37. సంభాషణం – కవి, సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు అంతరంగ ఆవిష్కరణ

6
12

[సంచిక కోసం కవి, సంపాదకులు విల్సన్ రావు కొమ్మవరపు గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

నాగలిని కూడా ఆయుధంగా ఎక్కుపెట్టగల సాహస కవి.. శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు:

[dropcap]సా[/dropcap]హిత్యాన్ని పాఠ్యాంశంగా ఎన్నుకుని కవిత్వం రాయడం పెద్ద గొప్పగా చెప్పుకోవలసిన విషయం కాదు. అలా కాకుండా తెలుగు సాహిత్యం మీద, తెలుగు భాష మీద మక్కువ గలవాళ్ళు సాహిత్యంలో ఏ ప్రక్రియను ఎన్నుకుని సాహిత్య సాధన చేసినా అది గొప్పగానే అంగీకరించాలి. వృత్తి, ప్రవృత్తి, తెలుగు భాష, తెలుగు సాహిత్యం అయినప్పుడు ఆయా పండితులు తప్పనిసరిగా మంచి సాహిత్యాన్ని అందించే అవకాశాలు ఉంటాయి. కానీ, వృత్తి వేరుగా వుండి, ప్రవృత్తి సాహిత్య రచనా వ్యాసంగం అయినప్పుడు, వాళ్ళు ఎంతో కష్టపడితేనేగాని మంచి సాహిత్యాన్ని అందించలేరు. ఇలాంటివారే ఎక్కువగా తెలుగు సాహితీ రంగంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరు కథ/నవల రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, వ్యాసకర్తలు కూడా కావచ్చు. ఇలాంటి వారిలో కవితా ప్రక్రియను తమ రచనా వ్యాసంగంగా ఎన్నుకున్న వారే ఎక్కువగా వుంటారు. అలంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ కవి శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు.

శ్రీ విల్సన్ రావు వృత్తి రీత్యా జీవిత బీమా సంస్థలో అంచలంచెలుగా ఎదిగిన ఉన్నత అధికారి. ప్రవృత్తి రీత్యా ఆయన సహజ కవి. కష్టాలను అనుభవించి అందులోనుండి కవిత్వాన్ని పిండుకుంటున్న క్రమశిక్షణ గల కవి. కవిత్వాన్ని తన రచనా వ్యాసంగంగా ఎన్నుకుని, పలువురి ప్రశంశలు అందుకుంటున్న శ్రీ విల్సన్ రావు గారు, ఇంకా తన సాహిత్య సేద్యం గురించి ఏమి చెబుతారో పరిశీలిద్దాం..

~

సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన ప్రముఖ కవి, సృజన క్రాంతి దినపత్రిక సాహితీ సంపాదకులు శ్రీ కె.విల్సన్ రావు గారికి స్వాగతం, నమస్కారం. విల్సన్ రావు గారూ..

నమస్కారం డాక్టర్ కె. యల్.వి.ప్రసాద్ గారు.

ప్రశ్న 1. సాహిత్యం వైపు లేదా కవిత్వం వైపు మీ మనసు ఎప్పుడు, ఎలా మళ్లింది?

జ: మీతో ముఖాముఖి నాకు చాలా ఆనందంగా ఉంది సార్. కవిత్వం వైపు ఎప్పుడు మనసు పారేసుకున్నానంటే:

నాకు బాగా గుర్తు. అది 1977వ సంవత్సరం. నేను విజయవాడ ఐ.టి.ఐ.లో చదువుతున్నప్పుడు నా మిత్రుడు భాస్కరరావు శ్రీశ్రీ కవిత్వంను నాకు పరిచయం చేశాడు. తను మహాప్రస్థానంలోని కవితలను లయాత్మకంగా చదువుతుంటే ఎంత వినసొంపుగా ఉండేదో! అతను నాకు ఇచ్చిన సాహిత్య ఇంజెక్షనుతో శ్రీశ్రీ, జాషువా, తిలక్, చలంల సాహిత్యం కొంత కొని చదివాను. చలం రాసిన ‘కవి హృదయం’ గాని, ‘దైవమిచ్చిన భార్య’ గాని, ‘మైదానం’ గాని ఎంతో ఇష్టం.

ఆ తరువాత 1994లో నేను వినుకొండలో.. LIC లో ఉద్యోగిస్తున్నప్పుడు జాషువా గారి మనవడు ప్రవీణ్ కుమార్ శ్యాం నన్ను వారి ఇంటికి తీసుకెళ్లి జాషువా గారి జ్ఞాపకాలు, వారి కుటుంబ నేపథ్యం నాతో పంచుకున్నాడు.

అప్పటినుంచి జాషువా గారి సాహిత్యంపై ఇంకా ఇష్టం పెరిగింది. అక్కడే సాహితీమిత్రుడు కళ్యాణ్.. వినుకొండ మెయిన్ రోడ్డులో రేడియో/వీడియో షాపు నడుపుతుండేవాడు. సినిమా పాటలు రాస్తుండేవాడు. తను రాసిన పాటలు ఆడియో క్యాసెట్ల రూపంలో వినిపించేవాడు. అప్పటికే నేను రాసిన కొన్ని కవితలు (నావరకే అవి కవితలు) అతనికి చూపించాను. అప్పటివరకు రాసిన కవితల్లోంచి కొన్ని ఏరి, సరిచేసి, పోటీలకు పంపమని సలహా ఇచ్చాడు.

శ్రీమతితో… శ్రీ విల్సన్ రావు

అలా పంపిన కవితలకు మొదటిసారిగా 1994లోనే నాకు బహుమతి ఇచ్చి ప్రోత్సహించిన సంస్థ.. కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ, జాలాది, గుంటూరు జిల్లా.

మరో సంస్థ మదర్ థెరిసా అంధుల పాఠశాల, మార్టూరు, గుంటూరు జిల్లా. ప్రస్తుతం సాహిత్యంలో మెరుపులు మెరిపిస్తున్న శ్రీ బీరం సుందర రావు గారు నా సహ పురస్కార గ్రహీత కావడం ఆనందం.

మొట్టమొదటిగా పాల్గొన్న కవి సమ్మేళనం.. విజయవాడలో 1995 జనవరి మూడవ తేదీన ఎక్స్‌రే సాహిత్య సేవా సంస్థ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంపై కవిసమ్మేళనం. మొట్టమొదటిగా అచ్చయిన కవిత విశాలాంధ్ర దినపత్రిక సాహిత్య పేజీ మార్చి 1995.

కుటుంబసభ్యులతో శ్రీ కొమ్మవరపు.

ప్రశ్న 2: చదువు – ఉద్యోగం వీటితో పాటు మీరు రచనా వ్యాసంగం ఎలా కొనసాగించారు?

జ: కొన్ని అనివార్య కారణాల వలన నేను స్కూలు చదువుతోనే ఆగిపోయాను. 1977లో ఐ.టి.ఐ, విజయవాడలో ఒక సంవత్సరం కోర్సు చేశాక, విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డ్‌లో అప్రెంటిస్‌గా ఒక సంవత్సరం చేశాను. ఆ తరువాత 1979లో పొట్టకూటి కోసం హైదరాబాద్ చేరుకొని, ఒక ప్రయివేటు కంపెనీలో ఆరు రూపాయల కూలీగా చేశాను. అంచెలంచెలుగా ఎదిగి ఇంజినీరింగ్ సంస్థలో కాంట్రాక్టర్‌గా కుదురుకుందామనుకునే లోగానే నందిగామలో 1983 ఫిబ్రవరిలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అప్పటిలో మొదటి జీతం రూ. 423/-.

నందిగామ గ్రామ పంచాయితీలో ఉద్యోగం చేసుకుంటూనే.. తెలుగు, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లోయర్‌లో ఒకేసారి, అలాగే హయ్యర్‌లో ఒకేసారి ఉత్తీర్ణత పొందాను. ఈ కాలంలోనే దూరవిద్య ద్వారా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బి.ఏ. డిగ్రీ చేసాను. డిగ్రీ విద్యార్హతతో 1989లో యల్.ఐ.సి.లో రిక్రూట్మెంట్ ద్వారా టైపిస్ట్‌గా చేరినా 1994లో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో కుదురుకున్నాక, చదువుపై మక్కువతో దూరవిద్య ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (Public Administration), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్‌లో పట్టాలు పొందాను.

ఇందాక నేను చెప్పినట్టు 1977 నుంచి శ్రీశ్రీ, బాల గంగాధర తిలక్, చలం, జాషువా మొదలైన వారి రచనలు చదివినా.. 1994లో మాత్రమే కవిత్వం రాయడం మొదలైనది. అంటే గత మూడు దశాబ్దాలుగా నేను కవిత్వం రాస్తున్నాను. ఒక రకంగా కవిత్వంలోకి నేను లేట్ కమ్మర్ అని చెప్పవచ్చు. చిన్నతనంలో గ్రంథాలయంలో ఎక్కువసేపు గడిపేవాడిని. గత ముప్పై ఏళ్ళుగా కథలతోపాటు అనేక కవితా సంపుటాలు చదివాను. ఒక రకంగా నేను నిత్యం ఏదో ఒక ప్రక్రియలో కనీసం ఇరవై పేజీలైనా చదవనిదే ఆ రోజు నిద్రరానితనం.

వృత్తిపరమైన సమావేశంలో మాట్లాడుతూ శ్రీ విల్సన్ రావు

నేను రాసేదానికన్నా చదివేది ఎక్కువ. ఐదు వేల పైచిలుకు గ్రంథాలతో మా ఇంట్లో ప్రత్యేకంగా నాకొక స్వంత గ్రంథాలయం ఉంది. ఏ ప్రక్రియకు ఆ ప్రక్రియ గ్రంథాలు, ఆయా అలమరలలో సర్దుకుంటాను. నా మూడ్‌ను బట్టి నా చదువు ఉంటుంది.

యల్.ఐ.సి.లో అంచెలంచెలుగా ఎదిగి అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్‍గా 2020 మే నెలలో ఉద్యోగ విరమణ తరువాత చదుకునే సమయం బాగా ఎక్కువైంది. ఈ మూడేళ్ళ కాలంలో సృజన నేడు, సృజన క్రాంతి దినపత్రికలలో సాహితీ సంపాదకుడుగా ఉంటూనే రెండు పుస్తకాలు ప్రచురించాను. ఒకటి ‘నాగలి కూడా ఆయుధమే’ కవితా సంపుటి. మరొకటి నా కవితా సంపుటి ‘దేవుడు తప్పిపోయాడు’ పై ప్రచురితమైన వ్యాస సంకలనం.

ప్రశ్న 3: తెలుగు సాహిత్యం వైపు మీరు అభిరుచి పెంచుకోవడంలో, మీ వెనుక ఎవరైనా ఉన్నారా? వివరంగా చెప్పండి.

జ: మన చుట్టూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలతో పాటు, రైతులు.. తమ కష్టానికి సరైన ప్రతిఫలం రావట్లేదన్న ఆవేదనతో కుటుంబ పోషణ కష్టమై, పొలాలు అమ్ముకోవడం, ఇళ్లు అమ్ముకొని కుటుంబాలు కుటుంబాలే దినసరి కూలీలుగా మారి బతుకీడుస్తున్న సందర్భాల్ని నేను స్వయంగా చూశాను. చాలా బాధపడ్డాను.. దీనికి ఉదాహరణ, మా కుటుంబమే.

రైతుల వెతలను కళ్ళకు కట్టేట్టు కథనో, కవితనో, నవలనో రాసినంత మాత్రాన వాళ్ళ జీవితాలు మారతాయని అనుకోను గాని సాహిత్యంలో అనేక ప్రక్రియల ద్వారా రైతుల జీవితాలు, అణగారిన జాతుల జీవన వ్యధలు, స్త్రీలపై అకృత్యాలు ఇవన్నీ ఎప్పటినుంచో చరిత్రలో రికార్డు చేయబడుతున్నవే.

వాటికి కొనసాగింపుగా నా తక్షణ స్పందనగా నేను కవిత్వాన్ని ఎన్నుకొని, నేను అనుభవించిన, స్వయంగా చూసిన విషయాలను కవిత్వం ద్వారా చెప్పాను. ‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, అకృత్యాలపై స్పందన లేని మనుషులు మనుషులెలా అవుతారు’ అని మార్క్స్ ఒక సందర్భంలో అంటారు. బహుశా ఈ వాక్యాలు నాకు ప్రేరణనిచ్చాయేమో. రైతులపై, దళితులపై, స్త్రీలపై జరిగే అత్యాచారాలపై చాలా కవిత్వమే రాసాను నేను. అలా రాసిన కవిత్వం సాహితీవేత్తల, విమర్శకుల చూపునుంచి తప్పించుకోలేదు.

నేను అంతులేని ఆశావాదిని. వితండవాదులకు దూరంగా ఉంటాను. నా కవిత్వమంతా ఆశావాదమే. నా కవిత్వం నిండా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుందంటారు కొందరు మిత్రులు. నేను నమ్మిన వ్యక్తులను జీవితంలో వదులుకోను.

1994 నుండి కవిత్వం రాస్తూ.. రాస్తూ.. ఇప్పటికి నాలుగు కవితా సంపుటాలు అచ్చులో వెలుగు చూశాయి. అయితే మనం ఏ రైతుల గురించి, శ్రమజీవుల గురించి కవిత్వం రాస్తున్నామో వారి జీవన పరిస్థితులు మెరుగుపడేదాకా కవికి విశ్రాంతి లేదు. ముఖ్యంగా దుక్కిదున్ని పదిమందికి అన్నం పెట్టే రైతువిలాపం తీరే వరకు కవి విశ్రమించకూడదు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో శ్రీ రాంబాబు తో.. శ్రీ విల్సన్ రావు

అందుకే నా కవితారచనకు వ్యవసాయం చుట్టూ అల్లుకున్న మనుషుల జీవితమే ప్రేరణ. దానితోపాటు ఇతర అంశాలు కూడా నన్ను స్పందింప జేసిన ఫలితమే నా కవిత్వం.

ప్రశ్న 4: మీరు పుస్తక రూపంలో తెచ్చిన మీ రచనలు గురించి చెప్పండి.

జ: ఇప్పటిదాకా నా కవిత్వం:

  1. న్యాయ నిర్ణేతవూ నీవే (కవిత్వం) – 2011,
  2. తెల్లారితే – (కవిత్వం) 2014,
  3. దేవుడు తప్పిపోయాడు. (కవిత్వం) 2017,
  4. నాగలి కూడా ఆయుధమే-కవిత్వం(2023)
  5. నా కవితా సంపుటి ‘దేవుడు తప్పిపోయాడు’ పై ప్రముఖులు రాసిన సమీక్షలు, విమర్శలు, పరామర్శలు మొత్తం 70కి పైగా వ్యాసాలతో (357 పేజీలు) ఒక సంకలనంగా ‘ప్రేరణ’ పేరుతో ఆగష్టు, 2023లో నవ మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ గారి సంపాకత్వంలో వెలువడింది.

ప్రశ్న 5: కవిత్వానికి సంబంధించి, మీ అభిమాన రచయిత ఎవరు? ఎందుచేత.

జ: నా అభిమాన రచయిత అంటే ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. బహుముఖీన సాహిత్య సృజన ఇనాక్ గారి సొంతం. సాధారణంగా సాహిత్యకారులు ఒక ప్రక్రియలో పరిణతి సాధిస్తారు. కొన్ని సార్లు రెండు మూడు ప్రక్రియల్లోను రాణించేవారు ఉంటారు. ఇనాక్ గారిలో మాత్రం ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శ, పరిశోధన, అనువాదం అనే ఏడు ప్రక్రియల్లో తనది అందెవేసిన చెయ్యి. అదే వారికొక గొప్ప గుర్తింపునిచ్చింది. పేరు కోసం చెప్పుకోవడానికి అన్ని ప్రక్రియల్లో రచనలు చేశాడనే మాట ఆయనకు వర్తించదు. ప్రక్రియ ఏదైనా సాధికారికమైన పట్టుతో దానిని సృజించి సాహితీ లోకానికి అందించారు. అందుకే ఇనాక్ గారన్నా, వారి సాహిత్యమన్నా నాకు చాలా ఇష్టం.

కవి మిత్రుడు ఆంజనేయ కుమార్ గారు, నేను కలిసి 2014 జూన్ 1వ తేదీన ‘తెల్లారితే’ అనే పేరుతో నలభై ఏడు కవితలతో ఒక కవితా సంపుటిని విజయవాడలో ఆవిష్కరించాము. ఈ కవితా సంపుటిని ఆచార్య ఇనాక్ గారికి అంకితమివ్వడం జరిగింది. ఇనాక్ గారు ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన తరువాత అంకితం తీసుకున్న మొదటి గ్రంథం ఇది. అంతేకాదు ఈ కవితా సంపుటి ఆవిష్కరణ జరిగిన మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెండు రాష్ట్రాలుగా విభజించబడుతున్న సందర్భం. ఈ సంపుటిపై చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‍ను రెండుగా విభజించడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నేను రాసిన కవితలు ఇందులో ఉన్నాయి. ‘తెల్లారితే’ అనే టైటిల్ పోయెమ్ ఇలా సాగుతుంది:

వేదనా భరిత రాత్రిని భరించడం/ఇంత కష్టంగా వుంటుందని ఊహించనే లేదు.

అడవికి కంఠాన్ని అరువిచ్చి/ఆదివాసీల ఆత్మబంధువై/స్వార్ధపు బుల్లెట్ల దాడిలో/నేలకొరిగిన నాన్న/మూడోరోజు తిరిగి లేస్తాడని చెప్పింది అమ్మ/నాన్న తప్పనిసరిగా తిరిగి లేస్తాడు/తొందరగా తెల్లారితే బాగుండును..

వేకువను చంకన పెట్టుకుని/తూర్పు ఎటో తెలుసుకొని/నడిచే దారిలో మొలిచిన/ముళ్ళపొదల్ని తొలగించుకుంటూ ముందుకు సాగాలి/త్వరగా తెల్లారితే బాగుండును..

జవజచ్చిన విత్తనాల్ని ఏరిపారేసి శిశిరాల్ని దాటుకుంటూ/జీవమున్న మనిషిలా బ్రతకాలంటే ఈ నేలకు హక్కుదారుడ్ని/ నేనేనని ప్రకటించాలంటే/ తెల్లారాల్సిందే!

ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న/అరుణారుణ ఉషోదయాన్ని/కొత్తచూపుతో కనులారా చూడాలంటే/ఎంత తొందరగా తెల్లారితే అంత బాగుండును..

ఈ వేదనా భరిత రాత్రిని భరించడం/ఇంత కష్టంగా వుంటుందని/ఎప్పుడూ ఊహించనే లేదు!/ఎంత తొందరగా తెల్లారితే అంత బాగుండును..

అని రాసాను. దీనిని ఆంధ్రప్రభ సాహితీ గవాక్షంలో జూన్ 1వ తేదీన ప్రచురించారు. మంచి స్పందన వచ్చింది.

ఇక కవిత్వానికొస్తే:

కవిత్వంలో కె.శివారెడ్డి గారు నాకు చాలా ఇష్టం. కవిత్వంలో వారి తరువాతే ఎవరైనా. ఎందుకంటే వారి శైలి నాకు బాగా ఇష్టం. ఒక వాక్యాన్ని కళాత్మకంగా రాయడం ఎలాగో నేను వారి సాహిత్యం చదివి తెలుసుకున్నాను. శివారెడ్డి గారి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. సాహిత్య అకాడెమీ నుండి నిన్న మొన్నటి సరస్వతీ సమ్మాన్ పురస్కారం దాకా ఆయన ఎక్కని మెట్లు లేవు. రాయని వస్తువు లేదు. చేయని ప్రసంగం లేదు. కవిగా తను సదా ప్రేమికుడు. ఒక సమాజం మరింత ఆధునికంగా, నాగరికంగా తయారయ్యే క్రమంలో బాహ్య ఆంతరంగిక శక్తులు ఎలా పరస్పరం సంఘర్షించుకుంటాయో, ఆ సంఘర్షణ ఫలితంగా ఎలాంటి సవ్య, అపసవ్య ఫలితాలు వస్తాయో శివారెడ్డి గారి కవిత్వం కళ్ళకు కడుతుంది.

ఇటీవలే ఆవిష్కరించబడిన నా కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే..!’ ను నా ఇష్ట కవి శివారెడ్డి గారికి అంకితమిచ్చి, వారిని ఘనంగా సత్కరించుకున్నాను. ఈ కవితా సంపుటిని.. శివారెడ్డి గారికి ఎనభై సంవత్సరాల వయసు నిండిన సందర్భంలో వారికి అంకితమివ్వడం జరిగింది.

నాగలి కూడా ఆయుధమే.. పుస్తక ఆవిష్కరణ సభ రవీంద్రభారతి లో

ప్రశ్న 6: కవిత్వం రాయడానికి సాధారణంగా ఎలాంటి వస్తువును ఎన్నుకుంటారు?ఎందుచేత?

జ: కవిత్వం రాయడానికి ఏ కవి అయినా తన జీవితమో, తన అనుభవమో అయినప్పుడూ.. తన ఊహలనూ, ఉద్రేకాలనూ, అభిప్రాయాలనూ, కళాత్మకంగాను, అనుభూతి కలిగించే విధంగానూ తెలియజేయడానికి అనువైన వస్తువును ఎన్నుకుంటారు. అది ఏదైనా పరవాలేదు. నేను దానికి అతీతుడను కాను.

ఎవరికైనా తమతమ అనుభవాలే తమ గురువు కదా! వస్తువు ఏదైనా సాహిత్యానికి అస్పృశ్యము కాదు.

వస్తువు ఏదైనా, ఎదుటివారిని కదిలించే విధంగా రసాత్మకంగా, వాస్తవానికి అతి దగ్గరగా, ఇంతకు ముందే అదే వస్తువుపై ఉన్న కవిత్వం కన్నా భిన్నంగా, స్పష్టమైన అభివ్యక్తితో రాయడం నాకిష్టం. ఏ కవితకైనా వస్తువు, శిల్పం, కవితా ప్రయోజనం ముఖ్యం అని నేను భావిస్తాను.

కవి సంధ్యలో పాల్గొంటూ కవి శ్రీ కొమ్మవరపు

ప్రశ్న 7: వర్ధమాన కవుల్లో ఎక్కువ శాతం, సామాజిక సమస్యలను పక్కనపెట్టి, ప్రేమ కవిత్వం పుంఖానుపుంఖాలుగా, రాసేస్తుంటారు. దీని గురించి విపులంగా విశ్లేషించండి.

జ: మీ ప్రశ్న పాక్షిక సత్యమే. ప్రేమ అనగానే తనలోని, తాను అనుభవించిన ప్రేమతత్వాన్ని తక్కువ శాతం మంది కవులు స్వీయ కవిత్వం రాసినవారు వున్నారు. వారిలో ఎగువ, మధ్యతరగతి యువతీ యువకులు, కాలేజీలో చదువు’కొనే’వాళ్ళు మాత్రమే ప్రేమ కవిత్వం రాసారని భావిస్తాను. ఇలా రాసిన కవిత్వం ముఖ పుస్తకంలో ఎక్కువగా కనిపిస్తుంది గానీ, గ్రంథ రూపంలో నిక్షిప్తమైనవి కొన్ని మాత్రమే. అది చాలా తక్కువ అనేది నా నిశ్చితాభిప్రాయం.

వర్ధమాన కవుల్లో అధిక శాతం సామాజిక సమస్యలకు తక్షణ స్పందనలు తెలుపుతూ కవిత్వం రాశారు. రాస్తున్నారు. ఉదా: ఇటీవలి సంఘటనలే తీసుకుంటే.. బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం చేసి, కుటుంబంలోని వారిని హత్య చేసిన నిందితులకు న్యాయస్థానం విధించిన యావజ్జీవ శిక్షను ఒక రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి నేరస్తులను విడుదల చేసిన ఉదంతంపై వర్ధమాన కవుల, కవయిత్రుల స్పందన సాహితీ చరిత్రలో చెప్పుకోదగ్గది.

అలాగే జిహ్వ చాపల్యంతో మామిడికాయ కోసం వెళ్లి తోట యజమాని చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడు బిక్కు శీను.. ఇలా అనేక సంఘటనలపై పుంఖాను పుంఖాలుగా కవిత్వం రాసిన వర్ధమాన కవులు, కవయిత్రుల వున్నారు.

అలాగే స్త్రీ, దళిత, బహుజన, ముస్లిం, ప్రాంతీయ అస్తిత్వ వాదాలలో అనేక రచనలు, అనేక ప్రక్రియలలో వచ్చాయి. ఆయా రచనలలో వర్ధమాన కవులదే అగ్రభాగమని చెప్పక తప్పదు. వారు రాబోయే తరాల కోసం గొప్ప సాహిత్య నిధిని నెలకొల్పారు.

ఇలా అనేక సంఘటనలపై వర్ధమాన కవులు రాసిన కవిత్వం సంపుటాలుగా, సంకలనాలుగా కూడా వచ్చిన విషయం మనం మరువకూడదు.

ప్రశ్న 8: అవార్డుల కోసం, సామాజిక సమస్యలు పట్టించుకోకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా, చలామణి అయ్యే కవులు/రచయితల గురించి మీరేమంటారు?

జ: చాలా మంచి ప్రశ్న డాక్టర్ గారు. ఇలాంటి ఒక ప్రశ్న కోసం నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. అవార్డు-సామాజిక సమస్య-ప్రభుత్వ కార్యకలాపాలపై విమర్శ. ఈ మూడు కూడా ఒకదానికొకటి పరస్పర విరుద్దాలు.

ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా రచనలు చేసేవారు – నాకు తెలిసి ఎప్పుడూ పురస్కారాల కోసం ఆశ పడరు. ప్రభుత్వం-నాయకత్వంపై విమర్శలు చేసేవారికి ఎలాగూ పురస్కారాలు రావు.

ప్రభుత్వాన్ని విమర్శించకపోయినా తటస్థంగా వున్న వారికి, పదవులు, ఉన్నత పురస్కారాలు వరించిన సందర్భాలు మనం చూసాము కదా! పేర్లు ఎందుకు గానీ పదవులు, పురస్కారాలు పొందిన వాళ్ళ గురించి వాళ్ళవాళ్ళ మిత్రులే గుసగుసలాడుకున్న సందర్భాలు కూడా మన తెలుగు నేలపై ఉన్నాయి. అవి ఎలా వచ్చాయో కూడా చాలామందికి తెలుసు. అలాగని వాళ్లకు ప్రతిభ లేదని కాదు.

పురస్కారాలు పొందిన వాళ్ళకంటే ప్రతిభ ఉన్న వాళ్ళు ఎంతోమంది అలా తమ ప్రతిభకు గుర్తింపు దక్కలేదని వాపోయిన వాళ్ళ గురించి మనకు తెలుసు. గత పదేళ్లుగా తెలుగు నేలపై ప్రభుత్వాల తరపున వచ్చిన పురస్కారాల గురించి మన పాఠకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ వారు మహాకవి గుఱ్ఱం జాషువా గారి 128వ జన్మదిన సందర్భంగా నేను సాహితీ పురస్కారం పొందటంలో దీనికి నేనేమీ మినహాయింపుగా భావించడం లేదు.

ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే పురస్కారాలు ఇచ్చేవారికి.. పురస్కారాలు పొందేవారు దగ్గరివారో, స్నేహితులో, సహోద్యోగులో లేదూ.. వారి వందిమాగధులకో పురస్కారాలతో సత్కరించే రోజులివి. ఈ విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ప్రశ్న 9: తెలుగు సాహిత్యానికి సంబంధించి అనేక ప్రక్రియలు ఉన్నాయి కదా! మరి, మీరు కవితా ప్రక్రియకి మాత్రమే ప్రాధాన్యత నివ్వడానికి గల కారణం ఏమిటి?

జ: మీరన్నది నిజమే. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు వున్నా.. ఇతర ప్రక్రియల జోలికి వెళ్లకుండా కవిత్వం మాత్రమే రాస్తున్నాను నేను. కొన్ని పుస్తక సమీక్షలు కూడా రాశాను గానీ నాకెందుకో అక్కడ ఎక్కువ కృషి చేయాలని అనిపించలేదు. అలాగని మిగతా ప్రక్రియలపట్ల చిన్న చూపు లేకపోగా.. గొప్ప గౌరవభావం ఉంది. ఆధునిక సాహిత్య చరిత్రలో.. ఎవరయినా తమ తక్షణ భావ ప్రకటనకు ఎక్కువగా కవిత్వం మీదే ఆధారపడిన సందర్భాలు అనేకం. రాసి పరంగా కూడా వచనం కంటే కవిత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే ప్రచురణ రూపంలో తక్కువ కావచ్చు. అంతే కాదు. తమతమ అస్తిత్వ సంవేదనలను తక్షణమే బహిర్గతం చేయాలంటే కవిత్వమే ఆసరా. ఇంతెందుకు, ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో కవిత్వ ప్రక్రియదే ప్రథమ స్థానం అని చెప్పడానికి నాకు ఏమాత్రం సంశయం లేదు.

ఇదంతా ఎలా వున్నా.. నేను మొదటిగా ఎక్కువగా కవిత్వం చదివే.. కవిత్వం రాయడం వైపు దృష్టి సారించాను. మీలాంటి వాళ్ళు కథలు రాయమని ప్రోత్సహిస్తున్నారు. చూడాలి. కాలం ఎటువైపు తీసుకెళ్తుందో!

ప్రశ్న 10: మీ దృష్టిలో సాహిత్య విమర్శకి, సమీక్షకి, తేడా ఏమిటీ? తెలుగు సాహిత్యంలో మంచి – విమర్శ వస్తుందని మీరు భావిస్తున్నారా? ఎలా?

జ: ఓహో! ఎంత మాంచి ప్రశ్న సంధించారు!

సరే. మొదటిగా విమర్శ గురించి నాకు తెలిసిన విషయాలు పంచుకుంటాను.

విమర్శ అంటే అనుశీలన, పరిశీలన, సమీక్ష, పరామర్శించు, పరిశోధించు, విచారించు, వివేచించు, శోధించు అని రకరకాల అర్ధాలు నిఘంటువుల్లో ఉన్నాయి.

ఒక అంశాన్ని చక్కగా విశ్లేషించి, వివరించి అందులోని గుణ దోషాలు, మంచి చెడ్డలు, సర్వ విషయాలపై వ్యాఖ్యానించేది విమర్శ. విమర్శ ఒక గ్రంథానికి సంబంధించిన విషయమే గాక, దాని పూర్వాపరాలకు సంబంధించిన విషయాలతోపాటు, దాని సారంతోపాటు ఇంకా అనేకమైన విషయాలు గురించి దృష్టి పెడుతుంది.

ఆధునిక విమర్శ అంతా కొత్త సిద్ధాంతాల ప్రతిపాదనలతోను, ప్రయోగ వాదాల విశ్లేషణలతోనూ కొనసాగినదిగా ఉంటుంది. నేడు ప్రధానంగా స్త్రీ, దళిత, మైనారిటీ, బహుజన, ముస్లింవాద ధోరణులకు చెందిన సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు, ఈ ఆధునిక విమర్శ.. దేశీయమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాన్ని కోరుకునే ధోరణిలో కొనసాగుతోంది.

విమర్శకునికి కేవలం తన ప్రాంతం, తన భాషలోని గ్రంథాల పరిచయం మాత్రమే కాదు. వివిధ భాషల్లోని సాహిత్య ప్రక్రియల్లోని విషయాలతోపాటు, అనుభవము కూడా అవసరం. దీనివలన కావ్య విమర్శలో ప్రస్తావించే విషయాలు నిలకడగా స్థిరపడతాయి.

మంచి విమర్శ వలన ప్రాపంచిక విషయాలు ఆవిష్కరించడంతో పాటు పాఠకులకు సరికొత్త విషయాలు తెలియజేసినవారు అవుతారు విమర్శకులు. విమర్శ అనేది రాగద్వేషాలకు అతీతమైనదిగా ఉండాలి. ఒక మంచి రచన.. సద్విమర్శకుని విమర్శతో ఆ రచనకు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది అనేది నిర్వివాదాంశం.

సాధారణంగా కొంత మంది విమర్శకులు ఏదో ఒక కవిని, రచయితను, లేదా ఒక సాహిత్య ప్రక్రియను ఇష్టపడేవాళ్లుగా వుంటారు. అలా ఇష్టపడిన కవిని, రచయితని, సాహిత్య ప్రక్రియని ఉదాత్తమైనవిగా భావించి విమర్శను కొనసాగిస్తారు. కొన్ని సందర్భాలలో కులాభిమానంతోనో, మతాభిమానంతోనో, ప్రాంతీయ అభిమానంతోనో,ఒక కవిని లేదా రచయితని అమితంగా ప్రేమిస్తూ విమర్శని కొనసాగిస్తారు. ఇలాంటి పరిణామాన్ని మనం మంచి విమర్శ అనలేం. రాగద్వేషాలకు, ఇష్టాఇష్టాలకు అతీతంగా చేసే విమర్శ మాత్రమే సద్విమర్శ అవుతుంది.

ఇకపోతే, సాహిత్య సమీక్షలో కొత్తగా వచ్చిన సాహిత్య రచనను పరిచయం చేస్తూ వచ్చే వ్యాసం. ఒక గ్రంథానికి సంబంధించి కవి లేదా రచయిత ఆ రచనలో ఏఏ విషయాలను చర్చించారో, ఆ రచనలో ఉన్న సారాంశమేమిటో,ఆ కవి లేదా రచయితకు ఉన్న చైతన్యమేమిటో చెబుతుంది. ఆ రచనలో ఉన్న వివిధ రూపాలను తెలియజేస్తూ పాఠకులకు ఆయా రచనలపై అవగాహన కల్పిస్తారు సమీక్షకులు.

సమీక్షలో.. ఒక కవి లేదా రచయిత యొక్క రచన సమీక్షకునికి ఎలా ఇష్టమైనదో, ఎందుకు నచ్చిందో విడమరిచి చెబుతారు. దీనినే ఇంకోవిధంగా అభినందనాత్మకంగా, పొగడ్తల రూపంలో ఉండవచ్చు. పుస్తకంలో చర్చించిన విషయమూ, పద్ధతి, ప్రత్యేకత, గుణం లాంటి విషయాలకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి పుస్తకంపై పాఠకుడికి ఒక అభిప్రాయాన్ని కల్పించడం ఉంటుంది.

ఇందులో మంచి చెడ్డల్ని అంచనా వేసేదిగా, నిర్ణయించేదిగా, నిర్ధారించేదిగా ఉండదు. అంతేగాక రచనలో లోటుపాట్లు తెలియజేసే క్రమం కూడా ఉండదు.

అతి కొద్దిమంది విమర్శకులు మంచి సమీక్ష, మంచి విమర్శ రాస్తున్నా, నైతిక విలువలకు కట్టుబడి విమర్శ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువమంది కోసం సాహితీ లోకం ఎదురుచూస్తోంది.

ప్రశ్న 11: సాహిత్యకారులకు ప్రభుత్వం అందించే అవార్డుల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వ పురస్కారాలకు సాహిత్యకారులను ఎన్నుకోవడానికి, మీ దృష్టిలో ఎలాంటి మార్గదర్శక సూత్రాలు ఉంటే బావుంటుందని మీరు భావిస్తున్నారు?

జ: ఇది ఒక పెద్ద డిబేటబుల్ ఇష్యూ. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రభుత్వం అందించే పురస్కారాలు ఎప్పుడూ తమను స్తుతించే వారినో, లేదా తమ వర్గం వారినో వరిస్తాయని ప్రతి సాహితీవేత్తకు తెలిసినదే. ఓట్ల రాజకీయం పెరిగిన నేటి వ్యవస్థలో కులాల, మతాల వారీగా సాహితీ పురస్కారాలు ఇచ్చిన సందర్భం మనం గుర్తించవచ్చు.

మార్గదర్శక సూత్రాలు విషయానికి వస్తే..

అన్ని అస్తిత్వ వాదాలను సమర్థిస్తూ, నేటి సమాజం, అభ్యుదయం వైపు పయనింపజేయడానికి ఉపయోగపడే వివిధ ప్రక్రియలపై మంచి పట్టున్న తటస్థ సాహితీవేత్తలచే ఒక కమిటీ వేసి, ఆ కమిటీలోని మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు ప్రభుత్వ పురస్కారాలు అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరగాలి.

సాధ్యమైనంతమంది సాహితీవేత్తలను ఈ విధంగా ప్రోత్సహిస్తే సాహితీవేత్తలు కూడా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతారు. అలాగే సాహితీవేత్తలు.. తమ రచనలను ప్రచురించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆయా రచనలను ప్రజల వద్దకు చేర్చేలా ప్రభుత్వమే చూడాలి.

ఎలాంటి నియమ నిబంధనలు నిర్ణయించినా అర్హులైన వారికి పురస్కారాలు రాకపోతే పెద్ద చర్చ జరుగుతూనే ఉంది కదా! అటువంటి సందర్భాలలో చర్చించేవారి విజ్ఞతకే వదిలేద్దాం.

ప్రశ్న 12:  ఈ ఆధునిక కాలంలో మన రచనలు, పుస్తకరూపంలో తీసుకురావాల్సి వచ్చినప్పుడు రచయిత-పుస్తక విక్రయం మీద దృష్టి పెట్టాలా? ఎలాగైనా పాఠకుల మధ్యకు పోవాలని మీరు భావిస్తున్నారా?

జ: ఇటీవలి కాలంలో చాలామంది కవులు, కథకులు, నవలాకారులు తమ రచనలను అతి తక్కువ కాపీలు ముద్రించుకొని తమ మిత్రులకు మాత్రమే పంపుకోవడం మనం గమనిస్తున్నాము. మన దేశంలో ఉన్న నాలుగు ప్రధాన గ్రంథాలయాలకు కూడా పంపనివారు, అసలు ఆ విషయమే తెలియని రచయితలు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. కవిత్వమైతే పుస్తకం ఖరీదు చెల్లించి కొనడానికి సంకోచిస్తున్నారు. కథలకు మంచి ఆదరణ ఉందని నేను అనుకుంటున్నాను. నవలలు చదివే వారు తక్కువే. ఏ రచనైనా వంద పేజీలకు మించకుండా ఉంటే పాఠకులు చదువుతున్నారని, నా అనుభవం మాత్రమే కాదు, నాకున్న సమాచారం కూడా.

ఇటీవల చాలామంది ప్రచురణకర్తలు వివిధ కవుల కవిత్వ సంపుటాలు, కథకుల కథా సంపుటాలు ప్రచురించి పాఠకుల దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఈ ప్రక్రియ మంచిదే కానీ కవులకు, రచయితలకు రాయల్టీ ఇచ్చే విషయంలో ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఆయా రచయితలకు పది ప్రతులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

మీరన్నట్టు తమ రచనలు ఏదో రకంగా పాఠకుల వద్దకు చేరుతుందని రచయితలు భావిస్తుండటమే దీనికి కారణం కావచ్చు. దీనివలన ప్రచురణకర్తలు మాత్రమే లాభపడుతున్నారనేది సత్య దూరం కాదు.

ప్రశ్న 13: మీరు పొందిన అవార్డులు, సన్మానాల గురించి చెప్పండి.

జ: 2017 నవంబర్ లో విడుదలైన నా మూడవ కవితా సంపుటి ‘దేవుడు తప్పిపోయాడు’ ఎనిమిది జాతీయ, రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకోవడం నాకు చాలా ఆనందం మాత్రమే కాదు, అవి నా సాహిత్య కృషికి ప్రేరణలుగా భావిస్తాను. అవి:

  1. రావి రంగారావు గారి సాహితీపీఠం వారిచే ‘జనరంజక కవి’ ప్రతిభా పురస్కారం- ఫిబ్రవరి, 2018
  2. కీ.శే. పల్లా నరసింహులు, పొద్దుటూరు వారి పేరిట జాతీయస్థాయి సాహిత్య పురస్కారం – 2018
  3. కీ.శే. క్యాతం కృష్ణారెడ్డి, నిజామాబాద్ వారి పేరిట స్మారక సాహిత్య పురస్కారం – 2018
  4. కీ.శే. కొత్తపల్లి నరేంద్రబాబు గారి పేరిట స్మారక సాహిత్య పురస్కారం, అనంతపురం – 2018
  5. ఎస్.ఆర్. నాయుడు ఛారిటబుల్ ట్రస్ట్, అనకాపల్లి వారి సాహిత్య పురస్కారం – 2018
  6. సహృదయ సాహితి, కాకినాడ వారిచే రజతోత్సవ సాహితీ పురస్కారం – 2018
  7. గిడుగు రామమూర్తి పంతులు గారి పేరిట సాహిత్య పురస్కారం – 2019
  8. శ్రీ అంగలకుదిటి సుందరాచారి గారి పేరిట స్మారక సాహిత్య పురస్కారం-2022
ఎక్స్‌రే అవార్డు తో శ్రీ విల్సన్ రావు..

పురస్కారాలు, కవిసత్కారాలు:

  • ఎక్స్‌రే, మల్లెతీగ, రంజని కుందుర్తి, వేకువ, విశాలాక్షి, నెలవంక- నెమలీక మొ. సాహితీ సంస్థల నుండి ఉత్తమ కవితా పురస్కారాలు.
  • వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి రంగాచార్య గార్ల పేరుతో నవ తెలంగాణ దినపత్రిక నిర్వహించిన కవితల పోటీలో ఉత్తమ కవితా పురస్కారం
  • ముఖ పుస్తకం సమూహం ‘కవిసంగమం’లో రెండవతరం కవిగా డిసెంబర్ 2015లో కవిత్వ పఠనం, సత్కారం.
  • డా.నాగభైరవ కోటేశ్వరరావు గారి పేరిట స్పూర్తి పురస్కారం, నెల్లూరు – 2016
  • ‘మల్లెతీగ మాసపత్రిక వారిచే కవి సత్కారం 18-9-2016
  • ధర్మకేతనం సాహిత్య కళాపీఠం, హైదరాబాద్ వారిచే కవి సత్కారం 2017
  • కళానిలయం, హైదరాబాద్ వారు ఉగాది ఎక్సలెన్స్ అవార్డ్ 2018
  • కళానిలయం, హైదరాబాద్ వారిచే 6 ఏప్రిల్ 2016వ తేదీన ఉగాది కవి సత్కారం.
  • 2016 నవంబర్ 27న యానాం కవితోత్సవంలో కవి సత్కారం
  • శ్రీమతి పాతూరి మాణిక్యమ్మ గారి పేరుతో స్థాపించిన స్మారక జాతీయ సాహిత్య పురస్కారం, నెల్లూరు- 2017
  • కళానిలయం, హైదరాబాద్ వారిచే సి.నా.రె. సాహిత్య పురస్కారం – 2018
  • తేజ ఆర్ట్ క్రియేషన్స్, హైదరాబాదు వారిచే రాష్ట్రస్థాయి కవితా పురస్కారం.
  • కళానిలయం, గోదావరిఖని వారిచే గోల్డెన్ స్టార్ సాహిత్య పురస్కారంతో పాటు కవి సత్కారం.
  • 2వ ప్రపంచ తెలుగు మహాసభలు, విజయవాడలో కవి సత్కారం 13-15 ఆగస్టు 2011.
  • దూరదర్శన్ (యాదగిరి)లో ఇంటర్వ్యూ
  • ‘నల్ల మల్లె మొగ్గల కోసం’.. కవితకు డా. రాధేయ ఉత్తమ కవితా పురస్కారం – 2018
  • ఆల్ ఇండియా రేడియో (హైదరాబాద్)లో కవితా పఠనం.
  • అంబేద్కర్ టీ.వి. వారిచే అంబేద్కర్ సేవా పురస్కారం – 2019
  • శ్రీ రామదాసి రాజారామ్ మహరాజ్ స్మారక తెలంగాణ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం – 2019
  • విశాలాక్షి మాసపత్రిక వారి సాహిత్య పురస్కారం – 2019
  • అరిగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఉగాది పురస్కారం 2019
  • భారతీయ దళిత సాహిత్య అకాడమి, న్యూ ఢిల్లీ వారి డా.బి.ఆర్. అంబేద్కర్ జాతీయస్థాయి ఫెలోషిప్ పురస్కారం – 2019
  • క్రేన్ వక్కపొడి సంస్థ వారి ‘నాన్నపథం’ కవితా సంపుటి ఆవిష్కరణ సభలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారిచే కవి సత్కారం జనవరి 6,
  • నెల్లూరు జిల్లా రచయితల సంఘం వారిచే సాహిత్య సేవా పురస్కారం. మార్చి 26,2023
  • ‘మహాకవి జాషువా కళాపీఠం, గుంటూరు వారిచే సెప్టెంబర్ 25, 2023వ తేదీన అతిధిగా ఆహ్వానించబడి జాషువా గారి సాహిత్యంపై ప్రసంగించి, అతిథి సత్కారం.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ వారిచే మహాకవి గుర్రం జాషువా గారి 128వ జయంతి వేడుకలలో 26 సెప్టెంబర్, 2023వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాజశేఖర్ గారు మరియు అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ విజయబాబు గారి చేతులమీదుగా మహా కవి గుర్రం జాషువా సాహిత్య పురస్కారం.
  • ఆంధ్రప్రదేశ్ బహుజన రచయితల వేదిక వారిచే మహాకవి జాషువా పేరిట జాతీయ సాహిత్య పురస్కారం, 26 సెప్టెంబర్ 2023
  • హైదరాబాద్ కళా నిలయం సంస్థ వారు నిర్వహించిన అక్కినేని శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఏ.ఎన్.ఆర్ నంది పురస్కారంతో నవంబర్ 4, 2023వ తేదీన చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో సత్కారం.
  • శ్రీ మట్టా ప్రభాత్ కుమార్ మరియు ఘంటా విజయకుమార్ గార్ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సాహిత్య అకాడమీ వారు ‘జాతీయ భాషా భూషణ్’ బిరుదుతో నవంబర్ 11, 2023వ తేదీన విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యకక్షురాలు శ్రీమతి పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారిచేత సత్కారం.
డా. బి.ఆర్.అంబేడ్కర్ అవార్డు అందుకుంటూ..

సంపాదకత్వ బాధ్యతలు:

“అద్దంలో ఆభరణం” శీర్షికతో పెద్దనోట్ల రద్దుపై వచన కవితా సంకలనం 2018. ఈ గ్రంథానికి ప్రధాన సంపాదకులు చీకోలు.

“అతడు- మేమూ-కొన్ని కవి సమయాలు” శీర్షికతో ప్రఖ్యాత కవి కె. శివారెడ్డిగారి పై కవితా సంకలనం. ప్రధాన సంపాదకులు ఈతకోట సుబ్బారావు.

Editor for LIC@63 Hyderabad Division Animutyalu – Souvenir

కవి..విల్సన్ రావు గారితో.. డా. కె.ఎల్.వి. ప్రసాద్

~

నా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి, ఎంతో విలువైన ప్రశ్నలను సంధించి నన్ను ప్రోత్సహిస్తున్న మీకు కృతజ్ఞతలు డాక్టర్ గారు. ధన్యవాదాలు.

~

ధన్యవాదాలు విల్సన్ రావు గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here