం’ పేర్లతో సాహితీ రంగంలో, రచనా వ్యాసంగంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కుతూహల పడతారు కొంతమంది రచయితలు/రచయిత్రులు. ఒకానొక కాలంలో, కేవలం రచయిత్రులు, కవయిత్రులు పత్రికారంగాన్ని ఏలుతున్నప్పుడు, కవులు, రచయితలూ కూడా స్త్రీమూర్తుల పేర్లు తగిలించుకుని (పురాణం సీత.. వంటి పేర్లు దీనికి మినహాయింపు) రచనలు చేసిన చరిత్ర మనకు ఉంది. అయితే ఆ పేర్లు కొంతకాలానికి తెలిసిపోయేవి. బహుశా ఇదే కాలంలో అనుకుంటా, ఒక రచయిత అసలు  గుర్తుపట్టలేనంతగా (ఇప్పటికీ) ఒక మహిళామూర్తి  పొడుగు పేరును, కలం పేరుగా మార్చుకుని వందల సంఖ్యలో కథలు రాశారు. ఇప్పటికీ రాస్తున్నారు కూడా. వీరి పేరు మీద ఇంకొక రికార్డు కూడా ఉంది.

వీరు పాతతరం రచయిత అయినప్పటికీ, ఇప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల, ఆయన రచనలు పుస్తకరూపం దాల్చకపోవడం. ఈ రోజుల్లో ఇది వినడానికి కొంత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.. ఇంతకీ ఆ కలం పేరు చెప్పలేదు కదూ! ఆయన కలం పేరు ‘గంటి రమాదేవి’. రాజోలుకు చెందిన శ్రీ గంటి సుబ్రమణ్య శర్మ గారి మిగతా వివరాలు ఆయన ద్వారానే తెలుసుకుందాం …..

నమస్కారమండీ!

నమస్తే డాక్టర్ కే.ఎల్.వీ. ప్రసాద్ గారూ!

సాహిత్యం వైపు మీ మనసు మళ్ళింది ఎప్పుడు? కథా రచనకు మీ కలం ఎప్పుడు ఎలా అరంగేట్రం చేసింది?

..అక్షరాలు కూడబలుక్కు చదివే సమయంలో ‘చదవడం’ మీద ఇష్టం ఏర్పడింది. అన్నం మానేసి, పుస్తకాలు చదువుతూ వుంటే.. ‘అవి ఎక్కడికీ పోవు.. ముందు తిని వెళ్ళ రా!.. అందరూ వచ్చేసారు.’ అని అమ్మ బుజ్జగింపుగా అనేది. మా ఇంట్లో నేను ఆరవ సంతానం. ముందు నా పై అయిదుగురు అక్కలు. అందరికీ తమ్ముడిని నేను. కొంత గారాబం వుండేది. ఈ పిలుపు అలవాటు గా మారి.. నా కన్నా చిన్న వాళ్ళు కూడా ‘తమ్ముడు’ అనే అనేవారు. తమ్ముడు నా పేరుగా మారిపోయింది.

ఇంకా రాకపోతే.. ‘దీపాలు పెట్టే వేళయింది.’ అని గట్టిగా అమ్మ అనేది. మీకు అర్థమై వుంటుంది. మా ఇంట్లో కరెంటు లేదు. మా వూరిలో కూడా లేదు. కిరసనాయిలు దీపాల వెలుగులో చదువు సాగేది. ముందుకు వంగి చదువుతూ వుంటే, కిరసనాయిల్ పొగ ఉక్కిరి బిక్కిరి చేసేది. అప్రయత్నంగా కళ్ళు మూతలు పడేవి. ముందున్న పెద్ద జుట్టు చురచురా కాలిపోయేది. ప్రమాదమేమీ లేదు. పక్కనే అక్కలు వున్నారు కదా! .. ‘చదివింది చాలు. ఇక పడుకో..’ అని ఎత్తుకుని మంచం మీద పడేసే వాళ్ళు. చదవాలని అనిపించింది చిన్నప్పుడే.

మా వూర్లో ఒకటో రెండో వార్తా పత్రికలు, దినపత్రికలు వచ్చేవి. అవి మునసబు గారికి ఒకటి, పంచాయితీ ఆఫీసులో ఓ ఉద్యోగి తెప్పించుకునేవారు. ఇంకో తమాషా.. ‘ఈ’ రోజు పేపర్ ‘రేపు’ వచ్చేది. మాకు మాత్రం.. ఆ ఒక రోజు పాత న్యూసే.. హాట్ న్యూస్!

మాది మట్టి ఇల్లు.. రూఫ్ తాటాకులు, కొబ్బరి ఆకులు. మా చిన్న వూరి చుట్టూ గోదారి. ఎటు వెళ్ళినా, ఎటు చూసినా నీళ్ళే.. వరదల కాలంలో వూరు మునిగి పోయేది. ఎక్కువ వరదలు వచ్చేవి. ఇల్లు మునిగిపోతే.. అటకల మీద వుండే వాళ్ళం. రేడియో లేదు. సినిమా లేదు. ఉన్నది అక్షరాలు మాత్రమే. చదవడానికి బలమైన కారణం.. ‘ఏమీ లేకపోవడం’’.

ఇక బంగాళాఖాతం దగ్గర కాబట్టి.. భయంకరమైన తుఫానులు వచ్చేవి.. దేనికీ భయం లేదు.

ఈ ఈతి బాధలు మామూలుగా వుంటాయి అనే అమాయకత్వం. ఈ బాధలు అందరూ పడుతున్నారు అనే నమ్మకం. ఆ భావనలో బాధ తెలిసేది కాదు.

ఓ రోజు స్కూల్‌కి రోజు వెళ్ళాను. నాలుగయిదు సంవత్సరాల వయసు. అదీ బలవంతం వల్ల.

మరీ ‘పొట్టి బుడంకాయ’లా వుండడం వల్ల, పెద్ద పిల్లలు మెట్ల మీద నుంచి తోసేసే వాళ్ళు. దెబ్బలు తగిలేవి.

…ఇక స్కూల్‌కి వెళ్లనని అంటే.. మా నాన్నా, అమ్మా, వెంటనే ఒప్పేసుకున్నారు. మా ఇంటి పక్క అరుగుల మీద ప్రైవేటు స్కూల్‍లో చేర్పించారు. ఆట పాటలు లేవు. స్నేహితులు లేరు. పుస్తకాలే స్నేహితులు.

పొద్దున్న ఎనిమిది నుంచి పదకొండు వరకు.. సాయంత్రం రెండు నుంచి సాయంత్రం అయిదు వరకు.

ఆ మేష్టారు గారు మాకు దగ్గర వాడు. అది ‘అడ్వాంటేజ్’గా తీసుకుని మా వాళ్ళు.. స్కూల్ టైం మార్చేసారు. ఉదయం ఏడున్నర నుంచి పదకొండున్నర వరకు.. మధ్యాన్నం ఒంటి గంట నుండీ, సాయంత్రం ఆరు గంటల వరకు. ఆ సమయాల్లో ఆ స్కూల్‌లో నేను ఒక్కడినే.. ‘బిక్కు బిక్కు’మంటూ. నా పక్కన పుస్తకాల సంచీ.. నా నేస్తం. అప్పుడప్పుడు ఓ కుక్క వచ్చి వింతగా చూస్తూ అక్కడే వుండేది.

ఈ ‘లాంగ్ అవర్స్’ చదువు కూడా .. పఠనాసక్తి పెంపొందించి వుంటుంది.

మీ మొదటి కథ ఎప్పుడు రాశారు? మీ మొదటి కథ ప్రచురించిన పత్రిక ఏది? అప్పుడు ఆ పత్రిక అందించిన రెమ్యునరేషన్ ఎంత?

‘అరుగు’ స్కూల్‌లో అయిదు వరకు చదివిన తర్వాత.. డైరెక్ట్‌గా ‘ఫస్ట్ ఫాం’ (అంటే ఇప్పటి సిక్స్త్ క్లాస్)లో వెయ్యడానికి ప్రయత్నం చేసారు. మా వూరిలో హైస్కూల్ గానీ, మిడిల్ స్కూల్ గానీ లేవు. మా తాలుకా టౌన్‌లో ప్రయత్నం చేసారు. నా అయిదు క్లాసులూ రెండేళ్ళలో అయిపోయాయి. తాలుకా స్కూల్‌లో ‘ఎంట్రన్స్ టెస్ట్’ పెట్టారు. దానిలో ‘ఫెయిల్!’. మేము కట్టిన ‘ఎంట్రన్స్ ఫీ’.. ఒక పావలా (25 నయా పైసలు.. అప్పుడు నయా రాలేదు).. తిరిగి ఇచ్చేసారు. ఆ పావలాతో ఎన్నెన్నో కొనుక్కుని తిని, ఇంటికి వచ్చి, పెద్దలు కొట్టిన దెబ్బలు తిని, సంతోషంగా మా కుగ్రామానికి వచ్చేసాను తిరుగు టపాలో.

మా మేష్టారు కొంత సేపు బాధపడి.. ‘ఫస్ట్ ఫాం పోతే పోయింది.. ఈ సంవత్సరం చదివించి సెకండ్ ఫాంలో వేసేద్దాం!’ అన్నారు. మళ్ళీ లాంగ్ అవర్స్. నో గేమ్స్.. నో ఎంటర్‌టైన్‌మెంట్! బుక్స్.. మరియి నేను.

సెకండ్ ఫాం ప్రతిపాదనకి మా ఇంట్లో అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మా వాళ్ళు నా మీద పెట్టిన ఖర్చు కేవలం అయిదు రూపాయల గురుదక్షిణ!

మరుసటి సంవత్సరం.. మిడిల్ స్కూల్, హై స్కూల్ వున్న పెద్ద టౌన్‌కి పంపించారు. అక్కడ కరెంట్ కూడా వుంది. అది మా మేనమామ గారిల్లు.. ఆయనకి పిల్లలు లేరు. నాకు బయటకు వెళ్ళే అనుమతి లేదు. సరి జోడు పిల్లలతో ఆటలు లేవు.

ఓ రోజు.. స్కూల్ నుంచి వస్తూ ఓ గ్రంథాలయం చూశాను. అది మునిసిపల్ లైబ్రరీ! అక్కడ పుస్తకాలు చదువుతూ వుండి పోయేవాడిని. ఇంట్లో నా ఈడు వాళ్ళు ఎవరూ లేరు. ఒంటరి జీవితం! అప్పుడు చందమామ ఎక్కువగా చదివే వాడిని. ‘బాల’ అనే పత్రిక కూడా వచ్చేది. ఆ తర్వాత.. ‘బాలమిత్ర’ అనే చందమామ టైపు పత్రిక వచ్చేది. ఆ లైబ్రరీ లో ఆంధ్రప్రభ వచ్చేది.

చిన్న ‘పాంట్’ అక్షరాలు అప్పుడు నచ్చేవి కాదు. క్రమంగా అవీ చదవడం అలవాటయింది.

స్కూల్ పుస్తకాలు చదవమని ఎవరూ చెప్పేవారు లేరు. స్కూల్ మార్కులు, ఆ చదువు అంతంత మాత్రమే. ‘no asker no teller’. ఏడవ తరగతి పరీక్ష ఎలా పాసయ్యానో ఐడియా లేదు. నేను సెకండ్ ఫాంలో చేరబట్టి, నాకు హిందీ సబ్జక్ట్ తీసుకునే వీలు లేకుండా పోయేది. ఆరవ తరగతిలో హిందీ మొదలు. ఆరు క్లాసులు మూడేళ్ళ లో పూర్తి చేసిన నాకు.. హిందీ కూడా అలా చెయ్యవచ్చని ఎవరూ చెప్పలేదు. నో ఆస్కర్ .. నో టెల్లర్! కదా! థర్డ్ ఫారం మిడిల్ స్కూల్‌లో అయిపోయింది.

అప్పుడు.. నూతి పళ్ళెంలో పడి నా చెయ్యి విరిగింది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ఈ లోపల తొమ్మిది తరగతి ప్రవేశాలు పూర్తయి పోయాయి. ఎడం చేయి ప్లాస్టర్ నన్ను బాధించేది.

తిరుమల కొండ పై.. extreme right.. కుడి వైపు వున్నది రచయిత కుమార్తె రమాదేవి. Extreme left వున్నది చిన్న అమ్మాయి..అన్నపూర్ణ.

స్కూల్‌లో ప్రవేశం లేదు అనేసరికి, నేను నా బాధ మరిచిపోయాను. to hell with school అని సంబరపడిపోతూ, మా అందాల వూరికి వెళ్లి పోవచ్చు అనుకునే సమయంలో, పట్టు వదలని మా పెద్ద వాళ్ళు, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారి ముందు నన్ను నిలపెట్టారు. పొట్టి నిక్కర్ వేసుకుని, ‘నేలకు కొట్టిన వంకాయలా’ వున్న నన్ను చూసి, నా చేతికున్న ప్లాస్టర్ చూసి.. ‘as a special case’ అని తొమ్మిదవ తరగతిలో ప్రవేశం ఇచ్చేసారు హెడ్ మాస్టర్ శ్రీ కృష్ణమాచార్య గారు.

తొమ్మిది తరగతిలో పెద్ద పెద్ద పిల్లలు వుండేవారు. నా పర్సనాలిటీ చూసి, వాళ్ళు తమలో చేర్చుకునే వాళ్ళు కాదు. నా అంత పిల్లలు ఇంకా ఆరో తరగతిలో వుండేవారు. ఈ ఒంటరితనం.. నన్ను పుస్తకాలకి దగ్గర చేసింది. కానీ… స్కూల్ పుస్తకాల వరకు.. అదే పాత పద్ధతి. మేనమామ ఇంట్లో… ‘no asker teller’ రిపీట్ అయింది. .. స్కూల్ లో చెప్పినదే.. మళ్ళీ చదివే పని లేదు. అయినా.. తొమ్మిది తరగతి పాసయ్యాను.

అది 1956 సంవత్సరం. స్కూల్ మాగజైన్ లో కథలు, వ్యాసాలూ, కవితలూ, కావాలని మా క్లాస్ టీచర్ అడిగగానే నేను ఓ కథ రాసి ఇచ్చాను. కథ పేరు గుర్తు లేదు. అది చందమామ కథలా వుందని గుర్తు. of course.. అది ప్రింట్ అవలేదు. First rejection.

1957లో SSLCలో ప్రవేశం. మొదటి rejection వల్ల మరలా రాయడానికి మళ్ళీ ప్రయత్నించలేదు. అదే సంవత్సరం పరీక్ష రాయడానికి సమస్య వచ్చింది. SSLC లాటి పెద్ద పరీక్ష రాసే వయసు రాలేదు. పీడా పోయింది. అనుకుంటూ వుంటే.. మా మేనమామ గారు.. దానికి సరి పోయే విధంగా నా date of birth మార్చి పరీక్షకి ‘అర్హత’ సాధించారు.

చదువులో అదే ‘అయోమయ’ ధోరణి. రోజుకి రెండు పరీక్షలు విధానం వుండేది అప్పుడు.

9 నుంచి 12 వరకు. మధ్యాన్నం 2 నుంచి అయిదు వరకు. SSLC అనే పరీక్ష ఎంత పెద్దదో తెలిసేది కాదు. రాత్రి ఎనిమిది వరకు మాత్రమే చదువు. రెండు సబ్జెక్ట్‌లూ ఆ లోపలే చదివి, పరీక్షలు రాశాను. పాస్, ఫెయిల్ అనే వాటి గురించి ఆలోచించేది లేదు. అది ఓ ‘నిర్వాణ’ స్థితి.. ఫెయిల్ అయితే ఎవరూ కొట్టరు. అడగరు. పాసయితే మళ్ళీ పరీక్ష ఫీజ్ పదిహేను రూపాయలు కట్టనక్కరలేదు అని సంతోషించే వాళ్ళు.

తెలుగు రెండు, ఇంగ్లీష్, రెండు, పరీక్షలు, maths, science, social studies .. ఇలా ఉండేవి పరీక్షలు.. ప్రతీ రోజూ.

మార్చి పరీక్షలు ఫలితాలు, జూన్ చివర వచ్చేవి. నాకు ఆశ్చర్యం! మా వాళ్లకి ఆశ్చర్యం..

first attempt లో అన్నీ సబ్జెక్ట్ లలో పాసయ్యాను. ఆ సంవత్సరం .. maths లో పాస్ మార్క్ 25 .. నాకు 35 వచ్చాయి.

ఇక చదువు అయిపొయింది. పుస్తకాలు అన్నీ కట్ట కట్టి అటక మీద పడేసాను. పై చదువులకి ‘ఛాన్స్’ లేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఆ రోజుల్లో.. ఉద్యోగం కావాలంటే.. typing, shorthand తప్పని సరి. దానికోసం ఓ టైపు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. టైపు డబ్బా కొట్టడం బాగానే వచ్చింది. చాలా ‘లీజర్’ వుండేది. ఆ ఖాళీ సమయంలో లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపే వాడిని. అప్పుడే పెద్ద కథలు చదువుతూ వుండే అలవాటు అయింది. ఆరుద్ర, మల్లాది, కథలు వచ్చేవి. ఆంధ్ర ప్రభలో మల్లాది వారి (ఆయన సీనియర్ మల్లాది.. మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు కాదు).. ఆయన సినీ రచయిత కూడా అనుకుంటా.. భారతి అనే మాస పత్రికలో వ్యాసాలు చదివే వాడిని.

స్కూల్‌లో ఉండేటప్పుడే… డిటెక్టివ్ సాహిత్యం చదవడం అలవాటు అయింది. కొత్త డిటెక్టివ్ పత్రికలు వచ్చేవి. ‘శనివారం హంతకుడు’ అన్న మొదటి కథ నాకు డిటెక్టివ్ సాహిత్యం అలవాటు చేసింది. టెంపో రావు, కొమ్మూరి సాంబశివరావు, జొన్నలగడ్డ, లాటి రచయితల కథలు.. సినీ నటుడు జగ్గయ్య రాసిన నవలలు, పేకేటి సాంబశివరావు రాసిన నవలలు, ఆరుద్ర నవలలు విపరీతంగా చదివే అలవాటు. ఒక రాత్రి రెండు మూడు గంటలు చదివి పుస్తకం తిరిగి ఇచ్చేయాలి. మరో రోజు ‘రెంట్’ ఇచ్చుకోలేక. ఎన్ని పుస్తకాలు ఇచ్చినా ఆనందంగా చదివే అలవాటు అయింది.

అయినా.. నా మొదటి కథ రాయడానికి సమయం పట్టింది. ఎవరి గైడెన్స్ లేదు. మా కుటుంబంలో హై స్కూల్ చదువు వరకు వచ్చింది నేను ఒక్కడినే. కథ నిడివి పరిమితి తెలిసేది కాదు. నేను రాసిన కథలు తిరిగి వచ్చేవి. అటూ కథా కాదు, నవలా కాదు లా నా పరిస్తితి. .

ఇలా చాలా కథలు తిరిగి వచ్చిన తర్వాత.. ఒక రచయిత సలహా ఇచ్చాడు. పత్రికల వాళ్ళు .. ‘ఇంచ్’ ‘ఇంచ్’ లెక్క పెడతారు. ఇరవై ఇరవై అయిదు పేజీలు వేసుకోరు అని.

ఆ సలహా పని చేసింది. అతని సూచనలు పాటిస్తూ రాసిన కథ ఆంధ్రప్రభ వార పత్రికలో అచ్చయింది. అది 1964 – 65 సంవత్సరాలలో. కథ పేరు ‘నివురు కప్పిన నిప్పు’.

ప్రభ ఖరీదు పావలా అనుకుంటా.. నాకు ఆంధ్రప్రభ వారు పంపిన పారితోషికం Rs.40 రూపాయలు. crossed cheque పంపారు. ఆంధ్రా బాంక్ వారి చెక్. అది encash చేసుకోవడానికి నానా తిప్పలు పడ్డాను. ఆంధ్రబాంక్ మేనేజర్ నన్ను అనుమానంగా చూశారు. SSLC తప్ప చదువు లేదు. పర్సనాలిటీ అంతంత మాత్రం. కర్నూల్ మెడికల్ కాలేజీ ఉద్యోగిని అన్నది ఒకే ఒక ప్లస్ పాయింట్. ఆ చెక్ encash కోసం account open చేశాను. ముందు అయిదు రూపాయలు డిపాజిట్ చేస్తే కానీ account open కాలేదు. చెక్ చేసిన రెండు వారాలకి నా మొదటి పారితోషికం బాంక్ ఎకౌంటులో జమ అయింది. ఆ తర్వాత ఆంధ్రా బాంక్ అవసరం లేదు. ఎందుకంటే.. డిపాజిట్ చేసే సొమ్ము ఎప్పుడూ వుండేది కాదు.

ఆ కథ పడిన వెంటనే కొలీగ్స్ పార్టీ అడిగారు. పార్టీ అంటే SKC అనే మూడు అక్షరాలే. అంటే స్వీట్, ఖారా, కాఫీ.. అన్న మాట. ఓ నలుగురు అయిదుగురు స్నేహితులు. అంతా కలిస్తే.. ఖర్చు.. పది రూపాయలు వరకు వచ్చింది.

మొదటి కథ పడిన అనుభూతి గొప్పగా వున్నది. నా ఒకే కోరిక.. graduate అనిపించుకోవాలని.

దానికి ప్రయత్నం మొదలు పెట్టాను. అప్పటిలో మూడు నెలల టర్మ్ ఫీ 42 రూపాయలు. ఆ సొమ్ము కూడ పెట్టడానికి నాకు కొన్ని నెలలు పట్టింది.

తర్వాత అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాజదానికి తిరిగి రాగలిగాను. చదువు మీద ద్యాసతో రచనా వ్యాసంగం మందగించింది. కానీ.. ఆంధ్రప్రభ వారు నేను రాసిన కథలు అప్పుడప్పుడు వేసుకుంటూ వుండేవారు. ఆంధ్ర పత్రిక సపరివార.. నన్ను ఆదరించలేదు. తరువాత రోజుల్లో.. అదే ఆంధ్రప్రభ వారు నా మొదటి నవల కూడా ప్రచురించారు. అప్పటి.. నా కథలు ఎక్కువ ఆంధ్రప్రభ వారే ప్రచురించారు. ఎల్లోరా, అజంతా అని పిలిచే సంపాదకులతో పరిచయం అయింది. అలాగే శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు ప్రధాన సంపాదకులుగా వుండగా.. మంచి ప్రోత్శాహం ఇచ్చారు. నేను రాసిన పెద్ద కథలు.. రెండు వారాలు ప్రచురించేవారు. ఆంధ్రప్రభలో వచ్చిన నవల. ‘వెండి పిడుగు’ .. పెద్ద కథలు. ‘నీలాకాశం’, ‘త్రిజట’.

తిరుపతిలో రచయిత అమ్మాయి.. మనవరాలు.

వెండిపిడుగు నవల చదివిన అజంతా గారు చాలా నిజాయితిగా చెప్పారు “మీ హ్యాండ్ రైటింగ్ వరస్ట్! ఎవరి చేతనైనా వ్రాయించిన ప్రతి తీసుకు రండి!” అని. దాన్ని హ్యాండ్ రైటింగ్ బాగా వున్న ఒక వ్యక్తికి రెండు వందలు ఇచ్చి తిరగ రాయించాను. అన్న మాట ప్రకారం ఆ నవల 25 వారాలు వచ్చింది. పారితోషికం 2500/-

అదే సమయంలో… 1985 ప్రాంతాల్లో.. నా graduation, post graduation, FICWA Calcutta (అప్పుడు అదే పేరు.. ఇప్పుడు కోల్‍కతా) పూర్తి అయి.. మన దేశీయ విమాన సంస్థలో ఆఫీసరుగా వున్నప్పుడు.. శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు పరిచయం అయ్యారు. అప్పటికే ఆయన పెద్ద కమర్షియల్ రైటర్. నాదీ, ఆయనదీ accounts background కాబట్టి.. official గా పరిచయం.

అప్పటి వరకు నేను రచన సీరియస్‌గా తీసుకోలేదు. ఆయన ఆంధ్రభూమి మెయిన్ రైటర్.

నా బ్యాక్‌గ్రౌండ్.. ఆంధ్రప్రభలో కథలు అవీ యథాలాపంగా చెప్పగానే.. “ఇప్పుడు ఎందుకు మానేశారు?” అని అడిగారు. “పెద్ద కారణం ఏమీ లేదు.” అన్నాను. “మీరు రాయండి” అన్నారు.

“మీరు రాస్తున్నారు.. అంతే… నాకు రెండు రోజుల్లో మీ కథ కావాలి!” అన్నారు. రెండు రోజుల్లో కథ రాసి ఆయనకి ఇచ్చాను. దానికి ఏమి పేరు పెట్టాలో తెలియలేదు. ఆయన దానికి ‘క్షణికం’ అన్న పేరు పెట్టారు. ఆంధ్రభూమి ఎడిటర్ గారితో పరిచయం చేసారు. అల్లా రచయితగా.. నా రెండవ phase మొదలయింది.

తిరుపతిలో రచయిత కుమార్తె రమాదేవి.. మనవడు మనవరాలు.

అక్కడే శ్రీ యండమూరి పరిచయం అయ్యారు. ఎలా? ‘క్షణికం’ కథ చదివి.. “ఈ రైటర్ ఎవరు? నేను చూడాలి!” అన్నారట. అలా మల్లాది గారి ప్రోత్సాహంతో ఎన్నో కథలు రాశాను. అన్నీ ఆంధ్రభూమిలో ప్రచురితమయ్యాయి. ఒక్క కథ తప్ప.. ‘మేం తప్ప ఎవరూ మీకు దొరకలేదా?’ అని నిష్ఠూరాలాడి, విసిరి కొట్టారు ఆ ఒకే ఒక కథ. అప్పటి నుంచి ఆ అనుభవం ఆయనతో ఎదురవలేదు.

దాదాపు ప్రతి ఆంధ్రభూమి మాస పత్రికలో తప్పక నా కథ వచ్చేది. రెగ్యులర్‌గా.. ఆ మాస పత్రికలో ఎన్నో చిన్న నవలలు వచ్చాయి. నేను ఆంధ్రభూమికి రాసిన ‘వెండి పిడుగు’ అక్కడ రిజెక్ట్ అయింది. అదే ఆంధ్రప్రభ వేసుకున్నారు. దానికి ఆయన బాధ పడ్డట్టు, పత్రిక స్టాఫ్ ద్వారా నాకు తెలిసింది. పల్లకి అనే పత్రికలో ‘ప్రమాదంలోకి ప్రయాణం’ అన్న నవల వచ్చింది.

ప్రతీ మంచి రోజు ఒక రోజు ఆగిపోతుంది. అలాగే.. ఆ ఎడిటర్ గారు ఆ పత్రిక నుంచి తప్పుకున్నారు. నేనూ వేరే దేశానికి బదిలీ పై వెళ్ళిపోయాను. అలా నా రచనా వ్యాసంగం మరోసారి ఆగిపోయింది.

ఆ తర్వాత.. ఉద్యోగ విరమణ తర్వాత.. నవ్య పత్రిక బాగా ఆదరించింది. ఇంకా విపుల, చతుర సంపాదకులు నా కథలు వేసుకున్నారు. స్వాతి వార పత్రిక వారు వరసగా నా కథలు అంగీకరించి మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకో ఆసక్తికర విషయం. నేను రాసిన కథలు తిరిగి వస్తూ వుంటే.. మళ్ళీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారిని సలహా అడిగాను. “మీరు స్వాతి పత్రికకి పంపించండి. వారు నిష్పక్షపాతంగా వుంటారు” అని. ఆ సలహా బాగా పని చేసింది. స్వాతి వార పత్రికా, మాస పత్రికా నా కథలు విరివిగా ప్రచురించారు. మరో గొప్ప విషయం స్వాతి వారి పారితోషికం. అది భారీగా వుంటుంది. కథ అంగీకరించిన వెంటనే అది అందుతుంది.

రచయితగా నా వయసు దాదాపు అరవై ఏళ్ళు.

మీరు కథా రచయితగా ఎలాటి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేవారు? ఎందుచేత?

నాకు బాగా ఇష్టమైన రచయితలు కొమ్మూరి, టెంపో రావు, ఆరుద్ర, విశ్వప్రసాద్, కృష్ణ మోహన్, అంటే.. డిటెక్టివ్ సాహిత్యం, థ్రిల్లర్..లు. ఆ తర్వాత ఆంధ్రభూమి సమయంలో.. శ్రీ మల్లాది కథలు నవలలూ ఇష్టం. యండమూరి కథలూ, నవలలూ బాగా చదివే నాకు.. అలా రాయాలని అన్పించింది.

సామాజిక స్పృహ కథలూ. . ‘ఇజం’ కథలూ, ‘యాస’ కథలు, ‘ప్రాంతీయ’ కథలు, పని కట్టుకుని రాసేవాడిని కాదు. నా దృష్టిలో పడ్డ ఏ అంశం మీదనైనా.. ‘చదివించే గుణం’ ఏ కథ అయినా రాసే వాడిని.

నవ్యలో వచ్చిన.. పెద్ద కథలు. ‘అవును. ఆ వంతెన వాళ్లెప్పుడూ దాటలేరు!’, ‘మరీచిక’, ‘వెండి మబ్బులు’, ‘మా నీడ కూడా మీ మీద పడకూడదు!’ లాటి కథలు డిటెక్టివ్ కథలు కావు.. థ్రిల్లర్ కావు.

ఏదో సమస్య తీసుకుని దానిమీద కథ రాసిన గుర్తు లేదు. సహజంగా నాకు రాయలనిపించేవి రాశాను. దానిలో ఏదైనా సామాజిక సమస్యలు స్పృశిoచానేమో తెలియదు. ఈ మధ్య కథల పోటీలు ఒక ‘థీం’ మీద రాయమంటున్నారు. ఇప్పుడు అలా రాస్తున్నాను.

చిన్న కథలు ఇప్పుడు ‘ట్రెండ్’.. పెద్ద కథలు ఎవరూ చదవడం లేదు. అందుకే.. ఎవరూ రాయడం లేదు. చిన్న చిన్న కథలు విపుల పత్రికలో కొన్ని వచ్చాయి.

అప్పటి AP CM ఎన్.టీ.ఆర్.తో.. వరద బాధితుల కోసం విరాళాలు సేకరించి చెక్ ఇచ్చిన సందర్భం.

మీరు కథా రచయితగా ఉన్నత స్టాయిలో ఉన్న కాలంలో మీ సమకాలికులైన రచయిత లెవరు?

ఉన్నత స్థానం అనేది 1985, 90 దశకాల్లో వుండేది. ఏ కథా రిజెక్ట్ కాలేదు. ఏ చిన్న నవలా రిజెక్ట్ కాలేదు. ‘వెండి పిడుగు’ అన్న నవల ఆంద్రభూమి బదులు ఆంద్రప్రభ వారు తీసుకున్నారు.

సమకాలికులు.. శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి, యండమూరి వీరేంద్రనాథ్, చందు సోంబాబు, ఎన్.ఆర్. నంది, ఆది విష్ణు, శ్రీమతి అడవి సూర్యకుమారి, శ్రీమతి కాకాని కమల, శ్రీమతి విజయ లక్ష్మి మురళీధర్ (వరంగల్), శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు గారు (వైజాగ్), కొమ్మనాపల్లి గణపతిరావు (hmt engineer), శ్రీమతి బొమ్మదేవర నాగకుమారి, .. శ్రీ ఉత్పల సత్యనారాయణ గారు, చారిత్రిక నవలలు రాసే, ముదిగొండ శివప్రసాద్ (తెలుగు లెక్చరర్… డిగ్రీలో నాకు కూడా పాఠాలు చెప్పారు) ఇంకా… డాక్టర్ సి. ఆనందారామం, శ్రీ నూకల సీతారామారావు (బ్యాంకు ఆఫీసరు), ఇంకా ఓ పోలీస్ అధికారి పేరు శ్రీ చావా శివకోటి మొదలయినవారు. పైన చెప్పిన ప్రసిద్ధ రచయితలందరినీ నేను ఆంద్రభూమి ఆఫీసులో చూశాను. నేను చూడని రచయితలు.. ప్రసిద్ధ రచయిత ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు (ఈ మధ్య కాలంలో స్వాతి వార పత్రికలో కళ్యాణి అన్న నవల అనుకుంటా.. ప్రచురితమైనది). ఇంకా కొంత మంది రచయితల పేర్లు ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. ఆంధ్రభూమి ఆఫీసులో కొందరు రచయితలున్నారు. వారిలో ప్రముఖ రచయిత వేదగిరి రాంబాబు, శ్రీమతి దమయంతి (editorial staff), రాంబాబు (ఈయన సినిమాలో పనిచేసారు).. చాలా సమయం గడిచిపోయింది కాబట్టి, పేరులో చిన్న దోషాలు వుంటే.. వారిని క్షమించమని అడుగుతున్నా.

అందులో ఎవరి ఎవరి కథలు మీరు అమితంగా ఇష్టపడేవారు? ఎందుచేత?

నేను తప్పకుండా చదివే రచయితలు (ఈ నాటికి కూడా) శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి, శ్రీ యండమూరి.. అప్పటిలో.. చందు సోంబాబు, శ్రీ ఎన్ ఆర్ నంది.

వీరి అందరి రచనల్లో .. మొదటి పేరాలోనే మనని కట్టిపడేసి తమతో లాక్కు పోయే గుణం వుంది. కొస మెరుపు కథలకి శ్రీ మల్లాది అందెవేసిన చెయ్యి. కథల్లో, నవలలలో ఆయన వస్తు వైవిధ్యం నాకు ఇష్టం.

ఒకానొక కాలంలో వార, పక్ష, మాస, కత్రిలన్నీ మహిళా రచయితలకే ప్రాధాన్యం ఇచ్చేవారు కదా.. ఎందుచేత అంటారు? మగ రచయితగా అప్పటి మీ స్పందన ఎలాటిది?

నిజమే.. స్త్రీ రచయితల రచనలు ఎక్కువ ఆనాటి సామాజిక పరిస్థితులని ప్రతిబింబించేవి. శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గురించి, ఇప్పటికే ఎందరో చెప్పారు. శ్రీమతి ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి రచనల పై పెద్ద చర్చ పత్రికల్లో వచ్చేది. శ్రీ యండమూరి సాహిత్యాన్ని ‘శవ సాహిత్యం, క్షుద్ర సాహిత్యం’ అన్న విమర్శలు, ప్రతి విమర్శలు ఉండేవి. ‘వంటింటి నుంచి బయటకు వచ్చింది తెలుగు సాహిత్యం’ అనేవారు. యువ, జ్యోతి అనే పత్రికల్లో సాహత్య చర్చలు జరిగేవి. ఇక ఆ మహా రచయతల గురించి చెప్పడం చర్విత చరణం అవుతుంది.

అప్పుడు.. స్త్రీ రచయితల రచనలకి విపరీతమైన డిమాండ్ వుండేది. ఆ తర్వాత కాలంలో, అది కొంత తగ్గింది. కాలక్రమంగా… పాఠకుల అభిరుచి మారిపోయింది. థ్రిల్లర్ నవలలు చదవడం మొదలయింది. అప్పటి.. మన రచయితల అనువాద రచనలు కూడా కన్నడ, తమిళ భాషల్లో పెద్ద డిమాండ్ వుండేది.

నా స్పందన ఎలాటిది? అని అడిగారు.

ఎవరి కథ అయినా చదివే వాడిని. ఇప్పటికీ నాకు అర్థం కానీ విషయం.. స్త్రీ రచయితలు ఎవరూ డిటెక్టివ్ సాహిత్యం వైపు వచ్చే వారు కాదు. అది మగ రచయితల కంచు కోట. ఇప్పటికీ.. ఏ స్త్రీ రచయితా డిటెక్టివ్ నవల రాయడం లేదు.. స్త్రీ రచయితల సైన్స్ ఫిక్షన్ నవలలు ఒకటి రెండు చూశాను. వంద శాతం, డిటెక్టివ్ నవలలు రాలేదు అని అనుకుంటున్నాను.

మీ పేరు చూడగానే నాతో పాటు చాలామంది పాఠకులకు అది కలం’ పేరు అన్పించదు!

మన ప్రమేయం లేకుండా కొన్ని జరిగి పోతాయి. దానికి ముందస్తు ప్లానింగ్, ప్రణాళిక, అంటూ లేవు. 1985 తర్వాత రెండో దశ రచనా వ్యాసంగం మొదలయినప్పుడు.. ఈ మార్పు యాదృచ్ఛిక్కంగా జరిగింది. ఇంటి పేరుతో సహా ‘కలం’ పేరు పెట్టుకున్నది బహుశా.. నేనే అనుకుంటా.

అప్పటి భారతదేశ ప్రధానితో రచయిత తమ సంస్థ తరఫున కలిసినప్పుడు.

ఎందుకు అలాటి కలం పేరు పెట్టుకున్నారు?

ఎనభై దశకంలో నా కథలు, నవలలు రావడం మొదలు అయింది. అప్పుడు నేను ఒక ‘ఇబ్బంది’కర పరిస్థితుల్లో వున్నాను. మొదటిది.. నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాను. రచయితగా… అనుమతి కావాలంటే మా కేంద్ర కార్యాలయం అనుమతి తప్పనిసరి! కేంద్ర కార్యాలయం ఢిల్లీలో వుండేది. అనుమతి కోసం ప్రయత్నించి, వారు అడిగే యక్ష ప్రశ్నలకు విసిగి పోయి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. చూడండి.. ఎలాటి ప్రశ్నలు వేసే వారో! ..

1. మీరు ఎందుకు రాయలనుకున్నారు?

2.మీ ఈ వ్యాసంగం వల్ల మీ విధి నిర్వహణలో లోపాలకి మీరు బాధ్యతావహిస్తారా?

3.మీరు రాసిన స్క్రిప్ట్, ఒరిజినల్, దాని అనువాదం ఇంగ్లీషులో, హిందీలో రెండు ప్రతులు పంపండి. అది మాకు ఆమోదం అయిన తర్వాత మాత్రమే వాటిని పబ్లిష్ చేసుకోవాలి.

4.మీకు వచ్చిన పారితోషికం, రాయల్టీలో 40 శాతం మాకు జమ చెయ్యాలి.

ఇది అయ్యే పని కాదు అని ఆ ప్రయత్నం విరమించుకున్నాను. అలా కలం పేరు అవసరం ఏర్పడింది.

ఇక ఈ ‘కలం పేరు’ చిదంబర రహస్యం ఇంకోటి వుంది. అదే ప్రత్యేక కారణం.

దీని వెనక ప్రత్యేక కారణం ఏమిటి?

నా రచనలకి డిమాండ్ వుంటుందని అనుకోలేదు. ‘వన్ స్టోరీ వండర్’ లాటిది నా రచనా వ్యాసంగం అనుకున్నాను. తొందరలో కనుమరుగు అవుతానని… చరిత్ర పరదాలలో వెనక్కి వెళ్లిపోతానని అనుకున్నాను. అది ఖాయం అని నమ్మాను. కానీ జరిగినది మరొకటి… ఒకటి తర్వాత, ఒకటి కథలు రావడం మొదలైంది.

ఆ పై.. మా సంపాదకుల వారు నర్మగర్భంగా చెప్పారు. “మీ పేరులో ‘గ్లామర్’ లేదు. పేరు మారిస్తే.. బాగుంటుంది!” అని.

“అది నిజమే..సార్! నా పేరులోనే కాదు, నా ‘ఫేస్’లో కూడా గ్లామర్ లేదు. దానికి నా బాధ్యత లేదు. ఆ ‘పై’ వాడి లీల” అని నోరు లేని, సమాధానం చెప్పని, చెప్పలేని ‘పై’ ఆయన మీద తోసేశాను.

అప్పుడు ఎన్నో పేర్లు తెర పైకి వచ్చాయి. మొదటి ‘ఛాయిస్’ నా గోత్రం.. అది.. ‘వాధూలస’. అది నచ్చలేదు ఆయనకి. నా జన్మ నక్షత్రం అడిగారు. అదీ నచ్చలేదు. ఇంటి ఆమె (గృహలక్ష్మి. ఆమె పేరులో కూడా లక్ష్మి వుంది) పేరు అడిగారు. అదియునూ నచ్చలేదు.

అప్పుడు మా అమ్మాయి పేరు అడిగారు. అది చెప్పగానే.. ‘ఆల్రైట్’ అన్నారు. అలా ఇంటి పేరుతో ‘గంటి రమాదేవి’ ఫిక్స్ అయింది. అప్పుడు ఆమె చిన్న పిల్ల. కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత.. ‘నా పేరు వద్దు.’ అని మారం చేసింది.

కానీ. అప్పటికే fiat accompli.. situation వచ్చేసింది…. ఇక ఆ పేరు మార్చడం కుదరలేదు. అలాగే.. తర్వాత.. అమ్మాయి కూడా ఆ పేరుకు అభ్యంతరం చెప్పలేదు. (కొస మెరుపు.) ఆమెకు గాంధీ టెక్స్‌టైల్స్ వారు చీరె బహూకరించారు. చీరె కట్టే వయసు కాదు. ఫోటో తీసుకున్నారు. అది ఎక్కడ ప్రింట్ అయిందో తెలియదు. ఆ ఫోటో కూడా మా దగ్గర లేదు. దానితో ఆ అమ్మాయి.. చాక్లెట్ ఇచ్చినంత సంబరపడి, మాట్లాడలేదు. తర్వాత.. నా పేరు వాడొద్దు అని అనలేదు.

ఇల్లా చాలా మంది ఈ కలం పేరుతో గందరగోళానికి గురి అయ్యేవారు. వీలయిన చోటల్లా .. ఈ విషయం చెప్పే వాడిని.

(ఆ రోజుల్లో నా పేరు చూసి… ‘అప్పటి’ యువకులు ‘లవ్ లెటర్స్’ రాసేవారు. అందులో తమ ఆస్తిపాస్తులు, తాము చేసే వ్యాపారాలు రాసేవారు.. ఈ విషయం ఎడిటర్ గారికి చెప్పగానే.. “ఇంకా నయం. మన మగ రచయితలకి కొందరు మహిళలు ప్రేమలేఖలు రాస్తున్నారు. ఏమి సమాధానం చెప్పాలో వాళ్లకి తెలియడం లేదు. దానిలో కొందరు పెళ్ళయిన వాళ్ళు కూడా వున్నారు. మీ కేసు డిఫెరెంట్!” అని నవ్వేవారు.)

ఓ పెద్ద ప్లస్ పాయింట్.. నన్ను ఇప్పటి వరకు ఎవరూ ఏ సభకీ ఆహ్వానించలేదు. లేకపోతే ఇబ్బంది అయి వుండేది. ఇంకో ప్లస్ పాయింట్.. శ్రీ మల్లాది, యండమూరి వుండగా.. నన్ను ఎవరూ పట్టించుకోలేదు! ( కొస మెరుపు. రచయిత శ్రీ మల్లాది గారు కూడా ఏ సభ లోనూ కనపడలేదు. ఆయన ఎలా వుంటారో సామాన్య పాఠకులకు తెలియదు).

మీ కాలంలో రచయితలకు పత్రికల ప్రోత్సాహం ఎలా ఉండేది? ఎందుచేత?

ఒక్కొక్క పత్రిక పాలసీ ఓలా వుండేది. ఆంధ్రప్రభ వీక్లీ నిష్పక్షపాతంగా వుండేది. ఆంధ్రపత్రిక కొత్త వారికి ప్రోత్సాహం ఇచ్చినట్టు కనబడదు. ఇంకా ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి, మయూరి, పల్లకి లాటి పత్రికలూ ఉండేవి. పల్లకి పత్రిక సంపాదకుల వారు ‘అదో రకం’ రాగం ఎత్తుకునేవారు. ఒక రోజంతా వాళ్ళ ఆఫీసులో కూర్చో పెట్టుకుని, చిన్న నవల రాయించారు. ఏక బిగిన ఎనిమిది గంటలు రాశాను. అది ఇచ్చి వచ్చాను. ఆ నవల గతి ఏమైందో తెలియలేదు.

అప్పుడే ‘ప్రమాదంలో ప్రయాణం’ నవల రాసి ఆ ఆఫీసులో ఇచ్చాను. దానికి సమాధానం లేదు. ఓ రోజు హైదరాబాద్ కలకత్తా విమానంలో ఆ పత్రిక ‘ఓనర్’ రెడ్డి గారు కనబడ్డారు. నన్ను నేను పరిచయం చేసుకుని, నా సమస్య చెప్పాను. కొన్ని రోజుల్లో… ఆ నవల ప్రచురణ ప్రారంభమయింది. ఆంద్రభూమి, ఆంధ్రప్రభ, పారితోషికాలు ఇచ్చేవారు. మిగిలిన వారి సంగతి చెప్పక పోవడమే మంచిది.

దీని వల్ల ఏమి తెలుస్తోంది? కథలో, నవలలో, గుణ గుణాల కన్నా, ‘వ్యక్తిగత సంబంధాలు’ ఎక్కువ ప్రభావం చూపుతున్నదని అర్థం కదా.. ‘యువ’లో నా కథలు రాలేదు. జ్యోతి మాస పత్రిక గౌరవ ఎడిటర్ (సరి అయిన పదం గుర్తు లేదు), శ్రీ యండమూరి గారు కథ రాయమని చెప్పారు. రాసిన తర్వాత, జ్యోతి ఆఫీసులో ఇవ్వడం జరిగింది. అది తీసుకోవడానికి అక్కడున్న స్టాఫ్ నిరాకరించారు. అప్పుడు నేను లిబర్టీ టాకీస్ దగ్గర వున్న, ఆంధ్రా బాంక్‌కి వెళ్లి, శ్రీ యండమూరి గారిని కలుసుకుని, జరిగిన విషయం చెప్పాను. దాని ఆయన, “మళ్ళీ ఇవ్వండి. నేను ఇమ్మన్నానని చెప్పండి” అన్నారు. అప్పుడు గానీ, ఆ కథ తీసుకోలేదు. ఆ కథ తర్వాత, ఇంకొక రెండు మూడు కథలు జ్యోతి లో వచ్చాయి. రెమ్యునరేషన్ సంగతి గుర్తులేదు.

పత్రికల్లో కథలకు బొమ్మలు అవసరమంటారా? ఎందు చేత? మీకు ఇష్టమైన చిత్రకారులేవారు?

పత్రికల్లో బొమ్మలు అవసరం వుంది. కథలో, హీరో, హీరోయిన్‌ల వర్ణన వుంటుంది. నాలుగయిదు పేజీల వర్ణన, ఒకే ఒక చిత్రంతో తెలిసిపోతుంది. అందుకే.. మన పత్రికలూ, ‘illustrated weekly’ అని రాసుకునేది. బొమ్మలు ఎంత అవసరం అంటే.. ఓ పత్రిక ముఖ చిత్రానికి, అందమైన హీరోయిన్ బొమ్మ ఎంత అవసరమో అంత! బొమ్మ చూసి పత్రిక కొనడం సర్వ సాధారణం. పత్రికల్లో కథలకు బొమ్మలతో పాటు, కథకి సంబంధం లేని కార్టూన్‌లు కూడా అవసరం. అది ‘కోల్డ్ ప్రింట్’ అక్షరాల ముందు పెద్ద రిలీఫ్. బొమ్మ లేని పత్రిక, ఉప్పు లేని పప్పు లాటిది.

నా కిష్టమైన చిత్రకారులు శ్రీ చిత్ర .. ఇంకా shankar. చందమామ మాస పత్రికలో.. ఆయన బొమ్మలు అద్భుతం. రాజులు, రాజకుమారులు, విక్రమార్కుడు, భేతాళుడు, యువతీ యువకులు.. చాలా గొప్పగా వేసేవారు. మరువ తరమా… ఈయన అసలు పేరు తర్వాత తెలిసింది. ఇప్పుడు గుర్తుకు లేదు. ఆంధ్రపత్రికలో … శ్రీ శంకర్… ఇంకా… బాల… శ్రీ కరుణాకర్, శ్రీ చంద్ర బొమ్మలు వేసేవారు. ఇంకా శ్రీ బాపు గురించి నేను వేరే చెప్పనక్కరలేదు. ఆయన రేఖలే వేరు. నా కథలకు శ్రీ చంద్ర, శ్రీ కరుణాకర్ బొమ్మలు వేశారు. ఇప్పటికి ముప్పై ఏళ్ల నాటి మాట. కొడిగట్టిన దీపం లాటి జ్ఞాపకాలలో ఇవి కొన్ని మాత్రమే.

ఇప్పుడు విసృతంగా వెలుగు చూస్తున్న వెబ్ మేగజైన్‌లపై, మీ అభిప్రాయం ఏమిటి? మీ రచనా వ్యాసంగానికి వానిని మీరు ఉపయోగించుకున్నారా ?

కాలమనే మహా ప్రవాహంలో, ఎండిపోయిన ఆకు మీద భద్రంగా ప్రయాణం సాగించే పిపీలికం లాటి వాడిని. ప్రయాణం కాదు అనుకుంటే.. నీటి లోనుంచి ప్రవాహంలో దూకి, ‘హిరాకిరీ’ చేసుకోవాలి. నా ప్రయాణం వెబ్‌లో కొనసాగుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో, మాగజైన్ ప్రింటింగ్ చాలా ఖర్చుతో, శ్రమతో కూడిన వ్యవహారం. ప్రింట్ అయిన పత్రికల మార్కెటింగ్, పంపిణీ, ఇంకా క్లిష్టమైనవి.

వెబ్ మాగజైన్‌లలో కూడా బొమ్మలూ, కార్టూన్‌లూ ఉంటున్నాయి. ఒక ప్రింటింగ్ తప్ప, అవి సమగ్రంగా ఉంటున్నాయి.

వెబ్ మాగజైన్‌లు చదవడం కష్టం. నాకు ప్రింట్ పుస్తకాల సౌలభ్యం వెబ్ మాగజైన్‌లలో కనపడ లేదు. పుస్తకం చదివే అనుభూతి వేరు. ఎప్పుడంటే.. ఎక్కడంటే, మనతో పాటు వుంటాయి. కరెంట్, నెట్, సిగ్నల్ సమస్యలు వుండవు. కాగితం, ప్రింటింగ్ ఇంకు, కొత్త పుస్తకపు సువాసన. పాత పుస్తకాల విలువ.. ఇవేవీ లేకుండా… జీవం లేని, వ్యక్తిగత సాన్నిహిత్యం లేనిది వెబ్. అయినా…. మన జేబులో, చేతిలో, పడక పై ఎక్కడున్నా మనతో వుండే ఓ సహచరి. అంగీకరించ వలసిన చాలా అంశాలు వెబ్ మాగజైన్ లలో వున్నాయి.

అవి. ..వెబ్‌లో పెద్ద సౌలభ్యం. కాగితం, కలం అవసరం లేని, శ్రమ లేని ఓ ప్రక్రియ. పూర్తయిన రచన, డి.టి.పి. చేయించనక్కరలేదు. పోస్ట్ చేయడానికి, కొరియర్ చెయ్యనక్కరలేదు. పోస్ట్ ఆఫీసుకు వెళ్ళనక్కరలేదు. పూర్తి సౌకర్యం. ఖర్చు లేదు. అందుకే ముందు చెప్పినట్టు.. ముందుకు సాగి పోవడమా.. ఆగి జీర్ణమై పోవడమా.. అంటే.. మారి ముందుకు పోవడమే నా ప్రాధ్యానత. నా వ్యాసంగానికి కొంత వరకు ఉపయోగించుకున్నాను.

ఇంకా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను.

ప్రస్తుత పరిస్థితుల్లో కథా సంపుటాల ప్రచురణ విషయంల మీ ఉద్దేశం ఏమిటి?

కథా సంపుటాల కాలం కూడా అయిపోవచ్చింది. ఇది మామూలు రచయితలు మోయలేని భారం. ప్రింటింగ్, పంపిణీ, అంశాలలో రచయితలకి అనుభవం తక్కువ. కొందరు రచయితలు దీనికి మినహాయింపు.

కథా సంపుటి వేయాలని అని చేతులు కాల్చుకునే రచయితలు ఎందరో. పెద్ద కమర్షియల్ రైటర్‌ల కథా సంపుటిలు అమ్ముడు కాకుండా వుండిపోతున్నాయి. అమ్ముడు పోని పుస్తకాలు రచయిత ఇంటి అటక ఎక్కుతున్నాయి. దుమ్ము సేకరించుకుంటున్నాయి .. . ఎలకలకి ఆహారం అవుతున్నాయి. సాహిత్య చెదపురుగులకి ఇష్టంగా మారుతున్నాయి.

నా వ్యక్తిగత అనుభవం. కొంత కాలం క్రితం.. కథా సంపుటి ప్రచురించాలని ఒక బాగా తెలిసిన (ఆయనా ఓ రచయితే!) వ్యక్తికి నేను దాదాపు నలభయి వేలు ఇచ్చి, ఎదురు చూశాను. బాగా తెలిసిన వ్యక్తి కదా.. మోసపోయానని లేటుగా తెలుసుకున్నాను. కథలు తిరిగి రాలేదు. డబ్బులు పోయాయి. అడగడానికి మొహమాటం. ఆ చెడు, చేదు జ్ఞాపకం నన్ను ఇంకా వెంటాడుతూనే వుంది. నేను అనుభవ రాహిత్యంతో నష్ట పోయాను. నేను స్వంతంగా పుస్తకాల ప్రచురణకి వ్యతిరేకం. వ్యాపార పుస్తక పంపిణీ దారులయితే.. దానిలో సాధక బాధకాలు తెలుస్తాయి.

తెలుగు పాఠకులు మరింత పెంచే విషయం దెసలో, ఎలాటి చర్యలు అవసరం అని మీరు భావిస్తున్నారు?

ఇప్పుడు ప్రింట్ మీడియా జబ్బు పడి వుంది. చేతిలో సెల్ ఫోన్‌లో ఏ ‘జోనర్’ కావాలంటే ఆ ‘జోనర్’ సాహిత్యం లభ్యమవుతూ వుంది. చదవడానికి అవసరం లేని, దృశ్య మాధ్యమాలు వచ్చాయి. వర్ణనలు చదవనక్కరలేదు. ఒక క్షణంలో మీ నగ్న నేత్రం ముందు ప్రత్యక్షమవుతూ వున్నాయి. ఇంకా చర్మ చక్షువు అవసరం లేని జ్ఞాన నేత్రం అవసరం ఏముంది? తెలుగు భాష ఇప్పుడు హీన స్థితిలో వుంది. స్కూల్ విద్యార్థులలో తెలుగు చక్కగా రాయగల వారు లేరు. అది అలా ఉంచితే.. చదివే వాళ్ళు కూడా లేరు. తెలుగు మార్కులు మాత్రం అనూహ్యంగా ఉంటున్నాయి. వాస్తవానికి, వచ్చే మార్కులకీ పొంతన ఎక్కడా లేదు.

పాఠకుల సంఖ్య ఎలా పెంచాలి?

పాఠకుల సంఖ్య ఎలా పెంచాలో.. మన పూర్వ సంపాదకులు నిరూపించారు. ప్రతీ మనిషికీ ఒక అభిలాష వుంటుంది. అది తన పేరు ‘ప్రింట్’ లో రావాలని.. తన ఫోటో అందరూ చూడాలని. అది వ్యక్తి బలహీనత అయితే.. అది పాఠకులు సంఖ్య పెంచడానికి అవసరమైన బలం

పత్రికలో కొంత స్థలం, పాఠకుల ప్రత్యక్ష పాత్ర వుండాలి. ఆ రోజుల్లో.. పాఠకుల ప్రశ్నలు సమాధానాలు కనీసం రెండు పేజీలు ఉండేవి. ఉత్తమ ప్రశ్నలకి బహుమతులు ఉండేవి. శ్రమతో కూడినది అయినా.. ‘రీడర్స్ ఇన్వాల్వ్‌మెంటు’ వుండాలి. అంటే… ప్రతీ పాఠకుడినీ ఓ రచయితగా అవడానికి అవకాశం కల్పించాలి. ఆ పాత కాలంలో… కొన్ని నగరాల్లో, పట్టణాలలో.. సభలు నిర్వహించేవారు. ప్రముఖ రచయితలు పాల్గొనే వారు. ఇప్పుడు అల్లా చేయగలరా ఎవరైనా అని ఎదురు చూస్తున్నాను.

ఇప్పటి తరం వారికి చదివే ఓపిక తక్కువ. చిన్న కథలు ప్రధానంగా వుండాలి. చివర కొస మెరుపు కనపడాలి.

ఇవి నా అభిప్రాయాలు.

తెలుగు భాషను, మరింత అభివృద్ధి పథం వైపు మళ్ళించే విషయంలో పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ఎలాటి పాత్ర పోషించాలని మీరు భావిస్తున్నారు?

ఈ విషయంలో… మన రాష్ట్ర ప్రజా పతినిధులు విఫలమయ్యారని నేను అనుకుంటున్నాను. ‘తెలుగు భాష చదువుకుంటే ఉద్యోగాలు రావు’ అన్న వితండ వాదం వినిపిస్తోంది. తెలుగు భాషలో ఇన్ని వత్తులు, ద్విక్తాక్షరాలు, వ్యాకరణం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా మన నేతలు నేర్చుకోవలసినది. చదువు మనో వికాసానికి.. ఆలోచనా పరిథి విసృతికి. పరిశోధనలకి..

ఉద్యోగం ఒక్కటేనా జీవిత లక్ష్యం. జీవనోపాధి కావాలంటే… తెలుగు మర్చిపోవాలా?.. దీనిలో కుట్ర కోణాలు లాటి పదజాలం వుంది. ఇంగ్లీష్ మీడియం చదివితే.. స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక అక్కడ సుఖమే సుఖం అన్న అసత్య ప్రచారం సాగుతూ వుంది.

తెలుగు మీడియంలో చదువుకుని, ఆ పై ఆంగ్ల మాధ్యమం నేర్చుకుంటే.. ఆ పరిణతి ఇంగ్లీష్ మీడియం మాత్రమే నేర్చుకుంటే అది సాధ్యం కాదు. పుట్టగానే తల్లి పాలు అవసరం. ఆ పై ఆవు పాలు. పుట్టగానే ‘డబ్బా’ పాల ఈ అద్వాన్న ఇంగ్లీష్ మీడియం గోల పోవాలి. ఇంగ్లీష్ మీడియం చదవగానే సరి కాదు. ఇంకా, భాష గోల లేని గణితం, గణ గణాంకాలు,

మిగిలిన శాస్త్రాలు అధ్యయనం చేయడం అవసరమైనప్పుడు ఇంగ్లీష్ మీడియం అనే మంత్రం దండం పని చేయదు. తెలుగు బాష సంక్లిష్టత అర్థం చేసుకున్న విద్యార్థి, ఏ సంక్లిష్టమైన విషయాన్నయినా సులభంగా అర్థం చేసుకోగలడు. అది మన పెద్దల ద్వారా ధ్రువీకరించబడినది. ఇంగ్లీష్ మీడియం వల్ల మాత్రమే ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే.. ఇంగ్లీషే మాతృభాష కల ఆంగ్లో ఇండియన్స్ లాటి వారిలో నిరుద్యోగమే వుండకూడదు.

ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత వారలైనా… వాగ్దేవి నాలుక మీద లేకుండా రాణించలేరు.

ఆ వాగ్దేవి మన తెలుగులో వుంది. ఆ దేవిని విస్మరించి, ఇప్పటికే మన విద్యా విధానం, నిర్గుణంగా మారింది. గతంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో కూడా ప్రామాణీకృతమైన తెలుగు భాష వుండేది. స్వంత భాషనీ, స్వంత తల్లినీ మరిచిన ఈ తరం ఎంత చక్కగా వుందో రోజూ చూస్తూనే వున్నాం.

మీ రచనలు, సత్కారాలు, అవార్డుల గురించి చెప్పండి. 

ఈ ప్రశ్నకి ఒకటే సమాధానం. ఏవీ లేవు. కొన్ని కథలకి బహుమతులు వచ్చాయి. నాలుగు వందల పైనే కథలు, పదివరకు చిన్న నవలలు, ఎనిమిది వరకు పెద్ద నవలలు ప్రింట్ అయి వున్నాయి.

ఈ మధ్యనే.. ఓ ప్రతిపాదన వచ్చింది. ‘మీకు ‘కథారత్న’ బిరుదు ఇవ్వాలని అనుకున్నాం.. అని. ఇలాటి ప్రతిపాదనల ‘డొల్లతనం’ నాకు తెలుసు. నేను ఉత్సాహం చూపలేదు. ఇప్పుడు.. నాకు ఏ సత్కారాల గురించి ఆసక్తి లేదు. వయసు రీత్యా నేను ప్రయాణాలు చెయ్యలేను. జన రంజక ఉపన్యాసాలు చేయలేను.

వర్ధమాన కథా రచయితలకు, రచయితలకు.. రచయిత్రులకు మీ సూచనలు.

సూచనలు, సలహాలు ఇచ్చే సాహసం చెయ్యను. ఇప్పుడు ఎవరూ సూచనలు స్వీకరించే మానసిక స్థితిలో లేరు. మా మనవలు అంటారు.. ‘మీకు ఏమీ తెలియదు తాతగారూ!’ అని. అది నేను నమ్ముతాను. బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటారు కదా!

నాది ఓ సూచన.

…నా వ్రాతలు చూసి.. నాకే.. సూచనలు ఇవ్వండి. నేను వాటిని చదువుతాను. అనుసరణీయమైతే పాటిస్తాను.

ఇది చదివిన పెద్దలకి విన్నపం. మీ తరవాతి తరం వారికి తెలుగు చదవడం, రాయడం, నేర్పించండి.

గ్రంథ పఠన విషయంలో మన దేశం చాలా వెనక బడి వుంది. A generation without reading is a generation without hope అన్నది ఒక నానుడి.

మన దేశపు పఠనా వ్యాసంగం నూటికి ఒక్కటి కూడా లేదు. అంటే నూరు మందిలో ఒక్కరు మాత్రమే పుస్తకాలు చదువుతారు. కొరియాలో 7 శాతం మంది చదువరులు. జర్మన్‌లు, పాశ్చాత్త దేశాలవారు, ఇజ్రాయిల్ లాటి దేశాల్లో పఠనాసక్తి ఎక్కువ. అందుకేనేమో .. అవి అభివృద్ధిలో ముందున్నాయి.

ఇవీ నాకు తోచిన విషయాలు.

జై హింద్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here