సంభాషణం: ‘కులం కథ’ విడుదల సందర్భంగా శ్రీ కస్తూరి మురళీకృష్ణతో ముఖాముఖి

2
5

[box type=’note’ fontsize=’16’] ‘కులం కథ’ పుస్తకం విడుదల సందర్భంగా మైండ్ మీడియా ప్రతినిధి – శ్రీ కస్తూరి మురళీకృష్ణగారితో జరిపిన ఇంటర్వ్యూ. కులం కథ సంకలనం గురించి కస్తూరి మురళీకృష్ణగారు పలు విషయాలు వివరించారు. [/box]

[dropcap]క[/dropcap]స్తూరి మురళీకృష్ణగారూ, నమస్కారం. సంచిక తరఫున ‘కులం కథ’ సంకలనం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా మీ బృందానికి శుభాకాంక్షలు. ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు చెబుతారా?

నమస్కారం. మై ఇండ్ మీడియా ప్రేక్షకులకు, సంచిక పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు.

సంచిక ముందుగానే ప్రకటించిన విధంగా దీపావళి సందర్భంగా ‘కులం కథ’ సంకలనాన్ని తయారుచేసి సమయానికి అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

నేనూ, నా సహ సంపాదకుడు కోడీహళ్ళి మురళీమోహన్ కలిసి ఈ సంకలనాన్ని రూపొందించాము.

నిజానికి సంచిక అనేది కేవలం ఒక వెబ్ పత్రికనే కాకుండా, సాహిత్యానికున్నటువంటి సామాజిక దృక్కోణాన్ని ప్రతిబింబిస్తూ, సామాజిక బాధ్యతను నిర్వర్తించే వెబ్ పత్రికగా ఎదుగుతున్నందుకు, విశేష రీతిలో పాఠకాదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది సంచిక-సాహితీ తరఫున మేము సంయుక్తంగా వెలువరిస్తున్న మూడవ సంకలనం. మొదటి సంకలనం ‘దేశభక్తి కథలు‘ గత సంవత్సరం ఆగస్టు 15న విడుదలైంది. ఆ తరువాత ‘క్రీడాకథ‘ మొన్న ఉగాదికి విడుదలయింది. ఇప్పుడు దీపావళికి ‘కులం కథ‘ సంకలనం రూపొందించి విడుదల చేస్తున్నాం. నిజానికి సంచిక తరఫున ‘కులం కథ’ కాని, ‘క్రీడాకథ’ కాని, ‘దేశభక్తి కథలు’ కాని రూపొందించడం వెనుక ఒక ప్రణాళిక ఉంది.

ఆ ప్రణాళిక ఏంటంటే తెలుగు సాహిత్యంలో ఒక పద్ధతి ప్రకారము కొన్ని కథల్ని మాత్రమే పైకెత్తి, వాటికి మాత్రమే ప్రాచుర్యం కల్పించడం జరిగింది. అలా ప్రాచుర్యం కల్పించడం వల్ల ఇవే కథలు, వీళ్ళే కథకులు అనేటు వంటి ఒక పరిస్థితి నెలకొని గుప్పెడు కథలు, గుప్పెడు కథకులే మనకు మిగిలారు. ఈ పరిస్థితి మారాలంటే తెలుగులో మన కథకులు చేసినటువంటి అనేక విచిత్రమైన ప్రయోగాలు, వారు రాసినటువంటి విశిష్టమైన కథలు, ఎన్నుకున్నటువంటి విభిన్నమైన అంశాల ఆధారంగా సృజించిన కథలు – వీటిని పాఠకుల దగ్గరకు తీసుకువస్తే ఓ రకంగా పాఠకులే జడ్జ్ చేస్తారు ఎంతమంచి కథకులు మనకున్నారో అనేటువంటిది. ఈ ఉద్దేశంతో సంకలనాలు రూపొందిస్తున్నాం. ముందు మూడు నెలలకొక సంకలనం అనుకున్నాం, కాని తరువాత ఇప్పుడు ఆరు నెలలకొక సంకలనం చొప్పున రూపొందిస్తున్నాం.

మీ మొదటి రెండు సంకలనాల గురించి చెబుతారా?

మొదటి సంకలనం ‘దేశభక్తి కథలు’. తెలుగులో అంతవరకు దేశభక్తి కథలను అన్నీ ఒక చోట కూర్చినటువంటి ప్రయాస జరగలేదు. దానికి విపరీతమైన ఆదరణ వచ్చి, ఇప్పుడు దేశభక్తి కథలు అనగానే ఆ పుస్తకం ఒక రిఫరెన్స్ పాయింట్‌లాగా మారింది. దేశభక్తి అంటే ఏమిటో నిర్వచించాము. ముఖ్యంగా మన సమాజంలో దేశభక్తి అంటే ఏమిటన్నది ఒక ప్రశ్నార్థకం. సో, అలాంటి సమయంలో దేశభక్తి అంటే ఏమిటో నిర్వచించి, డౌన్ ది ఏజస్.. ప్రాచీన కాలం నుండి నేటి వరకు దేశభక్తి కాన్సెప్ట్‌లో వచ్చిన మార్పులను సూచించే కథలను ప్రచురించి ఆ సంకలనం రూపొందించాము.

తరువాత ‘క్రీడాకథ’ మొన్న ఉగాదికి విడుదల చేశాము. మేము సంకలనం గురించి ప్రకటించినప్పుడు తెలుగులో క్రీడాకథలే లేవన్నారు. కానీ 23 కథలు వచ్చాయి. ఈ 23 కూడా విభిన్నమైన కథలు. కథలతో ఎన్నో ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా క్రీడ కేంద్రంగా మన తెలుగు కథకులు చేసిన ప్రయోగాలను ఆ సంకలనం షోకేస్ చేస్తుంది. ఆ సంకలనం తెలుగు కథకులలోని లోపాన్ని కూడా చూపించింది. సాధారణంగా కథకులు క్రీడాకారులు కారు. వాళ్ళకి క్రీడలతో అంత సన్నిహిత సంబంధం లేదు. కాబట్టి కథల్లో టెక్నికల్ యాస్పెక్ట్స్ కన్నా ఇతర సామాజిక, ఆర్థిక, మానసిక కారణాలను ఎక్కువగా చూపించారు. టెక్నికల్‌గా క్రీడాకథలు తక్కువ ఉన్నాయి… ఒకటో రెండో తప్పించి ఎక్కువ లేవు. ఈ లోపం కూడా సాహిత్య ప్రపంచానికి స్పష్టమయింది. ఇప్పుడు కొందరు కథకులు పూనుకుని స్పోర్ట్స్‌లో టెక్నికల్ యాస్పెక్ట్స్‌తో కథలు రాసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆ సంకలానికి ఒక విజయంలా భావిస్తాము.

మొదటి రెండు సంకలనాలు విజయవంతమైన సందర్భంలో నేనూ, కోడీహళ్ళి మురళీమోహన్ తదుపరి ఏ సంకలనం వేయాలి అని అనుకుంటున్నప్పుడు మా ఎదురుగా ఒక ప్రశ్న నిలిచింది. రకరకాల సంకలనాలు, రకరకాల ఐడియాలు అనుకున్నాము. అయితే ప్రస్తుతం మన సమాజంలో కులం అనేది ఒక సమస్యగా ఉంది. ఒకప్పుడు అంటే మేము ఎదిగేడప్పుడు కులం చెప్పుకోడానికి గాని, కులం అడగడానికి గాని ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఉదాహరణకి అనేకులు తమ పేర్ల వెనక ఉండేటువంటి రెడ్డి, గౌడ్ వంటి వాటిని తీసేసేవారు. మాకు కులం లేదు, కులం లేకుండా మమ్మల్ని గుర్తించండి అనేవారు. మేము పాఠశాలలో చదివేడప్పుడు గానీ, కాలేజీలో చదివేడప్పుడు గానీ నీదే కులము అని అడిగి ఎవరితోనూ ఫ్రెండ్‌షిప్ చేయలేదు. కలిసిన వాళ్ళతోటి కలిసాము, తిరిగాము. కాని ఎదిగి ఉద్యోగాలొచ్చిన తర్వాత ముఖ్యంగా 1990ల తర్వాత గమనిస్తే కులం అనేది ప్రతీ వ్యక్తికి ఒక ఐడింటిటీలాగా మారి తన అస్తిత్వాన్ని నిరూపించుకోడానికి కులం అనేదాన్ని వాడుకోవడం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే లైన్స్ ఆర్ డ్రాన్ బెట్వీన్ ఇండివిడ్యువల్స్. వీడీ కులం వాడు, వాడు ఆ కులం వాడు, వీడు ఇలాంటి వాడు అని చెప్పుకోవడమే కాదు, మేము ఆ కులానికి చెందినవారిమని తమ కులం పేరుతో పేరుని చెప్పుకోవడం అనేది కూడా ఈ మధ్య కాలంలో ఒక ఐడెంటిటీగా మారింది. కులం తరఫున సంఘాలు ఏర్పర్చుకోడం… అంతకు ముందు కూడా ఉండేవి కానీ ఇంత బ్లాటంట్‌గా కులాన్ని ప్రచారం చెయ్యడం లేదు. లేదంటే కులం నాశనం కావాలంటే భారతీయ ధర్మం నాశనం కావాలని, ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని భారతీయ ధర్మాన్ని విమర్శించడం, ధర్మశాస్త్రాలను విమర్శించడం… ఇలాంటివి ఎక్కువయిపోయింది.

స్వాతంత్ర్యం వచ్చాక మనం కుల రహిత సమాజాన్ని ఊహించాము, అప్పట్లో వ్యక్తులు కూడా ఆ రకంగా ఉండేవారు. కానీ ఇప్పుడు కులం లేని సమాజాన్ని ఊహించలేని పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తి తన కులాన్ని గుర్తుపెట్టుకోకపోయినా సరే, మర్చిపోవాలని ప్రయత్నించినా సరే, ఆ కులాన్ని గుర్తు చేసేటువంటి పరిస్థితులొస్తున్నాయి. బాటిల్ లైన్స్ ఆర్ క్లియర్లీ డ్రాన్. మనుషుల మధ్య కులం అనేది అడ్డుగోడలా నిలిచి అందరూ ఒకరితో ఒకరు కలవకుండా చేస్తోంది. ద్వేషాలు పెరుగుతున్నాయి. ప్రతి విషయంలోనూ కులాన్ని చూస్తున్నారు. ఆటగాడు ఆడితే వాడిదే కులము, ఓ ఆటగాడు ఏదైనా గెలిస్తే వాడిదే కులమని గూగుల్‌లో సెర్చ్ చేయడం.. ఒక ఆటగాడికి గవర్నమెంట్ ఏదైనా బహుమతి ఇస్తే వాడిదా కులం కాబట్టి బహుమతి ఇచ్చారని… ఇలా ప్రతీదానిలో కులం లేనటువంటి ఆలోచన రాని పరిస్థితులు ప్రస్తుతం నెలకొంటున్నాయి. అప్పుడు నాకూ, మురళీమోహన్‌కి ఒక ఆలోచన వచ్చింది. ఈ పరిస్థితుల్లో మన కథకులు ఎలా స్పందించారు? 1910 నుంచి మన కథలు స్టార్ట్ అయ్యాయని మనం అనుకుంటాం. కథకులు తమ చుట్టూ ఉన్న సమకాలీన సామాజిక పరిస్థితులకు స్పందించి కథలలో తమ పరిస్థితులను ప్రతిబింబిస్తూ వారు రాసుంటారు. ఇలా ఈ కులం అనే భావనని మన కథకులు తమ కథలలో ఎలా ప్రతిబింబించారో చూస్తే, అటువంటి కథలను సేకరించి ఒక సంకలనం చేస్తే – ఈ కుల భావన ఎలా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, ఎలా మారుతూ వస్తోంది, దానికి కథకుల స్పందన ఏమిటి – అని తెలుసుకునే వీలుంటుంది కదా అని అనిపించింది. ఆలోచించాము. కొన్ని కథలని వెతికాము. దానిలో శ్రీ తోలేటి జగన్మోహనరావు గారిది చాలా అద్భుతమైన కథ దొరికింది ‘కులం’ అని. ఆ కథ చదివిన తర్వాత ఇలాంటి సంకలనం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని అనిపించింది. ఎందుకంటే, ఆ కథలో అసలు కులం అంటే ఏమిటో చర్చించి ప్రపంచంలో అసలు కులము గిలము ఏమీ లేదు, ఉండేవి రెండే రెండు కులాలు. ఒకటి డబ్బున్న వాళ్ళు, రెండు డబ్బు లేని వాళ్ళు అని తేలుస్తారు. అంతే. సో, ఇలా అసలు కులమంటే ఏమిటి అని చర్చించి, కులం గురించి ఎలాంటి సైడ్స్ తీసుకోకుండా అపోహలు లేకుండా, ద్వేషభావనలు ప్రదర్శించకుండా అగ్రవర్ణాలు అణగదొక్కారనో, వాళ్ళు అలాంటి వాళ్ళనో, వీళ్ళు ఇలాంటి వాళ్ళనో అని విమర్శలేవీ లేకుండా తార్కికంగా ఒక అవగాహనతోటి భారతీయ సమాజాన్ని విభజించకూడదు, దీన్ని కలపాలి అనే ఉద్దేశంతోటి సృజించిన కథలను ఒక చోట చేర్చి ‘కులం కథ’ అని పేరుపెడితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. కొందరిని మేం అడిగాం ఇలా కులం కథ చేస్తే ఎలా ఉంటుందని. “అసలు కులం అంటే ఏమిటని ఎలా నిర్ణయిస్తావు, దాదాపుగా మూడు వేల కులాలు, ఉపకులాలు ఇలా ఉన్నాయి దేశంలో, ఏ కులం కథ రాస్తావు నువ్వు? కమ్మరి కథనా, కుమ్మరి కథనా, చాకలి కథనా” ఇలా రకరకాల ప్రశ్నలడిగారు. “అసలిప్పుడు కులం కథల సంకలనం ఎందుకు?”, “కులం లేనిదే సమాజమే లేదు, కులం కథలు సంకలనం చేసి నువ్వేం చేస్తావు?” ఇలా రకరకాలుగా విమర్శలొచ్చాయి. “ఇది కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్, నిప్పులాంటిది, ముట్టుకోకు, కాలుతుంది” అని బెదిరించినవాళ్ళూ ఉన్నారు.

కాని ఎవరు ఎంతగా వద్దంటున్నా, మాకు నమ్మకం ఏంటంటే ఈ కథలు సమాజంలో రావాలి, పదిమంది చదివి చర్చించాలి ఇలాంటి కథలు, మన కథకులు ఎంత ఆదర్శంతోటి ఎంత దూరదృష్టితోటి, ఎంత అవగాహనతోటి కులం ఆధారంగా కథల్ని సృజించారో; ఆధునిక సమాజంలో కులం అనగానే అది మనుషుల మధ్య అడ్డుగోడలు నిర్మించేది, ద్వేషభావనలు వెదజల్లేది అనేటువంటి భావనతోనే కథలెలా చూపిస్తున్నారో చూపించాల్సిన అవసరం ఉందనిపించింది. తత్ఫలితంగా ఈ ‘కులం కథలు’ అనేది మేం రూపొందిస్తున్నట్లుగా ప్రకటించాం. కులం ఆధారంగా రాసిన కథలు పంపించమని అడిగాం. అయితే మా కాన్సెప్ట్ ఆఫ్ కులం అంటే ఏమిటో మేం ఎక్కడా ప్రకటించలేదు, ప్రచురించలేదు. కేవలం కులం కథలు అన్నాం.

ఎన్ని కథలందాయి, వాటిని ఎలా ఎంచుకున్నారు? మీ ప్రామాణికాలేమిటి?

మేం ఇలా అనేడప్పటికి మాకు బోలెడు కథలొచ్చాయి. కొన్ని వేల సంఖ్యలో కథలొచ్చాయి. కమ్మరి కథలు, కుమ్మరి కథలు, చాకలి కథలు, ఇలా ఏదో ఒక రకంగా పేర్లు పెట్టి మాది కులం కథ అన్నారు. అయితే మేం కొన్ని ప్రామాణికాలు ఏర్పర్చుకున్నాం. ఎలాంటి కథలు తీసుకోవాలి? మొదట చెప్పినట్టు ద్వేషభావన ఉండకూడదు. ఎవరినీ విమర్శించకూడదు. అకారణమైన విమర్శలు, దూషణలు లాంటివి ఉండకూడదు. భాష సభ్యతా సరిహద్దులని దాటకూడదు. ఆ తరువాత రచయిత ఏ కులమూ కాకున్నా ఒక అవగాహన ఉండాలి – సమాజంలో కులం అనే భావన ఎలాంటి పరిస్థితిని కల్పిస్తోందో, దాన్ని మార్చాలంటే ఏం చేయాలో తెలిసి ఉండాలి. సో, ఇలాంటి భావనలతో రాసిన కథలని మాత్రమే మేం తీసుకోవాలనుకున్నాం. అలా ఎంచుకోగా మొత్తం 42 కథలతో మా ‘కులం కథ’ సంకలనం పూర్తయ్యింది.

కాబట్టి మనం సంచిక – సాహితి తరఫున వేసే కథల సంకలనాలు ఇతర కథల సంకలనాలకి పూర్తిగా భిన్నమైనవిగా ఉండి సమాజానికి ఉపయోగపడుతూ సాహిత్య రంగంలో కూడా ఒక ఆలోచనని కల్పిస్తూ ముందుకు వెళ్ళడమనేది చాలా ప్రోత్సాహకరంగా, ఆనందదాయకంగా ఉంది. అందుకని ఇప్పుడు కులం కథ రూపొందించాము. కులం కథ విషయానికొస్తే దీనికి ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎందుకంటే కులం అనేది మోస్ట్ సెన్సిటివ్ టాపిక్. ఎవరూ కులం అనే భావన నుండి తప్పించుకోలేరు. అలాగే కులం పేరిట జరిగే వివక్షని మనం కాదనలేని పరిస్థితి. కులం పేరు మీద ఎంతో మంది అణచివేతకి కూడా గురయ్యారు కొన్ని వందల సంవత్సరాల పాటు. ఇది కాదనలేని సత్యం. అయినా సరే మనలో ఉన్న లోపాలను ఎంచుకుంటూ, లోపాల వల్ల ఇతరులను ద్వేషిస్తూ కూర్చుంటూ ఉంటే సమాజం ముందుకు పోదు. ఎక్కడో ఒక చోట ఈ ద్వేషభావనని మనం అణగదొక్కాల్సిన అవసరం ఉంది. మన మధ్య ఉండే భేదభావాలని లేదా అపోహలని తొలగించుకుని కలిసికట్టుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి నాందీ ప్రస్తావన లాంటిది ఈ పుస్తకం అని మేము అనుకుంటున్నాము. అలా నాందీ ప్రస్తావనగా ఈ పుస్తకం పనికొస్తే అంతకంటే ఆశించేది ఏదీ లేదు.

సంచిక తరఫున మీరు ప్రశ్నిస్తున్న మూడవ సంకలనం ఇది. మొదటి రెండు సంకలనాలకు రెస్పాన్స్ ఎలా ఉంది?

మొదటి రెండు సంకలనాలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దేశభక్తి కథల సంకలనం అంత వరకూ లేదు. తొలిసారిగా మనం సంచిక తరఫున చేశాము. ఇందులో కూడా దేశభక్తి కాన్సెప్ట్‌ని వివరించాము. దేశభక్తి అంటే మనకిప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే పాకిస్థాన్ కూడా ఒకప్పుడు ఇండియాలో భాగమే, బంగ్లాదేశ్ భారత్‌లో భాగమే. కాని ఇప్పుడు అవి వేరే దేశాలు. వాటిని ద్వేషిస్తేనే దేశభక్తా? లేకపోతే మనం ఏవైతే గౌరవంగా భావిస్తామో… సింధు నాగరికత గానీ, శారదా పీఠం గానీ, ఇలాంటివానీ అటువైపు ఉన్నాయిప్పుడు. సరిహద్దుకు ఆవలి వైపున. మరిప్పుడు వాటిని ద్వేషించాలా, ప్రేమించాలా? సో దేశభక్తి అంటే ఏమిటి? ఇటువంటి ప్రశ్న వస్తుంది. కొందరేమంటారంటే మనకి అసలు దేశభావనే లేదు, బ్రిటీషు వాడొచ్చిన తర్వాత, సంస్థానాలన్నీ విలీనం చేసిన తర్వాత ఒక దేశంలాగా ఏర్పడ్డాం. కాబట్టి మన దేశభక్తి అప్పట్నించే ఏర్పడింది, అంతకు ముందు దేశభక్తి లేదంటారు. ఈ రకమైన భావనల మధ్య అసలు దేశభక్తి కాన్సెప్ట్‌ని వివరించి, దేశానికీ ధర్మానికీ ముడిపెట్టి మన దేశంలో ధర్మంతో సంబంధం లేనిది ఏదీ లేదు. సో దేశం, భక్తి అంటే ధర్మ భక్తి అని నిరూపించి; అలాంటి భావనలను సూచించే కథలను చేయడం అనేది దేశభక్తిని గూర్చిన ఆలోచనను కల్పించింది. ఈ పుస్తకాన్ని చాలామంది స్కూళ్ళలో పిల్లలకి బహుమతి లాగా ఇవ్వటమూ, కాంపిటీషన్స్‌లో గెలిచిన వారికి! దీన్ని చదవటమూ, చర్చించటమూ సాగుతోంది.

అలాగే ‘క్రీడాకథ’ కూడా. ఇందాక చెప్పినట్టు విజయనగరంలో ‘క్రీడాకథ’ పుస్తకాన్ని విజయనగరం జిల్లాలో డిస్టింగ్విష్డ్ క్రీడాకారులు పదిమందికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా, స్కూళ్ళలో కూడా క్రీడల పట్ల అవేర్‌నెస్ పెంచడానికి ఈ పుస్తకాన్ని వాడుతున్నారు. ‘క్రీడాకథ’కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కులం కథ చేయాలనే ఆలోచన అసలెలా కలిగింది? సంకలన ప్రక్రియ ఎలా సాగింది? కొన్ని కథల గురించి చెబుతారా?

ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఇందాక చెప్పాను. నేనూ కోడిహళ్ళి మురళీమోహన్ ఉన్నప్పుడు ఈసారి కులం కథ సంకలనం చేస్తే బాగుంటుందని అనిపించింది.

సంకలనం తయారైన తర్వాత ఒక్కో కథని మేం చివరిసారిగా చదువుతున్నప్పుడు చాలా అద్భుతమైన కథలున్నాయనిపించింది. ఈ కులం కథ సంకలనంలో అమరిక చూస్తే – మొత్తం 42 కథల్లో 40 కథల్ని క్రోనలాజికల్ ఆర్డర్‌లో వేశాము. అంతే అవి ప్రచురితమైన సంవత్సరాన్ని బట్టి. మోస్ట్ సీనియర్ కథ 1927లో వచ్చిన కథ. తరువాతి కథ 1938లో వచ్చినది. ఇలా సీక్వెన్స్‌గా 2019 వరకు వచ్చిన కథల్ని ముఖ్యంగా 20 అక్టోబరు 2019 సంచికలో ప్రచురితమైన రెండు కథల వరకూ… ఇవెక్కడా మునుపు ప్రచురితం కాలేదు.. 1927 నుంచి 2019 వరకు ప్రచురితమైన కథలలో కులభావన ఉన్న కథలలోంచి అంటే… ఏ ఒక్క కులం కాదు… బ్రాడ్‌గా అసలు కులమంటే ఏమిటి? ఈ భావన మనుషుల మధ్య ఎలా అడ్డగోడలు నిర్మిస్తోంది? ఈ భావనని ఎలా తొలగించుకోవాలి? ఆ అడ్డుగోడలని కూలగొట్టి మనమంతా ఒకటి కావాలంటే ఏం చేయాలి? అని సూచించిన కథల్ని ఈ సంకలనంలో చేర్చాము. 40 కథల్ని క్రోనలాజికల్ ఆర్డర్‌లో పెట్టి, రెండు కథల్ని మాత్రం వాటి క్రోనలాజికల్ ఆర్డర్ నుంచి వేరు చేశాము. ఉదాహరణకి గోపిని కరుణాకర్ వ్రాసిన ‘కుమ్మరి చెక్రం’ అనే కథ ఉంది. ఆ కథతోటి సంకలనం ఆరంభించాం – అంకురార్పణ అనేటి హెడింగ్ క్రింద. దాని తర్వాత కులం కథలు వస్తాయి. చివరగా బి.ఎన్. స్వామి వ్రాసిన ‘నిన్నటి ఊపిరి’ అనే కథ ఉంది. ఈ కథని స్వామి 1992లో రాశారు. దీన్ని చివరికథగా ‘ఉపసంహారం’ అనే హెడింగ్ కింద వేశాము. దీని వెనకాల ఒక ప్రణాళిక ఉంది.

‘కుమ్మరి చెక్రం’ కథేంటంటే ఒక కుమ్మరివాడు మట్టిని తీసుకుని కుండలు చేస్తుంటే భూదేవికి కోపం వస్తుంది. ఇదేంటి ఇలా చేస్తున్నావ్ అంటే, రైతుకి కుండలు కావాలి కాబట్టి, కుండలు మట్టి తోనే చేస్తాం కాబట్టి నేను కుమ్మరి చక్రాన్ని ఇలా తిప్పుతున్నాను అంటాడతను. ఆ చక్రం తిప్పద్దంటుంది. చక్రం తిప్పకపోతే కుండలు ఎలా తయారవుతాయి? అప్పుడు చక్రానికి ఒకవైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడు నిలుస్తారు. చక్రాన్ని తిప్పుతుంటే ఋతువులు ఏర్పడుతాయి. వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. మనుషులు జీవిస్తారు. ఈ రకంగా ఒక కుమ్మరి చక్రం అనేదాన్ని విశ్వానికి ప్రతీకగా చేసి కుమ్మరి కులం అంటే తక్కువ కులం కాదని చెప్పిందా కథ. కుమ్మరి చక్రం ఏదైతే ఉందో దాన్ని విశ్వప్రణాళికలో భాగం చేసి కుమ్మరి చక్రం తిరుగుతోంది కాబట్టే సూర్యుచంద్రులు తిరుగుతున్నారని చెబ్తూ, రైతులకి నిత్యజీవితంలో ప్రతీ అవసరానికి కుండ కావాలి -పిల్లలు పుట్టినప్పటి సంబరాలకు, పెళ్ళిళ్ళకు, చావులకు కుండలు కావాలి. అన్ని కుండలు ఈ కుమ్మరే తయారుచేయాలి. తయారు చేయాలంటే చక్రం తిరగాలి. ఈ చక్రం తిరిగితే ఋతువులు ఏర్పడుతాయి. రైతుకు జీవిక ఏర్పడుతుంది. ప్రజలకు బియ్యం, ఇతర పంటలు దొరుకుతాయి. సో, ఈ రకంగా ఒక తక్కువ కులంగా భావించబడేటి కుమ్మరి కులానికున్న కథలో ఆ కులం యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తూ ఆ కులం ఎవరికీ తక్కువ కాదనీ, కుమ్మరంటే ఎవరికీ తక్కువ కాదని, తక్కువగా భావించడం మనలో దోషమని ఈ కథ చెబుతుంది. దోషం కులంలో లేదు, కులభావనలో లేదు, మనుషులలో ఉంది. వాడు తక్కువ, వీడు ఎక్కువ అని భావించడం మనుషులలోని దోషం. ఎందుకంటే కుమ్మరి కుండలు చేయకపోతే, రైతు బతకలేడు. రైతు పండిచకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే ఆహారం ఉండదు. సో ఇదొక చక్రం. ఈచ్ పర్సన్ ఈజ్ డిపెండెంట్ ఆన అనదర్ పర్సన్. ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ పరస్పరం గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ ఉండేటువంటి స్నేహ సౌహార్ద భావాలతో… ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రాటర్నిటీ అని ఏదైతే ఉందో ఆ భావనలతోటి ఏర్పడిన సమాజానికి ప్రతిబింబంగా ఆ కుమ్మరి చక్రం అనే కథ ఉంటుందన్న మాట. సో, ఈ కథతోటి ఆరంభం. అంటే ఆరంభంలో ఈ కులాలు వృత్తులు ఆధారంగా ఏర్పడినా తక్కువ ఎక్కువ భావనలు లేవు. ఒకరి మీద ఒకరు ఆధారపడే వ్యవస్థ అది. వీళ్ళింట్లో పూజలు చేయాలంటే బ్రాహ్మణుడు కావాలి, వీళ్ళకి రక్షణ కావాలంటే క్షత్రియుడు కావాలి. ఈ రకంగా మనిషి శరీరం ఉంటే… ప్రతి ఒక్క అంగానికీ దాని ప్రత్యేకత ఉంది.

ఉపనిషత్తులలో ఒక కథ ఉంది. ఇది చాలా ఫేమస్. ఏంటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని శరీరంలోని అంగాలన్నీ కొట్లాడుకుంటాయి. అన్నీ పనులు మానేస్తాయి. కాళ్ళు చచ్చుబడిపోతాయి, చేతులు చచ్చుబడిపోతాయి. జీర్ణక్రియ పనిచేయడం మానేస్తుంది. కళ్ళు చూడ్డం మానేస్తాయి, చెవులు వినడం మానేస్తాయి. ఇదంతా చూసిన తర్వాత చివరికి గుండే కొట్టుకోవడం మానేస్తుంది. మనిషి చచ్చిపోతాడు. సో, అందరూ సమానమే ఇక్కడ. ఎవరు లేకున్నా పని జరగదు. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. ఈ ఎక్కువ తక్కువ భావనలు మనలో వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఎక్కువ తక్కువ భావనలను మనం తొలగించుకుని, మనమంతా ఒక్కటే, ఒకళ్ళ మీద ఒకళ్ళం ఆధారపడి ఉన్నాం అని గ్రహించి పరస్పరం గౌరవించుకుంటూ స్నేహ సౌహార్ద భావనలతో జీవించేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఈ కుమ్మరి చక్రం కథ ప్రతీక. దీనితో కథలు ప్రారంభమవుతాయి. ఒక కుమ్మరి తిప్పేటువంటి చక్రం మీదే సూర్యచంద్రులున్నారనీ, మొత్తం సమస్త జగతి ఆధారపడి ఉందనే కాన్ఫిడెన్స్ – తక్కువ కులం అని భావించబడే కుమ్మరి కులంలో ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో ఇది కేవలం కుమ్మరికే కాదు, మీరు గనుక ప్రతి కులమూ, దాని పురాణమూ చూస్తే – వాళ్ళ తోటే సృష్టి ఆరంభమవుతుంది. వాళ్ళు లేకపోతే సృష్టి లేదు. అంటే ప్రతీ కులానికీ వాళ్ళకంటూ ఒక పురాణం ఉంది. ఆ పురాణం డైరక్ట్‌గా విశ్వసృష్టికి కనెక్ట్ అవుతుంది. ఇదంతా ఒకటే – వేర్వేరు కులాలకు వేరు కాదు. ఎవరూ ప్రత్యేకం కాదు, అందరూ ఈ చక్రంలో ఇమిడిన వారే, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడినవాళ్ళే అని నిరూపించేటటువంటి కథ. అలా ఆరంభమయింది కులవ్యవస్థ అని చూపించేటటువంటి కథ అది. దాంతోటి కథల సంకలనం ఆరంభమవుతుంది.

ఇక ఆ తరువాత కులవ్యవస్థ ముదిరిపోయి, మనుషులలో స్వార్థభావన పెరిగిపోయి హెచ్చు తగ్గులొచ్చి కొందరిని ఊరి బయటపెట్టి, కొందరిని తక్కువవాళ్ళని అనడం ఏదైతే వచ్చాయో దాన్ని రూపుమాపడం కోసం ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మాగాంధీ హరిజనులు అని ఏర్పాటు చేసి అంటరానితనాన్ని రూపుమాపడం అగ్రవర్ణాల బాధ్యత… they are responsible for this అని వారిలో ఒక రకమైన నేరభావనని కలిగించి తమ బాధ్యతను గుర్తుచేసి అగ్రవర్ణాలే దీన్ని రూపుమాపాలి, వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత అగ్రవర్ణాలదే, ఎందుకంటే ఇన్నేళ్ళు అణగదొక్కారు కాబట్టి అని అంటరానితనాన్ని నివారించడానికి ఆయన ప్రచారం చేస్తే, దానికి సమాజం ఎలా స్పందించింది అనేటువంటి కథలు – ‘నేరేడు పండ్లు కంటు’, ‘వెట్టి మాదిగ’, ‘మాదిగోళ్ళ యెంకి’, ‘కులమా? కులపాలికా?’ ఇలాంటి 1927 నుంచి 1950ల మధ్యలో వచ్చిన కథలివి. ఈ కథల్ని సంకలనంలో ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో పెట్టాము. కుల భావన ఎలా వస్తోంది, ఎలా మారుతోంది అని తెలుసుకోడం కోసం! ఒక కథ ఉంది ‘మంచితనానికి కులమేమిటి’ అని యస్. పార్వతీదేవి వ్రాసారు. ఇది 1977లో వచ్చింది. ఈ కథలో కథకులు అగ్రవర్ణాలలోనే అనాథలను చేరదీసి పెంచుతారు. అదే సమయంలో ఇంటికి వస్తున్నప్పుడు తక్కువ కులం వాళ్ళకి ఆహారం ఇస్తూ ఉంటారు. అగ్రవర్ణానికి చెందిన పిల్లాడు పెద్ద ఉద్యోగం సంపాదించుకుని, వీళ్ళు తన తల్లిదండ్రులని, తనని పెంచారని చెప్పుకోడానికి సిగ్గుపడి వాళ్ళని దగ్గరకు తీయడు. వాళ్ళ అవసరాలు పట్టించుకోకుండా అనాథల్లా వదిలేస్తాడు. అప్పుడు వీళ్ళు అప్పుడప్పుడు డబ్బులిచ్చిన ఆ అల్పవర్ణాల పిల్లాడు వీళ్ళని చేరదీస్తాడు. వీళ్లకి ఆసరా ఇస్తాడు. సో, ఇక్కడ మనకి మంచితనంతో సంబంధం గానీ, కులంతో కాదు. ఆ సమయంలో కథకులు ఏం చేసారంటే – నీది ఆ కులం కాదు, ఈ కులం కాదు, మంచి ఉంటేనే కులం అని, మంచి నడవడిక ఉంటేనే కులం అనీ, అందరూ కలిసి ఉండేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించారు.

ఇందులో మరో గమ్మత్తైన కథ ఉంది. జొన్నలగడ్డ రామలక్ష్మి వ్రాశారు. కథ పేరు ‘కులతత్వం’. మనం కులం కులం అంటాం గానీ, రచయితల్లో కూడా కులతత్వం ఉంది. అంటే ఎవరైతే పేరుపొందిన రచయిత ఉన్నాడో, వాదు ఇతర రచయితలని చిన్నగా చూస్తాడు. వాడితో నే మాట్లాడడమేంటి, టైమ్ వేస్టు అని! సో వాణ్ణి పక్కన పెడతాడు. కథకులలో కులతత్వం ఇలా వస్తుంది. యాక్చువల్‌గా తప్పు కులంలో లేదు, సమాజంలో లేదు. వ్యక్తులలో ఉంది. ‘నేను గొప్పవాణ్ణి’, ‘నా ఇంటికి నేను ఎంత డబ్బు సంపాదించాను’, ‘నేను చాలా ఫేమస్’, ‘వాడు నా ఇంటికొస్తే బయట ఉండాలి’, ‘వాణ్ణి కలవటం నా టైమ్ వేస్టు’, ఈ భావన మనం కులాలాకు అంటించుకుంటున్నాం. గొప్ప రచయిత, చిన్న రచయిత అని. ఇలాంటివి ఆఫీసుల్లో కూడా చూడచ్చు. ఆఫీసరు, అతని కింద సబార్డినేట్లు, సబార్డినేట్ వెళితే, ఆఫీసరు వాణ్ణి కూర్చోమని కూడా అనడు. వాడు చేతగాని వాడు, పనికిరానివాడు అనే అభిప్రాయంతో ఉంటారు. సబార్డినేట్ ఏదైనా సలహా ఇవ్వబోతే ఒప్పుకోరు. ఈ రకంగా మనలో మనమే, ‘కులరహిత సమాజాన్ని’ ఊహించిన మనమే.. మనుషుల మధ్య ఇన్ని రకాలుగా అహంకారం వల్ల, లేకపోతే డబ్బు వల్ల, లేకపోతే వాడి స్టేటస్ వల్ల ఇన్ని రకాల వ్యత్యాసాలు ఏర్పాటు చేసుకున్నాం అని చూపించే కథ. అంటే problem is with individuals, not with the system… వ్యక్తులలో దోషముంది, వ్యవస్థలో లేదు. వ్యవస్థలో దోషముంటే, మనం వ్యక్తులని సరిజేస్తే వ్యవస్థ సరైపోతుంది. ఎందుకంటే వ్యవస్థా, వ్యక్తులు ఒకటే. వ్యక్తులతోటే వ్యవస్థ ఏర్పడుతుంది. ఇలాంటివి సూచించే కథలున్నాయి. సమాజంలో వస్తున్న మార్పులను చూపించే కథలున్నాయి. ‘కళేబరం’ అనే కథ జూకంటి జగన్నాథం రాశారు. పల్లెటూర్లలో ఎద్దులు అవి చనిపోతే వాటిని లాగడానికి మరో కులం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా చదువుకుని తమ శక్తిని తెలుసుకున్న తర్వాత – పెద్దోళ్ళు పిలిచి రారా ఎద్దును వేసేయరా అంటే వాళ్ళు వేయరు… ఎందుకంటే now they are changed. సో, వాళ్ళు మారుతున్నారు. ఇలాంటి మార్పుని సూచించే కథలు, అలాగే ‘కులకశ్పి’ అని నందిని సిద్ధారెడ్డి గారి కథ ఉంది. దాంట్లో ఏంటంటే పల్లెటూళ్ళో ఒక కులం వృత్తిని చేపట్టేవాడు, పట్నానికి వచ్చాకా పరిస్థితులకు అణుగుణంగా తన వృత్తి యొక్క పద్ధతిని మార్చుకుంటూంటాడు. అక్కడ బొమ్మలు తయారు చేసేవాడు, ఇక్కడికొచ్చి క్రికెట్ బ్యాట్‌లు తయారుచేస్తాడు. ఎందుకంటే అందరూ క్రికెట్ బ్యాట్‌లు కొంటూంటారు కాబట్టి. సో కులంలోనే పరిస్థితికి తగ్గట్టుగా మారుతూ, ఎవాల్వ్ అయితే వ్యక్తి కూడా ఎవాల్వ్ అవుతాడనే పాజిటివ్ దృక్పథంతో రాసిన కథ అది. ఇంకా ‘అనాది అనంతం’, ‘వాదమే వేదం’ వంటి కథలున్నాయి.

‘వాదమే వేదం’ సూర్యప్రసాదరావు రాసిన కథ. ఈ కథలో ప్రస్తుతం మన సమాజంలో అంటే 1990ల తర్వాత కులం గురించిన దృక్పథంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెబుతారు. దళితులు అగ్రవర్ణాలు అని రెండు వర్గాలుగా వేరయిపోయి దళిత కవిత్వం, దళిత సాహిత్యం అని ఏర్పాటు చేసుకుని, మా గురించి మేమే రాసుకోవాలి, మీరెవరు రాయడానికి అని… ఈ రకంగా ద్వేషభావన మొదలైంది. అప్పుడలా జరిగింది, ఇప్పుడు మనం మారుదాం… అందరం కలిసుందాం అనే దృక్పథం పోయింది. ఇలాంటి భావనలను చూపించిన కథలు ఉన్నాయి.

నేను రాసిన ‘ఎక్స్‌పైరేషన్’ అనే కథ. ఆ మధ్య రోహిత్ వేముల అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పుడు మన సమాజంలో పెద్ద గొడవ జరిగింది, ఉద్యమాలు జరిగాయి. సెంటర్ లెవెల్‌కి వెళ్ళింది. ఆ సమయంలో ఉద్యమాలు చేసినవారు, కథలు రాసినవారు పేరుపొందారు, బహుమతి పొందారు. ఈ ఉద్యమాలు వ్యక్తుల స్వార్థాల కోసం అనీ, కొందరు కొందరిని పైకెత్తించి ఒక సంఘటనని బ్లో అప్ చేసి సమస్త దళితుల మీద జరుగుతున్న అన్యాయం చూపించి స్వలాభం చూసుకుంటారు. నిజానికి ఇంకా పైకి రాకుండా అణగారిపోతున్న దళితులు, అల్పవర్గాల వారు ఇంకా ఎందరో ఉన్నారని చెప్పే కథ ఇది.

ఇలాంటిదే మరో కథ అంబల్ల జనార్థన్ వ్ర్రాసారు. కథ పేరు ‘దండుగు’. అంటే పెనాల్టీ అని అర్థం. ఈ కథలో ఒక పల్లెటూరికి చెందిన వ్యక్తి దుర్భర దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటాడు. రిజర్వేషన్ సౌకర్యం పొంది పైకొస్తాడు. ఉన్నతోద్యాగానికి వచ్చిన తర్వాత తన ఊళ్ళోవాళ్ళు ఎవరొచ్చినా వాళ్ళని చిన్నచూపు చూస్తాడు. ఎలాంటి సహాయం చేయకుండా తరిమేస్తూ ఉంటాడు. తనతో కలిసి చదువుకున్న వాడికి కూడా సహాయం చేయడు. వాళ్ళని అంటరాని వాళ్ళుగానే చూస్తాడు. అటువంటిది వాళ్ళ తండ్రి చనిపోయి ఊరికి వస్తే, ఊర్లో వాళ్ళు సాయం చెయ్యడం మానేస్తారు, మమ్మల్ని ఎలాగూ అంటరానివాళ్ళుగా చూసావు, మేము కూడా నిన్ను అలాగే చూస్తాం అని పొమ్మంటారు. అప్పుడతను తన తప్పు గ్రహించి, బాధ్యత తెలుసుకుని, నేనొక్కడినే పైకొస్తే సరిపోదు, నా తోటివాళ్ళు కూడా ఎదగాలి అని గ్రహించి ఇకపై సహాయం చేస్తానని వాళ్ళకి మాటిస్తాడు. ఇది అతనికి పెనాల్టీ అన్నమాట!

ప్రతీ వ్యక్తికీ వ్యక్తిగత బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తి వ్యక్తిగత బాధ్యతకే ప్రాధాన్యతనిచ్చి సామాజిక బాధ్యతకి ప్రాధాన్యమీయడో అప్పుడు ఎన్ని రకలా పథకాలున్నా, ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నా అవి అందరికీ చేరవు. వాటి వల్ల లాభం ఉండదు. ఇలాంటి కథనే మీకు ‘రేయ్’లో కనిపిస్తుంది. ఇలాంటిదే మరో కథ వసంతరావు దేశ్‌పాండే రాసిన ‘పెంటయ్య బాబాయి’ కథ. ఇది సంచికలో ప్రచురితమైంది. ఈ కథని అన్ని పత్రికలు రిజెక్ట్ చేసాయట. పెంటయ్య బాబాయి అనే అతను రిజర్వేషన్ ఫెసిలిటీ ఉపయోగించుకుని పైకొస్తాడు. తన సంతానానికి, తన నెక్స్ట్ జనరేషన్ వారికి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాడు. కాబట్టి తన పిల్లలకి రిజర్వేషన్ వద్దంటాడు. కేస్ట్ సర్టిఫికెట్ వాడడు. సో, పిల్లలు ఆశించినది దొరకదు. ఇంటివాళ్ళందరూ అతన్ని బాయ్‌కాట్ చేస్తారు. ఎంతగా అంతే చివరికి అతను చచ్చిపోయినప్పుడు చూడ్డానికి కూడా రారు.

సో లోపం ఎక్కడుంది? వ్యవస్థలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడుంది లోపం అంటే ఇండివిడ్యువల్స్‌లో ఉంది. ‘నేను పైకొచ్చాను, నా సోదరుడు కూడా పైకి రావాలి’ అనేటువంటి భావన చూపించడం లేదు. ఇలాంటి కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కులభావన సమాజంలో ఉంది, కాదనలేము. అణచివేతలున్నాయి, కాదనలేము. అయితే దీనికి కారణంగా మనమొక ధర్మాన్నో, ఒక వ్యవస్థనో దూషించి లాభం లేదు.

ఇక ఈ సంకలనంలో చివరి కథ ‘నిన్నటి ఊపిరి’. అనంతపురానికి చెందిన బండి నారాయణ స్వామి రాశారు. ఈ కథ చాలా సింబాలిక్‌గా ఉంటుంది. చాలా గొప్ప కథ. ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలతో వ్యక్తిగతంగా ఏకీభవించకపోయినా, కథలో చూఫించిన ప్రణాళిక, ఆలోచనా విధానం చాలా గొప్పవి. ఒకో ఊరి వాళ్ళు తమకు గతం గుర్తొచ్చినప్పుడల్లా కొట్టుకుంటూ ఉంటారు. ఓ విచిత్రమైన వ్యక్తి ఆ ఊరికి వస్తాడు. “మీ గతం గురించి నే చెప్తా” అని వాళ్ళందరినీ తోడేళ్ళుగా మార్చేస్తాడు. వాళ్ళు తవ్వడం మొదలుపెడతారు. 18వ శతాబ్దానికి వెళ్ళగానే బ్రిటీష్ వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ అణచివేతలు, మతం మార్పిళ్ళు వస్తాయి. ఇంకొంచెం కిందకి తవ్వగానే ఇస్లాం వాళ్ళు రావడం, వాళ్ళ అణచివేతలు, వాళ్ళ మతమార్పిడులు కన్పిస్తాయి. ఇంకా ముందుకెళ్తే నాగరికతలు, రాజులు, వాళ్ళ మధ్య గొడవలు, మొదటి నాగరికత, బయటి నుంచి రావడాలు… ఇలా అన్నీ వస్తాయి. అల్టిమేట్‌గా ఆదిమానవుడికి ఇవేవీ లేవు. సో, గతాన్ని తవ్వుకుంతూ పోతుంటే మన మధ్య ద్వేష భావనలు పెరుగుతాయి. ఉన్న భావన ఇదే. ఇది జరిగింది, దీన్ని మార్చలేము. భవిష్యత్తును మార్చుకోగలం మనం. దీనిని అర్థం చేసుకుని భవిష్యత్తులో ఈ అడ్డుగోడలు లేకుండా చూసుకోగలం అంటుందీ కథ.

భారతదేశంలో కులవ్యవస్థ ఎప్పుడూ స్టాటిక్‌గా లేదు, అది డైనమిక్. ఇవ్వాళ అగ్రవర్ణానికి చెందినవాడు, రేపు ఇంకో వర్ణానికి వెళ్ళిపోవచ్చు. ఇవాళ అల్పవర్ణానికి చెందినవాడు రేపు అగ్రవర్ణం కావచ్చు. ఇదొక డైనమిక్ సిస్టమ్ అన్న మాట. ఇది అర్థం చేసుకుకోకుండా వ్యవస్థపై తప్పు మోపుతున్నారని ఈ కథ చెబుతుంది.

మొదట్లో కులవ్యవస్థ pristine stateలో ఎలా ఉందో చెప్పే కథ, అది ఎలా మారి మన మధ్య గొడవలు సృష్టిస్తోంది మధ్యలోని కథలు చెప్తాయి. అందరూ సమానమే, అందరూ అణచివేతకి గురైనవారే అని చెప్పేది చివరి కథ ‘నిన్నటి ఊపిరి’. ఎన్‌ఆర్‌ఐలలో కూడా కులభావన ఉందని బొమ్మదేవర నాగకుమారి గారి కథ ‘ఏమిట్లు’ చెబుతుంది. అలాగే నంబూరి పరిపూర్ణ గారి ‘ఎర్ర లచ్చుప్ప’ కథ ఉంది. ఆ కథలో తరతరాలు మన వ్యవస్థలో కులవ్యవస్థని నిర్మూలించడం కోసం ఇంటర్నల్‌గా… ఎలాగైతే గంగానది తనని తాను పరిశుద్ధం చేసుకుంటుందో అలా… మనం ఎలా ప్రయత్నించామో చెబుతుంది. రామానుజార్యులు మాలదాసరులకు వైష్ణవమిచ్చి వారిని అగ్రవర్ణాలవారిగా చేయడం చెబుతుంది. మన సమాజంలో కుల వ్యవస్థ స్టాటిక్‌గా లేదు అని చెప్పే కథ ‘ఎర్ర లచ్చుప్ప’. ఒక అగ్రవర్ణాల వ్యక్తి ఒక అల్పవర్ణాల యువతిని పెళ్ళి చేసుకుని ఎలాగ ఆమెని తక్కువగానే చూస్తున్నాడనేది కూడా ఆ కథ చూపిస్తుంది.

దీనికి రివర్స్ కథ వారణాసి నాగలక్ష్మి గారు వ్రాసిన ‘అమృతాన్ని సాధించు’. దాంట్లో ఒక అల్పవర్ణానికి చెందిన అబ్బాయి, ఒక అగ్రవర్ణానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. అగ్రవర్ణాలు, అల్పవర్ణాల మధ్య ఉన్న ద్వేషభావనలని అతడు తన సంసారంలోకి ఎలా తీసుకొచ్చాడో చెప్తుందీ కథ. బాలన్స్‌డ్‌గా అన్ని కోణాలలోనూ కులవ్యవస్థను చూపించిన కథలివి. సమస్యలకు పాజిటివ్ పరిష్కారాలు చూపించే కథలివి. మంచి వినాలి, మంచినే చూడాలి, మంచి భావనలే ప్రపంచానికి చెప్పాలి అని చెప్పే కథలనే మేం ఎంచుకున్నాం. అలాంటి 42 కథలతోటి ఈ ‘కులం కథ’ సంకలనం రూపొందించాం. ఇక ఇది ఇప్పుడు పాఠకుల చేతిలో ఉంది. ఒకటి మాత్రం చెప్పగలను, దీనిలో ద్వేషభావనలకీ, దూషణలకీ తావు లేదు.

ఈ పుస్తకానికి స్పందన ఎలా ఉంది?

ఇప్పుడే విడుదలయింది కద! అయితే ఇంతవరకు ఏంటంటే ఈ పుస్తకం ఇలా వస్తోంది అని చెప్పగానే కథకుల నుంచి స్పందన వచ్చింది, పుస్తకం తయారవుతోందని చెప్పగానే పాఠకులు కూడా బాగా స్పందించి ప్రీ-పబ్లికేషన్ ఆఫర్ ఉపయోగించుకున్నారు. ఇంకా ధర కూడా నిర్ణయించని సమయంలోనే విపరీతంగా ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి ఈ సంకలనం చదివింపజేస్తుంది, ఆలోజింపజేస్తుంది, ఒక అవగాహనని కలిగిస్తుంది, భవిష్యత్తును ఒక సక్రమమైన రీతిలో రూపొందించుకోడం పట్ల తప్పకుండా అలోచనలు కలిగిస్తుంది.

ఈ సంకలనం వల్ల ఏం సాధించారు?

ఈ సంకలనం వల్ల సాధించాలనుకున్నదేంటంటే – ఒక ఆలోచన, మథనం జరగాలి. సమాజంలో ఇప్పుడు మథనం జరగడం లేదు. ఎవరేం చెప్తే అదే! నేను చెప్పింది విన్నవాడు నావాడు, వినని వాడు దుష్టుడు. సో, either you are with me or against me అనేటువంటి ఒక సంకుచిత భావన సమాజంలో ప్రస్తుతం నెలకొంటూ వస్తోంది. నెగటివ్ మనస్తత్వం నెలకొంటోంది. ఈ కథలు చదివి, ఆలోచించి, కొంచెమైనా నెగటివ్ మనస్తత్వానికి సమాజం దూరమవడానికి ప్రయత్నిస్తే ఈ సంకలనం లక్ష్యం నెరవేరినట్టే. మథనం జరగాలి. ముందు హాలాహలం వస్తుంది. దాన్ని కంఠంలో బంధించాలి, అమృతాన్ని అందరికీ పంచాలి. అందుకు ఈ ‘కులం కథ’ సంకలనం నాందీ ప్రస్తావన అవ్వాలని మా ఆకాంక్ష. అవుతుందన్నది మా ఆశ, మా నమ్మకం.

***

మై ఇండ్ మీడియా ద్వారా ‘కులం కథ’ సంకలనం గురించి పలువురికి తెలియజేసే అవకాశం కల్పించినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.

***

పూర్తి ఇంటర్వ్యూని ఇక్కడ చూడవచ్చు/ వినవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here