38. సంభాషణం – కవి, రచయిత, సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు అంతరంగ ఆవిష్కరణ

8
15

[సంచిక కోసం కవి, రచయిత, సంపాదకులు ఈతకోట సుబ్బారావు గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

సౌమ్యుడైన నెల్లూరు సాహిత్యకారుడు శ్రీ ఈతకోట సుబ్బారావు..!!:

[dropcap]అ[/dropcap]భిరుచి ఉండాలేగాని సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోను తమదైన ముద్రతో రచనలు చేయదగ్గ మహానుభావులు ఎంతోమంది మన తెలుగు సాహిత్య రంగంలో ఉన్నారు. అందులో కొద్దిమంది ఎలాంటి ప్రచారం అక్కరలేనివారు కూడా ఉన్నారు. అలాంటివారిలో శ్రీ ఈతకోట సుబ్బారావు గారు ఒకరు.

రచనా వ్యాసంగంలోనూ, పత్రికారంగంలోనూ, నిత్యం క్షణం తీరక లేని వీరు, సాహిత్యభిలాషి అయినందువల్ల, నాకు తెలిసి ఒక నాటక ప్రక్రియ తప్ప అన్ని ప్రక్రియలలోనూ తన రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు. అంతమాత్రమే కాదు ఆయన రాస్తూనే ఒక మాసపత్రికలో వర్కింగ్ ఎడిటర్‌గా పని చేస్తూ.. లేత లేత రచయితలను, చేయితిరిగిన రచయితలను/రచయిత్రులను, కవయిత్రులను కవులను ప్రోత్సహిస్తున్నారు. నెల్లూరు అనగానే గుర్తుకు వచ్చే అనేకమంది ప్రముఖులలో శ్రీ ఈతకోట సుబ్బారావు గారు కూడా ఒకరు. ఆయన గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే..

~

సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి స్వాగతం. నమస్కారం, సుబ్బారావు గారూ..

నమస్కారం డాక్టర్ కె. యల్.వి.ప్రసాద్ గారు. సంచిక అంతర్జాల మాస పత్రిక పక్షాన నన్ను ఇంటర్వ్యూ చేద్దామని ఆలోచన రావటం, ఎంపిక చేసుకోవడం, నా భావాలను నలుగురితో పంచుకొనే అవకాశం రావటం కూడా చాలా ఆనందంగా ఉంది. మీకు అభివందనాలు సార్.

ప్రశ్న 1. మీరు రచయితగాను, పాత్రికేయులుగానూ, ఒక పత్రికకు సంపాదకులుగానూ వున్నారు కదా! ఈ మూడింటిలోనూ మీరు ఎలా రాణించగలుగుతున్నారు?

జ: సర్.. నేను డిగ్రీ చదివే రోజుల్లోనే సినీహెరాల్డ్ అనే పత్రికకు పనిచేసే అవకాశం వచ్చింది. అది కేవలం ఆసక్తి మేరకు మాత్రమే చేస్తూ వచ్చాను. అలా నాకు జర్నలిజం మీద ఎందుకో ఒక తెలియని ఇష్టం, ఒక మమకారం ఏర్పడింది. ఇప్పటికి దాదాపు 40 ఏళ్లకు నేను జర్నలిస్ట్‌గా, ఎడిటర్‌గా చేస్తూనే ఉన్నా. జర్నలిస్ట్ అనేది ఒక ఫాల్స్ ప్రిస్టేజి. కింద స్థాయిలో జర్నలిస్టులకు కూడు పెట్టే ఉద్యోగం కాదు. ఒక అధికారి, ఒక నాయకుడు, మంత్రి ఎవరైన జర్నలిస్ట్‌కు ఇచ్చే ప్రాధాన్యత చూసి, ఆ చట్రంలో కూరుకుపోయిన వాళ్ళు ఎక్కువ. అయినా నేను చేశా. చేస్తూనే ఉన్నా. ఎందుకంటే.. నా ఆర్థిక సోర్స్ వేరు. నేను ఈ జర్నలిజం చట్రంలో ఇరుక్కుపోయినా ప్యాషన్‌గా చూసాను. విశాలాక్షి ఇందుకు మినహాయింపు ప్లీజ్. అయినా మొదట చెప్పాను కదా ఇష్టం అని, అందుకే కష్టపడుతున్న సార్. రచయితగా నా క్రియేటివిటీ కొంత తగ్గింది. సంపాదకుడిగా సక్సెస్ కావాలి. పత్రికకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. దాన్ని నిరంతరం కొనసాగించాలి. దానికి కృషి చేస్తూనే ఉండాలి కదా.

ధర్మపత్ని శ్రీమతి రమాదేవి గారితో…

ప్రశ్న 2: మూడింటిలోనూ దేనికి ఎక్కువ మీరు సమయం కేటాయించగలుగుతున్నారు? ఎందుచేత?

జ: నిజానికి విశాలాక్షికి మాత్రమే. ఎందుకంటే పత్రిక యజమాని కొసూరు రత్నం గారు సాహిత్యం మీద అభిమానం, భాష మీద మక్కువతో పత్రిక పెట్టారు. ఇక్కడ అటెండర్ నుంచి ఎడిటర్ వరకు చూసుకోవాలి.. పత్రిక నాణ్యత కొరకు ఇక్కడ ఉన్న వసతులు మేరకు నిరంతర కృషి చేయాలి. ఇందులో భాగంగానే మిగిలిన వ్యాసంగం దెబ్బతింటుంది. విశాలాక్షి పత్రికకు ఎక్కువ సమయం పడుతుంది. కాదు ప్రస్తుతం పూర్తి సమయం పడుతుంది.

శ్రీ ఈతకోట గారి కుటుంబం

ప్రశ్న 3: నెల్లూరు నుండి మీరు ఒక పత్రికకు సంపాదకులుగా వున్నారు. ఒక అనుభవజ్ఞుడైన రచయితగా, పత్రికను తీర్చిదిద్దడంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఎందుచేత? ఆయా సమస్యలను మీరు ఎలా అధిగమించ గలుగుతున్నారు?

జ: పత్రిక అంటే సాహిత్యం మాత్రమే కాదు. పత్రిక అంటే సమస్యలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. పాఠకులకు సాహిత్యం మాత్రమే కనిపిస్తుంది. మాకు ప్రతి పేజీలో సమస్య ఉంటుంది. ప్రతి రోజు సమస్య ఉంటుంది. పత్రిక ఆలోచన రాగానే సమస్యలను పరిష్కరించుకోవాలి, అలా ముందుకు పోవాలి అని ఆలోచన కూడా అంతకన్నా బలంగా ఏర్పడుతుంది. అలాంటప్పుడు పరిష్కరించుకోక తప్పదు కాబట్టి కొన్ని అధిగమిస్తూ పోతుంటాం. ఎలా అనేది ఆయా సందర్భాన్ని బట్టి ముందుకు పోతుంటాం. సమస్య వస్తేనే పరిష్కారం ఉంటుంది. పరిష్కారమే పత్రికకు పటుత్వం అవుతుందనే ఒక పాజిటివ్ దృక్పథంలో ముందుకు పోతుంటాము.

ప్రశ్న 4: మీరు కథలు/నవలలు/వ్యాసాలూ/కవిత్వం రాస్తున్నారు. కానీ మీరు కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఎదుచేత? వివరంగా చెప్పండి.

జ: నిజమే, నేను కథ, కవిత్వం, వ్యాసం అని రాస్తూనే ఉన్నా. కానీ కవిత్వం అంటేనే మీరు చెప్పినట్టు నాకు మక్కువ. ఎందుకంటే కవిత్వంలో ఒక బలం ఉంది. ఒక శక్తి ఉంది. సూటిగా పాఠకుల్లో పెనిట్రేట్ అయ్యే గుణం కవిత్వానికే ఉంది. ఒక ఆయుధం లాగా ఉంటుంది. అలాంటి కవిత్వం మనం రాయగలిగినప్పుడు ఆ కవిత్వము సమాజానికి అవసరం. అలాంటి కవిత్వం వలన మనం చెప్పదలచుకున్నది సూటిగా కూడా చెప్పొచ్చు. బలంగా చెప్పొచ్చు. మార్పు తీసుకురావచ్చు. ముందుగా ఆలోచింపజేస్తుంది. ఇన్ని గుణాలుంటాయి కవిత్వంలో. ఒక శక్తవంతమైన సాహిత్య ప్రక్రియ కవిత్వం మాత్రమే. సమాజానికి ఏది అవసరమో దాన్ని స్వీకరించాలి. ఏ మార్పు తీసుకురావాలనుకుంటామో, ఆ మార్పు కోసం అలాంటి భావజాలంతో నిండిన కవిత్వాన్ని అందిపుచ్చుకోవాలి, అలాంటి కవిత్వమే ప్రజల్లోకి వదలాలి. అప్పుడే మన కవిత్వానికి సార్థకత ఏర్పడుతుంది. ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. సమాజానికి ఉపయోగపడుతుంది. ఈ గుణాలున్నప్పుడు ఎలా స్వీకరించాలంటే మన చేతిలో ఉన్న ఒక బలమైన ఆయుధంగా స్వీకరించాలి కవిత్వాన్ని. అలా తీసుకున్నప్పుడే అలా రాయగలిగినప్పుడే దానికి మనం న్యాయం చేస్తాం.. అలాంటి కవిత్వం కావాలి అలాంటి కవితమే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలి. మన సమాజానికి కూడా అలాంటి కవిత్వం కావాలి. అందుకే నేను కవిత్వానికి ప్రాధాన్యత ఇస్తాను. కథ కూడా ఆలోచింపచేస్తుంది. మనిషిని ఉన్నతీకరిస్తుంది. మన సంబంధాలను బలపరుస్తుంది. దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. మన సాహిత్య ప్రక్రియల్లో కథ కూడా గొప్ప శక్తివంతమైంది.

సినీనటులు శ్రీ చంద్రమోహన్ దంపతులతో శ్రీ ఈతకోట.

ప్రశ్న 5: మీరు నెల్లూరు చరిత్ర రాసినట్లు పత్రికలలో చూసినట్టు గుర్తు. నెల్లూరు చరిత్రను అంత సమగ్రంగా మీరు ఎలా రాబట్టగలిగారు? ఈ గ్రంథం నేపధ్యం గురించి విపులంగా చెప్పండి.

జ: నెల్లూరు అంటే పురిటి గడ్డ. సహజంగానే ఎవరికైనా సొంత గడ్డ అంటే గర్వం గానే ఉంటుంది. అలా నాకు ఉండటం కూడా పెద్ద విశేషమేమీ కాదు కానీ నేను మరింత లోతుగా వెళ్ళటానికి కారణం నాకు తెలిసి మా గురువులే అని చెప్పాలి ఎందుకంటే భాష మీద బండి నాగరాజు గారు ప్రేరణ అయితే, స్థానిక చరిత్ర మీద మా అధ్యాపకులు నలుబోలు రాంగోపాల్ రెడ్డి గారు, వెన్నెలకంటి శ్రీ రామచంద్ర రావు, డా. కాళిదాసు పురుషోత్తం గారు లాంటి పెద్దల ప్రేరణలు నాకు బలాన్ని ఇచ్చాయి. అంతేకాకుండా నాకున్న వసతులు నేపథ్యంలో కొంత తిరిగే అవకాశం వచ్చింది. పరిశీలన, పరిశోధనకు అంతే అవకాశాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో నేను స్థానిక చరిత్ర వైపు వెళ్లగలుగుతున్నా. అందులో భాగంగానే దాదాపు నెల్లూరు చరిత్ర మీద ఆరు పుస్తకాలు వెలువరించాను. నూరేళ్ల నెల్లూరు అనే చరిత్ర పుస్తకం కూడా ఇంచుమించుగా ముగింపు దశలో ఉంది. దాన్ని కూడా ఈ ఏడాది వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ఒక మాట చరిత్ర గూర్చి చెప్పాలి.

సామాన్యులకు కాదు, పెద్దలకు ముందు చరిత్ర తెలియాలి. చరిత్ర సాహిత్యం చరిత్ర పఠనానికి సింహ ద్వారం లాంటిది. చరిత్ర చదవండి. నలుగురితో చదివించండి. చరిత్రను ప్రేమించండి. యువతకు చరిత్ర అందించండి.

కథానిలయం స్థాపకులు, కథా రచయిత శ్రీ కా.రా. మాష్టారి తో

ప్రశ్న 6: మీరు రచయితగా రచనావ్యాసంగం లోకి ఎప్పుడు, ఎలా ప్రవేశించారు?

జ: రచన వ్యాసంగంలోకి ప్రవేశించే ముందు నేను పాఠకుడిగా మారిన తీరు చెప్పటం ముఖ్యమనిపిస్తుంది. ఎందుకంటే రచయిత కావాలంటే ముందు పాఠకుడు కావాలి. ఆ కోవలో చెప్పాలంటే నేను ఐదారు తరగతుల్లో గ్రంథాలయానికి వెళ్లేవాడిని. కానీ నేను ఎందుకు వెళ్ళటం అంటే అప్పటికి డిగ్రీ చదువుతున్న మా అన్న రామారావు కథలు రాసేవారు. నాకు తెలియకపోయినా మీ అన్న కథ పత్రికలో వచ్చింది పలానా పత్రికలో అంటే అప్పుడు లైబ్రరీకి వెళ్లి చూడాలనిపించేది. కానీ పిల్లలను రానివ్వరు. ఎందుకంటే సినిమా బొమ్మలు అలాంటి కట్ చేసుకుని వెళ్తారు అని. కానీ మా వీధిలోనే లైబ్రరీ ఉండటం మా బావ దగ్గరుండి చెప్పి పంపే వారు. అలా గ్రంథాలయానికి వెళ్ళటం అలవాటయింది. అప్పుడు మా అన్న రచనలు చదివేవాడ్ని. అర్థమయ్యేది కాదు. కానీ ఆయన పేరు చూసుకునేవాడిని. అలా అక్కడ పుస్తకాలు తిప్పేవాడిని. మొదట సినిమా బొమ్మలు, సినిమా పత్రికలు, నెమ్మదిగా చందమామ, బాలమిత్రలు అలా పుస్తక ప్రపంచంలో కడుగు పెట్టాను. ఆ పుస్తకపు ప్రపంచమే ఆ తర్వాత నన్ను పాఠకుడిగా తీర్చిదిద్దాయి. అలాంటి టైంలో మా అన్న రచనలు చూసి చూసి నేను ఎందుకు రాయకూడదు అనే ఆలోచన కలిగి, ఏదో రాయాలనే తపన మొదలైంది. అప్పుడు స్థానిక పత్రికలకు ఉత్తరాలు రాసేవాణ్ణి. ఆ తర్వాత జ్యోతి మాస పత్రికలో VAK రంగారావు గారి శీర్షిక ఒకటుంది. కొత్త సినిమాల్లో సంగీత పాటలు మీద రాసేవాణ్ణి.

ఆ తర్వాత బాలమిత్ర, చందమామ కథలు చిన్నచిన్నగా అలా కలం పట్టాను. ఆ తర్వాతనే జూనియర్ ఇంటర్ వచ్చేటప్పటికి కవితలు రాసేవాణ్ణి. కథలు రాసేవాణ్ణి. అలా సాహిత్యం లోకి ప్రవేశించాను.

ప్రశ్న 7: మీకు గుర్తింపు తెచ్చిన రచన ఏది? ఎందుచేత?

జ: ఇప్పటికి కవితలు లెక్క లేదు కానీ, 400 పైగా ప్రచురణ జరిగాయి. 100 కథలు ప్రచురణ కూడా. వ్యాసాలు, ఇలా అనేకం ప్రచురితమయ్యాయి. కథలకు, కవితలకు బహుమతులు వచ్చాయి. అవార్డులు వచ్చాయి. ప్రభుత్వ పురస్కారాలు కూడా వచ్చాయి. సంపుటాలు కూడా పురస్కారాలు అందుకున్నాయి. కానీ ఇవేమీ గుర్తింపు అని భావించటం లేదు. ప్రజల మధ్య నిలిచే రచన ఉంటే.. అదే గౌరవం. అప్పుడే గుర్తింపు లభించినట్టు.

మధుర గాయకుడు శ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం గారితో శ్రీ ఈతకోట

ప్రశ్న 8: మీరు రచయితగా, సంపాదకునిగా, ఎలాంటి కథలకు ప్రాధాన్యం ఇస్తారు? ఎందుచేత?

జ: వ్యక్తులను ఉన్నతీకరించే రచనలు, సమాజానికి ఉపయోగపడే రచనలు, మానవ సంబంధాలు బలపరిచే రచనలకు ప్రాధాన్యత ఉంటుంది.

వ్యక్తి బావుంటే, సమాజం బావుంటుంది. సమాజం బావుంటే రేపటి తరం మంచిగా ఎదుగుతుంది. ఇందుకు కథ లేదా ఏ సాహిత్య ప్రక్రియ అయినా దోహదపడాలి.

ప్రశ్న 9: పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో, యువతీ యువకుల్ని రచయితలుగా తీర్చిదిద్దడానికి పత్రికలూ ఎలాంటి ప్రోత్సాహం ఇస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు? ఈ విషయంలో అనుభవజ్ఞులైన రచయితల పాత్ర ఎలా ఉంటే బావుంటుందని ఒక రచయితగా మీరు అనుకుంటున్నారు? వివరించండి.

జ: తల్లిదండ్రుల శ్రమ కష్టం ఎందుకోసం, ఇంటికోసం తమ పిల్లల కోసం – అంతే కదా. సాహిత్యం కూడా ఒకసారి చేరుకున్న తర్వాత ఆ సాహితీవేత్తలు తమ భాషా సంపదను నైపుణ్యాన్ని యువతకు అందించాలి సమాజాన్ని కూడా కుటుంబంగా భావించగలిగినప్పుడు రచయితలు అలాంటి బాధ్యతగల పాత్రని తీసుకురావాలి. ఇప్పుడు మరి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే యువతకు తెలుగు అందడం లేదు. సాహిత్యం అంటే తెలియటం లేదు. ఈ నేపథ్యంలో నిజానికి కృషి చేయవలసిన అవసరం చాలా ఉంది. అలాగని మౌనంగా ఏమీ లేరు. కొన్ని జిల్లాల్లో కొంతమంది రచయితలు కొన్ని సంస్థలు, గ్రంథాలయ ఉద్యమం నుంచి పాఠశాలల్లో భాష సదస్సుల వరకు నిర్వహిస్తున్నారు. బాల సాహిత్యాన్ని కూడా పోషిస్తున్నారు, అందిస్తున్నారు. ఇలా కొంతవరకు మాత్రం జరుగుతుంది. ఇది మరింత ఉధృతంగాను యువతకు చేరువ చేయడంలో మరింత శ్రమ పెడితే రేపటి తరం కూడా తెలుగు సాహిత్యంలో రాణిస్తుంది. నిలబెడుతుంది. మంచి సమాజానికి పునాదులుగా నిలబడతారని కూడా నేను ఆశిస్తున్నాను.

నెల్లూరులో.. శివారెడ్డి గారి పుస్తకం ఆవిష్కరణ సభలో.. ప్రముఖులతో..

ప్రశ్న 10: పత్రికా రంగంలో మీకున్న అనుభవాన్ని బట్టి, పాఠకులు ఎక్కువగా ఎలాంటి రచనలు కోరుకుంటున్నారు? దానికోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జ: హృదయాన్ని తాకగలిగే రచనలు. ఇప్పుడు ఊహ లోకంలో రచయితలు లేరు, పాఠకులు కూడా లేరు. వాస్తవ పరిస్థితుల్లోనే అందరూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఏ కథ అయినా ఏదైనా గాని స్పందింపచేయాలి ఆలోచింప చేయాలి. అరే ఇది మా వీధిలో జరిగింది మా ఇంట్లో జరిగింది మా ఊరిలో జరిగింది అలా ఒక ఫీల్ కలగాలి. అలాంటప్పుడే వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. మరింతగా ప్రజల్లోకి వెళుతుంది.

కవి శివారెడ్డి గారిని సన్మానిస్తూ

ప్రశ్న 11: పత్రికలలో మీరు అనేక సందర్భాలలో కథ/కవిత/నవలల పోటీలు పెడుతుంటారు కదా! బహుమతుల లిస్టులో ఎప్పుడూ సీనియర్ రచయితల పేర్లే కనిపిస్తుంటాయి. ఒక రచయితగా మీరు దీని గురించి స్పందించండి.

జ: సహజంగా వినిపించే అపవాదు. కానీ మా పోటీల్లో ఒక చిత్తశుద్ధి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది.. ఎందుకంటే వడపోతలు స్థానికంగా ఐదారు మంది చేస్తారు. వీటిల్లో మిగిలిన అంటే తేలిన మెటీరియల్స్ కథలు గాని కవితను గాని ఏదైనా కానివ్వండి అది ప్రముఖుల వద్దకు వెళుతుంది. అది కూడా హామీ పత్రం లేకుండా. వారి పేరు అలాంటి ఏమి వారికి అందకుండా పంపిస్తాం. కానీ కొంతమంది మాత్రమే ఉంటారు. అంటే మీరు అనుకున్నట్టు పెద్ద తలలు. నిజానికి మా పోటీల్లో చాలామంది పేర్లు చెప్పటం సమంజసం కాదు గాని సీనియర్ కవులు పెద్ద రచయితలు అనుకునే వాళ్ళు కూడా వెనకబడిపోయారు చాలా సందర్భాల్లో. అది నాకు తెలుసు. మా ప్రాథమిక స్క్రూటినీ చేసే రచయితలకు కూడా తెలియదు. ఎందుకంటే అది నా దగ్గరే హామీ పత్రం ఉంటుంది డీకోర్ట్ చేసి స్క్రూటినీ మొదలుపెడతాం కాబట్టి. కానీ అప్పుడు అప్పుడు వారికి కూడా బహుమతులు వస్తుంటాయి. కానీ నిజానికి ఒక మంచి రచన అయినా చూస్తాం గానీ మంచిది, పెద్ద రచయిత, పేరు ఉందా లేదా అని కూడా చూడం. ఎందుకంటే నాకు తెలిసి కూడా ఒక జస్ట్ ఒక చిన్న రచయిత మొట్టమొదటి నా కథకు బహుమతి ఇచ్చారు. మరిన్ని కథలు రాసే దానికి నాకు ఒక ధైర్యం ఇచ్చారు అన్నారు. పెద్ద రచయితలు కూడా లేకుండా పోలేదు. కేవలము రచన ప్రాబ్లం మాత్రమే అలా జరుగుతుందని పేరును బట్టి మాత్రం బహుమతులు రచనలకు అంటూ ఉండదు.

ప్రశ్న 12: మీ కలం నుండి వెలువడిన రచనల గురించి చెప్పండి.

జ: కథ, కవిత, స్ధానిక చరిత్రకు చెంది 17 పుస్తకాలు వెలువడ్డాయి. పొడుగాలి కథా సంపుటి ముద్రణలో ఉంది. నూరేళ్ల నెల్లూరు అని చరిత్ర పుస్తకం కూడా సిద్ధంగా ఉంది. వసతులు చూసుకొని ఐదు ఆరు నెలలలో వెలుగులోకి తీసుకురావాలని కూడా ప్రయత్నం జరుగుతుంది.

శ్రీ ఈతకోట సుబ్బారావు గారి రచనలు కొన్ని

ప్రశ్న 13: మీరు అందుకున్న అవార్డులు, పొందిన సన్మానాలు గురించి వివరించండి.

జ: అవార్డులు సన్మానాలు బహుమతులు ఈ నలభై ఏళ్ళ సాహితీ రంగంలో చవి చూశాను, కానీ అవి ఘనంగాను గొప్పగాను గర్వం గాను ఇలా వేదికల మీద చెప్పుకోదగ్గవి మాత్రం కాదు. కానీ నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఒక ప్రయోజనం ఒక సంకల్పంతో ముందుకెళుతున్నాను గాని వచ్చే బహుమతులు అవార్డులు స్వీకరిస్తున్నానే కానీ మన ప్రయత్నానికి మాత్రం లోపం లేకుండా ఆ పురస్కారాలు అడ్డం పడకుండా ముందుకు నడుస్తున్నాను. పెద్దగా కూడా నాకు లభించిన కీర్తి కిరీటాలుగా భావించడం లేదు కానీ నాకు ఒక శక్తిగా ప్రేరణగా స్ఫూర్తిగా మాత్రమే నిలుస్తున్నాయి. వాటికి ఎప్పుడు నాకు విలువ ఇస్తాను గౌరవిస్తాను అంతేగాని అవి నాకు ప్రతిగా కొలమానంగా భావిస్తే కష్టం అనేది నా ఆలోచన.

నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య గారితో సన్మానం
సి.నా.రె. గారితో సన్మానం

ప్రశ్న 14: భవిష్యత్తులో పత్రికా రంగం, పూర్తిగా డిజిటల్ వ్యవస్థలోకి వెళ్ళిపోతుందని మీరు భావిస్తున్నారా? ఎందుచేత?

జ: పూర్తిగా డిజిటల్ రంగంలోకి ఇప్పట్లో సాధ్యం కాదేమో. వెళ్లే పరిస్థితులు కూడా అనుకూలంగా లేవేమో. కానీ డిజిటల్ వైపు అడుగుల బలంగా పడుతున్న మరో తరం వరకు కూడా సమాంతరంగా నడుస్తుందని ఆలోచిస్తున్నా. అలాగని డిజిటల్ వెనక పడుతుంది అని అనుకోను సమాంతరం అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఇది కొంతకాలమే అంటే ఒకటి రెండు తరాలు కొరకు ముద్రణ రంగం ఇబ్బంది పెట్టదు, అందుబాటులోనే ఉంటుందనుకుంటా.

~

చక్కని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కృతజ్ఞతలు డాక్టర్ గారు. ధన్యవాదాలు.

~

ధన్యవాదాలు సుబ్బారావు గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here